మేమంతా గడచిన రెండు మూడు గంటల అనుభవాలను తలచుకుంటూ, టీ తాగుతూ ఉండగానే వర్షపు ఉద్ధృతి బాగా పెరిగిపోయింది. ముందుకు సాగడమే తప్ప మరో మార్గం లేదన్న స్పష్టత మాలో ఏర్పడిపోయింది కదా, ఇహ వర్షం గురించి కలవరపడటమన్న ప్రస్తావన పెట్టుకోకుండా టీలు ముగించి నడక ఆరంభించాం. కాసేపట్లోనే మాకు మరో ఊహించని అడ్డంకి ఎదురయింది – కొండలమీదనుంచి మహా చురుగ్గా, బాగా వెడల్పుగా ఉరికి దిగుతోన్న జలపాతమే ఆ అడ్డంకి. ‘నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి?’ అన్న పద్యపాదం గుర్తొచ్చింది. ఆ జలపాతంగుండా నడుచుకుంటూ తడుచుకుంటూ ముందుకు సాగాం. సహజంగానే అంగుళం మినహాయింపు లేకుండా అందరం పూర్తిగా తడిసిపోయాం. అది దాటీ దాటగానే కాస్త దూరంలో మరో జలపాతం… “గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల ఫలితమిది,” అని వ్యాఖ్యానించాడు మా బాబు గురుంగ్. దూరాన ఎక్కడో దారపు పోగుల్లా, రిబ్బను ముక్కల్లా కనిపించిన జలపాతాలు దగ్గరకు వెళ్ళగానే దట్టమైన నీటి పరదాలను తలపిస్తూ, తమ అసలు రూపం చూపించసాగాయి.
అన్నపూర్ణ ట్రెక్ తర్వాత ఇన్నిన్ని జలపాతాలు చూడటం ఇదే మొదటిసారి. మళ్ళా అలా చూస్తాననుకోలేదు; చూడటమే కాదు – ఇక్కడి జలపాతాల సంఖ్యా, ఉద్ధృతుల ముందు అన్నపూర్ణ జలపాతాలు సరితూగవనిపించింది. ఒక్కోసారి ఒకచోట నిలబడి చూస్తే ఇరవై ముప్ఫై జలపాతాలు కనిపించాయి! మాకు తెలియకుండానే, ‘వాటి దిగువనుంచి నడచి వెళ్లడమన్నది ప్రమాదం,’ అనిపించడం మానేసి ఆ నడక ప్రమోద హేతువు కాసాగింది. పరిసరాల్లోని చక్కని సమశీతల వాతావరణం, మెల్లగా వీస్తోన్న పిల్లగాలులు మా జలపాతానందాలను పెంపు చేసాయి. అందరం చిన్నపిల్లలమైపోయాం.
ఆటలూ సరదాల సంగతి ఎలా ఉన్నా మేమంతా ఎంతో పదిలంగా కాపాడుకొంటోన్న బూట్లు మాత్రం సుబ్బరంగా తడిసిపోయాయి. అవి ఎంతో నాణ్యమైన వాటర్ ప్రూఫ్ బూట్లు అన్నమాట నిజమే. గోర్-టెక్స్ అన్న పదార్థపు పై పొర కలిగిన బూట్లు నీళ్ళను తమలోకి ఇంకనివ్వవు సరిగదా వాటిని వికర్షిస్తాయి. వాటితోపాటు మేమంతా ధరిస్తోన్న నిడుపాటి తొడుగులు – గెయ్‌టర్స్ (Gaiters), పిక్కల దాకా అంటి పట్టుకుని విస్తరించి పైనుంచి కూడా నీళ్ళు బూట్లలోకి చేరకుండా చూసుకుంటాయి. ఇవన్నీ మామూలు వర్షాలపుడు చక్కని ఫలితాలు ఇస్తాయేగానీ ఎడతెగకుండా కురిసే వానలకు బండలూ బూట్లూ అన్న తేడా ఉండదు. పాదరక్షలను ముంచేసి, పాదాల లోపలి దాకా చొరబడి, ‘చూడండి మా తడాఖా’ అని కవ్విస్తాయి.
బూట్లూ పాదాల సంగతి ఎలా ఉన్నా, మేమంతా నడుస్తోన్న కాలిబాటలు ఆ సమయంలో కురుస్తోన్న గట్టి వానల పుణ్యమా అని, చీలమండల దాకా ముంచెత్తే సెలయేళ్ళుగా రూపాంతరం చెందాయి. మీ పాదాలను కాపాడటం మావల్ల కాదని బూట్లన్నీ చేతులెత్తేసాయి. ‘పాదాలకు తడి సోకుతోంది,’ అన్న నాజూకు కలవరపాటుల్లో ఉన్న మాకు – ఆ తడి కాస్తా ముదిరి బూట్లనిండా నీళ్ళు నిండటంగా పరిణమించడమన్నది అనుకోని ఉపద్రవం. ఒక్కో బూటులోనూ లీటరు లీటరు నీళ్ళు నిండాయి. ఆ బూట్లు వేసుకుని అడుగులు వేయడం – అంత కష్టంలోనూ నవ్వు తెప్పించింది.
అలా పడుతూ లేస్తూ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ‘జగత్’ అన్న గ్రామం చేరుకున్నాం. ఆ ఊరి పురాతన రాతి ద్వారం మాకు సాదరస్వాగతం పలికింది. ‘మనస్లు కన్సర్వేటివ్ ఏరియా’లోకి ఆ ద్వారం ద్వారా అడుగు పెట్టామన్న మాట. ఊళ్ళో ఎన్నెన్నో టీ హౌస్‌లు కనిపించాయి. అది యాత్రికులు ఇష్టపడే గ్రామమని ఆ టీ హౌస్‌లు చాటుతున్నాయి. ఊరి చివర ఉన్న ‘న్యూ మంగోలియన్ టీ హౌస్’ అన్న చోట అందరం ఆగాం. ఆ టీ హౌస్ అతి సుందరమైన ప్రదేశంలో ఉంది. బుధీగండకి నదీతీరాన, ఎదురుగా కట్టని గోడలా నిలబడి ఉన్న గ్రానైట్ కొండచరియ… దాని మీదనుంచి జాలువారుతోన్న జలపాతాలు – మా అనితారాణి వాటిల్ని లెక్కపెట్టి ‘మొత్తం 27 కనిపిస్తున్నాయి,’ అని ప్రకటించింది. బహుశా మరుగుల మాటున దాగి, మా కళ్ళకు కనిపించని జలపాతాలు మరింకెన్నో ఉండి ఉండాలి. అంత చిన్న ప్రదేశంలో అన్నన్ని జలపాతాలు కూడుకుని ఉండటమన్నది నేను మొట్టమొదటిసారి గమనించాను.
