చాలామందిని చనిపోయిన తరువాత, మృతజీవుల క్రింద పరిగణించి మర్చిపోతాం. కానీ కొంతమందిని మృతజీవులైనా సజీవులగనే లెక్క వేస్తుంటాము. అటువంటి వారు చరిత్రలో బహు కొద్ది మంది. ఒక్కొక్క కాలం, ఒక్కొక్కరకపు తత్వవేత్తలను, విజ్ఞానవేత్తలను, కళాభిజ్ఞులను సృష్టిస్తుంది. కొంతమంది అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శాంతిని ప్రసాదించేందుకు జనిస్తే, మరికొంతమంది శాంతంగా వున్న కాలంలో సంచలనాన్ని ఉత్పన్నం చేసేందుకు ఉద్భవిస్తారు. కాని విచిత్రం, ఇవన్నీ కాలగర్భంలో కలిసి పోయేవే. గతంలో జరిగిన మంచైనా, చెడైనా భావికి అండగా ఉండడం సహజం. ఇటువంటి సమయం ఒకసారి చిత్రకళా రంగంలో కూడా వచ్చింది.
సూర్యోదయం (సొలే లెవాఁ)
క్లాడ్ మొనే (1873) ఇంప్రెషనిస్ట్ చిత్రం
అప్పటివరకు కడుపులో నీళ్ళు కదలకుండా మెత్తని సోఫాలో కూర్చుని, చూస్తూ ఆనందించవలసిన నున్నటి ఫోటోగ్రాఫుల వంటి చిత్రాలను, ఇంప్రెషనిౙమ్ (Impressionism) చిత్రాలు వచ్చి ఆటంబాంబులా తుడిచివేశాయి. మొనే (Claude Monet) ‘సూర్యోదయం, ఒక జ్ఞాపకం (Impression, Soleil Levant)’ అని పేరు పెట్టాడు ల హావ్రే (Le Havre) పట్టణంలో చిత్రించిన చిత్రానికి. దానితో ఇంప్రెషనిౙమ్ అనే పేరు ఆ రకమైన చిత్రకళకు వచ్చింది. ఈ పద్ధతిలో ముఖ్యంగా, చూచిన దృశ్యం ఒక క్షణంలో తమపై వేసిన ముద్రను అంతే సహజంగా చిత్రించడానికి ప్రయత్నిస్తారు, ఆ క్షణంలో కదిలే వెలుగునీడలు, మెదిలే రంగులలోనే. ప్రజలు, విమర్శకులు ఈ క్రొత్త కళారంగాన్ని జీర్ణం చేసుకునే లోపునే సెజాన్ (Paul Cezanne) ఒక కొత్త పద్ధతిని, క్యూబిౙమ్ విత్తనాన్ని నాటి మరణించాడు. దీనితో వచ్చిన ప్రళయం కళారంగంలో, అసలు కళాపద్ధతినే మార్చివేసింది. ఒక విధంగా చెప్పాలంటే నేడు ఉన్న అనేక రకాల చిత్రకళా పద్ధతులకు మూలం సెజాన్ పద్ధతే.
సెజాన్ చనిపోయిన తరువాత 1907లో పారిస్‌లో, ఆయన చిత్రాలన్నీ కలిపి, పెద్ద ప్రదర్శన జరిపారు. సెజాన్ బ్రతికి వుండగా మిత్రుడు ఎమీల్ బెర్నార్డ్‌కి (Emile Bernard) వ్రాసిన ఉత్తరాన్ని కూడా ప్రచురించారు. అందులో సెజాన్ అంటాడు: ” లోగడ నేను చెప్పినదాన్ని మరలా ఒకసారి చెపుతాను. ప్రకృతిని గోళాకారము, వర్తుల స్థంభాకారము, కూచి ఆకారములలో చూచినట్లైతే, ప్రకృతి ప్రభావ సిద్ధమా అన్నట్లు, భూమికి సమానాంతరముగ ఉన్న రేఖలు వెడల్పును, నిలువుగ ఉన్న రేఖలు లోతును కల్పిస్తాయి. నిజానికి ప్రకృతి భూమిపై కంటే భూమి లోపలనే ఎక్కువగా ఉంది.”
వస్తువులను, ప్రకృతిని గోళాకార, స్తంభాకార, కూచి ఆకారాలలో చూచి చిత్రించే పద్ధతిని, పాబ్లో పికాసో (Pablo Picasso), జ్యార్జ్య్ బ్రాక్ (Georges braque) ఎంతో దీక్షగా కొనసాగించారు. అప్పటివరకు చిత్రిస్తున్న ఆకారాన్ని విధ్వంసం చేసి, ఒక క్రొత్త పోకడలో చెప్పారు. దాని వలన వారు చిత్రాలలో కావలసిన వివిధ కోణాకారాలను తేగలిగారు. అందుకే ముఖ్యంగా ఈ క్రొత్త చిత్రకళారంగంలో పికాసో, బ్రాక్‌లు జంటగా నిలుస్తారు.
ప్రపంచాన్ని తన చిత్రాలతో మైమరపింపజేసిన బ్రాక్ (Georges Braque) 31 ఆగస్ట్ 1963న, తన 81వ యేట పరమపదించారు. ఈ వార్తను ప్రపంచం లోని అన్ని రేడియోలు, పేపర్లు ప్రకటించాయి. పారిస్ నగరం మొత్తం దుఃఖించింది. అంతటి వ్యక్తి సాధించిన విషయాన్ని, ఆయన జీవితాన్ని, సాధ్యమైనంత వివరంగా తెలుపుతాను.
