కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే …

Girls for Sale, kanyasulkam


A Play from Colonial India,
Gurajada Apparao
Indiana University Press (July 2007)
Paperback: 280 pages
List Price: $21.95
Translated from Telugu
By Velcheru Narayana Rao

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకాన్ని ఇంగ్లీషు లోకి ‘ అనువదిస్తున్నా’ నని వెల్చేరు నారాయణ రావు గారి నుండి విన్న వాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణి. అమ్మ బాబోయ్ అని గుండె బాదుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకణ్ణే! అందుకు ముఖ్య కారణం, కన్యాశుల్కం నాటకంలో వాడిన భాష. అప్పారావు గారు కన్యాశుల్కం లో 19 వ శతాబ్దం ఉత్తర భాగంలో విజయనగరం శివార్లలో వాడే మాండలికం వాడారు. దానికి తోడు నాటకంలో ప్రతి పాత్ర తను మాట్లాడే మాటల్లో తన కులం, ఆర్థిక స్థితి, చదువు సంధ్యలు, లింగబేధం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అటువంటి నాటకాన్ని ఇంగ్లీషులోకి తేవడం సాహసమయిన పనే అనిపించింది. నిజానికి ఈ పని చాలా అవసరమైనదని కూడా అనిపించింది. ఈ పనికి తగిన వాడు నారాయణరావు గారే అనే నిబ్బరం కూడా కలిగింది. ఎందుకంటే, ఇదివరలో ఆయన చాలా తెలుగు పుస్తకాలు ఇంగ్లీషులోకి అనువదించిన విషయం అందరికీ తెలుసు.

అనువాదాలమీద, అనువాద సమస్యల మీద యిప్పటికే చాలా వ్యాసాలు విమర్శలూ మన పత్రికలలో వచ్చాయి. వాటి గురించి ముచ్చటించటం ప్రస్తుతం అనవసరం. ప్రాచ్య భాషలనుంచి పాశ్చాత్య భాషల్లోకి వచ్చే అనువాదాలు ముఖ్యంగా ఎవరిని ఉద్దేశించి చేసినవో బోధపడితే అనవసర వాదప్రతివాదాలకి తావులేదని నా నమ్మకం.

నాకు తెలుసు కుందామన్న అభిలాషతో, (క్యూరియాసిటీ అనండి) నాకు తెలిసిన తెలుగు మాండలికాలకి, వ్యావహారిక భాషలో ఉన్న జాతీయాలకీ నారాయణరావుగారు చేసిన ‘అనువాదాలు’ ఇంగ్లీషు వాడుక భాషకి, ఎంత దగ్గిరగా ఉన్నాయో చూశాను. అయితే, నాటకం మొత్తం అంతా ఈ సమసామ్యత కోసం వెదక లేదు. స్థాలీపులాకన్యాయంగా మూల నాటకంలో గిరీశం చేసిన స్వగతాలు, మధురవాణి దెప్పి పొడుపులు, అగ్నిహోత్రావధాన్లు కోపంగా అన్న మాటలూ, లుభ్ధావధాన్లు పెట్టిన తిట్టు, వాళ్ళభాష, వాడుకలో ఉన్న ఇంగ్లీషులోకి చక్కగా సమాంతరంగా అనువదించ బడ్డాయి. అల్లాగే, ‘ఖగపతి అమృతము తేగా…’ అన్న పద్యం ఇంగ్లీషులోకి భేషుగ్గా అనువదించ బడింది. అల్లాగే, 5 వ అంకం, 6 వ రంగం ఆఖర్న శిష్యుడి పాట కూడా చక్కగా వచ్చింది. అయితే, ఇటువంటి అనువాద పరీక్షలు పెట్టడానికి నేను సరైనవాడిని కానని నాకు తెలుసు. కారణం : మూలంలో తెలుగు నుడికారానికి, తెలుగుమాట్లాడేచోటుకీ, నేను దగ్గిరగా ఉండబట్టి; — ఎంత వద్దనుకున్నా భాషాగత పక్షపాతం (bias) పోదు కాబట్టి. కాగా, వాడుక భాషగా ఇంగ్లీషులో నాకు ప్రవేశం లేదు. పైగా, అనువాదాలని విమర్శించగల ప్రత్యేక నేర్పరితనం లేకపోవడం మరొక ముఖ్య కారణం.

ఇక్కడ పుట్టిపెరుగుతూ తెలుగు గురించి వినడమేకాని తెలుగులో ప్రత్యేక ప్రవేశం లేని ‘ తెలుగు -అమెరికన్‌ ‘ యువతీయువకులు — (వాళ్ళ మాతృభాష ఇంగ్లీషు కాబట్టి!) చదివి, ఈ ‘ఇంగ్లీషు’ నాటకం ఇంగ్లీషు నాటకంలా ఉన్నదో లేదో చెప్పవలసిన అవసరం ఉంది. అందుకని, ఈ పుస్తకం కొని మీపిల్లలచేత చదివించండి. ఒక విషయం మాత్రం నిజం. నాకు మాత్రం ఎక్కడా నట్టు పడకండా ఇంగ్లీషు కన్యాశుల్కం చదవడానికి సాఫీగా నడిచిందని ధీమాగా చెప్పగలను.

