పేకాట

“పేకాట ఆడ్డం శ్రీనివాస్‌కు రాదు” చెప్తోంది నా భార్య కొత్తగా ఆ రోజే కలిసిన వాళ్ళతో. ఆవిడ గొంతు నేను ‘ఆ ఆటేదో నేర్చుకుని ఆడగలిగితే బాగుండు ‘ అన్నట్టు ధ్వనించింది. ఆ రోజే కొత్తగా ఇద్దరు వచ్చారు మా పార్టీకి, మా సర్కిల్‌కే కాదు, మా సిటీకి కూడా కొత్తేనట.

శనివారం రాత్రి, మామూలుగా అయితే నలుగురు స్నేహితులం మా ఫ్యామిలీలతో సహా కలిసి మాట్లాడుకుని విడిపోయే వాళ్ళం. అక్కడ అందరికీ తెలుసు నేను పత్తాలాడనని. ప్రతి శనివారం లాగే మిగతా మాతోటి వాళ్ళంతా ఒకే చోట చేరి ఇక రాత్రి రెండు అయేదాకా కార్డ్స్ ఆడతారు. మాకు మాత్రం రాత్రి పది దాటగానే ఆటకు కూర్చునే వాళ్ళను వదిలి పెట్టి ఇంటికి బయల్దేరటం మామూలే. మా ఆవిడకు మామూలుగా అయితే ఇంకాసేపు వాళ్ళతో గడపాలని ఉంటుంది, నాక్కూడా పెద్దగా పోయేదేం లేదు కానీ పేకాటను ఒకళ్ళు ఆడుతుంటే చూడ్డమంటే మటుకు చిరాకు.

కారు డోర్ తీసి పిల్లవాణ్ణి కారు సీట్లో పెడుతూ ఉంటే అడిగింది “మీరు కాలేజీలోనే తెలుసట ఆవిడకి, మీగ్గానీ ఆవిడ తెలుసా?”

“అవునా నాకు గుర్తులేదు, ఏ కాలేజీలో? అమెరికాలోనా, ఇండియాలోనా?”

కారు స్టార్ట్ చేస్తూ ఉంటే చెప్పింది, “ఆవిడ మీ కాలేజీలోనే ఇంజనీరింగ్ చదివిందట మీకు ఆవిడ గుర్తు లేకున్నా ఆవిడకు మీరు బానే గుర్తున్నారే” కొంత వెక్కిరింపుతో కూడిన నవ్వుతో అనింది.

తెల్లవారి ఆదివారం ఆవిడ ఇంకా బెడ్ మీదే ఉంటే, మా వాడికి ఫ్రెంచ్ టోస్ట్ చేసి నా మటుకు కాఫీ కలుపుకుని ఎప్పట్లాగే ‘మీట్ ద ప్రెస్’ చూడ్డంలో పడ్డాను. ‘మిషన్ అకంప్లిష్డ్‌’ అని బుష్ ప్రకటించటం కరెక్టేనా అన్నది ప్రశ్న, నలుగురు ఎక్స్‌పర్ట్ జర్నలిస్టులతో. బిల్ సఫైర్ అంటున్నాడు, ‘మన మిషన్ ఏంటి అసలు’ అని. ఇంటి విషయాలు వదిలిపెట్టి బయటివి పట్టించుకుంటానని మా ఆవిడ గొణగక మునుపే ఆదివారం పొద్దున్నే నాక్కావలసినంత మేత సప్లై చేయటం కూడా ఒక కారణం, టిమ్ రసర్ట్ నాకు నచ్చడానికి.

ఆ తరువాత వారమే మా ఇంట్లో పార్టీ, మా పిల్లవాడి పుట్టినరోజు. ఆ కొత్తావిడ, వాళ్ళాయన, ఇద్దరు పిల్లలు వచ్చారు. పేరు జానకి అట, వాళ్ళాయన పేరు శంకర్. ఆవిడ కేక్ తీసుకుంటూ అడిగింది, “మీకు పేకాట రాకపోవటమేమిటి, అప్పుడెప్పుడో మీరు ఆడటం మానేసాక మళ్ళీ ఎప్పుడూ మొదలు పెట్టలేదా” అని.

“అవును మానేసాను, పూర్తిగా, చాన్నాళ్ళ క్రితమే” చెప్పాను. “అయినా మీకెలా తెలుసు నేను పేకాట ఆడేవాణ్ణని?”

“నేను మీకంటే రెండేళ్ళు జూనియర్, కానీ మీ క్లాస్ మేట్ వసంత నాకు బాగా తెలుసు” అంది.

