క్రితం సంచికలో ఇచ్చిన అత్త, అల్లుడు కథకు విశ్లేషణ:
[విశ్లేషణలో ఆంగ్లవాక్యాలు మూలకథకు బుసినో చేసిన అనువాదం నుండి: (Tales of Madness tr.by Giovanni Bussino (Dante University of America Press) Giovanni Bussino.]
ఈ కథ మొదటి గుణం, యిది ఆపకుండా చదివిస్తుంది. ఇంతకంటే ఏ కథకుడు ఆశించగలిగింది లేదు. కానీ కథలో కష్టమంతా ఆ తరువాతనే. ఈ కథపై ఏ ముద్ర వేయాలి? ఇది హాస్యకథా? సస్పెన్స్ కథా? వ్యంగ్యమా? తత్త్వమా? ఇక కథలోకి వెళుదాం.
ఈ కథలో ఎవరికి నిజంగా పిచ్చి, అత్తకా అల్లుడికా? ఇద్దరికీనా? ఇద్దరికీ పిచ్చి లేదా?
ఇద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం? ఇద్దరిలో ఎవరిది తప్పు? కథ పేరులో యిద్దరే ఉన్నారు. అత్త అల్లుడు. మూడో మనిషికి, భార్యకు, ఎటువంటి పాత్ర లేదా?
కథలో ప్రధానవిషయం యీ యిద్దరు లేక ముగ్గురు, వీళ్ళ పిచ్చి మాత్రమేనా? వీరుకాక మరెవరైనా ఉన్నారా?
ఈ కథలో పిచ్చి స్వరూపమేమిటి? కథ చదివిన వెంటనే, ఏమిటి యీ పిచ్చికథ, లోకంలో యిట్లా ఉంటుందా, అనిపించదు ఎవ్వరికీ. ప్రతి ఒక్కరికీ “యిది” తమకు నిత్యమూ అనుభవంలో ఉన్న విషయమే అన్న భావం కలుగుతుంది. ఏమిటా “యిది”? తమకు, తమ కుటుంబంలో అందరికీ పిచ్చి, తమ గురించిన కథే యిది, అనుకుంటున్నారా? అనుకోరు. మరి తమకు నిత్యమూ అనుభవంలో ఉన్న విషయమే. అంటే అర్థమేమిటి? ప్రతి అల్లుడు యిది తన అత్తగురించిన కథ అనుకుంటాడు. ప్రతి అత్త యిది తన అల్లుడిగురించి రాసిన కథ అనుకుంటుంది.ఏ అల్లుడూ యిది నా కథ అనుకోడు, ఏ అత్త అనుకోదు. ఇది యీకథలో ప్రధానకథావస్తువు. తానేమిటో తాను తెలుసుకోడం కంటే, తన గురించి యితరులేమనుకుంటారు అన్నదానికి ఎక్కువ విలువ యివ్వడం, మన విలువలు మన చేతిలోకి తీసుకోక, లోకం చేతిలో పెట్టడం.
ఈ కథలో పిచ్చి ప్రవర్తన ఏమిటో చూద్దాం. అత్త తన కూతురు చనిపోలేదని. ప్రస్తుతం తన అల్లుడి భార్య తన కూతురేనని నమ్ముతుంది. అల్లుడు అత్తకు పిచ్చి, తన రెండవభార్యను తన కూతురు అనుకుంటోంది. అంటాడు. ఆ భ్రమ, తన కూతురు బతికే ఉన్నదన్న భ్రమ, కూతురు చనిపోయిందన్న దుఃఖంనుంచీ ఆమెను కాపాడుతున్నదని, ఆ భ్రమను, ఆమె మేలుకోరి, తాను భద్రంగా కాపాడుతున్నానని, అంటాడు. కూతురు నిజంగా చనిపోయిందో లేదో, తాను పోంజా మొదటి భార్యనా, లేక రెండవభార్యనా అని చెప్పగలిగింది పోంజా భార్య. కాని, యీమె నిజం చెబుతుందన్న నమ్మకం ఏమిటి? భర్త ఎదుట, తానతని రెండవ భార్యనంటుంది.తల్లి ఎదుట ఆమె కూతురు నేనే అంటుంది. ఇద్దరూ లేనపుడు అడగొచ్చు. కాని, భర్త ఆమెను ఒక్క క్షణంకూడా వదలడు కదా? అలా వదిలితే యీ కథే లేదు. ఈ భ్రమను చివరకు ప్రాంతాధికారికూడా సమర్థించాడు. అంటే, ఎవరిది భ్రమ అన్న విషయం సాక్ష్యాధారాలవల్లగాని, ధృవపత్రాలవల్లగాని ఋజువు అయ్యేది కాదు. నిజం మనం ఏదనుకుంటే అది. నిజమనేది మన అభిప్రాయం. ఆ అభిప్రాయం ఎప్పుడూ అలానే ఉండిపోతుందా? లేదు. సందర్భాన్నిబట్టి, సంబంధాన్నిబట్టి మారుతూ ఉంటుంది.
