(ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ అనుభవాల్నీ కలబోసి రాసిన కథ యిది. ఇది స్వీయకథ కావొచ్చు, కాకపోవచ్చు కాని మనసులోంచి వచ్చినది, మనసుల్ని తాకేది అని తప్పకుండా చెప్పుకోవచ్చు.)
“అరవయ్యేళ్ళొచ్చాక చదువుకోక మన్ను కొట్టుకోనా అని అందిట వెనకటికి” మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. అలాగే మేము సీనియర్ సిటిజెన్స్ హోదా వచ్చాక, పిల్లలూ మనవలూ రమ్మని పేచీ పెడితే సాహసించి అమెరికా బయల్డ్దేరాం.”మనకి ఫారెన్ రేఖ లేదని చెయ్యి చూసి ఇదివరకు చెప్పారనుకో. కానీ ఈ రోజుల్లో అమెరికాలో పిల్లలు ఉన్న వాళ్ళు ఫారెన్ రేఖలు ఓ బ్లేడు పెట్టి గీసుకుంటే వీసా దానంతటదే ఒచ్చేస్తుందిట” అన్నారు మా వారు.మొత్తానికి బారిష్టరు పార్వతీశం లండను ప్రయాణంలా అలవాటులేని సాక్సులు, బూట్లు, స్వెట్టర్లూ కొనుక్కుని, ఇక్కడి పిల్లలు ఇక్కడి ఏర్పాట్లు చూసి, అక్కడి పిల్లలు అక్కడ అన్నీ అమర్చి, మాకేమీ ఇబ్బంది లేకుండా చూసుకోగా అమెరికా చేరుకున్నాం.
ఒక వారం శలవలకి దగ్గరలో San Antonio లో చూడవలిసినవి చూపిస్తామని పిల్లలు తీసుకుని వెళ్ళారు. అక్కడ river walk అంటే ఏదో నది పక్కన షికారులా ఉంటుందేమో, మన ఊళ్ళో చాలా సార్లు చూసిందే కదా అనుకున్నాను. క్యూ ఎక్కువగా ఉందంటే పోనీ మానేద్దామన్నాను. కాదు ఇది వేరని చెప్పి అబ్బాయి పట్టు బట్టి తీసుకెళ్ళాడు. వెళ్ళాక తెలిసింది, ఈ బోటు షికారు విశేషమయిందేనని. నదిని ఊరు మధ్యనించి మళ్ళించి చూడవలిసిన ప్రదేశాలన్నీ బోటునించే చూసేలా ఏర్పాటు చేశారు. రెండు పక్కలా చాలా ఎత్తయిన భవనాలూ పెద్ద పెద్ద చెట్లూ, వాటి నిండా దీపాలూ, కొన్ని చోట్ల సంగీతం, కొన్ని చోట్ల డ్యాన్సులూ, కొన్ని బోట్లలో డిన్నరు పార్టీలూ, చాలా గొప్పగా ఉంది. అచ్చు చిన్నప్పుడు దీపావళికి నాన్న తన చేతులతో చేసిన మతాబాలు నాచేత కాల్పించినప్పుడు కలిగినంత సంబరమేసింది.
అక్కడి నించి natural caverns కి వెళ్ళాం. అక్కడ ప్రవేశ ద్వారం దగ్గిర ఎవరైనా శారీరిక ఇబ్బందులుండి నడవలేకపోతే అక్కడే ఆగిపోవలిసుంటుందని రాసారు. ఈ వయసులో, ఈ ఒంటి బరువుతో అంత లోతుకి దిగి మళ్ళీ ఎక్కగలనా అని భయం వేసిన మాట నిజమే. ఆయన పక్కనుండి “నీకేవిటి, తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు, మీ నాన్న పోలిక నీది, ఆయన మిట్ట మధ్యాహ్నం తారు రోడ్డు మీద ఆయాస పడుతూ నడిచినట్లే ఇదీనూ” అన్నారు. లేని నేర్పు కూడా ఉందని భ్రమ పడేలా ప్రోత్సాహమివ్వడం ఆయన అలవాటు. సరే ముందుకెళ్ళాం. సాహసించి రాలేకపోతే చాలా అపురూపమయిన అందాలు చూడలేకపోదుమనిపించింది. చెప్పడానికి అలవికాని అద్భుతమైన గుహలవి. రక రకాల స్తంభాల ఆకారాలతో పైనించి వేళ్ళాడే ఊడల మాదిరిగా, చిన్ని చిన్ని ఆశ్రమాల లాగ, గుడి గోపురాల మీద చెక్కిన శిల్పాల లాగ, ఎవరి చూపుకి ఎలా తోస్తే అలాగే ఊహించుకోవచ్చు. తెలుపులో లేత పసుపు రంగు కలిసిన సున్నపు రాతి కొండ గుహలవి.