కన్యాశుల్కం గురించి మళ్ళీ ఇప్పుడు రాయవలసిన అవసరం ఏమిటి అన్నది అసలు ప్రశ్న. ఏడు దశాబ్దాలుగా, ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలలో కన్యాశుల్కం నాటకం పై కొన్ని వందల వ్యాసాలు, విమర్శలు, ప్రతివిమర్శలూ, వివాదాలూ, ఉత్తరాలూ వచ్చాయి. ఈ వ్యాసాలు నాటక కర్తృత్వంతో మొదలుపెట్టి, నాటకంలో ప్రతిపాత్రపైన, అప్పారావుగారి అంకిత వాక్యాలపైన, పీఠికలపైన, పాత్రల ఔచిత్యంపైన, వాటి ఆవశ్యకతపైన, నాటక లక్షణాలపైన, లక్ష్యాలపైన, వస్తువు పైన, వస్త్త్వైక్యత పైన, నిర్వహణపైన, సాంఘిక సంస్కరణలపైనా …. అటూ ఇటూ … ఎన్నో ఎన్నెన్నో…. . కన్యాశుల్కం నాటకం కొందరికి బ్రహ్మపదార్థం; మరి కొందరికి ప్లేడౌ (play dough!) ఒక్కొక్క విమర్శకుడికి ఒక్కొక్క రకంగా కనిపించింది, వినిపించింది. మరి కొందరు విమర్శకులకి వాళ్ళకి నచ్చిన పాక్షిక పద్ధతిలో మలచుకో బడ్డది! పైగా ఈ నాటకం కొన్ని వందలసార్లు తెలుగుదేశంలో ప్రదర్శించ బడింది. అయితే, మూలంలో నాటకాన్ని కుదించి కత్తిరించి అప్పుడప్పుడు భాషని ‘సంస్కరించి’ ఈప్రదర్శనలన్నీ చేశారని గుర్తుంచుకోవాలి. మూలంలో నాటకం ఏడు అంకాలు, ముప్ఫైరెండు రంగాల నిడివి గలది. అందుకనే కాబోలు, ప్రదర్శనా సౌలభ్యం పేరుతో కుదించారు, కత్తిరించారు, సవరించారు, ప్రయోక్తలందరూ!

నారాయణరావు గారి అనువాదం కన్యాశుల్కం నాటకాన్ని మళ్ళీ చదివించింది. అనువాదమే కాదు; ఆయన రాసిన వెనుక మాట (The Play in Context) నూతన ప్రేరణనిచ్చి, తిరిగి ఆలోచించవలసిన అవసరం కల్పించింది. వెనుక మాటలో నారాయణరావుగారు ఒక సరికొత్త ప్రతిపాదన చేసారు. ఒక రకంగా ఇది విప్లవాత్మకమైన ప్రతిపాదన. తన ప్రతిపాదనని సోపపత్తికంగా సమర్థించారు.

నారాయణరావు గారి ప్రతిపాదనకిం పూర్వ రంగం ఇది :

కన్యాశుల్కం నాటకం పై ఇంతకు పూర్వం విమర్శకులందరూ అప్పారావు గారు ఈ నాటకం రాయడానికి ప్రేరణ, కారణం, సంఘసంస్కరణే అని ప్రతిపాదించారు. నాటి సమాజంలో ముఖ్యంగా మూడు దురాచారాలని ఎత్తిచూపి వాటి నివృత్తి కి ఈ నాటకం మార్గదర్శి అని విమర్శకులందరూ పదే పదే నొక్కి వక్కాణించారు. ఈ మూడు దురాచారాలూ వరుసగా, — కన్యాశుల్కం, అంటే ఆడపిల్లలని అమ్మడం కొను క్కోవడం; వితంతు వివాహం; వేశ్యా సమస్య. గత 50 సంవత్సరాలుగా వచ్చిన వ్యాస పరంపర, ఈ మూడింటినీ పూర్తిగానో, అర్థోక్తిలోనో, సమర్థించినవే. (చాలా కొద్ది విమర్శలు ఇందుకు వ్యతిరేకత చూపించాయి కానీ వాటిని ఎవరూ ఖాతరు చేసినట్టు లేదు!)

నారాయణరావుగారు చేసిన ప్రతిపాదన సారాంశం ఇది : ఈ విమర్శకులలో ఏ ఒక్కరూ కన్యాశుల్కం నాటకాన్ని, రచనా వ్యూహాన్ని, సరిగా అర్థం చేసుకోలేదని, బ్రిటీషు వలసరాజ్యం అప్పటి సంఘంమీద తెచ్చిన వత్తిడి వారికి పూర్తిగా బోధ పడలేదనీ ఉదహరిస్తూ అప్పారావుగారిలోని నవ్యతనీ, ఆయనదయిన ‘ఆధునికతనీ ‘ సోదాహరణంగా వివరించారు.

ఈ వ్యాసంలో నేను గత ఐదు దశాబ్దాలుగా కన్యాశుల్కం నాటకం పై విమర్శకుల అవగాహన సారాంశంగా వారి మాటల్లోనే ఉదహరిస్తూ, ఈ వ్యాస ధోరణికి అడ్డు పడకండా అనుబంధంలో ఇస్తాను. నా వ్యాసంలో నారాయణరావుగారు చేసిన ప్రతిపాదనపై కేంద్రీకరిస్తాను. ఈ నాటకాన్ని కొన్ని వందలసార్లు కత్తిరించి ‘ప్రదర్శించడం’ వలన తెలుగు ప్రజలలో పాతుకొపోయిన కొన్ని అపోహలు, అపార్థాలూ ఉటంకిస్తాను.

