దూతఘటోత్కచం – సమూలానువాదం

పూర్వరంగం

కథాసంగ్రహం

జగన్నాటకసూత్రధారుడైన నారాయణుణ్ణి ప్రార్థించాక, మనవి మాటలు మొదలుపెట్టి, వెంటనే పక్కకు తప్పుకుంటాడు. అభిమన్యువధ వార్తను ధృతరాష్ట్రుడికి మనవి చేసేందుకని భటుడు రంగప్రవేశం చేస్తాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, దుస్సలా అభిమన్యుడి మరణానికి చింతిస్తూ, రానున్న అర్జునప్రతీకారాన్ని ఊహిస్తూ ఉండగా దుర్యోధనాదులు విజయగర్వంతో శిబిరానికి తిరిగివస్తారు.

దుర్యోధనుడి దురహంకారం ధృతరాష్ట్రుడి దూరదృష్టితో తలపడుతున్న సమయంలోనే, అటువైపునుంచి అర్జునుడి శపథకోలాహలం చెలరేగుతుంది. ఇక వినాశనం తప్పదని ఆ తండ్రి క్రుంగిపోతుండగా, అర్జునుణ్ణి చితికెక్కించే అవకాశం దొరికిందని ఆ కొడుకు పొంగిపోతాడు.

ఇంతలో కృష్ణుడి సందేశాలను మోసుకొని ఘటోత్కచుడు దూతగా వస్తాడు. సర్వనాశనమవకముందే సైన్యాన్ని ఉపసంహరించుకొమ్మని ధృతరాష్ట్రుడికి ఒక మాట; పుత్రశోకతప్తుడైన పార్థుడికి భూభారాన్ని తగ్గించడం పెద్ద పని కాదని దుర్యోధనుడికొక హెచ్చరిక ఇచ్చి, కౌరవప్రముఖుల నిర్లక్ష్యభావాన్ని ఘటోత్కచుడు వీరోద్రేకంతో ఎదుర్కొంటాడు. మళ్ళీ దూతపాత్రలోకి ఒదిగిపోయి, దుర్యోధనుడి ప్రతివచనాన్ని వినేసి, కృష్ణుడి మూడో సందేశాన్ని భరతవాక్యంగా పలికి నిష్క్రమిస్తాడు.

కొన్ని విశేషాలు

  1. దూతఘటోత్కచం దశవిధరూపకాలలో అంకము అనే రకానికి చెందినది. దీనినే ఉత్సృష్టికాంకం అని పిలుస్తారు. దశరూపకసారములో పేర్కొన్న అంకలక్షణాలలో మనకు దూతఘటోత్కచంలో కనబడేవి ఇవి — ఒకే అంకం; ప్రధానరసం కరుణ; స్త్రీశోకం; మాటలలో యుద్ధవర్ణన.
  2. ఇందులో ధృతరాష్ట్రుడు కుత్సితుడిలా, ఈర్ష్యాళువుగా కాక బంధుప్రీతిని, వాస్తవికదృష్టినీ, నిస్సహాయతనూ తనలో నింపుకున్నవాడిలా కనబడతాడు. ఘటోత్కచుడు రంగప్రవేశం చేసి చెలరేగక ముందు సాగిన కథకు కేంద్రబిందువుగా నిలిచి అందులోని ఉద్విగ్నతను నిలిపి ఉంచుతాడు./li>
  3. అర్జునుడి బలపరాక్రమం గురించి తనకు తెలియదన్న దుర్యోధనుడి బింకానికి దూతవాక్యంలో కృష్ణుడి సమాధానమూ, ఈ నాటకంలో ధృతరాష్ట్రుడి సమాధానమూ సారంలో ఒక్కటే అయినప్పటికీ, ధృతరాష్ట్రుడి మాట మరింత పదునుగా ఉన్నట్లనిపించింది నాకు.
  4. ఈ నాటకపు సంభాషణల్లో ప్రత్యేకంగా పేర్కొనదగ్గది, దుర్యోధనుడితో ఘటోత్కచుడు అన్న “రాక్షసేభ్యోఽపి భవన్త ఏవ క్రూరతరాః…” (రాక్షసులకన్నా మీరే క్రూరతరమైన వారు) అన్నమాట. ఘటోత్కచుడి రోషము, వ్యంగ్యమూ భలేగా పలుకుతాయి ఆ మాటలో.
  5. నాటకం చివరలో వచ్చే భరతవాక్యం కొంత విచిత్రంగా ఉండి, అది భరతవాక్యమేనా లేక మనకు లభించిన నాటకం అసంపూర్తిగా ఉన్నదా అనే అనుమానాన్ని కలిగిస్తుంది. ఈ భరతవాక్యశ్లోకం ఏ చాక్యార్ కళాకారుడు కల్పించినదై ఉంటుందా అని సందేహిస్తారు, ఏ.డి. పుసాల్కర్, తన భాసాధ్యయనగ్రంథంలో.

పాత్రలు

  1. ధృతరాష్ట్రుడు
  2. దుర్యోధనుడు
  3. దుశ్శాసనుడు
  4. శకుని
  5. ఘటోత్కచుడు
  6. భటుడు (జయత్రాతుడనే పేరుగల వార్తాహరుడు)
  7. గాంధారి
  8. దుశ్శల
  9. ద్వారపాలిక




(నాన్ద్యన్తే తతః ప్రవిశతి సూత్రధారః ।)

సూత్రధారః:
నారాయణస్త్రిభువనైకపరాయణో వః
పాయాదుపాయశతయుక్తికరః సురాణామ్ ।
లోకత్రయావిరతనాటకతన్త్రవస్తు-
ప్రస్తావనప్రతిసమాపనసూత్రధారః ।। 1 ।।


(నాంది ముగిసాక సూత్రధారుడు ప్రవేశిస్తాడు.)
సూత్రధారుడు:
ముల్లోకాలకు ఆశ్రయమైనవాడు, దేవతలను గెలిపించేందుకు వందలాది ఉపాయాలను, వ్యూహాలను కల్పించేవాడు, నిరంతరంగా సాగే జగత్త్రయమనే నాటకపు సంవిధానాన్ని, వస్తువును, ప్రస్తావనను, పరిసమాప్తినీ నియంత్రించే సూత్రధారుడూ అయిన నారాయణుడు మిమ్ములను కాపాడుగాక!

(పరిక్రమ్య) ఏవమార్యమిశ్రాన్విజ్ఞాపయామి । అయే కిం ను ఖలు మయి విజ్ఞాపనవ్యగ్రే శబ్ద ఇవ శ్రూయతే । అఙ్గ పశ్యామి ।

(నేపథ్యే)
భో భో నివేద్యతాం నివేద్యతాం తావత్ ।


(రంగస్థలంపై తిరిగి) పూజ్యులైన మీకు నా విన్నపం… అరె, ఇదేమిటి? నేను ప్రేక్షకులకు నా విన్నపం వినిపించబోతుండగా, ఏదో శబ్దం వినబడుతున్నది? చూస్తాను.
(తెర వెనుకనుంచి)
విన్నవించవోయీ, పూర్తిగా విన్నవించు.

సూత్రధారః:
భవతు విజ్ఞాతమ్ । ఏష ఖలు సంశప్తకానీకనివాహితే జనార్దనసహాయే ధనఞ్జయే తదనన్తరముపగతభీష్మవధామర్షితైర్ధార్తరాష్ట్రైః పరివార్య నిపాతితః కుమారోఽభిమన్యుః । తథాహి

యాన్త్యర్జునప్రత్యభియానభీతా
యతోఽర్జునస్తాం దిశమీక్షమాణాః ।
నరాధిపాః స్వాని నివేశనాని
సౌభద్రబాణాఙ్కితనష్టసంజ్ఞాః ।। 2 ।।

(నిష్క్రాన్తః ।)
(స్థాపనా ।)


సూత్రధారుడు:
తెలిసింది. సంశప్తకుల సైన్యం కృష్ణుడితో సహా అర్జునుడిని యుద్ధానికై ఆహ్వానించారు. తదనంతరం, భీష్మవధ కారణంగా కోపించి ఉన్న కౌరవులు, బాలుడైన అభిమన్యుడిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. అదిగో –

అర్జునుడు తిరిగి వస్తాడన్న భయంతో అతడు వెళ్ళిన దారివైపు చూస్తూ, అభిమన్యుడి బాణాల గాయపు గురుతులతో, చేష్టలుడిగిన ధార్తరాష్ట్రులు తమ తమ శిబిరాలకు తిరిగివస్తున్నారు.

(నిష్క్రమిస్తాడు)

(స్థాపన పూర్తి అయ్యింది)



(తతః ప్రవిశతి భటః ।)

భటః:
భో భోః! నివేద్యతాం తావత్పుత్రశతశ్లాఘ్యబాన్ధవాయ విజ్ఞానవిస్తారితవినయాచారదీర్ఘచక్షుషే మహారాజాయ ధృతరాష్ట్రాయ । ఏష ఖలు

యోధస్యన్దనవాజివారణవధైర్విక్షోభ్య రాజ్ఞాం బలం
బాలేనార్జునకర్మ యేన సమరే లీలాయతా దర్శితమ్ ।
సౌభద్రః స రణే నరాధిపశతైర్వేగాగతైః సర్వశః
ఖే శక్రస్య పితామహస్య సహసైవోత్సఙ్గమారోపితః ।। 3 ।।


(భటుడు ప్రవేశిస్తాడు.)

