చతురదూతిక

చెలియా! యేమని విన్నవింతు నకటా! చేరంగరాడెందుకో
తొలి నన్నున్ మనసారఁగాఁ బువులయందుం బెట్టి పూజించుచున్
వలపుల్ గుప్పిన చంద్రవర్మ యిపుడీ ప్రాంతంబునం దుండియున్
చలివెల్గుం గన వేచు రాత్రివలె నాచందంబు నేఁడయ్యెడిన్.

అన్యదేశమునకు నంపఁబడిన నేమి
కొన్నినాళ్ళు చంద్రగుప్తుచేత
మగిడివచ్చెను గద! మాసంబు క్రిందట
కానరాడు నన్నుఁ గత మదేమొ?

మును నే నాడిన యప్పు డుజ్జ్వలరసాభోగంబుతో నాకడం
దన సర్వస్వముఁ గాన్కచేసి ప్రియుఁడై నాకంటిసన్నం బ్రతి
క్షణముం బుచ్చఁగ నెంచు వల్లభుఁ డు పేక్షంజూపు నేఁడేలకో!
క్షణముల్ కల్పము లయ్యెఁ దద్విరహసంజాతార్తి నాకియ్యెడన్.

మధుమాసమందునన్ మందారవనమందు
         వెలసిన యనురాగవిహరణములు,
అబ్జాకరంబందు హంసద్వయంబట్లు
         సలిపిన జలకేళివిలసనములు,
శరదిందుచంద్రికాసంపూర్ణనిశలందుఁ
         బొనరిన వెన్నెలభోజనములు,
వలికాలమందునం జలిబాధ నపయింపఁ
         గూడిన గాఢోపగూహనములు,

లీలఁ బరియాచకములాడు వేళలందు
వ్రాసియుండిన యన్యోన్యవర్ణచిత్ర
లేఖనంబుల నర్మంపురేఖ లిపుడు
తలపునకు రావొ, రాడేల తరుణి యతఁడు?

వేశ్యనయ్యును వాని కర్పించియుంటి
నాదు మనమును, గాన నో నళిని! నీదు
జాణతనమును, గార్యదక్షతయుఁ జేర్చి
ఎటులనైనను గొనిరావె యిటకు నతని.

అనఁగ ననియెను నళిని యథార్థ మెరిగి
అమ్మ! మీ యమ్మ ప్రసభాన నతఁడు లేని
యపుడు గూర్చెను నిన్ను ధనాఢ్యుఁడైన
కనకగుప్తునితోడ నా కదియె తన్ని
రాదరణహేతు వౌనేమొ యనుచుఁ దోఁచు.

తరుణినిఁ, జంద్రవర్మకు హృదర్పణచేసినదానినిం, ధనా
దరణముచే నతండు సవిధంబుననుండని వేళఁ దల్లి శ్రీ
గురుత వహించు నా కనకగుప్తుని కగ్గము సేసె నందుచేఁ
దఱుగఁగఁబోలు నాతనికిఁ దత్పరతాప్రియతానుభావముల్.

గోడలకుఁ గూడ చెవులు, చక్షువులు నుండు
నందు రందుచే నిది వీనులందు సోఁకి
యుండు నందుచే నతఁడు రాకుండు నిపుడు
ఛలముచే నినుఁ జూడంగఁ జంద్రవదన!

అనెడు నళినికిఁ దరళిక యనియె నిట్లు
చతురదౌత్యమునందు నిష్ణాత వీవు,
చంద్రవర్మకుఁ దెల్పి నా చందమెల్ల
సుప్రసన్నునిఁ జేయవే సుందరాంగి!

అతనికి వేణుగానమున నాదర మెచ్చని నేను జేసితిన్
సతతము నాదసాధనను, సంతసమారఁగ నేటిరాత్రి నా
యతనము నెల్ల శ్రోతయయి సార్థకముం బొనరింప రమ్మటం
చతనికిఁ దెల్పి తోడ్కొని రయమ్మున రాగదె యేఁగి వేగమే!

తల్లి నిర్బంధమున కేను దాళలేక
ఇంచుకించుకయే కటాక్షించి యుంటిఁ
గనకగుప్తునిఁ, గాని నిక్కముగఁ జంద్ర
వర్మయే మదీయమనోబ్జపద్మహితుఁడు.

సుందరదూతికాకృతియు, సొంపిలు మాటల తీరు, చంద్రికా
సుందరమందహాసమును శోభిలు నిన్గనినంతనే రస
స్యందము గాకపో దతని స్వాంతము, తద్విధి నార్ద్రమైన యా
డెందము కెక్కునట్లు బ్రకటింపుము నాదగు సుప్రలాపమున్.

ఇంద! కైకొను మిదె నా యెడంద నున్న
‘తరళికా’నామసంయుతతరళసహిత
తారహారము, దీని సందర్శనమున
మొదటికూరుము లతనిలో మొలకలెత్తు.

అనుచుఁ దరళిక చెలిని దూత్యంబు సేయ
నొడఁబరచి చీరలును, బైఁడితొడవు లొసఁగి
యంప నామెయు నవ్వాని నవధరించి
పొలిచెఁ బూర్ణపుష్పితవసంతలతవోలె.

