తేలిక తెలుగు

“ప్రయోగం పేరిట పవిత్రమైన మన భాషని అభాసు చేస్తావుటయ్యా, ఱావూ!”

– మరొక శంకరశాస్త్రి.

1. తేలిక తెలుగు అవసరం ఏమిటి?

కేలిఫోర్నియా విశ్వవిద్యాలయపు డేవిస్ కేంద్రంలో, ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి దశకంలో, మొదటి సంవత్సరం విద్యార్థులకి ఆరేళ్ళపాటు తెలుగు నేర్పేను. ఆ సందర్భంలో తెలుగు రెండవ భాషగా నేర్పడంలో ఉన్న కష్టాలు కొన్ని అర్థం అయాయి. ఈ కష్టాలనుండి గట్టెక్కడానికి రకరకాల చిటకాలు వాడవలసి వచ్చింది. పబ్బం గడుపుకోడానికి వాడిన ఈ చిటకాలు అన్నీ తెలుగువాళ్ళు అందరూ ఆమోదిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాని అప్పటి ఆలోచనలని క్రమబద్ధం చేసి ఎక్కడో ఒకచోట రాసి పెట్టాలనే కోరికే ఈ వ్యాసానికి ప్రేరణ.

తరగతిలో సగటున 15 నుండి 20 వరకు విద్యార్థులు నమోదు అయేవారు. వీరి వయస్సు ఇటూ అటూగా 18 ఏళ్ళు. వీరిలో భారతీయ సంతతి ఇద్దరో ముగ్గురో ఉంటే, అందులో తెలుగు సంతతి ఒకటో అరో ఉండేవారు. ఈ భారతీయ సంతతిని మినహాయిస్తే, ఈ తరగతిలో ఉన్న విద్యార్థులకి తెలుగు భాష గురించి ఏమీ తెలియదు. ఈ భాషని ఎప్పుడూ విని ఉండలేదు. అంటే వీరికి తెలుగుతో పరిచయం పరమ పూజ్యం. “మీరు తెలుగు తరగతిలో ఎందుకు నమోదు అయేరు?” అని అడిగితే “కేవలం కుతూహలం,” అని కొందరు, “భాషాశాస్త్రం అధ్యయనం చెయ్యాలని ఉంది, అందుకని,” అని మరి కొందరు చెప్పేవారు.

ఈ రకం విశ్వవిద్యాలయపు విద్యార్థులకి తెలుగు నేర్పుతూన్నప్పుడు వారందరూ ఛందోబద్ధంగా కవిత్వం రాయగలగాలని కాని, అటువంటి కవిత్వం చదివి అర్థం చేసుకుని ఆనందించాలని కాని నేను ఎప్పుడూ ఆశించలేదు. తెలుగు వినడానికి వారి చెవులకి తరిఫీదు ఇవ్వడం, నిత్య జీవితంలో పనికొచ్చే తెలుగు పదసంపదని వారికి పరిచయం చెయ్యడం, తెలుగు చదవడం, రాయడం – గీత బాగుంటే, మాట్లాడడం – వస్తే చాలని అనుకున్నాను. ఇది చాల పరిమితమైన గమ్యం. పది వారాల కాల పరిమితిలో, వారానికి రెండు గంటల బోధనతో ఇంతకంటె ఆశించడం అవివేకం అనిపించింది. పరిస్థితులు అనుకూలిస్తే తెలుగు వ్యాకరణంలో ఉన్న ప్రత్యేకతలు ఎత్తి చూపాలని కూడ అనుకున్నాను. ఇటువంటి పరిమితమయిన లక్ష్యంతో నా ప్రయాణం మొదలయింది.

తెలుగు రెండవ భాషగా నేర్పడం అనేది తెలుగు వారికి ఒక కొత్త అనుభవం. మన పిల్లలకి తెలుగు నేర్పబూనుకున్నప్పుడు, అప్పటికే వారికి భాష మీద బాగా పట్టు ఉంటుంది. మనం నిజంగా వారికి నేర్పేది రాయడం, చదవడం, వ్యాకరణం, వగైరాలు – భాష కాదు. అమెరికాలో తారసపడే విద్యార్థులకి తెలుగు నేర్పేటపుడు పరిస్థితి వేరు; ఈ పరిస్థితులకి అనుకూలంగా నేర్పాలి కాని, ‘ఎప్పుడో మా తాతలనాడు పడవలలో ప్రయాణం చేసేం కనుక ఇప్పుడూ పడవలే వాడాలి’ అనే కోణం కుదరదు.

2. తేలిక తెలుగు అంటే ఏమిటి?

