నాకు నచ్చిన పద్యం: తొలికోడి కూత

ఉ.    తోయజ పుష్పబాంధవుఁడు తూరుపుఁగొండకు రాదలంచె భూ
       నాయకుడున్ శకుంతల మనంబలరన్ చనుదెంచుఁ దుమ్మెదల్
       మ్రోయకుడీ శుకంబులు నెలుంగులు సేయకుడీ పికంబులున్
       గూయకుడీ ప్రమాదమని కూకలు వేసిన భంగిఁ గొక్కురో
       కోయని బిట్టు మ్రోసెఁ దొలుకోడి నికుంజ కిరీట వాటికన్

ఈ పద్యం వ్రాసిన కవి గొప్ప ఆత్మవిశ్వాసంతో ‘వాణి నా రాణి’ అని చెప్పుకున్న పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి. ఈయన వ్రాసిన కావ్యాలలో శృంగార శాకుంతలము, జైమినీభారతము బాగా పేరు పొందినవి. మన దేశానికి భారతదేశము అని పేరు రావడానికి కారణమైన వాడు, భారత యోధులైన పాండవ కౌరవుల వంశంలోని ఆది చక్రవర్తుల్లో ఒకడు అయిన భరతుని జననము, అతని తల్లిదండ్రుల కథ తెలిపేది శాకుంతలం.

దుష్యంతుడు శకుంతలల కథ భారతంలో సంగ్రహంగా వుంది. ఆ కథను పెంచి, కొన్ని సన్నివేశాలను కల్పించి ఒక నాటకంగా మలిచాడు సంస్కృత కవి కాళిదాసు. ఆభిజ్ఞాన శాకుంతలమ్ అనే ఆ నాటకం ప్రపంచ సాహిత్యంలో ఒక మహాద్భుత కళాఖండంగా ప్రాచ్య పాశ్చాత్య దేశాల మేధావుల ప్రశంసలు పొందింది. ఈ కథను పిన వీరభద్రుడు తెలుగులో ఒక చిన్న నాలుగు ఆశ్వాసాల ప్రబంధంగా 773 గద్య పద్యాలతో రచించాడు. భారతం లోని మూల కథను ప్రధానంగా అనుసరించాడు. కాళిదాసు చేసిన కొన్ని మార్పులనూ స్వీకరించాడు. శ్రీనాధుడు హర్షనైషధాన్ని సంస్కృతం లోనుండి తెనిగించి దానికి శృంగార నైషధమని పేరు పెట్టుకున్నట్లే పిల్లలమఱ్ఱి కవి తన శాకుంతలానికి శృంగార శాకుంతలమని పేరు పెట్టుకున్నాడు. చదువుతుంటే అక్కడక్కడా మనుచరిత్ర, వసుచరిత్ర లాంటి ప్రబంధాల పోకడలు లీలగా దర్శనమిస్తాయి. అంత మాత్రం చేత ఈయన వారిని అనుసరించాడనుకోవడం పొరపాటు. ఎందుకంటే పిన వీరన ప్రబంధ కవుల కంటే ముందరివాడు. ఈయనలో దృగ్మాత్రంగా కనిపించే ప్రబంధ లక్షణాలు అష్ట దిగ్గజ కవుల్లో పూర్తిగా వికసించాయి.

మూలభారత కథలో దుష్యంతుడు కొద్ది గడియల సేపు మాత్రమే కణ్వాశ్రమంలో ఉండి శకుంతలను లోబరుచుకొని – కణ్వ మహర్షి వచ్చేలోగా వెళ్ళిపోతాడు. కాళిదాసు నాటకంలో దుష్యంతుడు మున్యాశ్రమంలో కొన్ని రోజులుండి, మునులకు రాక్షస బాధ లేకుండా చేసి, శకుంతలతో ప్రణయ కథ నడిపి వెళ్ళిపోతాడు. పిన వీరన దుష్యంతుణ్ణి చాలా రోజులు అక్కడ వుంచి – ప్రణయానికీ విరహానికీ, చంద్రోపాలంభనకూ, మన్మథుణ్ణి తిట్టడానికీ, సూర్యోదయాస్తమాల వర్ణనకూ, చంద్రోదయ వర్ణనకూ, యుద్ధ వర్ణనకూ – అన్నిటికీ అవకాశం ఆ సమయంలో కల్పించుకున్నాడు. అలాంటి ఒక పట్టులో, వేకువ జామున తొలికోడి కూసే వైనాన్ని అందంగా వర్ణించే ఘట్టం లోనిది పై పద్యం.

