నాచన సోమన చతుర వచో విలాసం

చిన్నప్పుడు మనందరం direct speech, indirect speech గురించి చదువుకునే ఉంటాం. వీటిని తెలుగులో ప్రత్యక్ష అనుకృతి, పరోక్ష అనుకృతి అంటారు. సుబ్బారావు సుజాతని రమ్మని పిలిచాడు – ఇలా రాస్తే అది పరోక్ష అనుకృతి. దీన్ని ప్రత్యక్ష అనుకృతిలోకి ఎలా మార్చడం?

“సుజాతా రా”, అని సుబ్బారావు పిలిచాడు – ఇలా మారిస్తే వ్యాకరణరీత్యా సరిపోతుంది. అయితే దీన్ని రకరకాలుగా రాయవచ్చు.

“ఒసేయ్ సుజాతా ! ఇలా రా” అని సుబ్బారావు పిలిచాడు.

“సుజాతా! ఓసారిలా రావా” అని సుబ్బారావు పిలిచాడు.

“సుజాతగారూ! ఒకసారిక్కడి వస్తారా” అని సుబ్బారావు పిలిచాడు. ఇలా రకరకాల పిలుపులు. సుబ్బారావనే పాత్ర వ్యక్తిత్వం, సుబ్బారావు సుజాతల మధ్యనున్న సంబంధం, పిలిచే సందర్భం – ఇలా ఎన్ని విషయాలనైనా ఆ పిలుపులో ధ్వనించవచ్చు.

కథనం ప్రధానమైన శ్రవ్య కావ్యాలకీ, నాటకీయత ప్రధానమైన దృశ్య కావ్యాలకీ ఉన్న ఒక ముఖ్యమైన తేడా, సరిగ్గా ఇదే! పాత్రలని కళ్ళముందు కదిలించడమే కాకుండా సంభాషణల ద్వారా ఆయా పాత్రల స్వభావాలని, అంతరంగాలని ధ్వనింపజెయ్యడం నాటకీయత సాధించే మహత్తర ప్రయోజనం. సమర్థమైన సంభాషణల ద్వారా కవి తనని తాను మరుగుపరచుకొని పాత్రలని పాఠకులముందు నిలబెట్టగలుగుతాడు. ఇలాంటి నాటకీయతకి పెట్టింది పేరు తిక్కన్న. అందులోనూ విరాట, ఉద్యోగ పర్వాలు అయితే అచ్చమైన నాటకాలుగానే అనిపిస్తాయి. తిక్కన్న తర్వాత అంతగా చెప్పుకోదగ్గ కవి నాచన సోమన. ఎందుకో, ఈ వ్యాసంలో వివరించడానికి ప్రయత్నిస్తాను.

పాత్రలకి జీవం సంభాషణలు

పురాణ పాత్రలకి జీవం పోసి, వాటికొక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగించడానికి సోమన సంభాషణలని సమర్థవంతంగా వాడుకున్నాడు. రుక్మిణి కృష్ణుణ్ణి తనకొక కొడుకుని ప్రసాదించమని కోరుకునే సన్నివేశం దీనికొక మంచి ఉదాహరణ. ఆ సందర్భంలో రుక్మిణి కృష్ణునితో ఇలా అంటుంది:

అఖిల లోకైకనాథ! నీ యట్టి రూప
విక్ర మౌదార్య శౌర్య వివేక నిలయు
నొక కుమారుని దయజేసి యుర్విలోన
గడుపు చల్లని కాంతల గలుపు నన్ను

రుక్మిణి కోరుకుంటున్నది మామూలు కొడుకుని కాదు. రూపంలో, విక్రమంలో, ఔదార్యంలో, శౌర్యంలో, వివేకంలో శ్రీకృష్ణుడిని పోలే కొడుకుని! పైగా ‘కడుపు చల్లని కాంతల’లో తనని ఒకదానిగా చెయ్యమని ముద్దుగా కోరింది. ఇలా అడిగి ఊరుకుంటే అందులో పెద్ద నాటకీయత ఉండదు. పాత్ర సజీవమవ్వదు. అందుకే సోమన రుక్మిణి చేత మరొక రెండు మాటలు పలికించాడు:

మును రుక్మిణి తన్నడిగిన
దనుజాంతకుడే వరంబు దప్పక యిచ్చుం
దనయుని నడిగిన నీడని
జనులాడగ జెవులు నేడు సంకట పడవే

“ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే, ఇంతకుముందు రుక్మిణి ఏమడిగినా ఇచ్చే కృష్ణుడు, ఒక కొడుకునిమ్మంటే ఇవ్వలేదని జనాలు అనుకుంటారు. అలాటి మాటలు వినడానికి నా చెవులు బాధపడవా” – అని ముందరికాళ్ళకి బంధం వేస్తుంది. అక్కడితో ఆగకుండా,

కాచికొని కొడుకు నడిగెన
టే చనవున నాలు, మగడటే వరమిచ్చెన్!
జూచెద మను సవతులచే
నీ చులుకదనంబు చేరనీకుము కృష్ణా!

“సమయంచూసి భార్య ఒక కొడుకుని అడిగిందట, దానికా భర్త సరేనని వరమిచ్చాట్ట. ఇప్పుడేమిటవుతుందో చూద్దాం” అనుకునే సవతులముందు తను చులకనవ్వకుండా, తను కోరినదిమ్మని మరో నొక్కు నొక్కింది రుక్మిణి. ఇవి మానవ స్వభావ సహజమైన మాటలు. అయితే, కొడుకు కోసం భార్య ఇంతలా తన భర్తని అడగాల్సిన అవసరం ఏముంది అనే అనుమానం రావచ్చు. రుక్మిణి కృష్ణుని అడుగుతున్నది సామాన్యమైన కుమారుని కాదు. కృష్ణునివంటి కుమారుని, అంటే మారుని. మన్మథుడిని కొడుకుగా పొందడం అంత సులభం కాదు, దానికొక తిరకాసుంది. అదేమిటంటే శివుడు మన్మథుణ్ణి కాల్చి బూడిద చేసేశాడు. అతనికి తిరిగి రూపం కలగాలంటే శివుని అనుగ్రహం కావాలి. అది శ్రీకృష్ణుడు సంపాదించాలి. దానికీ ఒక పెద్ద తతంగం ఉంది. అందుకే రుక్మిణి కృష్ణుడిని అంతలా అడగటం. కృష్ణుడేమైనా తక్కువ తిన్నాడా! శృంగార కళాభిరాముడు గోముగా అడిగిన భార్యకి అంతకంటే ముద్దుగా సమాధానమిస్తాడు:

తన వలచు కాంత యే పని
మనమున దలచినను జేయు మగవానికి న
వ్వనిత బిగియారు కౌగిలి
దినదినమును మదన కామధేనువు గాదే

“తను ప్రేమించే భార్య కోరిక తీర్చే భర్తకి ఆ వనిత రోజూ ఇచ్చే బిగి కౌగిలి మదన కామధేనువే కదా”! ఈ సంభాషణలో సౌకుమార్యం ఉంది, శృంగారం ఉంది, చతురత ఉంది. మన్మధుని పుత్రునిగా పొందే సందర్భంలో ‘మదన కామధేనువు’ అన్న పదం ఎంతటి సాభిప్రాయమో గమనించండి!

