చాదస్తం

సాయంకాలం నీరెండ పెరడంతా పాకింది. అప్పటి వరకూ స్ప్రింక్‌లర్‌ల వానలో తడిసిన పచ్చగడ్డి నించీ వచ్చే వాసన ఆహ్లాదంగా వుంది. పిల్లలు కాలేజీ చదువులకని వేరే వూళ్ళు వెళ్ళారు. మా ఆయన స్నేహితుల్ని కలవడానికని బయటకెళ్ళాడు. నేను పెరట్లో లాన్ ముందర కుర్చీలూ, బల్లా, చదరంగం, వగైరా సామగ్రి అంతా సర్దుకుని నా స్నేహితుడు రాఘవ్ కోసం ఎదురు చూస్తున్నాను.

నాకూ, రాఘవ్‌కీ స్నేహం ఏమిటని నా మిగిలిన స్నేహితులంతా ఆశ్చర్యపోతూనే వుంటారు. ఎందుకంటే రాఘవ్ నాకన్నా ముప్ఫై యేళ్ళు చిన్న. దాని గురించి ఒకావిడ ‘ఫ్రాయిడ్ సిద్ధాంతం’ చెప్పబోతే, ఒళ్ళు మండి, ‘పళ్ళు రాలగొడతా’నన్నాను.

“పోనీలే! పిల్లలింట్లో లేరు కదా? ఆ లోటు రాఘవ్ స్నేహంతో తీరుతుంది” అందో పెద్దావిడ.

వీళ్ళు నాకూ, రాఘవ్‌కీ మధ్య తల్లీ, కొడుకుల్లాంటి సంబంధం ఏదో కుదిర్చే వరకూ, శాంతిగా వుండేటట్టు లేరు. రాఘవ్ నాకు కొడుకు లాంటి వాడని నేనెప్పుడూ చెప్పుకోలేదూ, అలా అనుకోలేదు కూడా. అతను నాకు స్నేహితుడే. స్నేహానికి వయసు వ్యత్యాసం ఎక్కువ వుండకూడదు అనుకునే వాళ్ళకి ఇది విచిత్రమే.

“నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నంత వరకూ, ఎవరూ మీ స్నేహం గురించి ఏమనుకున్నా లెక్క లేదులే” అని తేల్చేసింది ఇంకొకావిడ.

అదన్న మాట సంగతి! మా ఆయనకర్థం అయ్యే స్నేహాలు మాత్రమే నేను చెయ్యాలట! అతనికర్థం కాకపోతే అది అతని చేతకానితనం అవుతుంది గానీ, నా స్నేహం తప్పెందుకవుతుందీ? అయినా భర్త దయాదాక్షిణ్యాల మీదా, అతను విషయాలనర్థం చేసుకునే చాకచక్యం మీదా ఆధారపడి లేవు నా స్నేహాలు.

రాఘవ్‌కీ, నాకూ ముఖ్యంగా పొత్తు కుదిరింది చదరంగం ఆడటంలో. మా ఇంట్లో ఎవరికీ, నాకు తప్ప, చదరంగం అంటే ఆసక్తి లేదు.

రాఘవ్ మా ఆయన స్నేహితుడి కొడుకు. తల్లి బయటి వుద్యోగం లేకుండా ఇంటి పని మాత్రమే చూసుకుంటుంది. తండ్రికి ఏదో కంప్యూటర్ కంపెనీలో వూడిగం. వాళ్ళు మంచిగానే కనిపించారు మా ఇంటికి వచ్చినపుడు. ఇద్దరూ కలిసి ఏదో తెలుగు సంస్థలో తెలుగు సంస్కృతిని కాపాడ్డానికి పని చేస్తూ వుంటారట సైనికుల్లా. నాకు అలాంటి గోల యెప్పుడూ పట్టేది కాదు.

అప్పుడు రాఘవ్ మా ఇంట్లో చదరంగం చూసి సంతోషపడ్డాడు. అతని సంతోషం చూసి నేను ముచ్చట పడ్డాను.

“ఒకాట ఆడదామా?” అనడిగాను ఆశగా.

ఆడతాడన్న నమ్మకం లేదు నాకు. అదీ ఇంటికి మొట్టమొదటిసారి వచ్చాడు. కానీ, ఆశ్చర్యంగా వెంటనే ఒప్పుకున్నాడు.

లేడికి లేచిందే పరుగన్నట్టు, ఇద్దరం ఆటకి కూర్చున్నాం మిగిలినవారిని పట్టించుకోకుండా. ఓ మూల అతని తల్లితండ్రులు నొచ్చుకుంటారేమోనన్న శంక వుండనే వుంది. కానీ వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ముచ్చట పడ్డారు.

మా ఆటయ్యే వరకూ అతిథి సత్కారాలన్నీ మా ఆయనా, పిల్లలూ చూసుకున్నారు.

ఆఖరికి నా ఆట కట్టయ్యాక లేచాము. ఓడిపోయానన్న బాధ కన్నా, అతనితో ఆడినందుకు సంతోషమే కలిగింది. కొంతమందిలా కాకుండా ఆడుతున్నంతసేపూ మేమిద్దరం మాట్టాడుకుంటూనే వున్నాము.

