జగన్నాటకసూత్రధారుడైన నారాయణుణ్ణి ప్రార్థించాక, మనవి మాటలు మొదలుపెట్టి, వెంటనే పక్కకు తప్పుకుంటాడు. అభిమన్యువధ వార్తను ధృతరాష్ట్రుడికి మనవి చేసేందుకని భటుడు రంగప్రవేశం చేస్తాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, దుస్సలా అభిమన్యుడి మరణానికి చింతిస్తూ, రానున్న అర్జునప్రతీకారాన్ని ఊహిస్తూ ఉండగా దుర్యోధనాదులు విజయగర్వంతో శిబిరానికి తిరిగివస్తారు.
దుర్యోధనుడి దురహంకారం ధృతరాష్ట్రుడి దూరదృష్టితో తలపడుతున్న సమయంలోనే, అటువైపునుంచి అర్జునుడి శపథకోలాహలం చెలరేగుతుంది. ఇక వినాశనం తప్పదని ఆ తండ్రి క్రుంగిపోతుండగా, అర్జునుణ్ణి చితికెక్కించే అవకాశం దొరికిందని ఆ కొడుకు పొంగిపోతాడు.
ఇంతలో కృష్ణుడి సందేశాలను మోసుకొని ఘటోత్కచుడు దూతగా వస్తాడు. సర్వనాశనమవకముందే సైన్యాన్ని ఉపసంహరించుకొమ్మని ధృతరాష్ట్రుడికి ఒక మాట; పుత్రశోకతప్తుడైన పార్థుడికి భూభారాన్ని తగ్గించడం పెద్ద పని కాదని దుర్యోధనుడికొక హెచ్చరిక ఇచ్చి, కౌరవప్రముఖుల నిర్లక్ష్యభావాన్ని ఘటోత్కచుడు వీరోద్రేకంతో ఎదుర్కొంటాడు. మళ్ళీ దూతపాత్రలోకి ఒదిగిపోయి, దుర్యోధనుడి ప్రతివచనాన్ని వినేసి, కృష్ణుడి మూడో సందేశాన్ని భరతవాక్యంగా పలికి నిష్క్రమిస్తాడు.
కొన్ని విశేషాలు
దూతఘటోత్కచం దశవిధరూపకాలలో అంకము అనే రకానికి చెందినది. దీనినే ఉత్సృష్టికాంకం అని పిలుస్తారు. దశరూపకసారములో పేర్కొన్న అంకలక్షణాలలో మనకు దూతఘటోత్కచంలో కనబడేవి ఇవి — ఒకే అంకం; ప్రధానరసం కరుణ; స్త్రీశోకం; మాటలలో యుద్ధవర్ణన.
ఇందులో ధృతరాష్ట్రుడు కుత్సితుడిలా, ఈర్ష్యాళువుగా కాక బంధుప్రీతిని, వాస్తవికదృష్టినీ, నిస్సహాయతనూ తనలో నింపుకున్నవాడిలా కనబడతాడు. ఘటోత్కచుడు రంగప్రవేశం చేసి చెలరేగక ముందు సాగిన కథకు కేంద్రబిందువుగా నిలిచి అందులోని ఉద్విగ్నతను నిలిపి ఉంచుతాడు./li>
అర్జునుడి బలపరాక్రమం గురించి తనకు తెలియదన్న దుర్యోధనుడి బింకానికి దూతవాక్యంలో కృష్ణుడి సమాధానమూ, ఈ నాటకంలో ధృతరాష్ట్రుడి సమాధానమూ సారంలో ఒక్కటే అయినప్పటికీ, ధృతరాష్ట్రుడి మాట మరింత పదునుగా ఉన్నట్లనిపించింది నాకు.
ఈ నాటకపు సంభాషణల్లో ప్రత్యేకంగా పేర్కొనదగ్గది, దుర్యోధనుడితో ఘటోత్కచుడు అన్న “రాక్షసేభ్యోఽపి భవన్త ఏవ క్రూరతరాః…” (రాక్షసులకన్నా మీరే క్రూరతరమైన వారు) అన్నమాట. ఘటోత్కచుడి రోషము, వ్యంగ్యమూ భలేగా పలుకుతాయి ఆ మాటలో.