జ్యార్జ్య్ బ్రాక్ (1882- 1963)
బ్రాక్ 1882 మే నెల 13వ తేదీన అర్జంటీల్ అనే పట్టణంలో జన్మించాడు. ఇది పారిస్ నగరానికి చాలా దగ్గర. తండ్రిది ఇండ్లకు రంగులు వేసే వృత్తి. తరువాత చిన్న షాపు స్వంతంగా పెట్టి రంగులు అమ్మేవాడు. బ్రాక్ తండ్రితో పాటుగా వెళ్ళి ఇండ్లకు రంగులు వేసేవాడు చిన్నతనంలో. తండ్రికి ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల గారాబంగా పెరిగాడు. చిన్నతనంలో మంచి హుషారైనవాడు. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు రఊల్ డఫీ (Raoul_Dufy) సోదరునితో కలిసి తరచుగా తిరిగేవాడు. ఫ్లూట్ నేర్చుకున్నది కూడా ఇతని వద్దనే. అంత సరదా ఐనవాడు తర్వాత తర్వాత ఎందువల్లనో అంతగా అందరితో తిరిగేవాడు కాదు. చివరి దశలో అసలు దాదాపు ఇల్లు వదిలి కదిలేవాడు కాదు. దగ్గరగా ఉన్న చిత్రకళాశాలలో కొంతకాలం కళాభ్యాసం చేశాడు. బ్రాక్‌కు ఎనిమిదవ యేడు వచ్చేసరికి తండ్రి ల హావ్రే వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే బ్రాక్ కొంతకాలం, రంగులు వేసే మరొకతని వద్ద పనిచేశాడు. తండ్రి వేసే పద్ధతుల్ని, ముఖ్యంగా, పాలరాతి లాంటి రంగుల్ని వేయడం, రాతిలో చారలను చూపడం లాంటి ట్రిక్కులని, అవి సరదాగా ఉండడం వల్ల, ఎంతో జాగ్రత్తగా నేర్చుకున్నాడు. ఈ పద్ధతులను తర్వాత తర్వాత తన స్టిల్ లైఫ్ చిత్రాలలో విరివిగా చూపించాడు. అంతగా చదువుపై శ్రద్ధ ఉన్నట్లు, చదివినట్టు కనిపించదు.
1900వ సంవత్సరంలో పారిస్‌కి వచ్చి స్థిరపడ్డాడు. చిత్రకళాశాలలో, స్టూడియోలలో, ఎకాడమీలలో తిరిగి ఎంతో అనుభవాన్ని సంపాదించాడు. అసలు బ్రాక్‌కు అదృష్టం అతని కున్న స్నేహితుల వల్ల వచ్చింది. ఈనాటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులందరూ అతనికి చిన్ననాటి స్నేహితులు. వారందరూ కలిసి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే బ్రాక్‌ను కూడా కలుపుకునేవారు. అలా అందరితోబాటు ఇతను గూడా నలుగురికి తెలియడం జరిగింది. రఊల్ డఫీ, ఓథాన్ ఫ్రీష్జ్ (Othon Friesz), ఫ్రాన్సిస్ పికాబియా (Francis Picabia), మరీ లారెన్సిన్ (Marie Laurensin), ఆన్రీ మథీస్ (Henri Matisse) లాంటి వారందరూ స్నేహితులు. ఇంక అంతకంటే ఏమి కావాలి? అటువంటి వాతావరణం, అటువంటి మిత్రబృందంలో ఉండి, ఎంతో చురుకైన వాడవడం వల్ల, ఇట్టే పైకి రావడం జరిగింది.
రివర్ సెయిన్ ఎట్ షటో బ్రిడ్జ్
మరీస్ వ్లామిన్క్ (1906) ఫావిస్టు చిత్రం
1906లో జీవితంలో మొట్టమొదటి ప్రదర్శన జరిగింది. సలాన్ దె ఇండిపెండాన్స్ (Salon_des_Indépendants) అనే ప్రదర్శనను మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేశారు. అందులో ఆరు చిత్రాలను ప్రదర్శించాడు బ్రాక్. ఈ ప్రదర్శన ఫావ్ (Fauve) చిత్రకారులందరూ కలిసి ఏర్పాటు చేసింది. ఈ ఫావ్ పద్దతిలో వేసిన రంగులు, చాలా ముతకగా ఒక రంగును ఏ ఇతర రంగుతోను కలపకుండా చిత్రించినట్టుగా వుంటాయి చిత్రాలు. ఇంప్రెషనిౙమ్ పద్ధతిలోవలె గాలిలో ఎగురుతున్న చిత్రాల వలె, మంచుతెరలలో కనిపించీ కనిపించని చిత్రాల వలె, మసకమసకగా మెరిసే పద్ధతి కాదు ఇది. బలాన్నీ, ఒకవిధమైన గ్రామీణ చిత్రకళా పద్ధతిని పుణికి పుచ్చుకున్న పద్ధతి. చిత్రాలు చూస్తే మన జామినీ రాయ్ చిత్రాలవలే కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. వీరికి చిత్రంలో కాంపోజిషన్ ముఖ్యం, బలం ముఖ్యం. అంతేగానీ ఇంప్రెషనిౙమ్ పద్ధతిలోని ఆకార స్వరూపాలు కాదు. దీని వలన ఇంప్రెషనిౙమ్ కంటే ఎక్కువ సౌలభ్యం ఉంది. చిత్రీకరణలో, ముఖ్యంగా కొట్టవచ్చే రంగులలో చిత్రించే పద్ధతి బాగా నచ్చింది బ్రాక్‌కు. అందుకే ఆ కాలంలో ఎన్నో చిత్రాలు ఫావిౙమ్ పద్ధతిలో చిత్రించాడు. అతనిపై ఆ కాలంలో డఫీ, ఫ్రీష్జ్‌ల ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది.
పారిస్ వదిలి ఫ్రాన్స్‌లో చాలా చోట్ల తిరిగాడు. ఫావిౙమ్‌లో చాలా చిత్రాలు వేశాడు. ఎన్నో ప్రకృతి దృశ్యాలను ముఖ్యంగా కొండలను, సముద్రపు ఒడ్డులను, ఓడ రేవులని చిత్రించాడు. అతనిలో మరొక మార్పు తెచ్చింది మిత్రుడు డానియెల్-హెన్రీ కాన్‌వైలర్ (Daniel – Henry Kahnweiler). ఇతను క్రొత్తగా చిత్రాలను అమ్మే షాపు ప్రారంభించాడు. పికాసో, డొన్గన్ (Kees Van Dongen), వ్లామిన్క్ (Maurice De vlAminck) తదితరుల చిత్రాలను కొన్నాడు. మొట్టమొదటగా బ్రాక్ చిత్రాన్ని కొన్నది కూడా ఇతనే. తర్వాత కొన్ని మాసాలకు బ్రాక్ చిత్రాలనన్నీ కొనివేశాడట. దాన్ని బట్టి బ్రాక్ చిత్రాలు ఎలా అమ్ముడు పోయాయో తెలుస్తుంది. అదృష్టవంతుడి కింద లెక్క బ్రాక్ మిగతా చిత్రకారులతో పోలిస్తే. అతని చిత్రాలు అమ్ముడు పోకపోవడం అన్నది ఏనాడూ జరుగలేదు జీవితంలో. ఈ కాన్‌వైలరే ఇతన్ని పికాసోకు పరిచయం చేసింది. ఈ పరిచయం బ్రాక్‌ను ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులలో ఒకరినిగా చేసింది. పికాసో అప్పటి మిత్రులు లియో స్టీన్ (Leo Stein), గియామె అపోలినేర్ (Guillame Apollinaire), మాక్స్ జేకబ్ (Max Jacob), వాన్ గ్రిస్ (Juan Gris)లతో తిరుగుతుండేవాడు. మొట్టమొదటగా పికాసో చిత్రాలను చూచి సంభ్రమాశ్చర్యాలను పొందాడు బ్రాక్. చిత్రాలను చూడగనే అతను పికాసోతో అన్న వాక్యమిది: “చూడవయ్యా! నీ చిత్రాలను గూర్చి నువ్వేం చెప్పుతావో నాకనవసరం. మేము మంటలు కక్కేందుకు, పెట్రోలు త్రాగమని చెప్పేందుకు నువ్వు చిత్రరచన చేస్తావు.” ఈ సంభ్రమాశ్చర్యాలు, తాను ఇంతవరకు చూడని క్రొత్త పద్ధతి, పికాసో యొక్క చిత్రకళా విధానం ఇతన్ని కలవరపరిచినై. తాను చేసే ఫావిౙమ్ పద్ధతితో ఇక లాభం లేదు, ఏదో మార్పు తేవాలి తన చిత్రాలలో అనుకున్నాడు. అందుకే ద్విగుణీకృత నిశ్చయంతో చిత్రాలను వెయ్యడం ప్రారంభించాడు.
