దాదాపు గంటకి పైగా అలా కిటికీలోంచే బయటకి చూస్తున్నావు. నరాల్లోంచి రక్తం తోడేసినట్లూ, కాళ్ళ క్రింద భూమి కూరుకుపోయినట్లూ ఉంది నీకు. తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందనీ నీకు తెలుసు. దీనికి నీ తోటి ఉద్యోగులే పెద్ద ఉదాహరణ.
అయిదేళ్ళ క్రితం నీ కొలీగ్ ప్రభాకరానికీ ఇప్పుడు నీకొచ్చిన పరిస్థితే వస్తే నువ్వు ఏం చెప్పావు? “పోయింది ఉద్యోగమే కదా? ఆస్తులు కాదు. ఇది కాకపోతే మరోటి. ఒక తలుపు మూసుకుంటే, రెండో తలుపు తెరుచుకునే వుంటుంది…” అని.
అలవాటు లేని సందర్భాలు మనకి, అంటూ నమ్మబలికావు. గుర్తుందా? అన్నివేళలా నువ్వే గెలవాలంటే ఎలా?
ఒక్కోసారి ఓటమిని మించిన గెలుపు ఉండదు. ఆ సంగతి నీకు తొందర్లోనే తెలియబోతోంది.
అప్పుడు నీకు పన్నెండేళ్ళు.
కోరుకొండ సైనిక్ స్కూలుకి నిన్ను పంపాలని మీ నాన్న నీకు లెక్కల ట్యూషన్ పెట్టించాడు. మీ లెక్కల మేస్టారు కాస్త చాదస్తుడు. పైగా పెద్ద సంసారం కూడాను. ఇద్దరు పిల్లలూ, పెళ్ళి కావల్సిన చెల్లెళ్ళూ. వయసు మీదపడ్డ అమ్మా, నాన్నా. టిపికల్ మధ్యతరగతి కుటుంబంలో మధ్య జీవితం ఆయనది. మాస్టారు స్థితిమంతుడు కాదని నీకు తెలుసు. ఎంత అన్నది అప్పుడు అవగాహన లేదు నీకు. ఉదయం అయిదు నుండి తొమ్మిది వరకూ, సాయంత్రం అయిదు నుండి పదివరకూ ట్యూషన్లే ఆయన జీవితం.
మాస్టారికి నువ్వంటే ఇష్టం. నీకూ ఆయన పాఠం అంటే ప్రేమే. హఠాత్తుగా ఒకసారి నీకు ఆయన రాక్షసుళ్ళా ఆనాడు. ఒకటో తారీకొచ్చేసరికి ఠంచనుగా ఫీజు కట్టాలి. అది నీకు గుర్తు రాలేదు. ఫీజు పట్టుకురాలేదని వెళ్ళిపొమ్మన్నాడు. అందరి ముందూ తల కొట్టేసినట్లయ్యింది నీకు. నాన్న రాజమండ్రీ వెళ్ళాడు, రాగానే ఇస్తానన్నా వినని మొండిఘటం ఆయన. నిన్ను నిర్దాక్షిణ్యంగా పంపేశాడు. ఒక్కణ్ణీ పక్కకి పిలిచి చెబితే అది వేరే విషయం. స్నేహితులందరి ముందూ నీ తల తెగ్గొట్టేశాడనిపించింది నీకు.
మరలా ఆ మాస్టారి గుమ్మం తొక్కలేదు నువ్వు. మీ అన్నయ్య చేత ఫీజు పంపించినా వెళ్ళడానికి నువ్వు సిద్ధపడలేదు. ‘మీవాడు ఫీజు డబ్బులు పెట్టి సినిమాకెళ్ళాడనుకున్నాను; రేపట్నుండి రావచ్చు…’ అని మీ అన్న వార్త మోసుకొచ్చాడు. ట్యూషన్‌కి వెళ్ళమని మీ నాన్న బ్రతిమాలినా వెళ్ళలేదు. గుమ్మంలోంచి నెట్టివేయబడినా క్రుంగిపోలేదు. ఉవ్వెత్తున లేచావు. పంతంగా చదివావు. ఏడో తరగతి స్కూల్ ఫస్టు వచ్చింది. సైనిక్ స్కూల్ ఎంట్రన్సూ పాసయ్యావు. మాస్టారి ఇంటి వైపు కూడా వెళ్ళలేదు. మాస్టార్ని మాత్రం క్షమించలేదు; నువ్వు లేనప్పుడు ఆయన అభినందించడానికి వచ్చినా సరే! నీదే గెలుపు అన్న ధోరణిలో మసిలావు.
