ప్రయాణం ఆరంభించి ఏడు రోజులు గడిచాయి. నడక మొదలెట్టి నాలుగు రోజులు. ఎనిమిదవ రోజున, అక్టోబర్ 8 న – మేము పెట్టుకున్న గమ్యం ‘లేడర్’ అన్న సమున్నత ప్రదేశంలో ఉన్న గ్రామం. 4250 మీటర్ల ఎత్తు – అంటే దాదాపు పధ్నాలుగువేల అడుగులన్నమాట. పదమూడు పధ్నాలుగు కిలోమీటర్ల దూరం. సుమారు ఆరుగంటల నడక.
చూడచక్కని మనాంగ్ పట్టణాన్ని వదలలేక వదిలి ఆ ఉదయమే మేమంతా మర్సియాంగ్దీ లోయ వేపు నడక ఆరంభించాం. మనాంగ్ పరిసరాలు దాటుతున్నపుడు వీపు మీద తమకు మూడింతల పరిమాణంలో ఉన్న బక్‌వీట్ గడ్డి మోపులు మోస్తూ పట్టణంకేసి వెళుతోన్న రైతులు అనేకమంది ఎదురు వచ్చారు. వెలిగే సూర్యుడూ నిర్మలాకాశమూ మాలో అదనపు స్ఫూర్తిని నింపాయి. నడక ఆరంభంలో విపరీత వాతావరణం చవి చూడవలసి వచ్చినా మనాంగ్‌లో మాకు తటస్థపడిన వాతావరణం అతి చక్కనిది. నడక మొదటి రోజున నాలుగురోజుల క్రితం ధారాపానీనుంచి ఛామె దాకా అడ్డూ ఆపూ లేకుండా కురిసిన వానలో రోజంతా నడవడమన్నది ఇపుడు ఏదో గతజన్మకు చెందిన జ్ఞాపకం అనిపించసాగింది.
మనాంగ్ దాటి కాస్తంత దూరం వెళ్ళగానే టెంకీ మనాంగ్ అన్న చిన్న గ్రామం వచ్చింది. ఊరి మొగలో పేద్ద రావిచెట్టు కనిపించింది. అక్కడివాళ్ళంతా ఆ చెట్టు దగ్గర ఓ క్షణం ఆగి, ప్రార్థించి వెళ్ళడం గమనించాం. ఆ వృక్షం దగ్గర ఆగి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అని అక్కడి వారి నమ్మకమట. నేనూ ఆగి, ‘మా బృందంలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా, విజయవంతంగా మా ఇప్పటి ట్రెక్ ముగించాలి,’ అని కోరుకున్నాను.
ఆ రోజు నేను అశోక్‌తోనూ, అతని ఆప్తమిత్రులు చేతన్, ప్రసాద్‌లతోనూ కలసి నడిచాను. అశోక్ నాకు చిరకాల మిత్రుడు. చక్కని ట్రెకర్. మా బృందాన్ని ఏకతాటి మీద నడిపించడంలో అతను నాకు అందిస్తోన్న సహకారం అమూల్యమైనది. అశోక్, చేతన్ బర్మింగ్‌హామ్ నివాసులు. మా బృందంలోని 35 మందిలో 18మంది యూకేకి చెందినవారయితే మళ్ళా అందులో 10మంది బర్మింగ్‌హామ్ నుంచి వచ్చినవారు. వీళ్లందరితోనూ నాకు అప్పటికే మంచి పరిచయం ఉంది. ఒకరిద్దరు తప్పించి మిగిలిన అందరూ నాతో కలసి ఏదో ఒక ట్రెక్‌లో పాలుపంచుకున్నవారే. ప్రసాద్ విషయానికి వస్తే అతనూ నేనూ కలసి ఎన్నో ట్రెక్‌లు చేసి ఉన్నాం. అందులో స్కాట్లాండ్‌కు చెందిన ‘వెస్ట్ హై లాండ్ వే’, ఇంగ్లాండ్‌లోని ‘రిట్జ్ వే ట్రైల్’, వేల్స్ ప్రాంతపు ‘బ్రెకాన్ బీకన్స్’ చెప్పుకోదగ్గవి. సహజంగానే మా మధ్య మా బృహత్ బృందపు పరిమాణం చర్చకు వచ్చింది. ‘ఇంతమందిని తీసుకువెళ్ళి ఎంతో కఠినమైన ఏసీటీ ట్రెక్ నిజంగా చెయ్యగలమా అని మా ముగ్గురికీ మొదట్లో బాగా అనుమానం కలిగింది. ఈ నాలుగు రోజులూ బృందమంతా ఒకే వ్యక్తిలా నడచిన తీరు చూస్తే సంతృప్తిగా ఉంది’ అని వాళ్ళంతా సంబరంగా చెప్పారు. ‘అసలు ఇంతమందిని ఎలా సమీకరించావు. ఇంత పెద్ద బృందం ఎలా ఏర్పడింది’ అని అశోక్ కుతూహలంతో అడిగాడు. ఏడాది ముందునుంచీ బృందాన్ని సమీకరించడం ఆరంభించాననీ, అది చూస్తూ చూస్తూనే అన్ని అంచనాలనూ దాటుకుని, ముందు అనుకున్న పదీ పదిహేనుమందికి రెట్టింపు సంఖ్యను కూడా దాటి 35 దగ్గర ఆగింది అని చెప్పాను. ఆ ఆగడం కూడా మా ట్రావెల్ ఏజెంట్ సూర్య ’35ను దాటి ఒక్కరు వచ్చినా నేను ఒప్పుకోను’ అని ఖచ్చితంగా చెప్పడంవల్ల ఆగింది.
అలా అని నేను ఊరికే మోహమాటపడి వద్దని చెప్పలేక అందరికీ తల ఊపే మనిషిని కాదు. ఎంతో ఉత్సాహంతో మా బృందంలో చేరదామని వచ్చిన కొత్త సభ్యులకు మేము చేపట్టబోతోన్న ట్రెక్‌లోని సాధకబాధకాలన్నీ క్షుణ్ణంగా వివరించేవాడిని. కొత్తగా చేరే ప్రతి ఒక్కరితో విడివిడిగా, వివరంగా మాట్లాడేవాడిని. యాత్రలోని కష్టాలన్నీ చెప్పేవాడిని. ఎక్యూట్ మౌంటైన్ సిక్‌నెస్ – AMS – లాంటి ఉపద్రవాల గురించి చెప్పేవాడిని. ‘మీకు శ్వాస సంబంధిత ఇబ్బందులు, గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే ట్రెక్‌లో చేరనే చేరవద్ద’ని హెచ్చరించేవాడిని. చేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళంతా సంపూర్ణ శారీరక శిక్షణ పొంది మరీ రావడం ఎంత అవసరమో చెప్పేవాడిని. ఎంత శారీరక పటుత్వం ఉన్నా ఉన్నతశ్రేణి హిమాలయాల్లో ఏ క్షణానైనా మనుషులు శారీరకంగా అశక్తులయ్యే అవకాశం ఉందనీ, అలా జరిగిన పక్షంలో మా బృందంలోని వైద్యబృందం ఆ మనిషి ముందుకు సాగాలో వద్దో నిర్ణయిస్తారనీ, ఆ నిర్ణయానికి తల ఒగ్గి తీరాలనీ స్పష్టపరచేవాడిని. ఎంతో కష్టసాధ్యమైన ఈ అన్నపూర్ణ ట్రెక్‌లో, బృందపు సభ్యులంతా అపారమైన టీమ్ స్పిరిట్‌తో ఏకతాటి మీద నడవడం ఎంత అవసరమో చెప్పేవాడిని. ఇవన్నీ విని, అర్థం చేసుకుని, వీటికి ఒప్పుకున్న తర్వాతే వారిని బృందంలో చేర్చుకునేవాడిని.
