శ్రుతిమించిన రాగం

ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం కానిదంతా (జానపద సంగీతం తప్ప) లలిత సంగీతమే అనే భావన ఉండేది. అందులో భావగీతాలూ, సినిమా పాటలూ అన్నీ భాగంగా ఉండేవి. ఈనాడు అలా అనలేము. మనకు (అక్కర్లేకపోయినా) నిత్యమూ వినబడుతూండే సంగీతంలో ” లాలిత్యం ” ఏమాత్రం ఉండటంలేదు. గతంలో డా. బాలాంత్రపు రజనీకాంతరావు గారి వంటి సంగీత ప్రయోక్తలు రేడియో ద్వారా తెలుగులో మంచి కవితలకి సంగీతం కట్టి ప్రజలకు వినిపించారు. లలిత సంగీతం గురించీ, తన అనుభవాలను గురించీ రజనీగారు ఆసక్తికరమైన వ్యాసాలు కూడా రాసారు. రేడియో సంగీతం జనప్రియం కాకముందే మరొకవంక సినిమా పాటలు సామాన్య ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుపోయి జన సంస్కృతిలో ఒక ముఖ్యభాగమైపోయాయి. ఆ సంగీతంలో ఎంత వ్యాపార ధోరణి ఉన్నప్పటికీ సినిమా పాటల్లో ఉండే “శక్తి వంతమైన ” సంగీతం ముందు, రేడియో సంగీతం కొంచెం నీరసంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందుకు కొంత కారణం సినీ ఆర్కెస్ట్రాలో ఉండే హార్మొనీ! వీటన్నిటికీ దూరంగా శాస్త్రీయ సంగీతం ఆనాడూ,  ఈనాడూ కూడా నిలిచే ఉంది. ఈనాడు లలిత కళలకు కూడా ప్రజాస్వామిక ధోరణి అబ్బింది కనక, శాస్త్రీయ సంగీతం నేర్చుకోదలచిన వారికి ఏ అర్హతలూ ఉండనవసరం లేదు. కేవలం ఆసక్తీ, ఓపికా, వ్యవధీ ఉంటే చాలు. ఆపైన గురువు గారికి నేర్పూ, ఓపికా ఉండాలి.

ఈనాడు మనకెన్నో రకాల సంగీతం, ఎన్నో పోకడలూ వినిపిస్తున్నాయి. ఫ్యూజన్‌ (  Fusion ) సంగీతం అని ఒక కొత్తపేరు వినిపిస్తోంది. నిజానికి మనం రోజూవినే సంగీతం అంతా ఫ్యూజన్‌ అనే చెప్పాలి. మన దేశపు సినిమా పాటలన్నీ దాదాపుగా శాస్త్రీయ సంగీతపు రాగాలమీద అధారపడినవే! మరి తేడా ఎక్కడుంది? శాస్త్రీయ సంగీతం రాగాల మయం. అందులో సాహిత్యం ఉన్నా, పెద్దపీట రాగానిదే. ఎందరో మహానుభావులు,జగదానంద వంటి కీర్తనల్లోని చరణాలకు త్యాగరాజు గారు ముందు స్వరం కట్టి, తరవాత వాటికి సరిపోయే సాహిత్యం రాసాడని మా నాన్న గారూ, నేనూ అనుకొనేవారం.జయంతసేన రాగంలో ఆయన రాసిన ” వినతాసుత వాహన ” అనే కీర్తనకూడా కొన్ని సినిమా పాటల పద్ధతిలో ముందు ట్యూన్‌ కట్టినట్టుగా అనిపిస్తుంది. అందులో పల్లవికి స్వరాలు ” మగసా సగమా పదసా పమపా మగసా సనిదా దసగమపాపా ” అనిఉంటే వాటికి సరిపోయే మాటలు ” వినతా సుతవా హనశ్రీ రమణా మనసా రగసే వించెద రామా ” అన్న పద్ధతిలో విరుగుతాయి. సాహిత్యం కన్నా స్వరాల గురించి త్యాగరాజు ఎక్కువ శ్రద్ధ చూపాడనడానికి ఇలాంటివెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటి మేధావి కూడా ఇటువంటి అభిప్రాయాన్నే ఒక వ్యాసంలో వ్యక్తం చేసారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, శాస్త్రీయ సంగీతపు “గొడవ” అంతా ప్రధానంగా రాగాల గురించేనని చెప్పడానికి.

