ఎందుకంత దూరం?

ఆగస్ట్ 14, 2015.

శ్రీధర్

ఘాట్ రోడ్డులో బస్ రొద ఆ మలుపుల్లో తగ్గుతూ పెరుగుతూ వుంది. చల్లగాలికి తెరలు తెరలుగా తలనొప్పి వస్తూంది. కళ్ళనుంచి కారుతున్న నీళ్ళు గాలికి చెదిరిపోతున్నాయి. అదృష్టం బాగుండి నా ప్రక్క సీట్లో ఎవరూ లేరు. నన్ను ఎవరైనా పరీక్షగా చూసినా ఎవరో మెకానిక్ అనుకోవాలని మట్టి, ఇంజనాయిలు బట్టలకి పూసుకున్నాను. టోపీని మొహం మీదకు లాక్కుని సీట్లో జారగిలబడి కూర్చున్నాను. ఈ రోడ్డులో పోలీసుల గస్తీ ఎక్కువగానే వుంటుంది. వాళ్ళు ఒకసారి చూసిన మొహాన్ని మర్చిపోరు. మొదటిసారి వాళ్ళకి చిక్కి ఏడేళ్ళయినా నాకు భయంగానే వుంటుంది ఎప్పుడేమవుతుందేమో అని. కానీ, అది ఈ రోజు మాత్రం కాకూడదు. నేను ఎలాగైనా సరే ఊరికి చేరాలి.

“బాగా దిగులు పడుతుంటుందిరా కృష్ణమ్మ నీ గురించి.”

తమ్ముడి మాటలు గుర్తొచ్చాయి. ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో నా గురించి మాట్లాడుతుందంట. నడవలేని తమ్ముడిని, రోగిష్టి అమ్మని గాలికొదిలేసి వచ్చాను. ఆమే వాడిని కాపాడుతోంది. ఎలా వచ్చానో అలా వాళ్ళని వదిలేసి!?

ఆమె మీద కోపం, ఉక్రోషం, నాకేం కావాలో నాకే తెలియనితనం. పారిపోయాను ఆమెకి దూరంగా… ఊబి లోకి… చేతకాని పనిని చేయలేక, ప్రతిక్షణమూ ఏడుస్తూ. ఇంత చదువుకున్న నాకు అది తప్పు పనన్న ఆలోచనే రాలేదు. తప్పని తెలిసే సరికే తప్పించుకోలేనంత ఇరుక్కుపోయాను. అమ్మ చనిపోయిందని తెలిసినా వెళ్ళలేదు. ఏదో కోపం నామీద నాకే, ఎవరి మీదో చెప్పలేని కసి.

బస్ మట్టిరోడ్డు మీదికొచ్చింది. ఇంకొక్క గంటలో ఊరు చేరతాను. వున్నట్టుండి వెన్నులోంచి చలి పుట్టి ఒళ్ళంతా వణికింది. ఆమెకేమయిందో!? ఆఖరి క్షణాల్లో ఉన్నట్లే చెప్పారు. ఆమె బతకాలి. బతకాలి.

మధ్యాహ్నం వాళ్ళు నా గది తలుపును తట్టినప్పుడు సగం నిద్రలో ఉన్నాను.

“శ్రీధరూ, కృష్ణమ్మకి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చేర్పించారంట, మీ తమ్ముడు ఫోన్ చేశాడు. చీకటి పడ్డాకే బయల్దేరమని పెద్దన్న నీకు చెప్పి రమ్మన్నాడు,” అన్నాడు రఘు.

వాడు చెప్పింది అర్థం కావడానికి చాలా సమయం పట్టింది కాని ఆమె పేరు వినగానే దిగ్గున లేచి కూర్చున్నాను.

“వెళ్ళేప్పుడు జాగ్రత్త అని చెప్పమన్నాడు అన్న. అడ్డరోడ్డు రంగమ్మ కొట్టు దగ్గరాగి మీ తమ్ముడికి ఫోన్ చేసి – వస్తున్నట్లు చెప్పు. నువ్వొస్తే ఆమె బతుకుద్దన్నట్లు చెప్తున్నాడు మీ తమ్ముడు.” వాడి మాటలకి గుండె గుబుక్కుమంది.

“ఆఁ” అన్నాను.

చీకట్లు ముసురుకున్న దాకా ఉగ్గబట్టుకుని కూర్చుని లేచెళ్ళి రంగమ్మ కొట్టు దగ్గర్నుండి ఫోన్ చేశాను.

