మధ్యాహ్నమంతా కురిసిన వర్షం తో వాతావరణం కాస్త చల్లబడింది. దగ్గరే కదా అని నా స్నేహితుడు బీచ్ కి వెళ్దాం అన్నాడు. నేను అంత ఆసక్తి చూపకపోయేసరికి “బందరొచ్చి బీచ్ చూడకుండా పోతా అంటావేంట్రా?” అంటూ బయల్దేరదీశాడు అక్కడికేదో నేను మొదటి సారి బీచ్ చూస్తున్నట్లు! చిన్నా పెద్దా అంతా కలిసి ఓ 10 మందిమి అయ్యాము. రెండు కార్లు. పావు గంట ప్రయాణం. దారి పొడువునా పట్టణవాసపు చాయలు లేని పరిసరాలు. హాయిగా ఉండింది ఆ ప్రశాంతత చూస్తూ ఉంటే. పిచ్చాపాటీ కబుర్లలో ఉండగా కారు ఆగింది. దిగి చూస్తే కాస్త దూరం లో సముద్రం. కానీ, నేను అనుకున్నంతమంది జనం లేరు. అదే అక్కడున్న పల్లీలమ్మే తాత ను అడిగాను. ఏదో చెప్పాడు. సునామి తర్వాత సముద్రం వెనక్కెళ్ళిందని, నీళ్ళు కూడా ఈ మధ్య మురిగ్గా ఉంటున్నాయని. కానీ, ప్రశ్న అడిగినప్పుడున్న ఆసక్తి జవాబు తెలుసుకునే సరికి “కుదరని ఏకాగ్రత” చేతి లో ఓడిపోవడం తో నేను ఆ జవాబు సరిగా వినలేదు. ఎప్పుడో 5,6 ఏళ్ళ నాడు నేనిక్కడికి వచ్చినప్పుడు జనం చాలా మందే ఉన్నారు. సముద్రమూ బానే ఉన్నట్లు గుర్తు.
పిల్లలందరూ ఉత్సాహంగా నీళ్ళల్లోకి వెళ్ళారు. వాళ్ళకి నానా జాగ్రత్తలూ చెప్తూ తల్లులు వెంట వెళ్ళి కాస్త దూరం వెళ్ళాక ఆగారు. అక్కడ ఇసుకలో కూర్చుని పిల్లల్ని చూస్తూ కబుర్లు మొదలుపెట్టారు. నేనూ, నా స్నేహితుడూ నీళ్ళు కాళ్ళకి మాత్రమే తగిలేంత దూరం లో తీరం వెంబడి నడుస్తూ కబుర్లాడుతున్నాం. ఇంతలో వాణ్ణి ఎవరో పిలవడంతో కూర్చున్న బ్యాచ్ దగ్గరకు వెళ్ళాడు. నా నడక కొనసాగిస్తూ సముద్రం నీటి వైపు దృస్టి సారించాను. ఎంత నిశ్శబ్దంగా ఉందిప్పుడు ! ఉన్నట్లుండి పెద్ద అల ఒకటి వస్తుంది. తీరం లో మనల్ని ముంచేలా భయపెడుతుంది. వచ్చినట్లే వచ్చి, ముంచినట్లే ముంచి తానంతటతానే వెనక్కి తగ్గిపోతుంది. మళ్ళీ ఇదివరకటి నిశ్శబ్దమూ, సన్నగా సముద్రం హోరూనూ. ప్రశాంతంగా, సమస్యలన్నీ తీరినట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఉవ్వెత్తున ఎగుస్తూ దూసుకొస్తున్న అల ! ఇది ఎప్పుడూ జరిగేదే. అలా కాక అలలకు భయపడి సముద్రాన్నే చూట్టం మానేస్తే ? ఇలా అర్థం లేని ఆలోచనల్లో ఉండగానే నా మనసు గతం లోకి వెళ్ళింది.
” మిస్టర్ రాం! యౌ ఆర్ ఫైర్డ్!” – మేనేజర్ మాటలకి భూమి కంపించినట్లైంది నాకు.
” బట్ సర్, వై?” – అతి కష్టం మీద ఆ షాక్ లో నుంచి గొంతు పెగుల్చుకుని అడిగాను.