ఈ కొత్త తరం విద్యార్థుల మనస్సులని ఆకట్టుకుని, వీరికి తెలుగు నేర్చుకోవాలనే కోరిక పెంపొందించాలన్నదే నా ప్రథమ లక్ష్యం. అందుకని వీరికి ‘తేలిక చెయ్యబడ్డ’ తెలుగుని బోధించాలని నిర్ణయించుకున్నాను. అందుకనే ఈ వ్యాసానికి తేలిక తెలుగు అని పేరు పెట్టేను. మనం ఈ రోజుల్లో నిత్యం వాడే భాషలో ఒక భాగం ఈ తేలిక తెలుగు. గణిత పరిభాషలో చెప్పాలంటే మనం వాడుకునే తెలుగు ఒక సమితి అనుకుంటే తేలిక తెలుగు అందులో ఒక ఉపసమితి.

నేను ఊహించుకుంటూన్న తేలిక తెలుగులో అచ్చులు అయిదు జతలు, ఒక పూర్ణానుస్వారం:

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ, అం

ఇదే విధంగా తేలిక తెలుగులో మొదట నేర్చుకోవలసిన హల్లులు ఇరవయిమూడు:

క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ

అటుపైన:

య, ర, ల, ళ, వ, శ. ష, స, హ, న్ (నకారపొల్లు)

ఈ తేలిక తెలుగు నుండి మినహాయించిన వర్ణాలు ఇవి:

ఋ, ౠ, ఌ, ౡ (అచ్చు లు, లూ) ఐ, ఔ, అః, ఙ, ఞ, ఱ, క్ష, ఁ (అర సున్న.)

ముందస్తుగా ఇక్కడ ఇలా కొన్ని అక్షరాలని మినహాయించినడం వల్ల వచ్చే కష్టసుఖాలని, లాభనష్టాలని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిద్దాం. మన విచారణ అచ్చులతో మొదలుపెడదాం.

తేలిక తెలుగులో ఌ, ౡ లు లేవు. వీటి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించేవారు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరనే నా నమ్మకం. ఉదాహరణకి, క్లుప్తం లో ఉండవలసిన ఌ-కారాన్ని ఈ రోజుల్లో అందరూ లు-కారం గానే రాస్తున్నారు. కనుక ఌ, ౡ లని నేను మినహాయించేనని నన్ను ఎవ్వరూ తూలనాడుతారని అనుకోను. వీటిని చాదస్తంగా వాడదామన్నా, లేఖిని వంటి కంప్యూటరు ఉపకరణాలలో ఈ రెండు వర్ణాలకి తావే లేదు.

తేలిక తెలుగులో విసర్గ లేదు; సంస్క్రుత పదాంతాలలో ఇది ప్రత్యయ రూపంలో తరచు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ విసర్గ లేకుండా తెలుగులో రాసే అలవాటు బాగా వాడుకలోనే ఉంది. కొన్ని ఉదాహరణలు:

బహుశః > బహుశ, బహుశా (చాలవరకు, probably)
క్రమశః > క్రమేణా, క్రమేపీ (వరుసగా, gradually)
జన్మతః > జన్మతా (పుట్టుక నుండీ, congenital)
స్వతః > స్వతహా, స్వతహాగా (instinctively)
ప్రాయశః > ప్రాయశంగా (తరచుగా, frequently)

విసర్గ మాట మధ్యలో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో తద్భవాలు వాడవలసి రావచ్చు, కొన్ని సందర్భాలలో వర్ణక్రమం కొద్దిగా మార్చవలసి రావచ్చు, కొన్ని సందర్భాలలో వ్యాకరణ సూత్రాన్ని అతిక్రమించవచ్చు, మరికొన్ని సందర్భాలలో ఒక మాటకి బదులు మరొక మాట వాడవలసి రావచ్చు. ఈ దిగువ ఇచ్చిన ఉదాహరణలు అన్నీ శాస్త్రసమ్మతం కాదు కాని ఎక్కువ వాడుకలో ఉన్నవే.

మనఃశాంతి > మనశ్శాంతి
చతుఃషష్టి > చతుష్షష్టి
నమఃకారం > నమస్కారం
తిరఃకారం > తిరస్కారం
అయఃకాంతం > అయస్కాంతం
దుఃఖం > దుఖ్ఖం, దుక్ఖం
అంతఃపురం > అంతహ్పురం, అంతిపురం
అంతఃకరణం > అంతహ్కరణం, అంతరాత్మ, మనస్సు
ప్రాతఃకాలం > ప్రాతహ్‌కాలం, వేకువ, తెల్లవారుజాము
తపఃఫలం > తపోఫలం
వయఃపరిమితి > వయోపరిమితి

కనుక ఎక్కువ కష్టపడకుండా విసర్గని విసర్జించి పబ్బం గడుపుకుంటే ప్రమాదం ఏమీ ఉండదనే నా నమ్మకం.