“నేను చేసింది తప్పురా శీనా. ఆమెకి చెప్పాలిరా. నేనొస్తున్నానని చెప్పు.” నా గొంతు బొంగురు పోయింది.

“పొద్దున్నే వీలు చూసుకుని చెప్తానన్నాయ్, నువ్వొస్తే సంతోషంతో కొన్నాళ్ళు బ్రతుకుతుంది, భయపడక్కర్లా, నాకు నమ్మకముంది.”

మౌనంగా ఉన్నాను. ఎప్పడి మాదిరే ‘నా గురించి ఏమంటోందిరా?’ అని అడగాలని మాట నోటిదాకా వచ్చింది కాని మాట పెగల్లేదు. వాడే మళ్ళీ అన్నాడు.

“అన్నాయ్, నువ్వెందుకు భయపడుతున్నావన్నాయ్? తెలీక చేసిన తప్పు. ఆ సంగతి పోలీసోళ్ళకి చెబితే శిక్ష తగ్గిస్తారు. తర్వాత ఏదో పని చేసుకోని బ్రతకొచ్చు అంతేగాని వాళ్ళకి కనపడకుండా దాక్కుంటే ఎట్లా? అదే తప్పులో అలానే బతుకుతుంటే ఎట్లా? అని అంటానే ఉందిరా కృష్ణమ్మ. ‘నువ్వు ఫోన్ చేసి చెప్పు కృష్ణమ్మా, నువ్వు చెప్తే వస్తాడు’ అని చాలా సార్లు అడుక్కున్నానన్నాయ్. నువ్వు తిరిగొస్తే కానీ నీతో మాట్లాడ్డం మాత్రం చేయననేదిరా. చాలా మొండిపట్టే పట్టింది. ఆమె చెప్పిన మాట వినకుండా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావని కోపం.”

“అమ్మనీ, నిన్నూ వదిలి పెట్టి రావడం తప్పే కదరా. పొరపాటు చేశాను. పోలీసులకి లొంగి పోతానన్నానని కృష్ణమ్మకి చెప్పు. వస్తున్నానని చెప్పు.” నా గొంతు పూడుకుపోయింది.

“ఊరుకోన్నాయ్, మనకి అమ్మ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కృష్ణమ్మే నాకు అమ్మ. నాకిప్పుడు వొంట్లో కూడా బావుందిరా. గజ్జి పోయింది. కర్రపోటుతో నడుస్తున్నాను. తొందర్లోనే కర్ర కూడా అక్కర్లేదని చెప్తుంది కృష్ణమ్మ. ఆయమ్మ ఎంత ధైర్యం చెప్తుందో ప్రతిరోజూ.” వాడి గొంతులో ఉత్సాహం వచ్చింది.

“సరేలే, రాత్రి బస్‌కి బయల్దేరుతున్నానుగా. వచ్చాక మాట్లాడుకుందాం.”

బస్సు గుంతలో పడి వూగింది. డ్రైవర్ ఆవేశంగా రోడ్లనీ, గవర్నమెంట్ ఆఫీసర్లనీ, రోడ్లకు రాళ్ళడ్డం పెట్టే పోలీసుల్నీ బూతులు తిడుతున్నాడు. ముందు సీట్లల్లో కూర్చున్న వాళ్ళు అతనికి సపోర్టుగా మాట్లాడుతున్నారు.

“నువ్వు బాగా చదువుకో శ్రీధర్, ఇంటికి పెద్దకొడుకువి నువ్వు. తమ్ముడు చూస్తే రోగిష్టి. మీ అమ్మ సంగతి నీకు తెలుసు. ఆమెకి ఎప్పుడు ఏం ప్రమాదం వస్తుందో చెప్పలేము. నువ్వు బాగా చదువుకుంటేనే తమ్ముడినీ, అమ్మనీ బాగా చూసుకోగలవు,” అనేది కృష్ణమ్మ.

ఉద్యోగం లేదని చిరాకు ఒక వైపు. ఆమె నన్ను తనింట్లోకి రానియ్యకుండా నా ముఖం మీదే తలుపులు మూసేసిందని దిగులు మరో వైపు. ఆమెని అల్లరి చేశాను, ఆమె తోనే ఉండాలని, ఆమె మళ్ళీ మళ్ళీ కావాలనిపించి పిచ్చి పట్టినట్లయి ఆమెని ఎన్ని మాటలో అన్నాను. నేనట్లా మాట్లాడినా కూడా ఆమెకి నా మీద అంతే అభిమానం వుండింది. తను నాతో మాట్లాడకపోయినా తమ్ముడి చేత ఫోన్లు చేపిస్తూ నన్ను వచ్చేయమని అడిగిస్తూనే ఉంది. నా బాగోగులు తెలుసుకుంటూనే వుంది.