మెయ్‌సాఁస్ అ లె ఎస్టాక్
బ్రాక్ (1907) క్యూబిస్టు చిత్రం
1907-08లలో బ్రాక్ ‘ఎస్టాక్ వద్దగల ఇళ్ళు’ (మెయ్‌సాఁస్ అ లె ఎస్టాక్: Maisons à l’Estaque) అనే చిత్రాన్ని చిత్రించాడు. మథీస్ చూచి మొట్ట మొదటిసారిగా “అవి చిన్న చిన్న ‘క్యూబుల’ లాగా కనిపిస్తాయి” అన్నాడు. 1909లో బ్రాక్ చిత్రించిన స్టిల్ లైఫ్స్, ప్రకృతి దృశ్యాలను చూచి ఒక కళా విమర్శకుడు వాటిని చిత్రమైన ‘క్యూబు’ ఆకారాలని వర్ణించాడు. దానితో క్యూబిౙమ్ (Cubism) అనే పద్ధతి వాడుకలోకి వచ్చింది. ఇలాగే పికాసో కూడా చేశాడు కొన్ని చిత్రాలు. కనుక ఈ ఇద్దరిలో ముందు ఎవరు ఇలా క్యూబుల పద్ధతిలో చిత్రించింది అని తెలియచెప్పలేం. దీనికి వీరిద్దరు ముందు కారకులే. చాలామంది విమర్శకులు ‘క్యూబిజానికి మూల కారకులు వీరిద్దరిలో ఎవరు?’ అని తలలు బ్రద్దలు కొట్టుకున్నారు – ఎవరెస్టు పర్వతం ఎక్కి ముందుగా శిఖరము పైన కాలు ఉంచినది ఎడ్మండ్ హిల్లరీయా, లేక టెన్సింగ్ నార్కేనా అని తలలు బ్రద్దలు కొట్టుకున్నట్లు. ఏది ఏమైతేనేం ప్రపంచ చిత్రకళారంగంలో, ఒక వినూత్న చిత్ర శైలిని సృష్టించిన ఇద్దరిలో ఒకడుగా బ్రాక్‌ను ప్రపంచం గుర్తించింది.
సెజాన్ క్యూబిజాన్ని సృష్టించాలని చిత్రాలు వెయ్యలేదు. అసలు ఒక శైలి కొరకు గాదు వేసింది చిత్రాలు. తన భావాన్ని క్రొత్త రూపంలో చిత్రించాలని పెట్టిన కృషి. దాన్ని ముందుకు తీసుకుపోయి ఒక ప్రత్యేకమైన ఆకారాన్నిచ్చింది బ్రాక్, పికాసోలు. “1909నుండీ నేనూ పికాసో ఎంతో సఖ్యతతో, ఒకే విధమైన దృఢనిశ్చయంతో ఒకే ధ్యేయంతో కృషి చేశాం. మేము కలిసి వుండకపోతే ఈ శైలి ఉద్భవించేది కాదు. ఇలా జరగాలని ఉంది కాబోలు అందుకని జరిగింది,” అని చెప్పుకున్నాడు బ్రాక్.
వయొలిన్ అండ్ పిచర్
బ్రాక్ (1910) ఎనలిటికల్ క్యూబిౙమ్
క్యూబిౙమ్ చిత్రకళారంగంలో మొట్టమొదటి అమూర్త చిత్రకళావిప్లవంగా చెప్పవచ్చును. అప్పటిదాకా చిత్రకారులు తమకు తోచిన ఒకే దృక్పథాన్ని చిత్రించేవారు. కాని ఇప్పుడు అలా కాదు. ఒక వస్తువుకున్న అనేక పార్శ్వాలని ఒకేసారి చూపించాలి ఈ కొత్త పద్ధతిలో. ఆఫ్రికా ఖండపు కళారూపాలైన ముఖాల తొడుగులు, బొమ్మల నుంచి కూడా ఈ పద్ధతి చాలా స్ఫూర్తి పొందింది. ఈ చిత్రకళా పద్ధతి రెండు సాంప్రదాయాలు: ఎనలిటికల్ క్యూబిౙమ్ అని, సింథటిక్ క్యూబిౙమ్ అనీ. మొదటిది సామాన్యంగా 1912కి ముందుది, ఇందులో చిత్రకారుడు ఒకే వస్తువును రకరకాల కోణాలలో పరిశీలిస్తాడు. ఆపైన ఆ అన్ని కోణాలను జామెట్రికల్ రూపాలలో దాని భావనను కలిగిస్తాడు అసలు వస్తువును చిత్రించకుండానే.
డానియెల్ కాన్‌వైలర్
పికాసో (1910)
రెండో పద్ధతి 1912 తర్వాత వచ్చినది. ఎందుకొచ్చింది అంటే అప్పటికే పికాసో, బ్రాక్‌ల చిత్రాలలో కొత్తదనం పోవడం మొదలయింది. ఇద్దరి చిత్రాలలో ఏది ఎవరు చిత్రించారో చెప్పటానికి లేకుండా ఉన్నాయని అందరూ అనేవారు. కానీ ఇది నిజం కాదు ఒక మంచి పరిశీలకుని దృష్టిలో. పికాసో లాగా కాకుండా బ్రాక్ కేన్వాస్ మీద ఎప్పుడూ కొంచెం కూడా ఖాళీ వుంచకుండా రంగులు చిత్రించేవాడు.
