ఒక అప్సరస అశ్వంగా మారితే అది ఒక సత్ప్రబంధం అవుతుంది! అదెలాగో తెలియాలంటే ఈ వ్యాసం సాంతం చదవాల్సిందే.
సీ. ప్రియుని కెమ్మోవి చుంబింప నోపని లేమ
కఠిన ఖలీన మేగతి వహించు
హారంబు బరువని యలయు లతాతన్వి
వాగెల నెట్టి కైవడి ధరించు
జడసోకు లోర్వగా జాలని తరళాక్షి
కడువంక పల్ల మే కరణి బూను
నొడ్డాణమును దాల్ప నోపని సతి పొట్ట
బట్టెడ బిగి నెటువలె సహించు
తే. మిగుల మెత్తని నడుపుల మెలగు నింతి
మనసు కంటెను జవమున మసలు నెట్టు
లనుచు దేవత లద్భుత మంది చూడ
రాజకులనాథ సాంబ్రాణి తేజి యయ్యె
ఒక చిత్రమైన సన్నివేశాన్ని వర్ణిస్తున్న పద్యం ఇది. ‘సాంబ్రాణి తేజి’ అంటే ఉత్తమజాతి అశ్వం. అతిలోక సుందరి, సుకుమారి, సొగసుల నెరజాణ అయిన ఒక అప్సర స్త్రీ గుఱ్ఱంగా మారుతూ ఉంటే చూస్తున్న దేవతలు, ఆమె పడే అవస్థని ఊహించుకొంటూ, అయ్యో పాపం అనుకొంటున్న సందర్భం. ఇలాంటి విచిత్రమైన సన్నివేశాలని సృష్టించి వినేవాళ్ళ, చదివేవాళ్ళ ఊహశక్తికున్న అవధిని విస్తృతపరచడంలో మన పూర్వకవులు సిద్ధహస్తులు. ఈ పద్యం కన్నా, దీని తర్వాత జరిగిన కథ మరీ చిత్రమైనది!
పూర్వం మన కథలన్నీ చివరకు కంచికే వెళ్ళేవి. అందుకే వాటి ముగింపుతో మనకి పెద్దగా నిమిత్తం లేదు. ఆ మాటకొస్తే కథతో కూడా లేదు! కథనంలో వచ్చే కల్పనలు, సంభాషణలు, వర్ణనలు, అవి రేకెత్తించే ఆలోచనలు, అనుభూతులు- అవీ మనకు ముఖ్యం. అందుకే మన కావ్యాలలో పురాణాలలో, అవే పాత్రలు రకరకాల కథలలో కనిపిస్తాయి. అవే కథలు రకరకాలుగా వినిపిస్తాయి. కథ మొదట్లోనే దాని ముగింపు తెలిసిపోతుంది! ఈ కావ్యం కూడా సరిగ్గా అలాగే మొదలవుతుంది. సూతుడు శౌనకాది మునులకు కథ చెప్పడం మొదలుపెడుతూనే ఇలా అంటాడు: “వినండి మహాత్ములారా. విచిత్రంగా, ఒక రాజు వల్ల కృష్ణునికీ అర్జునునికీ యుద్ధం జరిగింది. ఒక్క ధర్మరాజుని తప్ప, అర్జునునితో సహా అతని సైన్యం మొత్తాన్ని కృష్ణుడు తన చక్రధారతో చంపేశాడు. ఆ తర్వాత, కృపతో ఉభయ సైన్యాల వీరులందరినీ తిరిగి బతికించాడు.”