సంభాషణల ద్వారా పాత్రల తారతమ్యం

సంభాషణల నిర్వహణ ద్వారా పాత్రల తారతమ్యాలని అతి సూక్ష్మంగా చిత్రీకరించడంలో సోమన సిద్ధహస్తుడు. శ్రీకృష్ణుడు శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించే సన్నివేశాలు మూడున్నాయి ఉత్తరహరివంశంలో. అవి ఒకటి నరకునితో, మరొకటి పౌండ్రకునితో, ఇంకొకటి హంసడిభకులతో. నరకునితో యుద్ధం చేసే సన్నివేశంలో శ్రీకృష్ణ నరకుల మధ్య ఎలాటి సంభాషణా పెట్టలేదు సోమన. ఇక్కడ నరకుడొక రాక్షసుడు, కృష్ణుడు నారాయణ స్వరూపుడు. కాబట్టి వారి మధ్య సంభాషణ అనవసరం. కానీ, కృష్ణుడు పౌండ్రకునితో యుద్ధం చేసేటప్పుడు వారిరువురి మధ్య చిన్న మాటల యుద్ధం జరుగుతుంది. పౌండ్రకుడు మూర్ఖుడు, వాచాలుడు కూడా. అందుకు వాడు కృష్ణుని కించపరుస్తూ ప్రేలాపనలు పేలుతాడు. దానికి కృష్ణుడు దీటుగా సమాధానం చెపుతాడు. హంసడిభకులతో చేసే యుద్ధంలో హంసడిభకులకి మాటలు లేవు. కృష్ణుడే హంసునిపై కోపంతో:

ఏమిర హంస! కంస నరకేంధన బంధుర మచ్ఛరానలం
బామిషముం గొనం గలదురా విడిపింపగ నిన్ను నేడు సం
గ్రామము చేసి నన్నడుగు కప్పము దర్పము నీకు నేల నా
నా ముని బాధలం గమరినాడవు కాలిన త్రాటి చందమై

అని అంటాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అచ్చమైన రాజు. తనని కప్పం కట్టమని అవమానించిన శత్రువుపై పగ తీర్చుకునే సందర్భం. అతని రాజసమంతా ఆ మాటల్లో ప్రతిధ్వనిస్తోంది.
ఇలా సంభాషణల్లో తేడా చూపటం ద్వారా, పాత్రల స్వభావాల్లోని తారతమ్యాన్ని స్పష్టంగా చిత్రించే నేర్పు ఉత్తరహరివంశంలో చాలా చోట్ల కనిపిస్తుంది. దీనికే మరొక చక్కని ఉదాహరణ నరకుడు చేసిన దుర్మార్గాన్ని కృష్ణునికి చెప్పుకోడానికి వచ్చిన మునుల మాటలు.

నారాయణ! నీ మన్నన
కారణముగ నేము బదరికావన భూమిం
జేరితిమి నరకు డిమ్మెయి
గారించెం దనకు జేటు గాలంబునకున్

నీతో చెప్పిన యంతకు
మా తలపులు దుఃఖ జలధి మగ్నంబులు గా
కాతల నా తల కేలా
దైతేయాంతకుడ వెల్ల తగవు దెలియవే!

నువ్వు ఆదరించడం వల్లనే మేము బదరికావనంలో ఉన్నాం అనడంలో, మా బాధలని తొలగించాల్సిన బాధ్యత నీదే అని చెప్పకనే చెప్పడం ఉంది. తనకి చేటు కాలం వచ్చింది కాబట్టే నరకుడిలా చేసాడనడంలో నరకుని పనిపట్టమన్న కోరిక దాగుంది. పైగా, “నీతో ఈ విషయం చెప్పేదాకా మా మనసులు దుఃఖంలో మునిగి ఉన్నాయి. నీకు మా బాధ చెప్పుకున్నాక మాకింక కంగారెందుకు. రాక్షస సంహారివి నీకు న్యాయం తెలీకుండా ఉంటుందా” అనడంలో ఎంతటి గడుసుదనం ఉంది!

ఈ సంభాషణంతా ఇలా ఎందుకు సాగింది? నరకుని సంహరించమని కృష్ణునికి స్వయంగా చెప్పే చనువు మునులకి లేదు. ఇక్కడున్నది భగవంతుడూ భక్తులూ కాదు. రాజు, అతని ఏలికలోని ప్రజలు. అందుకే వాళ్ళ మాటల్లో వినయం ఉంది, క్లుప్తత ఉంది, లౌక్యం ఉంది. మునుల బాధలు విన్న శ్రీకృష్ణుడు నరకునిపై కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఈ సన్నివేశం మొత్తం మీద కృష్ణుడు మాట్లాడింది ఒకే మాట “నరకుని జంపువాడ నందఱును జూడ” అని. ఒక చక్రవర్తి ఠీవి ఇక్కడ కనిపిస్తుంది. ఇలాటి సందర్భమే ఈ కావ్యంలో మరో చోట వస్తుంది. హంస డిభకులు దుర్వాసముని ఆశ్రమానికి వెళ్ళి, అతన్ని అవమానిస్తారు. ఆ విషయం కృష్ణునికి చెప్పడానికి తన శిష్యగణంతో వెళతాడు దుర్వాసుడు. దుర్వాస మహామునికి స్వాగతమిచ్చి చాలా అనునయ వాక్యాలని పలుకుతాడు శ్రీకృష్ణుడు. మీకేం కష్టం వచ్చిందని విచారిస్తాడు. అప్పుడు దుర్వాసుడిలా అంటాడు:

తగునే యింత మురాంతకా తలుపవే త్రైలోక్యముం గావ నీ
వు గదా దానవవైరివై పొడమి లావుం జేవయుం జూప రూ
పగు దైవంబు గదాధరుండ వఖిల వ్యాపారాపారంగ మా
ధ్వగ మావృత్త మెఱుంగనేర వన జిత్తం బుత్తలం బందదే

“ముల్లోకాలనీ రక్షించే వాడివి, రాక్షస సంహారివి, అఖిల వ్యాపారాలనీ నిర్వహించేవాడివి. మాకు వచ్చిన కష్టం గురించి నీకు తెలియకపోవడం తగునా, నువ్వలా అంటే నా మనసు కలత చెందదా!” అంటున్నాడు దుర్వాసుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు దైవ స్వరూపుడు. దుర్వాసాది మునులు అతని నిరంతరం స్మరించే భక్తులు. భగవంతుడు భక్తాధీనుడు.