ఏది ఏమైతేనేం, ఈ కొత్త పద్ధతి పూర్తిగా అమూర్తం కాకుండా, చూచేవారికి విసుగు రాకుండా వుండడానికి పికాసో తన చిత్రాలలో, ఒకే ఉపరితలం మీద, ఒకదానికొకటి సంబంధం లేని రకరకాల వస్తువులని అంటించడం, దినపత్రిక కాగితాలు, చించేసిన టికెట్లు, ఉత్తరాల ముక్కలు ఇలాంటివి చేశాడు. దానితో రెండో చిత్రకళా పద్ధతి పుట్టుకొచ్చింది. బ్రాక్ కూడా ఈ పద్దతిలో చిత్రాలు చేసినా ఆయనది ముఖ్యంగా ఎనలిటికల్ తరహా క్యూబిౙమే.
టివోలి సినేమా, బ్రాక్ (1913)
సింథటిక్ క్యూబిౙమ్
1912 నుండి న్యూస్ పేపర్లను కేన్వాస్ పైన అతికించి, అక్షరాలను పెద్దగా చిత్రంలో ఇమిడ్చి, ఇసుక రంగులలో చిత్రించాడు. తృప్తిగా లేక తాను తండ్రి దగ్గర చిన్నప్పుడు నేర్చుకున్న పద్ధతులను, అనగా పాలరాయి మాదిరిగా అతినున్నంగా చిత్రించడం, పాలరాతిలోని చారలను చిత్రించడం సాగించాడు. అప్పటివరకు వస్తున్న ప్రకృతి దృశ్యాలను, మానవాకారాలనూ పూర్తిగా వదిలివేసి స్టిల్ లైఫ్ చిత్రాలను చిత్రించడంలో నిమగ్నమైపోయాడు. స్టిల్ లైఫ్ చిత్రాలు వెయ్యడంలో దిట్ట అని పేరు పొందాడు.
తను కాగితాలను చిత్రంలో ఎందుకు అతికించేది చెపుతూ, “మేము చేసిన ఈ పద్ధతిని సరిగా అందరూ అర్థం చేసుకోలేదు. కాని ఇది చాలా సులభం. మేము తలపెట్టిందల్లా రంగుకు గల ప్రాధాన్యతను, ఆకారాలకు సంబంధం లేకుండా నిలబెట్టి చూపాలని. మేము ఇలా వాడిన కాగితాలను చూచి విమర్శకులు విస్మయం చెందారు. ఇది ఉదాత్తంగా అనిపించలేదు చిత్రకళలో వారికి.” ఎన్ని కాగితాలు అంటించినా, నిజానికి, రంగులకు గల ప్రాధాన్యతని చూపాలని ఎంతో ప్రయాసపడిన మాట నిజం. దీన్నే చెపుతూ విమర్శకురాలు రెబెకా వెస్ట్ (Rebecca West), “బ్రాక్ తన రంగులను భూమి నుండి తీసుకున్నాడు, అతని మొదటి చిత్రాలను చూస్తే భూమిక గల బ్రౌను రంగు, గడ్డికి గల ఆకుపచ్చదనం, రాళ్ళకు గల బూడిద రంగులు కనిపిస్తాయి,” అంటారు. తన రంగులని భూమి నుండి ఆకాశం వరకు విస్తరింప చేశాడు ఈ మహోన్నత చిత్రకారుడు.
బ్రాక్ తన చిత్రాలలో ఖాళీ స్థలాన్ని అసలు ఉంచలేదు. చిత్రాన్నంతా పూర్తిగా ఆకారాలతో నింపాడు. సెజాన్ కాన్వాసులో చిత్రించకుండా చాలా భాగాన్ని వదిలివేసే వాడనీ, చాలా రంగులని వాడేవాడనీ ప్రఖ్యాత ఫ్రెంచి కళావిమర్శకుడు జాక్ డుపిన్ చెప్పేవాడు. ముఖ్యంగా బ్రాక్ తన చిత్రాలను ముదురు ఆకుపచ్చ, ముతక పసుపు, కావి రంగులలో పూర్తి చేసేవాడు. అప్పటివరకు ఎవరినైనా మోడలును ఉంచుకొని చిత్రరచన చేశాడు. 1910 నుండి మోడలును పూర్తిగా వదిలివేసి చిత్ర రచన చేయనారంభించాడు. అప్పుడు ఉత్పన్నమైన సమస్యలను చెప్పుతూ, “అసలు మోడలును పూర్తిగా విసర్జించాలని నిర్ణయించుకున్నాను. కాని అంత సులభంగా లేదు. ప్రారంభించాను పట్టుదలతో. చిత్రం ఎలా వస్తుందో పూర్తి అయ్యాక గాని తెలియదు. అది ఒక సాహస కృత్యం. ఇందులో మనసు అసలు పని చెయ్యదు,” అన్నాడు. అంటే చిత్రం ఎలా వస్తుందో అతనికే తెలియదు. ఒక ఉద్దేశ్యంతో చిత్రరచన చెయ్యలేదన్న మాట. చెయ్యి ఎలా సాగితే తాను అలా చిత్రిస్తూ, ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానంతో సాగించిన యాత్ర అది.
మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ప్రభుత్వం ఇతన్ని మిలటరీ సార్జెంటుగా నియమించింది. యుద్ధంలో తన బాధ్యతలను ఎంతో ప్రజ్ఞతో నిర్వర్తించి మన్ననలను పొందాడు. బాగా గాయాలు తగిలాయి. దానితో తిరుగుముఖం పట్టాడు యుద్ధభూమి నుండి. చాలాకాలం పట్టింది మరల చిత్ర రచన చేసే స్థితి వచ్చేటప్పటికి. ఇప్పుడు రంగుల్లో ఎంతో మార్పు వచ్చింది. అప్పటివరకు కండ్లు జిగేలుమనే రంగులు వాడిన అతను, రంగుల వర్ణాన్ని ఎంతో తగ్గించాడు. దాదాపు 18వ శతాబ్దం చిత్రకారుల మాదిరి రంగులను వాడాడు. కొంతమంది ఈ చిత్రాలను చూచి ఫ్రెంచి ఆర్టులో మరలా ‘ఓల్డు మాస్టర్ని’ చూచాం అన్నారు. తన ఈ చిత్రాల్ని చూచి బ్రాక్, “నాకు ఉద్రేకాల్ని అణచే నిబంధనలంటే ఇష్టం,” అని చెప్పుకున్నాడు. అందుకనే కాబోలు వర్ణాల్ని అణచివేశాడు తన చిత్రాల్లో, అయినా ఇది ఎంతో కాలం నిలువలేదు. మరల కాంతివంతమైన రంగులను వాడసాగాడు.