అదీ కథ! ఇలా కథని ముగింపుతో సహా ముందే చెప్పేస్తే ఇక దాని మీద ఆసక్తి ఎలా ఉంటుంది- అని సందేహించ నక్కర లేదు. అసలు అలా మొదలు పెడితేనే వినేవాళ్ళకి కథ గూర్చి మరింత ఆసక్తి పెరుగుతుంది. కృష్ణార్జునుల మధ్య యుద్ధం ఎలా సంభవించింది చెప్మా. కాస్త వివరంగా చెప్పండి మహానుభావా అంటూ మహర్షులు సూతుని తొందర చేస్తారు. ఇలా కథను టూకీగా ముందుగానే చెప్పేయడం మనకి రామాయణాది పురాణ కావ్యాలలో కూడా కనిపిస్తుంది. మన పురాణాలలో సామాన్యంగా కనిపించే మరొక కథన విధానం- ఒకరు మరొకరికి చెపుతున్నట్టుగా సాగడం. అది కూడా రెండు మూడు పొరలలో సాగుతుంది. మహాభారతం కూడా సూతుడు శౌనకాది మునులకు చెప్పేదే. అందులో మళ్ళీ జనమేజయునికి వైశంపాయనుడు ఆ కథ చెప్పినట్టుగా సూతుడు చెపుతాడు. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, అంటే పాండవుల మనవడు. మనవడు తాతల గురించిన కథ వింటాడన్నమాట. ఈ కథలో కూడా అదే సంవిధానం కనిపిస్తుంది. సూతుడు చెప్పే కథలో అసలు కథని శుకమహర్షి ఇలావంతుడికి చెపుతాడు. ఇలావంతుడు అర్జున కుమారుడు. ఇక్కడ తండ్రి కథని తనయుడు వింటున్నాడు. ఇలా ఒకే కథకి ఇద్దరు కథకులు ఉండడం, ఈ కథలు ఒకరు చెప్పగా మరొకరు వినే మౌఖిక సంప్రదాయానికి చెందినవన్న విషయాన్ని గుర్తుచేస్తాయి. అంతే కాదు, వినేవాళ్ళు రెండు మూడు దృక్కోణాలనుండి కథను వినే అవకాశం ఉంటుంది. పై పద్యంలో ‘రాజకులనాథ’ అనేది ఇలావంతునితో శుకుడు చేసిన సంబోధన. ప్రస్తుతం కథ ఇలావంతుని దృష్టినుంచి వింటున్నామన్నమాట. ఇలా రెండు పొరలు చాలవన్నట్టు, దీనికి మరొక పొర మన తెలుగు కవులు చేరుస్తారు. అది, తాము స్వయంగా తమ కృతిభర్తలకి కథ చెప్పడం. ఈ కథ చెపుతున్న కృతికర్త చరిగొండ ధర్మన. కృతిభర్త ఎనుమలపల్లి పెద్దన మంత్రి. చరిగొండ ధర్మన్న పదహారవ శతాబ్దానికి చెందిన కవి. అతను నిర్మించిన ఈ కావ్యం పేరు చిత్రభారతం.
పేరుకు తగ్గట్టే ఇది చిత్రమైన కావ్యం. భారతంలో వచ్చే పాత్రలే ఇందులోనూ వస్తాయి. అయితే సంఘటనలూ సన్నివేశాలూ మాత్రం పూర్తిగా భిన్నం. కృష్ణార్జునుల మధ్య యుద్ధం తటస్థపడుతుంది. కౌరవ పాండవులు ఏకమై యుద్ధానికి సన్నద్ధులవుతారు. మొత్తం వారి బలం పద్ధెనిమిది అక్షౌహిణీలు. కర్ణుడు అర్జునుని పరాక్రమాన్ని పొగుడుతాడు. సహదేవుడు సంధికై కృష్ణుని వద్దకు దూతగా వెళతాడు. కర్ణ దుర్యోధనాదుల పరాక్రమాన్ని కృష్ణునికి వర్ణించి చెప్తాడు సహదేవుడు. సంధి పొసగదు. కురుక్షేత్రంలోనే యుద్ధం జరుగుతుంది. శల్యుడు అర్జునుని రథసారథి. భీముడూ దుర్యోధనుడూ కలిసి బలరామునితో యుద్ధం చేస్తారు. అర్జునబాణానికి బలరామ కృష్ణులు మూర్ఛపోతారు. కృష్ణుని కుమారులు యుద్ధంలో మరణిస్తారు. చివరకి కృష్ణుడు ధర్మరాజుని తప్ప యుద్ధంలో అందరినీ చంపేస్తాడు. మరి యింత చిత్రమైన కథ ‘భారతం’ ఎలా అయింది? ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. సంఘటనలూ సన్నివేశాలూ చిత్రమైనవి కావచ్చు. కానీ అందులోని పాత్రలు ముమ్మూర్తులా భారతంలో పాత్రలే. అంటే ఆ పాత్రల స్వభావాలు, వాటి మధ్యనున్న సంబంధాలు, భారతంలో కనిపించినట్టుగానే ఉంటాయి. ఇందులోనూ అర్జునుడు విక్రముడే, ధర్మరాజు నీతివేత్తే. సుయోధనుడు మదమాత్సర్య మత్తుడే. కౌరవపాండవులు కలిసి యుద్ధం చేసినా, వారి మధ్య వైరిభావం ఎక్కడికీ పోదు. కృష్ణార్జునులు యుద్ధం చేసినా, వారి మధ్యనున్న పరమస్నేహం అలానే ఉంటుంది. అందుకే అది భారతమే అయ్యింది. పాత్రల స్వభావాలను అలానే ఉంచుతూ, కేవలం సన్నివేశ కల్పన ద్వారా ఇలాంటి నూతనమైన, అతి విచిత్రమైన కథలు నిర్మించడం మన భారతదేశ సాహిత్యంలో కనిపించే విశిష్టమైన అంశం. ఇలాంటివే రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం, అర్జున-బభ్రువాహన యుద్ధం (అర్జునుని మరొక కుమారుడు బభ్రువాహనుడు) మొదలైనవి.