ముందే చెప్పుకున్నట్టు మా బృందంలోని ఏభై శాతంమంది ఏదో ఒక సందర్భంలో 4000 మీటర్లను మించిన ఎత్తుకు చేరుకుని వచ్చినవారే. ఆ రకంగా వీరి విషయంలో ఉన్నత శ్రేణులు చేరుకోవడం అన్నది పెద్దగా ఇబ్బంది కలిగించదని నమ్మవచ్చు. అలాగే ఎవరెస్ట్ బేస్ కాంప్ ట్రెక్‌తో పోలిస్తే ఈ అన్నపూర్ణ ట్రెక్‌లో ఒక సౌలభ్యం ఉంది. ఎవరెస్ట్‌లా కాకుండా అన్నపూర్ణ ట్రెక్ ఆరంభం అతి సులభమైన ఎత్తులో మొదలై (ధారాపానీ, 1860 మీటర్లు), క్రమక్రమంగా ఏడవరోజున 5416 మీటర్ల థోరోంగ్ లా కనుమ చేరుతుంది. ఈలోగా ఎక్లమటైజేషన్ కోసం మనాంగ్‌లో దాదాపు రెండు రోజులు ఆగడం మా ప్రణాళికలో భాగం. అంచేత కొత్తగా చేరినవాళ్ళూ, అంతకు ముందు 4000 మీటర్లు దాటి వెళ్ళనివాళ్ళు కూడా ఎత్తులకు క్రమక్రమంగా అలవాటు పడి, వాటిని జయించే ఆవకాశం ఎంతైనా ఉందని భావించాను. చివరకు అదే జరిగింది.
ఏదేమైనా ఎవరెస్ట్, అన్నపూర్ణలాంటి ట్రెక్‌లు ఆషామాషీ వ్యవహారాలు కావు అనేది నిర్వివాదం. ముందే చెప్పుకున్నట్టు AMS అన్నది ట్రెకర్లకు ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదం. దాని సంగతి ఎలా ఉన్నా ప్రతికూల వాతావరణం, అనూహ్యంగా వాతావరణంలో జరిగే మార్పులు, తీవ్రమైన చలి, టాయ్‌లెట్‌లాంటి కనీస సౌకర్యాలైనా లేని మారుమూల ప్రాంతాల్లో తిరుగాడటం, ఊహను మించిన శారీరక శ్రమ, అలసట, నిస్పృహ, చిరాకు, అడుగు తీసి అడుగు వేయలేనంత నిస్సహాయ స్థితి – ఇలాంటివి ఏ ట్రెకర్‌కైనా ఎదురవవచ్చు. మరి 35మంది ఉన్న బృందం అంటే అవి అలా ఎదురయ్యే సంభావ్యత 35 రెట్లు పెరిగినట్లే. ఇలాంటివాటిని ఎదుర్కోవడానికి శారీరక దృఢత్వంతోపాటు మానసిక సంసిద్ధత కూడా అవసరం. బృందంలోని ఇతర సభ్యులూ, గైడ్‌లూ, పోర్టర్లూ ఎంతో ఎంతెంతో సహాయం చెయ్యగలరుగానీ వారు అలా చెయ్యగల సహాయానికి కూడా పరిమితులు ఉంటాయి. చివరికి ఎవరికి వారే శారీరకంగా మానసికంగా నిలదొక్కుకుని ముందుకు సాగవలసి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఇలాంటి ట్రెక్కుల్లోని ప్రతి క్షణమూ పరీక్షా సమయమే!
నడక మొదలెట్టి గంట గడిచేసరికి మర్సియాంగ్దీ నదినుంచి విడివడవలసి వచ్చింది. గత ఆరు రోజులుగా ఆ నదీ మేమూ కలసి మెలసి ఉన్నాం. ఈ ఏడవరోజున మా దారీ, మర్సియాంగ్దీ దారీ వేరు వేరు అయ్యాయి. ఈ నది మనాంగ్ జిల్లాలోనే ఉన్న తిలిచో అన్న సరోవరంలో పుట్టి బేసిషహర్‌కు కాస్తంత దిగువన త్రిశూలి నదిలో కలుస్తుంది. మేము తిలిచో సరోవరం దాకా వెళ్ళకపోయినా మొత్తానికి మర్సియాంగ్దీ నదిని మనాంగ్ దాకా, దాదాపు వంద కిలోమీటర్లు, దగ్గరగా చూసాం కదా – చక్కని అనుబంధం ఏర్పడింది. వదిలిపెట్టాలంటే సహజంగానే కాస్తంత దిగులనిపించింది.

మా మాంచెస్టర్ నవీన్‌కు ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఆసక్తి- తనతోపాటు ఏకంగా ఒక SLR కెమెరా తీసుకువచ్చి ఫోటోలు తీయసాగాడు. ఇలాంటి ట్రెక్‌లలో SLR లాంటి భారీ కెమెరా వెంటబెట్టుకుని తిరగడమంటే మాటలు కాదు. సహజంగానే నవీన్ మా బృందానికి అఫీషియల్ ఛాయాచిత్రకారుడు అయ్యాడు. మా అందర్నీ కూర్చి చక్కని గ్రూప్ ఫోటోలు తీసాడు. ట్రెక్ ముగిసి అందరం గూటికి చేరాక అన్నపూర్ణ ఫోటోలతో ఒక కాఫీ టేబుల్ బుక్ రూపొందించాలన్నది నవీన్ అభిలాష. తిరిగి వెళ్ళాక ఆ పని చేయనే చేసాడు.
మూడు రోజుల క్రితం ఛామె – పిసాంగ్ దారిలో కలసి కాసేపు మాతో నడచిన ఇజ్రాయెల్ పడుచువాళ్ళ బృందం మళ్ళా తటస్థపడింది. అంతకుముందు పదీ పన్నెండుమంది యువతీయువకులున్న ఆ బృందం ఇపుడు సగానికి సగం తగ్గి కనిపించింది. మిగిలిన వాళ్ళు మాకన్నా ముందో-వెనుకో ఉన్నారనుకున్నాను; కాదట. ఈ సగానికి తగ్గిన బృందం కూడా నవ్వులూ కేరింతలూ మానుకొని స్తబ్దంగా కనిపించింది. ఏమిటీ సంగతీ? అని కుశలమడిగాం. వారిలో ఏడెనిమిదిమంది హఠాత్తుగా ట్రెక్ మానుకొని ఇజ్రాయెల్ తిరిగి వెళుతున్నారట. వివరాల్లోకి వెళ్ళగా అందుకు కారణం తెలిసింది. నిన్నటి రోజున, అంటే అక్టోబర్ 7 వ తారీఖున, హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయల్‌లో ప్రవేశించి ఒక సంగీత విభావరి జరుగుతోన్న ప్రదేశంలో వందలాదిమందిని కాల్చి చంపారట. ఎంతోమందిని కిడ్నాప్ చేసారట. అదంతా విని విస్తుపోయాం. ట్రెకింగ్‌లో పడి మునిగాక మిగిలిన ప్రపంచంతో మనం ఎంతగా సంపర్కం కోల్పోతామో ప్రత్యక్షంగా అనుభవమయింది. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో జరుగుతోన్న విషయాలు తెలుసుకోవచ్చుగానీ ట్రెకింగ్ అంటూ మొదలెట్టాక ధ్యాస అటు మళ్ళదు – మహా అయితే ఇంటికి ఫోన్ చేసో, వాట్సప్‌లో మెసేజ్ పెట్టో – ‘అంతా బానే ఉంది; క్షేమంగా ఉన్నాం,’ అన్న సమాచారం అందిస్తాం. మళ్ళా మా ఇజ్రాయెల్ బృందం విషయానికి వస్తే వారిలో చాలామంది సైన్యంలో పనిచేస్తున్నవారట. వారందరినీ వెంటనే తిరిగి రావాలని ఆజ్ఞలు అందాయి – వెళ్ళిపోయారు. నలుగురైదుగురే మిగిలారు. ‘ధైర్యంగా ఉండండి; హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి స్మృతిలో మీరు ఈ ట్రెక్ విజయవంతంగా ముగించండి,’ అని వారికి ఉపశమన వాక్యాలు చెప్పాం.
వారికి ధైర్యమయితే చెప్పామే కానీ నా మనసు వికలమై పోయింది. ఇలాంటి సంఘటనలు ఒక చోట ఆగవు. అసలు ఇజ్రాయెల్ సమస్య అంటేనే శతాబ్దాలుగా చల్లారని రావణకాష్టం. పదే పదే పేలగల అగ్ని పర్వతం. నిన్నటి మారణహోమం మరిన్ని దాడులకూ మరణాలకూ దారి తీయడం ఖాయం అనిపించింది. చివరికి ఏడాదిపాటుగా అదే జరుగుతోంది.