భటుడు:
ఓయీ, వందమంది కొడుకులను కన్న ఖ్యాతికి పాత్రుడైనవాడు, విద్యచేత విస్తరించిన వినయము, దీర్ఘదృష్టీ కలిగినవాడైన ధృతరాష్ట్రమహారాజుకు ఈ విషయాన్ని విన్నవించు:

“యోధులను, రథాశ్వాలను, ఏనుగులను వధించి, రాజుల సైన్యబలాన్ని కలవరపరచి, అర్జునపరాక్రమాన్ని ఆటతీరున ప్రదర్శించిన అభిమన్యుడు, వందలాది రాజులు అన్ని వైపులనుంచీ వేగంగా వచ్చిపడడంతో – ఒక్క ఉదుటున – ఆకాశంలో ఉన్న తన తాతగారైన ఇంద్రుడి ఒడిలోనికి చేరుకున్నాడు.”


(తతః ప్రవిశతి ధృతరాష్ట్రో గాన్ధారీ దుఃశలా ప్రతిహారీ చ ।)


(గాంధారి, దుస్సల, ద్వారపాలిక, ధృతరాష్ట్రుడు ప్రవేశిస్తారు)

ధృతరాష్ట్రః:
కథం ను భోః!

కేనైతచ్ఛ్రుతిపథదూషణం కృతం మే
కోఽయం మే ప్రియమితి విప్రియం బ్రవీతి ।
కోఽస్మాకం శిశువధపాతకాఙ్కితానాం
వంశస్య క్షయమవఘోషయత్యభీతః ।। 4 ।।


ధృతరాష్ట్రుడు:
ఇదేమి?

ఎవరు నా కర్ణపథాన్ని కలుషితం చేస్తున్నారు? నాకు ఇష్టమని అనుకొని ఈ అప్రియాన్ని పలుకుతున్నదెవరు? ఎవరది, శిశువధ అనే మహాపాపం చేత కళంకితులమైన మా వంశం నాశనమవనున్నదని నిర్భయంగా ప్రకటిస్తున్నారు?


గాన్ధారీ:
మహారాఅ! అత్థి ఉణ జాణీఅది కేవలం పుత్తసంఖఅకారఓ కుళవిగ్గహో భవిస్సిది త్తి ।

మహారాజ! అస్తి పునః జ్ఞాయతే కేవలం పుత్రసంక్షయకారకః కులవిగ్రహో భవిష్యతీతి ।


గాంధారి:
మహారాజా! కుటుంబకలహం వంశక్షయకారకం కానున్నదని తెలిసినదా?


ధృతరాష్ట్రః:
గాన్ధారి! జ్ఞాయతే ।


ధృతరాష్ట్రుడు:
తెలుసు గాంధారీ!

గాన్ధారీ:
మహారాఅ కదా ణు ఖు ।

మహారాజ కదా ను ఖలు ।


గాంధారి:
ఎప్పుడు మహారాజా?

ధృతరాష్ట్రః:
గాన్ధారి! శృణు

అద్యాభిమన్యునిధనాజ్జనితప్రకోపః
సామర్షకృష్ణధృతరశ్మిగుణప్రతోదః ।
పార్థః కరిష్యతి తదుగ్రధనుఃసహాయః
శాన్తిం గమిష్యతి వినాశమవాప్య లోకః ।। 5 ।।


ధృతరాష్ట్రుడు:
గాంధారీ! విను.

అభిమన్యుడి మరణకారణాన ఆగ్రహించిన అర్జునుడు, కోపంతో పగ్గాలనూ, ముల్లుగఱ్ఱనూ చేతబూనిన కృష్ణుడి తోడుగా, ఉగ్రమైన గాండీవధనువును పక్కన ఉంచుకొని యుద్ధం చేయనున్నాడు. నాశనం తరువాతే లోకం శాంతిని పొందుతుంది.


గాన్ధారీ:
హావచ్ఛ అభిమఞ్ఞో! ఈదిసే వి ణామ పురుసఖఅకారఏ కుళవిగ్గహే వత్తమాణే వాళభావణిమజ్జణం అమ్హాణం భగ్గాకమేణ కరఅంతో కహిం దాణిం పోత్తఅ! గదోసి ।

హా వత్స అభిమన్యో! ఈదృశేఽపి నామ పురుషక్షయకారకే కులవిగ్రహే వర్తమానే బాలభావనిమజ్జనమస్మాకం భాగ్యక్రమేణ కుర్వన్ కుత్రేదానీం పౌత్రక! గతోఽసి ।


గాంధారి:
అయ్యో చిట్టితండ్రీ, అభిమన్యూ! ఉత్తములను నశింపజేసే ఈ ఇంటి పోరులో ఇప్పుడు నీ పసితనాన్ని ముంచేసి, మనుమడా! ఎక్కడికి వెళ్ళావు?


దుఃశలా:
జేణ దాణి ఉత్తరాఏ వేధవ్వం దాఇదం, తేణ అత్తణో జువదిజణస్స వేధవ్వమాదిట్ఠం ।

యేనేదానీం వధ్వై ఉత్తరాయై వైధవ్యం దత్తం తేనాత్మనో యువతిజనాయ వైధవ్యమాదిష్టమ్ ।


దుస్సల:
ఉత్తర వైధవ్యానికి కారణమైనవాడు తన భార్యకూ వైధవ్యాన్ని తెచ్చిపెట్టాడు.


ధృతరాష్ట్రః:
అథ కేనైష వ్యసనార్ణవస్య సేతుబన్ధః కృతః ।


ధృతరాష్ట్రుడు:
ఈ కష్టాల కడలికి వంతెన వేసినది ఎవరు?


భటః:
మహారాజ! మయా ।


భటుడు:
నేను ప్రభూ!


ధృతరాష్ట్రః:
కో భవాన్ ।


ధృతరాష్ట్రుడు:
నీవెవరివి?


భటః:
మహారాజ! నను జయత్రాతోఽస్మి ।


భటుడు:
జయత్రాతను కదా?


ధృతరాష్ట్రః:
జయత్రాత!

కేనాభిమన్యుర్నిహతః కస్య జీవితమప్రియమ్ ।
పఞ్చానాం పాణ్డవాగ్నీనాం ఆత్మా కేనేన్ధనీకృతః ।। 6 ।।


ధృతరాష్ట్రుడు:
జయత్రాతా!

అభిమన్యుడిని చంపినదెవరు? బ్రతుకు పట్ల అనిష్టం కలిగిందెవరికి? పంచపాండవులనే అగ్నికి తనను తాను ఇంధనంగా చేసుకున్నది ఎవరు?


భటః:
మహారాజ! బహుభిః కిల పార్థివైః సమాగతైర్నిహతః కుమారోఽభిమన్యుః । స్యాత్తు జయద్రథో నిమిత్తభూతః ।


భటుడు:
మహారాజా! మూకుమ్మడిగా పైబడిన పలువురు రాజులచేత కదా అభిమన్యుకుమారుడు హతుడయ్యాడు. జయద్రథుడు మాత్రము నిమిత్తకారణం అయి ఉండవచ్చు.


ధృతరాష్ట్రః:
హన్త జయద్రథో నిమిత్తభూతః ।


ధృతరాష్ట్రుడు:
ఏమీ, జయద్రథుడా నిమిత్తకారణం?


భటః:
మహారాజ అథ కిమ్ ।


భటుడు:
అవును, మహారాజా!


ధృతరాష్ట్రః:
హన్త జయద్రథో నిహతః ।


ధృతరాష్ట్రుడు:
అయ్యో, జయద్రథుడు చచ్చాడన్నమాటే!

(తచ్ఛ్రుత్వా దుఃశలా రోదితి ।)
(ఆ మాట విని దుస్సల ఏడుస్తుంది.)

ధృతరాష్ట్రః:
కైషా రోదితి ।


ధృతరాష్ట్రుడు:
ఏడుస్తున్న స్త్రీ ఎవరు?


ప్రతీహారీ:
మహారాఅ! భట్టిదారిఆ దుశ్శళా ।

(మహారాజ! భర్తృదారికా దుఃశలా ।)


ద్వారపాలిక:
రాజకుమారి దుస్సల, మహారాజా!


ధృతరాష్ట్రః:
వత్సే అలమలం రుదితేన । పశ్య,

భర్తుస్తే నూనమత్యన్తమవైధవ్యం న రోచతే ।
యేన గాణ్డీవిబాణానామాత్మా లక్షీకృతః స్వయమ్ ।। 7 ।।


ధృతరాష్ట్రుడు:
ఏడవవద్దు తల్లీ! చూడు,

నీవు సుమంగళిగా ఉండడం నీ భర్తకు ఏమాత్రం ఇష్టం లేనట్లున్నది. గాండీవి బాణాలకు తనను తాను గురిగా మార్చుకున్నాడతడు.


దుఃశలా:
తేణ హి అణుజాణాదు మం తాదో, అహం వి గమిస్సం వహూఏ ఉత్తరాఏ సఆసం ।

తేన హ్యనుజానాతు మాం తాతః అహమపి గమిష్యామి వధ్వా ఉత్తరాయాః సకాశమ్ ।


దుస్సల:
అందుకని తండ్రీ, నాకు అనుమతినివ్వండి. కోడలు ఉత్తర దగ్గరకు వెళతాను.


ధృతరాష్ట్రః:
వత్సే కిమభిధాస్యసి ।


ధృతరాష్ట్రుడు:
ఏమంటున్నావు, తల్లీ?


దుఃశలా:
తాద! ఏవం చ భణిస్సం-అజ్జకాలిఅం చ దే వేసగ్గహణం అహం వి అవధారఇస్సామి త్తి ।

తాత! ఏవం చ భణిష్యామి-అద్యకాలికం చ తే వేషగ్రహణమహమప్యుపధారయిష్యామీతి ।


దుస్సల:
తండ్రీ! నేటి సందర్భానికి అనుగుణమైన వేషాన్నే నేనూ ధరించనున్నానని అంటున్నాను.