పిచ్చి ఋజువుకాదు. పోనీ, యిద్దరకీ పిచ్చిలేదు. తప్పెవరిది? వెంటనే భర్తదే తప్పంటాం. అతడొక అనుమానపుపిశాచం, భార్యను ఒక్క క్షణం కూడా స్వేచ్ఛగా వదలడు. చివరకు ఆమె తల్లినికూడా కలవనీయడు, మాట్లాడనీయడు. అంటాం. మనం కాదు. అత్తగారుకూడా అతడికి పిచ్చి అంటుంది. కాని, అతన్ని కొంచెంకూడా తప్పుపట్టదు. పైగా, అతణ్ణి ఆకాశానికెత్తేస్తుంది. అతడిది అసూయకాదు. అనుమానంకాదు. బ్రహ్మండమైన ప్రేమ. ఆ ప్రేమలో అంగుళంచోటు మరెవరికీ యివ్వడు, బ్రహ్మాండమంతప్రేమను కూడా తప్పపట్టగలమా, అంటుంది. నిజమే కదా? అసలు భార్య కష్టమో యిష్టమో కథలో లేదు. మరి ఎవరికి కష్టం?
ఇంత మెచ్చుకున్న అత్త, కూతురుకు ఏ కష్టమూ లేదంటున్న అత్త. వాళ్ళను సుఖంగా సంసారం చేసుకోనివ్వవచ్చుకదా? వాళ్ళు ఎక్కడికి వెడితే అక్కడికి వెంటబడకపోతే? ఆమెది తక్కువ స్వార్థమా, తక్కువ అసూయా? అతి ప్రేమకూడా పిచ్చి ప్రవర్తనకు దారి తీస్తుందా? అయితే అది ప్రేమ ఎట్లా అవుతుంది? మరో పేరు పెట్టాలి దానికి.
జీవితంలో నిజానిజాలుగాని, తప్పొప్పులుగాని ఋజువు చేయగలిగినవి కావు. ప్రేమ ఎప్పుడు ప్రేమ, ఎప్పుడు హింస కూడా ఋజువుకాదు. అంతేకాదు, ఋజువు చేయవలసినవి కూడా కావు. అనుమానపిశాచాలను తరిమేసి, స్వార్ధం కొంత మానుకుని బతకడం సరైన మార్గం. అవి వదలనంతవరకు ఎవరిది పిచ్చి అని అడగడం అవివేకం. అర్థరహితం. ఎందుకంటే పిచ్చి అస్తిత్వవాస్తవం. మనమందరం పిచ్చి వాళ్ళమే. ఇది హాస్యమా విషాదమా? హాస్యం వెనుక దాగిన విషాదసత్యం. అత్త బాధ నిజం, న్యాయం. పోంజా బాధ కూడా నిజమే, అతడి మంచితనము మంచిదే. అంత వెంటబడుతున్న అత్తగారి బాగోగులు అతడి చాలీచాలని ఆదాయంలో కూడా అంతబాగా చూచుకుంటునన్నాడంటే అతడు తప్పపట్టవలసినవాడుకాదు.
అసలీ కథ ఎవరి గురించి? వింత ప్రశ్న కదూ? అత్త, అల్లుడు కథ అని స్పష్టంగా తెలుస్తోంది కదా? కాదు. కాదని, కథ మొదటి వాక్యంనుండి, వాచ్యంగా, పాఠకుడి ఊహకు వదిలేయకుండా, స్పష్టంగా చెబుతూనే వస్తున్నాడు రచయిత. మనం మనలోకంలో పడి రచయిత ఏంచెబుతున్నాడో వినిపించుకోలేదు. కథలో ప్రారంభవాక్యాలు చూద్దాం:
(“Well, for heaven’s sake! Can you imagine that? It is enough to drive us really crazy all of us just trying to figure out which of the two is mad…. Either she’s mad or he is. There is no middle course; one of them must necessarily be mad. Because we’re dealing with nothing less than this… This is the sort of the thing that can happen only in Valdana. an unfortunate town which has become the mecca for all kinds of eccentric strangers!.”