2.

అప్పారావు గారి గురించి రాసేటప్పుడు రెండు ముఖ్య విషయాలు మరిచిపోలేం. ఒకటి : బ్రిటీషు వలస విధానం, రెండు : ఆధునికత. ఆధునికత మన దేశంలో ఎప్పుడు మొదలయ్యింది అన్న ప్రశ్నకి సాధారణంగా మన ఆధునికులు చెప్పే సమాధానం — బ్రిటీషు వాడి వలస రాజ్య స్థాపన తరువాతనే అని. బ్రిటీషు వాడు వలసకి రావడం మూలంగానే మన సంస్కృతి, సాహిత్యం నూతన తేజం పొందాయని వాదం, నమ్మిక. అంతకు పూర్వం, అంటే 17, 18 శతాబ్దాలలోని సాహిత్యం అంతా అవినీతి భూయిష్టం అని, కుళ్ళిపోయిందనే నమ్మకం. అది సరైన వాదం కాదని, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఆధునికత 16 వ శతాబ్దంలోనే ఉన్నదనీ, నారాయణరావు, సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్‌ మన్‌ లు గత 15 సంవత్సరాలుగా తమ చారిత్రక సాహిత్య పరిశోధనల ద్వారా మనకి పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాటి సాహిత్యాన్ని సునిశితంగా, చారిత్రకంగా పరిశీలించి, నూతన పద్ధతుల్లో పరిశోధన చేస్తే బ్రిటీషు వలస కి పూర్వమే ఆధునికత స్పష్టం అవుతుందని వారి వాదం. బ్రిటీషు వాడి రాక మూలంగా వచ్చిన ఆధునికతని వాళ్ళు కాదనడంలేదు ; వాడికి పూర్వమే ‘ ఆధునికత ‘ ఉన్నది — అది చారిత్రక పరిణామంలో క్రమంగా సంప్రదాయకంగా వచ్చిందీ అని అర్థం. వలస రాజ్యం తరువాత వచ్చిన ఆధునికత సంప్రదాయ విరుద్ధం అని చెప్పవచ్చు. ఈ విషయాలపై నిశితమైన చర్చ (Penumbral Visions : Making Polities in Early Modern South India, Sanjay Subrahmanyam, Textures of Time : Writing History in South India 1600-1800, Narayana Rao, Shulman & Subrahmanyam, Symbols of Substance : Court and State in Nayaka-Period Tamilnadu, narayana Rao, Shulman and Subrahmanyam) అనే పుస్తకాలలోను, (The Sound of Kiss, The Demon’s Daughter) అనే పుస్తకాలలో ఉన్న వెనుక మాటలలో చదవ వచ్చు.

బ్రిటీషు వాడి వలసకు పూర్వం నుంచీ క్రమంగా వచ్చిన ఆధునికతనుంచి అప్పారావుగారి కన్యాశుల్కం ఉత్పన్నమైనదని నారాయణ రావు గారి ప్రతిపాదనలో ముఖ్య విషయం. బ్రిటీషు వలస విధానం వలన వచ్చిన ఆధునికత, చారిత్రకంగా సంప్రదాయకంగా వచ్చిన ఆధునికతని అణగ దొక్కింది. ఆకాలపు మధ్య తరగతి వారికి ఈ ఆధునికత సంస్కృతీస్మృతిభ్రంశం, మరుపూ కలిగించింది. ఏ తద్కారణంగా సంప్రదాయ విలువలు తగ్గు ముఖం పట్టాయి. అప్పటి సమాజం క్షీణదశలో ఉన్నదనీ, నైతికంగా పతనం అయిందనీ, మత సంబంధమైన పిచ్చిభ్రమలో సమాజం కొట్టుమిట్టాడుతున్నదన్నే నమ్మిక విద్యాధికులలో బలాన్ని పుంజుకున్నది.

ఈ సందర్భంలో అప్పారావుగారి నాటకంలో పాత్రలు మనముందుకొస్తాయి. ఈ పాత్రలన్నీ చురుకైనవి. సృజనాత్మకమైనవి. హాస్యం పుట్టించేవి; కడుపుబ్బ నవ్వించేవి, కవ్వించేవి. చాలా దృఢమైనవీను. అప్పారావుగారు తన నాటకంలో దిగజారిపోతున్న సమాజాన్ని, నైతికంగా పతనమవుతున్న సమాజాన్నీ సమర్పించలేదు. నైతిక వైరుధ్యం సమాజంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తలయెత్తితే ఆ సమాజం తనకు తానుగా మార్పు తెచ్చుకోగల స్థితిలో ఉన్నది కాని, సాంఘిక సంస్కరణకోసం ఎదురు చూడలేదు. ఈ సమాజం తనపై తనకి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేటంత వత్తిడి బ్రిటీషు వలస విధానం తెచ్చిపెట్టిన ఉధృతం. ఇందుచేత పైకులాలు తమ ప్రాథమిక యోగ్యతలని మరిచిపోవడం జరిగింది.

