ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు

రాజులని పొగుడుతూ రాసిన కవితలు, తెగడుతూ రాసిన కవితలు మనకి కొత్త కాదు. రాజకీయనాయకులపై వ్యంగ్య సాహిత్యం, ముఖ్యంగా హాస్యకవితలు తెలుగులో శ్రీశ్రీ మొదలైన ఆథునిక కవులు రాశారని వేరే చెప్పనక్కరలేదు. అయితే, ఆ రచనలు ఆ కవుల జీవనానికి, జీవితానికీ ఏ విధమైన ఆపదా తెచ్చి పెట్టలేదు. ప్రాచీన చాటు సాహిత్యంలో పోతరాజు వేములవాడ భీమకవిని తన రాచరిక భేషజం చూపించి ఇబ్బంది పెట్టాడని, భీమకవి వాడిని శపించాడని, ఆ తరువాత పోతరాజు భీమకవికి క్షమాపణ చెప్పాడనీ, భీమకవి శాపం తొలగించాడనీ ఒక చక్కని చాటు కథ ప్రచారంలో ఉన్నది.

అయితే ఒక చాటువు, ఒక చతురోక్తి కవిత, ఒక వ్యంగ్య కవిత ఒక కవి జీవితానికే ముప్పు తెచ్చిన ఘట్టం రష్యన్ చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఈ వ్యాసంలో, ఆ చాటువు గురించి ముచ్చటిస్తాను.

సాధారణంగా ప్రతి చాటువుకీ పూర్వకథ వుంటుంది. ఆకథ తెలియకపోతే, ఆ చాటువు పొడిపొడి వాక్యాలు కత్తిరించి పేర్చిన వచన పద్యంలా పేలవంగా కనబడుతుంది. రక్తి కట్టదు. కొన్ని చాటువుల్లో ప్రతి పాదానికీ వెనుక ఒక కథ వుండచ్చు. అటువంటి చాటువు, ఓసిప్ మాండిల్‌స్టామ్ (Osip Mandelstam) రాసిన ఎపిగ్రామ్ ఎగైన్స్ట్ స్టాలిన్ (Epigram Against Stalin.)

ఈ చిన్న పద్యం చాలా భాషల్లోకి అనువదించబడింది.ప్రముఖ అనువాదకులు మర్విన్ (W. S. Merwin), ఆండర్సన్ (Darren Anderson), తదితరులు ఇంగ్లీషు లోకి అనువదించారు. అంతర్జాలంలో వెతికితే, ఈ చాటువుపై, మాండిల్‌స్టామ్‌పై చాలా వ్యాసాలు, వ్యాఖ్యలూ దొరుకుతాయి. ఈ వ్యాసం చివర, ఇతర అనువాదాలు, రష్యన్ మాతృక ఇస్తాను. ముందుగా నేను తీసుకున్న అనువాదం, ఎస్థర్ ఆలెన్ (Esther Allen) స్పానిష్ నుంచి ఇంగ్లీషులోకి తెచ్చిన అనువాదం. రష్యన్ నుంచి హోసె ప్రియెటో (Jose Manuel Prieto) స్పానిష్ లోకి అనువదించాడు. ఈ కవితలో ప్రతిపాదానికీ ఉన్న వెనుక కథ చెపుతూ ఒక పెద్ద వ్యాఖ్య కూడా రాశాడు. ఎస్థర్ ఆలెన్ ఆ వ్యాసాన్ని ఇంగ్లీషులోకి అనువదించింది. (The New York Review of Books, June 10, 2010.) నా వ్యాఖ్యకి అది ముఖ్య ఆధారం. అంతర్జాలంలో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు కూడా వాడుకున్నాను.

Epigram Against Stalin

We live without feeling the country beneath our feet,
our words are inaudible from ten steps away.
Any conversation, however brief,
gravitates, gratingly, toward the Kremlin’s mountain man.
His greasy fingers are thick as worms,
his words weighty hammers slamming their target.
His cockroach mustache seems to snicker,
and the shafts of his high-topped boots gleam.