హంసడిభకుల చేత నీ యతులు నేము
బడిన పాటులు వేర చెప్పంగనేల
కమలలోచన ముంజేతి కంకణమున
కద్దమేటికి నీ సొమ్ము లరయ రాదె

“హంస డిభకుల చేత మేము పొందిన పాట్లని వేరే చెప్పకరలేదు. ఇదిగో యీ మా వస్తువులని చూడు. ముంజేతి కంకణానికి అద్దమెందుకు” అనడంలో దుర్వాసుని అతిశయం ద్యోతకమవుతుంది.

నకట మోమోట లేక తా రంతజేసి
బ్రదికి పోయిరె! పులి పేదవడిన బసుల
వాండ్రె యెక్కాడి రను కత వచ్చె నాకు;
మునుల లోపల నాలుక ముల్లు విరిగె

“భయం ఏ కోశానా లేకుండా ఆ హంసడిభకులు అంతలేసి పనులు చేసి ఇంకా బతికున్నారంటే ఏ మనాలి? శక్తి హీనమైన పులిని పసువుల కాపర్లు కూడా వెక్కిరించారట! అలా అయ్యింది నాపని! మునుల కొండనాలుక ఈ నాడు విరిగిపోయింది. ” అని కూడా అంటాడు దుర్వాసుడు.

మాకేది దిక్కు దెరువో
లోకంబులు మూడు నింతలో నేమగునో
నీ కడు పట స్వరంబును
జేకొనవే దుష్ట శిక్ష చేసి మురారీ!

“మాకే ఇలా దిక్కు లేకపోతే, ఇక లోకమేమై పోతుందో!” అంటూ దుష్ట సంహారం చెయ్యమని సూటిగా చెప్తాడు. ఈ సంభాషణలో ఎక్కడా పైన చెప్పిన మునుల సంభాషణలోని లౌక్యంగాని, గడుసుదనంగాని, అణకువగాని లేవు. ఇక్కడ మాట్లాడుతున్నది దుర్వాసుడు. సహజంగా అతనికున్న ఔద్ధత్యం, భక్తునిగా శ్రీకృష్ణుని పైనున్న అధికారం, చనువు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా చెప్పిన దుర్వాసునితో కృష్ణుడు కూడా దానికి అనుగుణంగానే బదులిస్తాడు:

అనిన యతిం గనుంగొని మురాంతకు డిట్లను “దప్పు చేసితిం!
గినియకు మయ్య! మిమ్మొకడు కీడున బెట్టెడు వాడు లేడ యెం
దని పరికింపనైతి, విను మా ధరణీశ కుమార ధూర్తులం
దునిమెద నింతలో వగల దూలకు, సాత్యకి తోడు సంయమీ

హరుడు వరమిచ్చె వాణీ
వర వరుణ కుబేర సురప వైవస్వతు లి
త్తురు గాక నీవు గినిసిన
వరముల గిరములను బ్రదుకు వారే కుమతుల్”

ఇలా ఎంతో వినమ్రంగా మాట్లాడతాడు. హంసడిభకులని సంహరిస్తానని సాత్యకిపై ప్రమాణం కూడా చేస్తాడు! సాత్యకిపైనే ప్రమాణం చెయ్యడంలోని ఔచిత్యం తర్వాతి కథ చదివితే తెలుస్తుంది. “వరములు గిరములు వాళ్ళని బతికించ లేవు” అనడంలో తిరస్కారభావం ఎంతగా ధ్వనిస్తోందో గమనించండి.

ఊర్వశి మాటల చదరంగం

ఉత్తరహరివంశంలో సంభాషణలకి మకుటాయమానంగా వెలిగే సన్నివేశాలు రెండు. అందులో ఒకటి ఊర్వశీ నరకుల సంభాషణ. నరకుడు స్వర్గం మీదకి దండెత్తి దేవతలందరినీ తరిమేసి వాళ్ళ సంపదనంతా దోచుకుంటాడు. అతనికి ఊర్వశి అంటే కోరిక కలుగుతుంది. ఆమెని పిలిపించి తన కోరికనిలా బయటపెడతాడు:

నాకపురంబులో మెఱసి నందనకేళి జరించి దివ్యకాం
తా కర తాలవృంత సముదాయ సమీరము సోక రాజ్యముం
గైకొని నేడు దిగ్విజయ గౌరవ ధన్యుడ నైన నా సభన్
నీ కనుదోయి వెన్నెలలు నిండక కోర్కులు నాకు నిండునే

“ఎన్ని స్వర్గ సౌఖ్యాలని అనుభవించినా నీ కనుదోయి వెన్నెలలు లేకపోతే నాకు కోర్కెలు నిండుతాయా?” అని అనడంలో ఎంతో సౌకుమార్యం ధ్వనిస్తోంది.

అవె సుత్రామ రథంబు లల్లవె కుబేరానేకపశ్రేణు; ల
ల్లవె వార్ధీంద్రు తురంగమంబు; లవె ప్రేతాధీశ వీరావళుల్;
దవులం బారిన బట్టి తెచ్చి రనిలో దైతేయు లేసొమ్ము లిం
దువిదా నీకు ప్రియంబు? గైకొనుము నీ యుల్లంబు దెల్లంబుగన్

ఈ సంభాషణలో నరకుని మాటల నేర్పంతా కనిపిస్తుంది. దిక్పాలకుల ఐశ్వర్యాన్ని చూపించి, “ఇందులో నీకేవి ఇష్టమో వాటిని నిస్స్సంకోచంగా తీసుకో” అంటున్నాడు. ఇక్కడ తాను స్వయంగా కాక, తన సేనలు యుద్ధబూమిలో ఆ సొమ్ములని పట్టి తెచ్చారనడంలో ఉంది నరకుడి ఠీవి, దర్జా. ఇందులో తాను దిక్పాలకులను జయించానన్న విషయం వాచ్యంగా లేదు!

ఈ మాటల బట్టి నరకుడొక కాముకుడిలా కాక ప్రేమికుడిలా కనిపిస్తాడు. అతనికి ఊర్వశి మీదున్నది నిజంగానే ప్రేమా లేదా మాటల చాతుర్యాన్ని చూపిస్తున్నాడా? ఇప్పుడు నరకుడే స్వర్గానికి అధిపతి. తనని ఎలా అయినా లొంగదీసుకోగలడు. అప్పుడు తను చెయ్యగలిగేది ఏదీ లేదు. కాని నరకుడలా చెయ్యలేదు. కాబట్టి అతనినుండి తప్పించుకొనే అవకాశం ఉంది. కానీ, ఎలా? అతను తనపై ప్రేమని కురిపిస్తున్నాడు. కాదనడం ఎలా? ఇదంతా కొన్ని క్షణాలు ఆలోచిస్తుంది ఊర్వశి. అతడిని మంచి మాటలతో కాసేపు ఆడించాలనుకుంటుంది. అందుకే ఇలా అంటుంది :

