మే 2026

Issue Index Image

తెలుగు భాష పూర్వకాలంలో రాజభోగాలను చవిచూసింది. “తెలుగొకండ” అన్న కృష్ణదేవరాయలు తనను తాను “కన్నడరాయ” అని అభివర్ణించుకున్నా తెలుగుకే పట్టం కట్టాడు. ఇది చాలామటుకు రాజకీయమైన నిర్ణయమే అయినా తెలుగుకి కలిసొచ్చింది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా దక్షిణాదిన తంజావూరు, మధుర నాయక రాజుల కాలంలో తెలుగు సాహిత్యం పొందిన వైభవం అనన్యసామాన్యం. చేమకూర వెంకటకవి, ముద్దుపళని వంటి వారు ఆ నేలమీదే అద్భుతమైన అక్షరసేద్యం చేశారు. నాదబ్రహ్మ త్యాగరాజు కృతులు విని, ఆ కృతుల్లోని భక్తికీ, భావానికీ, భాషలోని మాధుర్యానికీ పరవశించిన తమిళప్రజ ‘సుందర తెలుంగు’ అని కొనియాడారు. 20వ శతాబ్దం పూర్వార్ధం వరకూ తమిళనాట విద్యార్థులకు తెలుగు నేర్పే గురువులుండేవారని స్వామినాథ అయ్యర్ వంటి విశిష్ట పరిశోధకుల ఆత్మకథల ద్వారా మనకు తెలుస్తోంది.

చరిత్రలో తొలి అడుగు వేసేవారికి దక్కే కీర్తి వెనుక, ఎవరూ ఊహించని నష్టాలు, ఆటుపోట్లు కూడా దాగి ఉంటాయి. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన తెలుగు ప్రజల పరిస్థితీ అదే. నిజానికి ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలోనే తెలుగువారు పలు ప్రాంతాలను కోల్పోయారు. “బళ్ళారి నుండి బరంపురం దాకా” అన్న నినాదం కేవలం నినాదప్రాయమై మిగిలిపోయింది. అదృష్టాధ్వగమనం ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. విశాలాంధ్ర సృష్టి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చింది కానీ, సరిహద్దుల్లో తెలుగు మాతృభాషగా మాట్లాడే వారెందరినో తెలుగురాష్ట్రానికి పరాయివారిని చేసింది. దక్షిణ ఒడిశాలోని తెలుగు ప్రజకు ఆటపట్టుగా ఉన్న అప్పటి కొరాపుట్, గంజాం జిల్లాలు, ఇతరేతర ప్రాంతాలు ఒడిశాలోనే ఉండిపోయాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడివారిని “ప్రవాసాంధ్రులు” అనడం చారిత్రక అజ్ఞానమే అవుతుంది. అక్కడివారు వలస వెళ్ళినవారు కారు, తొలినుంచీ అక్కడివారే. ఆ మట్టిలోనే పుట్టి పెరిగిన అచ్చమైన తెలుగుబిడ్డలు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులుగారిది పర్లాకిమిడి. అది ఒడిశాలో భాగంగా ఉండిపోవడం వలననే ఆయన పక్కనే ఉన్న పాతపట్నంకి మారాల్సి వచ్చింది. ప్రసిద్ధ రచయిత త్రిపురగారిది ఋషికుల్యా నది ఒడ్డునున్న పురుషోత్తమపురం. మాజీ రాష్ట్రపతి వి.వి.గిరిగారిది బరంపురం. ప్రఖ్యాత కథకులు మంథా వెంకట రమణారావుగారిది రౌర్కెలా. ఈ ప్రాంతాలన్నీ తెలుగు సాహితీ వికాసానికి ఎంతో దోహదం చేశాయి.

అలాగే దక్షిణాదిన తమిళనాట నివాసముంటున్న తెలుగు కథకుల్లో అగ్రగణ్యులు స.వెం. రమేశ్‌గారు. కర్ణాటక సరిహద్దులైన బళ్ళారి, కోలార్, రాయచూరు, బెంగుళూరు ప్రాంతాలలో తెలుగు భాషా సాహిత్యాల ప్రాభవం నాటికీ నేటికీ సజీవమే. నాటక రంగాన్ని శాసించిన బళ్ళారి రాఘవ లాంటి మహామహులు అక్కడివారే. ఆధునిక కాలంలో హొసూరు, కోలార్ తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజల జీవన చిత్రాన్ని రికార్డు చేయడానికి, వారి కష్టసుఖాలను కథలుగా మలచడానికి ఎందరో స్థానిక కథకులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహారాష్ట్ర సరిహద్దులోని షోలాపూర్, గడ్చిరోలి, సిరోంచా ప్రాంతాల్లో తెలుగు నేటికీ మాతృభాషగా వర్ధిల్లుతోంది. అక్కడి దళిత, బహుజన జీవన పోరాటాలను అక్కడి రచయితలు అద్భుతమైన కథలుగా మలుస్తున్నారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్, దండకారణ్య ప్రాంతాల్లోని గిరిజన, ఆదివాసీల జీవితాలను, బహుళ సంస్కృతుల సంఘర్షణను స్థానిక తెలుగు రచయితలు తమ మాతృభాషలో సామాజిక స్పృహతో అక్షరీకరిస్తున్నారు. ఈ సరిహద్దుల వెలుపల ఉన్న తెలుగువారి అనుభవాలను, ఆచారవ్యవహారాలను భద్రపరచడానికి పూదోట శౌరీలు, స.వెం. రమేశ్ లాంటి వారు “మేరలకావల” పేరిట రెండు తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు రచయితల కథలతో తీసుకువచ్చిన సంకలనం గొప్ప కృషి. ఈ పుస్తకం రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల వెలుపల బతుకుతూ, భిన్న సంస్కృతుల మధ్య నలుగుతూనే, తమ మాతృభాషలో వాళ్లు సృష్టిస్తున్న అనన్యమైన సాహిత్యానికి అద్దం పట్టింది.

భౌగోళిక సరిహద్దులు రాజకీయ పటాలను నిర్దేశించగలవేమో కానీ, మాతృభాషతో ముడిపడిన భావోద్వేగాలను, సృజనాత్మకతను కట్టడి చేయలేవు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన రచయితలెంతమందో ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో నివాసమున్నవారు కారు. భౌతికంగా ఈ రచయితలు సరిహద్దులకు ఆవల ఉన్నా, వారి అక్షరాలు మాత్రం ఎప్పటికీ తెలుగు సాహిత్యపు నడిబొడ్డునే నిలిచి ఉంటాయి.