ఒక ఎగుడుబాటలో కష్టపడి నడిచాక అందరం గున్‌సంగ్ అన్న గ్రామం చేరుకున్నాం. మెరిసిపోయే, రాజసం ఉట్టి పడే గంగపూర్ణ శిఖరం ఆ గ్రామానికి నేపథ్యదృశ్యంగా నిలచి కనిపించింది. ఆ తర్వాత అందరం 4000 మీటర్ల ఎత్తున ఉన్న యాక్-ఖార్కా అన్న గ్రామం వేపు సాగాం. ఆ గ్రామం చేరడమూ అంటే మా యాత్రలో మరో ముఖ్యమైన మైలురాయి చేరుకోవడం అన్నమాట. పేరుకు తగ్గట్టుగానే ఆ గ్రామంలో అనేక జడలబర్రెలు పచ్చిక మేస్తూ కనిపించాయి. ఆ ఊళ్ళో భోజనం చేసి ఆనాటి మా గమ్యం, లేడర్ గ్రామం వేపు నడక సాగించాం.
4000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నపుడు నిద్ర కరువవడం, ఆకలి మందగించడం సామాన్యంగా తటస్థపడే సమస్యలు. మా బృందంలోని సభ్యులందరూ ఏదో ఒక స్థాయిలో, ఆ రోజు ఆ సమస్యలు ఎదుర్కొన్నారు. నాలాంటి కొద్దిమంది మాత్రం వాటి బారిన పడలేదు.
బాగా ఎత్తుకు చేరినపుడు మనకు ఎదురయ్యే మరో ఇబ్బంది – ఎముకలు కొరికే చలి. లేడర్‌లో మాకు లభించిన వసతి మరీ మరీ ప్రాథమికమైనది. టాయ్‌లెట్లు పేరుకు మాత్రమే ఉన్నాయి. షవర్లన్న మాట మర్చిపోవలసిన ప్రదేశమది. కనీస సౌకర్యాలు కూడా అనంత విలాసాలుగా తోచే అసలు సిసలు నిర్జనప్రాంతమది. ఏ సౌకర్యమూ మనం అనునిత్యం అనుకొనే మన జన్మహక్కు కాదు అన్న ప్రాథమిక సత్యం మనలో ఇంకడానికి, మంచుకొండల మధ్య ఉన్నత శ్రేణులు చేరుకొని ఒకటి రెండు రోజులు గడిపితే సరిపోతుంది. ఆ ఎరుక మనలో మౌలికమైన మార్పుకు కారణభూతమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. మనల్ని మనం నేలమీద నిలబెట్టి కాపాడుకోవడానికి అలాంటి మార్పు ఎంతైనా అవసరం. మన మూలాలనూ, ప్రకృతిలో భాగమైపోయి బ్రతికే పద్ధతినీ ఇలాంటి అనుభవాలు మనకు పునఃపరిచయం చేస్తాయి. భోజనం దగ్గరికి వస్తే, రోజూ ఒకే రకమైన తిండి దొరికే ప్రాంతాల్లో మేము మాతో తెచ్చుకున్న ఘాటు ఘాటు పచ్చళ్లు నోరు చవి తప్పకుండా కాపాడాయని చెప్పాలి. ఇహ పోషకపదార్థాలూ అంటే, ముందే చెప్పుకున్నట్టు మేము క్రమం తప్పకుండా తినే దాల్‌భాత్, దానితోబాటు అక్కడక్కడా లభించే గుడ్లు, ఆమ్లెట్లు, చపాతీలు, టిబెటన్ బ్రెడ్డు, కాఫీ, టీ – ఓహ్, మేమూ భాగ్యవంతులమే! ఆ రాత్రి పెందరాళే భోజనం ముగించి, బాబు చెప్పిన మర్నాటి కార్యక్రమాలు విని, ‘హమ్మో, రేపు చాలా పెద్ద కార్యక్రమమే ఉంది,’ అని గుండెలమీద చేతులు వేసుకుని అందరం నిద్రకుపక్రమించాం.
ఆనాడు అంతా కలసి ఆరు గంటలసేపు పధ్నాలుగు కిలోమీటర్లు నడిచాం. ఏకంగా 710 మీటర్లు ఎత్తు గడించాం. కొండల్లో లెక్క ప్రకారం ఏదైనా రోజున 500 మీటర్లు దాటి ఎత్తుకు చేరుకుంటే, అక్కడ ఒక రోజు ఎక్లమటైజేషన్ కోసం ఆగడం అవసరం. కానీ అది అన్నిసార్లూ సాధ్యం కాదు. ట్రెక్‌లో మా ఆరవరోజు మాకు విరామదినం కాదు – అధిక పరిశ్రమ చెయ్యవలసిన దినం!!
అక్టోబర్ తొమ్మిదో తారీఖు. ప్రయాణంలో తొమ్మిదో రోజు. 4880 మీటర్ల ఎత్తున ఉన్న ‘థోరోంగ్ ఫేడీ హై క్యాంప్’ అన్నది ఆనాటి మా లక్ష్యం. ఎత్తయితే దాదాపు ఐదువేల మీటర్లు ఉందిగానీ లేడర్ నుంచి థోరోంగ్ ఫేడీ మరీ అంత దూరం కాదు – ఎనిమిది కిలోమీటర్లు; ఐదు గంటలు. అందులో ఆరు కిలోమీటర్ల దూరం – లేడర్‌నుంచి థోరోంగ్ ఫేడీ వరకూ, అంతగా ఎత్తుపల్లాలు లేని మార్గం. అంతా కలసి 170 మీటర్లు మాత్రమే ఎత్తు పెరుగుతుంది. అంచేత ఆ ఆరు కిలోమీటర్లూ మహా అయితే మూడు నాలుగు గంటల్లో అధిగమించవచ్చు. కానీ థోరోంగ్ ఫేడీనుంచి మా ఆనాటి చివరి బిందువు, హై క్యాంప్‌కు, దూరం ఒకటిన్నర కిలోమీటర్లే అయినా, దాన్ని దాటడానికి గంటన్నర పట్టేస్తుంది – 460 మీటర్ల ఎత్తు ఎక్కాలి మరి!
ఎత్తులు పల్లాల దృష్ట్యా లేడర్ – థోరోంగ్ ఫేడీ మార్గం సరళం అనిపించినా ఒకసారి నడవటం మొదలెట్టాక ఆ మార్గంలో మేము ఊహించని క్లిష్టత ఉందని అర్థమయింది. దారంతా గులకరాళ్ళు, మెత్తని మట్టి, వదులుగా అలుముకుని ఉన్న రాళ్ళ ముక్కల సమూహాలు – వాటికి తోడు నిడుపాటి కొండచరియలు! ఇంత గొప్ప మేళవింపు పుణ్యమా అని ఆ ప్రాంతంలో లాండ్‌స్లయిడ్‌లు అనునిత్యం సంభవిస్తూనే ఉంటాయట. దానికి తగ్గట్టు కొన్నిచోట్ల కాలిబాట ఎంతో ఇరుగ్గా ఉంది. ఎంతో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయవలసి వచ్చింది. అదంతా దాటిన తర్వాత, ‘దారి కాస్త పరీక్ష పెట్టినమాట నిజమే కానీ మరీ అంత ప్రమాదకరం కాదు,’ అనుకున్నాను. కానీ ఆ దారిన తరచూ నడిచే మా గైడ్‌లూ, షెర్పాలూ మాకన్నా రెట్టింపు జాగ్రత్తతో నడిచారు. మమ్మల్ని పదే పదే జాగ్రత్త అని హెచ్చరించారు. ‘వారు అలా ఆ జాగ్రత్తపడడం ఎంతైనా అవసరం’ అని మాకు మెల్లగా అర్థమయింది.