ఆమెకి ఈ పాపిష్టి జబ్బేందో? నేను చేసిన పాపం ఆమెను కుట్టికుడుపుతోందేమో! నాకు వెక్కిళ్ళు ఆగలేదు. భుజం మీద తువ్వాలు తీసి మొహం కప్పుకున్నాను.

బస్ ఇంకా మట్టిరోడ్డు మీదే ఉంది. దారినిండా గుంతలు. వాటిల్లో పడ్డప్పుడల్లా బస్ ఎగిరెగిరి పడుతోంది.

జూన్ 10, 1996.

కృష్ణమ్మ

రోడ్డుకి అవతల మట్టిలో కూలబడి తన పక్కన ఆడుకుంటున్న పిల్లలని ఆశగా చూస్తూ, అప్పుడప్పుడూ తన గజ్జి కాళ్ళని గీక్కుంటున్న అబ్బాయి బొమ్మని వేస్తున్నాను నా గది కిటికీలోంచి చూస్తూ. వాటర్ కలర్స్ కాకుండా ఆయిల్స్ ఎంచుకున్నాను ఈ బొమ్మ కోసం. ఈయన క్యాంపుకెళ్ళి నాలుగు రోజులవుతోంది. ఈ రోజు రావాలి. ఆయనుంటే పెయింటింగ్ పనే కుదరదు అదేమిటో…

“కిష్టమ్మా, పువ్వులు కోసేదా?” నరసమ్మ కేక పెద్దగా.

ఉలిక్కిపడి గడియారం వైపు చూశాను. సాయంత్రం ఐదవుతోంది. కుంచెని పాలెట్ మీద పెట్టేసి తలుపు తీసి బయటకి వచ్చాను. ఇంటి ముందున్న రేకుల పంచ లోంచి వడగాలి కొడుతోంది.

“ఐదయినా ఎండ పేల్చేస్తుంది నరసమ్మా!”

నన్ను చూసిన నరసమ్మ గేటు తీసుకుని లోపలకి వచ్చి నా వైపు చూసి నవ్వింది. “లోపలే ఉంటావుగా, బయటికొచ్చేలకి అట్టానే వుంటది మరి.”

సన్నజాజి కొమ్మ వంచి పూలు కోస్తూ, “అబ్బబ్బ, ఈ పిల్లల గోల చూడు కిష్టమ్మా, మద్దేన్నం పూట కాస్త కునుకు కూడా తియ్యనియ్యకుండా అరుస్తానే వుంటిరి,” అంది విసుగ్గా.

“ఈ పిల్లలు బడికి వెళ్ళకపోతే వాళ్ళమ్మానాన్నలు ఏమీ అనరా?” అన్నాను వాళ్ళనే చూస్తూ.

గజ్జిపిల్లవాడు నన్ను చూసి దేక్కుంటూ నా వైపు రాసాగాడు. వయసు పద్నాలుగు, పదిహేనేళ్ళుంటాయేమో కాని పోషణ లేక బక్కచిక్కి ఉన్నాడు. కళగల ముఖం కాని పాపం ఒళ్ళంతా అట్టగట్టుకు పోయినట్లు గజ్జి. కాళ్ళ దగ్గర గీక్కున్నచోట చర్మం చెదిరి ఎర్రగా ఉంది. ఆ పిల్లాడి కాళ్ళల్లోని శక్తిని గజ్జే లాగేసి ఉంటుంది. అందుకే నడవలేకపోతున్నాడు.

“ఆ శీదర గాడు పిల్లల్ని సెడగొడుతున్నాడు కిష్టమ్మా, పదో తరగతి ఎన్ని సార్లు రాపిచ్చినా పెయిలయిపోతన్నాడు. ఈ గజ్జి శీను వాడి తమ్ముడే,” పిల్లల్లో అందరికంటే పెద్దవాడి లాగా ఉన్న అబ్బాయిని చూపిస్తూ అంది. గజ్జిపిల్లాడు గేటు దగ్గరకొచ్చి పళ్ళికిలించాడు. నాకు నవ్వొచ్చింది వాడిని చూస్తే.