నాటకం చివరలో వచ్చే భరతవాక్యం కొంత విచిత్రంగా ఉండి, అది భరతవాక్యమేనా లేక మనకు లభించిన నాటకం అసంపూర్తిగా ఉన్నదా అనే అనుమానాన్ని కలిగిస్తుంది. ఈ భరతవాక్యశ్లోకం ఏ చాక్యార్ కళాకారుడు కల్పించినదై ఉంటుందా అని సందేహిస్తారు, ఏ.డి. పుసాల్కర్, తన భాసాధ్యయనగ్రంథంలో.
తెలిసింది. సంశప్తకుల సైన్యం కృష్ణుడితో సహా అర్జునుడిని యుద్ధానికై ఆహ్వానించారు. తదనంతరం, భీష్మవధ కారణంగా కోపించి ఉన్న కౌరవులు, బాలుడైన అభిమన్యుడిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. అదిగో –
అర్జునుడు తిరిగి వస్తాడన్న భయంతో అతడు వెళ్ళిన దారివైపు చూస్తూ, అభిమన్యుడి బాణాల గాయపు గురుతులతో, చేష్టలుడిగిన ధార్తరాష్ట్రులు తమ తమ శిబిరాలకు తిరిగివస్తున్నారు.
ఓయీ, వందమంది కొడుకులను కన్న ఖ్యాతికి పాత్రుడైనవాడు, విద్యచేత విస్తరించిన వినయము, దీర్ఘదృష్టీ కలిగినవాడైన ధృతరాష్ట్రమహారాజుకు ఈ విషయాన్ని విన్నవించు:
“యోధులను, రథాశ్వాలను, ఏనుగులను వధించి, రాజుల సైన్యబలాన్ని కలవరపరచి, అర్జునపరాక్రమాన్ని ఆటతీరున ప్రదర్శించిన అభిమన్యుడు, వందలాది రాజులు అన్ని వైపులనుంచీ వేగంగా వచ్చిపడడంతో – ఒక్క ఉదుటున – ఆకాశంలో ఉన్న తన తాతగారైన ఇంద్రుడి ఒడిలోనికి చేరుకున్నాడు.”
కేనైతచ్ఛ్రుతిపథదూషణం కృతం మే
కోఽయం మే ప్రియమితి విప్రియం బ్రవీతి ।
కోఽస్మాకం శిశువధపాతకాఙ్కితానాం
వంశస్య క్షయమవఘోషయత్యభీతః ।। 4 ।।
ధృతరాష్ట్రుడు:
ఇదేమి?
ఎవరు నా కర్ణపథాన్ని కలుషితం చేస్తున్నారు? నాకు ఇష్టమని అనుకొని ఈ అప్రియాన్ని పలుకుతున్నదెవరు? ఎవరది, శిశువధ అనే మహాపాపం చేత కళంకితులమైన మా వంశం నాశనమవనున్నదని నిర్భయంగా ప్రకటిస్తున్నారు?
గాన్ధారీ:
మహారాఅ! అత్థి ఉణ జాణీఅది కేవలం పుత్తసంఖఅకారఓ కుళవిగ్గహో భవిస్సిది త్తి ।
మహారాజ! అస్తి పునః జ్ఞాయతే కేవలం పుత్రసంక్షయకారకః కులవిగ్రహో భవిష్యతీతి ।
కృష్ణుడి ఎనిమిది భుజాలు తలగడలుగా అమర్చుకొని అతడి ఒడిలో చిరకాలం వర్ధిల్లిన వాడు, మత్తెక్కి ఉండే బలరాముడికి మరింత మత్తును కలిగించిన వాడు, వీరత్వంలో దేవతాసమానులైన పాండవుల వాత్సల్యానికి పాత్రుడైన వాడూ అయిన అభిమన్యుడిని చంపాక, తన పాపకార్యాలతో ఎవడు ఈలోకంలో చిరకాలం జీవించి ఉండగలడు?
జయత్రాతా! ఆ దశలో ఉన్న పుత్రుణ్ణి చూసి అర్జునుడు ఎలా ఊరుకున్నాడు?
