ఆ తొమ్మిది నెలల
పురిటి నొప్పుల బాధ తరువాత
నన్ను బయటకు వదిలాక
నాకు తెలియని
భారం నొప్పులు
అమ్మకు తగ్గి
నాకు తెలియని నా నొప్పులు
అమ్మకు పెరిగి ఉంటాయి
నేను పెరుగుతున్న ప్రతి ఏడాది
తెలుసుకోగలుగుతున్న నా బాధలు
నాకు మొదలయాయి
తనపనేదో చేసుకొని
అమ్మ వెళ్ళిపోయింది
ఆమెవి నాన్నవి
వాళ్ళ వాళ్ళ అందరివీ
ఒక్కొక్క గుణాల్ని
నేను మోస్తూ విడుస్తూ
ఎనభైసార్లు జీవితంలోకి వెళ్ళొస్తున్నా
కప్పిపుచ్చుకోలేని నా ఆకారాలు
నన్నంటుకున్న నాచేష్టలు
నా రక్తంలోని రోగాలు
ఎంత వదిలించుకుంటున్నా
నన్ను వేలాడుతూనే ఉన్నాయి
పిల్లలకవి పిట్టకథలు వ్యాఖ్యానాలు
అదే పని నేను కూడా చేశానని నాకు తెలుసు
తరంతరం గుర్తుచేస్తూ
ఏదోలా బదిలీ అవుతున్నవన్నీ
అనుభవిస్తున్నవన్నీ
ఎవరెవరి ఆస్తులో
తీరనివన్నీ ..
ఎవరెవరి అప్పులో?
