ఇలియాడ్ – ముందుమాట

ప్రాచీన గ్రీకు భాషలో ‘ఇలియాన్’ అనేది ‘ట్రోయ్’ నగరానికి మరొక పేరు. మాట చివర ‘-ఇయాడ్’ అనే ప్రత్యయాన్ని చేర్చితే ‘యొక్క కథ’ అని అర్థం వస్తుంది. ఈ రెండు మాటలను కలపగా వచ్చిన ‘ఇలియాడ్’ అంటే ‘ట్రోయ్ నగరపు కథ’ అనే అర్థం వస్తుంది.

మనకు రామాయణం, మహాభారతం ఎలాంటివో, గ్రీసు దేశస్థులకు – ఆ మాటకొస్తే పాశ్చాత్యులకు – ఇలియాడ్, ఓడిస్సీ అనేవి అటువంటి గ్రంథాలు. స్థూలంగా ఇలియాడ్‌ని భారతంతోటీ, ఓడిస్సీని రామాయణంతోటీ పోల్చవచ్చు. రామాయణ, మహాభారతాలు చదవకుండా భారతీయ విలువలను, మనస్తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అలాగే ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు చదవకుండా గ్రీసు దేశపు సంప్రదాయాలనే కాకుండా పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య కళలనూ, పాశ్చాత్య ఆలోచనాసరళిని అర్థం చేసుకోవడం కష్టమే.

భారత కథలో దైవాంశ సంభూతులైన వీరులు, అక్కడక్కడ అవతార పురుషులు, దేవతలు కనబడినట్లే ఇలియాడ్, ఓడిస్సీలలో కూడా మానవులు, దేవతలు కలగాపులగంగా కనబడతారు. భారతయుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే ట్రోయ్ యుద్ధం పది సంవత్సరాలపాటు రగులుకొని, చివరికి 51 రోజుల తీవ్రమైన యుద్ధంతో ముగుస్తుంది. ట్రోయ్ యుద్ధం ముగిసిన తరువాత ఆ యుద్ధంలో పోరాడి, బ్రతికి బయటపడిన ఒక వీరుడు ఇంటికి తిరుగుముఖం పట్టినప్పుడు, మరొక పదేళ్ళపాటు సముద్రంలో చేసిన సాహసయాత్రలోని భయంకరమైన అనుభవాలే ఓడిస్సీలోని కథాంశాలు.

పదేళ్ళపాటు కొనసాగిన ఈ పోరాటంలోని చివరి 51 రోజులలో ట్రోయ్ నగరపు సముద్రపుటొడ్డున జరిగిన యుద్ధంలోని సంగతులే ఇలియాడ్‌లో కనిపిస్తాయి. హెలెన్ అపహరణ ఈ యుద్ధానికి ప్రేరణా, కారణమూ అన్న విషయం యాదృచ్ఛిక ప్రస్తావనలో వస్తుంది కానీ వివరాలు ఈ గ్రంథంలో కనబడవు. అలాగే, ‘హెలెన్ అఫ్ ట్రోయ్’ అనే పేరుతో తీసిన ఇంగ్లీషు చలనచిత్రంలో చూపించిన కర్రగుర్రం ఉపాఖ్యానం కూడా ఇలియాడ్‌లో కనిపించదు! ఈ గ్రంథం గురించి తెలిసినా, తెలియకపోయినా, సినిమాలో చూపించిన కర్రగుర్రం చాలామందికి పరిచయమయే ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఒకటి, రెండు సంఘటనలు బులబులాగ్గా అర్థం అవొచ్చు కానీ కథ సమగ్రంగా అర్థం అవ్వాలంటే ఇలియాడ్‌లో లేని నేపథ్యం కూడా అర్థం కావాలి. అందుకని ఈ పుస్తకాన్ని మూడు అసమాన భాగాలుగా విడగొట్టేను. పూర్వరంగంలో యుద్ధానికి ప్రేరణకారణాలయిన నేపథ్య సంఘటనలను కొన్నింటిని – గ్రీకు పురాణకథలనుండి సేకరించి, సంగ్రహించి – చెప్పడానికి ప్రయత్నం చేసేను. యుద్ధరంగంలో ఇలియాడ్‌లోని 24 అధ్యాయాల యుద్ధాన్ని సంక్షిప్తపరచి వర్ణించేను. ఉత్తరరంగంలో చెప్పిన అంశాలు కథను ఒక గట్టెక్కించడానికి అవసరమైనవే కానీ ఇలియాడ్‌లో కనబడవు.