ఈ చిత్రభారతం కథ వినగానే శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా గుర్తుకు వస్తుంది. అందులోనూ ఇదే కథ కదా. అయితే అందులో కౌరవ పాండవులు కలిసి యుద్ధానికి రావడం ఉండదు. అలాగే యుద్ధంలో కృష్ణుడు అందరినీ సంహరించడమూ ఉండదు. అందులో శివుడు ప్రత్యక్షమై ఇద్దరి యుద్ధాన్నీ ఆపుతాడు. కాబట్టి ఇది వేరే కథ. కృష్ణార్జునయుద్ధం గయోపాఖ్యాన నాటకం ఆధారంగా తీయబడిన చిత్రం. అందులో గయుడనే గంధర్వుని వలన కృష్ణార్జునులకు యుద్ధం సంభవిస్తుంది. ఈ చిత్రభారతంలో చతుర్ధనుడు అనే రాజు వలన వస్తుంది. రెంటిలోనూ శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ ఒకటే. ఇంద్రుడు, బ్రహ్మ, శివుల వద్దకు రక్షణకై వెళ్ళి, అక్కడ కుదరక చివరకు అర్జునుని శరణు కోరడమూ సామాన్య అంశమే. అయితే చిత్రభారతంలో, పాండవ కౌరవుల మధ్య కురుక్షేతంలో జరిగిన సమరమంతటి ఘోర యుద్ధమే, పాండవ యాదవుల మధ్య జరుగుతుంది. ధర్మరాజుని తప్ప పాండవ కౌరవ సేనావాహిని అంతటిని, చతుర్ధనుడితో సహా, శ్రీకృష్ణుడు సంహరించడం చిత్రం అయితే, తిరిగి అందరూ బతకడం అద్భుతం. తన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ధర్మరాజు ఒక్కడే రోదిస్తూ ఉంటాడా యుద్ధభూమిలో. అప్పుడు కృష్ణుడు ఓదార్చడానికి వస్తే, తనను కూడా చక్రంతో చంపేయమని కోరుకొంటాడు. శ్రీకృష్ణుడు అతని పరిస్థితికి జాలిపడి, చనిపోయిన అందరిలోనూ ఒకే ఒక్కరిని బతికిస్తానని, అది ఎవరో కోరుకోమని ధర్మరాజుకు వరమిస్తాడు. అప్పుడు ధర్మరాజు, తాము యిచ్చిన మాట నిలుపుకోనేటట్టుగా చతుర్ధనుని బతికించమని కోరుకొంటాడు. ధర్మరాజు ధర్మ నిరతికి సంతోషించిన కృష్ణుడు, యుద్ధంలో మరణించిన వారందరినీ తిరిగి బతికిస్తాడు. ఇందులో అర్జునుని పరాక్రమంతో పాటు యుధిష్ఠిరుని ధర్మవీరం కూడా ప్రదర్శింపబడిందన్న మాట!
గయుని కథ దక్షిణాది భాషలలో యక్షగానంగాను, నాటకంగానూ ప్రసిద్ధి పొందింది. అయితే సంస్కృత పురాణాలలో ఎక్కడా ఆ కథ ఉన్నట్టు లేదు. ఈ చిత్రభారతం బ్రహ్మాండ పురాణం లోనిదని చరిగొండ ధర్మన్న ఈ కావ్య అవతారికలో పేర్కొన్నాడు. నేను బ్రహ్మాండ పురాణం మొత్తం చదవలేదు కాని, చూసినంత వరకూ అందులో ఈ కథ మాత్రం నాకు కనిపించలేదు. దీనికి మరే సంస్కృత గ్రంథమైనా మూలమేమో తెలియదు. బహుశా దేశభాషలలో ఉన్న గయోపాఖ్యానాన్ని ఆధారం చేసుకొని అలాంటి కథనే ఒక కావ్యంగా ధర్మన్న మలచి ఉండవచ్చును. తన కావ్యానికి గౌరవాన్ని తీసుకురావడం కోసం అది బ్రహ్మాండ పురాణంలోని కథగా పేర్కొని ఉండవచ్చు! సంస్కృత సాహిత్యంతో కొంత లోతైన పరిచయం ఉన్నవాళ్ళు నిగ్గు తేల్చాల్సిన విషయమిది.