వాళ్ళు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు రమ్మని రాఘవ్‌కి ప్రత్యేకంగా చెప్పాను.

అలా మొదలైంది మా స్నేహం. అప్పుడప్పుడు చదరంగం ఆడ్డానికి వచ్చేవాడు. వచ్చే ముందర ఫోన్ చేసేవాడు. ఏ కారప్పూసో, జంతికలో, ఏవో ఇంట్లో వున్నవి పెట్టి, టీ ఇచ్చేదాన్ని. ఆటలో అప్పుడప్పుడు నేను కూడా నెగ్గేదాన్ని. ఏదో పెద్దదాన్ని కదా అని కావాలని ఓడిపోతున్నాడేమోనని, నాకో అనుమానం. అయినా నా ఆట మీద నమ్మకం ఎక్కువ కావటం వల్ల, అలా ఆడుతూనే వున్నాము.

మాటల్లో చెప్పాడు తన కుటుంబం గురించి. తండ్రి నాస్తికుడట. తల్లి ఆస్తికురాలట. తనకీ దైవ నమ్మకాలున్నాయిట. మళ్ళీ తన తమ్ముడు నాస్తికుడట. కానీ విచిత్రంగా తండ్రీ, అతనూ శాకాహారులయితే, తల్లీ, తమ్ముడూ మాంసాహారులంట. తల్లితండ్రుల లక్షణాల్ని పిల్లలిద్దరూ పంచుకున్నట్టున్నారు. తండ్రి నాస్తికుడు అవడం ఒక్కటే కాదూ, ఏ విషయంలోనూ పట్టింపు లేకుండా, తల్లి మీద పెత్తనం చెయ్యకుండా, ప్రేమగా వుంటాడట. తల్లి పేరు పిల్లలిద్దరికీ మిడిల్ నేమ్‌గా పెట్టాడట తండ్రి. ఆ అభ్యుదయానికే ముచ్చటేసింది నాకు.

నేను నాస్తికురాలినని తెలిసి, “మా నాన్నలాగే అన్న మాటా!” అన్నాడు మామూలుగా.

నేను కొంచెం నవ్వి, “కాదులే! నాకు మీ నాన్న కన్నా పట్టింపు లెక్కువలే!” అన్నాను.

ఆ రోజు ఆడుతూ, ‘బొమ్మరిల్లు’ సినిమా గురించి తెగ మెచ్చుకోడం మొదలుపెట్టాడు. రాఘవ్ ఎక్కువగా సినిమాలు చూస్తూవుంటాడు. ఆ కబుర్లు నాక్కూడా చెబుతూ వుంటాడు.

“అబ్బ, నువ్వు చెప్పకు బాబూ! నీకు ప్రతీ చెత్త సినిమా నచ్చుతుంది” అన్నాను చనువుగా విసుక్కుంటూ.

“అలా కాదండీ! ఈ సినిమా నిజంగా బాగుంది. మీక్కూడా నచ్చుతుంది. నాకోసం ఒక్కసారి చూడండి” అన్నాడు తన పాయింట్ రుజువు చేసుకోవాలనే తాపత్రయంతో.

నేను నవ్వాను అతను నన్ను సంబోధించిన తీరుకి. పరిచయం అయిన కొత్తలో మామూలుగా ‘ఆంటీ’ అనే పిలిచేవాడు. ఓ రెండు వారాల పరిచయం తర్వాత అలా పిలవొద్దని చెప్పాను.

“ఏం?” అర్థం కానట్టు చూశాడు.

“సరిగా పరిచయం లేని వాళ్ళు కూడా నన్ను ‘ఆంటీ’ అనే పిలుస్తారు. నీతో అంతో, ఇంతో స్నేహం వుంది. నువ్వు కూడా వాళ్ళ లాగే ‘ఆంటీ’ అని పిలిస్తే, తేడా ఏముందీ?” అన్నాను లాజికల్‌గా.

“మరేమని పిలవమంటారూ?” అని అడిగాడు.

“పేరు పెట్టి పిలు. నేను నిన్ను పేరుతోనే పిలుస్తున్నాను కదా?” అని చెప్పాను.

సిగ్గుపడ్డాడు ముందర. అతని సిగ్గు చూసి నాకాశ్చర్యం.

“పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవడం నాకు చేత కాదండీ!” అని వూరుకున్నాడు.

స్నేహంలో వయసు వ్యత్యాసం ఏమిటని అడుగుదామనుకున్నాను గానీ, వూరుకున్నాను అప్పటికి. ఎందుకంటే అతనితో నాకున్న బాంధవ్యం స్నేహం అని నేనే అనుకున్నాను గానీ, అతనెప్పుడూ ఆ మాట అనలేదు.

“నీ ఇష్టం వచ్చినట్టు పిలు” అన్నాను ఇంకా విషయం గురించి చర్చించడం ఇష్టం లేక.

‘ఆంటీ’ అని పిలవడం మానేశాడు గానీ, పేరు పెట్టి కూడా పిలవడు. ‘ఏమండీ’ అని పిలుస్తాడు. దానికే అలవాటు పడిపోయాను.