అప్పారావుగారికి ఈ సమాజంపై అవగాహన, సమకాలీన రచయితలైన బంకించంద్రకన్నా, టాగూరుకన్నా లోతుగా ఉన్నదన్న విషయం స్పష్టం అవుతుంది. ఆ రకంగా ఆయన ఎంతోముందుచూపు ఉన్న మహానుభావుడని చెప్పక తప్పదు.

బ్రిటీషు వలస విధాన నేపథ్యంలో కొన్ని సామాజిక విశేషాలు మననం చేసుకోవడం అవసరం. 19 వ శతాబ్దపు ఆఖరి దశాబ్దంలో, ముఖ్యంగా బెంగాల్‌ రాష్ట్రంలో ‘సంఘ సంస్కరణోద్యమం ‘ మొదలయ్యింది. బ్రిటీషు రాజ్యాధినేతలు ఈ ఉద్యమానికి మౌనాంగీకారం తెలిపారు కానీ, రాజకీయంగా పాల్గొన లేదు. కారణం : సిపాయి విప్లవం తరువాతనే ఈ ఉద్యమం ఆరంభం కావడం. రాజా రామ మోహన రాయ్ స్కూళ్ళల్లో సంస్కృతం చెప్పడం మానేసి, ఇంగ్లీషు బోధన కుపక్రమించమని అర్జీ రాశాడు, తనకు గా తాను సంస్కృత పండితుడే! కారణం : ఇంగ్లీషు విద్య మూలంగా మూఢ నమ్మకాలు, పిచ్చి భ్రమలూ, మూర్ఖత్వం పోయి కొత్తదైన సామాజిక స్వాతంత్ర్యం వస్తుందనే నమ్మకం. ఇందువల్ల జరిగిందేమిటంటే మహామహోపాధ్యాయులు, సంస్కృ త పండితులూ పక్కకి నెట్టబడ్డారు. సంప్రదాయ విద్య పూర్తిగా నాశనం అవడం మొదలయ్యింది. దానికి తోడు, టాగూరు భారత సాహిత్యానికి ఆధునికత తెచ్చాడనే ఉద్యమం దృఢపడి, ఆ పరిధిలోకి ఎంతోమంది సాహితీపరులు కూడా చొరబడ్డారు. ఈ ఉద్యమంతో, అంతకు పూర్వం వచ్చిన సాహిత్యం అంతా మలిన పూరితం, అశ్లీలం అన్న భావం పెరిగిపోయింది. సంఘ సంస్కరణకు తోడుగా సాహిత్య సంస్కరణ తలకెత్తింది.

తెలుగు దేశంలో ఈ ఉద్యమానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ప్రప్రథముడు, నాయకుడు. ఇంగ్లీషు విద్య అభ్యసించాడు. బ్రాహ్మణులలో విధవా వివాహానికి నాందీ వాక్యం పలికాడు. వేశ్యావృత్తి నిర్మూలనకి కంకణం కట్టుకున్నాడు. అప్పటినుంచి, ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళందరూ, క్రిష్టియన్‌ నీతికి, విక్టోరియన్‌ విలువలకి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది.

ఈ సాంఘిక నేపథ్యంలో అప్పారావుగారు విజయనగరం మహారాజా వారి (ఆనంద గజపతి) కొలువులోకి వచ్చారు. అక్కడ ఉండగా, కన్యాశుల్కం ( మొదటిది, రెండవదీ) రాయడం జరిగింది. రెండవ కన్యాశుల్కమే ప్రసిద్ధికెక్కిన నాటకం అన్న విషయం అందరికీ తెలిసినదే!

3.

కన్యాశుల్కం నాటకం ఏకార్థకం (monologic) కాదు. అది బహ్వర్థకం (polyphonic). ఏకార్థకంలో ఉన్న రచనల్లో రచయిత పాత్రల జీవన పద్ధతిని నిర్దేశిస్తాడు. వారందరి గొంతుకా అతనిదే! అట్లా కాకండా బహ్వర్థక రచనల్లో పాత్రలనుండి మనం రచయిత గొంతు వినం. పాత్రలు తమదైన స్వంత గొంతుతో తమ ప్రపంచంలో ఉండి మాట్లాడుతాయి. అంటే, రచయితకి ఏ విధమైన స్వతంత్రతా లేదని కాదు. ఈ పాత్రలన్నీ రచయిత తయారు చేసినవే! అయితే, ఈ పాత్రలన్నీ రచయిత వాక్కుతో సమాన స్థాయిలో మాట్లాడుతాయి. అంటే, స్థూలంగా, బహ్వర్థక రచనలో ఒకే ఒక్క సందేశం ఉండదు.

మన సాహిత్యంలో బహ్వర్థక రచనలు లేక కాదు. మహా భారతం, రామాయణం, బహ్వర్థక రచనలే! అవి బహ్వర్థక రచనలు కాబట్టే రకరకాల కోణాలనుంచి రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. ఒక్కొక్క సారి, కొన్ని కొన్ని వ్యాఖ్యలు, మూల గ్రంథ రచయిత “ఉద్దేశించిన” అర్థానికి ” వ్యతిరేకంగా ” కనిపించే అవకాశం ఉన్నది. మన ఋషులు రాసిన మహాకావ్యాలలో, పురాణాలలో బహ్వర్థకత్వం పాఠకులు గుర్తించినా, అప్పారావు గారు బహ్వర్థక రచన చేయగల సమర్థులు అనే ధ్యాస ఆ పాఠకులకి కలగక పోవచ్చు.