బయట దృశ్యం బావుండటంతోపాటు టీ హౌస్ లోపల కూడా చక్కగా, వెచ్చగా, సుఖంగా అనిపించింది. అక్కడివాళ్ళు మాకు వెచ్చవెచ్చని అల్లం-నిమ్మరసం తేనీరు అందించారు. అందరం బూట్లు విప్పి నీళ్ళు ఓడ్చి ఆరబెట్టాం. మేజోళ్ళూ వానబట్టలూ విప్పి వాటిని కూడా ఆరబెట్టాం. ఈ ట్రిప్‌లో మా మొట్టమొదటి దాల్‌భాత్ భోజనం ఆరగించాం. ఎంతో రుచిగా ఉంది ఆ భోజనం.
ఆనాటి మా గమ్యం అయిన ఫిలిమ్ గ్రామం చేరడానికి ఇంకా మూడు నాలుగు గంటల నడక మిగిలే ఉంది. ఇంకా ఎంతో కొంత వెలుతురు కూడా మిగిలి ఉంది. అయినా మేము ఆగిన జగత్ గ్రామంలోని చెక్‌పోస్ట్ దగ్గరి పోలీసులు, “ముందుకు వెళ్ళకండి. ఈ వర్షాల్లో రాలిపడే రాళ్ళ తాకిడి తప్పకుండా ఉంటుంది. అలాంటివి ఏమన్నా జరిగి మీరు ఇబ్బందుల్లో పడితే వచ్చి మేము సాయం చేసే అవకాశం కూడా ఉండదు. ముందుకు సాగకండి,” అని హితవు పలికారు. వారి మాట విన్నాం. ఆ రాత్రికి ఆ న్యూ మంగోలియన్ టీ హౌస్‌లోనే ఉండిపోయాం.
ఆ టీ హౌస్‌లో మాకు చక్కని డిన్నరు లభించింది. అక్కడ ఇతర ఈసీబీ, ఏసీటీ టీ హౌస్‌లకు భిన్నంగా సువాసనలు విరజిల్లే పొడవు గింజ బాసుమతి బియ్యం వాడటం గమనించాం. కాసేపు అలసట తీర్చుకున్న తర్వాత సాయంత్రం ఏడింటికల్లా డిన్నరు ముగించాం. మర్నాటి వాతావరణ సూచికలు ఆశావహంగా కనిపించాయి. ఈరోజు వానలూ లాండ్‌స్లైడ్ల పుణ్యమా అని మూడు నాలుగు గంటలు వెనకబడిపోయి జగత్‌లోనే రాత్రి గడపవలసి వచ్చింది కాబట్టి మర్నాటి మా గమ్యాన్ని బిహి గ్రామంనుంచి కాస్తంత దగ్గరలో ఉన్న డెంగ్ గ్రామంగా సవరించాడు గురుంగ్. అయినా నడవవలసిన దూరం 21 కిలోమీటర్లు.
దూరాలూ కాలాల గురించి మరీ ఎక్కువగా ఆలోచించకూడదనీ, ఏరోజు నడక మీద ఆరోజు దృష్టి నిలిపి ముందుకు సాగాలనీ మా అందరిలోనూ ఒక నిశ్శబ్ద ఏకీభావం అప్పటికే ఏర్పడిపోయి ఉంది. ఆ స్పష్టతతో అందరం మాకు ఆ క్షణంలో అందుతోన్న నిద్రాసుఖాన్ని ఆస్వాదించడానికి మా గదుల్లోకి చేరాం.
మూడోరోజు ఉదయం కోడి కూత పుణ్యమా అని నాలుగున్నరకే మెలకువ వచ్చింది. సూర్యోదయ సమయంలో బయటకు అడుగు పెట్టినపుడు వర్షం వెలిసి కనిపించింది. గొప్ప ఉపశమనం. చీకూ చింతా లేకుండా ప్రభాత సమయపు హిమాలయాల ప్రశాంతసౌందర్యాన్ని ఆస్వాదించగలిగాను. దూరాన ఉన్న కొండచరియల మీద కనిపిస్తోన్న జలపాతాల దృశ్యం అధివాస్తవిక చిత్రంలా అనిపించింది. ఏదో ఆరుబయలు రంగస్థలంలోని బృహత్తరమైన గ్రానైట్ తెరమీద జాలువారే జలధారల వర్ణచిత్రంలా అనిపించింది. మేము బస చేసిన మంగోలియన్ టీ హౌస్ బుధీగండకి నది ఒడ్డున అతి చక్కని బిందువు దగ్గర నిలచి ఉంది. ఆ ప్రాంతంలోని రాతి పర్వతాలు చక్కని నేపథ్య దృశ్యాల్లా అమరి ఉన్నాయి. ఆ రాళ్ళూ బండల నడుమ కాస్తంత చదునైన ప్రదేశం… దాని అంచున మా టీ హౌస్… దిగువున బుధీగండకి ప్రవహించే అఖాతం… ఆ చదునైన ప్రదేశంలో కూరమడులు నిండిన కిచెన్ గార్డెన్, బాతుల గూళ్ళు, కోళ్ళ గంపలు – అంత చక్కని దృశ్యం చిత్రించిన చిత్రకారుడెవరూ? ‘ఏ కౌన్ చిత్రకార్ హై?’ అని శాంతారామ్ సినిమాలోని పాటలో అడిగినట్లు అడగాలనిపించింది.