యుద్ధరంగంలో dactylic hexameter అనే ఛందస్సులో, 15,693 పాదాలు ఉన్న కథను ఇక్కడ టూకీగా చెబుతాను. ఈ కథ ఆరంభదశలో గ్రీకు సైన్యానికి సర్వసేనాధిపతి అయిన అగమేమ్నాన్‌కి, సైన్యంలో ‘మహారథుడు’ అనదగ్గ అకిల్లీస్‌కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అకిల్లీస్‌ అలిగి, యుద్ధం చెయ్యనని భీష్మించుకుని కూర్చుంటాడు. అప్పుడు గ్రీకు సైన్యం విశేషంగా నష్టపోతుంది. అప్పుడు అకిల్లీస్‌ తరఫున అతని ప్రాణమిత్రుడైన పెట్రాక్లస్ యుద్ధంలోకి దిగి ట్రోయ్ వీరుడైన హెక్టర్ చేతిలో చనిపోతాడు. తన తరఫున పోరాడి మరణించేడన్న విషయం తలుచుకుని, దుఃఖాతిశయంతో రగులుకున్న క్రోధాగ్నితో అకిల్లీస్‌ యుద్ధరంగంలోకి దూకి ట్రోయ్ నగరపు యువరాజు హెక్టర్‌ని హతమార్చుతాడు. హెక్టర్‌ మృతదేహాన్ని తన రథానికి కట్టి యుద్ధరంగంలో ఈడ్చి వీరవిహారం చేస్తాడు. తరువాత దహనసంస్కారాలకు హెక్టర్‌ మృతదేహాన్ని హెక్టర్ తండ్రికి అప్పగించడంతో గ్రంథంలో కథ పూర్తి అవుతుంది.

ఈ గ్రంథాన్ని ఇదివరకు తెలుగులో ఎవ్వరైనా అనువదించేరో లేదో నాకు తెలియదు. నాకు ఈ గ్రంథం యొక్క ఉనికి తెలిసి ఉన్నా, ఈ గ్రంథంలోని ముఖ్యమైన ఒకటి, రెండు సంఘటనలతో పరిచయం ఉన్నా, దీన్ని నేను సమగ్రంగా అధ్యయనం చేసినది ఇటీవలి కాలంలోనే. కనుక నాలాంటివాళ్ళు ఇంకా ఉంటారనే భావనతో, వారికి ఈ గ్రంథాన్ని పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో దీన్ని తేలికైన తెలుగు వచనంలో రాయడానికి ఉపక్రమించేను. ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో పాఠకులే నిర్ణయించాలి.

ఈ గ్రంథాన్ని సంక్షిప్తపరచి తెలుగులో రాసేటప్పుడు అనేక ఇంగ్లీషు పాఠాంతరాలను సంప్రదించడం జరిగింది. అనేక ‘యూట్యూబ్ సినిమాలు’ చూడడం జరిగింది. ఈ ఇంగ్లీషు పాఠాంతరాలకు పరస్పరం పొంతన లేదు. కథ ఒకొక్క చోట ఒకొక్కలా కనిపిస్తుంది. సాధ్యమయినంతవరకు హోమర్ వ్రాసిన కథనే ప్రమాణంగా తీసుకున్నాను. కనుక ఇక్కడ నా సొంత పైత్యం అంటూ ఏమీ లేదు.

నేను రాసిన చిత్తుప్రతిని జాగ్రత్తగా చదివి, కేవలం అచ్చుతప్పులనే కాకుండా, భాషాదోషాలను, అంతర్గతంగా చోటు చేసుకున్న పరస్పర వైరుద్ధ్యాలను ఎత్తి చూపి, సహాయం చేసిన మిత్రులు ఇంద్రగంటి శర్మకు, ఈమాటలో ప్రచురించే సందర్భంలో ఇంకా మిగిలిన అవకతవకలను ఎత్తి చూపి సహాయం చేసిన ఈమాట సంపాదకులకు నా ధన్యవాదాలు. ఇంకా తప్పులు కనిపిస్తే వాటికి నేనే బాధ్యుడను.

వేమూరి వేంకటేశ్వరరావు
2026, ప్లెజంటన్, కేలిఫోర్నియా

ఉపయుక్త గ్రంథాలు/వ్యాసాలు

  1. Barry Strauss, Achilles: Bronze Age Warrior, Military History Quarterly. Autumn 2007
  2. Did the Trojan War really happen?
  3. వేమూరి వేంకటేశ్వరరావు, గ్రీకు పురాణ గాథలు, ఈమాట, జనవరి – డిసెంబరు 2020
  4. వేమూరి వేంకటేశ్వరరావు, గ్రీసు దేశపు పురాణ కథలు, సైన్సు వ్యాసాలు-పుస్తకాలు
  5. వేమూరి వేంకటేశ్వరరావు, ఓడిస్సీ, ఈమాట, డిసెంబరు 2025-ఏప్రిల్ 2026
  6. Samuel Butler, The Illiad, Project Gutenberg
  7. William Cullen Bryant, Standard Ebooks
  8. Ian Strachan, The Iliad (Retold), Larousse Kingfisher Chambers Inc., 95 Madison Ave., New York, NY 10016, 1997
  9. The ENTIRE Story of the Trojan War Explained
  10. The Illiad, Cliff Notes
  11. కర్రగుర్రం నిర్మాణం
  12. Did Homer Influence Vyasa?

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...