“నిన్న ఆడిని పిలిచి లడ్డు ఇస్తివిగా!ఇంకొదలడు కిష్టమ్మా నిన్ను,” అంది నరసమ్మ కూడా నవ్వుతూ. నేను వాడికి లడ్డు తెచ్చివ్వాలని లోపలకి వెళ్ళాను.

ఆ ఇంట్లో మా కొత్త కాపురం మొదలు పెట్టి మూడు నెలలవుతోంది. ఇంటికి వెనకనున్న పోర్షన్ మాది. మా పోర్షన్ ఎదురుగ్గా, రోడ్దుకి అవతల వరసగా ఇందిరమ్మ ఇళ్ళు. మా ఇంటి ఓనర్స్ ముందు వైపు పోర్షన్లో ఉంటారు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, ముందు పెద్ద గేటు, వెనుక చిన్న గేటు. చిన్న గేటు లోంచే మా రాకపోకలు. ఓనర్స్ – భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు. వాళ్ళిద్దరూ, ఈయనా ఉదయం వెళితే మళ్ళీ సాయంత్రమే వచ్చేది. నెలలో నాలుగు సార్లు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళుతుంటారు ఈయన. వెళితే రెండు రోజులగ్గాని రాడు.

పగలంతా అంత పెద్ద ఇంట్లో నేనొక్కదాన్నే. ఇందిరమ్మ ఇళ్ళల్లో వాళ్ళు, పిల్లలు, మా ఇంటి ఎదురుగ్గా ఉండే నరసమ్మ నాకు కాలక్షేపం. నరసమ్మ మా ఇంట్లో పనికి కూడా కుదురుకోవడంతో భయం లేకుండా హాయిగా ఉంది.

“ఒరేయ్, శీదరా! ఇటురారా, కిష్టమ్మ పిలుస్తంది ఇటురా.” కేకేసింది నరసమ్మ. నేను లడ్డు తెచ్చి ఇస్తుంటే శ్రీధర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తమ్ముడిని చూస్తూ ‘తీసుకోకూడదు’ అని కంటితో సైగలు చేశాడు. అన్ననేమీ పట్టించుకోకుండా ఆ పిల్లాడు నా చేతిలోంచి లడ్డుని తీసుకున్నాడు.

“యీడికి బడికెళ్ళమని చెప్పు కిష్టమ్మా, నువ్వు చెప్తే అన్నా యినుకుంటడేమో! పది పాసయిపోతే ఏదో ఒక కంపెనీలో అటెండర్ పని ఇప్పిస్తానని మా ఇంటాయన అంటన్నాడు. మేవెంత చెప్పినా యినడంలా.”

శ్రీధర్ వైపు పరీక్షగా చూశాను. ముచ్చటగా ఉన్నాడు.

“లెక్కలొక్కటే ఫెయిల్ అయిపోతున్నానండీ ఎన్ని సార్లు రాసినా…” అన్నాడు కళ్ళు చిట్లించి. పదిహేడు ఏళ్ళ కుర్రవాడు అలా అమాయకంగా అంటుంటే పాపం అనిపించింది.

“పోన్లే, ఈ సంవత్సరం మళ్ళీ పరీక్ష ఫీజు కట్టు. ప్రతిరోజూ సాయంత్రం ఈ టైమ్‌లో వచ్చి నా దగ్గర లెక్కలు నేర్చుకో, ఈజీగా పాసయిపోతావు.”

సరేనన్నట్లుగా తల ఊపాడు. వెళుతున్న అతన్ని ఆపి లోపలకెళ్ళి మరో లడ్దు తెచ్చి ఇవ్వబోయాను. అతను తీసుకోకుండా వద్దంటూ తల ఆడించి వెళ్ళిపోయాడు.

జులై 5, 1996.

ఉదయం పది అయినట్లుంది. పిల్లలు బయట అరుస్తూ ఆడుకుంటున్నారు. దేకుతున్న గజ్జి పిల్లాడిలోంచి ఆరోగ్యంగా అయి కర్ర సహాయంతో లేచి నిలబడుతున్న అదే అబ్బాయి రూపాంతరం అవుతున్నట్టుగా, నా బొమ్మ నాకే చాలా బాగా నచ్చింది.

శ్రీధర్‌ లెక్కలు చెప్పించుకోవడానికి రాలేదు. ‘నేను కూడా అతన్ని గురించి పూర్తిగా మర్చిపోయానేమిటో’ అనుకుంటూ నరసమ్మ కోసం చూశాను. బయట రేకుల పంచకి ప్రక్కగా ఉన్న నీళ్ళ తొట్టి దగ్గర బట్టలు ఉతుకుతోంది.