చతుర వచో విలాస గుణసాగర! సాగర మేఖలావనీ
పతి యగు నీకు నింతులొక బ్రాతియె? నీవిటు గోరుటెల్ల నా
యతులిత భాగ్య; మింత నిజ; మైన గలంగక మున్న వైభవో
న్నతి మెఱయంగ వచ్చి యొక నాడయినన్ నను గారవించితే

ఇక్కడ ‘చతుర వచోవిలాస గుణసాగర’ అన్న సంబోధన పైకి అతన్ని పొగుడుతున్నట్టున్నా, అతను చూపించిందంతా నిజమైన ప్రేమ కాదు వట్టి వాక్చాతుర్యమే నన్న ఎత్తిపొడుపు కూడా ఉంది! “సమస్త భూమండలానికీ అధిపతివైన నీకు స్త్రీలొక లెక్కా? నువ్విలా నన్ను కోరడం నా అదృష్టం. ఇది నిజం!” అని పద్యంలో సగంపైగా అతని గొప్పతనాన్ని పొగిడి ఆ తర్వాత మెలిక పెడుతున్నది. “అయినా, ఇన్నాళ్ళల్లో ఒకనాడైనా వచ్చి నన్ను మన్నన చేసావా?” అని నిష్ఠూరమాడడంలో ‘అంటే నిజంగా నీది ప్రేమే అని నేనెలా నమ్ముతాను’ అన్న భావం నర్మగర్భంగా దాగుంది. ఇప్పుడా మొదట వేసిన విశేషణంలో, ‘నువ్వొట్టి మాటల మాయగాడివి’ అన్న అర్థం ధ్వనిస్తుంది. దీనికి నరకుడేమనగలడు?

నావుడు దానవేశ్వరుడు నవ్వుచు నూర్వశితోడ నిట్లనున్
నీవిటు దూర నేర్తు వని నేరమి పెట్టితి గాక యేను మీ
దేవతలున్న వీటి కరుదెంతునె మిండరికంబు చేతకై
లావున రాక వేరొక తలంపున వచ్చిన గీడు పుట్టదే?

నరకుని మాటల్లోని సౌకుమార్యం మెల్లిగా కరుగుతోంది. అయినా సరసత్వం పూర్తిగా పోలేదు. నవ్వుతూ, “ఊరికినే నామీద నేరం పెడుతున్నావు కాని, మీ దేవతలున్న చోటికి నీకోసం వస్తే అది మిండరికమే అవుతుంది. వస్తే గిస్తే బలాన్ని ప్రదర్శించి రావాలి కాని వేరే ఎలా వచ్చినా నాకు ముప్పుకాదా, అపఖ్యాతికాదా?” అని అంటాడు. ఇక్కడ సోమనలో ఉన్న వచోవిలాసమంతా నరకుడి చేత ‘మీ దేవతలు’ అని అనిపించడంలో ఉంది! అందులో ఉన్న ఎత్తిపొడుపు అచ్చమైన వాడుక భాషలో ఉన్న కాకువు. ఏదో విధంగా సంభాషణ కొనసాగించి నరకుడిని ఇరుకున పెట్టి తప్పించుకోవడమే ఊర్వశి ముఖ్యోద్దేశం. అందుకే ఊర్వశి జవాబుగా:

అనుటయు బూర్ణచంద్రముఖి యద్దనుజేంద్రుని తోడ నిట్లనున్
మనమున నింతమాత్ర మనుమానము గల్గిన నిందు నిన్ను ర
మ్మనుట పొసంగ; దొక్క దినమైనను నీ విహరించు చోటికిన్
నను బిలిపింప వైతి తగునా చనవింతకు నాకు చెల్లదే?

“నిజమే, ఇక్కడకి రావడానికి నీకలాటి అనుమానం ఉన్నదంటే రమ్మనడం సమంజసం కాదు. పోని నన్నయినా పిలిపించుకోలేదే నీదగ్గరకి? ఆ మాత్రం చనువైనా తీసుకోలేక పోయావా” అంటుంది. దీనితో నరకునిలో ఓరిమి నశించింది. ఈ తలతిక్క మాటలకి తనేమని సమాధానం చెప్పగలడు?

పగవాడట దేవేంద్రుడు,
మగువా! నీ వతని కొలువు మానిసివట, నిన్
దగవు చెడి పిలువ బనుచుట
మగతనమే? యిట్టి లంజె మాటలు గలవే!

నరకునిలో ఊర్వశి పట్ల ఉన్న మురిపెమంతా పోయింది. ఆమెని అవహేళన చేస్తూ, “దేవేంద్రుడెమో నా శత్రువుట. నువ్వేమో అతని కొలువులో ఉండేదానివట. నేనేమో నిన్ను పిలిపించుకోవాలట! అదెక్కడి మగతనం? ఇలాటి లంజె మాటలు ఎక్కడైనా ఉన్నాయా?” అని బదులిస్తాడు. తెలుగు వాడుకలో “ట”కార ప్రయోగం వెటకారాన్ని బాగా ధ్వనింప చేసే ఒక వచో విలాసం. దీన్ని సోమన చాలా చోట్ల ఉపయోగించుకున్నాడు. ఇక్కడున్న ‘లంజె మాటలు’ అన్న పదాన్ని రాళ్ళపల్లి వంటి విమర్శకులు తప్పుబట్టారు. ఇలాటి నీచ ప్రయోగం చేసి సోమన ఔచిత్య భంగం చేసాడని భావించారు. నిజానికి సోమన కాలంలో ఈ మాట ఒక నీచమైన తిట్టు కాదేమో అని నా అనుమానం. బ్రిటిషువాళ్ళ కాలం నుంచి పాశ్చాత్య విలువలు మనలని బాగా ప్రభావితం చెయ్యక ముందు, ఇలాటి మాటలు వాడుకలో తరచూ ప్రయోగంలో ఉండేవన్న దానికి సాక్ష్యాలున్నాయి. ‘లంజె మాటలు’ అన్న పదంలో వాచ్యార్థాన్ని తీసుకొని, నరకుడు ఊర్వశిని ‘లంజె’ అన్నాడని అనుకోడం సమంజసం కాదు. ఇందులో ‘పని జరగనివ్వకుండా మాటలతో మభ్య పెట్టడం’ అనే అర్థమే ఉంది. అయితే ఊర్వశి దీన్ని అదనుగా తీసుకొని, అతను తనని ‘లంజె’ అన్నాడనే మిషతో సంభాషణని మరో మలుపు తిప్పుతుంది.

లంజియ నౌదు నేను, విను, లావున నీ వమరేంద్రు గెల్చి న
న్నుం జెరవట్టి తెమ్మని వినోదము చేసితి గాక, చిత్త మే
ల్లం జెడి యుండ రిత్త యొడలం జవి చేరునె? చిల్క వోయినం
బంజర మేమి సేయ? రసభంగము సంగతిలోన మెత్తురే?