అక్కడి కూరమడులు, కిచెన్ గార్డెన్‌ను చూసి ముచ్చటపడుతోన్న సమయంలో ఆ గార్డెన్ యజమాని కెప్టెన్ వీర్ బహాదూర్ గురుంగ్ కనిపించి పలకరించాడు. ఆ తోటను గత ఎనిమిదేళ్ళుగా పెంచి సంరక్షిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. తన టీ హౌస్‌లో ఉపయోగించే ఆర్గానిక్ కూరగాయలూ కోడిగుడ్లూ ఇక్కడ్నించే సరఫరా అవుతాయని చెప్పాడు. తనతోపాటు వాళ్ళబ్బాయి కూడా ఆ టీ హౌసూ, కిచెన్ గార్డెన్ వ్యవహారాల్లో పాలు పంచుకుంటున్నాడట. కూతురు దగ్గర్లో ఉన్న మరో గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగిని అట…
‘మీరు ఆర్మీలో పని చేసారా?’ అని అడిగాను. కాదట. ఒకప్పుడాయన అక్కడి ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్ అట. అదిగో, అలా ఆ ముద్ర తన పేరుకు జోడింపబడిందట! మేమంతా ఆ ప్రాంతంలోని సెరాంగ్ గొంపా వెళ్ళబోతున్నామని విని అభినందించాడు. “అక్కడికి యాత్రికులు ఎంతో అరుదుగా వెళుతూ ఉంటారు. అది మీకు బాగా నచ్చుతుంది,” అని వ్యాఖ్యానించాడు. “ఆ ప్రాంతాల్లో గడ్డి మేస్తూ హిమాలయన్ థార్‌లు కనిపిస్తాయి. వాటికోసం ఓ కన్ను వేసి ఉంచండి,” అని సూచించాడు. ఈ థార్‌లన్నవి ఉన్నత పర్వత సీమల్లో తిరుగాడే గొర్రెల్లాంటి జంతువులట…
కుతూహలాన్ని అరికట్టుకోలేక, ఈ ప్రదేశంలో ఈ ‘మంగోలియన్ టీ హౌస్’ అన్న పేరేమిటీ? అని అడిగాను. “ఈ ప్రాంతంలోని చాలామందికి ఉన్నట్లే నాకూ టిబెట్ మూలాలు ఉన్నాయి. టిబెట్‌కూ మంగోలియాకూ మతపరమైన, సాంస్కృతికపరమైన సారూప్యాలున్నాయి. అదిగో ఆ అనాది మూలాలకు చిహ్నంగా, వాటిని గౌరవిస్తూ మా టీ హౌస్‌కు ఆ పేరు పెట్టాను,” అని వివరించాడు. “దానితోపాటు ఆ విలక్షణమైన పేరు చూడగానే పర్యాటకులు ఆకర్షించబడతారు అన్న ఆశ కూడా లేకపోలేదు,” అని కూడా చెప్పుకొచ్చాడాయన.
అందరం బాగా పెందరాళే జగత్‌కు వీడ్కోలు చెప్పాం. వర్షం లేదుగానీ ఆకాశమంతా మేఘాలు… అక్కడి టీ హౌస్‌కూ, గ్రానైట్ కొండచరియకూ, జలపాతాలకూ ప్రేమగా బై బై చెప్పాం. కెప్టెన్ గురుంగ్‌కూ, అతని ఉద్యోగులకూ వీడ్కోలు చెప్పడం మరచిపోలేదు. అక్కడి ఆ రాత్రి గడపగలగడం నిజంగా మాకు సంతోషమనిపించింది. మా ముందటి ప్లాను ప్రకారం జగత్ దాటుకుని ఫిలిమ్ దాకా సాగిపోగలిగి ఉంటే ఇక్కడి చక్కని అనుభవాన్ని కోల్పోయి ఉండేవాళ్ళం. వాతావరణ ప్రకోపాలు ఒకోసారి మనకు మంచే చేస్తాయన్నమాట. ఆశించని ఆనందాలకు కారకమవుతాయన్నమాట.
జగత్ దాటిన తర్వాత వచ్చిన కాలిబాట ఇరుకైనది. మనుషులూ కంచరగాడిదలూ నడవడానికి మాత్రమే సరిపడినది. జగత్ విడిచిపెట్టిన కాసేపటికే బుధీగండకి గండి – కాన్యన్ – ప్రాంతంలోకి ప్రవేశించాం. ఎక్కడో దిగువన రాళ్ళమీద గలగల ప్రవహిస్తోన్న నది చేసే శబ్దం మా నడకకు అతి చక్కని నేపథ్య సంగీతంలా అమరగా, అలసట అన్నది లేకుండా నింపాదిగా సాగిపోయాం. మరి కాసేపటికి జగత్ ఖోలా అన్న సెలయేరు మీద ఉన్న ఉయ్యాల వంతెన దాటాం. ఆ సెలయేరు ఆ చోట అక్కడి సన్నని రాతి గండిలో మహోద్ధృతంగా పారి దగ్గర్లోనే ఉన్న బుధీగండకి నదిలో కలుస్తోంది. అక్కణ్ణించి మా కాలిబాట బుధీగండకి దిగువ ప్రాంతానికి చెందిన కాన్యన్ గోడలను అంటిపెట్టుకుని సాగింది. అక్కడి కొండచరియలన్నీ పచ్చగడ్డితోనూ, ఇతర మొక్కలతోనూ మిసమిసలాడుతూ కనిపించాయి.
దారిలో గడ్డి మేస్తోన్న గొర్రెల మంద కనిపించింది. వాటి కాపరి హాయిగా ఓ రాతిబండ మీద పవళించి కనిపించాడు. ప్రకృతి సౌందర్యం పరిపూర్ణ రూపంలో వెలిగిపోతోన్న ఆ నిర్జన ప్రాంతంలో, ప్రశాంతంగా ఏకాంత సౌఖ్యాన్ని అనుభవిస్తున్న ఆ గొర్రెల కాపరిని చూసి కాస్తంత అసూయ కలిగింది. అతనిది ఎంతో విలాసవంతమైన వృత్తి అనిపించింది. మనబోటి వాళ్ళమేమో దేశాలూ ఖండాలూ నదులూ సముద్రాలూ దాటుకుని ఎక్కడెక్కణ్నుంచో ఈ ప్రశాంత పర్వత సీమలో ఏకాంత సౌందర్య సాధన కోసం వస్తాం – ఇతగాడు ఏ ప్రయాసా లేకుండా ఎంతో సహజంగా తన పని తాను చేసుకుంటూ ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు – మరి అసూయ పుట్టదూ?! నిజమే… నేను అతగాడి సౌభాగ్యం గురించి మరీ ఊహాలోకపు సదాలోచనలు చేస్తున్న మాట నిజమే. ఆచరణ సాధ్యం కాని ఆలోచనలు చేస్తున్న మాటా నిజమే. కానీ అక్కడ అలా బండ మీద చేరబడిన గొర్రెల కాపరి చిత్రం ఆచరణ సాధ్యాసాధ్యాలకన్నా, మనలోని గుప్తకాంక్షలూ కోరికలకు ప్రాణం పొయ్యడం లేదూ?!
