విశ్వగుణాదర్శ కావ్యపరిచయం

[తానా ప్రచురణల విభాగం జనవరి నెలలో విజయవాడ పుస్తకోత్సవంలో విడుదల చేసిన “విశ్వగుణాదర్శము” అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ వెల్చేరు నారాయణరావు రాసిన ముందుమాట కొన్ని మార్పులూ చేర్పులతో మీకందిస్తున్నాం. -సం.]


విశ్వగుణాదర్శము
తానా ప్రచురణలు, రూ. 295/-

పదిహేడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. నిజానికి ఈ మార్పులు అంతకుముందు నుంచీ జరుగుతున్నా, పదిహేడో శతాబ్దంలో ఇవి నిబ్బరంగా ఉధృతంగా ఊపందుకున్నాయి.

అంతవరకూ సామాజికంగా పెద్ద ప్రాధాన్యత లేని కొన్ని కులాల వాళ్ళు ఈ కాలంలో ప్రధాన స్థానంలోకి వచ్చారు. ఈ కులాల వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఒకపక్క వ్యాపారంలో సమర్థులు, మరొకపక్క యుద్ధంలో వీరులు. వీళ్ళు ప్రముఖులై దక్షిణదేశంలో (ఇప్పటి తమిళనాడులో) రాజ్యాధికారం సంపాదించుకున్నారు. నాయక రాజ్యం వీరి రాజ్యమే. అప్పటి సామాజిక వర్గీకరణ రీత్యా వీళ్ళు ఎడమచేతి కులాలు అనే విభాగంలో చేరతారు. భూమి ప్రధానమైన ఆస్తిగా, భూమి మీద తమ ఆధిపత్యం ప్రధానమైన సామాజిక గౌరవంగా రాజకీయ ప్రాబల్యాన్ని పొందినవాళ్ళు కుడిచేతి కులాలనీ, వ్యాపారం ప్రధానంగా చేసుకున్నవాళ్ళు ఎడమచేతి కులాలనీ అప్పటి వాడుక. ఈ కులాల సంప్రదాయాలూ, ఆచారాలూ ఒకదానికొకటి విరుద్ధంగా ఉండేవి.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజింపబడిన చాతుర్వర్ణ వ్యవస్థకి నిజంగా కులవ్యవస్థతో జన్యజనక సంబంధం లేదు. అసలు చాతుర్వర్ణ వ్యవస్థ ఎప్పుడూ జనబాహుళ్యం అనుసరించిన సామాజిక వ్యవస్థ కాదు. కాని సంస్కృతభావ ప్రపంచంలోనూ, శాస్త్రాలలోనూ, సాహిత్యంలోనూ దానికి బలమైన అస్తిత్వం ఉంది. అంచేత అదే మొదట ఏర్పడిన సామాజికవ్యవస్థ అనీ, దానిలోంచే కుల వ్యవస్థ పుట్టిందనీ చాలామంది నమ్ముతారు. ఆ సంగతి ఎలా ఉన్నా, కులసమాజంలో పైకి ఎదగాలనుకునేవారి మనసుల్లో వర్ణవ్యవస్థ బలంగా ఉంది. కుడిచేతి కులాలలో మోతుబర్లు రాజ్యాధికారం చేతిలోకి రాగానే తమకన్నా కొన్ని తరాల ముందే వేదాధ్యయనాదుల వల్ల చాతుర్వర్ణ వ్యవస్థలోకి ఎదిగిన ‘పెద్ద బ్రాహ్మణుల’ సాయంతో క్షత్రియత్వాన్ని పొందడానికి ప్రయత్నించేవారు. స్థానికంగా ఉండి, పూజారి పనులు చేసే ‘చిన్న బ్రాహ్మణులు’ ఇందుకు పనికిరారు కాబట్టి వేదాధ్యయనం చేసే పెద్ద బ్రాహ్మణులని పైనుంచి రప్పించి వారికి అగ్రహారాలు ఇచ్చి తమ రాజ్యంలో నివాసం ఏర్పరచేవారు. (కులవ్యవస్థలో ఉండి పూజారి పనులు చేసేవారినీ, వర్ణ వ్యవస్థలోకి ఎదిగి వేదాధ్యయనం చేసేవారినీ, ఉమ్మడిగా బ్రాహ్మణులు అని వ్యవహరించడం వల్ల కలిగిన గందరగోళాన్ని నివారించడం కోసం ఈ పెద్ద బ్రాహ్మణులు, చిన్న బ్రాహ్మణులు అనే విభజన చేస్తున్నాను).