అప్పారావుగారి కన్యాశుల్కం నాటకంలో బహ్వర్థకంకి ఉదాహరణగా, నారాయణ రావు గారు ఏడవ అంకం ఆఖరి రంగం తీసుకొని వ్యాఖ్యానించారు. నిజానికి ఈ భాగం ఎవరికి వారు చదివి ఆకళింపు చేసుకొని ఆనందించ వలసిన భాగం. క్లుప్తంగా ఆభాగం గురించి వివరిస్తాను.

మదురవాణి మగవేషంలో ఎవరి అనుమతీ లేకండానే సౌజన్యారావు గారి గదిలోకి వస్తుంది. గిరీశం అక్కడే ఉంటాడు. గిరీశం మధురవాణిని గుర్తు పట్టాడా? లేదా? గుర్తు పట్టే ఉండచ్చు! మధురవాణి ఆ గదిలో ప్రవేశించినది మొదలు, చివరివరకూ కథ అంతా తన చేతిమీదే నడిపిస్తుంది. సౌజన్యా రావుకి మధురవాణి ఎవరో తెలియదు. మారు వేషంలో వచ్చిన వేశ్య అని మొదటే తెలిస్తే సౌజన్యారావుకీ ఆవిడకీ సంభాషణలే ఉండేవి కాదు. మదురవాణి గిరీశాన్ని పొగుడుతుంది. ఎంతసేపటివరకూ గిరీశాన్ని ఆ రంగంలో ఉంచాలో మధురవాణికి తెలుసు. ఎప్పుడు గిరీశానికి ఉద్వాసన చెప్పాలో కూడ ఆమె కెరికే! సౌజన్యారావుకి వేశ్యలంటే పడదు కదా! చాలా తెలివి గా వేశ్యలు తమ వృత్తి మానుకుంటే పొట్ట గడిచేది ఎట్లాగ అని చమత్కారంగా ప్రశ్నిస్తుంది. సౌజన్యా రావు వాళ్ళు చదువుకోవచ్చు; ఎవరినన్నావివాహం చేసుకోవచ్చు అంటాడు. గిరీశం లాంటి ‘మంచి వాడు’ వేశ్యని వివాహ మాడుతాడా? అని అడుగుతుంది. సౌజన్యారావు ఆ సలహాని తీవ్రంగా ఖండిస్తాడు! కారణం : అంతకుముందే విధవా వివాహం మిషతో గిరీశం సౌజన్యా రావుని బుట్టలో వేసుకున్నాడు. (ఆ విషయం మధురవాణికి తెలుసా? తెలియదా? ) అయితే, మీరు సంస్కరించబడ్డ వేశ్యని వివాహం చేసుకుంటారా? అని అడుగుతుంది. దానికి సౌజన్యా రావు మండి పడతాడు. వివాహం కాదు కదా, వేశ్యని తాకను కూడా తాకను అంటాడు. మధురవాణి సమయానుకూలంగా, అతి చాకచక్యంగా మాట్లాడి, ఇవ్వవలసిన గౌరవం ఇస్తూనే, సౌజన్యారావు తన గొయ్యి తనే తవ్వుకునేట్టు చేస్తుంది. అక్కడి సంభాషణలన్నీ అంచెలు అంచెలుగా ఎన్ని రకాలుగానన్నా వ్యాఖ్యానించవచ్చు.

లుభ్ధావధానులు పెళ్ళాడిన “పెళ్ళికూతురు” వైనం, కరటకశాస్త్రి పన్నిన పన్నాగం చెప్పడంలో మధురవాణి చూపిన మెరుపులు, విరుపులూ ఎవరినన్నా ముగ్ధుల్ని చెయ్యాలసిందే! ఈ సంభాషణలూ, రకరకాలుగా వ్యాఖ్యానించవచ్చు. చివరిలో, మానసికంగా బలిష్టులమని అనుకునే ఇద్దరు మగవాళ్ళని, గిరీశం, సౌజన్యా రావులని, వాళ్ళ అహంకారాన్నీ ధ్వంసం చేస్తుంది. మధురవాణికి మృచ్చకటికం, తెలుసు. వసంతసేన తెలుసు. భగవద్గీత కూడా తెలుసు! (?)

సౌజన్యా రావు కున్న అమాయకత్వపు సంస్కరణాభిలాష దెబ్బతియ్యడానికి మధురవాణి బృహన్నాటకం ఆడుతూ వుండవచ్చు. ఆధునికుడు, పాశ్చాత్య ప్రాభవంలో పెరిగిన పెద్దమనిషి, నీతులు వల్లించే వాడికి గుణపాఠం చెప్పడానికి మధురవాణి వచ్చి వుండవచ్చు. లేదా, కాలం మారుతున్నది; తన దగ్గిరకి గౌరవనీయులైన వాళ్ళెవ్వరూ రారేమో నన్న భయం పుట్టి వుండవచ్చు. — ఏది ఏమో? వీటికి సమాధానం అప్పారావుగారికే తెలియక పోవచ్చు!

ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ; ఆ సంస్కరణలో నిజమైన సాంఘిక విలువ ఏమీ లేదు. ఈ సంస్కరణ ఘోష కేవలం వలస రాజ్య విధానం వల్ల ఏర్పడ్డ బూటకపు మాయ అని బోధపడుతుంది.