తరువాత ఎన్నోసార్లు మాస్టార్నీ, ఆయన పాఠాన్నీ, నిన్ను మెచ్చుకున్న సందర్భాలనీ తలుచుకున్నావు. అయినా, కనిపించని గాయం ఇప్పటికీ రక్తం చిమ్ముతూనే ఉంటుంది. మొదట్లో ఆయనేసిన కుదుళ్ళే నీ బలం అని తెలుసుకునే వయసు కాదది.
దాదాపు పాతికేళ్ళ తరువాత ఇంచుమించు అలాంటి సందర్భమే నీకు ఎదురయ్యింది. నీ కోపం అంతా దినకరన్ మీద. డైరక్టర్‌గా అతని స్థానం పెరిగినప్పటినుండీ నీకు అతనంటే అసహనంగానే వుంది. టెక్నికల్‌గా అతను శూన్యం అని నీ భావన. ఇదే విషయం నువ్వు చాలాసార్లు నీ కొలీగ్ స్టీవ్ దగ్గర అంటే ఏమన్నాడో గుర్తుందా?
“ఒప్పుకుంటాను. ఒక్కోసారి మనకి ఏం తెలుసు అన్నది ముఖ్యం కాదు; ఎదుటివారికి మనకి తెలుసు అన్న నమ్మకం కుదిరితే చాలు. నేనే దినకరన్ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా నిన్ను పంపించేవాణ్ణి కాదు; ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్…”
“ఈ అమెరికాలో రేసిజం ఎలాంటిదో ఇండియాలో రీజినలిజం అలాంటింది. అతను నన్ను కావాలనే పంపించేశాడు. నీకూ నాకూ తెలుసు, డేవిడ్ పనిచేయడని. అతన్ని మినహాయించి నన్ను తీసేయడం అదే. ఇప్పుడు ఏవో కుంటి సాకులు చెబుతాడు.” దినకరన్‌కి తెలుగు వాళ్ళంటే పడదన్నది నీకు అనుభవం నేర్పిన పాఠం. అది నువ్వు స్టీవ్‌కి చెప్పావు.
స్టీవ్‌కి నీ బాధ అర్థమయ్యింది. అతను నీతో వాదించలేదు. నిజానికి స్టీవ్ నీకు చాలా సాయంచేశాడు. అతి త్వరలోనే నీకు జాబ్ వస్తుందని ధైర్యం చెప్పాడు. అతనికి తెలుసున్న ఇద్దరు ముగ్గురి రిఫరెన్స్ కూడా ఇచ్చాడు. వాటి వలనే కదా, ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళావు. స్టీవ్ సింపతీ కూడా నీ వైపే. దినకరన్ నిన్ను అవమానించాడు. పీరియడ్. అంతకు మించి ఆలోచించడం వేస్ట్!
అవమానం అనే దావానలం ముందు సింపతీలూ, ఓదార్పులూ నీటిబొట్టు లాంటివి. ఎంత వద్దనుకున్నా నీకు దినకరన్ రూపమే మనసులో మెదులుతోంది. అతన్ని తలచుకుంటేనే నీకు అసహ్యం. దినకరన్‌ని నువ్వు తిట్టుకోని క్షణం లేదు. అతను కొట్టిన దెబ్బ నువ్వు ఎప్పటికీ మరచిపోలేవు, చిన్నప్పుడు మీ మాస్టారు చేసిన అవమానంలా.
కాని వద్దనుకున్నా పదే పదే గుర్తొస్తున్నాడు.