ఇది ఇలా ఉండగా, పదిహేడో శతాబ్దంలో ఎడమచేతి కులాలలో మోతుబర్లు కూడా రాజ్యాధికారం సంపాదించి రాజులయ్యారు. అయితే కుడిచేతి కులాలలోంచి వచ్చిన పూర్వపు రాజులకీ, ఈ ఎడమచేతి కులాల రాజులకీ పెద్ద తేడా ఉంది. ఎడమచేతి వాళ్ళుగా, ఈ రాజులు వర్తకులు కూడా. వర్తకులుగా వైశ్యులు కావలసిన వాళ్ళు రాజ్యాధికారం వల్ల రాజులు కూడా కావడంతో వైశ్య క్షత్రియత్వాలు ఒకచోట కలిసిపోయి, చాతుర్వర్ణ భావన కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దానితోపాటు, ఈ ఎడమచేతి కులాల రాజు తానే దేవుడిగా పూజలందుకున్నాడు. దేవాలయంలో దేవుడూ, రాజప్రాసాదంలో రాజూ, ఒకడుగానే భావించబడడంతో, రాజుకి క్షత్రియత్వమూ అవసరం లేకపోయింది. ఆ క్షత్రియత్వం ఇచ్చే బ్రాహ్మణుడూ అవసరం లేకపోయాడు.

ఇంతకుముందు రాజు దైవాంశ సంభూతుడే కాని దేవుడు కాడు. రాజే దేవుడైపోవడంతో, రాజుకి అందరూ – స్థానికంగా ఉన్న చిన్న బ్రాహ్మణులతో సహా – సేవకులు అయ్యారు. బ్రాహ్మణుడి స్థితి రాజుకి క్షత్రియత్వం ఇచ్చే ఉన్నతస్థాయి నుంచి రాజుకి సేవకుడయే కిందిస్థాయికి దిగజారింది. దీనితో పాటు రాజే వర్తకుడు కూడా కావడంతో, రాజ సంపాదనలో డబ్బుకు ప్రాధాన్యం వచ్చింది. అంటే రాజ్యంలో డబ్బుకు ప్రాధాన్యం వచ్చింది. అంతకుముందు భూమికి ప్రాధాన్యం, అంటే భూమి రూపంలో ఉన్న ఆస్తికి ప్రాధాన్యం వున్న సమాజంలో హెచ్చుతగ్గులు స్థిరంగా ఉండేవి. ఒకరు పుట్టిన కులం ద్వారా వారికి సమాజంలో స్థానం నిర్ణయమైపోయేది. భూమికి ఉన్న ప్రాధాన్యత తగ్గి డబ్బుకి ప్రాధాన్యత రావడంతో డబ్బు సంపాదించిన వాళ్ళకి సమాజంలో గౌరవం రావడం మొదలయింది.

డబ్బుకి ప్రాధాన్యం రావడం సమాజంలో పెద్ద మార్పుకి దారి తీసింది. స్వయంశక్తి వల్ల సంపాదించుకున్నది డబ్బు. ఆ డబ్బు సంపాదించుకున్న వాళ్ళు సమాజంలో ప్రముఖ స్థానంలోకి రావడం అంటే, పుట్టిన కులం వల్ల కాకుండా తన సొంత సామర్థ్యం వల్ల, మనిషి పైకి రావడానికి వీలు ఏర్పడిందన్నమాట. కులానికన్నా, గుణానికి విలువ పెరిగిందన్న మాట. దీనివల్ల అంతవరకూ తక్కువ కులాలుగా ఉన్నవాళ్ళు డబ్బు గడించి పైకి రావడానికి అవకాశం ఏర్పడింది.

వేసరపు జాతిగానీ
వీసము తా జేయనట్టి వీరిడి గానీ
దాసి కొడుకైనగానీ
కాసులు గలవాడె రాజు గదరా సుమతీ

అన్న సుమతీ శతక పద్యం ఈ కాలానిదే అని నిశ్చయంగా చెప్పలేను కానీ, ఆ కాలంలో ఇలాంటి మాటలు పెద్ద కులాలవారు, ఈ కొత్తగా పైకొస్తున్న కులాల మనుషుల్ని గురించి అనుకుంటూ వుండేవారనే అనుకుంటాను.