గాన్ధారీ:
పుత్తిఏ! మా ఖు మా ఖు అమంగళం భణాహి । జీవది ఖు దే భత్తా ।

పుత్రికే ! మా ఖలు, మా ఖల్వమఙ్గలం భణ । జీవతి ఖలు తే భర్తా ।


గాంధారి:
బిడ్డా! వద్దు, అమంగళం పలుకవద్దు. నీ భర్త జీవించి ఉన్నాడు కదా.


దుఃశలా:
అమ్బ! కుదో మే ఏత్తిఆణి భాఅధేఆణి । జో జణద్దణసహాఅస్స ధణంజఅస్స విప్పిఅం కరిఅ కోహి ణామ జీవిస్సిది ।

అమ్బ! కుతో మే ఏతావన్తి భాగధేయాని । యో జనార్దనసహాయస్య ధనఞ్జయస్య విప్రియం కృత్వా కో హి నామ జీవిష్యతి ।


దుస్సల:
అమ్మా, నాకంత అదృష్టమా! జనార్దనుడి సహచరుడైన ధనంజయుడికి అప్రియం చేసి ఎవడు ప్రాణాలతో ఉండగలరు?


ధృతరాష్ట్రః:
సత్యమాహ తపస్వినీ దుశ్శలా । కుతః,

కృష్ణస్యాష్టభుజోపధానరచితే యోఽఙ్కే వివృద్ధశ్చిరం
యో మత్తస్య హలాయుధస్య భవతి ప్రీత్యా ద్వితీయో మదః ।
పార్థానాం సురతుల్యవిక్రమవతాం స్నేహస్య యో భాజనం
తం హత్వా క ఇహోపలప్స్యతి చిరం స్వైర్దుష్కృతైర్జీవితమ్ ।। 8 ।।

జయత్రాత! అథ తదవస్థం పుత్రం దృష్ట్వా కిం ప్రతిపన్నం తేన గాణ్డీవధన్వనా ।


ధృతరాష్ట్రుడు:
దీనురాలైన దుస్సల నిజమే చెప్పింది. ఎందుకంటే,

కృష్ణుడి ఎనిమిది భుజాలు తలగడలుగా అమర్చుకొని అతడి ఒడిలో చిరకాలం వర్ధిల్లిన వాడు, మత్తెక్కి ఉండే బలరాముడికి మరింత మత్తును కలిగించిన వాడు, వీరత్వంలో దేవతాసమానులైన పాండవుల వాత్సల్యానికి పాత్రుడైన వాడూ అయిన అభిమన్యుడిని చంపాక, తన పాపకార్యాలతో ఎవడు ఈలోకంలో చిరకాలం జీవించి ఉండగలడు?

జయత్రాతా! ఆ దశలో ఉన్న పుత్రుణ్ణి చూసి అర్జునుడు ఎలా ఊరుకున్నాడు?


భటః:
మహారాజ! కిం వార్జునసమీపే వృత్తమేతత్ ।


భటుడు:
మహారాజా! అర్జునుడు దగ్గర ఉండగా జరగలేదు కదా ఇదంతా?


ధృతరాష్ట్రః:
కథమర్జునోఽపి నాత్రాసీత్ ।


ధృతరాష్ట్రుడు:
అర్జునుడక్కడ లేడా?


భటః:
మహారాజ! అథ కిమ్ ।


భటుడు:
లేడు, మహారాజా!


ధృతరాష్ట్రః:
కథమిదానీం వృత్తమేతత్ ।


ధృతరాష్ట్రుడు:
అలా ఎలా జరిగింది?


భటః:
శ్రూయతాం — సంశప్తకానీకనివాహితే జనార్దనసహాయే ధనఞ్జయే స బాల భావాదదృష్టదోషః సఙ్గ్రామమవతీర్ణః కుమారోఽభిమన్యుః ।


భటుడు:
వినండి, సంశప్తకుల సైన్యం కృష్ణసమేతుడైన అర్జునుడిని యుద్ధానికి కవ్వించింది. ఆ సమయాన, బాలుడైన అభిమన్యుకుమారుడు, పసితనం కొద్దీ, రానున్న ఆపదను గమనించకుండా యుద్ధానికి దిగాడు.


ధృతరాష్ట్రః:
హన్త యుక్తరూపోఽస్య వధః । కోహి సంనిహితశార్దూలాం గుహాం ధర్షయితుం శక్తః । అథ శేషాః పాణ్డవాః కిమనుతిష్ఠన్తి ।


ధృతరాష్ట్రుడు:
అరరె! అలాంటప్పుడు అతడి వధ జరిగే తీరుతుంది కదా. పులి గుహలోకి చొరబడగలరా ఎవరైనా? మరి, మిగతా పాండవులు ఏం చేస్తున్నారు?


భటః:
మహారాజ! శ్రూయతామ్ ।

చితాం న తావత్స్వయమస్య దేహమారోపయన్త్యర్జునదర్శనార్థమ్ ।
తేషాం చ నామాన్యుపధారయన్తి యైస్తస్య గాత్రే ప్రహృతం నరేన్ద్రైః ।। 9 ।।


భటుడు:
చెబుతున్నాను, మహారాజా!

మొదటగా – అర్జునుడు వచ్చి చూసేందుకని అభిమన్యుడి శవాన్ని చితినెక్కించకుండా ఉంచారు. అతడి శరీరంపై వేట్లు వేసిన రాజుల పేర్లను వల్లెవేస్తూ ఉన్నారు.


ధృతరాష్ట్రః:
గాన్ధారి! తదాగమ్యతామ్ । గఙ్గాకూలమేవ యాస్యావః ।


ధృతరాష్ట్రుడు:
బయల్దేరు గాంధారీ! గంగాతీరానికే వెళదాము.


గాన్ధారీ:
మహారాఅ! ణం తహిం గాహామో ।

మహారాజ! నను తత్ర గాహావహే ।


గాంధారి:
స్నానార్థమా, మహారాజా?


ధృతరాష్ట్రః:
గాన్ధారి! శృణు ।

అద్యైవ దాస్యామి జలం హతేభ్యః
స్వేనాపరాధేన తవాత్మజేభ్యః ।
న త్వస్మి శక్తః సలిలప్రదానైః
కర్తుం నృపాణాం శిబిరోపరోధమ్ ।। 10 ।।


ధృతరాష్ట్రుడు:
గాంధారీ, విను.

నా తప్పిదంవల్ల మరణించిన నీ కుమారులకు జలతర్పణం చేస్తాను. కానీ, ఆ జలప్రదానాలతో ఇక్కడ శిబిరాలలో విడిసిన రాజులను అడ్డుకోలేను.


(తతః ప్రవిశతి దుర్యోధనో దుశ్శాసనః శకునిశ్చ ।)


(దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ప్రవేశిస్తారు.)

దుర్యోధనః:
వత్స దుశ్శాసన!

యాతోఽభిమన్యునిధనాత్ స్థిరతాం విరోధః
ప్రాప్తో జయః ప్రచలితా రిపవో నిరస్తాః ।
ఉన్మూలితోఽస్య చ మదో మధుసూదనస్య
లబ్ధో మయాఽద్య సమమభ్యుదయేన శబ్దః ।।


దుర్యోధనుడు:
నాయనా, దుశ్శాసనా!

అభిమన్యుడి మరణంతో శత్రుత్వం స్థిరపడిపోయింది. గెలుపు దక్కింది. శత్రువులు ఓడిపోయారు; చలించిపోయారు. మధుసూదనుడి మదం కూకటివేళ్ళతో పెకలించబడింది. విజయమూ, కీర్తీ తగుస్థాయిలో లభించాయి నాకు.


దుశ్శాసనః:
అహో తు ఖలు,

రుద్ధాః పాణ్డుసుతా జయద్రథబలేనాక్రమ్య శత్రోర్బలం
సౌభద్రే వినిపాతితే శరశతక్షేపైర్ద్వితీయేఽర్జునే ।
ప్రాప్తైశ్చ వ్యసనాని భీష్మపతనాదస్మాభిరద్యాహవే
తీవ్రాః శోకశరాః కృతాః ఖలు మనస్యేషాం సుతోత్సాదనాత్ ।। 12 ।।


దుశ్శాసనుడు:
భలే, కదా!

జయద్రథుడి సేన శత్రుసైన్యాన్ని ఓడించి పాండవులను నిలువరించింది. వందలాది బాణాల తాకిడి కారణంగా రెండవ అర్జునుడైన అభిమన్యుడు నేలకూలాడు. భీష్ముడు పడిపోయినందుకు దుఃఖితులమై ఉన్న మనం ఈనాటి యుద్ధంలో ఆ అభిమన్యుకుమారుడిని వధించి, పాండవుల హృదయాలలో తీవ్రమైన శోకం అనే బాణాలను నాటాము.


శకునిః:
జయద్రథేనాద్య మహత్కృతం రణే
నృపైరసమ్భావితమాత్మపౌరుషమ్ ।
ప్రసహ్య తేషాం యదనేన సంయుగే
సమం సుతేనాప్రతిమం హృతం యశః ।। 13 ।।


శకుని:
నేటి యుద్ధంలో జయద్రథుడు ఇతర రాజులెవ్వరూ ఊహించనంతటి పరాక్రమాన్ని చూపాడు. తన దృఢప్రయత్నంతో పాండవకుమారుడైన అభిమన్యుడిని, వారి అసమాన కీర్తినీ యుద్ధాన హరించాడు.


దుర్యోధనః:
మాతుల! ఇతస్తావత్ । దుశ్శాసన! ఇతస్తావత్ । తత్రభవన్తం తాతమభివాదయిష్యామః ।


దుర్యోధనుడు:
మామా! ఇలా రండి. దుశ్శాసనా, ఇటు రా. పితృపాదులకు నమస్కరిద్దాము.