ఆకురాలు కాలమొచ్చింది. ఓ రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ కూర్చుని చూస్తే ఎదురుకుండా ఉన్న చెట్టుకి ఒక పక్కనించి తోపురంగు కలిసిన ఎరుపు, మరో పక్క లేత నారింజ రంగు, ఇంకా పసుపూ, అక్కడక్కడ ఊదా రంగు కలగలిసి కనిపించి భలే ముచ్చటేసింది. మొదట చిగురాకులో, ఎండుటాకులో తెలియలేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్టుమొదళ్ళలో చిగురాకులూ, పైన రాలిపోయే ఎండుటాకులూ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. వసంత కాలపు వైభవాలు అలవాటు పడ్డ కళ్ళకి రాలేముందు కూడా ఇంత అద్భుతమైన అందం వెదజల్లే చెట్ల ఆకులు చూడ్డం మిగిలిన అమెరికా అనుభవాలతో పోటీ పడి నెగ్గే కొత్త వింత. కొంచెం తియ్యగా, కొంచెం చేదుగా, జ్ఞాపకాలు కదిలాయి, చెట్టు మీద చిక్కుకున్న గాలిపటంలా ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతూ.
…
నా బతుకు దారి మీదా, తీరు మీదా చెరగని ముద్ర వేసిన నాన్న అపురూప వ్యక్తిత్వం గులాబీ రంగరించిన పాల తెలుపు రంగూ, గుండ్రని మొహం, నవ్వే కళ్ళూ, సాఫుగా దువ్వాక కొంచెం చెదిరిన జుట్టూ, తెల్లని షర్టూ, గ్లాస్కో పంచె, ఒక చేతిలో సిగరెట్టూ, ఒక చేతిలో కోవా బిళ్ళల పొట్లం “అమ్మాయ్” అంటూ ఇంట్లోకి వస్తూంటే పేచీలూ, ఏడుపులూ ఆగిపోయి నవ్వులూ కేరింతలూ మొదలవడం, ఇల్లంతా మారిపోయి ఇంకాస్త వెలుగ్గా కనిపించినట్లుండడం నా చంటితనం జ్ఞాపకాలు.
పిల్లల్ని దగ్గిరికి తీసుకుని కథలు చెబుతూ, సరదా కబుర్లు చెబుతూ ఉడుక్కునే వాళ్ళని వేళాకోళం చేసి ఉడికిస్తూ, ఇంటి మొత్తాన్నీ రోజూ పండగే అనుకునేలా చేసేవారు. ఊరెళ్ళినప్పుడల్లా ఏదో కొత్త బొమ్మో వస్తువో తెచ్చేవారు. తెచ్చిన గంటలోనే నేనో తమ్ముడో పగలకొట్టి అమ్మ చేతా బామ్మ చేతా తిట్లు తినే వాళ్ళం. నాన్నుంటే మటుకు “పోన్లేవే, వాళ్ళ సరదాకోసం కాకపోతే నీకోసం, నాకోసమూనా బొమ్మలు?” అనేవారు.
ఆ రోజుల్లో గ్రామఫోను తప్పనిసరి సౌకర్యంగా ఇంట్లో ఉండేది. ఎవరికి తోచిన రికార్డు వాళ్ళు పెట్టుకుని వినే వాళ్ళు. నాన్న సైగల్ పాడిన “దునియా రంగ్ రంగేళీ బాబా, దునియా రంగ్ రంగేళీ” చాలా మాట్లు వింటూ ఉండేవారు. ఆ మాటలకి పూర్తి అర్థం ఆయనకి తెలుసునోలేదోగానీ, నాకు అర్థం కాకుండానే ఆ పాట వింటూంటే రంగు రంగుల దారాల కలనేత కళ్ళకి కట్టినట్లుండేది. ఎందుకో, నాన్నా ఆ పాటా ఒకటే అనిపించేది.
