ఐదు కవితలు: అగ్ని స్పర్శ

ఎప్పుడూ ఏదో మండుతూనే వుంటుంది
మంటలు అంటుకుంటూనే వుంటాయి
కోరల నాల్కలు సాచి నమిలి మింగేసి
బూడిద వూసేస్తూ!

వెచ్చదనానికి కరిగిపోయి
చలిమంటేనని ముట్టుకుంటే
చురుక్కుమంటుంది…
మంటనంటించి మంట మాయమవుతుంది!
మంటే మిగులుతుంది

కూరుకున్న బుర్ర బాంబై బద్దలవుతుంది
లేస్తున్న విమానం నిప్పుముద్దవుతుంది
మధ్యవేసిన పచ్చగడ్డి భగ్గుమంటుంది
ఆకలేసిన దూడ అరుస్తుంది

భస్మాసుర హస్తం
అదిమిపట్టిన ఒత్తిడికి
అక్కడో అగ్నిపర్వతం లావా కక్కుతుంది
ఇక్కడో గ్యాసు బావి బ్లో-ఔట్ అవుతుంది
అంటుకున్న అరణ్యాలు అంత తొరగా ఆరవు
ఆర్పడానికి కొంపల్లో నీళ్ళూ వుండవు

ఎక్కడో చమురు కాలుతున్న వాసన…
వంటిల్లే వల్లకాడు!
శవాలకు స్పర్శ తెలీదు
అయినా ఎర్రగా అంతటా ఏడుపు-
అయినా గొంతుకలు మర్యాదగానే నడుచుకుంటాయి
అయినా లేక అందుకే
ఇంకో అగ్గిపుల్ల ముద్దు పెట్టుకోకమానదు.

(25/02/1997)


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...