శకునిః:
వత్స దుర్యోధన! మా మైవమ్ ।

కామం న తస్య రుచితః కులవిగ్రహోఽయ-
మస్మాంశ్చ గర్హయతి స ప్రియపాణ్డవత్వాత్ ।
యుద్ధోత్థితైర్జయమవాప్య హి తుల్యరూపం
ఏవం ప్రహృష్టవదనైరభిగన్తుమేనమ్ ।। 14 ।।


శకుని:
నాయనా దుర్యోధనా! వద్దు, వద్దు.

ఈ కుటుంబవైరం ఆయనకు ఎంతమాత్రము రుచించదు. పాండవులంటే ప్రీతి కనుక మనలను నిందిస్తూ ఉంటాడు. ఈవిధంగా, యుద్ధంలో విజయం సాధించి ప్రసన్నవదనాలతో ఆయనవద్దకు వెళ్ళడమా?


దుర్యోధనః:
మాతుల! మా మైవమ్ । యథా తథా భవతు । తత్రభవన్తం తాతమభివాదయిష్యామః ।


దుర్యోధనుడు:
మామా! అలా వద్దు. ఏమైనా కానివ్వండి. పూజ్యులైన తండ్రిగారికి నమస్కరిద్దాము.


ఉభౌ:
బాఢమ్ । (పరిక్రామతః ।)


ఇద్దరూ:
మంచిది. (ధృతరాష్ట్రుడు ఉన్నవైపుకు తిరుగుతారు)


దుర్యోధనః:
తాత! దుర్యోధనోఽహమభివాదయే ।


దుర్యోధనుడు:
తండ్రీ! నేను దుర్యోధనుడను, నమస్కరిస్తున్నాను.


దుశ్శాసనః:
తాత! దుశ్శాసనోఽహమభివాదయే ।


దుశ్శాసనుడు:
తండ్రీ! నేను దుశ్శాసనుడను, నమస్కరిస్తున్నాను.


శకునిః:
శకునిరహమభివాదయే ।


శకుని:
శకునిని, నమస్కరిస్తున్నాను.


సర్వే:
కథమాశీర్వచనం న ప్రయుజ్యతే ।


అందరూ:
ఆశీర్వదించడం లేదేమిటి?


ధృతరాష్ట్రః:
పుత్ర! కథమాశీర్వచనమితి ।

సౌభద్రే నిహతే బాలే హృదయే కృష్ణపార్థయోఃః ।
జీవితే నిరపేక్షాణాం కథమాశీః ప్రయుజ్యతే ।। 15 ।।


ధృతరాష్ట్రుడు:
పుత్రా, ఎలా ఆశీర్వదించను?

కృష్ణుడికి, పార్థుడికి హృదయంవంటి వాడైన బాలాభిమన్యుడు మరణించిన ఈ సమయంలోనా? ప్రాణాలపై ప్రీతిని వదులుకున్నవారిని ఏమని ఆశీర్వదించను?


దుర్యోధనః:
తాత! కింకృతోఽయం సమ్భ్రమః!


దుర్యోధనుడు:
తండ్రీ! ఎందుకీ కలవరం?


ధృతరాష్ట్రః:
కింకృతోఽయం సమ్భ్రమ ఇతి ।

ఏకా కులేఽస్మిన్బహుపుత్రనాథే
లబ్ధా సుతా పుత్రశతాద్విశిష్టా ।
సా బాన్ధవానాం భవతాం ప్రసాదాద్
వైధవ్యమశ్లాఘ్యమవాప్స్యతీతి ।। 16 ।।


ధృతరాష్ట్రుడు:
ఎందుకీ కలవరమా?

పుత్రులు అనేకంగా ఉండిన ఈ ఇంటిలో నూరుగురు కొడుకులకన్నా మిన్నగా ఒకే ఒక కూతురు కలిగింది. తన అన్నలైన మీ అనుగ్రహం కారణంగా నిందనీయమైన వైధవ్యాన్ని పొందనున్నదని!


దుర్యోధనః:
తాత! కిం చాత్ర జయద్రథస్య ।


దుర్యోధనుడు:
తండ్రీ, జయద్రథుడికి ఏమయ్యిందని?


ధృతరాష్ట్రః:
తేన కిల వరవిదగ్ధేన రుద్ధాః పాణ్డవాః ।


ధృతరాష్ట్రుడు:
శ్రేష్ఠుడైన ఆ వీరుడు పాండవులను అడ్డగించాడు.


దుర్యోధనః:
ఆః తేన రుద్ధాః । బహుభిః ఖల్వన్యైః ।


దుర్యోధనుడు:
ఓ, అడ్డగించాడనా? ఇంకా అనేకులూ అడ్డగించారు కదా?


ధృతరాష్ట్రః:
భోః! కష్టమ్ ।

బహూనాం సమవేతానామేకస్మిన్నిర్ఘృణాత్మనామ్ ।
బాలే పుత్రే ప్రహరతాం కథం న పతితా భుజాః ।। 17 ।।


ధృతరాష్ట్రుడు:
ఎంత కష్టం!

ఆ ఏకాకి బాలుడిపై, కుమారుడిపై నిర్దయగా మూకుమ్మడిగా దాడి చేసినవారి చేతులు ఎందుకు పడిపోలేదో!


దుర్యోధనః:
తాత!

వృద్ధం భీష్మం ఛలైర్హత్వా తేషాం న పతితా భుజాః ।
హత్వాస్మాకం పతిష్యన్తి తమబాలపరాక్రమమ్ ।। 18 ।।


దుర్యోధనుడు:
తండ్రీ!

వృద్ధుడైన భీష్ముడిని మోసంతో నేలకూల్చినవారి చేతులు పడిపోలేదు. పరాక్రమంలో బాలుడు కానివాడిని చంపినందుకు మా చేతులు పడిపోవాలా?


ధృతరాష్ట్రః:
వత్స! కిం భీష్మస్య నిపాతనమభిమన్యోశ్చ వధః సమః ।


ధృతరాష్ట్రుడు:
నాయనా! భీష్ముడిని కూల్చడంతో అభిమన్యుడి వధ సమానమా?


దుర్యోధనః:
తాత! కథం న సమః ।


దుర్యోధనుడు:
ఎందుకు కాదు తండ్రీ?


ధృతరాష్ట్రః:
పుత్ర! శ్రూయతామ్,

స్వచ్ఛన్దమృత్యుర్నిహతో హి భీష్మః స్వేనోపదేశేన కృతాత్మతుష్టిః ।
అయం తు బాలః కురువంశనాథశ్ఛిన్నోఽర్జునస్య ప్రథమః ప్రవాలః ।। 19 ।।


ధృతరాష్ట్రుడు:
పుత్రా! విను.

తను కోరుకున్నప్పుడే మృత్యువు కలుగుతుందన్న వరం ఉన్న భీష్ముడు స్వయంగా తనను గెలవగల ఉపాయాన్ని బోధించి సంతోషంగా మరణించాడు. వీడు? బాలుడు. కురువంశప్రభువు. అర్జునవృక్షపు తొలి అంకురం చిదిమివేయబడ్డది.


దుశ్శాసనః:
తాత! బాలో న బాల ఇతి । అభిమన్యునా,


దుశ్శాసనుడు:
తండ్రీ! ఆ బాలుడు బాలుడు కాడు. అభిమన్యుడు…


ధృతరాష్ట్రః:
కిం కిం దుశ్శాసనో వ్యాహరతి ।


ధృతరాష్ట్రుడు:
ఏమేమి? దుశ్శాసనుడా ఆ మాట్లాడేది?


దుశ్శాసనః:
అథ కిమ్ ।

సర్వేషాం నః పశ్యతాం యుధ్యతాం చ
వ్యాయామోష్ణం (వ్యాధామోష్మం?) (ఆ?)గృహ్య చాపం కరేణ ।
సూర్యేణైవాభ్యాగతైరంశుజాలైః
సర్వే బాణైరఙ్కితా భూమిపాలాః ।। 20 ।।


దుశ్శాసనుడు:
అవును, నేనే.

…మేమందరమూ చూస్తూ ఉండగానే, పోరాడుతూ ఉండగానే, వజ్రాయుధమంతటి శక్తిగల వింటిని చేతబట్టి, సూర్యుడు కిరణాలను వెదజల్లినట్లు, బాణాలను వేస్తూ రాజులందరినీ గాయపరిచాడు.


ధృతరాష్ట్రః:
కష్టం భోః!

బాలేనైకేన తావద్భోః! సౌభద్రేణేదృశం కృతమ్ ।
పుత్రవ్యసనసన్తప్తః పార్థో వః కిం కరిష్యతి ।। 21 ।।


ధృతరాష్ట్రుడు:
కష్టం!

ఒక్క బాలుడైన సుభద్రాసుతుడే ఈవిధంగా ఇంతలేసి చేసాడే, పుత్రశోకసంతప్తుడైన అర్జునుడు మిమ్మల్ని ఏమి చేయనున్నాడో!


దుర్యోధనః:
కిం కరిష్యతి ।


దుర్యోధనుడు:
ఏం చేయనున్నాడో?


ధృతరాష్ట్రః:
తత్కరిష్యతి, యత్సావశేషాయుషో ద్రక్ష్యథ ।


ధృతరాష్ట్రుడు:
ఏం చేస్తాడన్నది ఆయుష్షు మిగిలినవాళ్ళు చూద్దురు కానీ.


దుర్యోధనః:
తాత! కస్తావదర్జునో నామ ।


దుర్యోధనుడు:
తండ్రీ! ఎవడా అర్జునుడు?


