నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ

శాస్త్రీయసంగీత ప్రియులకు స్వరప్రస్తారాలు బాగా పరిచితమే! రాగ లక్షణాన్ని సంపూర్ణంగా దర్శింపజేయడానికో, పాటలోని భావావస్థితిని పైస్థాయికి తీసుకువెళ్ళడానికో (లేదా తమ గానవైదుష్యాన్ని ప్రదర్శించడానికో!) గాయకులు చేసే స్వరప్రస్తారం శ్రోతలను సమ్మోహితులను చేస్తూ ఉంటుంది. వాటికంటూ ఒక ప్రత్యేకతతో గాయకుని మనోధర్మానికి అద్దంపడుతూ అవి శోభిస్తాయి. అయితే కొన్నిసార్లు, పాట మధ్యలో ఒక స్వరమో, ఒక చిన్న గమకమో, ఊహించని విధంగా వినిపించి పాటకీ రాగానికీ ఒక కొత్త కాంతిని తీసుకు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. వాటిని ఆ పాటనుంచి వేరు చేసి చూసే అవకాశం ఉండదు. కావ్యాలలోని పద్యాలు కూడా సరిగ్గా యిలాగే ఉంటాయి. కవి తన కల్పనాచాతుర్యంతో చేసే వర్ణనలు స్వరప్రస్తారాల లాగా పాఠకులని అబ్బురపరుస్తాయి. కొన్ని పద్యాలు మాత్రం మనం ఊహించని విధంగా, కథాగమనంలో తళుక్కున మెరిసి, కథకో అందులోని పాత్రలకో కొత్త వెలుగుని అందిస్తాయి. అలాంటి ఒక ముచ్చటైన పద్యాన్ని గురించి యీ నెల ముచ్చటించుకొందాం.

ఆ పద్యం ఏమిటో చెప్పుకొనే ముందు, అది వచ్చే కథనూ, అంతకన్నా ముఖ్యంగా ఆ కథలోని నాయికానాయకులనూ, పరిచయం చేసుకోవాలి. మన మునులందరిలోనూ అగస్త్య ముని అంటే నాకు ఎందుకో చెప్పలేని అభిమానం. ఆయన ఒక సాహసికుడు. వింధ్య గర్వాన్ని అణచినా, సముద్రాన్ని పుక్కిటబట్టినా, వాతాపిని జీర్ణం చేసుకొన్నా – అతని కథలన్నీ అద్భుత సాహసాలే! పైగా, ఈ పనులన్నీ ఆయన చేసింది తన స్వార్థం కోసమో, లేదా తన కోప కారణంగానో కావు. అన్నీ పరోపకారం కోసం చేసిన మహాకార్యాలే. ఆ అగస్త్యుడే ఈ రోజు మన కథానాయకుడు. సాక్షాత్తూ ఆయనకు సహచరి, సహధర్మచారిణి, లోపాముద్ర. ఆవిడే కథానాయిక. వాళ్ళది ఒక అపురూపమైన దాంపత్యం! తనకు దీటైన అమ్మాయి ఎవరూ భూప్రపంచం మొత్తంలో కనిపించకపోతే అగస్త్యుడే స్వయంగా ఆమెను తయారు చేశాడని ఒక కథ. లోపాముద్ర అగస్త్యునికి సరైన జోడీగానే కనిపిస్తుంది. తాపసులకు కూడా సంసార బాధ్యత ఉందనీ, తనను పట్టించుకోవడం అతని కర్తవ్యమనీ, ఆమె అగస్త్యుని నిలదీసినట్టు అర్థం వచ్చే రెండు సూక్తాలు, ఆమె పేర అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో ఉన్నాయి! జ్ఞానమూ సౌందర్యమూ కలగలిసిన లలితాదేవి స్వరూపంగా లోపాముద్రను చాలామంది భావిస్తారు. అగస్త్యుని విషయం సరేసరి! అతను సాహసికుడే కాదు గొప్ప శస్త్రాస్త్ర కోవిదుడు కూడా. ఆదికావ్యమైన రామాయణంలో అతను ప్రముఖంగా కనిపిస్తాడు. అగస్త్యుని గొప్పతనం తెలిసిన రాముడు అరణ్యవాసంలో అతని గురించి వెతుక్కుంటూ వెళతాడు. ముందు ‘అగస్త్య భ్రాత’ను కలిసి, అతని ద్వారా అగస్త్యుని కలుస్తాడు. అగస్త్యుడు రామలక్ష్మణులకి అనేక అస్త్రాలను ప్రసాదిస్తాడు. తిరిగి యుద్ధకాండలో దర్శనమిచ్చి, రామునికి ఆదిత్యహృదయాన్ని బోధిస్తాడు. ఉత్తరరామాయణంలో కూడా అగస్త్యుని ప్రస్తావన ప్రముఖంగా వస్తుంది. మహాభారతంలో కూడా ద్రోణునికి బ్రహ్మాస్త్రాన్ని అందించిన మహర్షి అగస్త్యుడే. లోకకల్యాణం కోసం అగస్త్యుడు ఉత్తరభారతం నుండి దక్షిణానికి తరలి వచ్చినట్టుగా కథలున్నాయి.