“శ్రీధర్ రానేలేదే నరసమ్మా, లెక్కలు చెప్పించుకోవడానికి వస్తానన్నాడు?!”

“ఇప్పుడే పట్టకొస్తా నుండమ్మా.”

మొదటి రోజు శ్రీధర్‌కి నా దగ్గరున్న నోట్‌బుక్‌లో లెక్కలు వేసి చేయమని ఇచ్చాను. కాసేపట్లోనే ఆ లెక్కలు వేసి ఇచ్చిన శ్రీధర్ చాలా తెలివైన వాడని గ్రహించాను. చాలా చురుగ్గా నేర్చుకుంటాడు ఏది చెప్పినా. కాకుంటే కాస్త ప్రేమగా చెప్పాలి, నిదానంగా.

మధ్యాహ్నం మిగిలిన అన్నం నరసమ్మ గిన్నెలో పెట్టుకుంటోంది. శ్రీధర్ అటే చూస్తున్నాడు. శీను దేక్కుంటూ వచ్చి గేటు దగ్గర కూర్చున్నాడు.

“పొద్దున ఏం టిఫిన్ తిన్నావ్ శ్రీధర్?”

“అయ్యో, కిష్టమ్మా! యీళ్ళ సంగతి నీకింకా తెలియలా. నిన్న మద్దేల నేను పెట్టిన నాలుగు ముద్దల అన్నమే. ఇంకా టిపిను కూడానా!? వాళ్ళమ్మ ఊరెమ్మట పడి పోయిందిగా. నాలుగు రోజులదాకా కనపడదింకా. నేను పన్జేసే ఇండ్లల్ల మిగిలిన అన్నం యారయినా ఇస్తే నేనే పెడతా. లేకపోతే పస్తే ఇద్దరు బిడ్డలకి. మద్దేలన్నానికైనా బడికి పోరా అంటే ఈ శీదర గాడు యినడు,” అంది నరసమ్మ.

“ఆఁ!”

అన్నదమ్ములిద్దరినీ చూస్తూ కాసేపు అలాగే నిశ్చేష్టనయ్యాను. బాధతో కడుపులో దేవినట్లయింది. నరసమ్మ తీసుకున్న అన్నంలో పచ్చడి కలిపి గబగబా ముద్దలు చేసి ఇద్దరికీ చెరి నాలుగు ముద్దలు గిన్నెల్లో పెట్టి ఇచ్చాను. ఆబగా తిన్నారు. తొట్టి దగ్గర గిన్నెలు కడిగి ఆ నీళ్ళే పట్టుకుని కడుపు నిండా తాగాడు శ్రీధర్.

వాళ్ళిద్దరినీ పంపించి వాళ్ళమ్మ గురించి నరసమ్మని అడిగాను. పిల్లల తండ్రి ఎవరో తెలియదు. తల్లి రోడ్డు మీద నిలబడి ఎవరో ఒకరిని పట్టుకుని డబ్బులు సంపాదిస్తుందట, ఒక్కోసారి ఏ లారీ వాళ్ళో, ఆటోలవాళ్ళో నాలుగు రోజులు తీసుకుపోతారట. నరసమ్మ చెప్తుంటే చాలా బాధేసింది. ‘పాపం’ అంటున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ “ఈమాట నీబోటోండ్లకి చెప్తే ‘చీ, చీ!’ అన్నోళ్ళే కాని ‘పాపం’ అంటున్నదాన్ని నిన్నొక్కదాన్నే చూస్తున్నా కిష్టమ్మా!” అంది నరసమ్మ.

వాళ్ళని నేనింక వదల్లేదు.

ఆగస్ట్ 15, 2003.

నరసమ్మ

పొద్దెక్కగానె కిష్టమ్మ ఇంటికి బోయినాను. ఆమె పడగ్గదిలో బొమ్మ ఏసుకుంటంటే శీదర ఆ బొమ్మని అప్పుడప్పుడూ చూస్తా ఆడనే కూర్చోని ఏదో రాసుకుంటన్నాడు. ఆన్నట్లా చూస్తంటే ఇంకా చూడబుద్దవతంది. నా కంటి ముందు పుట్టి పెరిగినోడు. గాలికి తిరిగేటోడు వాడు పది పాసయితే చాలు అనుకున్నా కాని ఆయమ్మ దయ వల్ల వాడు యింజినీరి దాకా సదువుకొచ్చాడు. వాడికి అదృష్టం అట్టొచ్చింది. ఇంక ఉద్దోగం దొరికినా, వాడి కష్టాలు తీరతయ్యి. అదేందో మరి ఎన్ని ఆపీసులకి తిరిగినా ఉద్దోగం దొరకడం లేదంట. ‘వస్తుందిలే తొందరపడితే ఎట్టా’ అంటంది కృష్ణమ్మ.