నాలుగైదు వారాలు ఇబ్బందిపడ్డాక, నీకూ మంచి రోజులొచ్చాయి. చూస్తూండగానే వారంలో వుద్యోగం వచ్చేసింది. ఆ వార్త వినగానే సంతోషం కలిగినా, నీకు ముందు గుర్తొచ్చింది సాయం చేసిన స్టీవ్ కాదు; దినకరన్. ఈ వార్తతో అతని చెంప ఛెళ్ళుమనిపించాలనుకున్నావు. పగ పాము లాంటిది. బుసకొడుతూనే ఉంటుంది; ఎప్పుడు కాటేద్దామనో.
నువ్వు స్టీవ్‌కి ఫోన్ చేసి చెప్పగానే నీ ముందు వచ్చి వాలాడు. “ఐ యామ్ ఆల్ హాపీ ఫర్ యూ! ఐ నో యూ విల్ గెట్ ఇట్!” అంటూ నిన్ను కౌగలించుకోగానే నీకు ఎంత ఆనందం కలిగింది! కొండంత బరువు గుండెలమీద నుండి తీసేసినట్లయ్యింది.
“స్టీవ్! నువ్వు రేపే దినకరన్‌కి చెప్పు. ఐ హేట్ దట్ ఫకింగ్ బాస్టర్…”
నీ ఫ్రస్ట్రేషన్ చూసి కాదన్నట్లు తలాడించాడు స్టీవ్. “రాజ్! నీకో న్యూస్ చెప్పాలి. దినకరన్‌కి హార్ట్ ఎటాక్ వచ్చిందట. స్టాన్‌ఫర్డ్ హాస్పటల్లో చేర్చారట. మేం అందరమూ రేపు విజిట్ చేద్దామనుకుంటున్నాం, వస్తావా…?” ఇప్పుడు షాక్ తినడం నీ వంతయ్యింది. ఎప్పుడూ, ఎక్కడా అని అడగలేదు. లోలోపల శాస్తి బాగా జరిగింది అనుకున్నా, పైకి మాత్రం “అలాగా…” అని ఆశ్చర్యపోతూ నటించావు.
“ఇది జరిగి వారం అయ్యిందట. హీ ఈజ్ ఫైన్ అన్నారు. లాంగ్ వీకెండ్ రావడంతో ఒక వీక్ శలవు తీసుకున్నాడని చెప్పారు. ఫ్యామిలీతో కలిసి హౌఆయి ప్రోగ్రాం పెట్టుకున్నారట. ఈలోగానే ఇది జరిగింది. ఈ ఫ్రైడే వెళదామనుకుంటున్నాం. నువ్వూ…” అంటూ నీ ముఖంలోకి చూశాడు.
“యూ గయ్స్ క్యారీ ఆన్! ఐ హావ్ యాన్ అపాయింట్మెంట్ దట్ డే…”
“నీకింకా దినకరన్ మీద కోపమా!? అతను తీసుకుంది ఒక చిన్న బిజినెస్ డెసిషన్! అతని స్థానంలో నువ్వున్నా అదే చేసుండేవాడివి.”
“ఐ డోంట్ థింక్ సో. బిజినెస్ డెసిషన్ నా ఒక్కడిమీదే ఏవిటి? డేవిడ్ ఉన్నాడు. నువ్వూ ఉన్నావు. అదొక పైశాచిక ఆనందం. నీకు ఇండియాలో రీజినల్ డైనమిక్స్ తెలీవు.”
ఇంటికి రాగానే నీ భార్యకి నువ్వు చెప్పింది అదే. “చూడు! ఆ దినకరన్ నాకు చేసినదానికి శాస్తి అనుభవించాడు. హార్ట్ ఎటాక్ వచ్చిందట. బాగా అయ్యింది!”
ఆమె మౌనంగా వింది.
ఎందుకో పైకి చెప్పలేని ఆనందం నీది.
వారం తరువాత నువ్వు ఒక ఫ్రైడే లంచ్‌కి స్టీవ్‌ని పిలిచావు. నువ్వు రెస్టారెంట్‌కి వెళ్ళేసరికే అక్కడున్నాడు స్టీవ్. అతని పంక్చ్యుయాలిటీ నీకు తెలుసు. ఆలస్యంగా వచ్చినందుకు నువ్వు ఏదో కారణం చెప్పబోతోంటే, “ఇట్స్ ఒకే,” అనేసి లోపలికి దారితీశాడు, “కొత్త జాబ్ ఎలా వుంది?” అంటూ.
