ఇవాళ నువ్వేది మాట్లాడినా వింటాను
సిగ్గును రెండు ముక్కలు చేసి
మనసును రెండు చెక్కలుగా కోసి
ఎందుకంటావా?
అవ్యక్తాల్నిలా ప్రేమించినందుకే
అందుకే వింటాను చెప్పు
పరిమళపుమాటల్ని పలవరించి
ఆ పై కలల్లో కోటలు కట్టి
కవితలల్లి నా మెడలో వేసినా సరే
ఏవన్నా ఏవన్నా చెప్పు
తరతరాలుగా వింటూనే ఉన్నా
ఇవాళా వింటాను చెప్పు
నీ సంతోషం కోసమే కేవలం అనీ
నిష్టూరంగా
నిందా ప్రహసనాలు చెయ్యనులే చెప్పు
అవి పెదవులు కావు పారిజాతాలనో
ఆ హృదయం తెల్లపావురమన్నా
ఆ కళ్ళు రెండూ రెండు మహాప్రపంచాలన్నా
మౌనవేదన రహస్యప్రణయకావ్యంగా
మిగిలిపోతుందని
విషాదం శ్రావ్యంగా పలికించినా
ఏదో ఒకటి అట్లానే హమ్ చేస్తూండు ప్లీజ్
నువ్వు నా అనార్కలీవన్నా
ఆమ్రపాలీవన్నా
ఆంతర్యానివన్నా
రసరూప మృత్యుంజయవన్నా
ఏవన్నా వింటాను
‘ఏదో ఒకటి వింటాను’
అద్వైతాన్ని
ఆత్మకద్దుతానన్నా అర్థంచేసుకుంటాను
పోగొట్టుకోవడాలూ, పొలమారటాలూ
భౌతికాంతరంగిక ప్రపంచాలు
ఇవన్నీ ఏం ప్రస్తావించనులే
ఆకాశమంత ప్రశ్ననీ
అనంత శూన్యాన్నీ
విషాద జ్వాలనీ
అవతలపెట్టి వింటాను చెప్పు
చేతనీ చూపునీ భావననీ
పోస్టుమార్టం చేయదల్చలేదు
అట్లా చేశానా?