దూరాన ఉన్న నీలిగొర్రెల జాడ బాబు కంటపడింది – మాకూ వాటిని చూపించాడు. కొండలూ బండల మధ్య వాటి ఉనికిని తెలుసుకోవడం మామూలు కళ్ళకి అంత సులభం కాదు – బాగా తర్ఫీదు పొందిన కళ్ళకే అది సాధ్యం. బాబు వాటి గురించి చెప్పాక అటు చూసి, కదలికల ద్వారా వాటి ఉనికిని పసిగట్టాం. ఈ నీలి గొర్రెలు 4000 మీటర్లు దాటిన ఎత్తు ఉన్న ప్రదేశాలలోనే, కొండచరియల దగ్గర కనిపిస్తాయట.
‘అంతరించిపోతున్న జంతుజాలానికి చెందిన ఈ నీలి గొర్రెలను ఇలా చూడటం బాగానే ఉంటుందిగానీ ఆ కొండ చరియల్లో వాటి కదలికల పుణ్యమా అని లాండ్‌స్లయిడ్లు జరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది,’ అని ప్రేమ్ షాహి అన్న మా గైడ్ ఒకతను వ్యాఖ్యానించాడు. అతను అన్న మాట నిజమేననిపించింది. ఏది ఏమైనా ఇలాంటి అరుదైన జంతువులను వాటి సహజ ఆవరణలో చూడగలగడం మా అందరికీ సంతోషం కలిగించింది.
ఎక్కడో ఉన్నత పర్వత శ్రేణుల్లో మనిషి కంటపడకుండా తమ మానాన తాము బ్రతికే ఈ నీలిగొర్రెలు ప్రశాంతంగా ఉంటాయా అంటే అదీ లేదట! వీటిని వెంటాడి, వేధించి, వేటాడడానికి మంచు చిరుతపులులు ఎప్పుడూ పొంచి ఉంటాయట. ఆ మంచు చిరుతలు కూడా ఈ నీలిగొర్రెలలానే 4000 మీటర్లకు ఎగువ సీమలలోనే ఉంటాయి. ఆ మాట విన్నాక మంచుచిరుతల మీద డేవిడ్ అటెన్‌బరో తీసిన డాక్యుమెంటరీ ఒకటి గుర్తొచ్చింది. ఆ డాక్యుమెంటరీలో ఆ చిరుతపులులు ఈ నీలిగొర్రెలను నిడుపాటి కొండచరియల్లో వేటాడే విధానం చూపించారు.
థోరోంగ్ ఫేడీ చేరుకొనే ముందు ఆకాశంలో తిరుగాడుతోన్న గద్దల్లాంటి పక్షుల్ని చూసాం. ‘అవి గ్రిఫిన్ రాబందులు,’ అని వివరించాడు బాబు గురంగ్. అంతరించిపోతోన్న పక్షి జాతుల్లో ఇదీ ఒకటట.
మొట్టమొదట్లో అనుకున్న ప్రకారం ఆనాటి రాత్రి మేమంతా థోరోంగ్ ఫేడీలో బస చెయ్యాలి. థోరోంగ్ లా కనుమను లక్ష్యంగా పెట్టుకొనేవాళ్ళలో అత్యధిక శాతం అదే పని చేస్తారు. అక్కడ బస చేసి మర్నాటి ఉదయం రెండింటికల్లా కనుమకేసి నడవడం ఆరంభిస్తారు. కానీ ఆ ప్రదేశంలో మరో చోట బస చేసే అవకాశం ఉంది. మరో గంటన్నరా రెండు గంటల దూరంలో, సముద్రతలానికి 4880 మీటర్ల ఎత్తున హై క్యాంప్ అన్న మరో వసతి ప్రదేశం ఉంది (థోరోంగ్ ఫేడీని ‘లో క్యాంప్’ అని కూడా వ్యవహరిస్తారు). ఏకంగా ఆ హై క్యాంప్‌కే చేరుకుని ఆ రాత్రి అక్కడ ఉండగలిగితే మర్నాటి కష్టతరమైన నడకలో కొంత భాగం ముందుగానే ముగించవచ్చు. ఈ విషయం సూర్య శ్రేష్టతోనూ, బాబూ గురంగ్‌తోనూ కార్యక్రమ రూపకల్పన దశలోనే ఎంతో వివరంగా చర్చించాక మేమంతా హై క్యాంప్ చేరుకోవడం అన్ని విధాలా సబబు అని తేలింది. అదే నిర్ణయించాం. హై క్యాంప్‌లో ఉండటంవల్ల మరింత చలికి గురి అవడం, నిద్రపోవడం మరింత కష్టమవడంలాంటి అసౌకర్యాలు ఉన్నా, మొత్తం మీద చూస్తే అదే సరైన పని అనిపించింది.
థోరోంగ్ ఫేడీలో స్నాక్సూ తేనీరూ తీసుకున్న తర్వాత ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన, 460 మీటర్లు ఎగువన ఉన్న హై క్యాంప్ కేసి సాగిపోయాం. దారంతా అనుకున్నట్టుగానే రాతినేల. ఎగుడు మార్గం. రెండు గంటలు పట్టేసింది. పళ్ళ బిగువున నడవవలసి వచ్చింది. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ, మన గమ్యం మరెంతో దూరం లేదు అని ప్రోత్సహించుకుంటూ హై క్యాంప్ వేపు సాగాం. కొన్నికొన్ని చోట్ల కాళ్ళతోపాటు చేతుల్ని కూడా నేలమీద మోపి ఆ రాతి నేలలను అధిగమించవలసి వచ్చింది. ఒక్కసారి దూరాన హై క్యాంప్ కనపడగానే అప్పటిదాకా పడిన శ్రమనంతా మర్చిపోయి చకచకా హై క్యాంప్ చేరుకున్నాం. సంబరమే సంబరం.
ఆ రోజు అంతా కలసి తొమ్మిది కిలోమీటర్లు నడిచాం. ఆరుగంటలు పట్టేసింది.
కష్టమైనా ఇష్టమైన పనిగాబట్టి అందరం పట్టు విడవకుండా హై క్యాంప్ చేరాం. బావుంది. సంబరపడుతున్నాం – నిజమే, సంబరపడవలసిన విషయమే. కానీ మా లగేజ్ అంతా మోసుకుని వచ్చి ఓ పక్కన సేదదీరుతోన్న మా పోర్టర్లను చూడగానే నా మనసులోని సంబరం స్థానాన్ని అంతులేని ఆలోచన ఆక్రమించింది.
ఒక్కొక్కరూ 30 కేజీల బరువు మోసుకుని వచ్చారు. కష్టమనకుండా, ఇష్టమన్న మాటకే అవకాశం లేకపోయినా మా అందరి బరువులనూ తమ వీపులకెత్తి తీసుకువచ్చారు. నిజమే, అది వాళ్ళ వృత్తి. ఉపాధి. కానీ వాళ్ళూ మనలాంటి మనుషులే. ఒక్కొక్కరూ ఇద్దరిద్దరు ట్రెకర్ల పన్నెండు పన్నెండు కిలోల డఫెల్ బ్యాగులు మోసుకొచ్చారు. వాటితోపాటు వారి వారి సామాన్లూ మోసుకుని వచ్చారు. అసలు ఈ పోర్టర్ల సాయమే లేకపోతే మాలాంటి నవనాగరికులం ఇలాంటి ప్రదేశాలలో ఒక్క అడుగైనా వేయగలమా? అసాధ్యం. పోర్టర్లంటూ లేకపోతే రోజుల తరబడి సాగే ఇలాంటి ట్రెకింగుల గురించి ఆలోచించనయినా ఆలోచించలేం.