“నీకో విషయం చెప్పాలి. దినకరన్‌ని లాస్ట్ సండే కలిశాను. డేవిడ్, లీసా ఇంకా చాలామంది వచ్చారు. నీ గురించి అడిగాడు దినకరన్.”
దినకరన్ పేరు ఎత్తగానే నీకు చుర్రుమంది. పైకి మాత్రం “అలాగా?” అన్నావు.
“బై ద వే, నీకింకో సర్ప్రైజ్! మేం చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన కనిపించాడు. వయసు ఎనభై దాటుంటుంది. ఆయన దినకరన్ ఫాదర్-ఇన్-లా అని పరిచయం చేసుకున్నాడు. నీదీ ఆయనదీ ఇండియాలో ఒకే ఊరని చెప్పాడు. నువ్వు తెలుసనీ, నీకు చిన్నప్పుడు ట్యూటరింగ్ చేశాననీ అన్నాడు.”
అది వినగానే నీకు గుండెల్లో రాయి పడినట్లయ్యింది. ఏం చెబుతావు? నీ మొహం కందగడ్డలా అయ్యింది. “ఐ విల్ టాక్ టు దినకరన్…” అని మాట మార్చేశావు. ఇహ నీకు అక్కడ వుండడం ఇష్టంలేకపోయింది. గబగబా లంచ్ ముగించి బయటకొచ్చేశావు. దినకరన్ నీ పట్ల ఎందుకు అలా ప్రవర్తించాడో పూర్తిగా అర్థమయ్యింది. మాస్టారు చిన్నప్పటి సంగతి చెప్పుంటారు. మాస్టారి అమ్మాయి కూడా నీ గురించి ఎక్కించుంటుంది అని నీకు రూఢిగా నమ్మకం కుదిరింది. మాస్టారికి ఈ తమిళ అల్లుడు ఎక్కడ దొరికాడా అన్న అనుమానం వచ్చింది. దినకరన్ నిన్ను లే-ఆఫ్ చేయడానికి నికార్సైన కారణం కనిపించింది. దినకరన్‌తో అయిదేళ్ళుగా పరిచయం. అతని భార్య తెలుగేనని యెప్పుడూ చెప్పనేలేదు.
సరిగ్గా వారం తరువాత ఓ రోజు నీకు స్టీవ్ ఫోన్ చేశాడు. క్రితం శుక్రవారం లంచ్ తరువాత నువ్వు స్టీవ్‌ని నువ్వు కలవలేదు. ఫోన్ ఎత్తుదామా? వద్దా? అని తటపటాయిస్తూనే నువ్వు కొంత సేపు ఆగావు. “దినకరన్ నిన్న రాత్రి పోయాడట… వచ్చే సండే మెమోరియల్ అని చెప్పారు. మేం అందరం వెళుతున్నాం. కంపెనీ ప్రెసిడెంట్ కూడా వస్తున్నాడు. నువ్వూ వస్తావన్న ఉద్దేశ్యంతో చెబుతున్నాను.”
దినకరన్ పోయినందుకు నీకేరకమైన ఫీలింగూ లేదు, నీకు అన్యాయం చేశాడన్నది ఒక్కటీ తప్పించి. దానిక్కూడా నీకు కారణం వుంది. మామూలుగా అయితే మెమోరియల్‌కి వెళ్ళేవాడివే. ఇప్పుడు మాస్టారు కూడా అఘోరించాడు. వెళ్ళాలనిపించడం లేదు. అనిపించడం కాదు; వెళ్ళాలనే లేదు.
“స్టీవ్! సండే వేరే ప్రోగ్రామ్ ఉంది…”
“బావుండదు, నువ్వు రాకపోతే… కమాన్! ఎంత లేదన్నా నువ్వూ, నేనూ, దినకరన్ ఆరేళ్ళకు పైగా కలిసి పనిచేశాం. ఈ మధ్య అయితే నీకు అతనితో తేడా వచ్చింది కానీ, ఇంతకుముందు ఫ్రెండే కదా.”