మహాభారతంలో అనేక ఉపకథలు వచ్చినట్టుగానే చిత్రభారతంలో కూడా వస్తాయి. ఇంద్రుని దగ్గరకు రక్షణ కోరి వెళ్ళిన చతుర్ధనుడికి పారిజాతాపహరణ కథను వినిపిస్తాడు ఇంద్రుడు. అయితే అది నంది తిమ్మన చెప్పిన కథ కన్నా కొంత భిన్నమైనది. నరకాసురుని సంహరించిన తర్వాత అదితి కుండలాలను తీసుకొని స్వర్గానికి వెళతాడు కృష్ణుడు. అక్కడ శచీదేవి పారిజాత పుష్పాన్ని అలంకరించుకొని, దాన్ని ధరించే అర్హత దేవతాస్త్రీలకు మాత్రమే ఉందని సత్యభామతో అంటుంది. దానితో సత్య అలగడం, ఆమె అలక తీర్చడానికి ఇంద్రునితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని కృష్ణుడు భూమికి తీసుకుపోవడం జరుగుతుంది. తన పారిజాతాన్నే కాపాడుకోలేని తాను, కృష్ణునినుండి చతుర్ధనుని ఎలా కాపాడగలనని చెప్పి పంపిస్తాడు ఇంద్రుడు. అలాగే చతుర్ధనుడు శివుని దగ్గరకు వెళ్ళినపుడు అతనికి బాణాసుర వృత్తాంతాన్ని చెపుతాడు శివుడు. బ్రహ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు భాగవతంలో వచ్చే బ్రహ్మ గర్వభంగ కథను అతను చెపుతాడు. ఇలా అచ్చమైన పురాణ బాణీని అనుసరిస్తూ విచిత్రమైన కల్పనలతో సాగుతుంది ఈ కావ్యం.
ఇంతకీ చతుర్ధనుని చంపుతానని కృష్ణుడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? అది తెలుసుకోవాలంటే మన పద్యం దగ్గరకి తిరిగి రావాలి. పద్యానికి అర్థాన్ని వివరించుకొని ఆ తర్వాత మళ్ళీ కథలోకి వెళదాం. ఒక అప్సరస గుఱ్ఱంగా మారుతోంది. అది ఉత్తమజాతి అశ్వమే. సర్వాలంకారభూషితం కూడానూ. అయినా అవి స్త్రీలు ధరించే అలంకారాలు కావు కదా, గుఱ్ఱానివాయెను! అంచేత పాపం ఆ అప్సర వాటిని ఎలా భరిస్తోందో కదా అని దేవతలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ప్రియుని పెదవుల తాకిడినే సహించలేనంత లేత పెదవులు ఆ అప్సరవి. ఇప్పుడా పెదాలకు గుఱ్ఱపు కళ్ళెం తగిలించబడింది! అసలే ఆమెది తీగలాంటి మేను. మెడలో హారాన్ని కూడా మోయలేనంతటి సుకుమారమైన ఆ శరీరం వాగెలను, అంటే పగ్గాన్ని ఎలా ధరిస్తుంది! వెనక ఊగే జడ తాకిడులు కూడా ఓర్వలేని ఆ తరళాక్షి వంపైన పల్లము (అంటే కూర్చునేందుకు గుఱ్ఱంపై వేసే జీను) ఎలా మోస్తుంది! ఒడ్డాణాన్ని సైతం భరించలేని ఆమె పొట్ట పట్టెడ బిగింపుని ఎలా సహిస్తుంది! అతి మెల్లగా సుకుమారంగా నడిచే ఆమె ఇప్పుడు మనోవేగంతో ఎలా పరిగెత్తగలదు! ఇలా అనుకొంటూ దేవతలు అద్భుతంతో చూస్తూ ఉండగా, ఆమె సాంబ్రాణి తేజిగా మారిపోయింది. ఒక అందమైన ఆడది గుఱ్ఱంగా మారిపోయే సన్నివేశం కాని, దాన్ని ఇలా వర్ణించే పద్యం కాని బహుశా ప్రప్రంచ సాహిత్యంలో మరెక్కడా లేదేమో!
