(చెన్నై మైలాపూర్‌లో ఉన్న దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు ఉద్యానవనంలో మఱ్ఱిచెట్టు కింద కూర్చుని ఓ రోజు పాట రాస్తుండగా మఱ్ఱిపళ్ళూ, ఆకులూ జలజలమంటూ తలమీద రాలసాగాయి. తలెత్తి పైకి చూశాను. ఆహా! రాలుతున్న ఆకు ఎంత అందం! పడిపోతున్నా ఎంత ఉత్సాహం! ఏ ఆకులోనూ మరణఛాయ లేదు; దుఃఖపు రేఖ లేదు. ‘నా గురించి రాయి,’ అంది ఓ ఆకు. పాట కిటికీనలా మూసివేసి, కవిత తలుపు తెరుచుకున్నాను.)
ఈరోజో… రేపో…
ఇప్పుడో… తర్వాతో…
రాలిపోతానుకడప్రాణం చివరి పోగు
కొమ్మ పట్టుకు వేలాడుతున్నా
రాలిపోతానుఇలై – కవి వైరముత్తు స్వరంలోవీచేగాలి అలజడి చేసినా
రాలే చినుకు ముత్యం తాకినా
పిచ్చుకొక్కటి వాలి కొమ్మన
ఒక్కపరిగా రెక్కలార్చినా
నేను రాలిపోతాను
వీడ్కోలివ్వు వృక్షమా
వీడ్కోలివ్వుఉన్నన్నాళ్ళు నాపై
ఎన్ని నిందలో
గాలి వేసే తప్పుడు తాళానికీ
తలాడిస్తానట
రెట్ట వేసే పక్షులకీ
పచ్చజెండా ఎగరేస్తానట
పక్క ఆకులతో
పొద్దస్తమానం రుసురుసలేనటఇదిగో
నా మరణాన్ని దృష్టిలో పెట్టుకుని
క్షమించేశాయి నన్ను తోటి ఆకులుఊపిరి ఉంటే లేని విలువ
అదే లేకపోతే వస్తుందా?
జీవితపు వెలితికి
మరణమే పూరణమా?
సంపూర్ణ జీవితం నాది
నేను స్నానమాడిన తరువాతే
వాననీటితో
భూమి స్నానమాడింది
సూర్యకిరణం
మొదట నన్ను తాకాకే
మట్టిని తాకింది
పగలు నా ఊపిరితోనే కదా
తేటతేరింది కాలుష్యపు గాలిఈ ప్రపంచం నుండి
నేను తీసుకున్నది తక్కువ
తిరిగి ఇచ్చింది ఎక్కువ
ఆకునే ఐనా నా జీవితం లోనూ
మరిచిపోలేని
సంఘటనలు రెండుఆచూకీ తెలియని తుఫానొకటి
చివురుటాకులు సైతం తెంపుకెళ్ళిన
ఆ కాళరాత్రీ –పూవూ తేటి తన్మయత్వంలో ఒకటై
సిగ్గుతో నేను
సాటి ఆకు చాటుకు ఒదిగిపోయిన
ఆ మదనోదయమూ –
ఒకరోజు ఆసరా కోరి
వచ్చి వాలిన పక్షి
ఎత్తిపొడిచింది నన్ను“పువ్వులాగా పుట్టకుండా
పండులాగా మారకుండా
ఆకులానే పుట్టినందుకు
ఆకు రూపం దాల్చినందుకు
ఎప్పుడైనా బాధ పడ్డావా?”గాలి సాయంతో
గలగలమని నవ్వాను“అదృష్టం నాది
నేను పువ్వుని కాను
తుమ్మెదలు నా శీలాన్ని
దోచుకుంటాయని బాధ లేదుఅదృష్టం నాది
నేను పండుని కాను
చిలకల గుంపులు
నా శరీరాన్ని ముక్కలు
చేస్తాయని దిగులు లేదునాకు నేనై ఆకునై
ఉండటం స్వర్గం
ఏదో కావాలని కాలేదని
కుమిలిపోవడం నరకం.”
అదిగో అదిగో
గాలి రూపంలో
వస్తోంది నా చావుఇదిగో ఇదిగో
భూమివైపు
సాగుతోంది నా తనువుతప్పుకో తుమ్మెదా
దారివ్వు మిడతామరణమా నీకు కృతజ్ఞతలు
బ్రతుకు ఇవ్వని వరమొకటి
నువ్వు ప్రసాదించావుపుట్టిననాటినుండి నే
ముట్టుకోలేని మట్టితల్లిని
మొదటిసారి ముద్దాడబోతున్నాను
వచ్చేశాను తల్లీ వచ్చేశాను
నన్ను అక్కున చేర్సుకుని పొదువుకోఆహా! సుఖం!
అద్వైతం!
విచారించకు వృక్షమా
ఇది తుదికాదు
మరో మొదలుబ్రతుకు ఒక చక్రం
మరణం ఒక ఆకు
చక్రం తిరుగుతుందికొమ్మకు మళ్ళీ
మరో రూపంలో
నీ వేరు నుంచి పుడతానుఇదిగో
నా కోసం ఒక్కసారి మిగతా
ఆకుల్ని చప్పట్లు కొట్టమనవూ?
(మూలం: తమిళ కవి వైరముత్తు, తమిళుక్కు నిఱముండు – 1995 (తమిళానికి రంగుంది) కవితా సంపుటి నుంచి ఇలై అన్న కవిత. మూల కవిత తెలుగు, తమిళ్ లిపిలో.)