“ఈసారి నువ్వొచ్చే లోపల ‘బొమ్మరిల్లు’ సినిమా చూసి, నా అభిప్రాయం చెబుతాలే!” అన్నాను.

రాఘవ్ మాత్రమే కాకుండా, చాలా మంది ఆ సినిమా గురించి చాలా పొగిడారు. మా ఆయన కూడా చూద్దాం, చూద్దాం అంటున్నాడు. మొత్తానికి ఈ సారి రాఘవ్ వచ్చేలోపల ఆ సినిమా చూసేశాను.

చదరంగానికి కూర్చుంటూ, “ఎలా వుంది ‘బొమ్మరిల్లు’ సినిమా మీకు?” అని అడిగాడు కుతూహలంగా.

“సినిమా చెత్తగా ఏమీ లేదులే. కాస్త ఫరవాలేదు. కానీ ఆ సినిమా చూశాక నాకు కొన్ని విషయాలు తట్టాయి. మొదటిది: పిల్లల ప్రేమ వ్యవహారాలు తల్లితండ్రులకి తెలియకుండా జరుగుతూ వుంటాయి. రెండోది: కుర్రాళ్ళు తాగి, రోడ్డు మీద తండ్రిని బండ బూతులు తిడుతూ, వచ్చే పోయేవారిని గోల చెయ్యడం చాలా మామూలుగా, క్షమించదగ్గ విషయం సినిమాలో! ‘తాగుడు అంత చెడ్డ అలవాటు కాదులే. అది ఈ వయసువారికి చాలా సర్వ సాధారణం’ అంటారు. ఇలాగే ఇంకా చాలా విషయాలున్నాయిలే. ఎటొచ్చీ ఆ హీరోయిన్ పాత్రా, నటనా నాకు చాలా బాగా నచ్చాయి. ఆ పాత్రలో మాత్రం లోపం ఏమీ కనబడలేదు పెద్దగా. కానీ తండ్రీ, కొడుకులిద్దరూ వెధవలే! ఉత్త బండ మనుషులు ఇద్దరికిద్దరూ!” అంటూ టూకీగా నా అభిప్రాయం చెప్పాను.

నాకు ఏ సినిమా ఓ పట్టాన నచ్చదనీ, బాగానే విమర్శిస్తానని రాఘవ్‌కి నమ్మకం.

“మీరన్న విషయాలన్నీ సరే గానీ, పిల్లల ప్రేమ గురించి ఏదో అన్నారు, అది వివరంగా చెబుతారా?” అని అడిగాడు ఆసక్తిగా.

“పిల్లలు తల్లితండ్రులతో స్నేహంగా, అభిమానంగా, చనువుగా పెరుగుతున్నప్పుడు, వాళ్ళ జీవితాల్లోని ప్రేమ తల్లితండ్రులకి తెలియకుండా ఎలా వుంటుంది రాఘవ్? ఇంకో మనిషి మీద ప్రేమ కలిగినప్పుడు, పిల్లలు ఆ విషయం ఇంట్లో తల్లితండ్రులికి ఎందుకు చెప్పరూ? ఒక మనిషి మీద ముందర ఇష్టం కలిగాకే గదా, అది ప్రేమగా మారుతుంది. ఆ ప్రోసెస్‌లో స్నేహంగా వుంటున్న తల్లితండ్రులకి ఆ విషయం ఎందుకు చెప్పరూ? ‘నాన్నా, ఫలానా అమ్మాయంటే నాకు ఇష్టంగా వుంద’నో, ‘అమ్మా, ఫలానా అమ్మాయి అంటే నాకు ఇష్టం’అనో ఎందుకు చెప్పరు? మా పిల్లలు అలాగే చెప్పారు. అయితే కొన్నాళ్ళకి ఆ ఇష్టం ప్రేమగా మారకుండా నశించిపోయింది అవతలవాళ్ళ ప్రవర్తనతో. ఈ సినిమాలో తండ్రీ, కొడుకులిద్దరూ చెత్త మనుషులే కాబట్టి, వాళ్ళని వొదిలెయ్యి. ఆ పిల్లకేమయింది? తండ్రి ఎంతో స్నేహంగా, అభిమానంగా, ప్రేమగా వుంటున్నాడు కదా? తన ప్రేమ విషయం మొదట్లోనే తండ్రికెందుకు చెప్పలేదూ? విషయం చెప్పాక, తండ్రి ప్రవర్తనని బట్టి తన ప్రవర్తన వుండాలి. అంతా చాటుగా చేసి, చివర్లో తండ్రికి ఆ విషయం తెలిస్తే, ఆ మనిషికి అది అవమానం కాదా? నా విషయంలో అలా జరిగితే చాలా ఫీలవుతాను నేను. పిల్లలకి ఎంతో స్వేచ్చ ఇచ్చాను. భద్రత సమస్య లేనప్పుడు, అర్థరాత్రి స్నేహితులతో ఐస్ క్రీం తినడానికి వెళ్ళినా, మామూలుగానే వున్నాము నేనూ, మా ఆయనా. వాళ్ళ పెళ్ళి వాళ్ళిష్టం అని ఎప్పుడో చెప్పేశాము. అయినా వాళ్ళ జీవితంలో ఇష్టం, ప్రేమా విషయాలు మాతో చాలా సహజంగా ముందర నించీ చెప్పుకోకపోతే, ఇంక వారితో మేము ఏం స్నేహంగా వున్నట్టు? ఆ విషయంలో ‘తల్లితండ్రులు’ అన్న గిరి గీసుకున్నట్టే కదా?” అన్నాను ఆవేశంగా.