పని అయినాక ఆల్లున్న గదికాడికి పొయినా. జుట్టంతా బుజాల మీదేసుకొని, కిటికీలోంచి ఏందో చూస్తా నిలబడ్డ ఒక పిల్ల బొమ్మని గీస్తంది కిష్టమ్మ. బలే ఉంది ఆ పిల్ల.

“కిష్టమ్మా, నాపని అయిపోయింది. నే పోతున్నా.” పెద్దగా కేకేసి చెప్పి గేటు గడేసుకుంటా నేనొచ్చేశా.

శిరీషమ్మ ఇంట్లో, లలితమ్మ ఇంట్లో పని చేసుకోని చూస్కుందును గదా తాళంచేతులు కనపళ్ళే. కిష్టమ్మ ఇంట్లో మరిచిపోయుంటా. మళ్ళీ అటుకేసి పోయినా. మెల్లిగా పడగ్గది వైపు పోయినా. నేను గేటు తీసిన చప్పుడు కూడా వాళ్ళకి యినబడలా. ఇద్దరూ ఈ లోకంలో లేనట్టుండారు.

గబగబా ఎనక్కి నాలుగడుగులేసి గుమ్మం నుండే, అసలేమీ చూడనట్టే, ‘కిష్టమ్మా!’ అని పిలుస్తా వంటింటి కేసి పోయా. ఆయమ్మ గదిలోంచి మాట లేదు. ఏమీ తెలియనట్లు యాక్షాను చేస్తా, ‘తాళం మర్చిపోయా కిష్టమ్మా, ఇదిగో తీసుకుని పోతండా!’ అంటా కేకబెట్టి గేటు పెద్దగా చప్పుడు చేస్తా యేసి ఇంటికొచ్చి పడ్డా పరుగెత్తుకుంటా. గుండె గుబగుబలాడతావుంది. చూసింది తలచుకుంటంటే కాళ్ళు చేతులు వణికిపోతన్నట్లయి గడపలోనే కూలబడిపోతిని. ఏం చేసేది బగమంతుడా…

ఈ శీను గాడేడబ్బా, వాడెటు పోయుండాడు!? చూసొద్దామని లేచి మా గోడ మీదగా తొంగి చూశా. వాళ్ళింటి వాకిట్లో పడి నిద్రపోతన్నాడు. వీళ్ళమ్మ మళ్ళీ ఎక్కడికి పోయిందో ఏమో! ఎప్పుడైనా నాలుగైదు రోజులకొచ్చే మనిషి పది రోజులవుతున్నా రాలేదు. శీదరకీ, శీనుగాడికీ, ఇద్దరికీ కిష్టమ్మే అన్నం పెడతంది.

కిష్టమ్మ మంచిది. ఎట్ల జరిగిందో ఇది జరిగింది. తప్పు కాయి సామీ. ఈ సంగతి పొక్కనీయకు సామీ!’ అనుకుంటా లోపలకొచ్చి పొయ్యి వెలిగించాను. నా సూపు మాత్రం కిష్టమ్మ ఇంటేపే ఉంది. కాసేపటికి శీదర గాడు బయటికి వచ్చి వాళ్ళింట్లోకి పోయాడు. కిష్టమ్మ ఇంటి తలుపులు మూసేసుకున్నాది.

శీదర గాడికి సహాయం చేయమని కిష్టమ్మని అడగడం నా తప్పా సామీ! ఇట్లా జరిగిద్దని నేనెట్లనుకుంటాను. గుడ్డిదాన్ని కాకుంటే ఇద్దరికీ మద్దెన వయసు తేడా యెంతున్నాదేంది. ఒంటిగుంటారాయె రోజంతా కలిసి. సిన్మాల్ల సూడటంలా ఇట్టా జరిగేది?

తలూడిపోతంది సామీ, బగమంతుడా ఇప్పుడేమయిద్దో!? సారు క్యాంపు నుంచి ఇయ్యాళో, రేపో వస్తడు. ‘వస్తే ఏమయిద్దిగాని, నువు మాత్రం నోర్మూసుకోనుండు తల్లా,’ కడుపు అరిచి చెప్తంది.