…
ఇన్నేళ్ళకి మా అబ్బాయి CD player లో ఆ పాట మళ్ళీ విన్నాను. ఎందుకో కలిమిలో నాన్న, కష్టాల్లో నాన్న, కలగలుపుగా ఒకే పిక్చరు మనసులో మెదిలింది.
…
“పొద్దున్న వేళలా పొడిచేటి భానుడు పొన్న పువ్వూ ఛాయ, మధ్యాహ్న వేళల పొడిచేటి భానుడూ మంకెన్న పూఛాయ”.
“ఏవిటీ ఎప్పుడూ లేనిది కూని రాగాలొస్తున్నాయి, పూర్తిగా పాడరాదా” అన్నారు మా వారు.
“ఆ, నా మొహం నాకొకటి ఒస్తే కదా! నా చిన్నప్పుడు మా దొడ్డ పాడే పాటలు గుర్తొచ్చాయి, ఈ ఆకుల వైభవం చూస్తుంటే. మా వూళ్ళో నా వానా కాలం చదువుకి వొంటి పూటి శలవులప్పుడు బడి నించి ఇంటికి వస్తూంటే దారిలో రెండు పక్కలా దుబ్బులమీద తీగలకి పూసిన ఎర్రని మధ్యాహ్నం మాణిక్యాలు, వాటి తొడిమలు తుంపి నోటిలో పెట్టుకుంటే కొద్దిగా మకరందం రుచీ, తీరీ తీరని దాహం, ఏవేవో జ్ఞాపకాలొస్తున్నాయి” అన్నాను.
“మధ్యాహ్నం మాణిక్యాలేమిటీ, నేనెప్పుడూ చూడలేదూ, వినలేదూ?”
“ఏమో, మా దొడ్డా మంకెన్న పువ్వుల్నే మధ్యాహ్నం మాణిక్యాలంటారని చెప్పేది”
మా వూళ్ళో చేలగట్లమ్మట అడివి మల్లి పూలు, ముళ్ళా గొబ్బి పూలు, పంటకాలవ పక్కని చెట్లకి ఏవో పేర్లు తెలియని గుత్తులుగా పూసే తెల్లని పూలు, ఇంటి పెరట్నిండా బొడ్డు మల్లి, పందిరి మల్లి, దుబ్బు మల్లి, విరజాజి, సన్నజాజి, చేమంతి, బంతి, రాధా మనోహరం, మన్మధ బాణాలు, కనకాంబరాలూ, నీలాంబరాలూ ఉండేవి. ఇప్పుడెక్కడా నీలాంబరాలూ, మధ్యాహ్నం మాణిక్యాలూ కనబడటమే లేదు.
“ఎన్ని పువ్వులున్నా దీనికి పిచ్చి పువ్వులంటే సరదా. ఎప్పుడూ చేలగట్లమ్మట తిరిగి ఆ పిచ్చి పువ్వులన్నీ కోసి తెచ్చుకుంటే గానీ దానికి తోచదు” అనే వాళ్ళు మా వాళ్ళు. నిజమే, అడివి మల్లి పూలు ఎంత బావుంటాయో! గమ్మత్తయిన వాసన, కొంచెం ఎరుపు కలిసిన తెల్లని పువ్వులు. చూడగలిగితే పిచ్చిపువ్వుల్లో కూడా ప్రపంచంలో ఉండే అందాలన్నీ చూడొచ్చు.