నిగనిగన్నిగలాడు నీలకేశములందు
         బొండుమల్ల్లెల విరిదండఁ బొదివి,
అర్ధచంద్రునిఁ గేరు నలికభాగమునందు
         రక్తచందనపుఁజిత్రకముఁ బెట్టి,
కనకంపుజిగి మీరు గండద్వయమునందు
         నెఱ్ఱగొజ్జగిరస మింత బూసి,
గిరిశిరంబులఁ దోఁచు మెఱుపుతీవెలచంద
         మురమందు ముత్యాలసరులు దాల్చి

కనకలతికలఁ బోలెడు కరములందు
స్వర్ణకంకణంబులు వెట్టి, కర్ణములను
వజ్రకర్ణికలను బెట్టి, వలిపచీర
గట్టి, తొడి వచ్చె తరళిక కడకు నళిని.

ఏమె! జ్యోత్స్నాభిసారికాకృతినిఁ బూని
మెఱయుచుంటి విందున మర్మమేమి? యనుచు
నర్మగర్భితంబుగఁ బల్కె నళినిఁ గాంచి
తరళికాకాంత యాశ్చర్యభరిత యగుచు.

అతని రాతిడెందము రసస్యంద మగును
నిన్నుఁ గాంచిన నంటివి నీవె మున్ను!
అందుచే నిట్టి వేషంబు నొందియుంటి,
నీదు మేలు గాదటె చెలి నాదు మేలు?

ఐన మఱవకుము మననెయ్యంపుమాట!
అతని డెందంబుఁ గరగించి యతనుబాణ
హతికి గురిచేసి తెమ్ము నీ చతురమతియు,
వాఙ్మధురిమయుఁ బణమొడ్డి ప్రాభవమున!


అయ్యది పూర్ణిమారజని, యత్తరిఁ బిల్లనగ్రోవి నూదుచున్
శయ్యకు చేరువం గల ప్రశస్తసువర్ణమయాసనస్థితుం
డయ్యెను చంద్రవర్మ, యపు డాతనిసమ్ముఖమందు నిల్చె నో
తొయ్యలి, పూర్ణిమానిశయె తొయ్యలియై చనుదెంచెనో యనన్.

తెల్లనిచీరఁ గట్టి, కడుతెల్లని మల్లెలు వెట్టి కొప్పునన్,
తెల్లని చంద్రరేఖవలెఁ, దేటనదింబలె సంస్మితాస్యయై,
తల్లడసేయు చుల్లమును తన్నిశయందు సమక్షమందు శో
భిల్లెడు సుందరాంగిఁ గని, పిల్లనగ్రోవిని నాపి యాతఁడున్.

ఓహొ! నళినివా? యేతెంచియుంటి విటకు,
ప్రకటమైన జ్యోత్స్నాభిసారికయుఁ బోలె,
ఏమి నీయాన చెప్పవే యిందువదన!
యనుచు నాతండు నిలుచుండె నామె చెంత.

తోడితరుణుల మనములఁ గూడ సపది
జనితసమ్మోహవశముగ సల్పఁదగిన
యామె యాహార్యమును రూపు నరయు నతని
డెందమందున మోహంబు కందళించె.

స్వామి! నీకుఁ బ్రియతమ, నీ స్వాంతనీర
జాతవికసనకారిణి, స్వాంతమందు
నున్నదానినిఁ బ్రకటింప నన్నుఁ బంపె;
వినఁగఁ దగునిదె తరళిక విన్నపంబు.

అన్యదేశంబునందున నధిపుపనుపుఁ
దీర్చివచ్చిన దాదిగఁ దిరిగి చూడ
రైతి రిటువైపు; ప్రణయంపురీతి యగునె
రమణి నిట్టుల నెడసేయ రసికవర్య!

అస్వతంత్రను, గణికను, నబల నేను
ధనవిలోభముచేత మజ్జనని గూర్చు
తగులములయం దొకింతగఁ దగులనోపు;
దాని పెనుమచ్చగాఁ జేయఁదగదు మీకు.

రోహిణియం దతిరాగస
మాహితుఁడైన శశివలె మదాహ్వానంబున్
స్నేహాతురచిత్తముతో
నూహించి ప్రియంబుసేయు టొప్పగు మీకున్.

చెప్పెడిదేమి మీదుపదసేవకె యీనిసి వేచియుంటి, మీ
రెప్పుడు వత్తురో యనుచు నెప్పుడు దారులు సూచుచుంటి, మీ
కొప్పగునంచు నెంతొ శ్రమకోర్చి పసందగు గానమాధురుల్
చిప్పిలు నాదపాఠములఁ జెప్పితి నే సుషిరంపుయోషకున్.

కావున వల్లభా! ప్రణయకౌతుక మొప్పఁగ రమ్ము నాదు లీ
లావనమందుఁ బార్వణకలానిధికాంతులు బర్వుచుండ స
ద్యోవికచోత్పలప్రభల నొప్పు సరోవరతీరమందు ప్రే
మావహమైన నా సుషిరమంజులనాదపువిందుఁ గ్రోలఁగన్.

