నేనలా బ్రేక్‌రూమ్‌లో కూచుని,
లోకంలో అన్ని లోపాలు గల చీరలూ మల్లు పంచెలేనట
అంచేత అన్ని పెళ్ళిళ్ళూ ఎంతోకొంత అసంతృప్త ద్రావణాలేనట.
ఏవిటో?
అని ఏవేవో ఆలోచించుకొనుచుండగా చటుక్కున అన్నగారి చిత్రం! భళారే విచిత్రమన్న పాట గుర్తుకొచ్చినది విచిత్రముగ. ఎంత చక్కని పాట! ముఖ్యంగా చిత్రం… భళారే విచిత్రం – అన్న చోట వచ్చే చిన్న సంగీతబ్బిట్టు!
రాచరికపు జిత్తులతో… రణతంత్రపుటెత్తులతో…
రాచరికపు జిత్తులతో రణతంత్రపుటెత్తులతో
సతమతమౌ మా మదిలో మదనుడు సందడి సేయుటే
చిత్రం! ఆయ్… భళారే విచిత్రం!
ఆహా! అన్నగారి హావభావములు! మగసిరి అన్ననదియే ఏమో? ఎంత చక్కని రూపురేఖలు! కోటేరువంటి ముక్కు కదా అన్నగారిది. తామర పువ్వులవంటి కన్నులు.
ఈ రాచ నగరుకు రారాజును రప్పించుటే విచిత్రం. పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం. మదనుడు సందడి సేయుటే చిత్రం.
ఎంతటి మహారాజైనా ఎపుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం!
బాగుగనే ఉన్నది కానీ ఈ మాటలు అన్నగారి నోటనే పలికించి ఉంటే ధర్మపత్ని గురించి పతి చెప్పు మాటగా ఎంతో అందముగ అమరి ఉండేది కదా! అని పరిపరి విధముల ఆలోచించుకొనుచూ ఉండగా ఆకలి హెచ్చాయెను.
అన్నము వేళ కన్న ముందే ఇంత ఆకలి ఏల వేయుచున్నదని యోచించగా ఉదయాన సమయాభావము వలన అల్పాహారము తీసికొనుట మరచితినని జ్ఞప్తికి వచ్చెను. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్! అన్న పాట మెదడులో మెదలెను.
బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా…
ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్
అమ్మానాన్నలతో భోజనాలకి కూచున్న వేళలోనో, నలుగురూ కూచున్న వేళ ఏ రేడియోలోంచో, రోడ్డు మీద మైకులోంచో,
అమ్మానాన్నదే తప్పా
అమ్మానాన్నదే తప్పా
అమ్మానాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని…
అంటూ వచ్చేస్తుంటే ఇబ్బందిగా తల పంకించడం. ఏవిటో తప్పా తప్పా అనుకుంటూనూ- ఆ వాక్యం ఒక్కటీ లేకపోతే బావుండేది కాదూ పాట బంగారంలా?
ఇంతలో హడావిడిగా సుబ్బారావు అచ్చటికి వచ్చెను. నావైపుకి అభిముఖుడై వచ్చుచూ ఏమాలోచించుచున్నారని అడిగెను. భళారే విచిత్రం పాటను గూర్చి ఆలోచించుచుంటినని, అటు పిమ్మట సాపాటు ఎటూ లేదు గురించనీ పలికిన, అటులనా? ఎంతైనా నా ముందు తరము వారు కదా! అని వెటకారముగ బలికి నవ్వెను.
అటులనా? ఓహో! మరి నీకు నచ్చిన పాట జెప్పుమనగా-
చిన్ని చిన్ని ఆశ
చిన్నదని ఆశ
అని బాడగా, ఆశ చిన్నదని ఆశా? అంటిని. అతగాడు తికమకపడి, మరియొక పాట ఎత్తుకొనెను.
ప్రేమా ఇది తే
అది తే అని
అడుగునా?
ప్రేమా స్థితిని
గతిని అన్నీ
చూచునా?
…
అని చెప్పబోవగా,
మెడ విరిగిన బాటిల్లో
దీపములై ఉందామా
కుళ్ళిపోయిన మామిడిలో
జత పురుగులమౌదామా?
అదే కాదూ ఈ పాట అని నే ఫక్కున నవ్వగా, డబ్బింగు పాటకు అర్థములు తియ్యరాదని అతగాడు హితవు పలికెను.
తన లంచి డబ్బానించి ధవళాన్నము, ఆపైని పడుకున్న మాడిపోయిన వంకాయలు బయటికి తీసెను. ఈ రీతి మాడినవేలా బాలకా అని అడుగగా, తన జతగాడు పొయ్యి ఆర్పుట మరచెనని తెలిపెను. వంకాయవంటి కూరయు వంకజముఖి సీత వంటి భార్యామణియు అన్న నానుడి తెలుసునా అనగా తనకు సంస్కృతము రాదనెను.
రెండు మాడు వంకాయలు ఉదారముగ నా వైపుకు తోసెను. మీ లంచి డబ్బా అగుపడుట లేదేమని కొచ్చెను వేసి, నేను జవాబు చెప్పబోవునంతనే తన అనువాద పాటల అంబుల పొదిలోంచి మరియొక రత్నమును వెలికితీసెను-
ఎగిరి దుమికితె నింగి తగిలెను
పదములు రెండు పక్షులాయను
వేళ్ళ చివర పూలు పూచేను
కనుబొమ్మలే దిగి మీసమాయను.
…
ఒక్కొక్క పంటితో నవ్వా
కలకండ మోసుకుంటూ
నడిచా ఒక చీమై
అనుచూ ఆ వార్తాకమును కసుక్కున కొరికెను.
నువ్వు లొట్టలేసి తినగా
అమ్మాయ్ లేమీ
ఆవకాయ్ కాదురా! అన్న డబ్బింగు సాంగు తెలుసునా అని నవ్వగా సుబ్బారావున్నూ బ్రింజాలుల పని పట్టుట మాని నా నవ్వుతో శ్రుతి కలిపెను.