…
మా తాత గారిది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆయన తమ్ముళ్ళూ, మేనల్లుళ్ళూ, బావ మరిదీ, మొత్తం పిల్లా పెద్దా కలిసి ఎప్పుడు చూసినా పెళ్ళి ఇల్లులా ఉండేది. ఎప్పుడూ ఏవో నోములూ పేరంటాలూ పురుళ్ళూ తద్దినాలూ సమారాధనలూ చాలా సందడిగా ఉండేది. పక్కన అతిథి కూచుని భోంచేస్తేనే మా తాతగారు తినే వారు. ఆస్థి ఉండి అట్టహాసముండి సరదాలూ సంబరాలూ వేడుకలతో నిండి, బొత్తిగా ముందు చూపూ జాగ్రత్తా లేని ఆ కాలపు పెద్ద కుటుంబం మా తాతగారిది.
పెద్ద మండువా ఇల్లూ నాలుగు వేపులా పెద్ద పెద్ద వసారాలూ, పెద్ద భోజనాల సావిడీ, నాలుగు పెద్ద పడక గదులూ, కొన్ని చిన్న గదులూ, పాల మజ్జిగలకి ప్రత్యేకం గదీ, వంటకి వేరే, పిండి వంటకి వేరే గదులూ ఉండేవి. మా బామ్మ కూర్చుని పిండి వంటలు చేస్తూ ఉంటే మేవంతా చుట్టూ కూర్చుని ఖాళీ చేసేవాళ్ళం.
“చేసినంతసేపు పట్టదర్రా, ఖాళీ అయిపోవడానికి” అనేదావిడ.
మా నాన్న కన్నతల్లి చంటితనంలోనే పోతే తాతగారి రెండో భార్య దగ్గిరే ఆయన పెరిగారు. “అమ్మా” అనే పిలిచే వారు. చాలా కాలం దాకా ఆవిడే మా అసలు బామ్మని అనుకునే వాళ్ళం.
దేవుడి గుళ్ళో ఏ వేడుక జరిగినా మా ఇంటికే పెద్ద పీటగా ఉండేది. దేవుడి కళ్యాణానికి బామ్మా తాత గారూ, తరవాత కాలంలో అమ్మా నాన్నా, పీటలమీద కూర్చునే వారు. ఆ అయిదు రోజులూ, ఏ రోజుకారోజు కొత్త బట్టలు మడత నలగకుండా కట్టుకునే వారు.
మా అమ్మకి సినీమాలంటే చాలా ఇష్టం. నాన్న మమ్మల్నందరినీ కాకినాడ తీసికెళ్ళి అక్కడ ఉన్న చుట్టాలతో సహా సినీమాకి తీసుకెళ్ళేవారు. అమ్మ స్థిమితంగా సినీమా చూసేందుకు వీలుగా పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళీ ఆడిస్తూ ఏవో కొనిపెడుతూ, కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు.
కథలంటే ఆయనకి మహా సరదా. ఆయన చెప్పే కథలు ఇంటిల్లిపాదీ ఆసక్తిగా వినేవారు.
దీపావళొస్తే మా ఇంట్లో సంబరం చూడవలిసిందే. సూరేకారం, పటాసూ పేక ముక్కలూ, పాత పోస్టు కార్డులూ పెట్టి మతాబాలు, చిచ్చుబుడ్లు, టపాకాయలూ చెయ్యడంలో నాన్న నేర్పు గురించి ఊరంతా చెప్పుకునే వారు. గది నిండేలా బాణసంచా పేర్చి, బాగా ఆరనిచ్చి, దీపావళికి ముందూ తరవాతా వారం రోజులు ఊరందరికీ పండగలా నడిపించే వారు. ఊరి పిల్లలందరికీ ఆయన పెద్దన్నయ్య.
అంత మందిలోనూ మాకేలోటూ రాకుండా చూస్తూనే, అందరితో కలిసి మెలిసి ఉండేలా, అందరితో మంచీ చెడ్డా పంచుకునేలా అలవాటు చేశారు.
…
యుద్ధమొచ్చింది. చాలా మంది డబ్బు చేసుకునే దార్లు చూసుకుంటుంటే మా వాళ్ళు మాత్రం తాకట్లు వాకట్లవుతున్నా, ఆస్థులు హరిస్తున్నా పద్ధతులు మార్చుకోకుండా ఎప్పుడూ ఒకలాగే ఉండాలనే భ్రమల్లో ఉండే వారు.
