చిన్నప్పుడు, హైస్కూలులో చదువుకునే రోజుల్లో, పెద్ద పెద్ద మాటలు కంఠతా పట్టి, సహపాఠకులతో మాట్లాడేటప్పుడో, ఎవరికన్నా ఉత్తరాలు రాసేటప్పుడో, ఆ మాటలు వాడెయ్యటం గొప్పనుకునే రోజుల్లో, అదొకపనిగా ఇంగ్లీషు డిక్షనరీ చూస్తుండేవాడిని. కాలేజీకి వెళ్ళిన తరువాత తెలిసింది; వాడుకలో లేని మారుమూల మాటలు, పదుగురితో మాట్లాడేటప్పుడు, పదుగురికోసం రాసేటప్పుడూ వాడటం ఆరోగ్యకరం కాదని!
మా రోజుల్లో విద్యార్థులు వాడుకోటానికి తెలుగు నిఘంటువు లేదు. మా తెలుగు మేష్టారే నిఘంటువు, మా పాలిట పెన్నిధి. ఆయన ఉభయభాషాప్రవీణ, శతావధాని, కవీ కాబట్టి పుస్తకంలో ప్రతిపద్యానికీ ప్రతిపదార్థం చెప్పేవారు. మేము రాసేసుకొనేవాళ్ళం. ఇప్పుడనిపిస్తున్నది, ఆయనకి శబ్దమంజరి, ఆంధ్రభాషార్ణవము, ఆంధ్రనామసంగ్రహం కంఠతా వచ్చి వుండాలి. ఒకవేళ అటువంటి ‘నిఘంటువులు’ ఉన్నాయని ఎవరన్నా చెప్పినా, అవి అందుబాటులో ఉన్నా, మాకు వాటిని చదవడం రావాలి కదా! ఆ పుస్తకాలేవీ వచనంలో ఉండేవి కావు; పద్యాల్లో ఉండేవి. ఒక పద్యంలో పదాలకి అర్థం తెలుసుకోడానికి మరో పద్యం చదవడం రావాలికదా! అది అప్పుడు.
ఇంతకీ, అసలు విషయం చెప్పబోయే ముందు, తెలుగులో నిఘంటువుల చరిత్ర క్లుప్తంగా గుర్తు చేస్తాను. ఆకారాదిక్రమంలో వచనంలో తెలుగు నిఘంటువు అవసరం అని గుర్తించి, పరవస్తు చిన్నయసూరిగారు, బహుజనపల్లి సీతారామాచార్యులు గారూ ప్రయత్నించారు. ఆపని పూర్తికాలేదు. తరువాత సీతారామాచార్యులు గారు శ్రీ శబ్దరత్నాకరము పొందుపరిచారు. “పూర్వ నిఘంటువులకంటె నిది బహువిధముల మేలైనదనుటకు సందేహములేదు,” అని జయంతి రామయ్య పంతులు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ సంపుటం (1936) తొలిపలుకులో శబ్దరత్నాకరం గురించి రాశారు. “కానీ, ఈ నిఘంటువు సమగ్రమైన నిఘంటువు కాదు. ఇందులో అర్థాలకు ఇచ్చిన ఉదాహరణలు చాలా తక్కువ. అట్లాగే, సి. పి. బ్రౌన్ పొందుపరిచిన తెలుగు – ఇంగ్లీషు నిఘంటువు (ప్రథమ ముద్రణ ప్రతి) కూడా సమగ్రమైన నిఘంటువు కాదు. ఇందులోనూ ఉదాహరణలు చాలా తక్కువ,” అని కూడా రాశారు.