వయొలిన్ (స్టిల్ లైఫ్) బ్రాక్ (1913)
ఇతను వేసిన చిత్రాలను పరిశీలనగా చూస్తే మనుష్యుల చిత్రాలను బహు కొద్దిగ చిత్రించినట్లు కనిపిస్తుంది. ఆ చిత్రించినవైనా స్తబ్దతతో, చలనరహితంగా వుంటాయి. మనుష్యుల ఆకారాలు గూడ ఏ స్టిల్ లైఫ్‌నో చిత్రిస్తున్నట్టుగానో చిత్రించాడు. అందుకే గాబోలు అపోలినేర్, “మనిషి ముఖం కంటే రాతిని చూచి ఎక్కువగా చలించాడు బ్రాక్.” అన్నాడు. తను వేసిన స్టిల్ లైఫులలో వయొలిన్, పండ్లు, సీసాలు, సీసా మూతలు, నిమ్మ పండ్లు, ఆపిల్ పండ్లు, పేక ముక్కలు, ఎన్నో చిత్రించాడు విరివిగా. తన ప్రపంచం అంతా వీటితో నింపేశాడు.
ప్వాఁసాఁ (Poisson) బ్రాక్ (193?)
రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. రంగుల కరువు వచ్చింది. శిల్పాలని చెయ్యడం సాగించాడు. కాని అంత ప్రజ్ఞావంతుడు కాదు శిల్పకళలో. ఎక్కువగా చేసిన ముఖాలు శిల్పంలో ప్రొఫైల్స్ – అంటే ముఖం పక్కభాగం చూపడం – మన రాజపుత్ర మొఘల్ శైలి చిత్రాలలో మాదిరిగా నన్నమాట. చేపలు, గుర్రపు తలలు, ఎగిరే పిట్టలు, శిల్పంలో మలచాడు. తాను చేసిన చేపల శిల్పాన్ని వివరిస్తూ “నీటిని శిల్పంగా మలచాను.” అన్నాడు.
గూటికి వస్తున్న పిట్ట. బ్రాక్ (1956)
స్టిల్ లైఫ్ చిత్రాలలో ఎగురుతున్న పిట్టలని చిత్రించారు. ఆయన చివరి కాలంలో ప్రతి చిత్రంలోనూ ఒక పిట్ట ఉన్నదా అనిపిస్తుంది. ఆయనకు పిట్టలపై అంత మక్కువ ఎందువల్లనంటే అవి భూమికి ఆకాశానికి మధ్య గల స్థలంలో ఎగురుతూ ఉండే విధానమే అనుకుంటాను. ఇతని చిత్రాలు గూడా ఈ ఆకాశం, భూమికి మధ్య గల ఖాళీ స్థలాన్ని పూర్తి చెయ్యాలనే కృషితో సాగించినవి. సెజాన్ వదిలి వేసిన ఖాళీ స్థలాన్ని ఇతను పూరించారు.
ఈ శతాబ్దంలో బ్రాక్‌కు గల స్థానం ఎట్టిది అంటే, చాలా మంది విమర్శకులు ఆయన్ని ముగ్గురిలో చేర్చారు. పికాసో, బ్రాక్, మథీస్ – ఈ ముగ్గురు ఈ శతాబ్దంలో అత్యంత ప్రతిభావంతులు. బ్రాక్ స్థానం ఈ ముగ్గురిలో చివరివానిగా నిర్ణయించారు.టైమ్స్ పత్రిక విమర్శకుడు దీనికి కారణం రాస్తూ, “పికాసో, మథీస్‌లు ఇద్దరూ ఎంతొ విభిన్నులైనా, తమ కళాసాధనలో, ఈ శతాబ్దపు కళారంగం గమనాన్నే పూర్తిగా మార్చివేశారు. వీరిద్దరి ప్రభావం లేని చిత్రకారుడు దాదాపు ఎవరూ లేరు. కాని బ్రాక్ ఫావిౙమ్ సాధన చేసినప్పుడు మథీస్ నీడలో ఉండవలసి వచ్చింది. క్యూబిౙమ్ తర్వాత పికాసో అంచెలు అంచెల మీద దాటిపోయాడు బ్రాక్‌ని వదిలి.” అన్నాడు. బ్రాక్ నిజంగా ఎవరినీ తన ప్రభావంతో ముంచెత్తలేదు. ఇతర చిత్రకారులు అందరూ బ్రాక్ చిత్రాలను చూచి మెచ్చుకున్నారే కాని, బ్రాక్‌ను అనుసరించి సాధన చెయ్యలేదు. వెతగ్గా వెతగ్గా మనకు బెన్ నికల్సన్ (Benjamin Nicholson) దొరుకుతాడు బ్రాక్ ప్రభావం పడ్డ వ్యక్తిగా. అంతకు మించి బ్రాక్‌కు శిష్యులు లేరనే చెప్పాలి.
చేపలు (ప్వాఁసాఁ) బ్రాక్ (1942)
నిజానికి బ్రాక్ ఒక క్రొత్త రంగం సృష్టించాడు స్టిల్ లైఫ్ చిత్రాలలో. ఒకదాన్లో (Les poissons noirs) అప్పుడే వండిన చేపలు ఎంతో జాగ్రత్తగా తెచ్చి బల్లపై ఉంచినట్లుంటుంది. చిన్న టవలు, రెండంటే రెండే పండ్లు ఉంచబడి ఇక తినడమే తరువాయి అనిపిస్తుంది. చిత్రం చేపలతో ప్రక్కలకు సాగుతూ ఉంది ఎంతో బలంగా. దీన్ని అరికట్టాలని కాబోలు బ్యాక్ గ్రౌండులో నిలువాటి గీతలను వాడారు బ్రాక్. అడ్డంగా సాగే చిత్రాన్ని పైకి పొడిగించాలని కాబోలు. ఈయన స్టిల్ లైఫ్ చిత్రాలు ఎంతో గజిబిజిగా ఉంటాయి. ఇది మాత్రం ఎంతో సింపుల్‌గా కొట్టవచ్చినట్లుంటుంది. తను చెప్పదలచుకున్నది చిత్రంలో తికమకలు లేకుండా చెప్పారు. టేబులుపై ఉన్న పెద్ద గుడ్డ చిత్రం అంతటికీ ఒక బరువును, హుందాను ఇచ్చింది. దీనిలో విపరీతంగా మథీస్ ప్రభవం కనిపిస్తుంది. అసలు ఇది మథీస్ చిత్రమే అంటే ఎవరూ అభ్యంతరం చెప్పకుండా నమ్ముతారు. అయినా, రంగులలో తన ముద్రను వేశారు బ్రాక్ ఈ చిత్రంలో.