తాతగారు పోయాక బాధ్యతంతా నాన్న మీద పడింది . మేఘాల్లో తేలే మనిషి నేల మీద ఒక్కమాటుగా చతికిల పడ్డట్టయ్యింది. అలాగని కదలకుండ నిమిత్తమాత్రుళ్ళా కూర్చునేందుకు వీల్లేని పరిస్థితి. ఆస్థీ ఆడంబరం పరిధుల్లో ఒంటికి పట్టి పోయిన పద్ధతులూ అలవాట్లూ, తాహతు తగ్గగానే ఓ పట్టాన మారవు. బ్రేకు వేసాక రైలైనా కారైనా కొంత దూరం ఇంకా అదే వేగంతో వెళ్ళినట్లే. మనుషులు పరిస్థితులు గమనించి అవగాహన చేసుకునే లోపే ఇంకా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది పైన బాధ్యత ఉన్న వాళ్ళ మాట.
ఇంక మిగిలిన జనాలకి బాధ్యత మోసేవాళ్ళేమవస్థలు పడుతున్నారో పట్టనే పట్టదు.వాళ్ళకి కావలిసిన పనులు సాగాల్సిందే. పెద్దరికాలూ, పది మందిలో పరువూ, పోయిన వాళ్ళ ఓరిమి, ఇంకా ఇలా ఎన్నో రకాల ఆయుధాలు ఉపయోగంలోకొస్తాయి. ముఖ్యంగా వెనకటితరం ఆడవాళ్ళకి.
నాన్నకి వాళ్ళతో ఎదిరించి మాట్లాడటానికి తగినంత అవగాహన ఉండేది కాదనుకుంటాను, మరీ ముంచుకుపోయిందాకాను.
“ఈ పని జరగాలి, ఇన్నేళ్ళుగా జరుగుతోంది. మీ బాబయ్య ఎప్పుడేనా డబ్బుల గురించి ఆలోచించారా?” అని బామ్మో దొడ్డమ్మో అంటే నాన్న డబ్బులేని పరిస్థితికి తనే మూల కారణమన్నట్లుగా బాధపడిపోయేవారు . నోములకోసం, వ్రతాలకోసం, సమారాధనలకోసం, ఇంటికొచ్చిన వాళ్ళకి తాహతుకి మించిన మర్యాదలకోసం, అమ్మ వొంటి మీదున్న బంగారు నగలన్నీ ఒక్కొక్కటే బజారుకెళ్ళిపోయాయి.
మెల్లి మెల్లిగా రోజులు గడవడమే క్ష్టమయ్యాక చుట్టాలు నిష్టూరాలాడుతూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మా చుట్టాల్లో ఒకాయన తాసిల్దారు. ఆయన పరపతి వల్ల ఆట్టే చదువుకోని మా నాన్నకి మధ్య వయసులో చిన్న మేస్త్రీ ఉద్యోగం దొరికింది, బతుకు వెళ్ళమార్చుకోడానికి.
…
ఒక రోజు మిట్ట మధ్యాహ్నం ఎర్రని ఎండలో చెమటలు కక్కుకుంటూ తారు మరకల పంచెతో వచ్చిన నాన్నని చూసి బామ్మ, “ఏవిటో నాయనా, ఎండ కంట పడితే కంది పోతావని ఇంటి చుట్టూ చల్లగా తాటాకుల పందిరి వేయించి కంటికి రెప్పలా పెంచుకున్నాము, ఈ నాటికి నీ రాత ఇలా మారింది” అని బాధ పడింది.మళ్ళీ ఆవిడే “ఏవిటో ఉద్యోగం పురుష లక్షణమని సొంత ఊరు ఒదులుకుని వచ్చాడు కానీ, మాకేవిటీ తరాలు తిన్నా తరగని ఆస్థి, పిల్ల జమీందారీ అమ్మా మాది” అనేది ఇరుగు పొరుగు వాళ్ళతో. వాళ్ళు పక్కకి తిరిగి ముసి ముసి నవ్వులు నవ్వుకునే వారు. పాపం ఆవిడకి తెలీదు, అప్పటికే ఆస్థి పూర్తిగా హరించుకుపోయి ఉన్న కొద్ది పాటి నేలా ఇల్లూ తనఖాలో ఉన్న సంగతి.