లంజె అన్న పదానికి లంజియ అన్నదొక రూపాంతరమే. అయితే అలా అనడంలో, ‘అవును లంజెనే’ అనే ధ్వని ఉంది. “అవును నేను లంజెనే అవుతాను. నీ బలంతో ఇంద్రుని గెలిచి నన్ను చెరబట్టి తెమ్మన్ని వినోదం చేశావు. అయితే మనసంతా చెడిపోయి ఉన్నాను నేను. అలాటప్పుడు దేహంలో కాంతి ఎలా ఉంటుంది? చిలుకపోయిన పంజరంతో ఏమి చెయ్యగలం? శృంగారంలో రసభంగాన్ని ఎవరైనా సహిస్తారా?” అని అంటుంది. తన మనసులో ఉన్న అసలు విషయాన్ని ఇక్కడ బయట పెట్టింది ఊర్వశి! నరకుడు నిజంగా తనని ప్రేమించి ఉంటే, ఆ పరిస్థితిలో అతడు తనని కోరుకోడు. పరస్పరానురాగం ఉంటేనే శృంగార రసం పండుతుంది. లేకపోతే జరిగేది రసభంగమే. వేశ్యకి విటుని మీద కోరికెప్పుడూ ఉండదు. అంచేత వేశ్యతో జరిపేది శృంగారం అవ్వదు. ఇది ఎంతో నేర్పుగా విప్పిచెప్పింది ఊర్వశి.

నవ్వుల మాటలో నిజమొ నాకములోన ననేక కన్యకల్
మవ్వపు దీగెలం దెగడు మానిను లుండగ సంత నెన్నడో
జవ్వన మమ్ముకొన్న గడసాని ననుం గవయం దలంచితే
పువ్వులు వేడుకైన గడివోయిన వాళ్ ముడువంగ వచ్చునే

“స్వర్గంలో ఎందరో కన్యలుండగా, ఎప్పుడో సంతలో యవ్వనాన్ని అమ్ముకున్న నన్ను నువ్వెందుకు కోరుకుంటున్నావు? ఎంత పువ్వులమీద ఇష్టమున్నా, వాడిపోయిన పువ్వులని ఎవరైనా తలలో ముడుచుకుంటారా” అన్నది. దీనితో నరకుడిలో ఉన్న సౌకుమార్యం పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుంది. తను కోరుకున్న ఊర్వశి తన ప్రేమ మాటలకి పడిపోదని తేలిపోయి అతనిలోని కాముకుడు పూర్తిగా బయటకి వచ్చేస్తాడు. అయితే ఇంకా అతనికి ఊర్వశిపై కోరిక మాత్రం పోదు. అందుకే అంటాడు:

అంజెదవు గాక నను జెం
తం జేరగనీక యెంత దరిగిన మిరియా
లుం జొన్నల సరిపోవే
లంజెతనము లందు గొమిరెలం గెలువ వటే

“నన్ను దగ్గరకి చేరనీకుండా ఏదో అంటున్నావు కాని, లంజెతనంలో నువ్వు కన్యలని మించిపోతావు. ఎంత తరిగినా మిరియాలు జొన్నలకి తీసిపోవు కదా?” ఇందులో నరకుడి లోని కాముకుడు చక్కగా సాక్షాత్కరించాడు. ఈ సంభాషణని ఇలా కొనసాగించడం వల్ల ఊర్వశికి రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి నరకుడికి తనమీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు. రెండు అతనికి తనమీద చాలా కోరిక ఉంది. అంచేత తను మాటలతో అతన్ని లొంగదీసుకోవచ్చునన్న ధైర్యం ఆమెకి వచ్చి ఉంటుంది.

అనుడు నవ్వామలోచన యతని జూచి
చిరుత నగవుల రెప్పల సిగ్గు దేర్చి
నీవు రాజవు! మాటలు నిన్ను గడవ
నాడ నేర్తునె, విన్నప మవధరింపు

మళ్ళీ అతన్ని పొగుడుతోంది. మామూలుగా కాదు, సన్నగా నవ్వుతూ రెప్పలలో సిగ్గులు కనపరుస్తూ “నువ్వు రాజువి. మాటల్లో నిన్ను గెలవగలమా?” అని అంటూనే తనకొక చిన్న కోరిక ఉంది వినమని వినమ్రంగా అడుగుతుంది.

శతమఖు డోడె నీ వతని సంపద కంతకు రాజ వైతి త
చ్చతుర విలాసినీ గణము సంతత సేవ యొనర్చు నీ మనో
హితముగ నింక నే ననగ నెంతటిదాన మహిన్ మహామునుల్
క్రతువులు సేయు చోటి కధికారివి గాని కొరంత యేటికిన్?

యాజకులు యజ్ఞ భాగ
భ్రాజిష్ణుని జేయ నిన్ను భావజ సౌఖ్యా
వ్యాజ పద రాజు జేసెద
దేజముసూ వలపు దెలుపు దెఱవల కెందున్

ఈ మాటల చదరంగంలో చివరి పావుని కదిపింది ఊర్వశి. “దేవేంద్రుని గెలిచి అతని సర్వసంపదలకూ రాజువయ్యావు. అప్సర గణమంతా నీకు సేవ చేస్తోంది. ఇంక నేననగా ఎంత! కాని ఒక్క కొరత మిగిలిపోయింది. భూలోకంలో మునులు చేసే యజ్ఞాలకి నువ్వింకా అధికారివి అవ్వలేదు. ఆ కొరత మాత్రం ఎందుకు? యజ్ఞ భాగాలకి నువ్వు అధికారివి అయిన తక్షణమే నిన్ను మన్మథ సామ్రాజ్యానికి రాజుని చేస్తాను. ఆడవాళ్ళపైనున్న వలపు తెలిపేది మగవారి తేజమే కదా!” అంటుంది. “అవును సుమా!” అని బుఱ్ఱూపి వెళిపోతాడు నరకుడు.