లలిత సంగీతం అలా కాదు. ఇందులో సాహిత్యమే ముఖ్యం. సాహిత్యపు భావానికి, రాగ భావం తోడైనప్పుడు పాట ఇంకా రాణిస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎస్‌ రాజేశ్వర రావు ఖమాస్‌ రాగంలో జావళీల ఫక్కీలో ఎన్నో పాటలు చేసారు. కాని, విప్రనారాయణలో భానుమతి పాడిన ” నను విడనాడకురా ” అనే పాటకన్నా, చరణదాసిలో సుశీల పాడిన జావళీ కన్నా, మల్లీశ్వరిలోని ” ఎందుకే నీకింత తొందరా ” అనేపాటే జనాదరణ పొందింది. ఇందుకు కారణం దేవులపల్లి వారి రచనే! శ్రీశ్రీ, దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవులు సినీగీతాలు రాసి సినిమాల్లో సాహిత్యపు విలువల్ని పెంచారు. ఈరోజుల్లో సినిమా పాటలు బాగుండక పోవటానికి కారణం చెత్త సాహిత్యమే! ఈనాటి కవులకు శక్తి లేదని కాదు. దంపుళ్ళ చప్పుడువంటి తాళమే పాటకు ముఖ్యమనే భావన బలపడింది. ముందు లయ ప్రధానమైన ట్యూన్‌ తయారవుతుంది.దానికి తరవాత మాటలు అతికిస్తారు. ప్రపంచంలో ఇతరత్రా వస్తున్న సామాజిక మార్పులవల్లనో ఏమోగాని, ఎవరు ఏం చెప్పినా వినదగినదేదీ లేదనే భావం పెరుగుతోంది. అందువల్ల పాట అంతా తెలుగువారు తయారు చేసినప్పటికీ, అది ” అరవ” పద్ధతిలోనే సాగుతుంది. పాత సినిమా పాట మాత్రం ఏది విన్నా అందులో తెలుగుదనం కనిపిస్తుంది.

తెలుగు సినిమాపాటలలో మనవాళ్ళు వాడినవన్నీ దాదాపు హిందూస్తానీ రాగాలే! ఇది తక్కిన దక్షిణభారత సినిమా పాటలకు కూడా చాలావరకు వర్తిస్తుంది. ముఖ్యంగా రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల సంగీతదర్శకత్వం నిర్వహించిన సినిమాల్లో ” మెలొడీ ” పాటలన్నీ ఇటువంటివే ! ఆమాటకొస్తే, భీంపలాస్‌ (అభేరి) రాగంలో హిందీ సినిమా పాటలు అతి తక్కువ. తెలుగులో కొల్లలు. నీలిమేఘాలలో, మేఘమాల, ఊరుకోవే మేఘమాలా, ఇలా తెలుగు మేఘాలన్నీ భీంపలాస్‌ మీదుగానే సాగినట్టనిపిస్తుంది. భాగేశ్వరీలో ” నీ కోసమె నే జీవించునది “, ” అలిగితివా సఖీ ప్రియా “, ” రారా కనరారా “, శుద్ధ సారంగ్‌ లో ” ఎవరో అతడెవరో (వెంకటేశ్వర మహత్మ్యం)”,  తిలక్‌ కామోద్‌ లో ” అలిగినవేళనె చూడాలి “, కేదార్‌ లో “నీ మధు మురళీ గాన లీల “, పట్‌ దీప్‌ లో ” కన్నుల దాగిన అనురాగం”, ” నీ అడుగులోన అడుగువేసి నడువనీ”, జైజవంతిలో ” మనసున మనసై “, ఇలా ఎన్నో పాటలున్నాయి. ఆది నారాయణ రావు వంటి సంగీత దర్శకులకు హిందూస్తానీ రాగాలే మక్కువ. కర్ణాటకంలో మోహన రాగాన్ని పోలినది హిందూస్తానీలో భూప్‌ రాగం. రాగ లక్షణం దృష్య్టా ఆది నారాయణ రావు చేసిన ” ఘనా ఘన సుందరా ” అనే పాట భూప్‌ రాగమే! మోహన కాదు.