భటః:
మహారాజ! కిం వార్జునసమీపే వృత్తమేతత్ ।
భటుడు:
మహారాజా! అర్జునుడు దగ్గర ఉండగా జరగలేదు కదా ఇదంతా?
ధృతరాష్ట్రః:
కథమర్జునోఽపి నాత్రాసీత్ ।
ధృతరాష్ట్రుడు:
అర్జునుడక్కడ లేడా?
భటః:
మహారాజ! అథ కిమ్ ।
భటుడు:
లేడు, మహారాజా!
ధృతరాష్ట్రః:
కథమిదానీం వృత్తమేతత్ ।
ధృతరాష్ట్రుడు:
అలా ఎలా జరిగింది?
భటః:
శ్రూయతాం — సంశప్తకానీకనివాహితే జనార్దనసహాయే ధనఞ్జయే స బాల భావాదదృష్టదోషః సఙ్గ్రామమవతీర్ణః కుమారోఽభిమన్యుః ।
భటుడు:
వినండి, సంశప్తకుల సైన్యం కృష్ణసమేతుడైన అర్జునుడిని యుద్ధానికి కవ్వించింది. ఆ సమయాన, బాలుడైన అభిమన్యుకుమారుడు, పసితనం కొద్దీ, రానున్న ఆపదను గమనించకుండా యుద్ధానికి దిగాడు.
జయద్రథుడి సేన శత్రుసైన్యాన్ని ఓడించి పాండవులను నిలువరించింది. వందలాది బాణాల తాకిడి కారణంగా రెండవ అర్జునుడైన అభిమన్యుడు నేలకూలాడు. భీష్ముడు పడిపోయినందుకు దుఃఖితులమై ఉన్న మనం ఈనాటి యుద్ధంలో ఆ అభిమన్యుకుమారుడిని వధించి, పాండవుల హృదయాలలో తీవ్రమైన శోకం అనే బాణాలను నాటాము.
నేటి యుద్ధంలో జయద్రథుడు ఇతర రాజులెవ్వరూ ఊహించనంతటి పరాక్రమాన్ని చూపాడు. తన దృఢప్రయత్నంతో పాండవకుమారుడైన అభిమన్యుడిని, వారి అసమాన కీర్తినీ యుద్ధాన హరించాడు.
మామా! ఇలా రండి. దుశ్శాసనా, ఇటు రా. పితృపాదులకు నమస్కరిద్దాము.
శకునిః:
వత్స దుర్యోధన! మా మైవమ్ ।
కామం న తస్య రుచితః కులవిగ్రహోఽయ-
మస్మాంశ్చ గర్హయతి స ప్రియపాణ్డవత్వాత్ ।
యుద్ధోత్థితైర్జయమవాప్య హి తుల్యరూపం
ఏవం ప్రహృష్టవదనైరభిగన్తుమేనమ్ ।। 14 ।।
శకుని:
నాయనా దుర్యోధనా! వద్దు, వద్దు.
ఈ కుటుంబవైరం ఆయనకు ఎంతమాత్రము రుచించదు. పాండవులంటే ప్రీతి కనుక మనలను నిందిస్తూ ఉంటాడు. ఈవిధంగా, యుద్ధంలో విజయం సాధించి ప్రసన్నవదనాలతో ఆయనవద్దకు వెళ్ళడమా?
పుత్రులు అనేకంగా ఉండిన ఈ ఇంటిలో నూరుగురు కొడుకులకన్నా మిన్నగా ఒకే ఒక కూతురు కలిగింది. తన అన్నలైన మీ అనుగ్రహం కారణంగా నిందనీయమైన వైధవ్యాన్ని పొందనున్నదని!
తను కోరుకున్నప్పుడే మృత్యువు కలుగుతుందన్న వరం ఉన్న భీష్ముడు స్వయంగా తనను గెలవగల ఉపాయాన్ని బోధించి సంతోషంగా మరణించాడు. వీడు? బాలుడు. కురువంశప్రభువు. అర్జునవృక్షపు తొలి అంకురం చిదిమివేయబడ్డది.