నాన్న దొరికిన చిన్నపాటిపని తక్కువనుకోకుండా చేస్తూ మమ్మల్ని జాగర్తగా చూసుకునే వారు.
“ఎప్పుడూ కూడా లేకపోవడం అనేది తక్కువ కాదర్రా! ఉన్నంతలోనే మనం సంతోషం వెతుక్కోవాలి” అనే వారు. జీవితం కొట్టిన అంత పెద్ద దెబ్బకి క్రుంగి కృశించకుండా కొత్త వాతావరణానికి ఎలా తట్టుకున్నారో నా పదేళ్ళా వయసులో అర్థమయ్యేది కాదు. నా మటుక్కు నాకు తలవంపులయినట్లుండేది. నేనెప్పుడైనా ఈ గడ్డు రోజులు గడుస్తాయా అని భయంగా ఉందంటే, “ఎందుకమ్మా భయం, భయం మన్ని చూసి భయపడాలి” అనే వారు.
అమ్మ ఓనాడు భరించలేక “ఏం చెయ్యనర్రా, ఇంత విషం కొనుక్కుని చద్దామన్నా అణా డబ్బులు లేవు!” అంది. నాన్న నవ్వుతూ “ఒక అణా దొరికితే విషమెందుకే కొనడం, టీ కాచుకుని తాగుదాం” అన్నారు.
ఇంట్లో ఎవరైనా మొహాలు ముడుచుకుని కూర్చుంటే ఇన్ని చింత గింజలో గవ్వలో తెచ్చి నవ్విస్తూ కబుర్లు చెబుతూ ఆడించేవారు. ఎన్ని ఇబ్బందుల్లోనూ ఎదురుదెబ్బలలో కూడా ఆయన సహనం కోల్పోకుండా నిత్య సంతోషిలా కనిపించే వారు.
ఒక సారి మావయ్య మమ్మల్ని చూడ్డానికి వస్తూ మా కోసం తెచ్చిన పెద్ద బిస్కెట్ల డబ్బా రైల్లో మర్చిపోయాడు.
“అయ్యో, పిల్లలు తింటారని పెద్ద డబ్బా కొన్నాను, ఎవరికి దొరికిందో?” అన్నాడు.
“పోనీలేవోయ్ అయ్యో అనకూడదు, ఎవరికి దొరికినా తింటారు, ఎవరైతేనేం, తినడానికీ, సంతోషించడానికి?” అన్నారు నాన్న.
“నీలా అందరూ అనలేరు బావా!” అన్నాడు మావయ్య.
“ఈ నాటికి బిస్కెట్ల డబ్బా పోయిందని విచారించమంటావా రావుడూ?” అన్నారు నాన్న.
ఎంత లేమి పరిస్థితుల్లోనూ లోపలి బాధ పైకి కనపడకుండా తిరుగుతున్న రోజుల్లో మా మేనత్త కూతురు పెళ్ళయింది. మొదటి రోజు వంట చేసిన వంట వాళ్ళు ఏదో పేచీ పెట్టుకుని చెప్పకుండా వెళ్ళిపోయారు. నాన్న తువ్వాలు నడుముకి చుట్టుకుని గాడి పొయ్యి రాజేసి గుండిగలూ కుళాయిలూ ఎక్కించేశారు. కంగారు పడుతున్న అత్తయ్యా, మావయ్యగారూ, మిగిలిన పెళ్ళి వారూ ఆశ్చర్యం నించి తేరుకునే లోపే, ఉప్మా, కాఫీ మొగ పెళ్ళి వారి విడిదికి పంపించడానికి సిద్ధం చేశారు. మాలాంటి పిల్లల్ని కొంచెం సాయం తీసుకుని, కూరలు తరిగించేసి, వీలయినంతలో వంటలు సిద్ధం చెయ్యడం చూసి అందరూ ముక్కుమీద వేలేసుకున్నవాళ్ళే. అప్పుడాయన వంట చెయ్యడానికొచ్చిన వాళ్ళలాగే మాసిన అంగోస్త్రమే కట్టుకున్నారు. ఆయాసం తగ్గడానికి టీ తప్పించి మరోటి తీసుకోలేదు, పనయ్యేదాకా. వడ్డనల టైములో ఆయాసం తట్టుకోలేక పైగదిలోకెళ్ళిపోయారు తిండి తినకుండానే.