“శుద్ధ కర్ణాటక రాగాల్లో లైట్‌ సాంగ్స్‌ చెయ్యలేమా ? ” అన్న సమస్య నన్ను చాలా కాలం వేధించింది. ఎన్నో సంవత్సరాలుగా ఘంటసాల గారికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసి, ప్రస్తుతం కూచిపూడి నృత్యనాటకాలకు సంగీతం సమకూరుస్తున్న సంగీత రావుగార్ని ఈ మాటే అడిగాను. తాను నాటకాలకు సంగీతం కడుతున్నప్పుడు ఉపదేశం, భక్తి వంటి భావాలను వ్యక్తం చెయ్యటానికి తప్ప కర్ణాటక రాగాలు తనకు అంతగా ఉపకరించలేదని ఆయన అన్నారు. శాస్త్రీయ సంగీతంలో ” పట్టు ” ఉంది. శాస్త్రీయ సంగీతం నచ్చని వారికి అందులో ఎబ్బెట్టుగా ఉండేది ఇదే! ఎటొచ్చీ హిందూస్తానీ సంగీతం పాడుతున్నప్పుడు అప్పుడప్పుడు పట్టు విడిచి మెలొడీ ప్రధానంగా పాడినా ఎవరూ తప్పు పట్టరు. నవాబుల ఆస్థానాల్లో ఆదరణ పొందిన సంగీతమది. అందుకని ” ఈస్తటిక్స్‌ ” పాలు ఎక్కువ. దేవాలయాల్లో మారుమ్రోగిన కర్ణాటక సంగీతంలో మాత్రం బాలమురళీకృష్ణ వంటి వారు కాస్త మధురంగా పాడితే సనాతనులు విరుచుకుపడుతూ ఉంటారు. శాస్త్రీయసంగీతమంటే మాధుర్యం మాత్రమే కాదని ఎవరైనా ఒప్పుకొంటారు. కాని, ” మధురంగా ఉండనిదే శాస్త్రీయ సంగీతం ! ” అన్న పద్ధతిలో ఛాందసంగా వాదించే వారివల్లనే కర్ణాటక సంగీతానికి అంత ప్రాచుర్యం రాలేదని నేననుకొంటాను. అది కర్ణాటక సంగీతంలోని లోపం కాదని అందరూ తెలుసుకోవాలి.

కానీ, కర్ణాటక రాగాలు భావయుక్తంగా పాడిన సంధర్భాలు కొన్నయినా ఉన్నాయి. కరుణశ్రీ రాసిన కొన్ని పద్యాలను ఘంటసాల రంజని, ముఖారి వంటి రాగాలలో స్వరపరచి అద్భుతంగా పాడారు. అందులో శాస్త్రీయతకు ఏమాత్రం రాజీ పడలేదు. ఎంతో మధురంగా కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకూ ఇటువంటి ప్రక్రియ మరెవరూ చెయ్యలేదు. ప్రముఖ సినీ దర్శకుడు బి. ఎన్‌ రెడ్డి గారికి ” ఆనంద భైరవి ” రాగమంటే ఇష్టమట. “స్వర్గ సీమ ” సినిమా నాటినుంచీ  ప్రతిసినిమాలోనూ కనీసం ఒక పాట కర్ణాటకరాగంలో చేయించుకొంటూ వచ్చారు. “బంగారు పాప ”  సినిమాలో ” తాధిమి తకధిమి తోల్‌ బొమ్మా ” పాటఒక ఉదాహరణ ( మరపురాని మరొక చక్కని గాయకుడు ” మాధపెద్ది సత్యం ” పాడారీ పాటను).ఎటొచ్చీ “భాగ్య రేఖ ”  లో పెండ్యాల చేసిన ” నీవుండేదా కొండపై ” అనే పాట ఎంత తియ్యగా ఉంటుందంటే అది ఆనంద భైరవి అని నాకు వెంటనే తట్టలేదు. ” బంగారు పంజరం” లో రాజేశ్వరరావు చేసిన “మనసే మారేరా” అనే పాట కూడా అంతే! ఈ పాటల్లో సంగీత దర్శకులు సాంప్రదాయమైన ” రాగ పట్టు” ను బుద్ధిపూర్వకంగా విడిచి పెట్టారు. శాస్త్రీయ పద్ధతిలో ” ఆనంద భైరవి  ” ఎలా ఉంటుందో తెలియాలంటే, “మిస్సమ్మ”  సినిమాలో ” శ్రీ జానకీదేవి సీమంత మలరే” లేదా ” పలుకే బంగార మాయెరా” అనే రామదాసు కీర్తన వినండి. తేడా తెలుస్తుంది.

