వాయసమైత్రి

కాకమ! ఎంతొ వింత మన కబ్బిన మైత్రిని ఎంచి చూడ; నీ
వాకసమందు తేలు చిరుపక్కివి, పృధ్వి వసించువాడ నే
ధీకుశలుండ మానవుడ; దీటగునే పరజాతి మైత్రి! ఎ
చ్చో కనలేని చెల్మి యిది! చూడగ ప్రాక్తన జన్మ బంధమా?

కనుచుంటిన్నిను నే భుజించుతరి చక్కన్‌ గోడపై వ్రాలి, నన్‌
తనియన్‌ చూచుచునుంటి ప్రత్యహము; వింతన్‌ కొల్పు నీ తీరు; కా
రణ మూహింపగ నేరనైతి; ఎదుటన్‌ ప్రత్యక్షమై యుండ నే
దినుటన్‌ నీకొక ముద్దయైన నిడకన్‌, దీనంబుగా తోచెడిన్‌

దినమున్‌ చూచుకొలంది నీ యెడల ప్రీతిన్‌ జాలియున్‌ నా యెదన్‌
జనియించెన్‌; సమభావ సాదర సమాశ్వాసాధిచిత్తంబునై
నిను తిన్పింపక నే తినన్‌ మనసు మన్నింపంగ లేకుండుటన్‌
నెనరున్‌ నీకిట ముందెబెట్టి కుడువన్‌ నే నిత్యమున్‌ నేర్చితిన్‌

ప్రీతిన్‌ నీవిట నోగిరంబు తినుచున్‌ విడ్డూరమున్‌ కొల్పగా
నీతోడన్‌ కొనితెచ్చినావు ప్రియునిన్‌ నీవాని రోజొక్కటన్‌
నే తిండిందిన నుద్యమించ నెదుటన్‌ నేస్తంబుతో గోడపై
పోతంబోసిన బొమ్మవై నిలిచి చూపుల్‌ చూతువే! కాకమా!

మది నీ చేష్టలెరుంగుచుంటి నను నమ్మంజేసి నీతో ప్రియుం
చెదరన్నీయక తెచ్చితీవిటకు; నీ నేర్పున్‌ ప్రశంసింతు, నే
కొదువంజేయక మీకు బెట్టి సుఖముల్‌ గూర్పంగ బాధ్యుండనే?
వదలంజాలక యుంటి కూర్మి నిను నీవానిన్‌ మరిం దెచ్చినన్‌

పిడికెడు పిండపున్‌ మెతుకు పెట్టిన యంతనె మీకు పూటకున్‌
సడలదు నాదు భాగ్యము విశాలకృపామయ చిత్తవృత్తితో
వడయగ చేయు చుంటినిటు పప్పుల యన్నము మీకు మావలెన్‌
బిడియము నొందకన్‌ తినుచు నేర్పుగ వేజనుచుంటి కాకమా!

మరి కొన్నాళ్ళిటు మీరలున్‌ బ్రతుకులన్‌ మాతోడ సాగింప నే
పరిపాటిన్‌ ఒకరోజు మీకిడితి సూపాన్నంపు ముద్దల్‌ తినన్‌
కరమానందము తోడ రెక్కలెగురన్‌ “కా”యంచు ముమ్మారు నీ
వరవన్‌ కాకుల దండు వ్రాలె నచటన్‌ ఆశ్చర్యమై తోపగన్‌

వ్రాలిన యంత కాకములు రద్దిని సేయుచు మీకునున్‌ తగన్‌
చాలక యున్న యోగిరము చయ్యన ముక్కుల నందుకొంచు మిన్‌
తేలి యధేఛ్ఛ పారెను విధేయత మీరును వెంబడించగన్‌
జాలిని పొందితిన్‌ మదిని చాలని యన్నము పెట్టియుండుటన్‌

మరుదినమందు బెట్టితిని మచ్చిక తిండిని; అట్లె వాటికిన్‌;
మరువక నాటినుండి యవి మందగ వచ్చుచునుండె వేళకున్‌
అరకొర కాగ ప్రాణులకు అన్నము పెట్టుట మేలు కాదటం
చెరిగి ఖగంబులయ్యు అతి చెల్వుగ తృప్తిని పెట్టుచుండితిన్‌

ఖేచరమా! ఒకింత పరికింపగ నీదు వికారచేష్టలన్‌
తోచెడునందు ధర్మములు స్థూలపు మానవ బుద్ధి నేర్వనౌ
నీ చలితైక దృష్టి కరుణింతువు మీ కులమున్‌ దయామతిన్‌
దాచక కొంచెమైన తగ ధర్మము సేతువు తోటివారికిన్‌

ఉన్నది కొంచెమైన, అదియున్‌ దయబెట్టిన ముద్దయైననున్‌
పన్నుగ నొంటిగా దినక పంచెదవంతయు తోడివారికిన్‌
ఎన్నగ నీదు సంఘపరవృత్తియు త్యాగమయైక శీలమున్‌
మిన్నగ నీతిపాఠములు మిత్రమ! నేర్పెదు మానవాళికిన్‌

అందమునన్‌ మయూర శుక హంసల పోలగ జాలవెంత; ఆ
నంద రసాబ్ధి తేల్చు పరనాదము కోకిల కంఠ మాధురీ
మంద కుహూ స్వనంబు మరి మచ్చుకు లేదుగ నీ గళాన! నీ
సుందరశీలమున్‌ గుణము చూచిన నీకెవరీడు కాకమా!

ఎంతయు కల్గియుండి మరి ఇంతయు తృప్తిని కాంచలేక త
త్సంతతికిన్‌ తరంబులకు సంపదలన్‌ తగ నిల్వబెట్టి అ
త్యంత నికృష్ట బుద్ధి తన ఆప్తుల సైతము  దోచు మానవుం
డెంతటి దైన్యపున్‌ స్థితికినేగెనొ! పోల్చగ నిన్ను చోద్యమౌ!

మానవుని బాసి విడిపోయె మానవతయు
మూగజీవుల యందది మూర్తి గొనియె
అవియె పాలన చేయుచో అద్వితీయ
సమ సమాజమ్ము నెలకొను జగతియందు

రచయిత నీలంరాజు నరసింహారావు గురించి: నీలంరాజు నరసింహారావు గారు వ్యవసాయంలోనూ కవితా వ్యాసంగంలోనూ కూడా బాగా కృషి చేసిన వారు. అద్దంకి దగ్గర్లో ఉన్న కలవకూరు గ్రామం స్వగ్రామం; అక్కడే చాలా కాలం ఉన్నారు. ఆ అనుభవాల గురించి వారు రాసిన పద్యాలలో సొంత చోటు నుంచి దూరమైన అందరికీ వర్తించే భావాలెన్నో కన్పిస్తాయి. ...