ధృతరాష్ట్రః:
పుత్ర! అర్జునమపి న జానీషే ।


ధృతరాష్ట్రుడు:
కుమారా! అర్జునుడెవరో కూడా ఎరుగవా?


దుర్యోధనః:
తాత! న జానే ।


దుర్యోధనుడు:
ఎరుగను తండ్రీ!


ధృతరాష్ట్రః:
తేన హి అహమపి న జానే । కిన్తు అర్జునస్య బలవీర్యజ్ఞాః బహవః సన్తి । తాన్ పృచ్ఛ ।


ధృతరాష్ట్రుడు:
అలాగా, నేనూ ఎరుగను. కానీ అర్జునుడి బలపరాక్రమాలు తెలిసినవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను అడుగు.


దుర్యోధనః:
తాత! కేఽర్జునస్య బలవీర్యజ్ఞా మయా ప్రష్టవ్యాః ।


దుర్యోధనుడు:
తండ్రీ! ఎవరిని ప్రశ్నించాలి? ఎవరా అర్జునుడి బలపరాక్రమాన్ని తెలిసిన వారు?


ధృతరాష్ట్రః:
పుత్ర! శ్రూయతామ్ ।

శక్రం పృచ్ఛ పురా నివాతకవచప్రాణోపహారార్చితం
పృచ్ఛాస్త్రైః పరితోషితం బహువిధైః కైరాతరూపం హరమ్ ।
పృచ్ఛాగ్నిం భుజగాహుతిప్రణయినం యస్తర్పితః ఖాణ్డవే
విద్యారక్షితమద్య యేన చ జితస్త్వం పృచ్ఛ చిత్రాఙ్గదమ్ ।। 22 ।।


ధృతరాష్ట్రుడు:
పుత్రా! విను.

పూర్వం నివాతకవచులనే రాక్షసుల ప్రాణాలే కానుకగా అర్చనలను అందుకొన్న ఇంద్రుడిని అడుగు. కిరాతుడి రూపంలో పలురకాల అస్త్రాలతో సంతుష్టినందుకొన్న శివుడిని అడుగు. ఖాండవవనంలో తృప్తి చెందాడే, పాములను ఆహుతిగొని ప్రీతిచెందిన ఆ అగ్నిదేవుడిని అడుగు. ఇవాళ, నిన్ను ఓడించిన చిత్రాంగదుడనే ఆ విద్యాధరుడిని అడుగు.


దుర్యోధనః:
యద్యేతద్వీర్యమర్జునస్య కిమస్మాకం బలే న సన్తి ప్రతియోద్ధారోఽర్జునస్య ।


దుర్యోధనుడు:
ఇదే అర్జునుడి పరాక్రమమైతే అర్జునుడికి ఎదురునిలిచే యోధులు మన సైన్యంలో లేరా?


ధృతరాష్ట్రః:
పుత్ర! కే తే ।


ధృతరాష్ట్రుడు:
ఎవరు వారు, పుత్రా?


దుర్యోధనః:
నను కర్ణ ఏవ తావత్ ।


దుర్యోధనుడు:
కర్ణుడున్నాడు కదా!


ధృతరాష్ట్రః:
అహో హాస్యః ఖలు తపస్వీ కర్ణః ।


ధృతరాష్ట్రుడు:
అయ్యో! నవ్వుగొలుపుతున్నాడు కదా ఈ దీనకర్ణుడు!


దుర్యోధనః:
కేన కారణేన?


దుర్యోధనుడు:
ఎందుకని?


ధృతరాష్ట్రః:
శ్రూయతాం,

శక్రాపనీతకవచోఽర్ధరథః ప్రమాదీ
వ్యాజోపలబ్ధవిఫలాస్త్రబలో ఘృణావాన్ ।
కర్ణోఽర్జునస్య కిల యాస్యతి తుల్యభావం
యద్యస్త్రదానగురవో దహనేన్ద్రరుద్రాః ।। 23 ।।


ధృతరాష్ట్రుడు:
విను,

కవచాన్ని ఇంద్రుడికి ఇచ్చేసాడు, అర్ధరథుడు, శ్రద్ధ లేనివాడు, మోసంతో సంపాదించుకున్న అస్త్రబలం విఫలమవుతుందని శపించబడ్డవాడు, దయ ఎక్కువైనవాడూ అయిన కర్ణుడికి, అగ్నినీ, ఇంద్రుడినీ, శివుడిని అస్త్రదానగురువులుగా కలిగిన అర్జునుడితో పోలికా?


శకునిః:
ప్రభవతి భవానస్మానధీరయితుం ।


శకుని:
మమ్మల్ని నిందించే అధికారం ఉన్నది తమరికి.


ధృతరాష్ట్రః:
శకునిరేష వ్యాహరతి । భోః శకునే!

త్వయా హి యత్కృతం కర్మ సతతం ద్యూతశాలినా ।
తత్కులస్యాస్య వైరాగ్నిర్బాలేష్వపి న శామ్యతి ।। 24 ।।


ధృతరాష్ట్రుడు:
శకుని మాట్లాడుతున్నాడు. ఓయీ శకునీ!

నిరంతరం జూదమాడడంలో నేర్పరివైన నీవు రాజేసినదే ఈ కురుకులద్వేషాగ్ని! పసివారిని దహించి కూడా శాంతించడం లేదు.


దుర్యోధనః:
అయే,

భూమికమ్పః సశబ్దోఽయం కుతో ను సహసోత్థితః ।
ఉల్కాభిశ్చ పతన్తీభిః ప్రజ్వాలితమివామ్బరమ్ ।। 25 ।।


దుర్యోధనుడు:
అరె!

ఉన్నట్లుండి, పెద్ద చప్పుడుతో భూమి కంపిస్తున్నది, ఎందుకనో? రాలుతున్న ఉల్కలతో ఆకాశం తగలబడుతున్నట్లున్నది.


ధృతరాష్ట్రః:
పుత్ర! ఏవం మన్యే,

సువ్యక్తం నిహతం దృష్ట్వా పౌత్రమాయస్తచేతసః ।
ఉల్కారూపాః పతన్త్యేతే మహేన్ద్రస్యాశ్రుబిన్దవః ।। 26 ।।


ధృతరాష్ట్రుడు:
పుత్రా! నేను అనుకోవడమేమంటే –

తమ మనుమడు మరణించడం చూసి దుఃఖిస్తున్న మహేంద్రుడి కన్నీటి చుక్కలే ఉల్కలై నేలరాలుతున్నాయి.


దుర్యోధనః:
జయత్రాత! గచ్ఛ, పాణ్డవశిబిరే శఙ్ఖపటహసింహనాదరవోన్మిశ్రః కింకృతోఽయం శబ్ద ఇతి జ్ఞాయతామ్ ।


దుర్యోధనుడు:
జయత్రాతా! వెళ్ళు, పాండవశిబిరంలో శంఖనాదాలు, తప్పెటల చప్పుళ్ళు, సింహనాదాలు కలగలిసిన ఆ శబ్దం ఎందుకు చేస్తున్నారో కనుక్కో.


భటః:
యదాజ్ఞాపయతి । (నిష్క్రమ్య ప్రవిశ్య) జయతు మహారాజః । సంశప్తకానీకనివాహితప్రతినివృత్తేన ధనఞ్జయేన నిహతం పుత్రమఙ్కస్థమశ్రుభిః పరిషిచ్య జనార్దనావభర్త్సితేన ప్రతిజ్ఞాతం కిలానేన ।


భటుడు:
తమ ఆజ్ఞ! (వెళ్ళి, తిరిగివచ్చి) మహారాజుకు జయమగుగాక. సంశప్తకుల సేనతో యుద్ధానికని వెళ్ళి తిరిగివచ్చిన అర్జునుడు, తన మృతపుత్రుడిని ఒడిలో ఉంచుకొని కన్నీటితో తడిపివేసాడు. ఆ తరువాత, కృష్ణుడు రెచ్చగొట్టగా శపథం చేసాడు…


దుర్యోధనః:
కిమితి కిమితి ।


దుర్యోధనుడు:
ఏమని? ఏమని?


భటః:
తస్యైవ వ్యవసాయతుష్టహృదయైస్తద్విక్రమోత్సాహిభి-
స్తుష్టాస్యైర్జితమిత్యవేక్ష్య సహసా నాదః ప్రహర్షాత్కృతః ।
ఆక్రాన్తా గురుభిర్ధరాధరవరైః సంక్షోభితైః పార్థివై-
ర్భూమిశ్చాగతసమ్భ్రమేవ యువతిస్తస్మిన్ క్షణే కమ్పితా ।। 27 ।।


భటుడు:
అభిమన్యుడి వధ కారణంగా విచలితులై ఉండిన రాజులందరి గుండెలు అర్జునుడి పూనికకు సంతోషంతో పొంగిపోయాయి. అతడి శౌర్యం వారిలో ఉత్సాహాన్ని నింపింది. వారి ముఖాలు ప్రసన్నమయ్యాయి. గెలిచి తీరుతామన్న ఎరుకతో వాళ్ళంతా ఒక్క ఉదుటున హర్షధ్వానం చేసారు. ఆ క్షణంలో, పెద్ద పెద్ద కొండలతో ఆక్రమించబడి ఉన్న భూమి– సంభ్రమానికి లోనైన యువతివలె – కంపించిపోయింది.


ధృతరాష్ట్రః:
ప్రతిజ్ఞాసా(స్వ?)రమాత్రేణ కమ్పితేయం వసున్ధరా ।
సువ్యక్తం ధనుషి స్పృష్టే త్రైలోక్యం విచలిష్యతి ।। 28 ।।


ధృతరాష్ట్రుడు:
ప్రతిజ్ఞ శబ్దానికే భూమి కంపించింది. ధనుస్సును ముట్టుకుంటే ముల్లోకాలూ కదిలిపోతాయని సుస్పష్టం!