“వసంత! చాన్నాళ్ళయింది ఆ పేరు విని, మీరింకా టచ్ లో ఉన్నారా” అడిగాను.

పక్కనే ఉన్న మా ఆవిడ ఆ సంభాషణలో దూరుతూ “ఆయన పేకాట ఆడగా నేనెప్పుడూ చూడలేదు, మీకు బాగానే గుర్తు వుందే!?” అటు ప్రశ్నో లేక ఇటు స్టేట్మెంటో కాకుండా అనింది. ‘ఆడ వాళ్ళకు జెలసీ ఎక్కువ ‘ అన్న వసంత మాటలే గుర్తొచ్చినయి.

వసంతతో నా నోరెప్పుడూ ఊరుకునేది కాదు. మాకిద్దరికీ ఎప్పుడూ గొడవే. పలకరింపుతో మొదలయి జగడంతో విడిపోయే వాళ్ళం కాలేజీలో ఎప్పుడు కలిసినా.

“కార్డ్స్ ఆడటంలో ఆయన్నెవరూ గెలవలేరని కాలేజీ అంతా చెప్పుకునే వాళ్ళు, మేం ఆడవాళ్ళం క్లాసుకు నలుగురమే కనక మాలో ఎవరికి ఏ విషయం తెలిసినా మిగతా అందరికీ తెలిసేది వెంటనే” చెప్పింది జానకి.

“మరిప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ఆడమని అడిగినా ఆడరేం” ఏ ఎంక్వయిరీ కమిషన్ లో అయినా సరే మా ఆవిడ బాగానే వెలిగేది అనిపిస్తుంది అప్పుడప్పుడూ, ముఖ్యంగా నాకు మాటలు కరువైనప్పుడు.

పార్టీ అయి అంతా వెళ్ళాక మర్చిపోకుండా మళ్ళీ అడిగింది తనే “పేకాట ఎప్పుడు, ఎందుకు వదిలిపెట్టారు”

“చెబితే నీకర్ధం కాదు” అన్నాను.

ఆ మాటలు అన్నప్పుడల్లా, వాటిని ఇకమీదట డిక్షనరీలోంచి తీసెయ్యాలి అనుకోవటం, మళ్ళీ మర్చిపోవటం అలవాటే. ఏం చెప్పినా మా ఆవిడ వింటుంది కానీ ఆ రెండు ముక్కలూ అంటే చాలు ముక్కుమీదకొచ్చేస్తుంది తనకు కోపం.

ఆ మాటతో ఆవిడ కూడా ఒకవైపు పడుకోబోయేదల్లా తన మీదున్న దుప్పటి లాగేసి “ఇప్పుడు చెప్పాల్సిందే” అని కూర్చుంది మంచం మధ్యలో, నా ఆలోచనలను కుదిపేస్తూ.

ఇక చచ్చాం అనుకుంటూ మరో వైపు తిరిగి పడుకున్నాను, ‘చెప్పేది చెప్పేసాను ‘ అన్నట్టు చిరాకు పడి.

తెల్లవారుతుంటే, ఆదివారం రోజు తాను ఇంకాసేపు పడుకుని నన్ను నా మానానికి టిమ్ రసర్ట్ తో వదిలేయకుండా నిద్రలేస్తూ అడిగింది మరోసారి, ‘పేకాట ఆపేసారు ఎందుకు’ అని?

“వసంత కోసం” చెప్పాను నేను.

“ఏం పాపం?”

“చాన్నాళ్ళ క్రితం కాలేజీలో డబ్బు సరిగా లేని కాలంలో వచ్చిన కొద్ది డబ్బునీ పేకాటలో పోగొట్టుకుంటే చూడలేని వసంత నాతో ఇక పేకాట ఆడవద్దని ఆపేసింది” వీలయినంత సింపుల్ గా చెప్పాను.

మొహం కడుక్కుని, పిల్లవాడి బట్టలు మార్చి, తను కూడా కాఫీ కలుపుకుని వచ్చి కూర్చుని మళ్ళీ అడిగింది, “మరి మీరు చాలా గొప్ప ఆటగాళ్ళని అంటూ వుంది ఈమె, డబ్బెట్లా పోయేది?”

