అంతరం

పూలు వికసించే సవ్వడి
నాకిక వినబడకపోవచ్చు
కాని, పూలు వికసిస్తూనే ఉంటాయి.
వాన చినుకుల పరిమళం
నన్నిక ముంచెత్తకపోవచ్చు
కాని, వాన కురుస్తూనే ఉంటుంది.
కోసిన గులాబీలతో ప్రేమని
కొలవటానికి నేనలవాటుపడినా
ఎక్కడో ఒకచోట ఒక గడ్డిపువ్వు
తలెత్తుకు మొలుస్తూనే ఉంటుంది.
నడచివచ్చిన దారులు మారినట్టే
విడిచివచ్చిన వయోప్రాంగణాలు
మరల మరల
పచ్చ తోరణాలు కట్టుకుంటాయి.
ఒకప్పుడు తెలిసిన భాషలు
నాకిపుడు అర్థం కాకపోవచ్చు
కాని, సకల చరాచరాలు
తమ తమ భాషలో
సంభాషిస్తూనే ఉంటాయి.
కొత్తదనాలు
కొత్త తరాల్ని
ఆకర్షిస్తూనే ఉంటాయి.