…
ఎప్పుడైనా ఇబ్బంది పరిస్థితుల్లో అమ్మ విసుక్కుంటూంటే, “అన్నం దగ్గిర గొడవ చెయ్యకే, నేను తినకుండా లేచేస్తే నువ్వు రోజంతా ఉప్పోషముంటావని తింటున్నాను, తినగలిగి కాదు”. అనేవారు. ఆయన తినకుండా ఆవిడెప్పుడు తినేది కాదు. ఆవిడ విసుగులోనూ, ఆయన సౌమనస్యంలోనూ కూడా ఆపేక్షా, అనురాగం మటుక్కే కనపడేవి. అలాగే పాపం ఒడుదుడుకులు తట్టుకుంటూ మమ్మల్నందర్నీ ఒక ఒడ్డుకి చేర్చాలని ప్రయత్నం చేస్తూ ఉండే వారు.
రెండేసి రోజులు పొయ్యి మీదికీ, పొయ్యి లోకీ ఏవీ లేక పోయినా మూడో రోజు ఏ కొంచెం డబ్బు సమకూడినా ఏవో తినుబండారాలు కొని రాత్రి ఏ టైముకొచ్చినా నిద్రపోయే పిల్లలందరినీ పేరు పేరునా లేపి తినిపించేవారు.
వేడి తార్రోడ్డు మీడ పని చేసి వచ్చి పడుకుంటే తగని ఆయాసమొచ్చి నిద్రపోనిచ్చేది కాదు సగం రాత్రి దాకా. అలా ఉన్నప్పుడు కొంచెం పల్చగా టీ తాగితే ఆయాసం తగ్గినట్లుండేది. ఒక రోజున అలా టీ అడిగినప్పుడు అమ్మ “టీ పొడుం అయిపోయిందండీ, ఇందాకటి చారు కొంచెముంది, వేడి చేసిస్తాను ఘాటుగా ఉంటుంది తాగండి” అంది.
ఏమనకుండా చారు తాగుతున్న నాన్నని చూసి “పాపిష్టి దాన్ని, అంత ఆయాస పడుతుంటే కాసిన్ని టీ నీళ్ళు కాచియ్యలేకపోయాను” అంది. “లేదే, ఈ చారు వేడిగా ఘాటుగా టీ కంటే బావుంది, గొంతు కొంచెం సద్దుకుంది” అన్నారు నాన్న, ఇంకా తన్నుకొస్తున్న దగ్గూ ఆయాసం లోపల అణిచేసుకుంటూ.
ఇంకోమాటు అలాంటి పరిస్థితిలో అమ్మ దొడ్లో తులసాకులు నీళ్ళల్లో కాచి ఇచ్చింది. అది తాగి నవ్వుతూ, “గొంతులో తులసి నీళ్ళ టైమింకా రాలేదనుకున్నాను” అన్నారు నాన్న. అమ్మ బావురుమంది. “లేదే, ఊరికే సరదాకన్నాను, నిన్ను బాధ పెట్టడానిక్కాదు, నేను చాలా కాలం బతుకుతాను” అని అటు తిరిగి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకున్నారు.
అలాంటి పరిస్థితుల్లోనే నాకు పెళ్ళీడొచ్చింది. నా జాతకం చాలా బావుందనే వారు అంతానూ. చిన్నప్పుడు ఏం జాతకాలో ఏమిటో అని ఈసడించుకునే దాన్ని. కాని ఆ పరిస్థితుల్లో అనుకోకుండా మా దూరపు చుట్టాలబ్బాయి కావాలని నన్ను చేసుకునేందుకు సిద్ధ పడ్డాడు. అప్పటికి తణఖాలో ఉన్న పల్లెటూళ్ళో పాతిల్లు అమ్మేస్తే ఎనిమిది వందలు అప్పు పోగా మిగిలింది. దాంతోటి, అటూ ఇటూ ఏ కాస్తో సొమ్మోఒ సరుకో సాయంతోటీ మా పెళ్ళయిందనిపించారు.