తమ ఆజ్ఞ! (వెళ్ళి, తిరిగివచ్చి) మహారాజుకు జయమగుగాక. సంశప్తకుల సేనతో యుద్ధానికని వెళ్ళి తిరిగివచ్చిన అర్జునుడు, తన మృతపుత్రుడిని ఒడిలో ఉంచుకొని కన్నీటితో తడిపివేసాడు. ఆ తరువాత, కృష్ణుడు రెచ్చగొట్టగా శపథం చేసాడు…
అభిమన్యుడి వధ కారణంగా విచలితులై ఉండిన రాజులందరి గుండెలు అర్జునుడి పూనికకు సంతోషంతో పొంగిపోయాయి. అతడి శౌర్యం వారిలో ఉత్సాహాన్ని నింపింది. వారి ముఖాలు ప్రసన్నమయ్యాయి. గెలిచి తీరుతామన్న ఎరుకతో వాళ్ళంతా ఒక్క ఉదుటున హర్షధ్వానం చేసారు. ఆ క్షణంలో, పెద్ద పెద్ద కొండలతో ఆక్రమించబడి ఉన్న భూమి– సంభ్రమానికి లోనైన యువతివలె – కంపించిపోయింది.
(ఉపసృత్య) పితామహ! అభివాదయే ఘటోత్క (ఇత్యర్ధోక్తే) న న అయమక్రమః । యుధిష్ఠిరాదయశ్చ మే గురవో భవన్తమభివాదయన్తి । పశ్చాద్ఘటోత్కచోఽహమభివాదయే ।
ఘటోత్కచుడు:
(లోనికి వచ్చి) అరె! పూజ్యుడైన ధృతరాష్ట్రుడు ఇక్కడ ఉన్నాడు. నీచులైన నూరుగురిని పుట్టించినవాడు. ఆహా, ఎంత కోమలమైన, గంభీరమైన రూపం! ఆశ్చర్యమాశ్చర్యం!
ముసలివాడైనప్పటికీ, ముడుతలు ఎక్కువగా లేవు. మూపు విశాలంగా, పొందికగా ఉన్నది. నూరుగురు కుమారులను కన్నందున శ్రద్ధకు పాత్రుడయ్యాడు. స్వర్గాన్ని కాపాడుకోలేమనే శంకవల్ల భయపడిన దేవతలు ఈయనను గుడ్డివాడిగా పుట్టించినట్లున్నారు.
(ధృతరాష్ట్రుడిని సమీపించి) తాతా! నమస్కరిస్తున్నాను ఘటోత్క… (మాటను సగంలో నిలిపి) ఊహూ! ఇది పద్ధతి కాదు. నా తండ్రులైన యుధిష్ఠిరాదులు తమకు నమస్కరిస్తున్నారు. ఆ పిమ్మట, ఘటోత్కచుడననే నేను నమస్కరిస్తున్నాను.
ధృతరాష్ట్రః:
ఏహ్యేహి పుత్ర!
న మే ప్రియం దుఃఖమిదం మమాపి
యద్ భ్రాతృనాశాద్ వ్యథితస్తవాత్మా ।
ఇత్థం చ తే నానుగతోఽయమర్థో
మత్పుత్రదోషాత్కృపణీకృతోఽస్మి ।। 36 ।।
ధృతరాష్ట్రుడు:
రా, రా, నాయనా!
ఇది నాకు ఇష్టం లేదు. నిన్ను దుఃఖింపజేస్తున్న నీ తమ్ముడి మరణం నాకూ దుఃఖాన్ని కలిగిస్తున్నది. నేను చెబుతున్నది నీకు అర్థం కాదు. నా పుత్రుల తప్పిదం కారణంగా నేను ఈ దుఃస్థితిలో ఉన్నాను.
తాతా! విను. ‘అయ్యో, తండ్రీ అభిమన్యూ! కురుకులప్రదీపమా! యదుకులపు అంకురమా! నీ తల్లిని, మేనమామను, నన్నూ వదిలి, తాతగారైన ఇంద్రుడిని చూడాలన్న కోరికతో స్వర్గానికి వెళ్ళావు’. తాతా! ఒక్క కొడుకు మరణించినందుకే అర్జునుడికి ఈ అవస్థ కలిగింది. మరి నీ పరిస్థితి ఎలా ఉండబోతున్నది? అందుచేత, పుత్రశోకజనితమైన అగ్ని మీ ప్రాణాలను హవిస్సులా కాల్చేయక ముందే — వెంటనే — నీ సైన్యాన్ని ఉపసంహరించుకో.