ఇంత చేసినా, మనతోపాటు నీడల్లా మనల్ని అనుసరించినా, వాళ్ళు మన కంటికి కనపడరు. విందామంటే వినపడరు. వాళ్ళ ఉనికే మనకు పట్టదు. రాత్రి బసకు చేరగానే మన డఫెల్ బ్యాగ్ ఎక్కడుందో వెతుక్కుంటాం. బసలో ఉన్నంతసేపూ అందులోని వస్తువులు వాడుకుంటాం. మర్నాడు నడక ఆరంభించే ముందు ఆ బ్యాగులు మళ్ళా సర్ది వదిలిపెడతాం. అవి మరునాటి బసకు చేరి తీరతాయని తెలుసు. ఏదేనీ కారణం వల్ల అవి చేరడం కాస్తంత ఆలస్యమయితే చిరాకు పడతాం. మన బ్యాగులు తీసుకువచ్చిన దేవదూతలు ఎవరో, ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో, ఏం తింటారో – అవేం మనకు పట్టవు. గైడ్‌లయితే మనతోనే ఉంటారు. మనతోనే భోంచేస్తారు. మరి పోర్టర్లు? ఎంతో అరుదుగా తప్ప మన కంటబడరు. కాస్తంత మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళు మనకందించే ‘సేవ’ అమూల్యం అని బోధపడుతుంది. అలాంటి వాళ్ళ విషయంలో కాస్తంత స్నేహంగా ఉండటం, నిర్దేశించిన బరువుకన్నా ఎక్కువగా బ్యాగుల్లో నింపకపోవడం, అవకాశం వచ్చినపుడు పిడికిలి విప్పి టిప్పులు ఇవ్వడం – ఇవీ మన కనీసపు కర్తవ్యాలు.
థోరోంగ్ హై క్యాంప్ లాడ్జ్‌లో అంతా కలసి 100మందికి వసతి సౌకర్యం ఉంది. కాస్తంత ఇరుకిరుకుగా ఉన్నా, వందమందికి ఆశ్రయం దొరకడమన్నది ఖాయం. థోరోంగ్ హై క్యాంప్ దాకా వెళదామా, లేకపోతే థోరోంగ్ ఫేడీలోనే ఉండిపోదామా అని ముందు ఏనాడో ఆలోచించాంగానీ హై క్యాంప్ చేరాక, ఇక్కడిదాకా రావడమే ఖచ్చితంగా మంచి పని అని బోధపడింది. ఈరోజు థోరోంగ్ ఫేడీలోనే ఉండిపోతే, మర్నాటి ఉదయం రెండింటికే నడక మొదలెట్టి మూడునాలుగు గంటలపాటు ఆ నిర్జన హిమపర్వతసీమలో హెడ్‌లైట్ల కాంతిలో దారికోసం తడుముకుంటూ తిరుగాడవలసి వచ్చేది. ఇపుడు కాస్తంత తీరికగా నాలుగింటికి బయల్దేరవచ్చు.
ఆడవాళ్ళందరికీ డార్మిటరీ హాలు కేటాయించారు. కాస్త ఇరుకైనా వాళ్ళు సర్దుకుపోయారు. మగవాళ్ళకు గదులు – గదికి నలుగురునుంచి ఆరుగురు దాకా – అవీ ఇరుకైన గదులే – అయినా సర్దుకున్నాం.
ఇంకా కాస్తంత వెలుగు మిగిలే ఉంది. చీకటి కమ్మేలోపల దగ్గర్లో ఉన్న ఓ చిన్న కొండ ఎక్కి రావడానికి అందరం బయల్దేరాం. సూర్యాస్తమయంలోపే చేరుకోగలిగాం. గొప్ప దృశ్యాలు. చులు వెస్ట్, పుంకర్ హిమల్, పుర్బంగ్ హిమల్, గంగపూర్ణ శిఖరాలు మేఘావరణాలను దాటుకుని నిలబడి సంధ్యాసమయపు సూర్యకాంతిలో వెలిగిపోతూ మమ్మల్ని పలకరించాయి.
ఆ కొండ ఎక్కడమూ అంటే 5000 మీటర్ల ఎత్తుకు చేరుకోవడం అన్నమాట. అంటే యూరప్‌లోకెల్లా ఎత్తైన మాంట్ బ్లాంక్ శిఖరంకన్నా రెండువందల మీటర్లు ఎగువకు చేరడమన్నమాట. మాలో చాలామందికి ఈ ఉన్నత పర్వతసీమలో వేసే ప్రతి అడుగూ వారిని వ్యక్తిగతంగా మరింత మరింత ఎత్తుకు తీసుకువెళ్ళి గగనపథాన నిలిపే ముందడుగే. అదో థ్రిల్లింత.
గగనపథపు థ్రిల్లింత సంగతి ఎలా ఉన్నా వైద్యపరంగా 8000 అడుగుల ఎత్తును దాటితే ఆ ప్రాంతాన్ని హై ఆల్టిట్యూడ్‌గా పరిగణించడం కద్దు. అంటే ఆ పరిధిని దాటి రెట్టింపు ఎత్తుకు మేమంతా చేరుకున్నామన్నమాట. సహజంగానే గాలి పలచన అవడం, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, తల తేలిగ్గా ఉండటం, తలనొప్పి – ఈ లక్షణాలన్నీ అందరిలోనూ ఏదో ఒక మోతాదులో పొడసూపాయి. ఆక్సిజన్ స్థాయి చూసుకుంటే 75 శాతంనుంచి 85 శాతం వరకూ మాత్రమే ఉంది. అయినా ఒక్కరైనా నిస్సహాయ స్థితికి చేరుకోకపోవడమన్నది మా బృందానికి గొప్ప ఉపశమనం కలిగించింది. కాకపోతే రాత్రి నిద్ర పోయినప్పుడు చాలామంది నిద్రరాక కష్టపడ్డారు. ప్రదేశపు ఎత్తువల్ల నిద్ర కరువవడమన్నది వారికి స్పష్టంగా అనుభవమయింది.
5000 మీటర్ల ఎత్తుకు చేరేసరికి చెట్టూ చేమా పూర్తిగా అదృశ్యమయిపోయి ఎటు చూసినా ఎడారిలా అనిపించినా, పక్షులూ జంతువులకు మాత్రం కొదవ లేదు. మేమున్న హై క్యాంప్ ప్రాంతంలో తెలుపూ బూడిదరంగు మచ్చలతో ఉన్న పది పన్నెండు పక్షులు మేతకోసం వెదుకులాడుకుంటూ కనిపించాయి. పేర్లు తెలియకపోయినా చిరపరిచితమే అనిపించాయి. పరిమాణంలో పావురాలకన్నా పెద్దగానూ కోడిపెట్టలకన్నా చిన్నగానూ ఉన్నాయి. వాటిల్ని టిబెటన్ స్నోకాక్‌లు అంటారట. మొత్తానికి ఒకే రోజులో నీలి గొర్రెలు చూసాం. గ్రిఫిన్ రాబందులు చూసాం. ఇదిగో ఇపుడు టిబెటన్ స్నోకాక్‌లు చూసాం. మంచుచిరుత దర్శనంకూడా అయితే ఎంత బావుండేదో అనిపించింది.
చెట్లూచేమల విషయానికి వస్తే వాటిలోని వైవిధ్యం రోజురోజుకూ మారుతూ కనిపించింది. రెండువేల మీటర్ల ఎత్తుకన్నా దిగువన ఉన్న ధారాపానీలో కనిపించిన వృక్షాలు వేరు. మూడువేల మూడువందల మీటర్ల ఎత్తున ఉన్న పిసాంగ్‌లో కనిపించిన వృక్షాలు వేరు. 4250 మీటర్ల లేడర్‌లో కనిపించిన పొదలూ తుప్పలూ వేరు – ఎప్పుడైతే 4500 మీటర్ల ఎత్తును దాటామో ఆ తర్వాత చెట్లూ చేమలూ అన్న ప్రసక్తే లేదు. 4800 మీటర్ల థోరోంగ్ ఫేడీ అయితే ఎడారితో సమానం.
డిన్నర్ సమయంలో బాబు గురంగ్ మర్నాటి ప్రణాళిక గురించి వివరించాడు. ‘మొత్తం ట్రెక్‌లోకెల్లా రేపు ఎంతో కీలకమైన రోజు’ అన్న విషయం నొక్కి వక్కాణించాడు. రేపటి వాతావరణం నిర్మలంగా ఉండబోతోంది అంటూ ఖాట్మండూ నుంచి అందిన శుభవార్త అందరితోనూ పంచుకున్నాడు. ‘ఇంతదూరం ఇంత క్షేమంగా అధిగమించిన మన బృందం రేపు తప్పకుండా మరింత ఉన్నతశ్రేణికి చేరి తీరుతుంది అన్న విషయంలో నాకేమీ సందేహం లేదు,’ అంటూ నేను కూడా అందరిలో నమ్మకం నింపే ప్రయత్నం చేసాను. ‘పెందరాళే నిద్రపోయి, ‘అవును – మనం సాధించగలం’ అన్న పాజిటివ్ ధోరణిలో అందరం రేపు సాగిపోదాం’ అంటూ ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నం చేసాను.