తన స్టిల్ లైఫ్ చిత్రాలలో బ్రాక్ వంగపండు రంగును, పసుపు రంగును అత్యంత ఆహ్లాదకరంగా ఉపయోగిస్తారు. వంగపండు రంగులో నలుపు చారలతో, ముదురు ఆకుపచ్చని పెద్ద పండ్లతో చిత్రించిన చిత్రాలు, నగిషీ పని చేసిన వివిధ ఆకారాల కూజాలు, పురాతనమైన మేజాలు, వాతికి తరిన బట్టిన కోళ్ళు, చారలు చారలు గల చెక్క తలుపులు, ఇలా ఎన్నో అమోఘమైనవి చిత్రించారు. బ్రాక్ దృష్టిలో చిత్రం కంటికి ఇంపుగా వుండి హాయిని కలిగించాలి. అది దాని మొదటి బాధ్యత.
ఈయన స్టిల్ లైఫ్ చిత్రాలు, ఒకవైపు నుండి వెలుతురు తెరచిన కిటికీలో నుండి వస్తూ, వస్తువులపై పడుతూ ఉన్నవి, చాలా పేరు పొందినవి. ఈయన చిత్రాలు చూసిన వారికి జాఁ బప్తీస్త్ షార్డీన్ (Jean Baptiste Simeon Chardin) చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇరువదవ శతాబ్దపు షార్డీన్ అని కూడా కొంతమంది అన్నారు ఇతన్ని. కొన్ని షార్డీన్ చిత్రాలను నేషనల్ గ్యాలరీలోనూ, పారిస్ లూవ్ర్ మ్యూజియంలో (Musee du Louvre) గూడ చూచాను. ఇద్దరికీ గల సామ్యం రంగులను మిశ్రమం చేయడంలో ఉంది. కాంతిని బలవంతంగా తగ్గించి, రంగులను తమ అధీనంలో ఉంచుకునే ఈ ఇద్దరిది పద్ధతి చాలా గొప్పది. రోజూ మామూలుగా మన ముందు కనపడే, మనం వాడుకునే వస్తువులని చిత్రించారు ఇద్దరూ. బ్రాక్ క్యూబిౙమ్ పద్దతులని తన చిత్రాల ద్వారా మేధకు పనిపెట్టే ఉద్దేశ్యం కంటే, వాటిని మరింత ఆహ్లాదంగా చూపేందుకే ముఖ్యంగా వాడుకున్నారు. ఉదాహరణకి బ్రాక్ చిత్రించిన రౌండ్ టేబుల్ అన్న ఎంతో ప్రసిద్ధి చెందిన చిత్రం. గుండ్రటి మేజా, అది వున్న గది మనం వెంటనే గుర్తుపడతాము. మేజా మన వైపుకు వాలి వుంది, దానిపై వున్న వస్తువులన్నీ మనకు కనపడే విధముగా. మేజాపై ఒక పుస్తకము, రెండు పండ్లు, ఒక చాకు, ఒక వయొలిన్, ఇలా మనము రోజూ చూచే వస్తువులెన్నో వున్నాయి. గది గోడల క్రింది భాగంలో నిలువు గీతల డిజైను ఉండి, నేల, మేజా వెనకాల గోడలు జామెట్రికల్ గీతలలో వున్నాయి.
ఈ చిత్రము వంటిదే ఇంకో స్టిల్ లైఫ్ చిత్రము కచేరీ అన్న పేరుతో బ్రాక్ చిత్రించారు. ఈ చిత్రములో కూడా ఒక గుండ్రటి మేజా ఉన్నది. దానిపై తెల్లని టేబులు క్లాత్ పరిచివుంది. టేబులుపై ఒక వయొలిన్, కొన్ని పండ్లు, ఒక కూజా, నొటేషను రాసిన కాగితాలు వున్నాయి. ఈ చిత్రములో కాంతి ఎడమనుండి కుడికి వస్తువులపై పడుతున్నట్టు రంగులలో వెలుగునీడలు చూపించారు. ఈ రెండు చిత్రములను మరింతగా పరిశీలించి ఆనందించే పని మీకే వదిలివేస్తున్నాను. ఈ రెండు చిత్రములకీ మధ్య షుమారు పది సంవత్సరముల తేడా వుండి బ్రాక్ చిత్రములలో, వారు వాడిన రంగులలో వచ్చిన మార్పులను సూచిస్తున్నది.
బ్రాక్ రేఖాచిత్రాలను, స్త్రీమూర్తులను చిత్రించారు. నిజం చెప్పాలంటే చాలా నాసిరకంగా ఉన్నాయి రేఖాచిత్రాలు. కాని, స్త్రీ మూర్తుల చిత్రాలు బాగున్నాయి. రేఖలలో గూడ, చిత్రాలంత గొప్పతనాన్ని చూపే ప్రజ్ఞ ఒక్క పికాసో కొక్కడికే ఉంది. బ్రాక్ తనకు గల బలహీనతలను రంగులలో కప్పి పుచ్చుకుంటాడు. ఇతని డ్రాయింగులు చూస్తే మనకు ఈ విషయం చటుక్కున తెలుస్తుంది.
