మహరాజవ్వాలంటే…

బుల్లి భూషయ్యకి మహరాజవుదామని కోరిక పుట్టింది. ఒకటే ఉబలాటం. ఇదేమీ కొత్తగా పుట్టిన కోరిక కాదు. అన్నయ్య చిన భూషయ్య ఆరేళ్ళకిందట అనుకోకండా మహరాజుగా ఎంపిక అయినప్పటినుంచీ, తను కూడా మహరాజవ్వాలని తహ తహలాడటం మొదలెట్టాడు. తనకేం తక్కువయిందని? చదువులేదా? చక్కని సంసారం లేదా? చినభూషయ్య లాగే తన్నుకూడా దక్షిణాదిలో ఎనిమిదేళ్ళు రాజరికం వెలిగించాడుగా. సామంతరాజరికమేననుకో. చినభూషయ్యలాగే తనకీ మొండిపట్టు, ముక్కుమీద కోపం! చెప్పద్దూ! పైగా, ఇప్పుడు తనకి పనికూడా లేదాయె!

చినభూషయ్యని మహరాజుగా చెయ్యడానికి తను అడ్డమైన గడ్డీ కరిచాడు. ఒక సారి కాదు. రెండుసార్లు. నానా రకాల అబద్ధాలూ చెప్పించవలసి వచ్చింది కూడా. అన్నయ్య తను చేసిన సాయం మరిచిపోతాడా!

ఎందుకన్నా మంచిదని, ముందుగా తన భార్యని సంప్రదించాడు.

“నేనుకూడా మహరాజుగా ఎంపిక చేయించుకోడానికి అన్నయ్యని సాయం చెయ్యమని అడుగుతా, ఏమంటావ్” అని ఆవిడని అడిగాడు.

“ఏమో బాబూ! ఈ మధ్య మీఅన్నయ్య పేరుచెపితే, మావైపువాళ్ళు మాట్లాడటంకూడా మానేసారు. అందాకా ఎందుకు? మన ఇంట్ళోనే మన పిల్లలు, మన పనివాళ్ళూ కూడా ఆయనగారి పేరువినపడితే చాలు, ఒకటే చీదరించుకోవడం మొదలెట్టారు. అయినా, ముందుగా మీరు మీనాన్నగారి సలహా, ఆయనగారి సాయం అడిగిచూడండి. ఆయనేం అంటారో,” అన్నది ఆవిడ.

అదీనిజమే! మంచిసలహాయే! బుల్లి భూషయ్య నాన్న పెదభూషయ్య కూడా మహరాజుగా కొన్నాళ్ళు వెలిగించాడు. ముందుగా ఆయన్న్ని అడగడం సబబేనని పించింది, బుల్లిభూషయ్యకి.

మంచి ముహూర్తం చూసుకొని పెదభూషయ్యని కలిశాడు; ఆయన్ని కదలేశాడు. తనుకూడా మహరాజుగా వెలిగించాలనుకుంటున్నానని చెప్పాడు. తను, చినభూషయ్య తరువాత మహరాజుగా ఎంపిక కాలేకపోతే మన భూషయ్య వంశానికే నామర్దా, అప్రతిష్ట కూడాను అన్నాడు. ఎల్లాగయినా చినభూషయ్యకి నయానో భయానో చెప్పి, సాయం చేయించమని ప్రాధేయపడ్డాడు.

పెదభూషయ్య చాలా జాలిగా బుల్లిభూషయ్యని చూస్తూ, “చూడు నాయనా! నువ్వు మహరాజవడం నాకు చాలా ఇష్టం. నువ్వు తప్పకుండా మహరాజు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అయితే, నీకు తెలియనిది ఏముంది చెప్పు? మీఅన్నయ్య, ఆ చినభూషిగాడు, నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నాడు గనక? చిన్నప్పటినుంచీ ఇంట్లో మనం ఎడ్డెం అంటే వాడు తెడ్డెం అనేవాడు గదా! వాడికి, ఇద్దరే ఇద్దరు సలహాదారులున్నారు. ఒకడేమో దానా రాశయ్య, రెండోవాడు డేగా చెన్నయ్య. వాళ్ళు ఏం చెపితే అది చేస్తాడు. మరి ఈ మధ్యకాలంలో దానా రాశయ్యకి వాడికీ అంత పొత్తు కుదరటల్లేదని విన్నా. అందుకని, నువ్వు ఏదోరకంగా ఆ చెన్నయ్యని పట్టుకో. వాడిని మంచిచేసుకున్నావంటే నీకు ఢోకాలేదు. వాడుగనక చినభూషయ్యకి చెప్పి నప్పిస్తే అడ్డమే లేదు. ఇంతకన్నా నేను చెప్పేందుకేమీ లేదు. శుభం!” అని బుల్లిభూషయ్యని సముద్యాయించి సాగనంపాడు పెదభూషయ్య.