ఎలా మాట్లాడుతున్నాడు దుశ్శాసనుడు! అరే దుశ్శాసనా! చక్రాయుధుడు మీకు రాజు కాడా?
పూర్వం జరాసంధుడి కారణంగా గౌరవాన్ని, ఉన్నతిని కోల్పోయిన రాజులను చెరనుంచి విడిపించినవాడు, సకలరాజన్యసమక్షంలో భీష్ముడి చేతులనుండి అర్ఘ్యాన్ని అందుకున్నవాడు, అనురాగిణి, ఆజ్ఞానువర్తియైన లక్ష్మీదేవిని తన శ్రీవత్సము అనే శయ్యాగృహంలో ఉంచుకున్నవాడు, రాజులకు రాజూ అయిన చక్రాయుధుడు నీకు రాజు కాడా?
అవునవును. భగవంతుడు, ముల్లోకాల ఏలిక అయిన చక్రాయుధుడు ప్రభువే. ముఖ్యంగా మా ప్రభువు.
‘క్షత్రియుల వినాశనము పూర్తయ్యిందని తెలుసుకో. వందమంది రాజుల సంహారంతో భూమి తేలిక అవనున్నది. యుద్ధం ఆరంభమయ్యాక, పుత్రవధ కారణంగా ఉగ్రాస్త్రప్రయోగతత్పరుడైన అర్జునుడికి ఏదీ పెద్ద బరువు కాదు,’ అని చెప్పమన్నాడు.
మాట మాత్రాన ఈ భూమిని జయించగలిగితే, మాటలతో సర్వక్షత్రియసంహారమూ సంభవిస్తే…
ఘటోత్కచః:
రే! రే! శకునిరేష వ్యాహరతి । భోః శకునే!
అక్షాన్విముఞ్చ శకునే! కురు బాణయోగ్య-
మష్టాపదం సమరకర్మణి యుక్తరూపమ్ ।
న హాత్ర దారహరణం న చ రాజ్యతన్త్రం
ప్రాణాః పణోఽత్ర రతిరుగ్రబలైశ్చ బాణైః ।। 45 ।।
ఘటోత్కచుడు:
ఒరే! ఒరే! ఇదిగో, శకుని మాట్లాడుతున్నాడు. ఓ శకునీ!
శకునీ, పాచికలను వదిలిపెట్టు. జూదపు పలకను యుద్ధానికి అనుకూలంగా, బాణాలను ఎదుర్కొనేందుకు వీలుగా మార్చుకో. ఇక్కడ పరుల భార్యలను అపహరించడం లేదు, రాజ్యాలను కాజేసే ఉపాయమూ లేదు. ప్రాణాలను పణంగా పెట్టాలి ఇక్కడ. ఉగ్రమూ, శక్తిమంతమూ అయిన బాణాలే ఆనందకారకాలు!
నియమాలను అతిక్రమించి మాట్లాడుతున్నావు. నిందిస్తున్నావు. పొడవైన చేతులవాడివి, మాట్లాడడంలో ఏదీ లెక్క చేయడంలేదు. నీకు తల్లివైపునుంచి ఉగ్రస్వభావం సంక్రమించిందని మిడిసిపడుతున్నావేమో. మేమూ రౌద్రము గలవారమే. రాక్షసులవలె ఉగ్రస్వభావులమే.