No! I’d better start by telling the story in an orderly fashion.I swear it. I am seriously concerned about the anxiety that has plagued the inhabitants of Valdana for the past three months. and I care little about Mrs Frola and Mr Ponza…)
ఈ కథ చెబుతున్నవాడెవడు? స్థానికుడు, వల్టానా (Valdana) లో ఉంటున్నవాడు. అత్త, అల్లుడు. వాళ్ళతో భార్య/కూతురు-ముగ్గురు ఆ టౌన్ కు వచ్చారు. ముగ్గురూ ఊరికి కొత్త. ఒక విధంగా ప్రవాసులు. కొత్తగా వచ్చినవాళ్ళను అక్కడి యిరుగుపొరుగు చాలా ఆసక్తితో గమనించడం ఎక్కడైనా సహజం. ఇక్కడా అదే జరిగింది. ఈ కొత్తగా వచ్చి చేరిన యీ కుటుంబం, వాళ్ళ సంబంధాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆ యిద్దరిలో ఎవరికి పిచ్చి అన్న విషయం అర్థం కాక పిచ్చిపట్టిస్తోంది అక్కడి జనానికి. కనుక, కథ ఆ యిద్దరి గురించి కాదు. ఆ యిద్దరి గురించి కాదు అన్న విషయంలో యింకా అనుమానం ఉంటుందని రచయిత. ఊహించగలడు. లేకపోతే రచయిత ఎలా అవుతాడు? అందుకే పాఠకుడి ఊహకు వదిలేయడం ప్రమాదమని, స్పష్టంగా, అసందిగ్ధంగా చెప్పేశాడు: అత్తా అల్లుడు
ఎటుబోతే ఏమైతే నాకెందుకు? నా చింత వాళ్ళ గురించి కాదు. (“I care little about Mrs Frola and Mr Ponza.”) మరి ఎవరి గురించి చింత? ఊరి ప్రజల గురించి, ఊరివాడుగా తానూ, మూడు నెలలుగా ఆ ఊరిజనమూ అనుభవిస్తున్న ఆందోళన గురించి (“I am seriously concerned about the anxiety that has plagued the inhabitants of Valdana for the past three months.”)
ఆందోళన ప్రభావం ఏ స్థాయికి చేరింది? “No! I’d better start by telling the story in an orderly fashion.” ఇంకొంత కాలం యీ ఒత్తిడి కొనసాగితే, “కథాక్రమంబెట్టిదనిన” (“orderly fashion’) అని మొదలు పెట్టి క్రమం తప్పకుండా కథ చెప్పగలనో లేనో అన్నంత చెడింది (disorder) బుర్ర.
కథ మొత్తం చదివినతరువాతకూడా, కథ అల్లుడిగురించి కాదేమోనన్న అనుమానంకూడా పాఠకుడికి కలగకపోవచ్చని రచయిత ఊహించాడు. కనుకనే, “Can you imagine that?”
అని కథ మొదటనే అన్నాడు. “మీరూహించరని నాకు తెలుసు”. అనికూడా అన్నాడు. కనుక, కథలో ప్రధానవిషయం ఊళ్ళోకొచ్చిన కొత్తకుటుంబం కాదు. ఊరిజనం, వారి పొట్ట ఉబ్బరం.
అదేమంత పెద్దవిషయం అంటారా? —“but I ask you, to keep a whole town on tenterhooks, doesn’t that seem serious enough to you?” కనుక ఇదేమీ మామూలు విషయం కాదు. పోనీలే అని వదిలేయడానికి, ఒక కుటుంబసమస్య, ఊరి సమస్య, జాతిసమస్య, జాతీయసమస్య కాదు. అది నేలనుండి నింగి దాకా సమస్తసృష్టిని నిండిన సమస్య. “… for heaven’s sake!” అన్నది చాలా సాధారణమైన, ప్రత్యేకమైన ప్రాముఖ్యం లేని అర్ధంలేని ఆశ్చర్యార్థకం. కాని, యిక్కడ దాని ప్రాముఖ్యం ప్రత్యేకం. భగవంతుణ్ణికూడా యీ కేసులో ఒక పార్టీని చేస్తోంది. కనుక ఎంతటి తీవ్రమైన కడుపు ఉబ్బరమో తెలుస్తోంది.