జగత్‌కూ ఫిలిమ్‌కూ నడుమ బిందువు దగ్గర మాకు మొట్టమొదటిసారిగా మంచు నిండిన వెండి కొండ దర్శనమిచ్చింది. సూర్యకాంతితో ధగధగ మెరుస్తోన్న ఆ గిరి శిఖరం పరిసరాల్లోని ఇతర శిఖరాలకన్నా ఎగువన నిలచి, మకుటంలో మణిలా వెలిగిపోతూ అబ్బురం కలిగించింది. 7,165 మీటర్ల ఎత్తున్న ఆ శిఖరం పేరు మౌంట్ సిరింగి హిమల్ అట. అప్పటిదాకా దిగువ హిమాలయాల్లో అడవులు, సెలయేళ్ళు, నదులు, కొండచరియల మధ్య గత రెండు రోజులుగా తిరుగాడుతూ వస్తున్నాం. ఇపుడు దూరాన నిలచిన ఆ వెండికొండ, దానికీ మాకూ ఉన్న మధ్యభాగంలో చెట్టూ చేమా లేని నల్లని కొండలు, మాకు చేరువలో మళ్ళీ అడవులతో కూడిన పచ్చల కొండలు, వాటిగుండా సాగిపోతోన్న నదీ ప్రవాహం – అసలు సిసలు హిమాలయ దృశ్యమది. అలా దూరాన ఉన్న హిమశిఖరాన్ని చూడగానే నా మనసు ఉత్తేజంతో నిండిపోయింది. ఎవరెస్ట్ ట్రెక్‌లోనూ అన్నపూర్ణ ట్రెక్‌లోనూ నాకు చిరపరిచితమై రోజుల తరబడి నాతో వచ్చిన ధవళశిఖరసీమతో నా పరిచయాన్నీ స్నేహాన్నీ పునరుద్ధరించుకున్నట్లు అనిపించింది.
ఫిలిమ్ గ్రామంవరకూ మేము నడిచిన పది కిలోమీటర్ల రాతిబాట ఆరోహణ అవరోహణలమయంగా సాగింది. కొన్ని కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంవల్ల దారి తన రూపు కోల్పోయి కనిపించింది. వాటిని దాటడం కష్టమయింది. అయితే అప్పటికే మేమంతా అలాంటి ప్రదేశాలను దాటడంలో అనుభవం గడించాం కాబట్టి మా పురోగమనానికి అవి అడ్డంకులుగా నిలవలేకపోయాయి.
మా గిరీశ్ దారిలో కనిపించిన ఒక వృక్షాన్ని సిచువన్ పెప్పర్ ట్రీగా గుర్తించగలిగాడు. ఆ ధాతువును చైనావారి వంటకాల్లో విరివిగా వాడతారట. నోటిలోకి వెళ్ళినపుడు గిలిగింతలు పెట్టి తిమ్మిరెక్కించే ధాతువది. పేరులో మిరియం అన్న పదముందే కానీ, అది పెప్పర్ జాతికి చెందినది కాదనీ, మాకు కనిపిస్తోన్న ఆ చెట్టునుంచి వచ్చే నిమ్మజాతి పండు తొక్కులని ఎండబెట్టగా వచ్చే ధాతువు అనీ వివరించాడు గిరీశ్.
దారిలో ఒక పొడవాటి ఉయ్యాల వంతెనను దాటి నిడుపాటి మెట్ల వరుసను అధిరోహించాక చిట్టచివరికి ఫిలిమ్ గ్రామం చేరుకున్నాం. చెప్పుకోదగ్గ పెద్ద ఊరది. ఊళ్ళో పూర్వకాలపు రాతి ఇళ్ళూ, ఇటుకలతో ఆధునికశైలిలో నిర్మించిన ఇళ్ళూ కలగలసి ఉన్నాయి. ఆ ఇళ్ళన్నీ కొట్టొచ్చే రంగులతో నిండి ఉన్నాయి. ఊళ్ళో నడుస్తున్నప్పుడు జొన్న, క్యాబేజ్, కాలీఫ్లవర్, బంగాళాదుంపల మళ్ళు కనిపించాయి. ఫిలిమ్ గ్రామంలో మా నీళ్ళ సీసాలు నింపుకుని ముందుకు సాగాం. మరో గంటలో ఛిసోపని అన్న అందమైన గ్రామం పలకరించింది. రాళ్ళు పరిచిన సన్నని బాటకు అటూ ఇటూ పూర్వకాలపు రాతి ఇళ్ళు కనిపించాయి. ఒకచోట సింక్‌హోల్‌లోకి ప్రవహిస్తోన్న చిన్న సెలయేరు కనిపించింది. ఊళ్ళోవాళ్ళు ఇళ్ళలో వాడుకోడానికి అక్కణ్ణించి నీళ్ళు పట్టుకు వెళుతున్నారు.
ఆ ఊళ్లోని టీ హౌస్‌లో రుచికరమైన దాల్‌భాత్ భోజనం చేసి ముందుకు సాగాం. ఆనాటి మా గమ్యమైన డెంగ్ గ్రామం, ఇంకా 11 కిలోమీటర్ల దూరాన ఉందని తెలిసింది. అంటే సగం దూరం వచ్చేశామన్నమాట. సగమే కదా మిగిలిందీ అనుకున్నామేగానీ ఆ మిగిలిన సగం కొన్ని కొన్ని చోట్ల ఎంత కష్టభూయిష్టమో నడుస్తున్నపుడు తెలిసింది. కష్టమే కాదు ప్రమాదకరం కూడానూ… లాండ్‌స్లైడ్ల వల్ల ప్రమాదకరంగా మారిన చోట్ల మా గైడ్లు నిలబడి, మెల్లగా మమ్మల్ని కాస్తంత చుట్టు తోవల్లోకి మళ్ళించి, ఒడ్డుకు చేర్చారు.
ఫిలిమ్ గ్రామం దాటాక బుధీగండకి నది లోతైన గండిలో ప్రవహించడం గమనించాం. అడపాదడపా ప్రవాహం పైన్ చెట్ల మధ్యనుంచి దిగువకు దుముకుతూ సాగుతోంది. వాతావరణం నిర్మలంగా, ఆహ్లాదకరంగా ఉండటం వల్ల దారి కఠినంగా ఉన్నా పరిసర సౌందర్యాన్ని మనసులో నింపుకోగలిగాం.
పోనుపోనూ దారి మరింత కఠినంగా మారసాగింది. కొండ చరియల్ని అంటిపెట్టుకుని సాగింది. ఒకచోట అసలు దారి అంటూ లేకుండా పోయింది. ఎదురుగా దాటలేని అగడ్త… దాన్ని దాటడానికి కొయ్య దుంగలు వేసి ఉన్నాయి. వాటిలో ఒకటి విరిగిపోయి ఉంది… ఎంతో జాగ్రత్తగా, కొండ చరియ అంచులను పట్టుకుని, గైడ్ల సహాయంతో ఆ అగడ్తను దాటాం. తిరిగి ఆలోచిస్తే అది ఎంతో ప్రమాదకరమైన విన్యాసం అని బోధపడింది. కానీ మా దృష్టి అంతా దాటడం మీదే కేంద్రీకరించాం కాబట్టి ప్రమాదం అన్న మాట మా మనసుకు తోచలేదు. బాబూ గురుంగ్ సాన్నిధ్యం, ఆపన్నహస్తం మా అందరికీ నిరంతరం అందుతోన్న గొప్ప విశ్వాస గుళిక. తలచుకొంటోంటే ఎప్పటిదో ఒక మానేజ్‌మెంట్ పోస్టర్ గుర్తొచ్చింది: బంబుల్ బీ అనే ఒళ్ళు ఎక్కువా రెక్కలు తక్కువా ఉండే కీటకానికి ఎయిరో డైనమిక్స్ తెలియవట. తాను ఆ శాస్త్రం ప్రకారం ఎగరనే ఎగరకూడదని తెలియదట… ఆ తెలియనితనమే తనను జీవిత పర్యంతం తనదైన బాణీలో ఎగిరేలా చేస్తుందట!!