ఇది సమాజంలో చాలా పెద్ద మార్పు. ఇలాంటి మార్పు అప్పటి మనుషుల్లో వారి స్థితిని బట్టి, అలజడినో, ఆశనో, ఉత్సాహాన్నో, నిర్వేదాన్నో కలిగిస్తూ వుండి వుండాలి. అలాంటి కాలంలో వేంకటాధ్వరి రాసిన పుస్తకం ఈ విశ్వగుణాదర్శం.

ఈ పుస్తకంలో ఒకపక్క తురుష్కులు, మరొకపక్క పాశ్చాత్యులు, అనేక స్వదేశీ కులాలవాళ్ళు, రోజులు మారుతున్నందుకు విచారిస్తున్న వాళ్ళు, మారుతున్నందుకు సంతోషిస్తున్న వాళ్ళు – వీరందరి ప్రసక్తీ వస్తుంది.

ఆకాశంలోకి ఎగిరి అక్కణ్ణుంచి భూమి మీద జరుగుతున్న మార్పుల గురించి వ్యాఖ్యానాలు చేసే ఇద్దరు గంధర్వుల్ని పాత్రలు చేసి, వాళ్ళ మాటల ద్వారా మనకి ఆ సమాజాన్ని విహంగ వీక్షణం చేసే అవకాశం కల్పిస్తాడు వేంకటాధ్వరి.

ఈ ఇద్దరు గంధర్వుల్లో విశ్వావసువు ఒకమాట చెప్తే, దానికి వ్యతిరేకంగా కృశానువు ఇంకో మాట అంటాడు. లోకంలో ఒక పరిస్థితిని గురించి ఒకే స్థిరమైన అభిప్రాయం వుండదనీ, దాన్ని ఇంకో కోణం నుంచి చూస్తే అది ఇంకోలా కనిపిస్తుందనీ, ఆధునికులు అనుకునే విమర్శనాత్మక దృక్పథం ఈనాటికే బలపడిందనీ, ఈ పుస్తకం మనకు గుర్తు చేస్తుంది.

ఉదాహరణకి-

హంత! సంతత మత్యంత దురిత నిరతాః
యవనా ఏవ తావదమీషు విషయేషు
ప్రాచుర్యతః పర్యటంతి పస్య సఖే!

అవనావతీత పవనాశ్వ శోభినో
భవ నాగశాయి భవ నావమర్దితః
యవనాశ్చరంతి భువనాతిభీషణాః (409)

తురకలు దేశమంతా తిరుగుతున్నారు. బ్రాహ్మణుల్నీ, దేవాలయాల్నీ ధ్వంసం చేస్తున్నారు అని కృశానువు అంటే, వెంటనే విశ్వావసువు:

సత్యమేవ మధ్యాప్యేతేషు తురుష్క యవననే ప్యనన్య
సాధారణ విక్రమే గుణమముం గృహాణ

అలా అనకు- వాళ్ళు ఎంత వీరులో చూడు, తురుష్కులు అనన్య సాధారణ విక్రమం కలవారు అని వాళ్ళలో సుగుణాలు మెచ్చుకుంటాడు.

ఆంగ్లేయులని కృశానువు

హూణాః కరుణాహీనా స్తృణవత్ బ్రాహ్మణ గణం నగణ యంతి
తేషాం దోషాః పారేవాచాం యే నాచరంతి శౌచమపి (410)

ఈ ఇంగ్లీషు వాళ్ళు దయలేని వాళ్ళు. బ్రాహ్మణుల్ని గడ్డిపోచల్లా చూస్తారు. వాళ్ళ దోషాలు చెప్పనలవి కాదు. వాళ్ళు శుభ్రంగా కూడా వుండరు, అని దూషిస్తే, విశ్వావసువు-

ప్రసహ్య న హరంత్యమీ
పరధనౌఘ మన్యాయతో
వదంతి న మృషావచో
విరచయంతి వస్త్వద్భుతం
యధావిధి కృతాగసాం
విదధతి స్వయం దండనం
గుణా నవగుణా కరేష్వపి
గృహాణ హూణే ష్వమూన్ (414)

వాళ్ళు పరుల డబ్బుని అన్యాయంగా తీసుకోరు. అబద్ధాలు చెప్పరు. అద్భుతమైన కొత్త కొత్త వస్తువులు తయారుచేస్తారు. తప్పు చేసిన వాళ్ళని చట్టప్రకారం దండిస్తారు. నువ్వు చెప్పిన అవగుణాలతో పాటు వాళ్ళలో ఈ సుగుణాలు కూడా వున్నాయి అంటాడు.