వో షామ్ కుచ్ అజీబ్ థీ…

ఉలిక్కిపడి లేచాను
ఆ సాయంత్రంలానే!

గడియలో చిక్కుబడ్డ చీటీ
అర్థం కాని రాత
ఏదో తుఫానుకు సూచన
వెంటాడి తరుముతున్న ఆత్రుత.

ఎక్కడో అలికిడి
నీకంటే ముందే నీ నవ్వు!

చెప్పానా ఎప్పుడైనా నీతో
నే మరణించిన ఘడియలెన్నో?!


అరచేతిలో ప్రశ్నల చీటీ
కళ్ళనిండుగా అలల సుడులు
చెబుతావా ఏమైనా?!

ఎప్పటికీ రావని తెలిసి కూడా
మళ్ళీ ఎప్పుడన్న పిచ్చి ప్రశ్న!

జీవితం తరుముతున్నవాడిలా
సాయంత్రపు మసక వెలుతురులో
దూరమౌతూ నువ్వు.


వర్షం కురిసినపుడో
పూవు రాలినపుడో
సన్నజాజులు పలుకరించినపుడో
ఏ శ్రావణ మేఘం ఉరిమినపుడో
జీవితపు ఏ శూన్యతో నిన్ను నిలవేసినపుడో
రేడియోలో ఆప్ కీ ఫర్మాయిష్ పూర్తయాక
అలముకునే కొద్దిపాటి విషాద విరామమపుడో
నేలవాలిన నీ చూపుల్లో ఎక్కడో ఓ చోట…
నా జ్ఞాపకం పూస్తుంది కదూ?!