నువ్వు నీ చిన్నప్పటి సంగతి చెప్పావు. మాస్టారు నీమీద కక్ష కట్టారనీ, అది దినకరన్ అమలు చేసి నిన్ను లే-ఆఫ్ చేశాడని మనసులో ఉన్నది కక్కేశావు. స్టీవ్ నువ్వు చెప్పినదంతా ఓపిగ్గా విన్నాడు.
“నీకో విషయం చెప్పాలి. నువ్వు అనవసరంగా దినకరన్‌ని తప్పు పడుతున్నావు. నువ్వు లే-ఆఫ్ అవ్వడానికి కారణం దినకరన్ కాదు, నేను. ఇందులో దినకరన్ ప్రమేయం ఏమాత్రమూ లేదు. నిజానికి దినకరన్ లిస్టులో డేవిడ్ ఉన్నాడు. అది నాకు తెలిసి, నేనే వైస్ ప్రెసిడెంట్‌ని కలిసి అతన్ని సేవ్ చెయ్యమని చెప్పాను. అతనికి ఉద్యోగం అవసరం. కూతురికి క్యాన్సర్. ఉద్యోగం పోతే అతని పరిస్థితి దారుణంగా ఉంటుంది. అది నాకు తెలుసు. ఏవో కొన్ని పోస్టులు తగ్గించమని పైవాళ్ళ నుండి ఆర్డర్స్ట. నేనే మన వి.పి.ని కన్విన్స్ చేశాను. ఎందుకంటే నీకు ఉద్యోగం ఇట్టే వస్తుంది. నువ్వు స్మార్ట్. కానీ డేవిడ్ అలాక్కాదు. ఇప్పుడు చెప్పు. నువ్వు తిట్టాల్సింది నన్ను. దినకరన్‌ని కాదు. నువ్వు మెమోరియల్‌కి వచ్చినా రాకపోయినా ఎవరికీ నష్టం లేదు. ఇప్పుడు అంతా విన్నాకా నువ్వు నన్నొక రేసిస్ట్ అన్నా ఆశ్చర్యపోను. యూ నీడ్ టు గ్రో అప్. బై!”
నీ నోట మాట లేదు. స్టీవ్ ఏదో కట్టుకథ అల్లాడనిపిస్తోంది నీకు. నమ్మబుద్ధి కావడంలేదు. స్టీవ్ నా లే-ఆఫ్‌కి కారకుడా? అన్నదే నమ్మబుద్ధి కావడంలేదు. మనుషులు ఎందుకింత కాంప్లెక్స్‌గా ఉంటారో బోధపడడం లేదు నీకు. పరవాలేదు. మెల్లగా నీక్కావల్సిన రీజనింగ్ నువ్వు వెతుక్కోగలవు. ఇలాంటి సమయంలో స్టీవ్‌ని కలవడం కూడా ప్రస్తుతం నీకిష్టం లేదు. ఇప్పటికేనా, ఎప్పటికీనా అన్నది చెప్పలేవిప్పుడు.
దినకరన్ మెమోరియల్. వెళ్ళడమా, వద్దా? అహం అడ్డొస్తోంది. వెళ్ళకపోతే అందరూ తప్పుపడతారు. వెళితే నీ అహం దెబ్బతింటుంది. వెళ్ళకపోతే ఏమీ కాదు. వెళితే మాస్టారు ఏడవడం కళ్ళారా చూడచ్చు. ఏడుపు లేకపోయినా, కనీసం బాధైనా కళ్ళారా చూడచ్చు.
ఇంటికెళ్ళాక నువ్వు మీ ఆవిడకి చెప్పావు, ఆదివారం చూడ్డానికి వెళ్ళాలని; నీ వుద్యోగం పోవడానికి కారణం స్టీవ్ అన్న సంగతితో సహా.
అంతా విని నీ భార్య అన్నమాటలు కలుక్కుమని గుచ్చుకున్నాయి నీకు.
“మనుషులు ఎందుకింత కాంప్లెక్స్‌గా ఉంటారండీ?”