శాస్త్రీయ రాగాలను గుర్తించటానికి సినిమా పాటలతో మొదలు పెట్టటం చాలా తేలికైన పని. టివీలో మహామహోపాధ్యాయ డా. నూకల చినసత్యనారాయణ వంటి విద్వాంసులు ఇలాటి కొన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహించారు. రాగాలు, స్వరాలూ గుర్తు పట్టి శాస్త్రీయ సంగీతంలోకి ” దొడ్డిదారిన” ప్రవేశించడం తప్పేమీ కాదు. ఎందుకంటే తిన్నగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటానికి ప్రయత్నించే వారికి కొందరు సంగీతం మేస్టార్లు అప్రయత్నంగా సంగీతం అంటే ఏవగింపు కలిగిస్తారు. సినిమా పాటలు వినేవారు అభిమానం కొద్దీ వింటారు. శాస్త్రీయ సంగీతాన్ని మాత్రం కేవలం గౌరవంకొద్దీ నేర్చుకోవడం మెదలుపెడతారు. వారికి ఏ బాలమురళి పాటో నచ్చినా తాము ఆ స్థాయిని అందుకోవటానికి చాలా కాలం పడుతుందని వారికి త్వరలోనే తెలిసిపోతుంది. అలాంటివారికి యూజర్‌ ఫ్రెండ్లీ పద్ధతి బావుంటుంది.

శాస్త్రీయ సంగీతం అంటే అభిరుచి పెరగడానికి కొంత సమయం పడుతుంది. బాలమురళి వంటి గాయకుడి గొంతు మధురంగా ఉంటుంది కనక వెంటనే నచ్చుతుంది. వోలేటి వెంకటేశ్వర్లు, ఎం. డి. రామనాధన్‌
మధురై మణి వంటి గాయకుల సంగీతం అద్భుతంగా ఉంటుందని ” పామరులకు” వెంటనే అనిపించక పోవచ్చు. మన దేశపు శాస్త్రీయ సంగీతంలోని ముఖ్య లక్షణాలు సాంప్రదాయం మాత్రమే కాక హృదయం, మేధస్సు కూడా! ఇవి అర్ధం అయినప్పుడు సంగీతం ఎంతో బాగుంటుంది. సంగీతానికి టైం డైమెన్షన్‌ ఒక్కటే అని మా నాన్నగారు అంటుండే వారు. అది నిజమే! శాస్త్రీయ సంగీతంలో ముఖ్యంగా మనో ధర్మసంగీతంలో ” ఏం అన్నాడు ” అనేది ఎంత ముఖ్యమో ” ఎప్పుడు అన్నాడు “, ” అంతకుముందు ఏం అన్నాడు ” అనేవి కూడా అంత ముఖ్యమే. మంచి ఉపన్యాసంతో ఆకట్టుకొనే వాడిలాగా సంగీతకారుడు కూడా సైకలాజికల్‌ మొమెంట్‌ ఎటువంటిదో తెలిసినవాడై ఉంటాడు. సంప్రదాయం, వ్యక్తి గత ప్రతిభ రెండూ ఉన్నవాడే రాణిస్తాడు. మరో ముఖ్య విషయం ఏమంటే, వినే వారికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండనక్కరలేదుగాని,పరిచయం మాత్రం ఉండి తీరాలి. అది విని ఆనందించడానికి ఓపిక ఉండాలి. అది చెరకుగడ నమిలినట్టుగా చాలాసేపు నమిలే వస్తువు. దానితో పోలిస్తే సినిమా పాటలు పెప్పర్మెంటు లాగా నోట్లో వేసుకొని కరకరా నమలవచ్చు.

సినీసంగీతంలో మన దేశపు రాగాలూ పాశ్చాత్య సంగీతపు కార్డ్‌ ( chord ) లూ కలిసి ఉంటాయి. ఇదే మనకు తొలి ప్యూజన్‌. రాగంపై ఆధారపడి లయబద్ధంగా నడిచే సినిమా పాటకు తబలా వంటి వాయిద్యాలతోబాటు గిటార్‌, పియానో వంటి వాయిద్యాలమీద అదే లయతో chords  వాయిస్తూ ఉంటారు. ఇందులో సామాన్యంగా మూడుస్వరాలు కలిసి మోగుతాయి. పాట ఆ క్షణంలో ఏస్వరంమీద నిలిస్తే దానికి తగిన ధఫలషన  మోగుతుంది. Chord లోని స్వరాల మధ్య స,గ,ప అనే పరస్పర సంబంధం ఉంటుంది. ఈ మూడు స్వరాలూ పాడుతున్న రాగానికి చెందినవే అయిఉండాలి. ఇది పాటకు అందాన్నీ, బరువునూ ఇస్తుంది. “ముద్దబంతి పూవులో…” అనే పాటను గిటార్‌ లేకుండా వింటే బోసిగా ఉన్నట్టు అనిపిస్తుంది.