నా ఆవేశం చూసి తెల్లబోయాడు రాఘవ్. అతని మొహం చూసి, నేనే నన్ను కంట్రోల్ చేసుకుని, నవ్వేశాను. నా నవ్వు ముఖం చూసి తేరుకున్నాడు.

“అయితే తల్లితండ్రులకి తెలియకుండా పిల్లలు ప్రేమలో పడకూడదంటారా?” అనడిగాడు.

“అలా అనడం లేదు రాఘవ్! అది ఆ తల్లితండ్రుల మీదా, వారి పెంపకం మీదా ఆధారపడి వుంటుంది. వారి మధ్య స్నేహం ఏ స్థాయిలో వుందీ అన్న దాని మీద ఆధారపడి వుంటుంది. నా విషయంలో అది జరిగితే నేను చాలా ఫీలవుతాను. అంతవరకూ ఎందుకు? పిల్లలతో కనీసం ప్రేమగా వుండే తల్లితండ్రుల మాట మాట్టాడుదాం. చెడ్డగా, పెత్తనాలు చేసే తల్లితండ్రుల్ని వదిలెయ్యి. ప్రేమగా వుండే తల్లితండ్రులకి తమ పిల్లల విషయాలు తెలుసుకునే నైతిక హక్కు వుంటుంది. విషయం తెలిశాక తల్లితండ్రులు పిల్లల ప్రేమల్ని ఆమోదించకపోతే, ఆ విషయం ఆ కుటుంబం తేల్చుకోవాలి. జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘ప్రేమ’ అనే విషయం గురించి మాఊహలు స్నేహితులతో చెప్పుకుంటామే, తల్లితండ్రులకి ఎందుకు చెప్పం? మా అమ్మ నాతో చాలా ప్రేమగా, స్నేహంగా వుండేది. నేను మొదటిసారి అతన్ని ఇష్టపడ్డప్పుడు, వెంటనే మా అమ్మకి చెప్పేశాను. అమ్మ సంతోషపడి, అన్ని వివరాలూ కనుక్కుంది. ఎన్నో ప్రశ్నలు వేసింది. ఆ జ్ఞానంతో నేను ప్రేమించిన వ్యక్తి ఒక వ్యసనాలవాడని తేలింది. అంతే, ఆ మనిషిని వదులుకున్నాను. మళ్ళీ చాలా కాలానికి, నేను నేర్చుకున్న జ్ఞానం నన్ను సరైన దారిలో నడిపించింది. తల్లితండ్రులు మంచివాళ్ళైతే, తమ ప్రేమ గురించి మొదటి నించీ చెప్పడమే సరైన విషయం. వారి మధ్య సరైన స్నేహం లేకపోతే అది వేరే విషయం” అన్నాను మళ్ళీ ఆవేశంగా.

ఆ పాటికి రాఘవ్ నా ఆవేశానికి అలవాటు పడిపోయాడు.

“మరి తల్లితండ్రులు పిల్లల ప్రేమని హర్షించకపోతే?” అని అడిగాడు రాఘవ్ కాస్త ఆత్రంగా.

“ఏముంది రాఘవ్ హర్షించకపోతే? పెళ్ళి అనేది పిల్లలిష్టం గానీ, తల్లితండ్రులిష్టం కాదు కదా? ఎటొచ్చీ తమ అనుభవంతోటీ, జ్ఞానంతోటీ పిల్లలకి సహాయంగా వుండాలి తల్లితండ్రులు. ఒకరి మీద ప్రేమని ఎలా పుట్టించలేరో, అలాగే పుట్టిన ప్రేమని చంపను కూడా లేరు తల్లితండ్రులు. చదువులయి, వుద్యోగాల్లో చేరే వరకూ ఆగి, ఆ తర్వాత కూడా, ఆ ప్రేమలు నిలిస్తే, పెళ్ళి చేసేసుకోవడమే కరెక్టు విషయం, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా” అన్నాను సానునయంగా.

కాస్సేపు మాట్టాడకుండా, చదరంగం ఆట ఆడకుండా, కిందకే చూస్తూ కూర్చున్నాడు రాఘవ్.

“నీ వాలకం చూస్తుంటే, నువ్వు కూడా ఏదో ప్రేమలో పడ్డట్టు వుందే?” అన్నాను కాస్త హాస్యంగా.

అవునన్నట్టు తలూపాడు. గతుక్కుమన్నాను అనుకోని ఆ మలుపుకి.

“నీ విషయం ఆ అమ్మాయికి తెలుసా? ఆ అమ్మాయి కూడా నువ్వంటే ఇష్టపడుతోందా?” అని అడిగాను ఆత్రంగా.