ఇదీ ఊర్వశీ నరకుల సంభాషణ, అందులో సోమన చూపిన చతుర వచో విలాసం! సంస్కృత మూలంలో కాని, ఎఱ్ఱన హరివంశంలో కాని ఈ సంభాషణ లేదు. నరకుడు ఊర్వశిని పిలిపించి తన కోరిక చెప్తాడు. యజ్ఞ భాగాలకి నరకుడు అధిపతి అయితేనే అతని కోరిక తీరుస్తానని ఊర్వశి చెప్తుంది. దానికి నరకుడు సరేనంటాడు. ఈ సన్నివేశాన్ని తీసుకొని సోమన తన నాటకీయ ప్రజ్ఞంతా కలబోసి ఇంతటి సంభాషణ సాగించాడు. ఇందులోని ఔచిత్యమేమిటి? అవసరమేమిటి? నరకుడు యజ్ఞ భాగాలకి అధికారి కావాలనుకోవడం అన్నది కథలో చాలా కీలకమైన విషయం. ఎందుకంటే, అలా అతడు అనుకోడం వల్లనే మునుల జోలికి వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళు వెళ్ళి కృష్ణునికి మొరపెట్టుకోవడం జరుగుతుంది. అదే నరకాసుర వధకి దారితీస్తుంది. ఇంతటి కీలకమైన విషయానికి ఎంతటి నేపథ్యం ఉండాలి? ఊరికే ఊర్వశి అడిగితే నరకుడు సరేననేస్తే అందులో సారస్యం ఏముంది? ఊర్వశి ఎందుకలా కోరింది అన్న ప్రశ్నకి సమాధానం కావాలి. ఊర్వశి కోరితే మాత్రం నరకుడు ఎలా అంగీకరించాడు అన్నదానికి సమర్థన కావాలి. దీని కోసం ఇంత సంభాషణా అవసరమైంది. ఊర్వశి నరకుడినుండి తప్పించుకోడానికే ఆ కోరిక కోరింది. అయితే సూటిగా అడిగేస్తే నరకుడు ఒప్పుకుంటాడన్న నమ్మకం లేదు. ఆ నమ్మకం ఊర్వశికి కలగాలి. అలా ఒప్పుకొనే మనఃస్థితిని నరకుడికి కలిగించాలి. దాన్ని సాధించిన నెరజాణగా ఊర్వశిని సాక్షాత్కరింప జేశాడు సోమన. కన్యాశుల్కంలో మధురవాణి సంభాషణల వెనుక ఈ ఊర్వశి మాటల ప్రేరణకూడా ఉండి ఉంటుందని నా బలమైన ఊహ.

మాటల కత్తి(పై)సాము – జనార్దన రాయబారం

సోమన నాటకీయ శైలీ నైపుణ్యం ప్రస్ఫుటంగా కనిపించే మరో ఘట్టం జనార్దన రాయబారం. దీని గురించి బేతవోలు రామబ్రహ్మంగారు ‘పద్య కవితా పరిచయం’ అనే పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు. కాబట్టి నేనిక్కడ వీలైనంత క్లుప్తంగా చెపుతాను. శివుని దగ్గర సంపాదించిన వరాల గర్వంతో హంస డిభకులు రాజసూయాన్ని తలపెడతారు. వాళ్ళ మిత్రుడు, మంత్రి జనార్దనుడు. ఈ రాజసూయం వాళ్ళకి చేటు కలిగిస్తుందని అతనికి తెలుసు. కానీ వాళ్ళు రాజులు. అంచేత చాలా జాగ్రత్తగా చెప్పాలి. అందుకిలా అంటాడు:

రాజసూయంబు చేయ నే రాజు దలచు
నాతనికి రాజు లరిగాపులైన గాని
నిర్వహింపదు మన మెల్లి నేడు సేయు
లావు మెరయునె ధర యింగలాలపుట్ట

రాజసూయం చెయ్యాలంటే అతనికి మిగతా రాజులంతా ‘అరిగాపులు’ కావాలి. అంటే కప్పం చెల్లించే సామంతులు కావాలి. ఇవాళ రేపు మనం సంపాదించిన బలం అంత గొప్పదా? ఈ భూమి అంతా ఇంగలాల పుట్ట, అంటే ఎక్కడపడితే అక్కడ నిప్పు రవ్వలే! అంచేత రాజులందరినీ ఓడించడం తేలిక కాదు సుమా అని. ఇక్కడ ఉన్న చతురతంతా ‘మనము’ అన్న మాటలో ఉంది. ‘మీరు’ అని అంటే వాళ్ళని వేరుచేసి తక్కువ చేస్తున్నట్టవుతుంది. మనం అన్న పదం ఆత్మీయతని ధ్వనిస్తుంది. ‘లావు మెరయునె’ అని కాకు స్వరం ప్రయోగించడం – మీరే ఆలోచించండని నిర్ణయం వాళ్ళకే వదిలివేయడం. ఆ తర్వాత జనార్దనుడు వివిధ రాజుల వీర శౌర్యాలని వర్ణిస్తాడు. ముఖ్యంగా కృష్ణుని వల్ల తమకి పొంచి ఉన్న ఆపదని వివరిస్తాడు. అంతా చెప్పి:

ఒప్పగునో తప్పగునో
ఇప్పటికిం దోచు కార్యమిది నృపతులకుం
జెప్పవలె నాప్త మంత్రులు
చొప్పగునే మనకు రాజసూయము చేయన్

అని అంటాడు. ఈ పద్యాన్ని పై పద్యంతో పోల్చండి. సరిగ్గా అదే ‘మనము’ అన్న ప్రయోగం, ‘చొప్పగునే’ అని అదే కాకుస్వరం! ‘ఆప్త మంత్రులు’ అనడంలో ఇది రాజ ధిక్కారం కాదని, ఆప్తవాక్యాలనీ వ్యంగ్యంగా అంటున్నాడు. జనార్దనుడి మాటల నేర్పుకి ఇది నాంది! అయితే హంస డిభకులు గర్వాంధులు. ఈ మాటలు వాళ్ళ చెవులకెక్కవు. జనార్దనుడు చెప్పిన రాజులందరినీ కరివేపాకులా తీసిపారేస్తారు.

కలు ద్రావం బనిపూని యాదవులు ఖడ్గాఖడ్గి వాదింతురే
కలగం బారుటగాక పంతములకుం గంసారి సైరించినం
గలనం బ్రాణముతోన పట్టువడు నింకన్ సాత్యకిం గీత్యకిన్
బలభద్రున్ గిలభద్రు నా యెదుర జెప్పం జొప్పు దప్పుం జుమీ

“కల్లు త్రాగే యాదవులు మనతో కత్తికి కత్తి పెట్టి యుద్ధం చేస్తారా, పారిపోతారు కాని! ఒకవేళ కృష్ణుడు ఎదిరించినా యుద్ధంలో ప్రాణాలతో పట్టుబడతాడు. ఇక సాత్యకీ గీత్యకీ, బలభద్రుడు గిలభద్రుడు ఎదిరిస్తారనుకోడం శుద్ధ తప్పు”.ఈ వ్యావహారిక వాక్య విన్యాస శైలితో, అవధులు లేని గర్వమూ, యాదవులంటే వాళ్ళకున్న తూష్ణీంభావమూ అచ్చంగా ధ్వనింపజేస్తాడు సోమన. ఇలా జనార్దనుని అనుమానాలకి జవాబు చెప్పి చివరికి అతడినే కృష్ణుని వద్దకు రాయబారిగా వెళ్ళమంటారు. ఉప్పుని కప్పంగా అడగమని చెప్తారు. స్వామి కార్యం ఎలా ఉన్నా, స్వకార్యం కోసం జనార్దనుడు ఆనందంగా శ్రీకృష్ణుని వద్దకు వెళతాడు. అక్కడ సభలో శ్రీకృష్ణుడు జనార్దనుని పలకరించిన తీరు కృష్ణుని రాజనీతికి అద్దం పడుతుంది.

అనఘ మీరాజు బ్రహ్మదత్తునకు గుశల
మా? నరేంద్ర కుమారులు హంసడిభకు
లధిక భవ్యులె? వరములు హరుని చేత
గొన్నవారట కుశలంబు గొఱత గలదె!