సమావేశం ముగిశాక అందరం మా ఇరుకిరుకు పడకగదుల్లోకి వెళ్ళాం. ఏడాదినుంచీ ఏర్పాట్లు చేసుకుని సమాయత్తమవుతోన్న అన్నపూర్ణ ట్రెక్‌ను విజయవంతం చేసే రోజు చేరువకు వచ్చేసింది అన్న విషయం అందరిలోనూ పట్టుదలనూ ఏకాగ్రతనూ నింపింది.
అక్టోబర్ 10. ప్రయాణం మొదలెట్టి తొమ్మిది రోజులు గడిచిపోయాయి. శిఖర బిందువు థోరోంగ్ లా పాస్ దాటుకుని, ఏకబిగిన దాదాపు 3000 మీటర్లు దిగువకు సాగి ముక్తినాథ్ క్షేత్రం చేరుకొనే రోజు. యాత్ర మొత్తానికి అతి ముఖ్యమైన రోజు ఈ అక్టోబర్ 10. 5895 మీటర్ల కిలిమంజారో శిఖరం ఎక్కడం, 4169 మీటర్ల మౌంట్ తుబ్‌కల్ శిఖరాగ్రాన నిలవడం, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకోవడం – అక్కడి 5644 మీటర్ల కాలాపత్థర్ కొండ ఎక్కడం – ఆ కోవకు చెందిన విజయసాధన, ఈ 5416 మీటర్ల థోరోంగ్ లా కనుమను అధిగమించడం.
అంతా ఉదయం మూడున్నరకే పక్క వదిలి, ఉదకబెట్టిన కోడిగుడ్లు, వేడి వేడి కాఫీలతో బ్రేక్‌ఫాస్ట్ ముగించి నాలుగున్నరకల్లా మా హెడ్‌ల్యాంప్‌లు వెలిగించుకుని చీకట్లను చీల్చుకుంటూ నడక ఆరంభించాం. అనుకొన్నట్టే శ్రుతి మించిన చలి – పొరలుపొరలుగా దుస్తులు ధరించి, మెడ తొడుగులు తొడుక్కుని, ఒకటికి రెండు జతల మేజోళ్లు వేసుకుని, తలకు ఉన్ని టోపీ, చేతులకు గ్లవ్స్ పెట్టుకుని, ఉన్నత హిమాలయ శ్రేణుల్లో తిరుగాడే ఔత్సాహిక పర్వతారోహకులు ఎలా ఉంటారో అలా తయారయ్యాం. గైడింగ్ తాళ్ళూ, పికాక్సులు మాత్రమే తక్కువ. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా చలి ‘నేనున్నాను, నేనున్నాను’ అని హెచ్చరించడం మానలేదు.
అంత బిగుసుకుపోయే చలిలోనూ మాలోని ఎవరో, “పైకి చూడండి, ఆకాశం ఎంత బావుందో,” అన్నారు. నిజమే. మేఘాల జాడే లేని నిర్మలమైన ఆకాశం. చుక్కలు మామూలుకన్నా రెట్టింపు కాంతితో మెరుస్తున్నాయి. వెదకనవసరం లేకుండానే పాలపుంత స్పష్టంగా దర్శనమిచ్చింది. ఆకాశం అన్నన్ని తారలను భరించలేదేమో, ఏ క్షణానయినా కొన్ని తారలు రాలి పడతాయేమో అనిపించింది. ‘చుక్కల మోజులో పడి ఆగకండి, పదండి ముందుకు,’ అంటూ బాబు గురంగ్ హెచ్చరిస్తూ వచ్చాడు. కాసేపట్లో థోరోంగ్ హై క్యాంప్ కనుమరుగయింది.
చిక్కని చీకటిలోంచి తారల చిరువెలుగుల సాయంతో తమ ఆకృతులు లీలగా ప్రదర్శిస్తూ పరిసరాల్లోని హిమశిఖరాలు మాకేసి తొంగి చూడసాగాయి. అదో అధివాస్తవిక చిత్రంలా అనిపించింది.
ట్రెకర్లమంతా చిన్న చిన్న బృందాలుగా విడివడి హెడ్‌లైట్ల సాయంతో మా ఉనికిని చాటుకుంటూ నడవసాగాం. గడ్డ కట్టించే చలికి తోడుగా శీతల వాయువులు. ఈ వాతావరణాన్ని కాచుకుని దాటుకోగలమా అనిపించింది. కానీ కాసేపు అలా నడిచాక మా శరీరాలు వెచ్చదనాన్ని సంతరించుకున్నాయి. మెలమెల్లగా చలికి అలవాటు పడిపోసాగాయి.
మరి కాసేపట్లో సూర్యోదయం అవబోతోంది అన్న ఎరుక మా అందరిలోనూ కాస్తంత ఉత్సాహం నింపింది. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగాం. 5000 మీటర్ల ఎత్తున ఎత్తుపల్లాలను దాటుకుంటూ నడవడం అంటే మాటలు కాదు. వేసే ప్రతి అడుగూ అదనపు సంకల్పశక్తిని కోరే సమయమది. ప్రతి నాలుగు అడుగులకూ ఒకసారి ఆగి, గుక్కతిప్పుకుని ముందుకు సాగవలసి వచ్చే సమయమది. ఎంత అనుభవం ఉన్న ట్రెకర్లయినా ఆచి తూచి అడుగులు వేసే ప్రాంతమది. ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ – దాన్ని PO2 అంటారు – 5000 మీటర్ల ఎత్తులో 50శాతం మాత్రమే ఉంటుంది. అంటే మామూలుతో పోలిస్తే అక్కడ మనకు అందే ఆక్సిజన్ సగానికి సగం కోత పడుతుందన్న మాట. మరి అలాంటి చోట అడుగు వేయాలంటే శరీరానికి అదనపు ఆక్సిజన్ కావాలి. కానీ ఉన్నదేమో సగానికి సగం! ఇదొక విలోమ విరోధాభాస సమయం!!
సూర్యోదయపు వెలుగులు పరిసరాలను నింపడం మొదలెట్టాయి. ఆ ప్రాంతపు హిమశిఖరాలన్నీ ఆ వెలుగులను తమలో నింపుకుంటూ అర్ధవలయాకారంలో మా ముందు నిలబడి కనువిందు చేసాయి. వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా బాబూ గురంగ్ మాకు పరిచయం చేసాడు – మూడవ అన్నపూర్ణ శిఖరం, గంగపూర్ణ, చులు మాసిఫ్, పుర్కుంగ్, పుతున్ హిమల్, అన్నీ ఘనమైన శిఖరాలే. ప్రతి ఒక్కటీ 6000 మీటర్లను మించిన ఎత్తున్న శిఖరాలే.
సూర్యుని కిరణాలు మాలో కొత్త జీవం నింపాయి. ఉదయం ఆరున్నర సమయం. వాతావరణం నిముషనిముషానికీ అనుకూలంగా మారసాగింది. సూరీడు, తన వెచ్చని ఉనికిని ప్రకటించడం మొదలెట్టాడు. 5000 మీటర్ల ఎత్తున ఉండే చలి ఎప్పట్లానే తన పని తాను చేసుకుపోతున్నా, పరిసరాల్లో వెచ్చదనం నింపుతోన్న సూరీడు, వెలుగు నింపుతోన్న సూరీడు మాలో కాస్తంత చలిని భరించే శక్తిని కూడా నింపసాగాడు.