మళ్ళీ అవునన్నట్టు తలూపాడు. ‘అమ్మయ్య’ అని నిట్టూర్చాను. ఒకరి మీద ఒకరికి ఇష్టం కలిగే వ్యవహారాల్లో సలహాలు ఇవ్వడం నాకు చాలా అయిష్టం. ఆ మాటలే నా కిష్టం వుండవు.

“మరయితే నీ సమస్య ఏమిటీ? మీ తలితండ్రులు వొప్పుకోవడం లేదా?” అని అడిగాను నవ్వుతూ.

“వాళ్ళకి ఈ విషయం తెలీదు ఇంకా. నాకూ, హరిణికీ పరిచయం జరిగి యేడాది పైనే అయింది. పెళ్ళి చేసుకుందామని కూడా అనుకున్నాము. నేను వుద్యోగంలో వున్నా, హరిణికి ఇంకో యేడాది చదువుంది. ఆ తర్వాత పి.జి. చేస్తానంటోంది. అదొక రెండేళ్ళు. అప్పటి సంగతి కదా అని ఇంట్లో చెప్పలేదు” అన్నాడు.

నాకీ విషయం ఇన్నాళ్ళూ చెప్పలేదని నా మనసు కొంచెం చివుక్కుమంది. అయినా మా మధ్య స్నేహం స్థాయి అంతే అని సరిపెట్టుకునాను.

“మీ తల్లితండ్రులకి ఇంకొకరి ద్వారా ఈ విషయం తెలియడం ఏం బాగుంటుంది రాఘవ్? నీతో చాలా ప్రేమగానే వుంటారు కదా? వాళ్ళకి వెంటనే తెలియజెయ్యి. ఆ తర్వాత పరిస్థితులెలా వున్నా, వాటిని ఎదుర్కోవడం నేర్చుకో” సలహా ఇచ్చాను.

“మీరు ఆ అమ్మాయి గురించి వివరాలేవీ అడగలేదేం?” అన్నాడు నవ్వుతూ.

“ముందరీ విషయం మీ వాళ్ళకి తెలియచెయ్యి. ఆ తర్వాత నేనడుగుతా వివరాలన్నీ” నవ్వుతూనే, స్పష్టంగా అన్నాను.

ఓ మూడు రోజుల పోయాక మొహం డీలా వేసుకొచ్చాడు. అతను చెప్పకుండానే విషయం కొంత అర్థం అయింది. ఏమీ అడక్కుండా టీ కప్పు అందివ్వబోయాను.

“టీ వద్దండీ! ఏదన్నా జ్యూస్ ఇవ్వండి. వేడిగా ఏదీ తాగాలనిపించాడం లేదు” అన్నాడు చనువుగా.

జ్యూస్ గ్లాసు మొత్తం పూర్తి చేశాక గానీ నోరిప్పలేదు. నేనూ తొందర పెట్టలేదు.

“మా అమ్మకి చాదస్తం ఎక్కువండీ! మా నాన్నకి మాత్రం తక్కువేమీ లేదు” అన్నాడు కాస్త అక్కసుగా.

నేను నవ్వు మొహంతో అతన్ని చూస్తూ వుండిపోయాను.

“హరిణి గుజరాతీ అమ్మాయి అని మా అమ్మ అభ్యంతరం. మా నాన్నకీ అదే అభ్యంతరం అని నా నమ్మకం” కాస్త కోపంగా అన్నాడు.

“ఈ దేశం వచ్చాక కూడా ఆ పట్టింపులున్నాయా? కాస్త వివరంగా చెప్పు ఏం జరిగిందో!”

“మీరు చెప్పినట్టు రెండ్రోజుల కిందట హరిణిని మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మాకీ, నాన్నకీ పరిచయం చేశాను. వాళ్ళు చక్కగా మాట్టాడారు. భోజనాలయ్యాక హరిణిని దింపేసి వచ్చాను. అప్పుడు చెప్పా ను హరిణంటే ఇష్టమనీ, పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాననీ. ఆ అమ్మాయికి కూడా ఇష్టమేననీ చెప్పాను…” కాస్త ఆగాడు.

“మీ అమ్మగారేమన్నారూ?” అని అడిగాను ఆత్రుతగా.

“‘తెలుగమ్మాయి అయితే చాలు, కుల, మత పట్టింపులు లేకుండా ఎవరినన్నా చేసుకో, నాకభ్యంతరం లే’దంది. మా నాన్నకీ ఇదే అభిప్రాయం అని నా విశ్వాసం. ఎటొచ్చీ ఆయనా విషయం ఎత్తలేదు. ‘మీకు పరిచయం జరిగి ఒక యేడాదే కదా అయిందీ? తొందరేముందీ? ఇంకో యేడాది ఆగండి! అప్పుడు కూడా మీ అభిప్రాయాలు ఇలాగే వుంటే, పెళ్ళి చేసుకుందురుగాని’ అన్నాడు నాన్న. అమ్మయితే ఏడుపు కూడా!” అన్నాడు కాస్త విసుగ్గా.

“మీ నాన్న అన్న మాట చాలా బాగుంది. ఎలాగూ నువ్వు రెండు, మూడేళ్ళూ ఆగుదామనుకుంటున్నావుగా? ఆయన మనసులో ఏమనుకుంటే ఏమిటీ? మీ అమ్మ సంగతే కాస్త ఇబ్బంది” అన్నాను.

