దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి రాయడం కష్టమే, సులువు కూడా. కొత్త విషయాలు చెప్పడం కష్టం. అందరికీ సుపరిచితులూ ఇష్టులూ అయిన మన తీయని మాటల కృష్ణశాస్త్రి గురించీ రాయడం సులువు కూడా. కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి సంపుటుల్లో ఏ కవితనైనా ఎంచుకోవచ్చు, మన కవి సృష్టించిన ఇక్షురసార్ణవపు తీరానికి పఠితలను తీసుకెళ్ళచ్చు. అధికశాతం తెలుగు పాఠకులు కృష్ణశాస్త్రిని “భావకవి”గానే ఎరుగుదురు. కృష్ణశాస్త్రి మీద Robert Frost, P.B. Shelley, టాగోర్ వంటి కవుల ప్రభావమున్నదనీ, జమిందారీ యుగపు కవిత్వం నుంచీ తెలుగు కవిత్వాన్ని రక్షించాడనీ, తెలుగులో కాల్పనికోద్యమాన్ని (Romantic Movement) త్వరగా తెచ్చాడనీ చాలామందే చెప్పారు. ఇక చలమైతే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ (ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ) అంటూ ఒకే ఒక్క epigramతో సరిపుచ్చాడు. ఇంతకన్నా గొప్పగా ఎవరు మాత్రం చెప్పగలరు? శ్రీశ్రీ అయితే తను తొలిదినాల్లో విశ్వనాథనూ, కృష్ణశాస్త్రినీ అనుకరించేవాడినంటూ ఇద్దర్నీ కొనియాడాడు.
కృష్ణపక్షంలో మొదటి గీతమే “ఆకులో ఆకునై”. ఇది తెలుగువారందరికీ హృదయస్థం. రెండో గీతం “స్వేచ్ఛాగానము”. అందులో రెండో చరణం:
క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య
శృంఖలములు తమంతనె చెదరి పోవ
గగనతలము మార్మ్రోగఁగఁ గంఠమెత్తి
జగము నిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు
దాస్య శృంఖలాల్ని కల్పితాలనీ, అవి “తమంతనె” చెదిరిపోతాయనీ రాశారు. కల్పితం అంటే నిఘంటువులో made, fraudulent, fictitious అనే అర్థాలు కనిపిస్తాయి. అవి “తమంతనె చెదిరిపోవ … స్వేచ్ఛాగానఝరుల నింతు” అనీ అన్నారాయన. స్వేచ్ఛ సత్తు. స్వేచ్ఛ లేకపోవడం మాయ. “స్వేచ్ఛ నీ జన్మహక్కు” అని పసిపాపకి చెప్పినా అది సర్వరోగనివారిణిలా పనిచేస్తుంది. భావవిప్లవానికిదే నాందీ. ఈ చరణంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే మహాకవి మనకు దర్శనమిస్తాడు. కృష్ణశాస్త్రి కవిత్వంలో స్వేచ్ఛకున్న విలువ ముందు ఇంకేదీ నిలబడదు. కనుకనే ఈ స్వేచ్ఛ విలువ తెలిసిన కవి ఇదే గీతంలోని రెండో భాగంలో “దిగిరాను దిగిరాను దివినుండి భువికి” అని అంతెత్తులో కూర్చున్నాడు, “నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు” అని భువిని దులిపేసుకున్నాడు కవి. “ఎట్లైన నిచటనే యాగిపోనా” అని కవి నీలగిరి నైసర్గిక అందాల మధ్య ఆగిపోయినప్పుడు కాలం స్తంభించిన నిశ్చింత పాఠకులదే . “అలరు నయ్యెదఁ జిగురాకు నయ్యెదను…. ఏలొకో యెప్పుడో యెటులనో గాని/మాయమయ్యెద నేను మాఱిపోయెదను” అన్నప్పుడు స్వేచ్ఛలో మాయ కూడా భాగమేనని హాయిగా నమ్ముతారు పాఠకులు.
మూడో గీతమైన “నేను” (ఆరోజుల్లో ఇటువంటి పేరు పెట్టి ఇంకెవరైనా ఓ గీతం రాశారా?) లో “ఏను స్వేచ్ఛాకుమారుఁడ” అని కవి స్వపరిచయం.