ఆలోచనలూ, తెలియని సాహసాల మధ్య సమయం చకచకా గడచిపోయింది. అసలు మాకు సమయపు స్పృహే లేకుండా పోయింది. హఠాత్తుగా మా ముందు చక్కని జలపాతమొకటి నిలచి కనిపించింది. ఏ హడావుడీ లేని ఆ నింపాది జలధారలు మమ్మల్ని ఆకట్టుకుని నిలువరించాయి. ఎంతో ఎగువనుంచి జాలువారుతోన్న జలపాతమది. నడుమన తటస్థపడే రాతిబండలవల్ల నీటి తుంపరలు ఏర్పడి, ఆ ప్రదేశమంతటా అలుముకుని ఉన్నాయి. ఆ తుంపరల మధ్యనుంచి లయబద్ధంగా నాట్యమాడే జలకన్యలా దిగుతోందా జలపాతం. ఆ ప్రక్రియలో తనకు తాను ప్రాణం పోసుకోవడమే కాదు – అక్కడి ప్రశాంత పరిసరాలన్నిటినీ జీవశక్తితో నింపి వదులుతోందా జలపాతం. అపురూపమైన, అరుదైన దృశ్యమది.
మేమంతా పరవశించి చూసాం. ఈ జలపాతానికి పేరు ఏమైనా ఉందా? అని బాబును అడిగాను. తెలియదన్నాడు. దారి పొడవునా ఎన్నెన్నో జలపాతాలున్నాయిగదా – అన్నిటికీ పేరు పెట్టడం కష్టం అనీ అన్నాడు. ఏదేమైనా కొన్ని కొన్ని అందాలు అనామకంగా ఉంటేనే బావుంటుంది. ఒకసారి పేరు పెట్టి ప్రచారం జరిగాక ఆ కీర్తికిరీటాల బరువు కింద ఎంతటి జలపాతాలైనా నీరసించి పోయే ప్రమాదం ఉంటుంది. అంచేత ఈ జలపాతానికి ‘జలనాట్యసుందరి’ అన్న పేరు పెడితే బావుంటుందన్న ఊహ కలిగినా దాన్ని వ్యక్తపరచకుండా ఊరకుండిపోయాను. ఆ ఆశించని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అందరం కొద్దిసేపు సేదదీరాం. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ నడక కొనసాగించాం.
మాలో గిరీశ్, శ్రీనివాస్, అనిల్ మహా నడకరాయుళ్ళు. వాళ్ళు ముగ్గురూ అందరికన్నా ఎంతో ముందుగా సాగిపోయారు. మిగిలిన ఏడుగురం ఒక జట్టుగా కూడుకుని మాదైన బాణీలో, మాదైన వేగంతో నడక సాగించాం. చీకటి పడేలోగా గమ్యం చేరుకోవాలి అన్నది మాకున్న ఒకే ఒక లక్ష్యం. అలా అనుకున్నామేగానీ ఆ గమ్యం ఇంకా మూడు కిలోమీటర్లు ఉందనగానే చీకటి పడనే పడింది. హెడ్ లైట్లు వెలిగించి ముందుకు సాగాం. లెక్కవేసి చూసుకుంటే మా బాణీ నడకలో కిలోమీటరు దూరానికి నలభై నిముషాలు తీసుకున్నామని తేలింది.
అదృష్టవశాత్తూ ఆ రోజు అంతగా వర్షం పడలేదు. అయినా అక్కడంతా బురదబురదగా, జారుడుజారుడుగా ఉంది. అక్కడక్కడ నీళ్ళ మడుగులు… వాటిలోంచి జాలువారుతోన్న చిరు జలపాతాలు… ఆ చీకట్లో ఎంతో జాగ్రత్తగా నడవవలసి వచ్చింది. దూరాన మిణుకుమిణుకుమంటూ దీపాలు కనిపించాయి. ‘అదిగో డెంగ్…’ అంటూ మనసు గీతాలాపన ఆరంభించింది. కానీ క్షణాల్లో మాది తొందరపడి ముందే కూసిన కోయిల బాణీ అని అర్థమయింది. ఆ ఎగుడుదిగుడు బాటలో మెలమెల్లగా సాగి డెంగ్ చేరుకునేసరికి మరో గంట పట్టింది. మరి కొద్దిసేపట్లో మా టీ హౌస్ చేరుకున్నాం. ఆ రోజు అక్కడక్కడ ఆగటాలూ, లంచ్ బ్రేకూ కలుపుకుని మొత్తం పన్నెండు పదమూడు గంటలు కాలిబాటలో గడిపామన్నమాట… నా వరకూ నాకు ఏదైనా ట్రెకింగ్‌లో అంతసేపు, అన్ని సవాళ్ళతో కూడిన బాటలో గడపడం అదే మొదటిసారి.
టీ హౌస్‌లో లభించిన గోరువెచ్చని నీళ్ళతో గబగబా స్నానించాను. అదో గొప్ప ఉపశమనం. రోజంతా కష్టించి నడిచాక వెచ్చని నీటితో చక్కని స్నానమంటే అది స్వర్గసౌఖ్యమే కదా! వెంటనే అందరం భోజనానికి కూర్చున్నాం. పచ్చళ్ళూ తినుబండారాల సాయంతో చక్కని భోజనం చేసాం. మేమంతా తీసుకువచ్చిన పచ్చళ్ళను ఒక పద్ధతి ప్రకారం అమర్చి రవాణా చేసి, సరైన సమయంలో ఆ పచ్చళ్ళు మా ప్లేట్లలోకి వచ్చేలా చూస్తోన్న మా ఫుడ్ ఇన్‌ఛార్జ్ సందీప్‌కు మనసారా దీవెనలందించాం. ఏ ట్రెక్‌లో ఏ రోజైనా డిన్నర్ సమయం మనోహరంగా ఉంటుంది. రోజంతా పడ్డ శ్రమను మర్చిపోయి అందరం కులాసాగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే సమయమది. ట్రెకింగ్ మొదటి రెండు రోజులూ తమ తమ సవాళ్ళు విసిరాయి – తట్టుకుని నిలబడ్డాం. రాబోయే రోజుల్లో ఎదుర్కొనబోయే సవాళ్ళకు ఆ మొదటి రెండు రోజులూ సరైన నమూనాలు. ఆ సవాళ్ళకు నిలబడి సాగిపోగలమన్న విశ్వాసం మాలో కలగడానికి కూడా అవే రెండు రోజులు మూలకారకాలు…
మా మర్నాటి గమ్యం సెరాంగ్ గొంపా. మొదట అనుకొన్నది రెండవ రోజు నాటికి బిహి గ్రామం చేరుకుని మూడవ రోజున నింపాదిగా అక్కడికి బాగా దగ్గర్లో ఉన్న సెరాంగ్ చేరాలని. కానీ మొదటి రెండు రోజుల్లో ఎదుర్కొన్న అవరోధాలు మమ్మల్ని రెండవ రోజు ముగిసేసరికి డెంగ్ వరకే చేరనిచ్చాయి. అంటే, స్థూలంగా ఇంకా మూడు గంటలు వెనకబడి ఉన్నామన్నమాట.
