నో-బుల్ బహుమతి

పుస్తకాలు చదివినందుకే
ఒకే ఒక్క నో-బుల్‌ బహుమతి.
నాకే ఇవ్వాలి ఆ నో-బుల్‌.

నన్ను మించి మిన్ను దాకు
ఉదాత్తుడూ పాఠకుడూ
దొరకడెపుడు మీకెక్కడ
వెదుకుడు ఈ భువనమంత!

చదివాన్‌ నే
పాంచాలీ బృహన్నలీయం
చదివాన్‌ నే
వైదేహీ దశకంఠీయం
ఆకు రాలు కాలంలో

కుల బాధని
మా
కుల వ్యధగ
కవనించిన
వినిపించిన
కవనాలని
కనులారా
ఆరగించి
ఆరని నా కళ్ళల్లో
తీరని ఆకలి బొట్లూ
చూశాన్‌ నేన్‌.

ఆంధ్రం నుంచీ అరవంలోకీ
అరవం నుంచీ అంగ్రేజ్‌లోకీ
అనువదించిన అరాచకంపు
నవలికలన్నీ నవిలేశాన్ నేన్.

మార్కులూ, ఎంగిల్‌లూ,
మావోలూ, మిన్హాలూ
బ్రాహ్మణీయం భూస్వామ్యం
సమాజాల వాచాలం
విప్లవీకం వర్వరీయం
ఒకటేమిటి, అన్నీ అన్నీ
విన్నాన్‌ విన్నాన్‌ చదివాన్‌ చదివాన్‌!

చేతికందిన దేనినైనా
వదలకుండా చదివినాను.
చేతికందని వీధి పేరులు
చేతికందని న్యోన దీపాల్‌
బిల్లు బోర్డులు కారు ప్లేటులు,
మరుగుదొడ్డుల కుడ్యతలముల్‌
వదలకుండా చదివినాను.

పత్రికల్లో రోజువారీ
బంతులాటలు గెంతులాటలు
నిశ్చితార్థాల్‌ వివాహాలూ
అనేకార్థాల్‌ రీ-విడాకులు
చావువార్తలు పుట్టుకలునూ
ఆకారాదీ ప్రకటనలూనూ
వారఫలితాల్‌
వంటవార్పుల్‌
వదలకుండా చదివినాను.

నాబోంట్లకి మాట పునీతం
అబద్ధం ట్రంపుకీయం
నాకైతే నిరుపయోగం!

అష్టాదశ అధికార్లూ
అశ్రద్ధా చేయకుడీ
నిర్దయాత్మకుడిని నేను
ప్రతి ఒక్కటీ చదువుతాను
వాతావరణం, విపణివీధీ
వర్గీకృతప్రకటనలన్నీ!

అయితే, ఇప్పట్లో
అంతగా చదవటల్లా!
తగిన సమయం
దొరకటల్లా!
నిజంగా నిజంగా
అది ఒక కారణం.
పోతే,
చదువుల్‌ నేర్చిన పండితాధములు స్వేచ్ఛా భాషణ క్రీడలన్‌
వదరన్‌ సంశయ భీకరాటవుల త్రోవల్దప్పి వర్తింపగా, —
చెదరుచిత్తమున నేనేమి సేతు గురునాథా, అని వాపోతిన్‌
అది మరో కారణం!

కానీ, ఇదివరకే
ఎంత చదివి పారేశానో!
అంతు తెలీదు, నాకే!

అందుకనే
మరీ మరీ చెప్తున్నా
చదివినందుకు
నో-బుల్‌ పురస్కారం
త్వరగా త్వరత్వరగా
సాధ్యము కానంత త్వరగా
నాకివ్వండని చెపుతున్నా!
Amen.


[చిలీ దేశపు కవి నికానోర్ పఱ్ఱా (Nicanor Parra, 1914-2018) ఆంటి-పోయెమాస్ అనే ప్రతికవితలకు ప్రసిద్ధుడు. అతని ప్రతికవిత ఎల్ ప్రెసియో దె నోబెల్‌కు ఇది తెలుగులో నా తిరిగిసేత. – వేవేరా.]