స్నేహితుడా!
అడగటానికైతే అడిగావు
రెండే రెండు చిన్న ప్రశ్నలు
హౌ ఆర్ యూ? హౌ ఈజ్ లైఫ్?
చెప్పటానికేమీ లేదు
చెప్పుకోటానికి చాలా ఉంది
రెండూ నిరంతరం వెంటాడే ప్రశ్నలు
దిగులు దిగుడు బావిలో
దిగబడిపోయాను
అంతా ముగిసిపోయింది అనుకోనా
ఇక నేను
నేను కాకుండా పోయాననుకోనా
అనుకోనా
ఇది నిజమనుకోనా కలయనుకోనా
అవి కొంటాం ఇవి కొంటాం
అన్నీ కొంటాం అని కేకేస్తూ ఉంటారు
తమాషాగా
పూడిక తీస్తాం పూడిక తీస్తాం అంటూ
ఎవరూ రావటం లేదు
బావిలో పూడిక తీయించాలి
అదీ మామూలు బావి కాదు
దిగులు దిగుడుబావి
దిగుడుబావి మెట్లు దిగాలి ముందు
అంతా పాకుడు మెట్లు
అడుగున ఎక్కడో నీళ్ళమీద
తేలుతున్న నాచుతెట్టు
ప్రతిబింబం కనిపించదు సరికదా
ఒక్క స్మృతిరేఖ కూడా కనిపించదు
నిరలంకారమైన ఉద్వేగకెరటాలు
అసలే జ్ఞాపకం లేవు
ఇక ఏవో కళాత్మక ఉద్వేగాలు
ఒచ్చీపోతుంటాయి అస్పష్టంగా
అందుకే పూడిక తీయాలి
ఎవరి బావిలో పూడిక
వారే తీసుకోవాలిట
ఎవరో అంటున్నారు సంకేతాత్మకంగా
“నిన్ను నువ్వు తెలుసుకో” అన్నట్టుంది కదూ
నమ్మకం ఉంది
వర్షం వొస్తుంది
బావిలో నీళ్ళు పొంగి పొర్లి
ఏ పూడికతీతా అవసరం లేకుండానే
కల్మషాలన్నీ కొట్టుకుపోతాయి
అప్పుడు ఆకాశ ప్రతిబింబమే కనిపిస్తుంది
అవును నమ్మకం ఉంది