“అమ్మకి తెలుగు వాళ్ళే ఎక్కువగా స్నేహితులు. కోడలితో నోరారా తెలుగులో మాట్టాడలేక పోతానని బాధట. పైపెచ్చు ఈవిడ తెలుగు స్నేహితులు వెక్కిరిస్తారట. చూస్తూ, చూస్తూ, తెలుగు కానమ్మాయిని ఎలా చేసుకుంటున్నావు తల్లీ, నీ కొడుక్కి అని వాళ్ళు అడిగేస్తారట. అలాగే రేపు మనవళ్ళతో కూడా తెలుగులో మాట్టాడలేకపోతానని బాధట. ఇదంతా చాదస్తం కాకపోతే ఏమిటండీ? ఈవిడకి ఈ తెలుగు పిచ్చేమిటీ? మిగిలిన వాళ్ళు మనుషులు కారా? అయినా కావాలంటే హరిణికి తెలుగు నేర్చుకోవడం ఏం కష్టం? వాళ్ళ వాళ్ళ కోసం నేను గుజరాతీ నేర్చుకోవడం ఏం కష్టం?” అన్నాడు ఆవేశంగా.

మొదటిసారి రాఘవ్ ఆవేశాన్ని చూసి నవ్వాను కాస్త.

“మీ అమ్మా,నాన్నా ఏదో తెలుగు సంస్థతో వుంటారు కదా? అలా తెలుగు భాష లేకుండా పోతుందేమోనన్న బాధ వుండటం సహజమేలే! వాళ్ళూ, వీళ్ళూ ఏదో అంటారని మీ అమ్మకి భయం వుంటే, అది పోగొట్టాలి గానీ, చాదస్తం అనడం ఎందుకూ?” అన్నాను కాస్త గట్టిగా.

అలా కాలం గడుస్తూనే వుంది. రాఘవ్ ప్రేమ కూడా గట్టిగా సాగుతూనే వుంది. అతని తల్లితండ్రులు కూడా సర్దుకుపోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వారు గమనించింది తమ పట్ల రాఘవ్ ప్రవర్తనలో మార్పు లేకపోవడం. అదే ప్రేమా, అదే అభిమానం వారి పట్ల. ఒకసారి రాఘవ్ తల్లి నాకు ఫోను చేసింది.

“మీ గురించి రాఘవ్ చెబుతూ వుంటాడు. మీరు చాలా పుస్తకాలు చదువుతూ వుంటారు కదా? మిమ్మల్నో విషయం అడుగుదామనుకుంటున్నానండీ!” అందావిడ.

“చెప్పండీ!” అన్నాను నవ్వుతూ.

“మా రాఘవ్ విషయం మీకు తెలుసు కదా? ఫరవాలేదంటారా? తెలుసున్నావిడొకావిడ, ‘తెలుగు కాని వాళ్ళని ఎలా కుటుంబంలోకి రానిస్తారూ’ అంటుంది. ‘నేనయితే మా పిల్లల కాళ్ళు విరగ్గొట్టి, తెలుగు వాళ్ళతోనే పెళ్ళి చేస్తా’నంటుంది. ‘ఆ గుజరాతీ పిల్లతో ఎలా మాట్టాడుతావూ, ఇంగ్లీషులోనా? మరి నీకు ఇంగ్లీషు రాదు కదా?’ అని వెక్కిరిస్తుందండీ. ‘ఇలా అయితే, మా తెలుగు సంస్థలో వుండటం కష్టం కూడా’ అని సాగదీస్తుందండీ. పిల్లవాడు ఇష్టపడ్డాడని ఒప్పుకోవడం తప్పితే, ఈ సంబంధం బాధగానే వుందండీ” అంటూ తన ఘోష వెళ్ళబోసుకుందావిడ.

“సంకుచితంగా వుండేవాళ్ళు ఎప్పుడైనా, ఎక్కడైనా వుంటూనే వుంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. పెళ్ళి చేసుకునే వాళ్ళకి ఇష్టంగా వుండాలి. వాళ్ళు ఎవరితో కలిసి జీవించాలో, వాళ్ళే నిర్ణయించుకోవాలి. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో పెద్దవాళ్ళకి హక్కులు వుండవండీ. మనం వాళ్ళకి తోడుగా వుండాలే గానీ, ఇబ్బందిగా వుండకూడదు. చూస్తూ వుండండి. మీ రాఘవ్ గుజరాతీ నేర్చుకుంటాడు. ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుంటుంది. ఇద్దరూ సుఖంగా బతుకుతారు. అది చూసి మీరు ఆనంద పడాలి. తెలుగు కాని వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు అని చెప్పే తెలుగు సంస్థ, అదేం సంస్థ? పిచ్చి సంస్థ. అలాంటీ సంకుచిత సంస్థల్లో మీరు పని చెయ్యనక్కర్లేదు. వొదిలెయ్యండి వాళ్ళని. ఎవరన్నా ఏమన్నా అడిగితే, ‘పెళ్ళి అనేది పిల్లల ఇష్టం, పెద్దలు పక్కనుండి సలహాలివ్వడమే గానీ, పెత్తనాలు చెయ్యకూడదు. పిల్లలు వాళ్ళ కిష్టమైన వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి గానీ, పెద్దవాళ్ళ కిష్టమైన వాళ్ళని కాదు. పిల్లల ఇష్టాన్నే పెద్దవాళ్ళు కూడా ఇష్ట పడాలి. మా పిల్లాడి పెళ్ళి మాకు చాలా సమ్మతం’ అని మీరు గట్టిగా చెప్పగలగాలి. అప్పుడే మీకీ బాధ పోతుంది” అని అనునయంగా చెప్పాను.

