నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య

అసహనం నీ అరచేతిలో రిమోట్‌లా ఒదిగి
ఆలోచనల ఛానెళ్ళను అస్తవ్యస్తంగా మారుస్తుంది
పరధ్యానం నా పుస్తకంలో తల దాచుకుని
అన్యమనస్కంగా పేజీలు తిరగేస్తుంది

లివింగ్ రూం సోఫాలో టివి ముందు నువ్వు
లైబ్రరీలో మెడికల్ జర్నల్‌తో నేను
భరించలేని ఈ నిశ్శబ్దపు అగాధాన్ని
బింకంగా దాటే ఉపాయం కోసం
ఎవరికి వారే వెతుక్కుంటూ ఉంటాము

ఏ చిన్ని కలహమైతే మన మధ్య కోటగోడలా నిల్చి
మన మాటలు మనకే వినబడకుండా చేసిందో
ఆ కోటగోడని నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
నెమ్మది నెమ్మదిగా కరిగించి వేస్తుంది

ఎప్పటి లాగా ఈ రోజు చిరునవ్వుల విరజాజులు
నులివెచ్చని పరామర్శలు మనల్ని స్పర్శించక పోయినా
సంక్షిప్తమైన మన చూపుల్ని కలుపుతూ
ఏటవాలుగా విరియటానికి ఓ ఇంద్రధనుస్సు
ఆరాటపడుతూనే ఉంటుంది

నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ
నీవు చెప్పలేనివన్నీ నాకు
గుసగుసగా వినిపించేసి
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
మూగబోయిన వాయిద్యమై మెరుస్తుంది

అంచెలంచెలుగా సాగిన జుగల్బందీలో
రసాత్మకమైన రాగాన్ని ఆలపించి
విశ్రాంతి తీసుకుంటున్న సహ గాయకుల్లా
కరిగిన గోడల మధ్య చెదిరిన మేఘాల క్రింద
మనిద్దరం మౌనంగా మిగిలిపోతాము

ఎందుకో ఒక్కోసారి
నీతో మాట్లాడకపోయినా
మాట్లాడుతున్నట్లే ఉంటుంది

(యండమూరికి కృతజ్ఞతలతో)

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...