మూడు ముక్కలు

బస్సు–సమాజం

సమాజ స్వరూపాన్ని అర్థంచేసుకోవడానికి బస్సు బాగా ఉపయోగపడుతుంది.

బస్సులో రకరకాలవాళ్ళు రకరకాల దశల్లో ఉంటారు. కొందరు తృప్తిగా కూర్చునివుంటారు. కొందరు బార్లా చాపుకుంటారు. ఒకచోట ముగ్గురు మనుషులు రెండు సీట్లలో సర్దుబాటు చేసుకుని కూర్చుంటారు. కొందరు సీటు దొరక్క నిరాశతో ఉంటారు. ఒకచోట ఖాళీ అవడంతో ఒకరికి అనుకోకుండా సీటు దొరుకుతుంది. ఒకరికి సీటు ఉన్నప్పటికీ అది విండో సీట్‌ అయ్యుండదు. ఒకరు ఉన్న సీటునుంచి, ఖాళీ అవగానే ప్రయత్నం మీద విండోసీట్లోకి మారుతాడు. ఒకరికి దొరకడం దొరకడమే విండోసీటు దొరుకుతుంది. ఒకరు ఎత్తేస్తోందని ముందుకు వెళ్తారు. ఒకరు ఖాళీ అవబోయే సీటు పక్కనుండి కూడా దొరికించుకోవడంలో విఫలం అవుతారు. ఏ కారణం వల్ల ఒకరు దిగుతారో, మరే కార్యం కోసం మరొకరు ఎక్కుతారో సహప్రయాణీకులుగా అర్థం చేసుకోలేం. వీళ్ళకు ఏ మేరకు ఇది గమ్యమో, గమ్యం కోసం మధ్య కేంద్రమో తెలియదు. వీళ్ళు అటునుంచి ఇటు వస్తున్నవాళ్ళో, ఇటు నుంచి అటు పోతున్నవాళ్ళో తెలియదు. సహప్రయాణీకుణ్ని ఎంపిక చేసుకోలేం. ఆ సమయంలో మనలాగే అతడూ అక్కడ ఉండటం కాకతాళీయత. పోతుంటే గొడవ కావొచ్చు, దవడ పగలొచ్చు, మంచి ప్రయాణీకుడు పరిచయం కావొచ్చు, మామూలుగానే జరిగిపోవచ్చు. ఒకరు నిద్రపోవడానికి మన భుజం మీద తల వాల్చొచ్చు. మనకు తెలియకుండానే ఒకరికి ప్రేమను పంచాల్సిరావొచ్చు.

(2014)

సృష్టి–ఉనికి

ఒక పెద్ద భూకంపం, నా ఊహల్లో కూడా లేనంతటి పెద్ద భూకంపం వచ్చి, ఈ ప్రపంచం తలకిందులైపోతే ఇప్పుడున్నవన్నీ అర్థం లేనివైపోతాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఐఫోన్లు, సాఫ్ట్‌వేర్లు… అప్పుడు నాలుగ్గింజలు పండించుకోవడమే ప్రధానం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ దానికనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. స్కిల్స్‌ రీడిఫైన్‌ అవుతాయి. బలంగా తవ్వేవాడే అవసరం అవుతాడు. పంట పండించినవాడే మొనగాడు అవుతాడు. అందువల్ల ఇప్పుడు గొప్పవనుకున్నవన్నీ ఉత్తవే, తాత్కాలికమే అనవలసివస్తుంది.

కానీ పంటలు పండించడం అయ్యాక, కొంత తీరుబడి దొరికాక, మళ్ళీ జనానికి కళలు, వినోదం వైపు దృష్టి మరలుతుంది. ప్రత్యేకంగా ఉండాలన్న ఉబలాటం మొదలవుతుంది. వీటన్నింటికి అనుకూలంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. దానికనుగుణంగా కొత్త ఆర్థిక వ్యవస్థ, కొత్త ఉద్యోగాలు… మళ్ళీ ఏదో ఒక కాలంలో చరిత్రలో ఉన్న దశకి ఆ దశ చేరుకుంటుంది. అంటే మళ్ళీ భూమిని, ప్రపంచాన్ని ఇప్పుడున్న రీతిలో అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఎంత తాత్కాలికమైనవైనా అందులో ఉన్న మానవ సంబంధాలూ అబద్ధం కాదు, గాఢతా అబద్ధం కాదు.

(2014)

ప్రాణవాయువు

పొద్దున లేవగానే హరి అలవాటుగా ఇంటి వెనకాల ఐమూలగా ఎర్రటి, పచ్చటి ఆకులతో నిటారుగా కనబడే బాదంచెట్టును చూస్తాడు. ఆ చెట్టుకు ఆనుకొని ఉన్న మొదటి అంతస్తులో ఒక బక్కముఖపు నల్ల భుజాల మెడిసిన్‌ పిల్ల ట్రాకుప్యాంట్లో పుస్తకం పట్టుకుని అటూ యిటూ తిరుగుతూ చదువుతూ ఉంటుంది.