జెండా పండగ చేసుకోని పిల్లలందరూ వచ్చారు.

“ఈరోజు క్రికెట్టు ఆడదామురా, కృష్ణమ్మ ఇంట్లో ఉన్నాడేమో శీదరన్నని పిలవండిరా” అంటన్నాడు ఎవరో… శీదర మాట వినపడగానే ఉడికిన అన్నాన్ని గబాల్న కిందికి దించి బయటకొచ్చి చూశా వాడొస్తాడేమో చూద్దామని.

“శీదరన్న ఇంట్లో నిదరపోతన్నాడురా. లేపుతుంటే లేవడంలా. మనమాడుకుందాం రాండి…” అంటన్నాడు బాగ్గెం కొడుకు గోపిగాడు.

ఆట మొదలయింది, అరుపులు వినపడుతున్నాయి. శీదర గాడు మాత్రం ఇంట్లోంచి బయటికి రాలేదు.

ఆగస్ట్ 15, 2015.

కృష్ణమ్మ

శీను కళ్ళ ద్వారా శ్రీధర్ వస్తున్నాడని తెలుస్తోంది. ఒక్కసారి చూడాలని ఉందనీ, రమ్మనీ ఎన్నిసార్లు అడిగినా రాలేదు. నేను అతన్ని తల్చుకున్నప్పుడల్లా గుండెలు పిండేసినట్లుంటుంది. ఆ బాధ ఇక పోయేది కాదు. అతను ఫోన్లో చాలా సార్లు శీనుకి చెప్పాడట. ఉద్యోగం దొరకలేదన్న చిరాకుతో ఇంట్లో నుంచి వెళ్ళానని. అది కూడా ఒక కారణం… నిజమే. కానీ అదొక్కటే కారణం కాదు. మూలుగుతూ ఎదని నొక్కుకున్నాను.

“ఏమయింది కృష్ణా, గుండెల్లో నొప్పిగా ఉందా?” ఆయన నా మీదకి వంగి అడుగుతున్నారు.

“ఏమీ లేదండీ. మీరు జాగ్రత్తగా ఉంటారుగా… మిమ్మల్ని వదిలి వెళుతున్నాను.”

ఆయన నా కన్నీళ్ళు తుడిచారు. మళ్ళీ శ్రీధర్ గురించిన ఆలోచనలు. వాడంటే నాకు జాలి. ఆ జాలే దగ్గర చేసింది. ఒంటరిగా వున్న ఇద్దరిని అలా దగ్గరకు చేర్చింది. అదేమీ పాపం అని నేను అనుకోలేదు. అనుకోకుండా జరిగిన ఒక తప్పు అనుకున్నాను. ఆ తప్పు కొనసాగించకూడదని అనుకున్నాను. అతనికీ అదే చెప్పడానికి ప్రయత్నించాను. ఆ సంఘటన జరిగాక నేను అతన్ని ఇంట్లోకి రానివ్వలేదు. అదే అతనికి మొదటి అనుభవం కావడం అతనిలో మార్పును తెచ్చింది. నా నిర్ణయం నాకు మనశ్శాంతిని ఇచ్చింది కాని అతను ఎంత చెప్పినా వినకుండా తన బాధ్యతలని మరిచి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడన్న ఆవేదన మాత్రం నన్ను పీడించడం మానలేదు.

“శీనేడండీ?” అన్నాను నీరసంగా.

ఆయన బైటికివెళ్ళి పిలిచారు. కర్రపోటేసుకుంటూ వాడు వచ్చి నా పక్కనే కూర్చున్నాడు.

నరసమ్మ

డాక్టరుబాబు వచ్చి కిష్టమ్మని చూసి పోయినాడు. కిష్టమ్మకి కడుపులో ఏందో కేన్సర్ అంట. ఈ మాయదారి రోగం మంచోళ్ళకే పెడతావేందయ్యా బగమంతుడా! ఆమె ప్రక్కనే సారు కూర్చోని వుండాడు. లేచి బైటకు పోయా. శీనుగాడు గది వాకిలి మెట్లమీద చీకట్లో కూర్చోనుండాడు.

“వచ్చేటోడు ఇంటిదాకా రాడట్రా శీనా? దా లోపలకి పోదాం,” అన్నా వాడి పక్కనే కూలబడతా. వాడు దిగులుగా నా వైపు చూశాడు. కిష్టమ్మ తనకి బిడ్దలు లేరని ఏనాడూ మనాది పడలా. శీనుగాడినే తన బిడ్డ మాదిరి పెంచుకుంది.