‘తెలుగు భాషలో ఉన్న శబ్దరూపాలని, అర్థ భేదాలనీ సప్రమాణంగా తెలుపునట్టి బృహన్నిఘంటువు’ అవసరాన్ని గుర్తించి, 1930 ప్రాంతంలో అందుకు కావలసిన ధనసహాయం పూర్తిగా తానే చేస్తానని ప్రతిజ్ఞ చేసి, ఆంధ్ర సాహిత్య పరిషత్తుని ఆ పనికి ప్రేరేపించినది పిఠాపురం రాజా శ్రీ సూర్యారావు. ఆయన సహాయానికి కృతజ్ఞతాసూచకంగా ఈ బృహన్నిఘంటువుకి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు అని పేరు పెట్టారు.
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మొదటి సంపుటం 1936లో విడుదలయ్యింది. 1949కి మొదటి నాలుగు సంపుటాలు, 5, 6, 7 సంపుటాలు 1957 లోను, ఆఖరిగా ఎనిమిదవ సంపుటం 1974 లోను విడుదలయ్యాయి. కారణాలు ఏమయితేనేం, సర్వ సమగ్రమైన తెలుగు నిఘంటువు ప్రచురించటానికి సుమారు నలభై సంవత్సరాలు పట్టింది! ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1979-82 మధ్య కాలంలో ఈ నిఘంటువుని పునర్ముద్రించారు. అదేదో మొక్కుబడికా అన్నట్టు, పూజల్లో ‘అక్షతాం సమర్పయామి’ అన్న ధోరణిలో 5000 కాపీలు మాత్రం పునర్ముద్రించారు. ఆ తరువాత మళ్ళీ అచ్చువేసినట్టుగా లేదు. మనకి ఉన్న ఈ ఒకే ఒక సమగ్రమైన నిఘంటువు ఈ రోజున మనకు దొరకదు. ఇది హాస్యాస్పదమే కాదు; అవమానకరం కూడాను!
ఈ నిఘంటువుని సంశోధన చేసి, పరిష్కరించి ప్రచురించాలని, వాడుకలో లేని మాటలని గుర్తించాలని, ఈ లోగా వాడుకలోకి వచ్చిన కొత్త తెలుగు పదాలని చేర్చాలని, వాటి వ్యుత్పత్తులు ఇచ్చి శబ్దసాధనకి అనుగుణంగా చెయ్యాలనీ, ఆధునీకరించి అందంగా అచ్చువెయ్యాలనీ, ఇలా రకరకాల సలహాలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ మంచి సలహాలే! ఇవికాక ఇంతకన్నా మంచి సలహాలు కూడా ఉండి ఉంటాయి. సందేహం లేదు. అయితే, ఈ నూతన ప్రచురణకి కావలసిన హంగామా అంతా ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో జరగాలి గదా! ఒకవేళ శ్రీకారం చుట్టి ఈ పని మొదలుపెట్టినా, మార్పులు చేర్పులన్నీ పూర్త య్యేటప్పటికీ కనీసం పది-పదిహేను సంవత్సరాలు పడుతుందంటే మీరు కాదనరనుకుంటాను.
అంటే, బహుశా 2020 – 2025 నాటికి కొత్త సూర్యరాయాంధ్ర నిఘంటువు (New and Improved) బయట పడవచ్చు. అదీ నమ్మకం లేదు.
అందుకని, ప్రస్తుతానికి ఉన్న నిఘంటువుని పునర్ముద్రించి అందుబాటులోకి తేవడం పాపం కాదు. అది అంత కష్టమైన పని కూడా కాదు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పనికూడా చెయ్యలేని స్థితిలో ఉంటే, తానా(TANA) – ఆటా (ATA) వంటి సాంస్కృ తిక సంస్థలు ఈ పనికి పూనుకోవడం అవసరమంటాను. బ్రౌన్ నిఘంటువు (ఐతే, ఆన్లైన్ లో ఉన్నది ప్రథమ ముద్రణ ప్రతి కాదు. కుదించబడిన బ్రౌణ్యం)లాగానే, సూర్యరాయాంధ్ర నిఘంటువునునూ ఆన్లైన్లో ఉంచే ఏర్పాటు కూడా ఒక మంచిపనే.
ఇది, నా ఉచిత సలహా! మీరేమంటారు?