[శ్రీ కొడుకుల శివరాం కర్ణాటక, హిందూస్తానీ సంప్రదాయ సంగీతాల్లో విశేషమైన ప్రతిభ కలవారు. సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి వద్దా, ఇంకెందరో ప్రసిద్ధుల వద్ద, చాలా కాలం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. తన ఎనిమిదేళ్ళ వయసు నుంచే ఎన్నో సంప్రదాయ సంగీత కచేరీలు చేశారు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కచేరీలే కాకుండా గజల్స్, లలిత సంగీతాల్లో కూడా కచేరీలు చేస్తున్నారు. ఆస్టిన్లోనే ఉంటారు.
పోతన గారి భాగవతాన్ని గురించి ఎవరికీ పరిచయం చెయ్యక్కర్లేదు. ఆయన పద్యాలు మందార మకరందాల్ని కురిపిస్తాయనేది తరతరాల తెలుగు వారికి తెలిసిన విషయం. ఆ పద్యాలు శ్రీ శివరాం గారి గళంలో పలికితే అది పసిడికి తావి అబ్బటంలా ఔతుందని వారిని కోరటం, అందుకు ఆయన ఆనందంగా ఒప్పుకుని ఎంతో శ్రమ, సమయం వెచ్చించి ప్రథమ స్కంథంలో నుంచి 22 పద్యాల్ని తీసుకుని బాణీలు కట్టి, గళంతో పాటు వాద్య సహకారం కూడ జతచేర్చి ఒక గంట running time పాటు రికార్డ్ చెయ్యటం జరిగాయి (కె. వి. ఎస్. రామారావు లఘువ్యాఖ్యానం సమకూర్చారు).
“ఈమాట” పాఠకుల కోసం ఈ శ్రావ్యమైన “భాగవత గానం” అందజేస్తున్నాం. పాడటానికి ఎంచుకున్న పద్యాలు, వాడిన రాగాలు ఇక్కడ ఇస్తున్నాం. Audio files శ్రీ శివరాం గారి copy righted material. కనుక దయచేసి వాటిని కాపీ చేసుకోకండి. –సం]
1. భాగవత పరిచయం
2.
శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్థంభకు కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకున్ (హంసధ్వని)
3.
వాలిన భక్తి మ్రొక్కెద అవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికిన్
బాలశశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ (మలయమారుతం)
4.
ఆతత సేవ సేసెద సమస్త చరాచర భూతసృష్టి వి
జ్ఞాతకు భారతీహృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికర నేతకు కల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్ (కళ్యాణి)
5.
ఆదరమొప్ప మ్రొక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికా
ఛ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్
మోదకఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ (అభేరి)
6.
క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి రక్షితానత
శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి అక్ష దామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్ (సరస్వతి)
7.
అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ (సింధుభైరవి)
8.
హరికిన్ పట్టపుదేవి పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పూబోడి తా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్యకళ్యాణముల్ (దేష్)
9.
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెట వాటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె ఈ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ (శివరంజని)
10.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా తలపడేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు (చక్రవాకం)
11.
మెరుగు చెంగట నున్న మేఘంబు కైవడి
ఉవిద చెంగట నుండ నొప్పువాడు
చంద్ర మండల సుధాసారంబు పోలిక
ముఖమున చిరునవ్వు మొలచువాడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
బలువిల్లు మూపున పరగువాడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి
ఘన కిరీటము తల గలుగువాడు
పుండరీక యుగము బోలు కన్నుల వాడు
వెడద యురము వాడు విపుల భద్ర
మూర్తి వాడు రాజముఖ్యు డొక్కరుడు నా
కన్నుగవకు నెదుర కానబడియె (భాగేశ్వరి)
12.
పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట నే
పలికిన భవ హర మగునట
పలికెద వేరొండు గాధ పలుకగ నేలా (ఆరభి)
13.
ఒనరన్ నన్నయ తిక్కనాది కవులీ యుర్విం పురాణావళుల్
తెనుగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో
తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా
జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ (బిలహరి)
14. భీష్మస్తుతి పరిచయం
15.
త్రిజగన్మోహన నీల కాంతి తను వుద్దీపింప ప్రాభాత నీ
రజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాడు మది నావేశించు ఎల్లప్పుడున్ (చంద్రకౌన్స్)
16.
హయ రింఖా ముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాత శ్రమ తోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయమున్ పార్థున కిచ్చు వేడ్క అని నా శస్త్రాహతిం చాల నొ
చ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్ (ఖరహరప్రియ)
17.
నరు మాటల్విని నవ్వుతో ఉభయసేనా మధ్యమ క్షోణిలో
పరులీక్షింప రథంబు నిల్పి పర భూపాలావళిం చూపుచున్
పర భూపాయువు లెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ
పరమేశుండు వెలుంగుచుండెడు మనఃపద్మాసనాసీనుడై (శహన)
18.
తన వారి చంపజాలక
వెనుకకు పో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగ విద్య బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్ (కేదారగౌళ)
19.
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల కప్పికొనగ
ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నా లావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ
కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు
విడువుమర్జున యనుచు మద్విశిఖ వృష్టి
తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు (సింహేంద్రమధ్యమం)
20.
తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు వొమ్మంచు అ
ర్జున సారథ్యము పూని పగ్గములు చే చోద్యంబుగా పట్టుచున్
మునికోలన్ వడి చూపి ఘోటకములన్ మోదించి తాటింపుచున్
జనులన్ మోహము నొందజేయు పరమోత్సాహుం ప్రశంసించెదన్ (హంసానంది)
21.
పలుకుల నగవుల నడపుల
అలుకల అవలోకనముల ఆభీర వధూ
కులముల మనముల తాలిమి
కొలుకులు వదలించు ఘనుని కొలిచెద మదిలోన్ (ఆనందభైరవి)
22.
మునులు నృపులు సూడ మును ధర్మజుని సభా
మందిరమున యాగ మండపమున
చిత్ర మహిమ తోడ చెలువొందు జగదాది
దేవుడమరు నాదు దృష్టి యందు (కానడ)
23.
ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచు పో
లిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూ
పకుడై యొప్పుచునుండు అట్టి హరి నే ప్రార్థింతు శుద్ధుండనై (రేవతి)
ఫలశ్రుతి
24.
లలిత స్కంధము కృష్ణ మూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్ సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్ సుందరో
జ్వ్జల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్వ్దిజశ్రేయమై (మోహనం)