Amid a rabble of scrawny-necked chieftains,
he toys with the favors of such homunculi.
One hisses, the other mewls, one groans, the other weeps;
he prowls thunderously among them, showering them with scorn.
Forging decree after decree, like horseshoes,
he pitches one to the belly, another to the forehead,
a third to the eyebrow, a fourth in the eye.
Every execution is a carnival
that fills his broad Ossetian chest with delight.

—Translated by Esther Allen from José Manuel Prieto’s Spanish version (The New York Review of Books, June 10, 2010.)

స్టాలిన్ పై చాటువు

అడుగున అడుగులకంటిన
మట్టి స్పర్శ
గురుతెరగని
బ్రతుకులు మనవి.
ప్రక్కన
పది అడుగుల దూరంలో
మాటాడిన మాటలు
చెవినపడవు, వినపడవు.

ఈ పాదాలకి వ్యాఖ్య చెప్పబోయే ముందు, సోవియట్ యూనియన్ చరిత్ర మననం చేసుకోవాలి. లెనిన్ మరణించిన తరువాత, స్టాలిన్ గద్దెకెక్కాడు. సుమారు ముప్ఫై సంవత్సరాలు (1924-1953) పరమనిరంకుశంగా పరిపాలించాడు. స్టాలిన్ హయాములో — కారణం ఏదయితేనేమి — మరణించిన సోవియట్ ప్రజల సంఖ్య ఇరవై మిలియన్ల నుంచి అరవై మిలియన్ల వరకూ ఉంటుందని అంచనా! కొన్ని వందలమంది రచయితలని, కవులని, ఉద్యమకారులనీ స్టాలిన్ ప్రభుత్వం హతమార్చింది, తుపాకి తోటి; కాకపోతే సైబీరియాకి పంపీ!

మాండిల్‌స్టామ్ 1933లో స్టాలిన్ రాజ్యాంగ విధానంపై నిరసనగా పైన చెప్పిన చాటువు ‘రాశాడు’. 1934 చివరలో అతనిని ఖైదులో పడేశాడు, స్టాలిన్.

ఆ రోజులలో, సోవియట్ పౌరులు ఎంత భయంగా బ్రతికేవారో మొదటి పాదంలో కనిపిస్తుంది. పద్యంలో వాడిన రష్యన్ పదం చుయత్ (chuyat.) వాసన పసిగట్టి వెంటాడే వన్యమృగ కౄరతని గుర్తుకు తెచ్చే పదం. నేలమీద నిలబడిన వ్యక్తి ఉనికికే ప్రమాదం సుమా! అని సూచించే పాదం. సోవియట్ పౌరులు అతి మెల్లగా గుసగుసలాడుతున్నట్టు ఒకరితో ఒకరు మాట్లాడటానికి అలవాటు పడ్డారు, ఆ రోజుల్లో! అంత భయంతో బ్రతికేవారని రెండవ పాదం. పిల్లల ముందు పెద్దవాళ్ళు ఏ సున్నితమైన విషయం మాట్లాడటానికైనా సరే, సంకోచించేవాళ్ళు.

ఐౙయా బెర్లిన్ (Isaiah Berlin) ఆనా ఆఖ్మతోవాని (Anna Akhmatova) కలిసినప్పుడు, ఆఖ్మతోవా చూరు కేసి వేలు చూపించిందట — వాళ్ళ సంభాషణలు మూడవ వ్యక్తి వినడానికి ఆస్కారం ఉన్నది సుమా అని గుర్తు చేస్తూ! మాస్కోలో టెలిఫోనులు స్టాలిన్ అనూయాయులు ట్యాప్ చేసారనే వదంతి ప్రబలంగా ఉన్న రోజులవి, సాంకేతికంగా ఆ రోజుల్లో అసాధ్యం అని తెలిసినప్పటికీ.