‘మీ రాజు బ్రహ్మదత్తునకు’ అని అనడం, మీ రాజు బ్రహ్మదత్తుడు కాని హంసడిభకులు కాదు సుమా అని గుర్తుచెయ్యడం. హంసడిభకులకి అధిక కుశలమా అని అడగడంలోని ఎకసెక్కం, ‘అవును శివుడి చేత వరాలు పొందారట కదా, ఇక కుశలమునకి కఱువేముంది’ అనడంలోని వ్యంగ్య వైభవం చదివే వాళ్ళకి అనుభవైకవేద్యం! “మీ జనకుడు శుభయుతుడే రాజులు మిము గారవింతురా” అని కూడా కృష్ణుడు అడుగుతాడు. ఇది కృష్ణుని భేద నీతికి తార్కాణం! ఆ తర్వాత వచ్చిన పని గురించి అడుగుతాడు. జనార్దనుడు శ్రీకృష్ణుని భక్తుడు. ఇక్కడకి రావడంలో అతని స్వార్థం శ్రీకృష్ణుని దర్శించటమే. అలాటి కృష్ణుణ్ణి తన రాజుకి కప్పం కట్టమని ఎలా అడుగుతాడు? “ఇందే వచ్చిన పని, గోవింద! ఎఱింగింప కెఱుగవే?” అని మొదలుపెడతాడు.

ఉండుట తప్పు, వారికడ నుండమి తప్పిట రాక తప్పు, రా
కుండుట తప్పు, తప్పులకు నొప్పులకుం గతి నీవ దేవ! యే
నొండొకరుండనే, పలుక కూరక నేరక యుండ జేయు వీ
ఱిండి తనంబు చేత నిసిఱింతలు వాఱెడి జిత్త మిప్పుడున్

అని నీళ్ళు నములుతాడు. ఏమి చెయ్యాలో తెలియని వెఱ్ఱితనంతో నా మనసంతా కంపిస్తోందని చెప్పుకుంటాడు. అలా అంటే సరిపోదుకదా. దూతగా వచ్చినప్పుడు రాజు చెప్పిన విషయాన్ని ఒప్పైనా తప్పైనా చెప్పక తప్పదు. అదే అంటాడు కృష్ణుడు. “చల్లకువచ్చి ముంత దాచినగతి” ఇలా మాట్లాడ్డం ఎందుకంటాడు. పైగా, పాముకాటుని చీరతో తుడిచేస్తే పోతుందా, ఇప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం లేదని కూడా అంటాడు. ఇక్కడ కృష్ణుడి పరిస్థితి కత్తిమీద సాములాంటిది. ఒకవైపు తన శత్రువులైన హంసడిభకులు, మరో వైపు తన భక్తుడైన జనార్దనుడు. అతన్ని భక్తునిగా చూసి ప్రసన్నంగా మాట్లాడితే రాజుగా తను చులకనవుతాడు. అదే కఠినంగా మాట్లాడితే తన భక్తుడు నొచ్చుకుంటాడు. అందుకే అలా మధ్యే మార్గంలో మాట్లాడతాడు. అప్పుడు చేసేది లేక జనార్దనుడు విషయం బయట పెడతాడు. అక్కడకూడా ఎంత చాకచక్యంగా చెప్తున్నాడో చూడండి:

అనుడు నతండు హంసడిభకానుమతంబున రాజసూయమున్
జనపతి సేయబూని భుజసారమునన్ సడిసన్న రాజులన్
ధనములు చాల దెండని పదంపడి దేవర యున్నచోటికిన్
నను బనిపంపె నిన్ను యజనంబున మున్నిడి చేయువాడుగాన్

రాజసూయం గురించి చెప్పాడు, భుజబలంతో రాజులందరినీ చాలా సొమ్ములని తెమ్మనడం చెప్పాడు కాని కృష్ణుడిని అడిగిన కప్పం గురించి చెప్పలేదు. తననిక్కడికి పంపించారని మాత్రం చెప్పాడు. పైగా, అగ్రతాంబూలం ఇవ్వడానికేమో అని కూడా అన్నాడు. ఇది జనార్దనుడు చేర్చిన మాట!

అప్పుడా హంసడిభకు లిట్లనిరి మనకు
లవణ మెంతేని నడుగు యాదవుల చేత
వేగ రమ్మను శౌరి నియ్యాగమునకు
నావుడుం బని పూనితి దేవదేవ

“అలా బయలుదేరినప్పుడు హంసడిభకులు, వస్తూ వస్తూ మిమ్మల్ని కాస్త ఉప్పు పట్టుకురమ్మని చెప్పమన్నారు. యాగానికి వేగంగా రమ్మన్నారు” అని ఊరుకున్నాడు. ఇక్కడా కప్పం ప్రసక్తి వాచ్యం చెయ్యలేదు! జనార్దనుడి మాటల నేర్పుకి ఇది పరాకాష్ఠ. ఎంత నేర్పుగా మాట్లాడినా అందులోని ఆంతర్యం గ్రహించలేనివాడా కృష్ణుడు? గ్రహిస్తాడు. “రోసంబునకు మూలంబైన హాసంబు జేసి” తీవ్రంగా స్పందిస్తాడు.

రాజసూయ కర్త బ్రహ్మదత్తుం డట్టె
రభస మెసగ హంసడిభకు లట్టె
చేయ బంచువారు చెల్లెబో లవణంబు
మోచువాడ కాక మురవిరోధి

ఇందులో మళ్ళీ వెటకారం ధ్వనించే ‘ట’కార ప్రయోగం ఉంది! “రాజసూయం చేసేవాళ్ళు వాళ్ళూను, వాళ్ళకి ఉప్పుని మోసుకెళ్ళేవాడు కృష్ణుడును, బలే!” అని అనడంలో తెలుగు వ్యవహారంలోని వ్యంగ్యమంతా వినిపించడం లేదూ! రణరంగంలో శత్రువులతో ఉప్పనబట్టెలు ఆడడానికీ, ఉప్పుపాతర వెయ్యడానికీ మాత్రమే యాదవులు ఉప్పు తెస్తారని వెళ్ళి వాళ్ళకి చెప్పని సమాధానమిస్తాడు.

వెదుకంబోయిన తీవ కాలదవిలెం, వేయేల, దుర్వాసుచే
మొదలన్ సంచకరంబు హంసడిభకోన్మూల క్రియా కేళికిం
గుదురై యున్నది, సాటిగాక యిట మత్కోదండ కాండోదర
ప్రదర ప్రావరణాంబుద ప్రకట శంపాకంప శాత్కారముల్

వ్యవహార గ్రాంధిక భాషల శక్తి పూర్తిగా కనిపించే పద్యమిది! చివరి సమాసం కృష్ణుని శౌర్యోద్ధతిని చక్కగా పట్టి ఇస్తుంది.