తమిళదేశంలో కూడా చాలా ప్రసిద్ధి పొందిన ముని అగస్త్య మహాముని. అతన్ని ముద్దుగా, కురుముని (అంటే పొట్టి ముని) అని పిలుస్తారు. తమిళభాషకూ వ్యాకరణానికీ ఆద్యునిగా తమిళులు అగస్త్యుని చాలా గౌరవిస్తారు. తమిళనాట చాలాచోట్ల అతని పేర అగస్త్యేశ్వర ఆలయాలున్నాయి. గొప్ప ఔషధసిద్ధునిగా కూడా అగస్త్యుని పేరు ప్రసిద్ధి చెందింది. దక్షిణభారతదేశంలో ప్రసిద్ధమై నాడీ జ్యోతిషానికి కూడా అగస్త్యుడే ఆద్యుడని నమ్ముతారు. అంటే, అగస్త్యుడు భారతదేశం మొత్తం మీద గొప్ప పేరున్న ముని అన్నమాట! ఉత్తర దక్షిణ భారతదేశ సంస్కృతులలో కనిపించే ప్రసిద్ధ వ్యక్తి కావడంతో, ప్రాచీన భారతచరిత్ర పరిశోధకులకు కూడా అగస్త్యుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. సింధునాగరికతలో కనిపించే రెండు ప్రముఖ చిహ్నాలు అగస్త్యుని పేరుని సూచిస్తాయని ఐరావతం మహదేవన్ అనే ప్రసిద్ధ పరిశోధకుడు పేర్కొన్నారు. అగస్త్యునికున్న మరో ప్రత్యేకత, తమాషాగా చెప్పుకోవాలంటే, మనకు తెలిసిన మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీలలో అతనొకడు! రెండవవాడు వశిష్ఠుడు. మిత్రావరణులు అనే దేవతల ద్వారా కుండలో పుట్టిన కవల పిల్లలు అగస్త్యుడు, వశిష్ఠుడూను.