బోరిస్ బఝనొవ్ (Boris Bazhanov) తన స్వీయ చరిత్రలో రాస్తాడు: స్టాలిన్ క్రెమ్లిన్‌లో ఉండే ఇతర కమ్యూనిస్ట్ నాయకుల సంభాషణలు వినటానికి ప్రత్యేకమయిన వసతి కల్పించుకున్నాడట. ఒకసారి, బోరిస్ పొరపాటున మరొక తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడట. అక్కడ స్టాలిన్ చెవులపై స్పీకర్లు పెట్టుకొని పార్టీ నాయకుల సంభాషణలు వింటున్నాడట. అప్పట్లో, ముఖ్య పార్టీ నాయకులందరూ క్రెమ్లిన్ లోనే ఉండేవారు. అంతే! బోరిస్ చడీ చప్పుడూ చెయ్యకండా, 1929లో కాలినడకన ఇరాన్ సరిహద్దులకి పారిపోయాడు. సోవియట్ పౌరులు ఎటువంటి భయాలతో బ్రతికేవారో ఈ కథ మూలంగా విశదమవుతుంది.

ఏ చిన్న సంభాషణైనా సరే.
ఎంత క్లుప్తమైన ముచ్చటైనా సరే
శరవేగంతో
క్రెమ్లిన్ కొండజాతి వాడికి
చేరితీర వలసిందే!

స్టాలిన్ కాకసస్ (Caucasus) పర్వతప్రాంతం నుంచి వచ్చాడు. కిరాతక సంతతివాడని ప్రతీక. అప్పట్లో క్రెమ్లిన్‌లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ‘అనాగరిక’ సంతతివారు కాదని ఓసిప్ ధృవపరుస్తున్నాడు. గూఢచారులు ప్రతివ్యక్తి పైనా నిఘా వేసి ఉండేవారు. మేథావులపై నిఘా మరింత హెచ్చు.


వీడి జిడ్డువేళ్ళు బలిసిన పురుగులు
వీడి మాటలు సమ్మెట పోటుల్లా
తావుకి తటాలున తగులుతాయి.

1934లో ఓసిప్, బోరిస్ పాస్టర్నాక్ (Boris Pasternak) ఇంటికి వచ్చాడు. పదిమందిలో తన కవిత చదివాడు. (అప్పటికి ఇంకా అతన్ని జైలులో పెట్టలేదు) ఈ పని చెయ్యడం అవివేకమే! మాండిల్‌స్టామ్‌కి ఈ కవిత ప్రజల ముఖం చూడదని తెలుసు. అందుకనే వీలు దొరినప్పుడల్లా స్నేహితుల దగ్గిర కంఠస్థం చేసిన ఈ పద్యం వినిపించేవాడు. ఇంతకు పూర్వం ఒకసారి పాస్టర్నాక్‌కి మాస్కోలో రహస్యంగా ఈ చాటువు వినిపించాడు. పాస్టర్నాక్ సమాధానం: నీవు చదివిన పద్యానికి — సాహిత్యం తోటి, కవిత్వం తోటీ — ఏ విధమైన బాంధవ్యమూ లేదు. ఇది సాహిత్య ప్రక్రియ కాదు. ప్రాణహానికి సంబంధించిన ప్రక్రియ. దీనితో నాకే సంబంధమూ లేదు. నువ్వు నాకు ఏమీ వినిపించలేదు; నేను ఏమీ వినలేదు. ఈ పిచ్చిపని ఇంకెక్కడా చెయ్యకు.

స్టాలిన్ హయాములో, స్వితేవా (Marina Tsveteva), ఆఖ్మతోవా (Anna Akhmatova), పాస్తర్నాక్‌లు గౌరవించ దగిన సాహితీకారులు కాదు. మయకోవిస్కీ (Vladimir Mayakovsky) పార్టీ ప్రచార కవిగా పేరు తెచ్చుకున్నా, స్టాలిన్ ఉద్దేశ్యంలో బెయిద్‌నీ(Demian Beidny) ఒక్కడే ‘ప్రజాకవి.’ అతని దగ్గిరనుంచి స్టాలిన్ పుస్తకాలు తీసుకొని, చదివిన తరువాత తిరిగి ఇచ్చేవాడుట. డెమియన్ తన డైరీలో ‘జిడ్డు వేళ్ళు’ తన పుస్తకాలపై పడినట్టు ఉదహరించిన విషయం ఓసిప్‌కు తెలిసి ఉండాలి.