న తు జతుగృహే సుప్తాన్ భ్రాతృన్ దహన్తి నిశాచరాః
శిరసి న తథా భ్రాతుః పత్నీం స్పృశన్తి నిశాచరాః ।
న చ సుతవధం సంఖ్యే కర్తుం స్మరన్తి నిశాచరాః
వికృతవపుషోఽప్యుగ్రాచారా ఘృణా న తు వర్జితా ।। 47 ।।
ఘటోత్కచుడు:
శాంతం పాపం! శాంతం పాపం! రాక్షసులకన్నా తమరే క్రూరులు. ఎందుకంటే,
లక్కయింటిలో నిద్రిస్తున్న అన్నదమ్ములను నిశాచరులు కాల్చనే కాల్చరు. వదిన తలను ఆవిధంగా తాకరు గాక తాకరు. యుద్ధంలో కొడుకును చంపాలన్న ఆలోచన కూడా రాదు వారికి. వికారశరీరులు, ఘోరవర్తనులూ అయినా కరుణను మాత్రం విడిచిపెట్టలేదు వారు.
దుర్యోధనః:
దూతః ఖలు భవాన్ ప్రాప్తో న త్వం యుద్ధార్థమాగతః ।
గృహీత్వా గచ్ఛ సన్దేశం న వయం దూతఘాతకాః ।। 48 ।।
దుర్యోధనుడు:
దూతగా వచ్చారు తమరు, యుద్ధానికని కాదు. మా ప్రతిసందేశాన్ని తీసుకొని వెళ్ళు. దూతలను చంపేవాళ్ళం కాము మేము.
ఘటోత్కచః:
(సరోషమ్) కిం దూత ఇతి మాం ప్రధర్షయసి । మా తావద్ భోః! న దూతోఽహమ్ ।
అలాగే, అలాగే. తాతగారు చెప్పినందున దూతనవుతున్నాను. అయినా నా కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను. నారాయణుడికి ఏమి మనవి చేయమన్నారు?
దుర్యోధనః:
ఆ కస్య విజ్ఞాప్యమ్ । మద్వచనాదేవం స వక్తవ్యః,
కిం వ్యర్థం బహు భాషసే న ఖలు తే పారుష్యసాధ్యా వయం
కోపాన్నార్హసి కించిదేవ వచనం యుద్ధం యదా దాస్యసి ।
నిర్యామ్యేష నిరన్తరం నృపశతచ్ఛత్రావలీభిర్వృత-
స్తిష్ఠ త్వం సహ పాణ్డవైః ప్రతివచో దాస్యామి తే సాయకైః ।। 51 ।।
దుర్యోధనుడు:
ఆహ్! ఎవరికి మనవి చేయడం? నా మాటగా ఇలా చెప్పు,
పలు మాటలేల? నీ నిష్ఠురానికి లొంగము మేము. నీవు యుద్ధానికి సిద్ధమైనప్పుడు — చిన్నదైనా సరే –ఆగ్రహపు మాట నీకు యుక్తం కాదు. నూరుగురు రాజుల ఛత్రపంక్తి నన్ను ఎల్లప్పుడూ పరివేష్టించి ఉండగా బయలుదేరి వస్తాను నేను. నీవు పాండవపక్షాన నిలిచి ఉండు. ఎడతెరపి లేని బాణాలతో నీకు సమాధానం చెబుతాను.
ధర్మం సమాచర కురు స్వజనవ్యపేక్షాం
యత్కాంక్షితం మనసి సర్వమిహానుతిష్ఠ ।
జాత్యోపదేశ ఇవ పాణ్డవరూపధారీ
సూర్యాంశుభిః సమముపైష్యతి వః కృతాన్తః ।। 52 ।।
ఘటోత్కచుడు:
ఓ రాజులారా! జనార్దనుడి తదుపరి సందేశాన్ని వినండి.
ధర్మాన్ని ఆచరించండి. స్వజనులపై ప్రేమాదరాలను చూపండి. మనసులోని కోరికలన్నింటినీ తీర్చుకోండి. మీ వంశానికి తగిన ఉపదేశాన్ని ఇచ్చేందుకు ఆ యముడే అర్జునరూపధారియై సూర్యుడి కిరణాలతోబాటు రాబోతున్నాడు.
(నిష్క్రాన్తః సర్వే ।)
(అందరూ నిష్క్రమిస్తారు)
దూతఘటోత్కచం నామోత్సృష్టికాఙ్కం సమాప్తమ్ ।।
‘దూతఘటోత్కచము’ అనే ఉత్సృష్ట్యంకము ముగిసింది.
భాసనాటకచక్రం
దూతఘటోత్కచం – సమూలానువాదం
ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.