“అది పత్తాలాట, ప్రతిసారీ గెలవటం జరగదు, ఒక సారి ఇంటి నుండి వచ్చిన డబ్బంతా ఒక్కనాడే ఓడి పోతే వసంత దగ్గరే అప్పు తీసుకుని ఆ నెలంతా నడిపించాను, అప్పుడే ఇక మానేసాను”

“మరి అంతదానికి రాత్రే ఎందుకు చెప్పలేదు?” లిబరల్ ఆర్ట్స్ మేజర్ మా ఆవిడది, పెద్ద టెక్నికల్ స్టఫ్ అర్ధమవదేమో అనిపిస్తుంది. పైకి అనే ధైర్యం లేదు.

పొద్దున్నే టిం రస్సర్ట్ “ఇరాక్ లో ఓడిపోతున్నామా మనం” అని ఒక అసంబద్ధమైన ప్రశ్న అడుగుతున్నాడు వైట్ హౌజ్ అన్-అఫీషియల్ రిపోర్టరు బాబ్ వుడ్వర్డ్‌ని. అంతే అసంబద్ధంగా “బుష్ ఈ యుద్ధం గెలిచినా, ఇరాక్ దేశాన్ని మాత్రం ఓడిపోవచ్చు” తనదైన శైలిలో చెబుతున్నాడు వుడ్వర్డ్.

చేసిన టిఫిన్ ముందు పెడుతూ, “బుష్ ను చూసి మనం నేర్చుకోవచ్చు, ఒకసారి ఒకచోట ఓడిపోయినంత మాత్రాన వదిలి పెట్టేయొద్దు అని, మీరు మళ్ళీ పేకాట ఆడాలి” అనింది తను. నోట్లో ముద్ద నోట్లో ఉండగానే సరాన పడ్డట్టయింది గొంతులో.

కొన్ని నీళ్ళు తాగి, “నీకీ పేకాట పిచ్చేంటి, బుష్ ఓడటం, గెలవటం లాంటివాటితో నా పేకాటకు సంబంధమేమిటి? నాకు ఇష్టం లేని దాన్ని ఎందుకు చేయమంటావ్? అయినా నీకు వుడ్వర్డ్ అన్నదేంటో అర్ధమవలేదు.” ఇక దీనికి అడ్డుకట్ట వేయకపోతే లాభం లేదు అనుకుని కొద్దిగా స్థిరంగానే చెప్పాను.

అంతకంటే పట్టుదలతో తను చెప్పింది “మీరు ఆ వసంత కోసం అప్పుడు పేకాట వదిలిపెట్టినట్టే, ఇప్పుడు నా కోసం మొదలు పెట్టండి”.

మళ్ళీ టిం రస్సర్ట్ పిలిస్తే అటు వెళ్ళిపోయాను, లో లోపల ఇదేదో ఇప్పట్లో ఆగిపోయేలా లేదు అనుకుంటూనే.

ఆ తరువాత రెండు వారాలకు మళ్ళీ పేకాట రాయుళ్ళ మధ్యలో అడిగింది, “చూడండి, శ్రీనివాస్‌కు పేకాట వచ్చు, ఈ సారి ఆడతాను అన్నాడు” తనక్కావలసింది నేను అడిగినట్లుగా అబద్ధం చెప్పటం ఆవిడకు ముందునించీ తెలిసిన విద్యే.

ఆ గుంపులో కొత్తగా చేరినా అందరితో త్వరగా కలిసిపోయిన జానకి ఊరుకోక, “శ్రీనివాస్ గారు పేకాట మళ్ళీ జీవితంలో ముట్టుకోను అన్నారట కాలేజీలో మీకు తెలవదా?” అనింది.

“నాకు తెలుసు, అయినా అప్పుడు ఉండే డబ్బు ఇబ్బందులు ఇప్పుడు లేవుగా, అయినా ఇప్పుడు ఇక్కడెవరూ డబ్బుకోసం ఆడరు కదా” అనింది మా ఆవిడ. నీకన్నా నాకే ఎక్కువ తెలుసు మా ఆయన అన్నట్లు కూడా వినిపించింది ఆవిడ గొంతులో. ఆవిడ స్వరాన్నిబట్టి అప్పుడప్పుడూ కనీసం రెండు మూడు రకాలుగా వినిపిస్తుంది నాకైతే.

కానీ జానకి గారికి అదేం పట్టినట్లు లేదు.

“డబ్బుకోసం అప్పుడూ ఆడలేదేమో శ్రీనివాస్ గారు, ఆయన ఓడితే కదా డబ్బు పోవటం!” ఆవిడకూ నా పేకాట గురించి మా ఆవిడకన్న ఎక్కువ తెలుసునని నిరూపించుకోవటం ఏం అవసరమో మరి నాకు తెలవదు.