సూర్యోదయాన్ని వర్ణించే సందర్భంలో తొలికోడి కూత కూసే సందర్భాన్ని చాలామంది కవులు వర్ణించారు గాని, బసవపురాణంలో పాల్కురికి సోమన వర్ణించినంత స్వభావోక్తి రమ్యంగా ఎవరూ వర్ణించలేదనే చెప్పాలి. అయితే అది ద్విపదలో వుంది. బహుశా ద్విపదలో వ్రాసినందుకే ఆ చోట ఆ అందం వచ్చి వుండవచ్చు. సరే, అది విషయాంతరం. ఇక మన పద్యానికి వస్తే దుష్యంతుడు శకుంతలకు, “సుతుడుదయించు పుణ్యమేను జేసిన, నతని నా యేలు సకల సింధునేమికి యువరాజు జేయువాడ” అని, “కుధర కన్యానాధ కోటీర రత్నంబు చంద్రుండు మా కులస్వామి సాక్షి” అనీ, వాగ్దానం చేసి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆమెను పల్లవ తల్పం మీదకి చేర్చబోతుండగా రక్కసుల రణభేరి వినిపిస్తుంది. ఇక ఆమె నక్కడే విరహంలో వదిలివేసి యుద్ధానికి వెళ్ళిపోతాడు. యుద్ధంలో రాక్షసులను జయించి – ఇక తిరిగి రాబోతున్నాడనంగా – ఆ వేకువన తొలికోడి కూసిన సందర్భం పై పద్యం.

కోడి కూయటం ఎలా ఉందంటే – తోయజ పుష్ప బాంధవుడు – సూర్యుడు ఉదయించ బోతున్నాడు. శకుంతల హృదయం సంతోష పడేటట్టుగా దుష్యంతుడు కూడా రాబోతున్నాడు. ఎవ్వరూ గొడవ చెయ్యకండి. తుమ్మెదలారా, మీ ఝుంకారాలు ఆపండి. చిలకల్లారా, సవ్వడి చేయకండి. కోయిలలారా, మీ పాటలు కట్టిపెట్టండి. లేదా, ప్రమాదం! జాగ్రత్త! అని ఆయా పులుగులను గద్దిస్తున్నట్లుందిట – ఆ ప్రశాంత నిశాంతంలో – ఆ పొదరింటి కుటీర ప్రాంతంలో కొక్కొరొకో అని కోడి కూసిన శబ్దం. మంచి కల్పన. తిర్యక్కులు కూడా దుష్యంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పడం రమ్యంగా ఉంది. మ్రోయకుడీ, సేయకుడీ, కూయకుడీ అని పాదపాదంలో పొదిగేసరికి పద్యం అందగించింది. ఒక వ్యర్థపదం కూడా లేకుండా మంచి ధారతో సాగిందీ పద్యం.

అయితే ఈ ఉత్పలమాలను మామూలుగా నాలుగు పాదాల్లో కాకుండా అయిదు పాదాల దాకా సాగదీశాడు కవి. సాగదీశాడు అనడం కూడ న్యాయం కాదేమో. అదే భావం, నాలుగు పదాల్లో అయితే ఇరికించవలసి వచ్చేది. అప్పుడు అందం కుదించినట్లయ్యేది. విశాలంగా స్వేచ్ఛగా వ్రాయడానికి ఐదు పాదాలలో వీలయి పద్యం సుఖంగా నడిచింది. నాకు ఇంకో రకంగా కూడా అనిపిస్తున్నది. తుమ్మెదలు, శుకాలు, పికాలు, ఇవన్నీ మన్మథుని పరికరాలు. ఒక వైపు మన్మథుడు శకుంతలను నానా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇక్కడ ఆయన పరివారమంతా నానా రొద చేస్తున్నది. అందుకని కవికి ఒళ్ళు మండి తొలికోడి చేత పంచబాణుని పరివారాన్ని పంచపాదాలలో గదమాయించడమూ బాగానే ఉంది.

భారత భాగవతాలు, నైషధము, మనుచరిత్రాదుల వరకే వచ్చి ఆగిపోతారు చాలామంది చదువరులు. అంత ప్రాచుర్యం లేని కావ్యాల జోలికి పోరు. కానీ అలాంటి వాటిలో కూడా చక్కని కల్పనలు, చక్కని పద్యాలు వుంటాయి. పిల్లమఱ్ఱి పిన వీరన ఉపేక్షించదగ్గ కవి కాడు. “అనటి పండొల్వనేటిని నినుపగోరు?” “తోటకూరకు చంద్రహాసము తెత్తురే?” లాంటి చక్కని తెలుగు పలుకుబడులు కనిపిస్తాయి ఆయన కావ్యంలో.

తొలికోడి ముచ్చట వచ్చింది కాబట్టి, పైన పాల్కురికి సోమనను తలుచుకున్నాం కాబట్టి, ఆయన వర్ణించిన తొలికోడి కూసే సంరంభం కూడా చిత్తగించండి.

తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి
జలజల రెక్కలు సడలించి నీగి
గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీఁకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడ సాచి నిక్కి మిన్సూచి
కొక్కొరో కుఱ్ఱని కూయకుమున్న!