దుర్యోధనః:
జయత్రాత! కిమనేన ప్రతిజ్ఞాతమ్ ।


దుర్యోధనుడు:
జయత్రాతా! ఏమని శపథం చేసాడు?


భటః:
యేన మే నిహతః పుత్రస్తుష్టిం యే చ హతే గతాః ।
శ్వః సూర్యేఽస్తమసమ్ప్రాప్తే నిహనిష్యామి తానహమ్ ।। 29 ।।


భటుడు:
‘నా పుత్రుడి వధకు కారణమైన వాడిని, వాడి మృతికి సంతోషించినవారిని రేపు సూర్యుడు అస్తమించేలోపు వధిస్తాను,’ అని.


దుర్యోధనః:
ప్రతిజ్ఞావ్యాఘాతే కిం ప్రాయశ్చిత్తమ్ ।


దుర్యోధనుడు:
ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోతే ఏమి ప్రాయశ్చిత్తం?


భటః:
చితారోహణం కిల గాణ్డీవేన సహ ।


భటుడు:
గాండీవంతో సహా చితినెక్కడం కదా.


దుర్యోధనః:
మాతుల! చితారోహణం చితారోహణమ్ । వత్స దుశ్శాసన! చితారోహణం చితారోహణమ్ । వయమపి తావత్ప్రతిజ్ఞావ్యాఘాతే ప్రయత్నమనుతిష్ఠామః ।


దుర్యోధనుడు:
మామా! చితినెక్కుతాడట, చితినెక్కుతాడట! నాయనా, దుశ్శాసనా! చితినెక్కడం, చితిని ఎక్కడం! మనమూ ఆ ప్రతిజ్ఞను భంగపరిచేందుకు ప్రయత్నిద్దాము.


ధృతరాష్ట్రః:
పుత్ర! కిం కరిష్యసి ।


ధృతరాష్ట్రుడు:
కుమారా! ఏం చేయనున్నావు?


దుర్యోధనః:
నను సర్వాక్షౌహిణీసన్దోహేన చ్ఛాదయిష్యే జయద్రథం । అపి చ,

ద్రోణోపదేశేన యథా తథాహం
సంయోజయే వ్యూహమభేద్యరూపమ్ ।
ఖిన్నాశయాస్తే సగజాః సయోధా
అప్రాప్తకామా జ్వలనం విశేయుః ।। 30 ।।


దుర్యోధనుడు:
అన్ని అక్షౌహిణుల సమూహాలతో జయద్రథుడిని దాచివేస్తాను. అంతే కాదు,

ద్రోణుడి ఉపదేశానుసారం అభేద్యమైన వ్యూహాన్ని రచిస్తాను. ఆశయం భగ్నమై, కోరిక నెరవేరక, ఆ పాండవులు ఏనుగులతో సహా, భటులతో సహా అగ్నిప్రవేశం చేయుదురు గాక!


ధృతరాష్ట్రః:
అపి ప్రవిష్టం ధరణీమప్యారూఢం నభస్థలమ్ ।
సర్వత్రానుగమిష్యన్తి శరాస్తే కృష్ణచక్షుషః ।। 31 ।।


ధృతరాష్ట్రుడు:
భూమిలోనికి దూరినా, ఆకాశాన్నే అధిరోహించినా – కృష్ణుడే తన కనుదోయి అయిన – అర్జునుడి బాణాలు అన్ని చోట్లలోనూ అనుసరిస్తాయి.


భటః:
క్రూరమేవం నరపతిం నిత్యముద్యతశాసనమ్ ।
యః కశ్చిదపరో బ్రూయాన్న తు జీవేత్ స తత్ క్షణమ్ ।। 32 ।।


భటుడు:
శాసించడంలో ఎల్లప్పుడూ ఆసక్తితో ఉండే ఈ రాజుతో ఇంకెవరైనా ఇలాంటి నిష్ఠురపు మాట అని ఉంటే వాడి జీవితం తక్షణమే ముగిసి ఉండేది.



(తతః ప్రవిశతి ఘటోత్కచః ।)


(ఘటోత్కచుడు ప్రవేశిస్తాడు)

ఘటోత్కచః:
ఏష భోః!

ప్రయామి సౌభద్రవినాశచోదితః
దిదృక్షురద్యారిమనార్యచేతసమ్ ।
విచిన్తయంశ్చక్రధరస్య శాసనం
యథా గజేన్ద్రోఽఙ్కుశశఙ్కితో బలిమ్ ।। 33 ।।

(అధో విలోక్య) ఇదమస్యోపస్థానగృహద్వారమ్ । యావదవతరామి । (అవతీర్య) ఆత్మనైవాత్మానం నివేదయిష్యే । భోః! హైడిమ్బోఽస్మి ఘటోత్కచో యదుపతేర్వాక్యం గృహీత్వాగతో ద్రష్టవ్యోఽత్ర మయా గురుః స్వచరితైర్దోషైర్గతః శత్రుతామ్ ।


ఘటోత్కచుడు:
ఇదిగో –

ఈ దినము, అభిమన్యుడి మరణంవల్ల ప్రేరితుడనై, చక్రధారియైన కృష్ణుడి ఆజ్ఞను తలదాల్చి – అంకుశపు పోటు పడుతుందని శంకిస్తూనే ఏనుగు గడ్డి కోసం వెళ్ళినట్లు – నీచబుద్ధిగల శత్రువును చూడాలన్న కోరికతో వెళుతున్నాను.

(క్రిందికి చూసి) ఇది ఇతడి సభాగృహద్వారం. ఇక్కడ దిగుతాను. (దిగి) నన్ను నేను పరిచయం చేసుకుంటాను.

అయ్యలారా, నేను హిడింబాపుత్రుడను. ఘటోత్కచుడను. కృష్ణుడి సందేశాన్ని తీసుకొని వచ్చాను. తన వారి తప్పుల కారణంగా శత్రుత్వాన్ని పొందిన పెద్దవారిని కలవాలి.


దుర్యోధనః:
ఏహ్యేహి ప్రవిశస్వ శత్రుభవనం కౌతూహలం మే మహత్
ధృష్టం శ్రావయ మాం జనార్దనవచో దుర్యోధనోఽహం స్థితః ।। 34 ।।


దుర్యోధనుడు:
రా, రా. శత్రువుల ఇంటిలోనికి ప్రవేశించు. నేను, దుర్యోధనుణ్ణి, ఇక్కడ ఎంతో కుతూహలంతో ఉన్నాను. కృష్ణుడి మాటలను నిర్భయంగా వినిపించు.


ఘటోత్కచః:
(ప్రవిశ్య) అయే అయమత్రభవాన్ ధృతరాష్ట్రః । అనార్యశతస్యోత్పాదయితా । అయం నను లలితగమ్భీరాకృతివిశేషః । ఆశ్చర్యమాశ్చర్యమ్ ।

వృద్ధోఽప్యనాతతవలీ గురుసంహతాంసః
శ్రద్ధేయరూప ఇవ పుత్రశతస్య ధృత్యా ।
మన్యే సురైస్త్రిదివరక్షణజాతశఙ్కై-
స్త్రాసాన్నిమీలితముఖోఽత్రభవాన్ హి సృష్టః ।। 35 ।।

(ఉపసృత్య) పితామహ! అభివాదయే ఘటోత్క (ఇత్యర్ధోక్తే) న న అయమక్రమః । యుధిష్ఠిరాదయశ్చ మే గురవో భవన్తమభివాదయన్తి । పశ్చాద్ఘటోత్కచోఽహమభివాదయే ।


ఘటోత్కచుడు:
(లోనికి వచ్చి) అరె! పూజ్యుడైన ధృతరాష్ట్రుడు ఇక్కడ ఉన్నాడు. నీచులైన నూరుగురిని పుట్టించినవాడు. ఆహా, ఎంత కోమలమైన, గంభీరమైన రూపం! ఆశ్చర్యమాశ్చర్యం!

ముసలివాడైనప్పటికీ, ముడుతలు ఎక్కువగా లేవు. మూపు విశాలంగా, పొందికగా ఉన్నది. నూరుగురు కుమారులను కన్నందున శ్రద్ధకు పాత్రుడయ్యాడు. స్వర్గాన్ని కాపాడుకోలేమనే శంకవల్ల భయపడిన దేవతలు ఈయనను గుడ్డివాడిగా పుట్టించినట్లున్నారు.

(ధృతరాష్ట్రుడిని సమీపించి) తాతా! నమస్కరిస్తున్నాను ఘటోత్క… (మాటను సగంలో నిలిపి) ఊహూ! ఇది పద్ధతి కాదు. నా తండ్రులైన యుధిష్ఠిరాదులు తమకు నమస్కరిస్తున్నారు. ఆ పిమ్మట, ఘటోత్కచుడననే నేను నమస్కరిస్తున్నాను.


ధృతరాష్ట్రః:
ఏహ్యేహి పుత్ర!

న మే ప్రియం దుఃఖమిదం మమాపి
యద్ భ్రాతృనాశాద్ వ్యథితస్తవాత్మా ।
ఇత్థం చ తే నానుగతోఽయమర్థో
మత్పుత్రదోషాత్కృపణీకృతోఽస్మి ।। 36 ।।


ధృతరాష్ట్రుడు:
రా, రా, నాయనా!

ఇది నాకు ఇష్టం లేదు. నిన్ను దుఃఖింపజేస్తున్న నీ తమ్ముడి మరణం నాకూ దుఃఖాన్ని కలిగిస్తున్నది. నేను చెబుతున్నది నీకు అర్థం కాదు. నా పుత్రుల తప్పిదం కారణంగా నేను ఈ దుఃస్థితిలో ఉన్నాను.