రెండువైపులవాదాలు విన్న జడ్జి నిజానిజాలు నిర్ధారించరానివి అని తెలిసికూడా తీర్పు ఇచ్చేశాడు. ఏమిటా తీర్పు? “Either she’s mad or he is. There is no middle course: one of them must necessarily be mad.” సమాజం తనకు సంబంధించని విషయాలలో తలదూర్చి, అర్థంకాని విషయాలలో అక్కరలేని తీర్పులు చెప్పడం అంటే యిదే. అపీలుకుకూడా అవకాశంలేనంత కఠినము నిర్ద్వంద్వము అయిన తీర్పు (“must necessarily be mad.”)
కథ మొదలు చూచాం, ముగింపు వాక్యాలు చూద్దాం:
“When the two happen to come across each other on the street..
And they proceed along together like that, amid the puzzled annoyance and the stupor and consternation of the people who examine them well. look them up and down. spy on them and… nothing comes of it. They still are unable in any way to find out which of the two is mad, where fantasy ends and where reality beings.”
ఆ ముగ్గురు వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేస్తున్నారు. అత్త అల్లుడు సర్దుకు పోతున్నారు. వాళ్ళ కష్టమంతా, యిరుగుపొరుగుకు సంజాయిషీ చెప్పుకోడంలో, కథ మొత్తం ప్రజలకోర్టులో వాళ్ళ సంజాయిషీ తప్ప మరొకటి లేదు. ఎంత కష్టమో, అల్లుడు యిరుగుపొరుగు యిళ్ళకు వెళ్ళి వాళ్ళకు తన వాదం వినిపిస్తున్నపుడు రచయిత స్పష్టంగా చెప్పాడు.
“He begs them to grant him just a couple of minutes of their time to hear a declaration of I feel duty bound to make. “if it would not inconvenience them.”
ఇది యిరుగుపొరుగు వ్యవహారంలా లేదు. న్యాయస్థానాల భాష, (“grant him just a couple of minutes…declaration of I feel duty bound to make”). కోర్టులో తన్ను తాను హాజరుపరచుకుంటాడు (“shows up”). ఇక పోంజో ప్రవర్తన:
Mr Ponza shows up, his face flushed, the blood almost bursting from his veins. his eyes sterner and gloomier than ever. The handkerchief he holds in his hand, as well as the cuffs and collar of his shirt, clash in their whiteness with his swarthy complexion and his dark hair and suit. He continually wipes his perspiration dripping from his low forehead…extreme, obvious, violent effort he makes to control himself..hands… tremble.”
ఒక హంతకుడుకూడా యింత చెమటలు కార్చడు కోర్టులో, దీనినిబట్టి యిరుగుపొరుగు అతణ్ణి మానసికంగా ఎంత హింసించారో తెలుస్తుంది. కనుక, కథ లోకం గురించి, దాని మానసికవ్యాధి గురించి. పిచ్చి లోకం! దాని పిచ్చి దానికానందం (sadism)! అంతే కాదు. లోకంలో ప్రతి ఒక్కడూ మరొకడికి పిచ్చి అనుకుంటాడు. ఈ అవగాహన మాత్రమే మనిషిని పిచ్చినుండి కాపాడుతుంది.
