రామన్న

“అత్తమ్మా, రామన్నున్నడా?”
బడినుంచి రాంగ రోజడిగెటోణ్ణి.
“ఆడొచ్చినప్పుడు జెప్త పోర”
కసురుకుంట జవాబొస్తుండె.

నేనిప్పుడు దండ మీద కూసొని
సైకిల్ తొక్కుతనని,
సాలోళ్ళ బావిల పల్టీ కొట్టి
దూకొస్తదని,
నాగ్గూడ పాటలకు కంజిర
కొట్టుడొచ్చిందని…
ఏమేమొ ముచ్చట్లు చెప్పుకునేదుండె.

అడవిలకెల్లి ఇస్తరాకులు తెచ్చుకొనీకి
నన్నుగూడ తీస్కపొమ్మని,
మా గోడకంటించనీకి చిరంజీవి
బొమ్మ తీస్కరమ్మని,
నువ్వు లేనప్పుడు నీ డంబెల్
నా దగ్గరుంచుకుంటనని…
ఏమేమొ బతిమిలాడేదుండె.

ఒకపొద్దు బడిగోడ మీద ఎర్రగ రాసిండ్రు
“రామన్న అమర్ రహే” అని.
ఆళ్ళింటి ముంగట్నుండి పోతే
ఇప్పటికి నోరు పెకల్దు నాకు.