ఘటోత్కచః:
అహో కల్యాణః ఖల్వత్రభవాన్ । కల్యాణానాం ప్రసూతిం పితామహమాహ భగవాంశ్చక్రాయుధః ।


ఘటోత్కచుడు:
ఆహా! ఈ పూజ్యుడు ఎంత ఉదాత్తుడు. భగవంతుడైన చక్రాయుధుడు మంగళకరుడైన తాతగారిని ఉద్దేశించి చెబుతున్నారు…


ధృతరాష్ట్రః:
(ఆసనాదుత్థాయ ।) కిమాజ్ఞాపయతి భగవాంశ్చక్రాయుధః ।


ధృతరాష్ట్రుడు:
(ఆసనం నుంచి లేచి) భగవంతుడైన చక్రాయుధుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు?


ఘటోత్కచః:
న న న । ఆసనస్థేనైవ భవతా శ్రోతవ్యో జనార్దనస్య సన్దేశః ।


ఘటోత్కచుడు:
వద్దు, వద్దు. జనార్దనుడి సందేశాన్ని కూర్చొని ఉండే వినాలి మీరు.


ధృతరాష్ట్రః:
యదాజ్ఞాపయతి భగవాంశ్చక్రాయుధః । (ఉపవిశతి ।)


ధృతరాష్ట్రుడు:
భగవంతుడైన చక్రాయుధుడి ఆజ్ఞ! (కూర్చుంటాడు)


ఘటోత్కచః:
పితామహ! శ్రూయతామ్ । హా వత్స అభిమన్యో! హా వత్స కురుకులప్రదీప! హా వత్స యదుకులప్రవాల! తవ జననీం మాతులం మామపి పరిత్యజ్య పితామహం ద్రష్టుమాశయా స్వర్గమభిగతోఽసి । పితామహ! ఏకపుత్రవినాశాదర్జునస్య తావదీదృశీ ఖల్వవస్థా, కా పునర్భవతో భవిష్యతి । తతః క్షిప్రమిదానీమాత్మబలాధానం కురుష్వ । యథా తే పుత్రశోకసముత్థితోఽగ్నిర్న దహేత్ప్రాణమయం హవిరితి ।


ఘటోత్కచుడు:
తాతా! విను. ‘అయ్యో, తండ్రీ అభిమన్యూ! కురుకులప్రదీపమా! యదుకులపు అంకురమా! నీ తల్లిని, మేనమామను, నన్నూ వదిలి, తాతగారైన ఇంద్రుడిని చూడాలన్న కోరికతో స్వర్గానికి వెళ్ళావు’. తాతా! ఒక్క కొడుకు మరణించినందుకే అర్జునుడికి ఈ అవస్థ కలిగింది. మరి నీ పరిస్థితి ఎలా ఉండబోతున్నది? అందుచేత, పుత్రశోకజనితమైన అగ్ని మీ ప్రాణాలను హవిస్సులా కాల్చేయక ముందే — వెంటనే — నీ సైన్యాన్ని ఉపసంహరించుకో.


ధృతరాష్ట్రః:
సక్రోధవ్యవసాయేన కృష్ణేనైతదుదాహృతమ్ ।
పశ్యామీవ హి గాణ్డీవీ సర్వక్షత్రవధే ధృతః ।। 37 ।।


ధృతరాష్ట్రుడు:
కోపంతో, పూనికతో కృష్ణుడు చెప్పిన మాట ఇది. క్షత్రియులందరినీ వధించాలని నిశ్చయించుకున్నట్లున్న అర్జునుడిని చూస్తున్నాను నేను.


సర్వే:
అహో హాస్యమభిధానమ్ ।


అందరూ:
భలే నవ్వుగొలిపే విషయం ఇది!


ఘటోత్కచః:
కిమేతద్ధాస్యతే ।


ఘటోత్కచుడు:
నవ్వేందుకు ఏమున్నదిందులో?


దుర్యోధనః:
ఏతద్ధాస్యతే ।

దేవైర్మన్త్రయతే సార్ధం స కృష్ణో జాతమత్సరః ।
పార్థేనైకేన యో వేత్తి నిహతం రాజమణ్డలమ్ ।। 38 ।।


దుర్యోధనుడు:
నవ్వేందుకేమున్నదా –

అసూయాపరుడైన కృష్ణుడు దేవతలతో మంత్రాలోచనం చేస్తున్నట్లున్నాడు — ఒక్క అర్జునుడిచేతనే లోకంలోని రాజులందరినీ సంహరింపజేయగలనని అనుకుంటున్నాడు.


ఘటోత్కచః:
హససి త్వమహం వక్తా ప్రేషితశ్చక్రపాణినా ।
శ్రావితం పార్థకర్మేదమహో యుక్తం తవైవ తు ।। 39 ।।

అపి చ భవతాపి శ్రోతవ్యో జనార్దనస్య సన్దేశః ।


ఘటోత్కచుడు:
కృష్ణుడి పనుపున దూతగా వచ్చిన నేను అర్జునుడు ఏం చేయబోతున్నాడో వినిపించాను. నువ్వు చులకన చేస్తూ నవ్వుతున్నావు. ఆహా! ఇటువంటి వ్యవహారం నీకే చెల్లింది.

నీవూ వినవలసిన జనార్దనుడి సందేశం ఒకటున్నది.


దుశ్శాసనః:
మా తావత్ భోః! క్షత్రియావమానిన్!

పృథివ్యాం శాసనం యస్య ధార్యతే సర్వపార్థివైః ।
సన్దేశః శ్రోష్యతేఽప్యన్యో న రాజ్ఞస్తస్య సన్నిధౌ ।। 40 ।।


దుశ్శాసనుడు:
చాలించు! క్షత్రియులను అవమానించేవాడా!

భూమండలంలో రాజులందరూ ఎవరి శాసనాన్ని శిరసా వహిస్తారో ఆ రాజు సన్నిధిలో, రాజులు కానివారి సందేశం వినిపించడానికి వీల్లేదు.


ఘటోత్కచః:
కథం దుశ్శాసనో వ్యాహరతి । అరే దుశ్శాసన! అరాజా నామ భవతాం చక్రాయుధః హం భోః!

ముక్తా యేన జరా పురాన్నృపతయః ప్రభ్రష్టమానోచ్ఛ్రయాః
యేనార్ఘ్యం నృపమణ్డలస్య మిషతో భీష్మాగ్రహస్తాద్ధృతమ్ ।
శ్రీర్యస్యాభిరతా నియోగసుముఖీ శ్రీవత్స(క్ష?)శయ్యాగృహే
శ్లాఘ్యః పార్థివపార్థివస్తవ కథం రాజా న చక్రాయుధః ।। 41 ।।


ఘటోత్కచుడు:
ఎలా మాట్లాడుతున్నాడు దుశ్శాసనుడు! అరే దుశ్శాసనా! చక్రాయుధుడు మీకు రాజు కాడా?

పూర్వం జరాసంధుడి కారణంగా గౌరవాన్ని, ఉన్నతిని కోల్పోయిన రాజులను చెరనుంచి విడిపించినవాడు, సకలరాజన్యసమక్షంలో భీష్ముడి చేతులనుండి అర్ఘ్యాన్ని అందుకున్నవాడు, అనురాగిణి, ఆజ్ఞానువర్తియైన లక్ష్మీదేవిని తన శ్రీవత్సము అనే శయ్యాగృహంలో ఉంచుకున్నవాడు, రాజులకు రాజూ అయిన చక్రాయుధుడు నీకు రాజు కాడా?


దుర్యోధనః:
దుశ్శాసన! అలం వివాదేన ।

రాజా వా యది వాఽరాజా బలీం వా యది వాఽబలీ ।
బహునాత్ర కిముక్తేన కిమాహ భవతాం ప్రభుః ।। 42 ।।


దుర్యోధనుడు:
దుశ్శాసనా! వివాదం చాలు.

రాజా, రాజేతరుడా? బలవంతుడా, కాదా? అన్నేసి మాటలెందుకు? ఏమన్నాడు నీ ప్రభువు?


ఘటోత్కచః:
అథ కిమథ కిమ్ । ప్రభురేవ త్రైలోక్యనాథో భగవాంశ్చక్రాయుధః । విశేషతోఽస్మాకం ప్రభుః । అపి చ,

అవసితమవగచ్ఛ క్షత్రియాణాం వినాశం
నృపశతవినిచిత్యా లాఘవం చాస్తు భూమేః ।
న హి తనయవినాశాదుద్యతోగ్రాస్త్రముక్తేః
సమరశిరసి కశ్చిత్ఫల్గునస్యాతిభారః ।। 43 ।।


ఘటోత్కచుడు:
అవునవును. భగవంతుడు, ముల్లోకాల ఏలిక అయిన చక్రాయుధుడు ప్రభువే. ముఖ్యంగా మా ప్రభువు.

‘క్షత్రియుల వినాశనము పూర్తయ్యిందని తెలుసుకో. వందమంది రాజుల సంహారంతో భూమి తేలిక అవనున్నది. యుద్ధం ఆరంభమయ్యాక, పుత్రవధ కారణంగా ఉగ్రాస్త్రప్రయోగతత్పరుడైన అర్జునుడికి ఏదీ పెద్ద బరువు కాదు,’ అని చెప్పమన్నాడు.