కాస్త తెరిపిపడి, ఇంకా చాలా సేపు ఆ విషయాలూ, ఈ విషయాలూ మాట్టాడిందావిడ. చివరికి గొంతులోకి కాస్త నవ్వొచ్చింది కూడా.

“మీరు చెప్పిందే కరెక్టండీ! పిల్లాడు కూడా ముందరే చెప్పాడు మాకు. వాళ్ళ నాన్న ఒక యేడాది ఆగమంటే, మూడేళ్ళు ఆగాడు. వాళ్ళు సంతోషంగా వుండాలి. మీరు పెళ్ళికి తప్పకుండా రావాలి సుమా!” అందావిడ నవ్వుతూ.

“పెళ్ళెలా చేస్తున్నారూ?” కుతూహలంగా అడిగాను.

“ఏమోనండీ! ఇంకా వివరంగా అనుకోలేదు. బహుశా ఏ హాలో బుక్ చేసుకుని, పురోహితుడిని పిలిచి చేయిస్తాము. ఇకపై అన్నీ ఆలోచించాలి” అందావిడ.

“సాంప్రదాయంగా చేసే పెళ్ళిళ్ళకి నేను రానండీ! కోర్టు పెళ్ళి చెయ్యండి, తప్పకుండా వస్తాను. ఆడంబరంగా, సాంప్రదాయంగా చేసేవి నాకు నచ్చవండీ. పెళ్ళయ్యాక ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి మీ కోడలిని చూస్తాను” వివరంగా చెప్పాను.

“కన్న కొడుకు అర్థం అయ్యాడు గనకనా, మీరు అర్థం అవ్వడానికి. మీ ఇష్టం అండీ. రాఘవ్ ఇలా సాంప్రదాయంగా పెళ్ళి చేసుకోవడమే ఇష్టం అన్నాడు. వుంటానండీ” ఫోను పెట్టేసిందావిడ.

ఆ మర్నాడు సాయంకాలం రాఘవ్ చాలా దూకుడుగా వచ్చాడు. సాధారణంగా ఫోను చేసి వచ్చేవాడు. అతని దూకుడు చూసి కొంచెం తడబడ్డాను ఏం జరిగిందా అని.

“మీరు నా పెళ్ళికి రానన్నారట?” సీరియస్‌గా అడిగాడు సోఫాలో కూర్చుంటూ.

అప్పటికి విషయం అర్థం అయింది.

“ఇంతకీ నీ పెళ్ళెలా జరుగుతోందీ?” అడిగాను నవ్వుతూ ఆరాగా.

“ఏముందీ! నాకూ, హరిణికీ దైవ నమ్మకాలున్నాయి. కాబట్టి, పురోహితుడిని పిలిచి సాంప్రదాయంగా పెళ్ళి చేసుకుంటాము” అన్నాడు మామూలుగా.

“అలా అయితే దేముడి గుళ్ళో సింపుల్‌గా మీ కుటుంబం, వాళ్ళ కుటుంబం మాత్రమే వెళ్ళి, పెళ్ళి చేసుకోవచ్చుగా? ఆ తర్వాత తెలుసున్న కొంతమంది దగ్గర స్నేహితులని పిలిచి, చిన్న రిసెప్షన్ ఇవ్వచ్చు. కాఫీ, టీ, కొన్ని స్నేక్సూ. మొత్తం ఖర్చంతా ఓ వెయ్యి డాలర్లలో అయిపోతుంది. ఇప్పుడు మీరు హాలు బుక్ చేస్తున్నారు. అదొక రెండు వేలవుతుంది. మీ అమ్మగారు ఇండియా వెళ్ళి షాపింగు చేసి వస్తారు. అదొక కొన్ని వేలు. ఇక్కడ ఆడంబరాలకి ఇంకొన్ని వేలు. వీడియోలూ, కార్డులూ, పెట్టుపోతలూ, బంగారాలూ, గట్రా అన్నీ కలిసి ఒక పాతిక నించీ, ముప్ఫై వేల దాకా తేలుతుంది కదా? ఎందుకంత ఆడంబరం?”

“రేపు మీ పిల్లలు వాళ్ళ కిష్టం అయి ఇలా చేసుకుంటే, మీరు వెళ్ళరా?”