అలా అని మొత్తం తప్పు సమాజంమీదకు తోసేస్తున్నాడా రచయిత? లేదు. వ్యక్తిని ఎంత తప్పు పట్టాలో అంతా తప్పుపడతాడు. పోంజోది నిజంగా ఒక మానసికవ్యాధి. అతడి అనుమానం అనే వ్యాధి ఎంత సూక్ష్మంగానో సూచిస్తాడు రచయిత. ఈ కథ మొదట్లోనే మక్కా ప్రస్తావన చేస్తాడు. (“unfortunate town which has become the mecca for all kinds of eccentric strangers”). పోంజోను వర్ణిస్తూ “కర్చీఫ్” ను నిర్లక్ష్యంగా అన్నట్టు జారవిడుస్తాడు. సాక్ష్యంగా, (” The handkerchief he holds in his hand”).అంతటితో ఆగడు. అతడి ఒంటి రంగు. (” his swarthy complexion and his dark hair”). ఏమిటిదంతా? ఒథెలోను గుర్తుచేయడం కాదూ? అతడూ ఒక అనుమానపిశాచం. పోంజో కూడా, తన మొదటిభార్యను…? ఏమో. ఎవడికి తెలుసు? ఈ లోకంలో అందరూ కొద్దోగొప్పో మానసికరోగులే. ముందు వ్యాధినిదానం జరగాలి, వ్యాధినివారించాలంటే. ఇది కథలోని సామాజికకోణం.
అంతకు మించింది, సత్యాసత్యనిరూపణం. ఏది సత్యం? నిరూపించడం అసంభవం. వాస్తవం బుద్ధికందదు. అసలు అబద్ధం బుద్ధిలోనే పుడుతుంది కనుక. నిజం మన సంబంధాలస్వరూపాన్నిబట్టి మారుతూ ఉంటుంది. సత్యం సాపేక్షం.
చివరగా, పిరాండెలో యీ కథలో, యీ కథలోనే కాదు. అతడి మొత్తం రచనలను పరచుకున్న విషయం మహామాయ. ఈ సృష్టిలో ఏదీ అర్ధం కాదు. ప్రతి వస్తువును, ప్రతివిషయాన్ని ఒక ముసుగు కప్పి ఉంటుంది. ముసుగు వెనుక వాస్తవం ఏమిటో. తెలియడం అసంభవం. ఆ ముసుగు తొలగదు, తొలగనివ్వదు. ఆ మహామాయ.
పిరాండెలో సాహిత్యమంతటికీ యీ భ్రాంతి కావ్యవస్తువు. పిరాండెలో ప్రసిద్ధనాటకంలో తల్లి పాత్ర ఒక బురఖాలో ప్రవేశిస్తుంది. (ఈ నాటకంలోని “ఆరు పాత్రలకు” పేర్లు లేవు. తల్లి, తండ్రి, కూతురు…) ఆ తల్లి ముఖంపై ముసుగు తొలగించబోతాడు తండ్రి. తల్లి వారిస్తుంది. ఇది ఒక రంగస్థలనిర్దేశం (stage direction) సంభాషణకూడా కాదు. కాని ఏ మాత్రమూ ప్రాముఖ్యం ఉండదనిపించే ఒక రంగస్థలనిర్దేశం, పిరాండెలో సమస్తసాహిత్యానికి వస్తునిర్దేశం చేస్తుంది. ఆ “తల్లి” పాత్ర ఆదిశంకరుల భాషలో మహామాయ. (“మహామాయా విశ్వం భ్రమయసి”: సౌందర్యలహరి.) ఈ కథ ముగింపు వాక్యం ఆ మహామాయతోనే, “where fantasy ends and where reality begins”, ఎప్పటికీ ఎవ్వరూ తెలియలేరు.
చివరగా పిరాండెలో శిల్పవిశేషం. అసత్యాన్ని చిత్రించి సత్యభ్రాంతి కలిగిస్తుంది సాహిత్యం. అసత్యాన్ని అసత్యంగానే చిత్రించి సత్యభ్రాంతి కలిగిస్తుంది అతీతసాహిత్యం (metafiction) ఏది సత్యం ఏదసత్యం అన్న విచికిత్సలోకి తోసేస్తుంది.పిరాండెలో రచనలు ఆ భ్రాంతికి సాహిత్యస్థాయినిచ్చి చిరస్థాయిని కల్పించాయి.
ఈ కథలో ఉత్కంఠ ఉంది, అగాధమైన తత్త్వం ఉంది. అగాధమైన తత్త్వాన్ని, నిగూఢమైన విషాదాన్ని, అత్యంత హాస్యంతో, ఉత్కంఠభరితంగా చెప్పగలడు పిరాండెలో. బహుశా ప్రపంచంలో యిలా సాహిత్యసృష్టి చేయగలిగిన రచయిత మరొకడు లేడేమో! ఇంత అయోమయంలోకి తోసెయ్యగలిగినవాడు కూడా.