ఇన్ని రకాలుగా అగస్త్యుడు భారతీయ సంస్కృతిలో చాలా విశిష్టత కలిగిన ముని. ఆయన గురించి చాలా చోట్ల చాలా కథలున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ధూర్జటి రచించిన శ్రీకాళహస్తిమాహాత్మ్యం అనే కావ్యం లోది. ఈ కథను స్వయంగా పరమశివుడే మాయాజంగముని వేషంలో వచ్చి శ్రీకాళహస్తిని పాలించే యాదవరాజుకు చెపుతాడు. కథ మొదలవుతూనే అగస్త్యుని మహత్వం మనకి స్పష్టంగా తెలుస్తుంది. శివపార్వతుల పెండ్లి వేడుక చూడాలని దక్షిణ దిక్కున ఉన్న సమస్త భూతకోటీ హిమాలయాలకు తరలి వస్తుంది. దానివల్ల ఉత్తరదిశపై భారం పెరిగి అది క్రుంగి పోతుంది. అప్పుడు శివుడు అగస్త్యునితో, “యీ ఉపద్రవాన్ని మాన్పడం నీకూ నాకూ తప్ప మరింకెవ్వరికీ సాధ్యపడదు. కాబట్టి నువ్వు వెంటనే దక్షిణ దిక్కుగా ప్రయాణం కట్టు,” అని అజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞకు కట్టుబడి అగస్త్యుడు తన యిల్లాలితో దక్షిణానికి ప్రయాణమవుతాడు. ఈ కథ, తమిళంలో అతిప్రాచీనమైన వ్యాకరణ గ్రంథం తొల్కాప్పియన్‌లో కనిపిస్తుంది. అలా బయలుదేరిన అగస్త్యుడు దక్షిణకైలాసంగా ప్రసిద్ధి పొందిన కాళహస్తి చేరుకొని అక్కడి శివలింగాన్ని దర్శించి పూజిస్తాడు. అంతటి గొప్ప పుణ్యస్థలం కూడా, దగ్గర నది లేని కారణంగా వెన్నెల లేని పున్నమి జాబిలిలా కళాకాంతులు లేకుండా ఉందని భావించి, ఆకాశగంగను అక్కడ ప్రవహింపజేయాలని సంకల్పిస్తాడు. దానికై పరమశివుని గూర్చి తపస్సు చేయాలనుకొంటాడు. కాళహస్తికి దక్షిణంగా నాలుగుయోజనాల దూరంలో ఉన్న మరొక పెద్ద పర్వతాన్ని భార్యాసమేతుడై చేరుకొని, దానిమీద ఒక చక్కని ప్రదేశాన్ని ఎన్నుకొని దృఢదీక్షతో తపస్సు మొదలుపెడతాడు. ఎండా వానా చలీ – వేటికీ చలించకుండా తపస్సు సాగిస్తాడు. ఆ భీకరమైన తపస్సుకు జడిసి దేవతలందరూ బ్రహ్మతో సహా ఈశ్వరుని దగ్గరకు వెళతారు. “ఏ దేవాధిపతిత్వం కోసం అగస్త్యుడు ఆ ఉగ్రతపాన్ని చేస్తున్నాడో! అతని సంగతేదో చూడు మహాప్రభో!” అని మొరపెట్టుకొంటారు. శివుడు చిరునవ్వు నవ్వి “మీకు భీతినొందను బని లేదు, అగస్త్యముని దక్షిణరౌప్యధరాధరంబు దాపున నది లేని దుఃఖమున బూనె మహాతపమాచరింపగన్,” అని దక్షిణకైలాసమైన కాళహస్తి దగ్గర నదిలేని కారణంగా ఆర్తి చెంది అగస్త్యుడు దానికై తపస్సు చేస్తున్నాడు తప్ప తనకేదో కావలని కాదు సుమా అని దేవతలకు ధైర్యం చెపుతాడు. ఈ మాత్రం దానికి తాను వెళ్ళడమెందుకని బ్రహ్మను వెళ్ళి అగస్త్యుని కోర్కె తీర్చమని చెపుతాడు. శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ ప్రత్యక్షమై, అగస్త్యుని కోరిక మేరకు ఆకాశగంగను అక్కడ సువర్ణముఖరీ నదిగా ప్రవహింపజేస్తాడు. అగస్త్యుని తపోమహిమకు అక్కడి మునులందరూ సంతోషించి:

శితికంఠు డద్రికన్యా
పతియై సుఖి యయ్యె భువనభవనంబున ద
త్ప్రతిగా లోపాముద్రా
పతివై సుఖివైతి వీవు పరమ మునీంద్రా

అని అగస్త్యా లోపాముద్రల గొప్పదనాన్ని కీర్తిస్తారు. ఆ తర్వాత దక్షిణాన ఉన్న యితర పుణ్యక్షేత్రాలను దర్శించడానికి సతీసమేతుడై అగస్త్యుడు బయలుదేరుతాడు. అదీ కథ!