“శీనూ, కృష్ణ పిలుస్తోంది, రా!” సారు బైటికొచ్చి చెప్పినాడు. గబాలమని లేచి లోపలకు పోతిమి.

కర్రపోటేసుకుంటూ దగ్గరికొస్తన్న వాడినే చూస్తా వుండింది కిష్టమ్మ. ఆ యమ్మ మనసులో ఏమనుకుంటాందో నాకు తెలిసినట్లే అయింది.

“ఇంకాసేపట్లో అన్నాయొస్తాడు కృష్ణమ్మా! వచ్చి ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాడంట… నన్ను చూసుకుంటాడు, నువ్వు నా గురించి దిగులు పెట్టుకోబాక!” ఆమె చెయ్యి పట్టుకుని అన్నాడు శీను.

కిష్టమ్మా చిన్నగా నవ్వింది. ఆయమ్మ కళ్ళు మూతలు పడిపోయినాయి. సారు డాక్టరుబాబు కోసం పెద్దగా కేక పెట్టినాడు. నాకు ఏడుపు ఆగలేదు. శీను కూడా తలని మంచం పట్టెకి ఆనించుకుని పెద్దగా ఏడ్చేసినాడు.

శ్రీధర్

అదాటుగా బస్సు ఎవరో ఆపినట్లు ఊగి ఆగింది. ఉలిక్కిపడి లేచి తలెత్తి చూశాను. హెడ్‌లైట్లలో రోడ్డు కడ్డంగా పోలీసు వ్యాను.

టోపీని ముఖం మీదికి లాక్కుని జారగిలబడి కూర్చున్నాను.

“ఏయ్, నిన్నే, లే!” నా భుజం మీద లాఠీ. అప్పుడే నిద్రలోంచి లేచినట్లుగా ఉలిక్కిపడి వాళ్ళ వైపు చూశాను.

“లే, బస్ దిగు!” కాలర్ పట్టుకుని లేపాడు లాఠీతో కొట్టిన వాడు. లేచి నిలబడ్డాను. బస్సు లోంచి దింపి వ్యాన్ దగ్గరకు తీసుకుపోయారు. ఇనస్పెక్టర్ నాదగ్గరికొచ్చి మొహంలో మొహం పెట్టి చూసి పరిచయం ఉన్నోడిలా నవ్వాడు.

“ఏరా, ఈడు మనోడేనట్రా? ఈణ్ణెక్కడో చూసినట్టు లేదూ?”

పోలీసోళ్ళు నవ్వుతూ భుజం మీద గన్నులు సర్దుకున్నారు.

“సార్, సార్! అర్జెంటుగా వూరు పోవాలి సార్! మా వాళ్ళకి బాలేదు. చావుబతుకుల్లో వున్నారు, నన్నొదిలేయండి సార్. ఆఖరు సారి చూసుకుందామని పోతున్నా. నాకేం తెలీదు సార్!”

“అవునా? ఈ బస్ ఇంక ముందుకు పోదు గానీ, ఆ చెట్లకడ్డంపడి పరుగెత్తు. మీ వూరు ఇక్కడికి దగ్గరే. పోరా, పో! పరుగెత్తు! ఆఖరు చూపులు చూసుకో, పో!”

పోలీసొకడు టార్చ్ లైట్ చూపెట్టాడు అడవి వైపుగా. ఆ వెలుతురులో పరుగెత్తాను చెట్లలోకి. కళ్ళనిండా నవ్వుతూ కృష్ణమ్మ. అదే ఆఖరు గుర్తు నాకు.

రాధ మండువ

రచయిత రాధ మండువ గురించి: భర్త ఉద్యోగరీత్యా మద్రాస్ లో 4ఏళ్ళు, పూనాలో 4ఏళ్ళు, అమెరికాలో 9ఏళ్ళు ఉన్నారు. ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ఇద్దరూ తెలుగు టీచర్స్ గా పని చేస్తున్నారు. రాయడం 2013 మార్చి, ఏప్రిల్ లోనే మొదలు పెట్టిన వీరి కథలు సారంగ, వాకిలి, ఈమాట, భూమిక, ఆంధ్రజ్యోతి, సాక్షి, కౌముది, విపుల, తెలుగువెలుగు, చినుకు, పాలపిట్ట పత్రికలలో వచ్చాయి. బాలసాహిత్యం కూడా రాశారు. దాదాపు 30 కథలు కొత్తపల్లి పత్రికలో వచ్చాయి. ...