మా మూడవరోజు నడకను బాగా ఉదయాన్నే మొదలెట్టాం.
1860 మీటర్ల ఎత్తున ఉన్న డెంగ్ గ్రామంనుంచి ముందు బస చేద్దామనుకొని చేయలేకపోయిన బిహి గ్రామం మీదుగా మొత్తం 17 కిలోమీటర్లు నడిచి సాయంత్రానికల్లా 3100 మీటర్ల ఎత్తున ఉన్న సెరాంగ్ గొంపా చేరాలన్నది ఆనాటి మా ప్రణాళిక. అంటే మరో 12, 13 గంటల నడక మాకోసం ఎదురుచూస్తోందన్నమాట.
డెంగ్ గ్రామం వదలగానే చిక్కని వెదురుపొదలు ఉన్న కొండవాలుల మీదుగా మా నడక సాగింది. హిమాలయాలలో అంత మేర అంత చిక్కని వెదురు అడవి కనిపించడం అరుదైన విషయం. ఆ వెదురు పొదలను దాటి ఓ ఎత్తైన ప్రదేశం చేరాక అక్కణ్ణించి కాస్తంత దూరంలో బిహి గ్రామం కనిపించింది. చూడచక్కని గ్రామమది. రంగురంగుల ఇళ్లు… అందమైన లోయ… సారవంతమైన లోయ – బక్‌వీట్, ఆవ, జొన్న చేలు…
బిహి పొలిమేరల్లో కనిపించిన టీ హౌస్‌లో ఆగి అంతా వేడి వేడి తేనీరు తాగాం. అది ముగిసాక బిహి గ్రామంలో అడుగుపెట్టాం. అంతా కలసి డెంగ్‌నుంచి బిహి చేరడానికి మూడు గంటలు పట్టింది. బిహి, సెరాంగ్‌ల మధ్య గ్రామాలు లేవు గాబట్టి బిహిలోనే అందరం భోజనాలు కట్టించుకున్నాం – చక్కని భోజనమే దొరికింది… ఆమ్లెట్-చపాతీ, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, ఏపిళ్ళు. పోర్టర్ల ద్వారా బాబు ముందే కబురు పంపాడట – మేము వెళ్ళీ వెళ్ళగానే లంచ్ పాకెట్లు అందాయి.
వెదురు పొదల అడవినుంచి బిహి గ్రామం వేపు దిగుతున్నపుడు నా కుడి కాలి దిగువ కండరం పట్టేసింది. బాగా నొప్పి. అది కండరం పట్టేయడమేనా ఇంకా ఏమన్నా పెద్ద సమస్యా అన్న అనుమానం వచ్చింది. అది పెద్ద సమస్య అయిన పక్షంలో నా ఈ ట్రెక్ కార్యక్రమానికి గండి పడుతుందని నా ఆందోళన. మనసంతా ఏవేవో ఆలోచనలు – బుర్ర వేడెక్కిపోయింది. అయినా ఆ ఆందోళనను అరికట్టి శాంతంగా ఉండే ప్రయత్నం చేసాను. మాలో ఉన్న రమేశ్ ఎంతో నైపుణ్యమున్న ఎమర్జెన్సీ వైద్యుడు. అతనితో పరీక్ష చేయించుకున్నాను. ‘మరేం పరవాలేదు. ఇది మామూలు నొప్పి,’ అన్నాడు. కాలు బాగా చాపమన్నాడు. సుతారంగా నొక్కుతూ తానే కాలు సాగదీసాడు. అంతే – ఏదో మంత్రం వేసినట్టు నొప్పి తగ్గిపోయింది. నొప్పితోబాటు దిగులూ తొలగిపోయింది. అయినా కొన్ని పెయిన్ కిల్లర్లు మింగాను. మొత్తానికి నొప్పి బాగా సర్దుకుంది. టీ తాగాను. తాజాగా, శక్తి తిరిగొచ్చినట్టుగా అనిపించింది. అలా ఆ ఘట్టం ముగిసాక అందరం సెరాంగ్ గొంపా కేసి సాగిపోయాం.
మెల్లగా బిహి గ్రామం ఉన్న లోయలోంచి పైకి ఎక్కాం. ఒక అగడ్తను చేరుకున్నాం. హఠాత్తుగా మూడు నాలుగు వందల మీటర్లు నిడివిగల రెండు జలపాతాలు నదికి కుడి ఎడమలనుంచి ఒకే ప్రదేశంలో జాలువారి నదిలో కలుస్తున్నాయి. ఆ నది వెళ్ళి బుధీగండకి నదిలో కలుస్తుందని చెప్పాడు బాబు గురుంగ్.
అక్కడ ఉన్న రెండు ఉయ్యాల వంతెనలూ కలిసే చోట ఒక చక్కని ప్రదేశం ఎంపిక చేసి మా బాబు గురుంగ్ అందరినీ అక్కడికి చేర్చాడు. అక్కడినించి అటు ఎగువనుంచి జాలువారుతోన్న జలపాతాలూ ఇటు దిగువనుండి పలకరిస్తోన్న అఖాతం, అందులో పారుతోన్న నదీ చక్కగా కనిపించాయి.
భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న ఉయ్యాల వంతెన వైర్లను కలపి ఉంచుతోన్న ప్లాట్‌ఫార్మ్ మీద “కాదురీ ఎగ్రికల్చరల్ ఎయిడ్ అసోసియేషన్, (KAAA) బ్రిటిష్ గోర్ఖాస్, నేపాల్ వారి విరాళం” అని రాసి ఉన్న ఫలకం ఒకటి నా దృష్టిని ఆకర్షించింది. అలాంటి ఫలకాలే అంతకు ముందు ఆ ప్రాంతంలోని ఎన్నో వంతెనల మీద కనిపించాయి. వివరాల్లోకి వెళ్ళాను. KAAA అన్నది 1960 ల తుది సంవత్సరాలలో హొరేస్ కాదురీ అన్న హాంగ్‌కాంగ్‌కు చెందిన, సేవాభావమున్న పారిశ్రామికవేత్త నెలకొల్పిన స్వచ్ఛంద సేవాసంస్థ అని తెలిసింది. బ్రిటిష్ ఆర్మీకి సేవలు అందించి స్వదేశం తిరిగి వచ్చే గూర్ఖా యోధులకు సహాయమందించడానికి ఏర్పడిన సంస్థ అది. క్రమక్రమంగా తన కార్యక్రమాలను విస్తరించి ఆయా యోధులు తిరిగి వచ్చి స్థిరపడిన ప్రాంతాలలో స్వయం ఉపాధి పథకాల రూపకల్పన, నిర్వహణ, అక్కడ మౌలిక సదుపాయాలు నెలకొల్పడం అన్న కార్యక్రమాలు కూడా ఆ సంస్థ చేపట్టిందట. మేము నడచిన దారిలోని వంతెనలన్నీ చక్కని కండిషన్లో ఉండటం నేను అప్పటికే గమనించాను – బహుశా KAAA వారి చేయూత అందుకు ముఖ్యకారణం అయి ఉండాలి. గూర్ఖా యోధుల వృత్తి నైపుణ్యాలు, నిబద్ధత, సాహస ప్రవృత్తి జగద్విదితం. ఇండియా, బ్రిటన్, సింగపూర్‌లాంటి దేశాలలో వారు అందించిన సేవలు ప్రఖ్యాతి చెందినవి. KAAA లాంటి సంస్థలు నేపాల్ లోని మారుమూల ప్రదేశాలలో ఇలాంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి స్థానిక జనజీవనాన్ని మెరుగుపరచడం, ఆ గూర్ఖా యోధులకు ప్రపంచం అర్పిస్తోన్న నివాళికి తార్కాణం అనడంలో అతిశయోక్తి లేదు.
భోజనాలు ముగించాక మళ్ళా మా నిడుపాటి కొండదారిలో అందరం ముందుకు సాగాం. అంతకు ముందు దూరంనుంచి ఎంతో ఎత్తున్నట్టు కనిపించిన ఒక జలపాతం, మేము దగ్గరకు చేరేసరికి మా దిగువన కనిపించి కాస్తంత సంబరం కలిగించింది. జలపాతానికన్నా ఎగువకు వెళ్ళి ఆ జలపాతం మనకన్నా దిగువన ఉండటం చూసినపుడు ఎంత వద్దనుకున్నా చిన్న పిల్లల్లా సంబరపడటం సహజమనుకుంటాను. సంబరాల సంగతి ఎలా ఉన్నా, అమాయకంగా కనిపించే మా కాలిబాట నిర్దాక్షిణ్యంగా ఎగువెగువకు సాగుతూ పోయింది. మా మానసిక శారీరక శక్తులను పరీక్షించడమే తన ధ్యేయం అన్నట్టుగా సాగిపోయింది. ఒకోసారి వంతెనలు దాటడానికి కాస్తంత కిందకు దిగేవాళ్ళం. ‘హమ్మయ్య’ అనుకొనేలోగానే మళ్ళా ఎగువకు ఎక్కడం… అయినా ఏమాటకామాట – అక్కడి దృశ్యాలు ఎంత చూసినా తనివి తీరనివి. వాటికోసం ఎంత శ్రమైనా పడవచ్చు.
శ్రమా, కష్టాలను పట్టించుకోకుండా మా ఎగుడు నడక కొనసాగించాం. వందలాది మెట్లు… సెరాంగ్ గొంపాకు చేర్చే మెట్లు… పరిస్థితిని గమనించి మా మోహన్, మాకు సలహాదారుడు-శిక్షకుడిగా మారాడు. అతని సలహాను పాటించి తడవకు 20-30 మెట్లు ఎక్కడం, ఎక్కి పదీ పదిహేను సెకండ్లు ఆగి గుండెల నిండుగా ఊపిరి నింపుకోవడం, మళ్ళా ఎక్కడం – అలా ఒక లయ ప్రకారం ఆరోహణ కొనసాగించాం. అనంతంలా అనిపించే దారిలో శ్రమ మర్చిపోడానికి మేమంతా గతంలో కలసి చేసిన ట్రెక్‌ల కబుర్లు చెప్పుకున్నాం.
సాయంత్రం అయ్యేసరికి మేము చేసిన ఒక పెద్ద పొరపాటు బయటపడింది… దారిలో ఊళ్ళు లేవు గాబట్టి జాగ్రత్తపడి పాక్డ్ లంచ్ తెచ్చుకున్నామేగానీ మంచి నీళ్ళ సంగతి సరిగా ఆలోచించలేదు. అవి అయిపోయేసరికి, ‘ఎంత పెద్ద పొరపాటూ,’ అనిపించింది. ఎవరో దారిలో ఓ చిన్న టీ హౌస్ ఉందని చెప్పారు. సరే అనుకున్నాం… ఆ మాట నిజమేగానీ ఆ టీ హౌస్ ఆ రోజు మూసేసి ఉంది. భోజనం తర్వాత ఎండా, ఎగుడు దారుల పుణ్యమా అని మేం తెచ్చుకున్న నీళ్ళన్నీ సాయంత్రం అయ్యేసరికి ఖాళీ అయిపోయాయి. దిగువన అఖాతాల్లో నీళ్ళు గలగల పారుతున్నాయిగానీ ‘ఎటు చూసినా నీళ్ళు, కానీ తాగడానికి గ్రుక్కెడు దొరకవు’ అంటూ సాగర నావికులు వాపోయేలాంటి సందర్భమది: అదృష్టవశాత్తూ పరిస్థితి విషమించక ముందే ఒక కొండవాగు కనిపించి మా దాహం తీర్చింది. ‘హమ్మయ్య,’ అనుకున్నాం.
