గుర్తుందా గోదారీ?
కార్తీకమాసపుటుదయాల్లో
వణుకుతూ వచ్చి
చేరేవాళ్ళం నీ వొళ్ళో
వెచ్చని నీళ్ళతో చుట్టి
మచ్చిక చేసుకునేదానివి.
అమ్మలొదిలిన దీపాలను చూస్తూ,
నీ గలగలకు మా గోల కలిపితే
చల్లగా జారుకునేది చలి.
* * * * *
గుర్తుందా గోదారీ?
ఎండాకాలం సెలవుల్లో
ఎదురుచూసేదానివి మాకోసం.
వేపపుల్ల నోట్లో వేసుకొని
వేగిరమే వచ్చేవాళ్ళం.
బండలపైనుండి దూకుతూ,
ఈదుతూ, మునకలేస్తూ,
బారెడు పొద్దెక్కినా
ఇళ్ళకు వెళ్ళేది కాదు.
కుళ్ళుబోతు ఇసుక,
సూర్యుడితో కుమ్మక్కై
చురచురలాడి పంపేది.
* * * * *
గుర్తుందా గోదారీ?
సాయంత్రమవగానే
చేరేవాళ్ళం నీ చెంత.
ఒడ్డుమీద బంతాట
ఓ పట్టాన ముగిసేది కాదు.
ఓపికగా చూసి, చూసి,
ఒక్కమాటున బంతిని
చేజిక్కించుకునేదానివి.
ఇక నీ ఆట మొదలు.
చీకటి పడే వేళకు
అందరి ఆటలు కట్టిపెట్టి
ఇళ్ళకు పంపించేదానివి.
* * * * *
గుర్తుందా గోదారీ?
ఉగ్రనరసింహుడి పాదాలు కడుగ
ఊళ్ళోకి వస్తావన్నారందరూ
పశువులు, పాకలు, కోళ్ళు,
కొట్టుకువచ్చాయి వెల్లువలో.
బంగళాలెక్కి చూసి
భయమపడ్డాం పిల్లమంతా.
మరొక్క అడుగుముందుకు వేస్తే
మరెప్పుడు వెళ్ళొద్దు నీవైపని వొట్టేసుకున్నాం.
ఎలా విన్నావో ఏమో మరి.
మెల్లగా తగ్గిపోయావ్ వెనక్కి.
* * * * *
గుర్తుందా గోదారీ?
చేపలు పట్టడం సరదాగుంటుందని
చెప్పకుండా వచ్చేశాం బళ్ళోంచి
ఎప్పుడూ ఆడే బండ మీదినుండే
ఎలాగో లాక్కున్నావు సుడుల్లోకి
మూడో మునక్కి బయటకి లాగుతూ
చచ్చేవాళ్ళమన్నారు అందరూ.
మందలించి పంపావని
తెలీదు పాపం వాళ్ళకి.
* * * * *
గుర్తుందా గోదారీ?
కన్నీళ్ళతో వచ్చానా రోజు
నీకూ నాకూ చెల్లిక
పట్నం వెళ్తున్నానని.
పట్టించుకోలేదు. ఎప్పటిలా,
పరుగులిడుతూ నవ్వుకున్నావు.
నీకు ముందే తెలుసు కదూ
ఎక్కడికి వెళ్ళినా, నా
మనసిక్కడే ఉంటుందని