లలిత సంగీతంలో మంచి రచన ఉండి దానికి తగిన ట్యూన్‌ జత పడితే chord లతో పరిపూర్ణంగా అనిపించే ఆర్కెస్ట్రా మరింత అందాన్ని ఇస్తుంది. పాత సినిమా పాటల్లో ఇవన్నీ సమకూరడం వల్లనే ఈనాటికీ యువతరానికి నచ్చుతున్నాయి. హిందీ సినిమా పాటల్లో కూడా ఇదే పరిస్థితి. 195060ల మధ్య కాలం మన దేశపు సినిమా పాటలన్నిటికీ స్వర్ణ యుగమే అనిపిస్తుంది. అంతకు ముందు కె. ఎల్‌. సైగల్‌ వంటి గొప్ప గాయకులున్నా నౌషాద్‌ వంటి అతిగొప్ప సంగీత దర్శకులు వచ్చి ఆర్కెస్ట్రేషన్‌  మెరుగు పరచి ఇతరులకు మార్గ దర్శకులైన తరవాతనే సినిమా పాటలు రాణించటం మొదలు పెట్టాయి.

సినిమా పాటలో గాయకుడికీ సంగీత దర్శకుడికీ వచ్చినంతగా కవికి పేరు రాకపోవచ్చు. సంగీతం ఆకర్షించినంతగా కవిత్వం ఆకర్షించక పోవడమే ఇందుకు కారణం. సాహిత్యానిదే పైచెయ్యి కావాలని హిందీ సినీరచయితా,మహాకవి అయిన సాహిర్‌ లూధియానీ పట్టుపట్టేవాడట. ఆయనతో ఎక్కువగా పని చేసిని రోషన్‌ సంగీత దర్శకత్వంలోని పాటలన్నిటిలోనూ సాహిత్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ట్యూన్‌, సాహిత్యాన్ని మరుగుపరచదు. తెలుగులో ఒక్క దేవులపల్లివారి పాటలు మాత్రం రాజేశ్వర రావు చేసిన ట్యూన్‌ల ధగధగలను కూడా అధిగమించి మనని అలరిస్తాయి.

రచయితకూ సంగీత దర్శకుడికీ పొత్తు కుదరటం చాలా ముఖ్యం. ఇది హిందీ పాటల్లో ఎక్కువగా ఉండేది.పైన చెప్పిన సాహిర్‌రోషన్‌ ద్వయంలాగే షకిల్‌నౌషాద్‌ లూ, శైలేంద్ర హస్రత్‌ జైపూరీ,శంకర్‌ జైకిషన్‌ వంటి ద్వయాలు ఉండేవి. ట్యూన్‌ ముందు చేసి పాట రాయించారో పాటకు ట్యూన్‌ కట్టారో తెలియనంత అన్యోన్యత ఉండేది ఆ పాటల్లో. పాటను రచయిత ముందు ఒక లయలో రాసినా సంగీత దర్శకుడు మార్చెయ్యగలడు. ఉదాహరణకు “నీలిమేఘాలలో గాలికెరటలలో …” అనే పాట జంపె (తాళం పేరు) నడకలో సాగినా ట్యూన్‌ మాత్రం చతురశ్రంలోనే చేసారు. ఇలాంటి ఉదాహరణలు హిందీలోనూ కనిపిస్తాయి. ట్యూన్‌ ఎటువంటిదైనా డబ్బింగ్‌ పద్ధతిలో అద్భుతమైన  రచనలు చేసినవారు శ్రీశ్రీ, ఆరుద్రలు. ఉదాహరణకు శ్రీశ్రీ రాసిన “జోరుగా హుషారుగా …” అన్న పాట మొత్తమంతా లయను బట్టి ఒక గురువు వెంట ఒక లఘువు వచ్చేటట్టు సాగుతుంది. ఇది శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే అనితర సాధ్యం.

బాగా పాడితే ఏసంగీతమైనా బావుంటుంది.. కొన్నేళ్ళక్రితం బొంబాయిలో ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌ సితార్‌ కచేరీకి ఉత్సాహంతో వెడుతున్న నాతోబాటు ” ఏమిటో ఆ వింత చూద్దాం” అని సంగీతంతో ఏమాత్రం పరిచయంలేని పధ్నాలుగు మంది మిత్రులు వచ్చి చివరిదాకా కూర్చొని అద్భుతంగా ఉందని అన్నారు. గొప్ప కళకు దివిటీ పట్టి చూపించక్కరలేదు అనడానికి ఇది మంచి ఉదాహరణ.

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...