అలా గుఱ్ఱంగా మారిన అప్సరస మరెవరో కాదు, నలకూబరుని వలచి వలపించిన దేవకాంతామణి రంభ. తుల్యుడనే మహర్షి తపస్సుని భగ్నం చేయడానికి ఇంద్రుని పంపున వచ్చి, ఆ ముని కోపానికి గురి అయి అతనిచ్చిన శాపం వలన గుఱ్ఱంగా మారుతుంది. చతుర్ధనుడు కుండిన రాజ్యాన్ని ఏలే రాజు. గొప్ప గుణవంతుడు, పుణ్యమూర్తి. అతను చేసిన పుణ్యం కారణంగా అతనికి సశరీరంగా అన్ని లోకాలనూ చూసే యోగం ఉంది. అతన్ని తనపై ఎక్కించుకొని సర్వలోకాలు తిప్పి తీసుకువస్తే అప్పుడు రంభకు శాపవిమోచనం జరుగుతుంది. కుండిన రాజ్యం దగ్గరలో ఉన్న అరణ్యాన్ని చేరి అశ్వరూపాన్ని పొందుతుంది రంభ. వేటనుండి వస్తూ అడవిలో ఆ ఉత్తమాశ్వాన్ని చూసి చతుర్ధనుడు రాజ్యానికి పట్టుకువస్తాడు. ఒక శుభముహూర్తం చూసి దానిని అధిరోహిస్తాడు. అది ఆకాశానికి ఎగిరి, స్వర్గ వైకుంఠ కైలాసాది సకల లోకాలనూ చూపించి తిరిగి అతని రాజ్యానికి తీసుకువస్తుంది. అలా వచ్చే తోవలో ఒక చోట శ్రీకృష్ణుడు అర్ఘ్యం ఇస్తూ ఉంటే, ఈ గుఱ్ఱపు మొహాన ఉన్న చెమట కాస్తా జారి, గాలివాటుకి వచ్చి కృష్ణుని చేతిలో పడుతుంది. ఆ తర్వాత కథ పైన మనం చెప్పుకున్నదే. ఎక్కడి తుల్య మహర్షి తపస్సు, ఎక్కడి పాండవ యాదవ యుద్ధం! ఇప్పుడు మనం చెప్పుకొనే ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ అంటే ఇదే కదూ!
తాను రచించినది పురాణ కథ అని ధర్మన్న చెప్పుకొన్నా, యిది ప్రబంధ బంధురమైన రచన. కొత్త కొత్త వర్ణనలు, అద్భుత రసపోషణ, ధారాధుర్యమయిన పద్య రచన ఈ కావ్యంలో మనకి కనిపిస్తాయి. రంభ గుఱ్ఱంగా మారిన తర్వాత ఆ అశ్వాన్ని ప్రబంధంతో పోలుస్తూ చెప్పే పద్యంలో తన కావ్య గుణాలను అన్యాపదేశంగా ఇతను పేర్కొన్నాడని భావించవచ్చు.
పదముల చొప్పును వడి యొ
ప్పిదము నలంకారలక్ష్మి పేర్మియు ధారా
స్పద భావము గల్గి శుభ
ప్రదమై హయ మమరె సత్ప్రబంధము రీతిన్
పదముల అందము (గుఱ్ఱానికి కాళ్ళు, ప్రబంధానికి మాటలు), చక్కగా ఒప్పారే వడి (వడి అంటే వేగము, తెలుగు పద్యంలో యతి అని రెండు అర్థాలు), అలంకార శోభ, గొప్ప ధారతో కూడిన స్వభావము (అశ్వగతికి ప్రత్యేకించి ధార అని పేరు) కలిగిన శుభ్రప్రదమైన ఉత్తమాశ్వం సత్ప్రబంధంలా అనిపించడంలో ఆశ్చర్యమేముంది!
ఈ కవి పద్యధారకు ఒక్క ఉదాహరణ చూపించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. సహదేవుడు భీష్ముని ప్రతాపం గూర్చి కృష్ణుని సభలో వర్ణిస్తున్న పద్యమిది.
చతురంబోధిపరీత భూవలయ రక్షాదక్ష బాహా బలో
ద్ధత రాజన్య సమూహ శుష్క గహనోద్యద్దావవహ్నిచ్ఛటా
యిత శాతోగ్ర కుఠార భార్గవ మదాహిస్తంభనోదగ్ర మం
త్రిత మౌర్వీ రవ భీష్ము భీష్ము నని వారింపంగ మీ శక్యమే
దీనికి అర్థం తెలుసుకోవడం భాషాకోవిదులైన ఈమాట పాఠకులకు పెద్ద పని కాదు. ఒకవేళ ఎవరికయినా తెలియకపోతే ఆ కొరత పూరించడానికి సహృదయులైన పండిత వ్యాఖ్యాతలు ఎలానూ ఉన్నారు!