అనుచుం దరళిక పనుపున్
వినిపించెడు దూతిసౌరు వివశుండై క
న్గొనుచుం బ్రతిమాకృతి ని
ల్చెను నిశ్చలముగ నతండు చిత్తజహతుఁడై.

మేలగు జాళువామిసిమి మీరెడు దేహము, దేహమందునం
దేలెడు శారదాభ్రమటు దీప్తిలు పల్చని చీరయు, చీరలోపలం
గ్రాలు మృదంగసౌష్ఠవముఁ గాంచుచు నాతఁడు చేష్ట దక్కి యు
ల్లోలతరాంతరుండు, నవిలోలవిలోచనుఁ డయ్యె నత్తఱిన్.

అమృతముచందము, సద్య
స్సుమసంయుతచంపకలతసొబగున, నళినీ
కమనీయాకృతి యాతని
కమితంబగు మోహశబలతాకర మయ్యెన్.

ఆమె సౌరును గనుచుండ నామె పల్కు
వాక్యము లతనికిం దోఁచె స్వప్నమందుఁ
బల్కు పల్కులం బోలె నస్పష్టముగను;
ఐన స్పష్టముగనె యుండె నామెరూపు.

తరళిక యన్నటు దూతిం
బరికించుచునున్న వాని స్వాంతము రససం
తరళితమయ్యెను గానీ
తరళిక మాత్ర మొనరదు తదంతరమందున్.

అతనితీరును గనుచున్న యామె తరళ
నేత్రము లతని కనులతో మైత్రి నెఱపె;
అంత మందాక్షమందాక్ష యగుచు నామె
వెన్కవెన్కకు తగ్గుచు వెడలసాగె.

ఆ ప్రయత్నమునందామె యంఘ్రుల కెదొ
యొరసినట్లయ్యె నందుచే నొరిగె నామె
ముందునకు, నంతలో నామె చంద మెఱిగి
సందిటం బొదివె నతండు సరభసమున.

సద్యోజాతంబగు రా
గోద్యోతనమున నతఁడు తదుజ్జ్వలగాత్రిన్
విద్యుల్లతికను మేఘుఁడు
హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్.

అదటున నాతఁ డా యువతి నక్కునఁ జేర్పఁగ నామె ముందుగా
నదవదఁ జెందినట్లు ముఖమందుఁ ద్రపాకలితానుభావముల్
విదితము సేసెఁ గాని పయి వెచ్చని తత్పరిరంభణంబులోఁ
బొదలెడు భూరిసౌఖ్యరసము న్మదిఁ గ్రోలఁగసాగెఁ బెల్లుగన్.

అట్లు పారవశ్యము నంది యతని బాహు
బంధమునఁ జిక్కుకొని యుండఁ బాసె కొన్ని
క్షణము, లంతలో మైకంబు సనఁగ నామె
బాహుబంధము వీడి పార్శ్వమున నిల్చె,

అట్టు లుద్బుద్ధచిత్తయై యలరు నామె
నాత్మయందుఁ దరళికాహితార్థఘటన
పటుసమాలోచనస్థితి వ్యక్తమయ్యె,
మేఘమందునఁ దోఁచు క్రొమ్మించువోలె.

అంత నాయింతి మృదుహాసమాస్యమందు
తొనఁకుచుండఁగ నాతనిఁ గనుచుఁ బలికె
అవసరోచితసందేశ మమరునట్టి
మృదులవాక్సరణి యెసకమెసఁగ నిట్లు.

ప్రేమము మీరఁగా నవశిరీషముఁ బోలిన కోమలాంగమున్
గోముగఁ జేర్చుచుం దరళికోత్పలగంధి వసింప నర్హమౌ
మీ మృదువక్షమందు రహిమీరఁగ నుండఁగ నాదుబోంట్లకున్
సేమము గాదు, మీకు నిది సేమము గాదని నేఁ దలంచెదన్.

కాదు మగనాలు తరళిక గణిక గాని,
జనని బలవంతమున నామె కనకగుప్తు
నాదరించినదని మీర లాగ్రహింతు
రైనఁ గనుడయ్య! మీదుచెయ్దమును నిపుడు.

ముసరుకొన్నట్టి యళిచేత మసకబారె
నీదుమో మని సుందరేందీవరంబుఁ
ద్యక్తమొనరింపఁ దగునె యత్యక్తమైన
మచ్చ గల్గిన విధునకు మహినిఁ జెపుమ!

ఆమె మాటలు వినఁగనె యతని మోము
చిన్నబోయెను కొంతగ సిగ్గుచేత;
అంత నతఁడు పశ్చాత్తప్తుఁ డగుచుఁ బలికె
రేపు రాతిరి వత్తును నాపెఁ జూడ.

(* దీనికి బ్రహ్మశ్రీ పిలకా గణపతి శాస్త్రిగారి ‘దూతీచాతుర్యం’ అను కథ ప్రేరకము. కాని ఇందులోని విషయము ఆ కథకంటె భిన్నంగా నిర్వహింపబడినది.)