ఇంతకీ ఈ నెల పద్యం సంగతేమిటి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. అగస్త్యుడు తన తపస్సు కోసం కాళహస్తికి సమీపంలోనే ఉన్న ఒక పర్వతాన్ని చూసి అక్కడికి చేరుకొంటాడని చెప్పాను కదా. “దక్షిణ కైలాస గోత్రంబునకుం జతుర్యోజన మాత్రంబున రాత్రించర దిశాభాగంబున నొక్క మహాశైలంబు గని” అన్న వచనం తరువాత వస్తుంది యీ పద్యం. సాధారణంగా ఆ సందర్భంలో ఎలాంటి పద్యాన్ని ఊహిస్తాం? “అటజని కాంచె భూమిసురుడు…” అన్న తరహాలో ఆ పర్వతాన్ని వర్ణించే పద్యమేదైనా ఊహించవచ్చు. లేదూ, అసలే వర్ణనా లేకుండా అగస్త్యుడు ఆ పర్వతాన్ని అధిరోహించి తపస్సు ప్రారంభించాడని మామూలుగా కథ నడిపించేయ వచ్చు. ఈ రెండూ కాకుండా, ఒక ముచ్చటైన దృశ్యాన్ని మన కళ్ళకు కట్టించాడు ధూర్జటి!

ఉ. చేరగబోయి యాత్మసరసీరుహలోచన కేలువట్టి వ
      క్షోరుహకుంభభారమున సూక్ష్మవలగ్నము పీడబొంద బొం
      దారయు వృత్తి రమ్మనుచు నాదరణంబున దోడుకొంచు విం
      ధ్యారి తదగ్రభాగమున కల్లన నెక్కి, ఝరాంబుధారలన్

పర్వతాన్ని చేరుకొని ఎక్కడం మొదలుపెట్టాడు అగస్త్యుడు. తానొక్కడే చకచకా ఆ కొండెక్కి లోపాముద్రని వచ్చేయమనలేదు. పాపం అసలే సన్నని నడుమేమో, అంత పెద్ద కొండ ఎక్కేటప్పుడు ఆమెకి నడుమునొప్పి రాక మానదు. అది గ్రహించిన అగస్త్యుడు, తానొక అడుగు ఎక్కి, ఆమె చేయిపట్టుకొని, ప్రేమగా రమ్మని పిలిచి, ఎక్కిస్తూ, ఎంతో ఆదరంతో జాగ్రత్తగా తనతో పాటు కొండ చివరికంటూ తీసుకువెళ్ళాడట. సరే ఆ తర్వాత అక్కడి జలపాతాలలో వారిద్దరూ సరిగంగ స్నానాలు చేశారు. ఎంత చూడముచ్చటైన దృశ్యమో కదా! అలాంటి సందర్భంలో యిలాంటి ఒక దృశ్యాన్ని ఊహించి చిత్రించడం సామాన్యమైన విషయం కాదు. అగస్త్యా లోపాముద్రల అన్యోన్య దాంపత్యం, వారి బాంధవ్యం లోని సౌందర్యం, ధూర్జటి మనసులో బలంగా నాటుకుపోయి ఉండాలి. దాన్ని వ్యంగ్యంగా చిత్రించడం ఎలా? నేరుగా చెప్పేస్తే అది కవిత్వం కాదాయె! సున్నితంగా స్ఫురింపజేసే అవకాశం కోసం ప్రతి సన్నివేశంలోనూ వెతుకుతూ వస్తూ ఉంటే, బహుశా ఇక్కడ అది అతనికి సాక్షాత్కరించిందేమో! దాంపత్యంలోని మధురిమను యింత లలిత మనోహరంగా చిత్రించే సన్నివేశాలు కావ్యాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి!