బుల్లిభూషయ్య ఎకాఎకీ రాజధానికొచ్చాడు. డేగా చెన్నయ్యని కలుసుకున్నాడు. తను మహరాజు కావడానికి సహాయం కావాలని కోరాడు. చెన్నయ్య ముసిముసినవ్వులు నవ్వుతూ, “ తొందరేముందోయ్! ఇంకా ఏడాది పైన వ్యవధి ఉన్నదిగా! వీలు చూసుకొని మీ అన్నయ్య చినభూషయ్య చెవిలో ఈ విషయం ఊదుతాలే! ఈ లోగా, నువ్వు ఒక పని చెయ్యి. ఇదిగో, ఈ నల్ల బొచ్చుకుక్క కాలీని మీ ఇంటికి తీసికెళ్ళి, దీనికి మన మాటలన్నీ నేర్పించు. నువ్వు ఆపనిగనక చెయ్యగలిగితే, నిన్ను గ్యారంటీగా మహరాజుగా ఎంపిక చేయిస్తా. నామాట నమ్ము,” అని చేతిలో చెయ్యివేసి, గొలుసుతోసహా నల్ల కుక్కని అప్పగించాడు.

బుల్లి భూషయ్య కుక్కని ఇంటికి తీసుకోచ్చాడు. భార్యతో జరిగిన కథంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. బుల్లిభూషయ్య భార్య వెంటనే, “వీళ్ళంత విశ్వాస ఘాతకులని నేను కలలో కూడా చూడలేదు,” అని, మొగుడిమీదా కుక్కమీదా గయ్యిమని విరుచుకొపడింది. అతనికీ, ఆవిడకీ డేగా చెన్నయ్యమీద, చినభూషయ్యమీదా చచ్చేంత కోపం వచ్చేసింది. దీనికితోడు, అగ్నిలో ఆజ్యం పోసినట్టు నల్లబొచ్చుకుక్క కాలీ భౌ భౌ అని అరవడం మొదలెట్టంగానే మరీ ఒళ్ళు మండిపోయి, పిచ్చెక్కినంత పనయ్యింది, ఆవిడకి! బుల్లిభూషయ్య నిదానంగా భార్యని సముదాయించి తాను ఆలోచనలో పడ్డాడు.

“మరయితే, ఏం చేద్దామనుకుంటున్నారు?” అని ఆవిడ అడిగింది.

“ఏడాది తరువాతి మాట కదా! ఈ లోగా అన్నయ్యకి మహరాజపదవి ఊడైనాపోవచ్చు; లేదా ఈ నల్ల బొచ్చుకుక్క కాలీ చచ్చైనా పోవచ్చు. ఓపిక పట్టి చూద్దాం,” అన్నాడు.

ఏడాది గడిచిపోయింది. బుల్లిభూషయ్య మళ్ళీ రాజధానికొచ్చాడు, అన్నయ్యనీ, చెన్నయ్యనీ కలవడానికి.

డేగా చెన్నయ్య, చినభూషయ్య కోలగదిలో రహస్య మంతనాలు చేస్తున్నారు. అయితేనేం! వచ్చిన వెంటనే బుల్లిభూషయ్యని లోపలికి రమ్మన్నారు.

“నల్ల బొచ్చుకుక్కకి మాటలు నేర్పావా?” అని అడిగాడు, చెన్నయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ.

“ఆహా! కాలీ కి మన మాటలు నేర్పాను,” అనాడు బుల్లిభూషయ్య.

“ఏదీ! కాలీని నీతో తేలేదే!” అని చినభూషయ్య, చెన్నయ్యా విస్తుపోతూ ఒకేసారి ఏకకంఠంతో అడిగారు.

“ లేదు. మీరిచ్చిన నల్ల బొచ్చుకుక్క కాలీని నావెంట తీసుకో రాలేదు. ఎందుకంటే, అది మాటలు వచ్చింతరువాత, మహా పేట్రేగి పోయింది,” అన్నాడు, బుల్లిభూషయ్య.

“అంటే?”

“అంటే ఏమిటంటే, ఇంటికి ఎవరొచ్చినా, వాళ్ళతోటి, మీరు గత అయిదేళ్ళల్లో కూడపలుక్కొని చేసిన మంతనాలు, పాడు పనులూ, మొత్తం మీతతంగం అంతా ఏకరువు పెట్టడం మొదలెట్టింది. అందుకని….”

“వెంటనే ఆ కుక్కని పట్టుకొ రా. దాన్ని ఈ తుపాకితో కాల్చి చంపెయ్యాలి,” అన్నాడు చెన్నయ్య, అతి కోపంగా.

“ఆ పని నేనే చేసేశాను,” అన్నాడు బుల్లిభూషయ్య, కాబోయే మహరాజులా మొహంపెట్టి. *

(ఒక జూయిష్ చాటు కథ చదివిన తరువాత…)