ఉమన్ విత్ ఫ్రూట్ బాస్కెట్
బ్రాక్ (1923)
పండ్లబుట్ట మోసే యువతి (Canephorae) చిత్రాలు చాలా అందమైనవి. ఎంతోమంది చిత్రకారులవి ఇటువంటి చిత్రాలు ప్రపంచంలో చాలా మ్యూజియములు సేకరించాయి. బ్రాక్ చిత్రించిన స్త్రీ చిత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో మలచినట్లుంది, చిత్రించినట్లు లేదు. ఇక్కడ గ్రీకు స్త్రీమూర్తుల ఆకారం కనిపిస్తుంది. స్త్రీ శరీరావయవములు నాజూకుతనాన్ని, వయ్యారాన్ని కోల్పోయాయి. దీనత్వం కనిపిస్తుంది. రేఖలు నలిగిన పరుపులా స్త్రీ చుట్టూ తిరిగినాయి. బహుకొద్దిగా చిత్రించిన స్త్రీమూర్తి చిత్రాలలో ఇది ఒకటి. సామాన్యంగా స్త్రీని ఒంటరిగా చిత్రించేకంటే, బ్రాక్ స్టిల్ లైఫ్ వలె కుర్చీలో కూర్చోబెట్టి చిత్రించినవి చాలా ఉన్నాయి. స్టిల్ లైఫు చిత్రించడంలో నైపుణ్యాన్ని ఎంతగానో ఒలికిస్తాడు బ్రాక్. ఈ మధ్య ఇరువదవ శతాబ్దపు చిత్రకారులవి కొన్ని చిత్రాలు లండన్‌లో మార్ల్‌బరో గ్యాలరీ వాళ్ళు ప్రదర్శించారు. పెద్ద చిత్రం సుమారు 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు సైజుది ఈ ప్రదర్శనలో ఉంది బ్రాక్‌ది. నిజంగా ఎవరినైనా నోరు తెరిపిస్తుంది, అంత గొప్ప చిత్రం.
బ్రాక్ విచిత్రమైన వ్యక్తి. అతనికి అతనే సాటి. ప్రముఖ చిత్రకారులకు అనుకరణ చేసేవారెందరో ఉన్నారు. కానీ ఈయనకు లేరు. అంత మాత్రాన ఇతని చిత్రాలలో అంత పస లేదా అంటే అది నిజం కాదు. రంగుల నైపుణ్యంలో మొనే, సిరా (Georges Pierre Seurat) లను మించి ఒక ఇంద్రజాలాన్ని సృష్టించగల వ్యక్తి. అతి సామాన్యమైన వస్తువులను స్టిల్ లైఫులో ఇమిడ్చి, ఎంతో ఉన్నత స్థాయికి తెచ్చాడు. ప్రతి వస్తువులో అందాన్ని చూడగలిగిన వ్యక్తి. మూర్తి చిత్రాలలో కొన్నిటికి రెండు మూడు ముఖాలను ఒకే వ్యక్తికి చూపుతూ చిత్రించినవి గూడా ఉన్నాయి. ఇవి పికాసో చిత్రాలను చూచిన తర్వాత వేసినవి. తన రంగులతో ప్రత్యేకంగా ఉన్నా, పికాసో వాటికి నాసిరకమనే చెప్పాలి. అసలు ఈ పద్ధతి తనది కానప్పుడు ఎంత శ్రమపడినా మెప్పించలేడు కదా!
ఈయన పికాసోతో కలిసి స్టిల్ లైఫు, మూర్తి చిత్రాలు చిత్రించే కాలంలో, విపరీతంగా యెల్లో ఓకర్ రంగు, ఇటుక రంగు వాడాడు. తెలుపు కూడా విపరీతంగానే ఉపయోగించాడు. తర్వాత రంగులను ఎంతో జాగరూకతతో ఎంచుకున్నాడు తన ముద్ర పడేటట్లు. ఈయన చిత్రాల లోని రేఖలు, నదిలోని చిరు తరంగాలవలె ఉంటాయి. అన్ని వస్తువులను వివిధ కోణాలలో పెనవేసుకొని, చలనం లేకుండా ముడుచుకున్న ముత్యంలా మెరుస్తుంటాయి. ఇలా చలనం లేకుండా ఉండడం ఈజిప్షియన్ శిల్పాలలో, చిత్రాలలో చూడవచ్చు. ఈజిప్టు చిత్రాలలో పక్షులు ఎగురుతున్నా, మనం చలనాన్ని చూడలేం. అలాగే దుముకుతున్న అసీరియన్ సింహాలలో స్థిరత్వాన్ని, గమన రాహిత్యాన్ని గ్రహించగలం.
స్టాచ్యూ. బ్రాక్ (19??)
శిల్పము అనే శిల్పంలో ఇద్దరి తలలు ఏదో తీవ్రంగా వాడులాడుకుంటున్నట్టుగా మలచబడినవి. ముక్కాలి పీటల మాదిరిగా ఉండి ఆఫ్రికన్ శిల్పాలను జ్ఞాపకం తెస్తుంది. శిల్పాలలో ఈయన చేపలను, గుర్రపు తలలను, స్త్రీల ముఖాల ప్రొఫైళ్ళను మలచారు. ఎముకలతో గూడ చాలా శిల్పాలు చేశారు. ఇవి, ఊసుపోక చేసినవిలా ఉన్నాయి. ఆ మాటకు వస్తే గాగిన్ (Paul Gauguin), డెగా (Edgar Degas), పికాసో, మథీస్‌లు చిత్రకారులైనా, వారు చేసిన శిల్పాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. రంగుల కుంచెలను ఎలా నడపగలరో అలానే మట్టిని, రాయిని గూడ మలచగలిగారు. బ్రాక్ గొప్ప చిత్రకారుడు గనుక అతను చేసిన శిల్పాలు గూడ గొప్పగా ఉన్నాయని విమర్శకులు అన్నా, అందులో నిజము సున్న. ఈయన వేసిన చిత్రాలలో బహుకొద్ది మార్పులు కనిపిస్తాయి. స్టిల్ లైఫులు, స్త్రీ స్టిల్ లైఫులు అంత గొప్పవి కానివి, కొన్ని ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి అంతే. పికాసోను చూస్తే రోజుకొక కొత్త సృష్టి చేయగల అతీతుడు. అది నయాగరా జలపాతం. కానీ బ్రాక్ పరిమితి బహుకొద్ది. అయినా చిత్రకళారంగానికి మణిపూస లాంటి పద్ధతులలో చేసిన మహానుభావుడు. అందులో సందేహం లేదు.
అవరోహణ (Descente)
బ్రాక్ (1961) లిథోగ్రాఫు
సంవత్సరం, రెండు సంవత్సరాల ముందు, బ్రాక్ డిజైనులతో బంగారు ఆభరణాలను తయారు చేశారు. వీటిని రంగులలో ఈమధ్యనే టైమ్స్ పత్రిక వారు ప్రచురించినది. ఈ నగలని పారిస్‌లో ప్రదర్శించారు. డిజైనులు ఎంతో అందంగా చాలా బాగున్నాయి. ఈయన లిథోగ్రాఫులు, ఎచింగులు చాలా ముచ్చటగా ఉంటాయి. శిల్పాలకంటే ఈ లితోగ్రాఫులు, ఎచింగులు చాలా విజయవంతమయాయి.