అట్లాగే సుబ్బి పెళ్ళి విషయం తీసుకోండి. సుబ్బి బహుశా పది పనెండేళ్ళ పిల్ల. లుబ్ధావధానులు డెబ్భయ్యో పడిలో ఉన్న పండు ముదుసలి. ఇటువంటి వివాహాలకి వ్యతిరేకంగా సంఘసంస్కరణోద్యమకారులు దేశం నలుమూలలా గందరగోళం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎవరో బయటినుంచి వచ్చిన విద్యాధికులు, ప్రభుత్వ ప్రమేయంతో ఈ దురాచారాన్ని మటుమాయం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. పూజారి, పోలీసు, సేవకులు, స్కూలు పిల్లడు, పెళ్ళికొడుకు కూతురు (మీనాక్షి) అంతా ఈ పెళ్ళి కుదిర్చిన జిత్తులమారి రామప్పంతులునీ, పెళ్ళికొడుకుని మూర్ఖులుగా బయట పెడతారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ఎవరో, సౌజన్యారావు లాంటి అమాయకులు, సమాజం కుళ్ళిపోయిందని భ్రమించి, ఆ భ్రమని నమ్మి, సంస్కరించేద్దామన్న కుతూహలంతప్ప? అల్లాగే నాటకంలో బైరాగి, మిగిలిన తక్కువ కులాల జనాన్ని చూడండి. వాళ్ళందరికీ నిజానిజాలు తెలుసు, మోసం తెలుసు. వాళ్ళ స్థితి స్థానాలు తెలుసు.

వలస కాలంతో వచ్చిన ఆధునికత పేరుతో అవినీతి నిర్మూలన అనే ఉద్యమానికి అప్పారావుగారు వ్యతిరేకి అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే, ఇంగ్లీషు విద్య అవసరం, అనివార్యం అని అప్పారావుగారికి తెలుసు. ఇంగ్లీషు రాకపోవడం వల్ల జనానికి వచ్చే బాధలు తెలుసు. వలస విధానం వల్ల వచ్చిన, వస్తూవున్న అనర్థాలూ తెలుసు.

4.

మరి ఇంతకాలం విమర్శకులు ఈ నాటకాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకో లేకపోయారు? ఈ నాటకం సమాజం కుళ్ళిపోయిందని, సంస్కరణే శరణ్యమని ఉద్బోధ చేస్తున్నదని ఎలా చూశారు?

ఇందుకు నారాయణరావుగారు నాలుగు ముఖ్య కారణాలు చెప్పుతున్నారు. మొదటి కారణం : ఈ నాటకం మొదటి ప్రచురణ – దాని ప్రదర్శన (1892) కి సంబంధించిన సందర్భం. రెండవ కారణం : ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వలస రాజ్య ప్రాబల్యంవల్ల వచ్చిన సమకాలీన సాహిత్య రాజకీయ వాతావరణం. మూడవ కారణం : తెలుగు రచయితలపై, ఆధునిక విద్యావంతులపై టాగూరు గారి ప్రబల ప్రభావం. నాలుగవ కారణం : మార్క్సిస్టులు వాళ్ళ సాంఘిక రాజకీయాలకోసం ఈ నాటకాన్ని స్వంతం చేసుకోవడం.

మొదటి కన్యాశుల్కం నాటకం విజయనగరం మహారాజావారి సంఘసంస్కరణాభిలాష కై రాయబడింది. ఆ పుస్తకంలో రాసిన ఉపోద్ఘాతం, అంకితం వాక్యాలు, విద్యాధికులలో చెరగని ముద్ర వేశాయి. తరువాత అప్పారావు గారు (1909) రెండవ కన్యాశుల్కం రాసారు. ఇదే మనందరికీ అందుబాటులోకొచ్చిన నాటకం. ఇందులో, ఆయనకి అర్థమైన సమాజ పరంగా చాలా మార్పులు ఉన్నాయి. నిజంగా మొదటి కన్యాశుల్కానికీ, రెండవ కన్యాశుల్కానికీ చాలా తేడాలున్నాయి. ఆయన, ఎక్కడా ఈ రెండవ కన్యాశుల్కం ‘ఎల్లా చదవాలో’ చెప్పలేదు. అక్కడక్కడ ఉత్తరాలలోను, డైరీలలోను చిన్న చిన్న సూచనలు చేసి ఊరుకున్నాడు. నాటకం పేరు ఒకటే. మొదటి నాటకానికి రాసిన ఉపోద్ఘాతం, అంకిత పత్రం, మహారాజాగారి బొమ్మ, అన్నీ అలాగే ఉంచారు. రెండవ ఉపోద్ఘాతంలో భాషగురించే ఎక్కువగా రాసారు. బహుశా ఆయన అప్పటికి ఇంకా విజయనగర ఆస్థానంలో ఉద్యోగిగా ఉండడమే కారణం కావచ్చు.

