అనంతం

ఏ కాలం లో ఈ తీరాన ఏ ఇసుక రేణువు అగ్నిలో కలిసిందో
అగ్నిలా మెరిసే ఆ రేణువులో ఏ ఆకాశాలు నిండాయో
ఏ ప్రాణవాయువులు మండాయో- మా అమ్మ గుండెల్లో
రక్తాన్ని పంచుకుంటూ నా మొదటి కదలికలు
మా అమ్మ భూదేవి గర్భంలో, పెన్నేటి తీరాన నా మొదటి కవళికలు
ఏ లోకాల్లొంచో వినవచ్చే గతితప్పని మెత్తని మృదువైన సంగీతం
వెచ్చని వుప్పునీటి పడకమీద చిక్కని చీకట్లో సాకారమవుతున్న కల
అమ్మ నుంచి అరువు తెచ్చుకున్న రక్తంతో నా ఆకలి తీర్చుకుంటూ
ఈ గుండ్రటి జ్ఞాపకాలనిచ్చెన వొక్కొక్క మెట్టే ఎక్కుతూ
నేనే కర్తనై, నేనే కర్మనై, కాలాన్ని ఆవాహనం చేస్తూ
విడిపోతూ, కరిగిపోతూ, కలసిపోతూ నాకేతెలియని నా రూపాన్ని
నేనెరగని కలలో నేనే చెక్కుకుంటూ, నన్ను నేనె సృష్టించుకుంటూ
నేనే- మా అమ్మని నేనే, మా నాన్నని నేనే, నేనే
అనంతవైన జీవనప్రస్తానంలో వేల వేల జీవితాల్లోంచి
ఆరిపోక సాగిపొయ్యే ఆ అగ్ని కణం నేనే, ఆ పిల్ల తెమ్మెర నేనే,
ఆ చల్లని నీటి బొట్టు నేనే, ఆ తెల్లని ఇసుకరేణువుని నేనే
మండే సూర్యుడిని బొట్టు పెట్టుకున్న ఆ ఎర్రెర్రని ఆకాశాన్ని నేనే.

ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి, ఈ చల్లని నీళ్ళలో మెల్ల మెల్లగా కరుగుతూ
అమ్మ పెన్న వొడిలో నీరుగా మారుతూ, తీరం మీగ గాలిగా సాగుతూ
ఇసుకలో రేణువునై చేరుతూ, ఆకాశంలో కలగా మారుతూ
చితిలో మంటనై నా కూతురి జ్ఞాపకపు మెట్ల మీద నిదురించే అగ్నికణం నేనే, నేనే
అనంతవైన ఈ జీవన సంగీతంలో క్షణకాలం వినవచ్చిన ఆ అడుగుల సవ్వడి నేనే.