బ్రాక్ అంటారు; “చూడండి! మనిషి బ్రతకాలి గదా. బ్రతకడం అంటే నా ఉద్దేశ్యంలో రోజు రోజుకూ కొద్దిగా మారుతుండడం అన్నమాట.” కానీ, ఇది ఈయనకంటే పికాసోకి బాగా వర్తిస్తుంది అందుకే కాబోలు. పికాసో పోను పోనూ తన చిత్రశైలిని ఎప్పటికప్పుడు కొత్తగా మార్చుకునేవాడు. క్యూబిస్టు చిత్రాలలో అధివాస్తవికత వంటి కొత్త కొత్త ప్రయోగాలు చేశాడు. బ్రాక్ అలా కాకుండా జీవితాంతం క్యూబిస్ట్ పద్ధతిలోనే శ్రమించాడు. బ్రిటన్ లోని హెన్రీ మూర్‌ను (Henry Moore) బ్రాక్‌తో పోల్చవచ్చును. హెన్రీ మూర్ బహుకొద్ది మార్పులతో శిల్పాలు చేశారు బ్రహ్మాండంగా. అలాగే బ్రాక్ బహుకొద్ది మార్పులతో చిత్రాలు చిత్రించారు అమోఘంగా. ఇద్దరూ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు.
ప్రపంచంలోని ఎన్నో మ్యూజియములు, గ్యాలరీలు, సంపన్నులు ఈయన చిత్రాలు కొన్నారు. ఎంతోమంది ఈయనపై, ఈయన చిత్రాలపై పుస్తకాలు వ్రాశారు. ఇంత గొప్ప వ్యక్తి బహు నిరాడంబరుడు. చిన్నప్పుడు ఎంతో సరదాగా నలుగురితో తిరుగుతుండేవాడు. ఆటల పోటీలలో మంచి పేరు తెచ్చుకున్నాడు. యువకుడుగా ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి చిత్రకారుడిగా పేరు పొందుతున్న కొలది, సంఘానికి దూరదూరంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. అసలు నలుగురు వున్నచోట ఆయన కనిపించేవాడు కాదు. ఇంటివద్దకు స్నేహితులని పార్టీలకు పిలిచి సరదా చేసేవాడు. పారిస్ లో మోఁత్‌మార్త్ర్ లోని ఇంటిలోనో, లేక వరాఁజ్‌విల్ గ్రామం లోని తన ఇంటిలోనో ఉండి కాలక్షేపం చెయ్యడమో, కొత్త చిత్రాలను వెయ్యడమో చేస్తుండేవాడు.
1912లో పెండ్లి అయిన దగ్గర నుండి ఈయన దశ తిరిగింది. చిత్రకారునిగ ఖ్యాతి రా నారంభించింది. అందువల్లనేనేమో విడాకులు లేకుండానే జీవితమంతా ఏకపత్నీ వ్రతుడిగా ఉన్నాడు. సామాన్యంగా పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా పారిస్ నగరపు చిత్రకారుల్లో ఇలా ఉండడం అరుదు. పికాసోకు ఇప్పటి భార్య ఐదవదనుకుంటాను.
బ్రాక్ మొట్టమొదటి పెద్ద ప్రదర్శన 1913లో బసీల్‌లో జరిగింది. 1934లో ప్రదర్శించగా చాలా చిత్రాలు అమ్ముడు పోయాయి లండన్‌లో. 1939లో కార్నెగీ ప్రైజు వచ్చి బ్రాక్‌ను ప్రపంచంలోని దిట్టలలో ఒకనిగా ముద్ర వేయడం జరిగింది చిత్రకళా రంగంలో. 1945లో అస్వస్థత వల్ల చాలాకాలం చిత్రరచన అసలు చెయ్యలేదు. నెమ్మదిగా కోలుకున్న తరవాత 1953లో లూవ్ర్ మ్యూజియములో సీలింగుకు మూడు చిత్రాలను వేయడం పూర్తిచేశాడు. 1956లో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది. ఎడిన్‌బరో నగరానికి ఎన్నో వేలమంది, బ్రిటన్ దేశం అంతటినుండి వచ్చి ప్రదర్శనలో చిత్రాలను చూచి ఆనందించారు. తర్వాత లండన్‌లో టేట్ గ్యాలరీలో ప్రదర్శించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆనరరీ డాక్టరేటు బిరుదాన్నిచ్చి గౌరవించింది బ్రాక్‌ను. మూడు సంవత్సరముల క్రితమే ‘గ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ ది రీజియన్ ఆఫ్ ఆనర్’ పొందాడు. వీటి అన్నిటికంటే మించి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో లూవ్ర్ మ్యూజియములో ఈయన తయారు చేసిన బంగారు, వెండి ఆభరణములను ప్రదర్శించటం జరిగింది. ఇంతవరకు బ్రతికి వున్న చిత్రకారునివి గాని, శిల్పకారునివి గానీ లూవ్ర్ మ్యూజియములో ఏర్పాటు చేయబడలేదు. ఇది మహోన్నత గౌరవంగా ఎంచవచ్చు. ఈ ప్రదర్శన అతి త్వరలో న్యూయార్కులో జరుగబోతున్నది.
బ్రాక్ మరణవార్త విని లండన్ లోని విశ్వవిఖ్యాత నేషనల్ గ్యాలరీ డైరెక్టరు సర్ ఫిలిప్ హెండీ, “ఈ శతాబ్దంలో ప్రతి ఒక్కరు సదా చెప్పుకునే ముగ్గురు చిత్రకారులలో బ్రాక్ ఒక్కడు. మిగిలిన ఇద్దరు పికాసో, మథీస్. ఇక ఇప్పుడు మిగిలిందల్లా పికాసో మాత్రమే. భావికాలానికి వారు ‘ఓల్డ్ మాస్టర్స్’ అనుకోవడంలో సందేహం లేదు.” అన్నారు.
(మొదటి ప్రచురణ: భారతి, నవంబర్ 1963.)
[ పై వ్యాసం ఈమాట కోసం విస్తృతంగా పరిష్కరించబడినది. ఈ వ్యాసంలోని చిత్రాలు ఇంటర్నెట్ నుండి సేకరించబడినవి. – సం.]