వలస రాజ్య సంస్కృతి వలన ప్రభావితమైన ఆధునికోద్యమం ఈ నాటకం మరోవిధంగా చదవడానికి ప్రేరణ చేసి ఉందకపోవచ్చు. వీరేశలింగం ప్రభృతులు చాలా పలుకుబడిగలవారు. ఇంగ్లీషు చదువులు చదుకున్నవాళ్ళు ఆయన పూనుకున్న సంస్కరణోద్యమానికి జోహార్లర్పించడం జోరుగా ఉండేది. సంప్రదాయ పండితులు రెండవతరగతి పౌరులయ్యారు. టాగూరు గారి ప్రభావం తెలుగు కవులమీద విపరీతంగా పడింది. పాతంతా రోత అయి, అమలిన శృంగారం పేరుతో, భావకవిత్వం ఉర్రూతలూగించింది. టాగూరు వలస కాలపు సాహిత్యానికి, సంస్కృతికీ ప్రతినిథి. విశ్వకవి అనడంతో, అప్పారావుగారి వంటి దూరదృష్టి ఉన్న విజ్ఞులకి సాంస్కృతిక సాహిత్య రంగాలలో చోటులేకుండా పోయింది. క్రిష్టియన్‌ నీతులు, విక్టోరియన్‌ విలువలూ తెలుగు దేశ విద్యావంతులపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. అదే సమయంలో, వీరేశలింగంగారు మధ్యయుగ తెలుగు సాహిత్యాన్ని అశ్లీలంగా పరిగణించి వాటిపై ఘాటైన విమర్శలు రాసారు. కేంబ్రిడ్జ్‌ లో చదువుకున్న రామలింగారెడ్డి గారు సాహిత్యరంగంలోకి దూకి వలస కాలానికి పూర్వం వచ్చిన ప్రబంధసాహిత్యం పై దుమారం లేవదీశారు

మార్క్సిస్టులు కన్యాశుల్కాన్ని తమదిగా చేసుకోవటంతో ఆ నాటకానికి మరొక వ్యాఖ్య రాకండా పోయింది. మార్క్సిస్టు విమర్శకులు సమాజానికి వేశ్యల వల్ల వచ్చే అనర్థాలకి ప్రతీకగా మధురవాణిని చిత్రించి, ఆ పాత్ర ద్వారా సంస్కరణకి దోహదం చెయ్యాలని మొదలుపెట్టారు. 20 వ శతాబ్దంలో, అభ్యుదయ రచయితల సంఘం (మార్క్సిస్టుల సాహిత్య శాఖ) ఈ నాటక రచయితను సమాజ పరివర్తనకి దోహదకారిగా, ఫ్యూడల్‌ వ్యవస్థకి వ్యతిరేకిగా, వేశ్యావృత్తి నిర్మూలనకి నిబద్ధుడిగా చిత్రించడం మూలంగా మరొక గొంతు వినపడటానికి తావులేకుండా పోయింది.

గిరీశం మోసగాడుగా, మధురవాణి చదువు, సంస్కారం, మంచిహృదయం ఉన్న వేశ్యగా, పరివర్తన పొందటానికి సుముఖంగా ఉన్న దానిగా చిత్రించడం, అగ్నిహోత్రావధానులునీ, లుబ్ధావధానులునీ, క్షీణదశలో ఉన్న బ్రాహ్మణ సంస్కృతికి ప్రతీకలుగా చిత్రించి మూక ఉమ్మడి ప్రచారం చెయ్యడం జరిగింది.

అప్పారావుగారు వీరేశలింగంగారి సంస్కరణలతో పూర్తిగా ఏకీభావం చూపించే వ్యక్తిగా చిత్రించబడ్డాడు. ఆ సాహిత్య వ్యక్తిత్వం ఈ ‘సంస్కరణ’ పరిధిలో పడి తిరిగి బయటికి రాలేదు.

5.

ఈ నాటకాన్ని కుదించి కత్తిరించి కొన్నివందలసార్లు దేశవ్యాప్తంగా ప్రదర్శించడం మూలంగా ఏం జరిగిందో చెబుతాను. ఇది నా ఉద్దేశం. నారాయణరావు గారి అనువాదంతో గాని, ఆయన రాసిన వెనుకమాటతో గాని దీనికి సంబంధం లేదు. అసలు రెండవ కన్యాశుల్కం ఎక్కడన్నా ఎప్పుడన్నా ప్రదర్శించారో/ప్రయోగించారో లేదో తెలియదు. నాకు తెలిసినంతలో ఈ నాటకాన్ని ఎప్పుడూ కుదించే ప్రదర్శించేవారు. అబ్బూరి రామకృష్ణారావుగారు తను చేసిన కుదింపు గురించిన వివరణ అనుబంధంలో ఉన్నది. నార్ల వెంకటేశ్వర రావుగారు సాహిత్య అకాదెమీ కోసం ఈ నాటకాన్ని సగానికి కుదించారు. తన కుదింపును ఎవరు విమర్శించినా, అబ్బూరి వారు మెచ్చుకోవచ్చని ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. వెంకటేశాన్ని అగ్నిహోత్రావధాన్లు జుట్టు పట్టుకొని కొట్టబోతున్న ఘట్టంతోనే అబ్బూరి గారు కూడా నాటకం ఆపుచేసేవారు.