మరో పెద్ద వంతెన దాటాక కళ్ళు చెదిరే లోతైన అఖాతం మా ముందు నిలచింది. దిగువనుంచి రాళ్ళమీద నీళ్ళు చేసే శబ్దం వినిపిస్తుందే కానీ జాగ్రత్తగా చూస్తే తప్ప కనిపించనంత దిగువన ఉందా నది! ఉన్నట్టుండి ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది! ఈ కనిపించని నదీజలాలే కదా గంగానదీ పరీవాహక ప్రదేశాల్లోని కోట్లాదిమంది జనుల దాహమూ ఆకలీ తీరుస్తున్నదీ? ఇవే గదా వేలాది సంవత్సరాలుగా మనుషులను తన దగ్గరకు చేర్చుకుని నాగరికతలకు బీజాలు వేసింది? ఇక్కడి ఈ నీళ్ళన్నీ వెళ్ళి కలిసేది అసలు నీళ్ళకే పర్యాయపదమైన గంగానదిలోనే కదా…
అవును. నదుల పుట్టుక, ‘పెరుగుదల’, తాము సాగినంతమేర ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చెయ్యడం, అడపాదడపా వరదల్లో ముంచెత్తడం – ఆ ప్రక్రియ అంతా గుర్తొచ్చింది.
నదులంటేనే సహజ ప్రవాహాలు. వాటిలోని సహజత్వం నాకు మొదటినుంచీ ప్రశాంత హేతువు. కొండలు, ఎడారులు, మహా సముద్రాలతో సహా – అవన్నీ అచల భౌగోళిక విశేషాలు. నదులంటే సహజ చలనశీలత. మనిషి పుట్టక ముందునుంచీ, సాగిపోవడమే తమ నిరంతర వ్యాపకంగా మనుగడ సాగిస్తోన్న గొప్ప చలనశీలురు నదులు. వాటిది నిరంతర యాత్ర. అలుపెరుగని యాత్ర. మన శరీరంలోని ధమనులలాగా అవి భూమాతను సాగరంతో అనుసంధించే వాహికలు. ఆ ప్రక్రియలో ఎన్నెన్నో పురానాగరికతలకు జన్మస్థలాలు.
మహానదులన్నీ కొండవాగులుగానే పుడతాయని స్కూలు పుస్తకాల్లో చదువుకున్నాం కదా, ఆ వివరం హిమాలయాల్లో ట్రెక్ చేస్తున్నపుడు నాకు ఎంతో స్పష్టంగా బోధపడింది. మేమిపుడు నీళ్ళు తాగి దాహం తీర్చుకున్న పిల్లవాగు చేరేది దిగువన కంటికి ఆనని అఖాతంలో పారుతోన్న బుధీగండకి నదిలోకే… అలా ఆ హిమాలయాల్లో తాను సాగినంత మేర అనేకానేక చిరు సెలయేళ్ళను తనలో నింపుకుని ఈ బుధీగండకి వెళ్ళి త్రిశూలి నదితో సంగమిస్తుంది. ఆ త్రిశూలి మళ్ళా మరికొన్ని ఉపనదులను తనలో ఇముడ్చుకుని నారాయణి నదిగా పరిణమిస్తుంది. అలా మనస్లు, అన్నపూర్ణ, ధౌళగిరి పరీవాహక ప్రదేశాలనుంచి నీరు సేకరించిన నారాయణి, దేశాల హద్దులు అధిగమించి, భారతదేశంలో ప్రవేశించి, చిట్టచివరికి పాటలీపుత్రానికి చేరువలో ఉన్న సోన్‌పూర్ అన్న చోట గంగానదిలో కలుస్తుంది.
మెల్లగా చీకట్లు అలుముకోసాగాయి. ఇంకా రెండుగంటలు నడిస్తేగానీ సెరాంగ్ గొంపా చేరుకోలేమని తెలుసు. ఈలోగా వర్షం మొదలయింది. గబగబా రెయిన్ కోట్లు వేసుకున్నాం. మేము నడుస్తోన్నది చిక్కని అడవి అవడంవల్ల వర్షంనుంచి కాస్తంత రక్షణ దొరికింది. మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఓ ఆరుబయలు ప్రదేశం… మా సౌకర్యం కోసమే అన్నట్టు వాన వెలిసింది! అక్కణ్ణించి దారి సమతలాన సాగింది. అదో పెద్ద ఉపశమనం. ఆ మసక చీకట్లలో మాకు కొన్ని కొండ గొర్రెలు కనిపించాయి.
ఆ పర్వతాల మధ్య వన్యప్రాణుల్ని చూడగలగడమన్నది మాకు సహజంగానే ఉత్తేజం కలిగించింది. అలాంటి చిన్న చిన్న విషయాలు మనకు ఆహ్లాదం కలిగించి మనసును సంతోషంతో నింపుతాయి అన్నది నాకు బాగా అనుభవంలోకి వచ్చిన విషయం. అన్నపూర్ణ ట్రెక్‌లో కూడా, ఎంతో ఉన్నత ప్రాంతాల్లో, ఈ కొండగొర్రెలు కనిపించాయి. అక్కడ అవన్నీ అక్కడి రాళ్ళ మధ్య ఇమిడిపోయి మా కంటికి కనిపించీ కనిపించకుండా ఉండిపోయాయి. ఎంతో పరీక్షగా చూస్తే తప్ప వాటి ఉనికిని గ్రహించలేకపోయాం. ఇక్కడ, ఈ మనస్లు ట్రెక్‌లో, ఆ ఇబ్బంది లేదు – స్పష్టంగా దగ్గరగా కనిపించాయి. అయినా అవి మహా చురుకైన జీవులు – కనిపించీ కనిపించగానే క్షణాల్లో అక్కడి చెట్టూ చేమల మధ్యకు ఉరికి అదృశ్యమైపోయాయి!
మరి కాసేపు నడిచాక దూరాన దీపాలు కనిపించాయి… సందేహమెందుకూ, అవి సెరాంగ్ గొంపా దీపాలే. అప్పటికి చిమ్మచీకటి కమ్ముకు వచ్చింది. హెడ్ లైట్లను వెలిగించుకుని, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేసాం. చివరికి రాత్రి ఏడుగంటల వేళ గొంపా చేరుకున్నాం.
అంతా కలసి ఆ రోజు పన్నెండు గంటలు నడిచాం. 17 కిలోమీటర్లు అధిగమించాం. 1240 మీటర్ల ఎత్తును సాధించాం. ఒకే రోజు అంత ఎత్తును సాధించడమన్నది మా హిమాలయాల ట్రెక్‌ల్లో అదే మొదటిసారి. అది ఒక రికార్డన్నమాట. అంత పెద్ద సవాలును ఏమాత్రం తొణుకూ బెణుకూ లేకుండా ఎదుర్కోవడం, సాధించడం మాకు సంతోషం కలిగించింది. ‘ఇలాంటి కష్టసాధ్యమైన హిమాలయ యాత్రలకు మేము సరితూగేవాళ్ళమే,’ అన్న విషయం స్పష్టంగా రుజువైన సమయమది. ఆ ఋజువు కలిగించే సంతోషం, సంతృప్తి మాటలకందనివి…