టీ తాగాక హరి, బుజ్జిదాన్ని చిటికెనవేలు పట్టుకోనిచ్చి స్కూలు బస్సు ఎక్కించడానికి మెయిన్‌ రోడ్డుకు వెళ్తాడు. మలుపు తిరిగాక వచ్చే చిన్న ఎత్తు మీదున్న ఇంటి ముందట రాత్రి రాలిన పారిజాతాలు నేలంతా పరుచుకుని ఉంటాయి. అదే సమయంలో అదే ఇంట్లో నైటీలో ఉండే కొత్తగా అయిన గుండ్రటి ముఖపు తల్లి, చిన్నారికి పొద్దుటి ఎండపొడ పడుతూ బయటికొచ్చి నిలుచుంటుంది.

సరిగ్గా వేపచెట్టుకు నాలుగు అడుగుల దూరంలో ఉన్న బస్టాపులో స్కూలు బస్సు ఆగుతుంది. బుగ్గచేతుల బ్లౌజులు వేసుకునే ‘సమయ్‌’ వాళ్ళమ్మ బస్సు వచ్చేదాకా ఆ చెట్టుకిందే వెయిట్‌ చేస్తుంది.

హరి తిరిగి వచ్చేప్పటికి తలస్నానం చేసి హరి భార్య తులసిచెట్టుకు నీళ్ళు పోస్తుంటుంది. అలవాటుగా ఒక ఆకు తెంపి నోట్లో వేసుకుంటాడు.

టిఫిన్‌ చేసి, బ్యాగు భుజాన వేసుకుని ఆఫీసుకు వెళ్ళడానికి హరి కానుగ చెట్ల వరుసను దాటుకుంటూ ఆటోస్టాండుకు వెళ్తాడు. ఒంటి జడలో ఎర్ర గులాబీ తురుముకున్న సన్న నడుము చామనఛాయ ప్రౌఢ బహుశా తనూ ఆఫీసుకే స్కూటీలో వెళ్తూ హరిని దాటేస్తుంది.

హరి ఎక్కిన బస్సులో పర్యావరణహితాన్ని కోరుతూ ప్రభుత్వం వారి స్లైడ్స్‌ ప్లే అవుతాయి. సరిగ్గా ఆ టీవీ ముందటి రెండో వరుసలో కుడి వైపు సీట్లో ఎడమవైపు కూర్చున్న జిప్పుల ప్యాంటు కాలేజీ అమ్మాయి ఎడమ కాలి పాదానికి ఎర్రటి మైదాకు పండివుంటుంది.

ఆఫీసు పనిలో తలమునకలైన హరి మధ్యలో కంప్యూటర్‌ తెర నుంచి విశ్రాంతిగా కళ్ళను కిటికీలోంచి ప్రహరీ గోడ పక్కన పరిచిన పచ్చిక వైపు సారిస్తాడు. అప్పుడే నడుం ఎత్తి స్టీల్‌ బాటిల్‌లో నీళ్ళు తాగిన ఎదురుసీట్లోని గ్రీన్‌ చుడీదార్‌ హిమబిందు మళ్ళీ మూత బిగించి, మళ్ళీ తన చూపును కంప్యూటర్‌లోకి మళ్ళిస్తుంది.

సాయంత్రం తిరుగు బస్సు ఎక్కి, ఆటోలోంచి దిగి, కాలనీ మొదట్లో పలకరించే సంపెంగపూల వాసన పీలుస్తూ ఇంటివైపు ఉత్సాహంగా అడుగులు వేస్తాడు హరి. రెండు ఇళ్ళు దాటాక, ఇంటిపనంతా ముగించుకుని, నీటుగా సింగారించుకుని కొత్తగా పెళ్ళయినట్టు కనబడే కోలముఖపు కోమలి ఫోన్లో బహుశా భర్తకు కాల్‌చేస్తూ నడుస్తుంటుంది.

భోంచేసి, కాసేపు ఎన్జీసీ చూసేసి, భార్య కూడా మురిపెంగా వింటూండగా బుజ్జిదానికి ఏడు తాటిచెట్ల కథ చెప్పి నిద్రపుచ్చేసి రోజుకు శుభరాత్రి పలుకుతాడు హరి.

వాడికి అరుణ గురించి బాధ లేదు, నీలిమ గురించి తలంపు లేదు, నవనీత గురించి దిగులు లేదు. వాడికి ప్రకృతే ప్రాణవాయువు.

వాడు నా కవల సోదరుడే. కానీ నాకు అలా కాదే!

(2018)