విశ్వాంతరాళం: పుస్తక పరిచయం

తెలుగువారికి శాస్త్రజిజ్ఞాస మెండు. ఆంగ్లవిద్యాభ్యాసంవల్ల ఆ ఆసక్తి మరీ పెరిగింది. తాము చదివింది, ఆలోచించింది ఇంగ్లీషులోనే అయినా, తెలుగులో రాయాలనీ, ఇంగ్లీషురాని తెలుగువారికి శాస్త్రవిజ్ఞానం కలిగించాలనీ చాలామంది ఉబలాట పడుతున్నారు. అయినాకూడా, ఈమధ్య తెలుగులో శాస్త్రగ్రంథాలు రావటం చాలావరకు తగ్గింది. అందుకు ముఖ్య కారణం చదువుకున్న ప్రతివారు ఇంగ్లీషులో చదవగలగటంవల్ల తెలుగు పుస్తకాలమీద అభిమానం తగ్గిపోవటం. ఒకవైపు శాస్త్రవిజ్ఞానం పెరుగుతున్నా, ఛాందసత్వం కూడా పెరుగుతూనే ఉంది. అందుకే తెలుగులో శాస్త్రవిజ్ఞాన పుస్తకాల అవసరం ఇంకా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి చేసిన ప్రయత్నమే రోహిణీప్రసాద్ గారు అంతరిక్షాన్ని గురించి రాసిన “విశ్వాంతరాళం” పుస్తకం.


విశ్వాంతరాళం
కొడవటిగంటి రోహిణీప్రసాద్

విశ్వాంతరాళం గురించి రాయటం సమంజసంగా ఉంది. ఎందుకంటే మానవుడికి మొదటగా జిజ్ఞాస కలిగించింది అంతరిక్షమే. ఇప్పటికి గూడా మనకు అంతరిక్షాన్ని గురించి తెలిసినంతగా కాళ్ళక్రింద ఉన్న భూమి గురించి తెలియదు. రోదసిలో వేలమైళ్ళు ఎగిరిన మానవుడు భూమి లోపలికి పది మైళ్ళుగూడా వెళ్ళలేదు. వెన్నెలరాత్రిలో కనపడేది ఒక్క చంద్రుడే. కాని చీకటిరాత్రిలో వేలనక్షత్రాలు కనపడతాయి. అవి ఏమిటో తెలుసుకోవాలనీ, వాటిదగ్గరికి వెళ్ళాలనీ మానవుడి తపన. అది సాధ్యమవనినాడు ఎన్నెన్నో ఊహలు కల్పించుకున్నాడు. తన పరిశీలనాశక్తితో నక్షత్రాల స్వరూపం తెలుసుకున్నాడు. తన ఊహల్ని దిద్దుకున్నాడు. పరిశీలనాశక్తిని పెంపొందించుకోవటం కోసం ఎన్నెన్నో సాధనాలు తయారు చేసుకున్నాడు. దూరదర్శిని నిర్మించుకున్న తరువాత గెలీలియొ లాంటి శాస్త్రజ్ఞుల పరిశీలనాశక్తి ఎంతగానో పెరిగింది. దూరదర్శిని నిర్మాణంలోగూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ వివరాలన్నీ రోహిణీప్రసాద్ తనపుస్తకంలో వివరించారు.

ఆధునిక పరికరాల ద్వారా కనుగొన్న ఖగోళరహస్యాలను రోహిణీప్రసాద్ గారు తనపుస్తకంలో విపులంగా చర్చించారు. మన సౌరవ్యవస్థలోని గ్రహాలనే కాకుండా, రోదసి లోని తారాపథాల గురించీ, అందులోని ఇతర సౌరవ్యవస్థల గురించి వివరించారు. నక్షత్రాలేమిటి? అవి ఎలా ఏర్పడ్డాయి? వాటిలో మన సూర్యుడి స్థానమేమిటి? ఈ నక్షత్రాల భవిష్యత్తేమిటి? ఈ సందేహాలకు సమాధానాలు వివరించారు. మనకు జీవనాధారమైన సూర్యుడు గూడా ఒకనాటికి కాంతిహీనుడవుతాడు. అప్పుడు ఈ భూమి మీద జీవరాశి ఉండదు. అది ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత జరుగుతుందని శాస్త్రజ్ఙుల అంచనా. ఆ పరిణామాన్ని ఏ దేవుడూ ఆపలేడు. అలాగని భయపెట్టటం శాస్త్రవిజ్ఞానలక్ష్యం కాదు. జరగబోయేది తెలుసుకుంటే విజ్ఞులవుతారు. ఈ విశాల విశ్వంలో తన స్థానమేమిటో తెలుసుకోగలుగుతారు. అన్ని జీవరాశులకన్నా తామే గొప్ప అనీ, ఈ సృష్టి అంతా తమకోసమే జరిగిందనీ విఱ్ఱవీగటం తప్పని తెలుసుకుంటారు.