అనుమానం చూపొకటి నావైపు పడేసింది మా ఆవిడ.

మిగతా ఫ్రెండ్స్ అంతా చాలా కాలం నుండి తెలిసిన వాళ్ళే కనక వాళ్ళూ పట్టు పట్టారు ఇక ఆ రోజు ఆడాల్సిందే అంటూ.

“సరే నాకూ పంచండి” అన్నాను. “కానీ ఇదే చివరి సారి, మళ్ళీ అడగవద్దు, నాకిష్టం లేదు ముందే చెప్తున్నా” ముఖ్యంగా మా ఆవిడవైపు చూసి చెప్పాను.

ఆ రోజు అందరి జేబులూ ఖాళీ చేసి మా ఆవిడ చేతిలో గెలుచుకున్న రెండు వందలూ పెట్టి, “ఇంకో సారి అడక్కు నన్ను, ఇది కూడా నీ కోసం మాత్రమే చేసాను” అన్నాను.

“సరే, ఒక సారి ఆడితే చాలు అన్నాగా” చెప్పింది తను. ఎప్పుడు అట్లా అనిందో నాకు మాత్రం గుర్తు లేదు.

తెల్లారి ఆది వారం పొద్దున్నే టిం రస్సర్ట్ ఈ సారి, ఇరాక్ లో “గెలుపుకు డెఫినిషన్” అడుగుతున్నాడు థామస్ ఫ్రీడ్మన్ న్యూ యార్కు టైంస్ రిపోర్టరుని.

రాత్రి డబ్బు గెలిచినందుకో మరిదేనికో పొద్దున్నే నాకిష్ఠమైన ఇడ్లీ సాంబార్ చేసి నాకు తెచ్చి పెడుతూ చెప్పింది మా ఆవిడ, “అయితే వసంత కోసం ఆట గెలిచి వసంతను పోగొట్టుకున్నారట కదా!”

ఇడ్లీ ఒక్కసారిగా చేదుగా తోచింది. నోరు వెళ్ళబెట్టాను.

“నాకంతా తెలుసు, పేకాటలో గెలిచినంత మాత్రాన ఆడపిల్లలు పడిపోతారు అంటే కష్టం అని తెలవదా. అయినా అట్లాంటి పనికిరాని బెట్ ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ అమ్మాయిని పబ్లికులో ముద్దు పెట్టుకోవాలని బెట్ కడతారా ఎవరైనా? ఆ అమ్మాయి కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టింది, నేనైతే అక్కడే చెప్పు తీసే దాన్ని, అట్లాంటి అడ్డమైన పనులన్నీ చేసి పైగా ఆటెందుకు వదిలారూ అంటే డబ్బు పోయిందని, మళ్ళీ ఆడలేదని అబద్ధాలా?” అన్నీ ఒక్కసారే కడిగేసింది.

ఏం మాట్లాడితే ఏం అవుతుందో అన్నట్లు రెండు ఇడ్లీ ముక్కలు ఒక్కసారే నోట్లో కుక్కుకుని టిమ్ రస్సర్ట్ వైపు ఎన్నడూ లేనంత ఇంట్రస్టుతో తిరిగాను.

“అయినా అటువంటి బెట్ ఎందుకు కట్టారు” ఈ సారి మొఖంలో మొఖం పెట్టి అడిగింది, ఈ జ్యూసీ సబ్జక్టు వదలటం ఇష్టం లేనట్టు.

ఒక గ్లాసు నీళ్ళు తాగి చెప్పాను “ఆ బెట్ నేను ఒప్పుకోవటం నాదే తప్పు. ఒప్పుకున్నాక గెలవకపోతే వాడెవడో వెళ్ళి అదే పని చేసేవాడు. నేను ఆట గెలిచాను కానీ వసంత ఇక ఆ తరువాత మళ్ళీ మాట్లాడలేదు నాతో. ఆ సారికి ఆట గెలిచాక నేను కూడా మళ్ళీ పేకాట జోలికి వెళ్ళలేదు” కొంత నిజం, కొంత అబద్ధం కలగలిపి.

“బుష్ ఇరాక్ లో గెలుస్తాడా, ఓడతాడా” రసర్ట్ అడుగుతున్నాడు తన ఊకదంపుడు ప్రశ్నల్లో మరొకటి పైకి లాగి. మా ఆవిడ వీడి దగ్గర ట్రైనింగ్ కానీ తీసుకుందా అనిపించేట్టు.