నేను మొదటి సారి అత్తారింటినుంచి వచ్చిన రోజున వేడి వేడి బటాణీలు తువ్వాల్లో కట్టుకుని, గుప్పెడు మల్లె పూలు జేబులోంచి తీసి ఇస్తూ “ఈ ఏడాది ఆఫీసు గెస్టు హౌసులో మల్లె పూలు తక్కువ పూసాయమ్మా!” అన్నారు. ఆపేక్షతో తెచ్చిన ఆ గుప్పెడు మల్లె పూల గుబాళింపు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది.
ఇంకా తమ్ముడూ, చెల్లాయీ చిన్న వాళ్ళే. స్కాలర్షిప్పులతో ఎలాగో చదువు సాగిస్తున్నాడు తమ్ముడు. చెల్లాయి చదువు మానేసి కుట్లు నేర్చుకుంది. నాన్న మధ్య వయసవకుండానే బాగా ముసలితనమొచ్చినట్లు కనపడే వారు. అయినా ఆ చిన్న ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం సాగిస్తూనే ఉండేవారు.
డొక్కు సైకిలు మీద మండే ఎండలో రోడ్డు మీద వస్తూనే ఉన్నారు. మొహంలో నవ్వుని అణిచేస్తూ బాధ ఆక్రమించుకుంటూ ఉండేది. మేమక్కడికి వెళ్ళినప్పుడల్లా బాధ కనపడకుండా నవ్వే కనపడాలని ప్రయత్నం చేసేవారు పాపం. మా పాపాయి కోసమని దీపావళికి అవస్థ పడుతూనే మతాబాలు కట్టారు. “మతాబాల వెలుతురులో గులాబి పువ్వులా మెరిసిపోతున్నావు తల్లీ,” అన్ని పాపాయిని ఆడిస్తూ, నవ్విస్తూ కాలక్షేపం చేసేవారు.
కట్టిన కొద్ది బాణసంచాలోనూ సగం ఇరుగు పొరుగు వాళ్ళకమ్మి ఆ ఖర్చుకి తట్టుకునే వారు కానీ, లేకపోతే ఇన్నేళ్ళుగా మానేసిన బాణసంచాకి ఇప్పుడు డబ్బులెక్కడివి? ఆయన కట్టిన సరుకు సీమ సరుక్కంటే బావుందని బజారుకంటే చవకనీ మళ్ళీ బోల్డు మందొచ్చి సరుకులిచ్చి మతాబాలూ చిచ్చుబుడ్లూ కట్టించుకున్నారు.
…
తమ్ముడు ఫోను చేసాడు నాన్నకి సీరియస్ గా ఉందని. హడావుడిగా బయల్దేరి వచ్చేప్పటికి కొంచెం తేరుకున్నట్లుగా కనిపించారు. మా వారిని చూస్తూనే “రావోయి, బేస్తులాడుకుండాం, చాలా రోజులయ్యింది” అన్నారు. నాకేసి చూసి “అమ్మాయీ నువ్వొచ్చేసావు, నాకింకే బెంగా లేదమ్మా!” అన్నారు. “ఆ మాటలన్నీ ఎందుకు నాన్నా, స్థిమితంగా ఉండండి” అన్నాను. నాన్న అడగంగానే పేకలూ సిగరెట్లూ తెచ్చారు మా ఆయన.
డాక్టరొచ్చి చూసి వెళ్ళాడు. ఏమీ వివరంగా చెప్పలేదు. మందులు రాసిచ్చి వెళ్ళిపోయాదు. సాయంత్రం కాసేపు పేకాడుకున్నాం ఇంట్లో అందరం కలిసి. “మానేసిన సిగరెట్టు ఇవాళ మళ్ళీ కాల్చాలనిపిస్తోందర్రా!” అని సంతోషంగా సిగరెట్టు కాలుస్తూ ఆడారు నాన్న.
పడుకునే ముందు మళ్ళి సీగరెట్టు కాల్చారు.
…
మళ్ళీ ఇన్నాళ్ళకి చూశాను మధ్యాహ్నం వేళ చెట్ల మధ్యనుంచి నవ్వుతున్న నాన్న ముఖాన్ని.