ఖగోళాలలో గ్రహాల, ఉపగ్రహాల అవతరణ రోహిణీప్రసాద్ ఈ పుస్తకంలో వివరించారు. సూర్యుడిచుట్టూ తిరిగేవి ఎనిమిది గ్రహాలేనని సూర్యుడితో కలిపి మొత్తం తొమ్మిది గ్రహాలని నవగ్రహాలకు పూజ చేయటం మొదలయింది. అదే జ్యోతిశ్శాస్త్రానికి పునాది అయింది. కాని గ్రహశకలాలను గూడా లెక్కలోకి తీసుకుంటే, సూర్యుడి చుట్టూ తిరిగేవి తొమ్మిది గ్రహాలు. మరి జామాత దశమగ్రహమని ఎందుకన్నారోగాని, ఆ దశమగ్రహాన్ని కూడా కనుగొన్నారు. అదే ప్లుటో. అది గ్రహమా, కాదా అని సందేహించవలసిన లక్షణాలను వివరించారు.

కోట్ల మైళ్ళ దూరాన ఉన్న ఖగోళాల ఉనికిని కనుగొనటమేగాక, వాటి దూరాలను, వయసుల్నీ గూడా అంచనా వేయడం కోసం శాస్త్రజ్ఙులు నిర్మించుకున్న వివిధ సాధనాలను రోహిణీప్రసాద్ చక్కగా వివరించారు. శాస్త్రజ్ఞానం లేనివారి కోసం రాశారు గనుక, వారికి అర్థమయ్యే విధంగా, సుబోధకంగా రాశారు. కాంతికిరణాల విశ్లేషణాన్ని చాకచక్యంగా వివరించారు. దానితోపాటు ధ్వనితరంగాలను, విద్యుదయస్కాంతతరంగాలను, వాటి స్వభావ ప్రభావాలను వివరించారు. విశ్వాంతరాళపరిశోధనకు అవి ఏవిధంగా ఉపయోగపడినయ్యో తెలియజేశారు.


విశ్వాంతరాళం
రూ.70 స్వేచ్ఛాసాహితి ప్రచురణ

రోదసీయానం గురించి ప్రసాద్ ప్రత్యేకంగా శ్రధ్ధవహించారు. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించీ, అందులోని సాధకబాధకాల గురించీ వివరించారు.

 విశ్వయజ్ఞము జరుగుచున్నది
హోతలందరు కూడినారట
యజ్ఙపశువులు మనమయా
యూరి గగారిన్ 

… అన్నాడు ఆరుద్ర.
మనిషి ఆకాశంలో ఎగిరే పిట్టల్ని చూసి తానూ ఎగరాలని ఉబలాటపడ్డాడు. నిజంగా ఎగరగల అవకాశం కలిగినప్పుడు, అది ఎంత సాహసమో, ఎంత సందేహించవలసి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ, ఆ సాహసం లేకపోతే విజ్ఞానం లేదు, అభివృధ్ధి లేదు. అసలు ఆకాశంలోకి ఎగిరి భూమిచుట్టూ తిరగగలమో, లేదో తెలుసుకోవటానికి రష్యా ఒక చిన్న ఉపగ్రహాన్ని 1957 అక్టోబరు,4 న ప్రయోగించింది. తరువాత ఒక కుక్కని (లైకా) పెట్టి పంపించారు. కాని దానిని సజీవంగా తిరిగి తీసుకురాలేకపోయారు. 1960లో రెండుసార్లు కుక్కలతో ప్రయోగంచేశారు. ఒకసారి విఫలమయ్యారు. చివరికి రోదసీయాత్రికుడితో 1961 ఏప్రిల్ 12న ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అతడే యూరి గగారిన్. అప్పట్లో అది ప్రమాదకరమైన ప్రయోగంగా అనిపించింది. మొట్టమొదటగా రష్యా ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపినప్పుడు, అమెరికాకి చెంపదెబ్బ కొట్టినట్లయింది. ఎందుకంటే బైబిలుభక్తుల ప్రభావంవల్ల అమెరికాలో శాస్త్రవిజ్ఞానబోధన కుంటుపడింది. అది హిందువుల ఛాందసత్వాన్ని మించిన మూర్ఖత్వం. సాంకేతిక పరిజ్ఞానంలో రష్యాది పైచేయి అనగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. తప్పు దిద్దుకున్నారు. కొన్ని ప్రమాదాలు జరిగినా, రోదసీయానం అవకాశానికి మిలియన్ల డాలర్లు ఇవ్వటానికి సిధ్ధపడుతున్నారు.

రోహిణీప్రసాద్ రచనలో ఇంకొక విశేషం – కొత్త పారిభాషికపదాల నిర్మాణం. నిజానికి శాస్త్రవిజ్ఞానాన్ని తెలుగులో అందించటానికి భావాన్ని సరిగా వ్యక్తీకరించగల పదాల కొరత పెద్ద ప్రతిబంధకం. అది రోహిణీప్రసాద్ గారికి ఏమీ కష్టమయినట్లు తోచదు. ఈ పుస్తకాన్ని అందించటంలో ప్రచురణకర్తల ప్రయత్నాన్ని అభినందించక తప్పదు. తక్కువ వెలలో అందించటమేగాక అందంగా, చదివేటప్పుదు పట్టుకోవటానికి వీలుగా తయారు చేశారు. “పుస్తకం హస్తభూషణం” అనదగినంత ఆకర్షణీయంగా ఉంది.

(విశ్వాంతరాళం – కొడవటిగంటి రోహిణీప్రసాద్, వెల రూ.70. స్వేచ్ఛాసాహితీ ప్రచురణ, జి 1, మైత్రి రెసిడెన్సీ, స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్, హైదరాబాద్ 500029. ప్రతులకు: ఫోన్ 040 2726 3161. dvrkrao166 AT gmail dot com).