ఇలాంటి పద్యాలను నిర్మించడం కూడా అంత సులువైన విషయం కాదు. వర్ణన అయితే, అందులోని విషయానికి తగిన పద్యరచన చేసేందుకు కొన్ని పూర్వ నిర్మిత పథకాలు ఉంటాయి. ఉదాహరణకు, చేసే వర్ణనలో అనేక అంశాల ప్రస్తావన ఉన్నట్టయితే, సీసపద్యాన్ని ఎన్నుకోవచ్చు. ఒక గంభీరమైన వర్ణనకు శార్దూల మత్తేభాలవంటి వృత్తాలని ఎన్నుకొని సమాసభూయిష్టమైన రచన సాగించవచ్చు. కానీ యిక్కడ విషయం అంత పెద్ద వర్ణన కాదు. అగస్త్యుడు తన భార్యను ఆప్యాయంగా వెంటపెట్టుకొని కొండ ఎక్కించే దృశ్యాన్ని చిత్రించాలి. మామూలుగా ఒక చిన్న పద్యంలో అలా ఎక్కించాడన్న విషయాన్ని మాత్రం చెప్పి ఊరుకొంటే పాఠకుల మనసులో అది ముద్రపడదు. అంచేత పద్యరచన సొగసుగా సాగాలి. కానీ అది చిత్రించే దృశ్యాన్ని మింగేయకూడదు. ఎన్నుకొనే ఛందస్సు మొదలుకొని, దాన్ని చివరికంటూ నిర్మించే దాకా యిది కవికి కత్తిమీద సామే! దాన్ని సమర్థంగా నిర్వహించి తన పలుకుల మాధురీ మహిమతో చక్కని దృశ్యాన్ని మనముందుంచాడు ధూర్జటి. తన భార్య చేయిపట్టుకొని అనడానికి ఆత్మ సరసీరుహలోచన కేలువట్టి, అన్నాడు. ఆ సన్నివేశంలో అగస్త్యునికి లోపాముద్ర ‘సరసీరుహలోచన’గా కనిపించిందన్న మాట. ఎన్నో ఏళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా భార్య భర్తకు సరసీరుహలోచనగా కనిపించండం ఎంత అరుదో, ఎంత అదృష్టమో వేరే చెప్పక్కర లేదు కదా! ఆత్మ అన్న పదం, ఆమె అతనికి ఎంత దగ్గరో సంపూర్ణంగా అవగతం చేస్తుంది. ఆవిడ వక్షోరుహకుంభభారము, సూక్ష్మ వలగ్నము కూడా అగస్త్యుని దృష్టిలో ఉన్నాయి. అందుకే, పొందు ఆరయు వృత్తి (తన స్నేహమంతా తెలిసేలా) ఆమెను పిలిచాడు. ఆదరణంబున తోడుకొంచు కొండ నెక్కించాడు. ఇక్కడ ‘తోడుకొని’ అని క్త్వార్థకం (భూతకాలాన్ని సూచించేది) కాకుండా ‘తోడుకొంచు’ అని శత్రర్థకాన్ని (అంటే వర్తమాన కాలాన్ని సూచించే క్రియ) ప్రయోగించడం ద్వారా, అగస్త్యుడు తన వెంట చివరికంటూ లోపాముద్రను తీసుకువెళ్ళడాన్ని ధూర్జటి చక్కగా ధ్వనింపజేశాడు. అగస్త్యునికి ‘వింధ్యారి’ అని ఉపయోగించాడు. మామూలుగా చూస్తే యిది కేవలం ప్రాసకోసం వేసినట్టుగా అనిపించవచ్చు. కాని ఒక్క క్షణం ఆలోచిస్తే అందులోని గొప్పతనం స్ఫురిస్తుంది. అప్పుడది మామూలు దృశ్యం కాదు. మహాపర్వతమైన వింధ్య గర్వాన్ని అణచిన గొప్ప మహిమాన్వితుడు, ఒక సామాన్య సంసారిలా తన భార్యతో ఒక చిన్న కొండ నెక్కే దృశ్యం. ఎంత ఆశ్చర్యం!

అదీ అగస్త్యుని వ్యక్తిత్వం!