శకునిః:
యది స్యాద్వాక్యమాత్రేణ నిర్జితేయం వసున్ధరా ।
వాక్యే వాక్యే యది భవేత్సర్వక్షత్రవధః కృతః ।। 44 ।।


శకుని:
మాట మాత్రాన ఈ భూమిని జయించగలిగితే, మాటలతో సర్వక్షత్రియసంహారమూ సంభవిస్తే…


ఘటోత్కచః:
రే! రే! శకునిరేష వ్యాహరతి । భోః శకునే!

అక్షాన్విముఞ్చ శకునే! కురు బాణయోగ్య-
మష్టాపదం సమరకర్మణి యుక్తరూపమ్ ।
న హాత్ర దారహరణం న చ రాజ్యతన్త్రం
ప్రాణాః పణోఽత్ర రతిరుగ్రబలైశ్చ బాణైః ।। 45 ।।


ఘటోత్కచుడు:
ఒరే! ఒరే! ఇదిగో, శకుని మాట్లాడుతున్నాడు. ఓ శకునీ!

శకునీ, పాచికలను వదిలిపెట్టు. జూదపు పలకను యుద్ధానికి అనుకూలంగా, బాణాలను ఎదుర్కొనేందుకు వీలుగా మార్చుకో. ఇక్కడ పరుల భార్యలను అపహరించడం లేదు, రాజ్యాలను కాజేసే ఉపాయమూ లేదు. ప్రాణాలను పణంగా పెట్టాలి ఇక్కడ. ఉగ్రమూ, శక్తిమంతమూ అయిన బాణాలే ఆనందకారకాలు!


దుర్యోధనః:
భో భోః! ప్రకృతిం గతః ।

క్షిపసి వదసి రూక్షం లంఘయిత్వా ప్రమాణం
న చ గణయసి కిఞ్చిద్వ్యాహరన్దీర్ఘహస్తః ।
యది ఖలు తవ దర్పో మాతృపక్షోగ్రరూపో
వయమపి ఖలు రౌద్రాః రాక్షసోగ్రస్వభావాః ।। 46 ।।


దుర్యోధనుడు:
ఓయ్, ఓయ్! స్వస్వభావానికి వచ్చేసాడు.

నియమాలను అతిక్రమించి మాట్లాడుతున్నావు. నిందిస్తున్నావు. పొడవైన చేతులవాడివి, మాట్లాడడంలో ఏదీ లెక్క చేయడంలేదు. నీకు తల్లివైపునుంచి ఉగ్రస్వభావం సంక్రమించిందని మిడిసిపడుతున్నావేమో. మేమూ రౌద్రము గలవారమే. రాక్షసులవలె ఉగ్రస్వభావులమే.


ఘటోత్కచః:
శాన్తం శాన్తం పాపమ్ । రాక్షసేభ్యోఽపి భవన్త ఏవ క్రూరతరాః । కుతః,

న తు జతుగృహే సుప్తాన్ భ్రాతృన్ దహన్తి నిశాచరాః
శిరసి న తథా భ్రాతుః పత్నీం స్పృశన్తి నిశాచరాః ।
న చ సుతవధం సంఖ్యే కర్తుం స్మరన్తి నిశాచరాః
వికృతవపుషోఽప్యుగ్రాచారా ఘృణా న తు వర్జితా ।। 47 ।।


ఘటోత్కచుడు:
శాంతం పాపం! శాంతం పాపం! రాక్షసులకన్నా తమరే క్రూరులు. ఎందుకంటే,

లక్కయింటిలో నిద్రిస్తున్న అన్నదమ్ములను నిశాచరులు కాల్చనే కాల్చరు. వదిన తలను ఆవిధంగా తాకరు గాక తాకరు. యుద్ధంలో కొడుకును చంపాలన్న ఆలోచన కూడా రాదు వారికి. వికారశరీరులు, ఘోరవర్తనులూ అయినా కరుణను మాత్రం విడిచిపెట్టలేదు వారు.


దుర్యోధనః:
దూతః ఖలు భవాన్ ప్రాప్తో న త్వం యుద్ధార్థమాగతః ।
గృహీత్వా గచ్ఛ సన్దేశం న వయం దూతఘాతకాః ।। 48 ।।


దుర్యోధనుడు:
దూతగా వచ్చారు తమరు, యుద్ధానికని కాదు. మా ప్రతిసందేశాన్ని తీసుకొని వెళ్ళు. దూతలను చంపేవాళ్ళం కాము మేము.


ఘటోత్కచః:
(సరోషమ్) కిం దూత ఇతి మాం ప్రధర్షయసి । మా తావద్ భోః! న దూతోఽహమ్ ।

అలం వో వ్యవసాయేన ప్రహరధ్వం సమాహతాః ।
జ్యాచ్ఛేదాద్దుర్బలో నాహమభిమన్యురిహ స్థితః ।। 49 ।।

మహానేష కైశోరకోఽయం మే మనోరథః । అపి చ,

దష్టోష్ఠో ముష్టిముద్యమ్య తిష్ఠత్యేష ఘటోత్కచః ।
ఉత్తిష్ఠతు పుమాన్ కశ్చిద్గన్తుమిచ్ఛేద్యమాలయమ్ ।। 50 ।।


ఘటోత్కచుడు:
(కోపంగా) దూతవంటూ నన్ను అవమానిస్తున్నావా? వద్దోయీ! దూతను కాను నేను.

మీ మాటలు చాలించండి. అందరూ ఒక్కసారిగా నాపై దాడి చేయండి. వింటినారి తెగిపోగానే బలహీనుడైపోయిన అభిమన్యుడను కాదు నేను.

చిన్నప్పట్నుంచీ నాకెంతో ఆశగా ఉండేది. పైగా,

పెదవిని పంట గరచి, పిడికిలి బిగించి సిద్ధంగా ఉన్నాడిక్కడ ఘటోత్కచుడు. నరకానికి పోవాలనుకున్నవాడెవడో లేచి నిలబడాలి.



(సర్వే ఉత్తిష్ఠన్తి ।)


(అందరూ లేచి నిలబడతారు)

ధృతరాష్ట్రః:
పౌత్ర ఘటోత్కచ! మర్షయతు మర్షయతు భవాన్ । మద్వచనావగన్తా భవ ।


ధృతరాష్ట్రుడు:
మనవడా! ఘటోత్కచుడా! క్షమించు, క్షమించు. నా మాట విను.


ఘటోత్కచః:
భవతు భవతు । పితామహస్య వచనాద్దూతోఽహమస్మి । తథాపి హి న శక్నోమి రోషం ధారయితుమ్ । కిమితి విజ్ఞాప్యస్తత్రభవాన్ నారాయణః ।


ఘటోత్కచుడు:
అలాగే, అలాగే. తాతగారు చెప్పినందున దూతనవుతున్నాను. అయినా నా కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. నారాయణుడికి ఏమి మనవి చేయమన్నారు?


దుర్యోధనః:
ఆ కస్య విజ్ఞాప్యమ్ । మద్వచనాదేవం స వక్తవ్యః,

కిం వ్యర్థం బహు భాషసే న ఖలు తే పారుష్యసాధ్యా వయం
కోపాన్నార్హసి కించిదేవ వచనం యుద్ధం యదా దాస్యసి ।
నిర్యామ్యేష నిరన్తరం నృపశతచ్ఛత్రావలీభిర్వృత-
స్తిష్ఠ త్వం సహ పాణ్డవైః ప్రతివచో దాస్యామి తే సాయకైః ।। 51 ।।


దుర్యోధనుడు:
ఆహ్! ఎవరికి మనవి చేయడం? నా మాటగా ఇలా చెప్పు,

పలు మాటలేల? నీ నిష్ఠురానికి లొంగము మేము. నీవు యుద్ధానికి సిద్ధమైనప్పుడు — చిన్నదైనా సరే –ఆగ్రహపు మాట నీకు యుక్తం కాదు. నూరుగురు రాజుల ఛత్రపంక్తి నన్ను ఎల్లప్పుడూ పరివేష్టించి ఉండగా బయలుదేరి వస్తాను నేను. నీవు పాండవపక్షాన నిలిచి ఉండు. ఎడతెరపి లేని బాణాలతో నీకు సమాధానం చెబుతాను.


ఘటోత్కచః:
పితామహ! ఏష గచ్ఛామి ।


ఘటోత్కచుడు:
తాతా! ఇక వెళతాను.


ధృతరాష్టః:
పౌత్ర! గచ్ఛ, గచ్ఛ ।


ధృతరాష్ట్రుడు:
మనవడా! వెళ్ళు, వెళ్ళు.


ఘటోత్కచః:
భో భో రాజానః! శ్రూయతాం జనార్దనస్య పశ్చిమః సన్దేశః ।

ధర్మం సమాచర కురు స్వజనవ్యపేక్షాం
యత్కాంక్షితం మనసి సర్వమిహానుతిష్ఠ ।
జాత్యోపదేశ ఇవ పాణ్డవరూపధారీ
సూర్యాంశుభిః సమముపైష్యతి వః కృతాన్తః ।। 52 ।।


ఘటోత్కచుడు:
ఓ రాజులారా! జనార్దనుడి తదుపరి సందేశాన్ని వినండి.

ధర్మాన్ని ఆచరించండి. స్వజనులపై ప్రేమాదరాలను చూపండి. మనసులోని కోరికలన్నింటినీ తీర్చుకోండి. మీ వంశానికి తగిన ఉపదేశాన్ని ఇచ్చేందుకు ఆ యముడే అర్జునరూపధారియై సూర్యుడి కిరణాలతోబాటు రాబోతున్నాడు.


(నిష్క్రాన్తః సర్వే ।)


(అందరూ నిష్క్రమిస్తారు)



దూతఘటోత్కచం నామోత్సృష్టికాఙ్కం సమాప్తమ్ ।।


‘దూతఘటోత్కచము’ అనే ఉత్సృష్ట్యంకము ముగిసింది.