ఎగుడు దోవ. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే ప్రాణాలు పట్టుకుపోయే ప్రదేశమది. అలాంటి సమయంలో దూరాన ఏదో కట్టడం కనిపించింది. అది నిజంగా కట్టడమేనా, మేమేమన్నా భ్రమ పడుతున్నామా అన్న అనుమానం కలిగింది. రేషమ్ అనే మా గైడ్ ‘అది కట్టడమే. థోరోంగ్ లా ప్రాంతాన ఉన్న ఒకే ఒక్క టీ హౌస్ అది,’ అని నిర్ధారించాడు. అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. ‘మరీ ఆశపడకండి. పేరుకు తగినట్టుగా అక్కడ టీ మాత్రమే దొరుకుతుంది’ అని నవ్వాడు రేషమ్. అది చాలు. కాసేపు ఆగి టీ తాగడంకన్నా ఆ క్షణాన, ఆ ప్రాంతాన మరో విలాసం ఉంటుందా?! ఎక్కణ్నించో పుట్టుకొచ్చిన కొత్త శక్తితో ఆ కట్టడంకేసి అడుగులు వేసాం.
5000 మీటర్ల ఎత్తున ఉన్న ఆ అపురూపమైన టీ దుకాణంలో చుక్కచుక్కనూ ఆస్వాదిస్తూ అందరం టీ తాగాం. ఖాట్మాండూలో పాతిక రూపాయలకు దొరికే టీ ఇక్కడ నాలుగు వందలట. అయితే అయింది – అందులో ప్రతి పైసా సార్థకమయినట్లే. అలాంటి చోట్ల కప్పులో ఉన్న తేనీటికన్నా అది దొరికే ప్రదేశం వెలకట్టలేనిది కదా. ఏదేమైనా అక్కడ ఆగటం, వేడి వేడి టీ తాగడం – నవయవ్వనం ప్రాప్తించినట్టయింది. ఆ గడ్డకట్టే చలిలో ఒక్క కప్పు టీ అమృతంలా పని చేసి శరీరానికి అంత సత్తువ అందిస్తుంది అని ఎవరైనా చెపితే నమ్మేవాడిని కాదేమో! కొన్ని కొన్ని వాస్తవాలు ఊహలూ కల్పనలకన్నా వింతగా శక్తివంతంగా ఉంటాయి మరి!
ఆ తేనీటి దుకాణాన్ని యకల్లా-థోరోంగ్ టీ హౌస్ అంటారట. అప్పటి దాకా వేడి వేడి టీ తాగిన హుషారులో ఉన్న నాకు, ఆ టీ హౌస్ పేరు వినగానే, సరిగ్గా పదేళ్ళ క్రితం అదే టీ హౌస్ ప్రాంతంలో సంభవించిన విషాద ఘటనలు గుర్తుకువచ్చాయి. 2014, అక్టోబర్ 14 అన్నది నేపాల్ ట్రెకింగ్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు అన్న సంగతి గుర్తుకువచ్చింది. థోరోంగ్ లా పాస్ ప్రాంతంలో మంచుతుఫాను విరుచుకు పడి దేశదేశాలనుంచి వచ్చిన ట్రెకర్ల ప్రాణాలు బలి తీసుకున్న రోజు. అలా ఆ రోజు చనిపోయిన 43 మందిలో నేపాలీ గైడ్లూ పోర్టర్లూ కూడా ఉన్నారు.
ఇక్కడ జరిగిన విలయానికి మూలాలు ఎక్కడో భారతదేశపు తూర్పు తీరపు నగరం విశాఖపట్నంలో ఉన్నాయంటే నమ్మడం కష్టం. 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుఫాను విశాఖపట్నం దగ్గర నేలను తాకి మొత్తం నగరం నగరమంతటినీ జలవాయుప్రళయంలో ముంచెత్తిన సంగతి తెలుగువారికి బాగా గుర్తుండే ఉంటుంది. అక్కడ నేలను తాకిన ఆ తుఫాను అక్కడితో ఆగకుండా భారతదేశపు తూర్పు తీరమంతా తన ధ్వంసకాండను కొనసాగించింది. హిమాలయాల చలిగాలులతో మిళితమై, దేశాల హద్దులు దాటుకుని నేపాల్‌దాకా గాలివానగా విస్తరించింది.
ఆనాటి ఉదయం థోరోంగ్ హై క్యాంప్‌లో ఇరవై ముప్ఫై సెంటీమీటర్ల మంచు పడిందట. అయినా ఆకాశం తేటగా ఉండటం చూసి ఈ మంచు పడటమన్నది తాత్కాలిక అపశ్రుతి మాత్రమే అని భ్రమించి ట్రెకర్లంతా థోరోంగ్ లా పాస్ వేపు సాగి పోయారట. అప్పట్లో వాతావరణం గురించి నిర్దుష్ట సమాచారం అందించే వ్యవస్థ లేదు. రాబోతున్న ఉపద్రవం గురించి ఎవరికీ ఏ మాత్రం తెలియనే తెలియదు.
తూర్పునుంచి పశ్చిమానికి వీస్తున్న కొసగాలి – టెయిల్ విండ్, ట్రెకర్లకు ఊహకు మించిన ‘సానుకూలత’ను సృష్టించింది. వడివడిగా సాగేలా చేసింది. కాసేపటికల్లా ఆ సానుకూలత శ్రుతి మించింది. అంత గాలిలో వెనక్కు తిరిగే అవకాశమూ లేదు – ఎదురుగాలి బలంగా ఉంది. ఈలోగా పరిసరాల్లో మసక కమ్మేసింది. తుఫాను ఉధృతి పెరిగింది.
చేరువలోనున్న థోరోంగ్ లా కనుమ ఒక నాజిల్‌లాగా పనిచేసి గాలులు మరింత మరింత బలంగా వీయడానికి దారితీసింది. ఉన్నతశిఖరాల నడుమ తిరుగాడే గాలులన్నీ తూర్పు-పడమర దిశలో ఆ కనుమగుండా అవతలి వేపుకు సాగిపోయే ప్రయత్నం చేసాయి. గాలి ఉధృతి విపరీతంగా పెరిగింది. కనుమ కాస్తా సొరంగంలా పని చేసింది. గాలీ చలీ కలగలిసి మైనస్ ఏభై డిగ్రీల వాతావరణాన్ని – విండ్‌చిల్ ఫాక్టర్ని సృష్టించాయి.
ఆ దారుణవాతావరణంలో ట్రెకర్లకు ఆనాడు కాస్తంతయినా రక్షణ ఇవ్వగల కట్టడం ఇపుడు మేము ఆగిన టీ హౌస్ మాత్రమే. ఆ పన్నెండు కిలోమీటర్ల కనుమ దారిలో మరింకో కట్టడమన్నది లేనేలేదు. ఇహ చెట్లు, తల దాచుకొనే నీడ సంగతి చెప్పక్కర్లేదు. అక్కడకు చేరిన ప్రతి మనిషీ ప్రకృతికి దాసోహం అనవలసి వచ్చిన సమయమది. ఆనాటి ప్రకృతి ప్రకోపం కనీ వినీ ఎరుగనిది. వెరసి ఈ టీ హౌస్, శరణుకోరి వచ్చిన ట్రెకర్లతో క్రిక్కిరిసి పోయిందట. క్షణాల్లో రెండు మీటర్ల మంచు కురిసిందట. దానికి తోడు దృశ్యమానత – విజిబిలిటీ, దాదాపు శూన్యం. కనుమ దారి అంతా మంచు కప్పు కింద ఉండిపోయింది. దారి చూపించడానికి పాతిన గైడింగ్ పోల్స్ మంచులో కప్పడిపోయాయి. ఎంతోమంది దిక్కుతోచక దారి తప్పి ఎటెటో వెళ్ళిపోయారు. కొంతమంది మంచు అగడ్తలకు బలి అయ్యారు. మరికొంతమంది కొండచరియలనుంచి జారిపడిన హిమపాతాలలో సజీవసమాధి అయ్యారు. ఎటు చూసినా మృత్యుసంకేతాల గాలుల విలయం. అది ప్రళయం. అది విషాద మరణం. అది నిస్సహాయ నిర్వేదం.