ఇక ఋ, ౠ ల సంగతి చూద్దాం. మాట మొదట్లో కాని, మధ్యలో కాని ౠ రావడం నా అనుభవ పరిధిలో చూడలేదు. ఋ తో మొదలయే మాటలు నాకు తెలుసున్నంత వరకు నాలుగు: ఋషి, ఋతువు, ఋణం, ఋత్విక్కు. ఇవి సంస్కృతం. తెలుగు మాటలు కావు. వీటిని మనలో చాల మంది అప్పుడే రుషి (లేదా రిషి), రుతువు, రుణం, రుత్విక్కు అని రాసేస్తున్నారు. కనుక ఋ, ౠ లు లేకపోయినా సరిపెట్టుకు పోవచ్చు కాని, ఋ హల్లుతో కలసినప్పుడు వచ్చే వట్రసుడి రూపం లేకుండా ‘సరిపెట్టుకు పోవడం’ అన్ని సందర్భాలలోనూ రాణించకపోవచ్చు; ప్రత్యేకించి, రాసేటప్పుడు కంటికి ఇంపుగా కనిపించకనూ పోవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

కృష్ణ-ని క్రిష్ణ అని కొంతమంది, క్రుష్ణ అని కొంతమంది రాస్తున్నారు. ఈ రెండింటిలో క్రిష్ణ-కి కొంచెం ప్రాచుర్యం ఎక్కువ ఉంది. ఈ ప్రాచుర్యానికి కారణం ఇంగ్లీషు వర్ణక్రమం, ఉచ్చారణల ప్రభావం కారణం కావచ్చు.

వట్రసుడి లేకపోతే సంస్కృతం అన్న మాటని సంస్క్రుతం అని రాయాలి. నృత్యం-ని న్రుత్యం అని రాయాలి. నృపుడు-ని న్రుపుడు అని రాయాలి. ఈ రకం ప్రయోగాలు చేసినప్పుడు చెవి ఉచ్చారణ దోషాన్ని పసికట్టలేకపోయినా, రాసినప్పుడు కంటికి కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. కాకపోతే నృపుడు, నృత్యం వంటి మాటలు వాడడం మానేసి వాటి స్థానంలో వాటికి సమానార్థకాలయిన నర్తనం, నాట్యం, రాజు వంటి మాటలతో తేలిక తెలుగు సరిపెట్టుకోవాలి. ఈ మార్పు వల్ల తెలుగుకి వాటిల్లే నష్టం పెద్దగా లేదనే నా అభిప్రాయం.

తేలిక తెలుగులో ఐ, ఔ లు ప్రత్యేక వర్ణాలు కావు; వీటిని అయ్, అవ్ అని రాయవచ్చు. కొన్ని ఉదాహరణలు:

ఐదు > అయిదు
ఐపు > అయిపు
ఐతే > అయితే
అందమైన > అందమయిన
ఖైదు > ఖయిదు
కైవశం > కయివశం
కైవారం > కయివారం
ఔరా > అవురా
ఔను > అవును
కౌగిలి > కవుగిలి
చౌక > చవుక

ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాసినప్పుడు స్థానంలో అయి రాయవచ్చు కాని కొంచెం క్రుతకంగా ఉన్నట్లు అనిపించవచ్చు:

హైవే > హయివే
ట్రైసికిల్ > ట్రయిసికిల్
డ్రైవ్ > డ్రయివ్

ఈ పద్ధతి సంస్క్రుతపు మాటలలో ‘వృద్ధి సంధి’ వచ్చిన సందర్భాలలో అంత సులభంగా కుదరకపోవచ్చు.

ఉదాహరణకి కౌంతేయుడు-ని కవుంతేయుడు-గా మార్చితే బాగుండదేమో. కౌరవులు అన్న మాటని నా ఆరేళ్ళ మనవడు ‘కూరవులు’ అన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. కాని యౌవనం అని రాయవలసిన చోట్ల మనలో అనేకులు యవ్వనం అనే రాసేస్తూ ఉంటే నవ్వు రావాలి కాని రావడం లేదు. ఎందుకుట? మనం అంతా ఈ తప్పు చేస్తున్నాము కనుక. అందుచేత అక్కడక్కడ కొన్ని సంస్క్రుత పదాలతో ఇబ్బంది వచ్చినా ఐ, ఔ లకి బదులు అయ్, అవ్-లు రాస్తే పరవాలేదనే అనిపిస్తోంది.

ఇప్పుడు హల్లుల నుండి మినహాయించిన అక్షరాలని చూద్దాం. క, ఖ, గ, ఘ ల తరువాత వచ్చే ఙ ని నా జీవితంలో నేను ఎప్పుడూ వాడలేదు. కాని చ, ఛ, జ, ఝ ల తరువాత వచ్చే ఞ ని జ్ఞానం అనే మాటలో నేను తరచు వాడుతూ ఉంటాను, జ్ఞానం, జ్ఞాతి వంటి అతి కొద్ది మాటలు తప్పితే ఞ అవసరం మరెక్కడా కనిపించడం లేదు. కనుక ఞ ని కూడ తేలిక తెలుగులో వాడొద్దు. ఈ అక్షరం లేకుండా జ్ఞానం, జ్ఞాతి మొదలైన మాటల ఉచ్చారణ సూచించడానికి మరొక మార్గం ఉంది; అది తరువాత చెబుతాను.