గత పది ఏళ్ళల్లో మా తెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారిగురించి రెండుమూడుసార్లు ముచ్చటించాను. అయితే, ఇప్పుడు చెప్పబోయే విషయం, ఎప్పుడైనా ఎక్కడైనా రాసానేమో గుర్తులేదు. ఒకవేళ రాసినా, పునశ్చరణం, పునః పునశ్చరణం చేసుకోవడం అవసరమేనని పిస్తుంది. అందులో నామర్దా ఏమీ లేదు.
మా తెలుగు మేష్టారు గరికపాటి మల్లావధాని గారు శతావధాని. ఆంధ్ర గీర్వాణవిద్యాపీఠంలో చదువుకున్నారు, సంస్కృతం, తెలుగూనూ. ఖద్దరు కట్టేవారు; స్వాతంత్ర్య సమరంలో పాల్గొని,అల్లీపురం జైలులో ఒక సంవత్సరం కఠిన శిక్ష అనుభవించారు. జైల్లో ఊసు పోవడంకోసం అవధానాలు చెయ్యడం మొదలెట్టారు. ఎం.ఎ. డిగ్రీ లేకపోబట్టి కాలేజీలో పండితుడిగా,లెక్చరర్ కన్నా చాలాతక్కువ వేతనంతో పనిచేశారు. ఇప్పుడు,ఈ రోజున నాకు కాస్తో కూస్తో తెలుగు వంటపట్టిందీ అంటే, అది ఆయన చలవేనని ఒప్పుకోక తప్పదు.
అప్పట్లో, కాలేజీ రోజుల్లో, అంటే యువరక్తం పెల్లుబికే రోజుల్లో విషయం వేరు. తెలుగు మేష్టారి క్లాసులో ఈలలెయ్యడం, వెనకబెంచీలోకూర్చొని పేపరు బాణాలు విసరడం,పిల్లికూతలు కూయడం చేతకానివాడు ప్రపంచకంలో ఎందుకూ పనిరాని అప్రయోజకుడనే దృఢనమ్మకంతో బతికిన రోజులవి.
విజ్జిక సంస్కృతంలో రాసిన కౌముదీమహోత్సవనాటకం – తెలుగు అనువాదం పాఠ్యగ్రంథం. పుస్తకంనిండా ఒకటే వర్ణనలూ!ముఖ్యంగా స్త్రీల తల కొప్పు నుండి,కాలి గోటి వరకూ వర్ణనలన్నీఛందస్సులో! మేష్టారు రాగయుక్తంగా చదివేవారు. అడగగానే ప్రతిపదార్థాలు కూడా చెప్పేవారు. అయితే,మాలాంటి అల్లరిమూక కావాలనే కొన్ని సంస్కృతపదాలకి అర్థంతెలిసికూడా, అడిగినదే పదేపదే అడగడం ఆనవాయితీ. విజ్జిక వర్ణనలు మరీ విపరీతంగా ఉన్నాయి మేష్టారూ అని అరవగానే, క్లాసులో వికవికలూ పకపకలూ మామూలు.
చక్కని సున్నితమైన శృంగార వర్ణనలు అమరు శతకంలో ఉన్నాయి, అని అంటూ మేష్టారు, అమరు శతకంలోనుంచి శ్లోకాలు, అనువాదాలు చదివే వారు. మాకు కాస్తన్నా తెలుగు అంటుతుందేమోనని ఆయన విశ్వప్రయత్నం చేసేవారు . ఆయన ప్రయత్నం వృధాయే. మాకు అల్లరి ముఖ్యం. ఎవడు ఎక్కువ అల్లరి చేస్తే, వాడు అంత గొప్ప. అప్పట్లో పనికిమాలిన అల్లరి ego booster.
ఈ అల్లరి మూకకి నేను ఒక ring leaderఅని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను. ఈ విషయం మేష్టారికి తెలుసునన్న సంగతి అప్పట్లో నాకు సంవత్సరాంతం వరకూ తెలియదు. కళ్ళుమూసుకొని పాలుతాగే పిల్లి తంతు.
అయితే సంవత్సరాంతంలో అందరి మేష్టర్లదగ్గిరకీ వెళ్ళి, అందమైన బైండు పుస్తకంలో ఆటోగ్రాఫులు తీసుకోవడం ఆరోజుల్లో ఆచారం. మేష్టర్లందరూ అడిగిన ప్రతి విద్యార్థికీ ఏదో ఒక సందేశం కూడా రాసే వాళ్ళు.
నేనూ ఒక పుస్తకం పట్టుకొని మా తెలుగు మేష్టారిదగ్గిరకి వెళ్ళాను, ఆటోగ్రాఫ్ కోసం. ఆయన ఆశువుగా నాకొక పద్యం రాసి ఇచ్చారు. ఇదిగో ఆ పద్యం.
మీరి చరించెడు నెడ కాల్
జారినచో తీసికొనగ సాధ్యమ కానీ
నోరే జారినచో నిక
నేరీతిన్ దీయవచ్చునే? విద్యార్థీ!
సుమారు ఐదు దశాబ్దాలక్రితం నాకు, (నా గురించే!) రాసి ఇచ్చిన పద్యం ఇది. నాకే కాదు; నాలాగా తొందరపడే చాలా మందికి వర్తించే పద్యం. ఇప్పుడు, నాకు పొరపాటున కాలు జారినా తీసుకోవడం కష్టమే. చాలాసార్లు, రాసేటప్పుడు, ఎవరో మిత్రుడన్నట్టు అప్పుడప్పుడు – రొచ్చులో పడడం – ఇప్పటికీ జరుగుతూ ఉన్నదే. అయితే, ఆ రొచ్చులోనుంచి బయట పడటానికి, రచ్చలోకి దిగడం అనవసరమని అర్థమవుతున్నది. కొద్దిముందు చూపు ఉంటే, రాసింది పదిసార్లు చదువుకుంటేనో, లేక మరెవ్వరైనా చదివి సలహా ఇస్తేనో, రొచ్చులో పడడం జరగకపోవచ్చు. ఇది నా గురించి.
పోతే, కవులు, కథకులూ, వ్యాస రచయితలూ, చాలా సున్నితమైన వాళ్ళు. విమర్శలు సునిశితంగాను, సూటిగాను,పెళుసుగా లేకుండానూ చెయ్యడం అవసరం. ఈమాట అభిప్రాయవేదికలో వ్యక్తిగత దూషణకి తావు లేదు. ఓక్కొక్క సారి, పొరపాటున దూకుడుగా అనాలోచితంగా రాసిన వాక్యాలు కత్తిరించకండా ప్రచురించడం జరిగింది. అందుకు నా క్షమాపణలు. ఇక ముందు కత్తిరించవలసిన పరిస్థితి రాకుండా సహకరించమని నా మనవి.
(అమరు శతకం మా మేష్టారు, కీ.శే. గరికపాటి మల్లావధాని గారు తెలుగులోకి అనువదించారు. అందులో నుంచి రెండు పద్యాలు, వాటిమూల శ్లోకాలు, ఆంగ్ల అనువాదాలు, అమరు గురించి ప్రచారంలో ఉన్న కథలూ ఈ అనుబంధ వ్యాసంలో చదవగలరు. — రచయిత)