ఆ దుర్భరస్థితిలో మొబైళ్ళు పని చెయ్యలేదు. కరెంట్ ఎలానూ లేదు. మనాంగ్‌లో ఉన్న అధికారులకు ఈ కనుమ దగ్గర జరుగుతోన్న ప్రకృతి విలయం గురించి తెలియడానికి బాగా సమయం పట్టింది. సమాచారం అందినా వారు రావడం, సహాయకచర్యలు అందించడం వెంటనే జరిగే అవకాశం లేని పరిస్థితి. ఆ మంచుతుఫానులో హెలికాప్టర్లు వచ్చి కాపాడటమన్న ప్రసక్తే లేదు.
కనుమ ఇవతల టీ హౌస్ వేపు ఉన్నవారిది ఒక దుస్థితి అయితే, కనుమను దాటి ముక్తినాథ్ వేపు దిగుతోన్న వారిది మరింత దారుణమైన పరిస్థితి. మామూలుగానే ఈ పర్వతసీమల్లో ఎక్కడంకన్నా దిగడం కష్టం. మంచు మేటలు అన్నివేపులా నిండిపోయిన స్థితిలో వారిలో కొంతమంది అతి శీతలానికి -– హైపోథెర్మియాకు గురైపోయారు. అసలే 5000 మీటర్ల ఎత్తు –- ఆ పైన మంచుతుఫాను. డానికి తగ్గట్టు ట్రెకర్లలో చాలామంది ఒక్కరోజులో ముక్తినాథ్ చేరిపోతాం గదా అన్న ఆలోచనతో, చలిలో ఎక్కువ సమయం గడపడానికి సన్నద్ధమై రాలేదు. అందుకు అవసరమయిన అదనపు చలి దుస్తులూ ఇతర పరికరాలూ తెచ్చుకోలేదు.
వాతావరణం మెరుగైన వెంటనే నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. ఎంతో చురుగ్గా సహాయకచర్యలు చేపట్టింది. రక్షణ బృందాలను నెలకొల్పింది. హెలికాప్టర్లను రప్పించింది. అంతా కలసి 500 ప్రాణాలు కాపాడగలిగింది. కానీ 43మంది ప్రాణాలు హిమార్పణం అవనే అయ్యాయి. సహాయక కార్యక్రమాలు చేపట్టిన రక్షణ బృందాలలోని వారు కూడా ఫ్రాస్ట్‌బైట్‌లాంటి సమస్యలకు గురి అయ్యారు. రక్షింపబడినవారిలో కొంతమంది అనేక కారణాలవల్ల థోరోంగ్ లా కనుమ ప్రాంతం లోనే 72గంటలు గడపవలసి వచ్చింది.
ఇలాంటివి జరిగినపుడు పర్వతాలలో వాతావరణం ఎంత చంచలంగా ఉంటుందో, క్షణాల్లో పరిస్థితి ఎంత దారుణంగా మారగలదో బోధపడుతుంది. మానవుడు సాధించిన సాంకేతిక ప్రగతి ప్రకృతి ప్రకోపం ముందు ఎంత నిస్సహాయంగా స్తబ్ధమైపోతుందో అర్థమవుతుంది. వీటితో పోలిస్తే నాలుగు రోజుల క్రితం రోజంతా ధారాపానీనుంచి ఛామె దాకా మేమంతా వర్షంలో నడవటమన్నది చిన్నపిల్లల బొమ్మలాట కాదూ?!
ఆ అక్టోబర్ ఉత్పాతం తర్వాత నేపాల్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. సమాచారవ్యవస్థను మరింత పటిష్టం చేసింది. జీపీఎస్ సదుపాయంతో కూడిన ట్రావెల్ గైడ్లు ట్రెకింగ్ బృందాలతోపాటు కలసి నడిచేలా చూసింది. థోరోంగ్ లా కనుమలాంటి ప్రదేశాలలో ఎమర్జెన్సీ షెల్టర్లు నిర్మించింది. ట్రెకింగ్ మార్గాల్లో తిరుగాడేవారికి వాతావరణ సూచనలు, హెచ్చరికలు సకాలంలో అందే వ్యవస్థను రూపొందించింది.
మాతోపాటు వస్తోన్న రేషమ్ అన్న గైడ్, ఇప్పటివరకూ తను థోరోంగ్ లా కనుమకు ఎన్నెన్నోసార్లు వెళ్ళాననీ, విపరీత వాతావరణ పరిస్థితుల్లో దాన్ని పదేపదే దాటాననీ, పెనుగాలులూ అకాలహిమపాతాలూ చవిచూసాననీ, కానీ అవేవీ 2014 అక్టోబర్ ఉత్పాతానికి సరితూగవనీ చెప్పుకొచ్చాడు. పైన చెప్పినట్టుగా ఇపుడు పరిస్థితులు బాగా మారాయి. రేషమ్‌లాంటి గైడ్‌లు అందరూ ఖాట్మండూలోని వాతావరణశాఖ అధికారులతో మాట్లాడి, పరిస్థితి అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే థోరోంగ్ లా వేపుకు దారి తీస్తారు. అంతర్జాతీయ ట్రెకర్ల విషయంలో లైసెన్సు ఉన్న గైడ్ తోడు లేకుండా థోరోంగ్ లా కనుమ వేపు వెళ్ళడం నిషిద్ధం. ‘ఈవేపు వచ్చిన ప్రతిసారీ 2014 అక్టోబర్ దారుణం నా కళ్ళముందు కనపడుతుంది. విషాదం కమ్ముకుంటుంది,’ అని వాపోయాడు రేషమ్.
రేషమ్ చెప్పినదంతా విన్న తర్వాత, అతను అనుభవిస్తోన్న వేదన నా మనసుకూ కాస్తంత సోకింది. ఈనాడు వాతావరణం ఇంత నిర్మలంగా, ఇంత అనుకూలంగా ఉండటం ఎంత అదృష్టం అనిపించింది. ఈ అనుకూల పరిస్థితులను మనసారా ఆస్వాదించాలి అన్న ఉత్సాహం, ఉత్తేజం మాలో కలిగాయి.
ఏదేమైనా ఈ 2014 అక్టోబర్ ఘటనగురించి నాకు ముందే అవగాహన ఉంది. ఆ వీడియోలు ఒకటికి రెండుసార్లు చూసాను. 5000 మీటర్లను రెండు మూడుసార్లు దాటిన అనుభవం ఉందిగాబట్టి ఆ పరిస్థితులలోని కాఠిన్యం నాకు తెలుసు. అంచేత మా బృందంలోని సభ్యులందరికీ –- ముఖ్యంగా కొత్తవారికి, ఈ విషయాలు పదేపదే చెప్పాను. హెచ్చరించాను. వాళ్లంతా ఆయా వీడియోలు చూసి వచ్చేలా చేసాను. మొన్నటిరోజున లేడర్ గ్రామంలో ఆగినపుడు కూడా ‘మీలో ఎవరికన్నా ముందుకు సాగటం విషయంలో ఎలాంటి సంకోచాలు ఉన్నా ఇప్పుడే చెప్పండి. బిడియానికి పోయి ముందుకు రాకండి. ఆగిపొండి,’ అని కూడా సూచించాను. ఒక్కరు కూడా ఆగలేదు. మా టీమ్‌లోని డాక్టర్ల బృందం అందరినీ పరీక్షించి క్లియర్ చేసింది. వారితో కలసి నాలుగయిదు రోజులు నడిచాక, వారిలో ఎవ్వరికీ ఆగిపోవలసిన అవసరం లేదన్న నమ్మకం నాకూ కలిగింది. అనుభవరాహిత్యంవల్ల కొత్తవారిలో కొంతమంది ఉన్ని దుస్తులు, చేతి తొడుగులులాంటివి తీసుకురావడంలో అలసత్వం చూపించారు. అవన్నీ కనిపెట్టి నడక ఆరంభించక ముందే సవరించుకునేలా చేసాం. వెరసి, ఇదిగో ఈ అక్టోబర్ 10 వ తారీఖున, 35మంది ఉన్న బృహత్ బృందం థోరోంగ్ లా కనుమకు చేరువలో ఉన్న టీ హౌస్‌లో, ఎపుడు కనుమ దాటుదామా అని ఎదురుచూస్తూ, తదుపరి అడుగులు వెయ్యడానికి ఉవ్విళ్ళూరుతోంది! ‘విజయీభవ,’ అనాలని నాకు అనిపించింది.
(సశేషం)