ఏను స్వేచ్ఛాకుమారుడ నేను గగన
పథవిహారవిహంగమపతిని నేను
మోహనవినీలజలధరమూర్తి నేను
ప్రళయజంఝూప్రభంజనస్వామి నేనుఎవ్వరని యెంతురో నన్ను ఏననంత
శోకభీకరతిమిర లోకైకపతిని
ఇక ఊర్వశి ఇలా మొదలౌతుంది.
“నా కఠిన పాదశిలలక్రిందఁ బడి నలఁగి
పోయె నెన్నెన్నియో మల్లెపూలు మున్ను”
తన పాదాలే శిలలన్నారు. ఆ శిలలకింద నలిగిపోయినవి మల్లెలు. ఇప్పుడు కాదు, “మున్ను”. స్వేచ్ఛకలిగిన వ్యక్తి చిన్న పొరపాటైనా చెయ్యకుండా ఉండడు. తనకు కలిగిన ఏ ఊహో రాయాలనుకున్న ఏ పద్యదళమో తనకే నచ్చి ఉండదు. అన్ని మంచి పువ్వుల్నీ ప్రేమించిన కృష్ణశాస్త్రి తన చిన్న తప్పిదానికి ఎంతో నొచ్చుకున్నారు. ఇక్కడ కృష్ణశాస్త్రి కేవలం స్వేచ్ఛాకుమారుడిగానే కాక స్వేచ్ఛకలిగిన నాగరక కవి బాధ్యత కూడా ఏంటో అందంగా, సున్నితంగా చెప్పారు.
కృష్ణశాస్త్రి కవిత్వంలో ప్రధానంగా కనిపించే భావధారలు రెండే. మాధుర్యం, దుఃఖం. దుఃఖితమదికి చంద్రికలూ మలయజమూ వంటివి చలువ చేయవు, తోటి మనిషి బాధలో ఉండడం కవికి బాధ. అప్పుడు కవి దైవాన్ని జాలిగా పిలిచి మొరపెట్టుకుంటాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ కావడం వెనుక ఉన్న రహస్యం ఇదే. ప్రపంచం బాధలో ఉన్నప్పుడు కృష్ణశాస్త్రికి శరచ్చంద్రికలూ, మలయానిలమూ సుఖాన్నివ్వలేదు. “ఇవన్నీ నాకే”, అనుకొనే కవులు కారు మన భావకవులు. “మంచివి అన్నీ అందరికీనూ” అని నమ్మేవారే మన మహాకవులు. మనిషికీ మనిషికీ మధ్య ఏ పొరపొచ్చాలు లేనప్పుడు వెన్నెల కాస్తుంది. ఎక్కడైనా ఏ ఒక్క కంట ఒక్క మలినాశ్రువు జారిపడినా, దుఃఖం పుడుతుంది.
మేనిఫెస్టోలు రాసినా రాయకపోయినా కవులు వాళ్ళ వాళ్ళ కవిత్వంలో దొరుకుతారు. కృష్ణశాస్త్రి తెలుగువారికిచ్చినది ఎంతటి సున్నితమయిన సుకుమారమయిన కవిత్వమంటే, ఈ కవిత్వాన్ని ఎక్కువగా quote చేసినా, విశ్లేషించినా దాన్లో ఉండే మాధుర్యం తగ్గిపోతుందేమో అని నాకొక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ కవిత్వంలో ఉన్న “నాలుగు వేణికల” గురించీ వాటి మధ్యనున్న పరస్పరసంబంధం గురించీ శ్రీ తల్లవజ్ఝల శివశంకర శాస్త్రిగారి “కృష్ణపక్షసింహావలోకనం”లో వివరంగా చూడవచ్చు. ఆ ప్రశంసలోనే శివశంకరశాస్త్రిగారు “కృష్ణపక్షంలో కవిత్వము ఆత్మాశ్రయమై హృదయంగమయినది” అన్నారు. సి.నా. రె. శేషేంద్ర కవిత్వం గురించీ “ఆత్మాశ్రయ కవిత్వా”న్ని నేను ఆహ్వానించను అన్నారు. ఎందుకో? దీని భావమేమి?
కృష్ణశాస్త్రి వంటి కవి గురించీ ఎంత రాసినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. ఎవరు ఏం రాసినా బాగుంటుంది. అది రాసినవాడి గొప్ప కాదు. కృష్ణశాస్త్రి అంత ప్రియమైన కవి మనకి. అది ఆ కవి మహాత్మ్యం.