హరి గదావిహార మల్లంత దోచిన
వరము మిమ్ము గావ వలతి యగునె
వెఱ్ఱివార పిడుగు వ్రేసిన దలటొప్పి
యాగునే వివేకమైన వలదె

“వెఱ్ఱివాళ్ళల్లారా! మీరేదో శివుడి వరాలున్నాయని విర్రవీగుతున్నారేమో. ఈ హరి గదా విహారమ్ముందు అలాటివేమీ పనిచెయ్యవు. నెత్తిన పిడుగు పడితే తలపై టొపీ రక్షిస్తుందా!” అని హంసడిభకులతో చెప్పమంటాడు. ఇలాటి సందర్భోచితమైన సామెతలనీ సామ్యాలనీ ప్రయోగించడంలో సోమన సిద్ధహస్తుడు!

సంభాషణలకి ప్రాణం భాష

పాత్రలకి ప్రాణం పోసేవి సంభాషణలైతే, సంభాషణలకి ప్రాణం పోసేది వ్యావహారికత గుబాళించే భాష. ప్రతి భాషకీ వ్యవహారంలో విలక్షణమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతి, జీవన విధానం ఆధారంగా ఏర్పడే లక్షణాలు. సంభాషణలకి ప్రాణం పోసే లక్షణాలివే. మన తెలుగు భాషకి కూడా అలాటి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మన రోజువారీ సంభాషణల్లో అడుగడుగునా కనిపించే సామెతలు జాతీయాలు, ‘సాత్యకి-గీత్యకి’, ‘వరము-గిరము’ వంటి నిందార్థక పదాలు, వెక్కిరింపు ధ్వనులు (‘ట’కార ప్రయోగము వంటివి), కాకు ధ్వని, మొదలనైవన్నీ ఇలాటి లక్షణాలే. సోమన సంభాషణలలో యీ వ్యావహారిక భాషా విలాసం అడుగడుగునా కనిపిస్తుంది. పైన ఉదహరించిన చాలా పద్యాలలో ఇప్పటికే వీటిని మీరు గమనించి ఉంటారు. అయినా మరొక్క ఉదాహరణ మాత్రం ఇచ్చి ముగిస్తాను. నరకాసురుడు తనకే యజ్ఞ భాగాన్నిమ్మని బదరికాశ్రమంలో మునులని గద్దించినప్పుడు వారి సమాధానం ఇలా ఉంటుంది:

మనుజాశనులట బలులట
మునులట యాగంబులట నమో విశ్వసృజే
వినమింతకు మున్నెన్నడు
గని కని కొఱ్ఱెవ్వడింటి కంబము సేసెన్

“మనుషులని తినేవాళ్ళట, బలవంతులట! మునులట, యాగములట… దేవుడా! ఇంతకుముందెప్పుడూ వినలేదయ్యా, చూస్తూ చూస్తూ శూలాన్నెవరైనా ఇంటి స్తంభంగా చేసుకుంటారా!” పై పద్యానికీ ఈ వచనానికీ తేడా ఎంత తక్కువో గమనించండి. పదాలు ఇప్పటి వాడుక తెలుగులోకి మారడమే తప్ప వాక్య నిర్మాణంలో పెద్ద తేడాలేదు కదా. అచ్చమైన వాడుక భాష పద్యాలలో రాసే విధానానికి ఇది ఉదాహరణ. వాడుక తెలుగులోని ప్రత్యేకత ఈ పద్యంలో అణువణువునా కనిపిస్తుంది. తిరస్కారాన్ని తెలిపే ‘ట’కారం, సగం సగం మాటలు మాత్రమే చెప్పడం, ‘అయ్యో దేవుడా!’ అనే నుడికారం (దీన్ని సంస్కృతంలో ప్రయోగించడం వెటకారాన్ని మరింత ఎగదోస్తోంది), పోలికకి ఒక సామెత వాడకం ఇవన్నీ మన తెలుగు సంభాషణలకి సొంతమైన సొగసులు. వీటిని పట్టుకోవాలంటే కవికి పుస్తక పాండిత్యం సరిపోదు, సజీవమైన భాషలోని సొగసులు, జిగి బిగి తెలిసుండాలి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తనంత మంచి వచనం రాయడానికి ముఖ్య కారణం ఇంట్లోనీ ఇరుగుపొరుగున ఉన్న ఆడవాళ్ళ సంభాషణలు వినడంవల్లనే అని చెప్పుకున్నారు కదా! పద్య కావ్యాలైతే సంభషణల్లోని ఆ ఒడుపంతా పద్యాల్లో పెట్టగలిగే నేర్పు కూడా అవసరమవుతుంది. అలాటి నేర్పు సోమనకి పుష్కలంగా ఉందని ఉత్తరహరివంశంలోని సంభాషణలు ఋజువు చేస్తాయి.

చివరగా కొన్ని ప్రశ్నలు

సంభాషణా రచనలో నాచన సోమన కనపరచిన ప్రజ్ఞని ఈ వ్యాసంలో పరిచయం చేసుకున్నాం. సంభాషణలు పాత్రలని ఎలా ప్రాణవంతం చేస్తాయో చూసాం. వ్యావహారిక భాష సంభాషణలకి ఎలా జీవం పొయ్యగలదో తెలుసుకున్నాం. ఉత్తరహరివంశంలోని ఈ వ్యవహార భాషా విలాసం గమనించాక, నాలో కొన్ని ప్రశ్నలు చెలరేగాయి. కాలానుగుణంగా మార్పు చెందడం భాషకి సహజ లక్షణం. అయితే, భాషా శాస్త్రవేత్తల ప్రకారం ఈ మార్పు వర్ణాలు, పదాలలో ఎక్కువ జరుగుతుంది. అంటే కొన్ని వర్ణాలు పోవడం కాని, కొత్త వర్ణాలు రావడం కాని, పదాలలో (రూపము, అర్థము) మార్పు, కొత్త పదాల చేరిక మొదలైనవి. వాక్య నిర్మాణంలో మార్పు తక్కువగా వస్తుంది. ఇవన్నీ భాష బాహ్య లక్షణాలు. పైన చెప్పుకున్న వాడుక భాషలోని సొగసులు భాష కుండే అంతర్గత లక్షణాలు. భాష పైపైన ఎంతగా మార్పు చెందినా, అంతర్గతమైన ఆ లక్షణాలు అలాగే కొనసాగుతాయి. వాటిలో మార్పు భాషా సంస్కృతులలో పెనుమార్పుని సూచిస్తుంది. మరి, ఇప్పటి మన తెలుగు భాషలో ఈ లక్షణాలు ఎంతవరకూ కనిపిస్తున్నాయి? ఏ రకంగా మార్పు చెందుతున్నాయి? ఈ మార్పు యొక్క లక్షణమేమిటి? ఈ ప్రశ్నలు కేవలం భాషా శాస్త్రవేత్తలకే పరిమితం కాదు. తెలుగువాళ్ళందరమూ ఆలోచించవలసినవి కదూ!