“చచ్చినా వెళ్ళను. అసలు వాళ్ళు అలా చేసుకోరు. చిన్నప్పటి నించీ సింపుల్‌గా వుండాలనే భావాలతోనే పెరిగారు. ఒకవేళ ఇప్పుడు మారిపోయి, అలాంటి ఆడంబరం పెళ్ళి చేసుకుంటే, నేను వెళ్ళను. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. అదంతా అయ్యాక మళ్ళీ వాళ్ళందరూ మా కుటుంబంలో మనుషులే అవుతారు. ఈ ఆడంబరాలకి నేను ఒక్క డాలరు కూడా ఇవ్వను వాళ్ళకి”

“జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకునే పెళ్ళి కదా? అది గ్రాండుగా చేసుకుంటే తప్పేమిటీ?”

“చట్ట ప్రకారం అయితే, తప్పు కాదు. నీ చుట్టూ వున్న వాళ్ళ సంస్కృతితో పోల్చుకుంటే తప్పుకాదు. అంత డబ్బు ఖర్చు పెట్టి,ఆడంబరం చేసి, చివరికి మీ భార్యా,భర్తలిద్దరూ ఎక్కడుంటారూ? అద్దె కొంపలోనే కదా? ఆ ఖర్చంతా డౌన్ పేమెంటుగా పెడితే, మీకో ఇల్లు వొస్తుంది కదా? మీ అమ్మది చాదస్తం అంటావు గానీ, అప్పు చేసి పప్పు కూడు తినడం కూడా చాదస్తం కాదా? నీ చుట్టూ మనుషులంతా రెండ్రోజుల్లో మర్చిపోయే ఈ ఆడంబరం పెళ్ళి చేసుకోవడం నీ చాదస్తం కాదా? ఇంకొకరి చాదస్తం గుర్తు చేసుకునే ముందు, నీ చాదస్తం గుర్తు చేసుకో! మొదటిసారి పెళ్ళి చేసుకునే వాళ్ళందరూ, అది ఒకే ఒక పెళ్ళి అనే అనుకుంటారు, వేరే సందర్భం వచ్చేవరకూ. కాబట్టి, ‘జీవితంలో ఒకే ఒక్కసారి’ అనే మాటకి అర్థం లేదు. అయితే మటుక్కి ఏమిటి? ఈ పెళ్ళికి మీ నాన్న సంపాదించిన డబ్బూ, నువ్వు సంపాదించిన డబ్బే కదా ఖర్చు పెట్టాలి? మీరేమన్నా డబ్బుతో పులిసి వున్నారా? నిన్న గాక మొన్న వరకూ మీ వాళ్ళకి సొంత కొంపే లేకపోయే. ఇంటి మీద అప్పు పెట్టుకుని, ఈ ఆడంబరం పెళ్ళి చేసుకోకపోతే యేమిటీ? కోర్టు పెళ్ళి వదిలెయ్యి, ఏదన్నా గుళ్ళో సింపుల్‌గా చేసుకోవడానికి ఏం దొబ్బుడాయి? ఇంకోసారి నువ్వు మీ అమ్మ చాదస్తం గురించి మాట్టాడకు. నీకా అర్హత లేదు” అన్నాను చాలా తీవ్రంగా.

ఏం మాట్టాడాలో తెలియక, నా వైపే చూస్తూ వుండిపోయాడు రాఘవ్. కొంచెం తేరుకున్నాను నేను. మళ్ళీ చెప్పసాగాను.

“ఎదటి వాళ్ళ చాదస్తం గురించి మాట్టాడ్డానికే మనకి నోరొస్తుంది రాఘవ్. మనది మనకు తెలియదు. నిజానికి, నీ పెళ్ళికి ఒప్పుకోవడం వల్ల మీ అమ్మా,నాన్నా చాదస్తాలు వదిలేశారు. నువ్వు మాత్రం నీ చాదస్తం పట్టుకు వేళ్ళాడుతూనే వున్నావు. ఆ అమ్మాయి కూడా నీలాంటి చాదస్తురాలే కాబోలు. మొన్నా మధ్య మాకు తెలుసున్న వాళ్ళు నాలుగు వేల డాలర్లు పోసి, ప్లాస్మా టీవీ కొన్నారు. ఇంటికొచ్చిన వాళ్ళందరికీ చూపించుకుని మురుస్తూ బతుకుతున్నారు. ఇంటి మీద వాళ్ళకి బోలెడు అప్పు. దాని మీద బోలెడు వడ్డీ కడుతున్నారు. రెండో పిల్లాడిని, డబ్బు లేదంటూ పబ్లిక్ స్కూల్లో వేశారు. పెద్ద పిల్లాడు మాత్రం ప్రైవేటు స్కూలు. డబ్బు లేదు కాబట్టి, వాణ్ణి ఆ ప్రైవేటు స్కూల్లోంచీ ఎప్పుడు తీసేద్దామా అని చూస్తూ వుంటారు. వాళ్ళకీ ఆడంబరం ఎందుకు? ఇంటికొచ్చిన వాళ్ళకి చూపించుకుని గర్వ పడ్డానికి తప్ప? అప్పు చేసి పప్పు కూడు ఎప్పుడూ చాదస్తమే నా దృష్టిలో. నువ్వేదో మిలియన్లలో ములిగుంటే, అది వేరే సంగతి” అన్నాను.

నోర్విప్పలేదు రాఘవ్. కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయాడు.

నా వుపన్యాసం అంతా కంఠశోష అయింది. నేను పెళ్ళికి వెళ్ళలేదు.