కన్యాశుల్కంలో మనల్ని ఆకర్షించేవి సంభాషణలు. ముఖ్యంగా గిరీశం వల్లించే హాస్యోక్తులు. అతగాడి ఇంగ్లీషు! మధురవాణి చెప్పే అందమైన మాటలు, పూటకూళ్ళమ్మ చీపురు దెబ్బలు. కన్యాశుల్కంలో చాలా మాటలు ఆధునిక సంస్కృతిలో భాగం అయిపోయినాయి. అది నిజంగా గొప్ప విషయమే! అయితే గిరీశం మోసగాడే అయినా వాడంటే జనానికి అదోరకమైన సానుభూతి. నిజంగా బుచ్చమ్మ మీదకన్నా వాడిమీదే సానుభూతి. ఇక లుబ్ధావధానులు, అగ్నిహోత్రావధానులూ, ప్రదర్శనలో పరమ ఛాందస మూర్ఖుల్లా కనిపిస్తారు. వాళ్ళంటే ఎగతాళి. సౌజన్యా రావుతో అగ్నిహోత్రావధానులు చేసే సంభాషణలు కత్తిరింపుల్లో పోవడం మామూలు కాబట్టి, వాళ్ళు మూర్ఖులనే చిత్రమే మనకు కనిపిస్తుంది. అలాగే లుబ్ధావధానులు రామప్పంతులుతో చేసే సంభాషణలు చాలా కుదింపులో పోతాయి. రామప్పంతులుని గేలి చేసే భాగం సాధారణంగా పోతుంది, ఈ కుదింపుల్లో! కారణం : ప్రయోక్తల ‘ఉద్దేశంలో’ జనానికి విసుగు పుడుతుందన్న భయం. జన రంజకంగా ఉండటానికి లుబ్ధావధానులు, అగ్నిహోత్రావధానులు సనాతనులుగా, పరమ మూర్ఖులుగా చూపించడం అవసరం. అలాగే కరటక శాస్త్రి, మహేశం, మధురవాణి ఈ పెళ్ళిని ఆపడానికి ఆడించే భాగాలు, ఆ మాటలూ ప్రజల మనస్సులో ఉండవు. అవి మరుగున పడిపోతాయి. కారణం: అందులో హాస్యం పాలు చాలా తక్కువ.

1955 లో కేతవరపు రామకోటిశాస్త్రి గారు కన్యాశుల్కంపై రాసిన వ్యాసంలో ఇలా ఇలా రాసారు : “ఈ రూపకములో ప్రవేశపెట్టబడిన పాత్రములు నాటికాలమున నున్న కొందరనుద్దేశించి యున్నవని విశాఖజిల్లా వారు చెప్పుదురు.” ఆయన తరువాత మార్క్సిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమై కన్యాశుల్కంపై చాలా వ్యాసాలు రాసారు. అయితే, ఏ వ్యాసంలోనూ మళ్ళీ ఈ ప్రస్థావన తేకపోవడము కొందరికి ఆశ్చర్యమే!

6.

ఏది ఎలావున్నా, పాక్షిక దృష్టి పక్కకునెట్టి, నారాయణరావు అనువాదం, వెనుకమాటలు చదివినతరువాత, మళ్ళీ తెలుగు కన్యాశుల్కం చదివి, వేరే కోణంనుంచి ఆ నాటకాన్ని అర్థం చేసుకోవడం అవసరమేనని అనిపిస్తుంది.

ఈ వ్యాసం రాయడానికి ఉపయోగపడిన పుస్త కాలు:

  1. మన గురజాడ — శ్రీశ్రీ (శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం -9 : కూర్పు చలసాని ప్రసాద్, 1988)
  2. మళ్ళీ కన్యాశుల్కం గురించి — కేతవరపు రామకోటి శాస్త్రి (1992)
  3. కన్యాశుల్క నాటక కళ — సర్దేశాయి తిరుమల రావు (1994)
  4. కన్యాశుల్కం — నూరేళ్ళ సమాలోచనం — సంపాదకులు : మొదలి నాగభూషణ శర్మ, ఏటుకూరి ప్రసాద్ (1999)
  5. మహోదయం — కె. వి. రమణా రెడ్డి (1958)
  6. కన్యాశుల్కం, మరోవైపు — కోవెల సంపత్కుమారాచార్య (2000)
  7. గురజాడ రచనలు – కవితల సంపుటం, సెట్టి ఈశ్వర రావు, పరిష్కర్త (1984)
  8. అబ్బూరి సంస్మరణ — నాట్య గోష్టి ప్రచురణ (1988)
  9. కన్యాశుల్కం – సామాజిక సంబంధాలు, కాత్యాయనీ విద్మహే (2005)
  10. కన్యాశుల్కం , టీకాటిప్పణి , కె.వి. రమణారెడ్డి (1991)
  11. నాయెఱుక , ఆదిభట్ల నారాయణ దాసు స్వీయ చరిత్ర (1976)
  12. కన్యాశుల్కం, గురజాడ ( జయంతి పబ్లికేషన్‌, 1983)
  13. గురజాడ అప్పారావు – కన్యాశుల్కము, కుదింపు కూర్పు, నార్ల వెంకటేశ్వర రావు (1976)
  14. సారస్వత వివేచన — రాచమల్లు రామచంద్రా రెడ్డి (1976)

[కన్యాశుల్కం నాటకం పై గత 50 సంవత్సరాలుగా వచ్చిన పొగడ్తలు, విమర్శలు, ప్రతివిమర్శల నుండి పాఠకులకు పనికివచ్చే కొటేషన్లు ఈ అనుబంధంలో నేను పొందుపరచాను. — రచయిత]