మార్చ్ 2024

తెలుగులో తాము సీనియర్ రచయితలం, కవులం అని చెప్పుకునే మనుషుల కనుసన్నలలో ఇప్పుడు ఎన్నో సమూహాలు ఉన్నాయి. వాళ్ళ అడుగులకు మడుగులొత్తే శిష్యబృందమూ ఉంది. ఎవరైనా ఒకరు ఒక రెండు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లకి వంద లైకులు సాధిస్తే, లేదా ఎక్కడైనా ఒక నాలుగు రచనల ప్రచురణ జరిగితే, ఇక వారికి రచయితలు అన్న టాగ్ వచ్చేస్తుంది. వాళ్ళ రచనలను బట్టి కథకులనో, కవులనో ముద్ర వేసేశాక, ఇక వాళ్ళకి సదరు ‘గురు’కులాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, రాసి ఏం చెయ్యాలి – ఇవన్నీ నేర్పించబడతాయి. అవి మేలు చేస్తున్నాయో చేటు చేస్తున్నాయో చెప్పడం కష్టం కాదు కాని, ఆ గీతలు అంత స్పష్టంగా కొత్తవారికి కనపడవు. కళలు ఉద్యోగాలు కావు అన్న స్పృహను పక్కన పెట్టేసిన సీనియర్ కవులు రచయితలు, కాలేజిలో ఫ్రెషర్స్‌కు చెయ్యాల్సిన పనుల చిట్టా చెప్పినట్టు, వారికి రచనలోకి రాగానే ఎంచుకోవాల్సిన ‘సబ్జెక్ట్స్’ ఇచ్చి, వెన్ను తట్టి పెన్ను పట్టిస్తారు. ‘సీనియర్’ల సంగతి ఒదిలెయ్యండి, తమ రచనను విభిన్న వర్గాల పాఠకులకు చేర్చడానికి తెలుగులో ఇన్ని పత్రికలు, ఇన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నా, ఇలా ఏదో ఒక వేదికమీద మాత్రమే, ఏదో ఒక కూటమితో జతపడి మాత్రమే, రచనలు ప్రచురించి, తాము పొందగలిగినది ఏమిటో యువరచయితలు ప్రశ్నించుకోవాలి. ఒకే రకం అభిప్రాయాలను సమర్థించే బృందంలో ఉన్నప్పుడు, అవి సహజంగానే అక్కడివారి ఆమోదం పొందుతాయి. కానీ ఆ రచనలను భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళకి చేరవేయగలుగుతున్నామా, వస్తువుతో నిరాకరణ ఉన్నా సరే, వాళ్ళని తమ రచనాబలిమి చేత చదివించగలుగుతున్నామా, ఆలోచింపజేయగులుతున్నామా అన్న ప్రశ్నలు వీరికి రావాలి. అవి రావాలంటే, ఈ ప్రచురణా ప్రపంచంలో ఎందుకు ఉన్నామని వీరు ప్రశ్నించుకోవాలి. తనదైన ఆశయంతో రచనలు చేయడానికా? ఏది రాసినా అనుమోదించి దన్నుగా నిలబడగల నలుగురు స్నేహితులను పోగేసుకోవడానికా? తన రచన మీద ఏ విమర్శ వచ్చినా కాపు రాగల కూటమిని కూడగట్టుకోవడానికా… దేనికి? కుటుంబాలతో ఉద్యోగాలతో తలమునకలుగా ఉండే జీవితంలో నుండి కొంత సమయాన్ని వీరు సాహిత్యం కోసం కేటాయించడానికి కారణాలేమిటి? అది నిజంగా నలుగురు, నిజంగా మెచ్చగల రచనను సృష్టించడమే అయితే, ఆ రచనాబలాన్ని తెలుసుకోవడానికి ఆశ్రయించాల్సింది ఎవరిని? ఎవరి విమర్శ నమ్మదగినది? మహామహా ఉద్యమాలే ఆత్మవిమర్శ కొరవడి నీరుకారిపోవడం చరిత్ర నమోదు చేసిన సత్యం. ఇక శ్రద్ధ లేని రచనలేపాటి? లేదూ, కావలసినది ఎంతోకొంత కాలక్షేపమే అయితే, ఈ రచనాపీఠాలను పట్టుకుని వేలాడుతూ వీరు పొందుతున్నది ఏమిటి? కోల్పోతున్నది ఏమిటి? వీటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది లోపలి పాఠకుడిని బతికించుకోవడం. సాహిత్యంలో విలువలు, రచనకు ఒక స్థాయి ఆశించడం ఎందుకు మానేశారు? పొగడ్త తప్ప విమర్శ ఎందుకు వినరు? సమాజపు సమస్త ఊహలకూ రెక్కలివ్వాల్సిన రచనాలోకంలో, ఈ విజ్ఞతని నిద్రపుచ్చి కవిరచయితలు చేస్తున్నదేమిటి? ముక్కలుముక్కలుగా రాసే మాటల్లో నాలుగు మెరుపులు కనిపిస్తే వస్తే మెచ్చుకోళ్ళకు పొంగిపోతూ, రచన మొత్తంలో కనపడవలసిన పరిపూర్ణత గురించి మాట్లాడటానికి భయపడుతూ లేదా నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటే సాహిత్యం ఎలా మెరుగవుతుంది? నిజమైన రచన శక్తిని, సమయాన్ని, మరీ ముఖ్యంగా నిజాయితీని కోరుతుంది. వీటికి తూనికరాళ్ళు ఎవరికీ వేరేవాళ్ళు ఇవ్వలేరు. ఏ సాహిత్య స్నేహాలూ సమూహాలూ రచనాబలిమి లేని శుష్కసాహిత్యాన్ని బతికించలేవు. సాహిత్యసృజన ఏకాంత ప్రక్రియ.