నాకొక్కటివ్వవా…
ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత
చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన
ఈ మసకలోంచి చూసినవన్నీ చూసినప్పుడల్లా
కుదుపుతూనే కదుపుతూనే ఉన్నాయనుకో
ఐనా ఒకప్పుడు చూర్లకిందా వరండాల్లోనూ
కుడుతున్న దోమల్ని తోలుకుంటూనూ
వంటింట్లో వాసనల్ని పోల్చుకుంటూనూ
మమతలు మెలిబెట్టుకోలేదా
మో మన మాటల్లో దొర్లాడా లేదా
విప్పిన మనసులొకటయ్యాయి కదా
చప్పున ఆశలెగిరాయి కదా…
అప్పట్లో
ఆరిన తడి తుడిచిందీ
ఏడ్చి మెచ్చుకుందీ
మెచ్చినట్టు ఏడ్చిందీ
నువ్వేనని తెలిసినా పర్లేదులే
ఇప్పట్లో…
కొంచెం తుళ్ళి కొంచెం మళ్ళి
కొంచెం నువ్వంటే తెలిశాక మరి కొంచెం వెనక్కెళ్ళి
అలలన్నీ ఆపేసి చేతలన్నీ చెరిపేసి
మామూలుగానే తింటో తాగుతో తిరుగుతో అరుగుతో
కళ్ళవెనుక చూపు మందగించినా పైకి
పళ్ళబిగువున భలేగా నవ్వుతో భరిస్తో
మిత్రమా –
తెరిచిన ముడులు బిగిసేనా
దూసిన మాటలు చెదిరేనా…
నవ్వులు నిండేనా దుఃఖపు దోసిట్లో?