“లుక్, మాకు కావాల్సింది పని చేసే వాళ్ళు మాత్రమే కాదు … మంచి ఫలితాలు చూపే వాళ్ళు కూడా ”
” సర్ … ఇంకొక్క అవకాశం…. ”
“నో. యు మే గో నౌ”
– ఇలా ముగిసింది ఆ సంభాషణ. నష్టాల్లో ఉన్నాము, డవున్ సైజింగ్ అంటే ఏంటో అనుకున్నాను. నామీదికే వస్తుంది అనుకోలేదు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఎక్కడికెళ్తున్నానో కాళ్ళకి అర్థం కాలేదు. ఏం చూస్తున్నానో కళ్ళకు కూడా అర్థం కాలేదు. వీటన్నింటికీ అర్థం కావాలంటే మెదడుకు ముందు అర్థం కావాలి. అది వీటికి సిగ్నల్ పంపాలి. అదే మొద్దుబారితే ఇంక చేసేదేముంది?
సాయంత్రం కావొస్తోంది. ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళను? ఇల్లనగానే గుర్తొచ్చింది – బంటీ కి వచ్చే నెల నార్త్ ట్రిప్ అన్నాను. ఏం పెట్టుకు వెళ్ళను ఆ ట్రిప్ కి? ఇంట్లో వాళ్ళు ఎలా స్పందిస్తారో? అసలే లత కి హైరానా ఎక్కువ. చిన్న టెన్షన్ కూడా భరించలేదు. ఏదోలా ఓ నెలరోజులు మేనేజ్ చేసి ఇంతలోపు కొత్త ఉద్యోగం సంపాదించుకోగలనా? కానీ, ఇలా చేస్తే లతను మోసం చేసినట్లే …. వద్దు. తను అమాయకురాలైనంత మాత్రన నేను ఉపయోగించుకోవాలా? – ఇలా సాగిపోతున్నాయి ఆలోచనలు. వర్షాన్ని ఒక్కసారిగా పడేయకుండా చినుకు చినుకూ రాలుస్తూ, పైన్నుంచి ఆకాశం ముచ్చట చూసే రోజుల్లో ఆ ముసురు కి ఎంత చిరాకేస్తుందో అంతకు మించిన అలజడి నాలో. ఏమిటిది? ఏం జరుగుతోంది? “కాళ్ళకీ, చేతులకీ సిగ్నల్ ఇవ్వడం చేతకాని చచ్చుదద్దమ్మ మెదడు ఆలోచనలు మాత్రం బోలేదు పుట్టిస్తోంది. వెదవ మెదడు, వెదవ నిర్మాణం! ” – మెదడు నీ, విధాత నూ ఒకే సారి తిట్టుకున్నాను.
రోజూ సాయంత్రం నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరేవాణ్ణి. ఈరోజు భవిష్యత్తు భయానికి, పరిశ్థితులను ఎదుర్కోగల ధైర్యానికీ మధ్య లోలకం లా నా మనసు ఊగిసలాడుతూ ఉంటే నీరసాన్ని మించిన విరక్తి తో ఇంటికి చేరాను. ఎప్పటిలాగే నాకోసం గేటు దగ్గర లత .. నిండైన చిరునవ్వుతో. ఇక ఒడ్డుకు చేరం అన్న నిస్పృహ లో ఉన్న వారికి ఒడ్డు చూడగానే కలిగే ఊరట కలిగింది ఆ చిర్నవ్వు చూసి. ఒక్క నవ్వు….నాలో ఆశను కలిగించింది. అయినప్పటికీ ఎలాంటి స్పందనా ఇవ్వక మౌనంగా ఇంట్లోకి వెళ్ళాను. మామూలుగా అయితే చిన్నబుచ్చుకునేదేమో కానీ, తను చాలా ఉత్సాహంగా ఉంది ఇవాళ ఎందుకో గానీ. “ఏమండీ! రేపే మనం బందరెళ్ళేది. గుర్తుంది కదా?” లత నన్ను సమీపిస్తూ అంది. ఇప్పటికి లత ఉత్సాహానికి మూలం అర్థమైనా, ప్రయాణం ఎందుకో గుర్తు రాలేదు. “బందరా? ఎందుకు?” అప్రయత్నంగా ప్రశ్నించాను. “మీరు మరీనండి. మీ ఫ్రెండు రాజు గారు ఫోన్ చేసారు. వాళ్ళింటి గృహప్రవేశం విషయం గుర్తు చేసి, మళ్ళీ రమ్మని పిలిచారు. వారం క్రితం మనం ప్లాను వేసుకున్నాం కదా రెపు బయల్దేరాలని? మర్చిపోయారా?” – అనింది.
“నీకెందుకంత సంతోషం వాళ్ళ గృహప్రవేశం అంటే?” – చిరాగ్గా ప్రశ్నించాను.
“మరి, మనందరం ఊరెళ్తున్నాం కదా! పిల్లలొకటే గోల పెడుతున్నారు. ఊరికెల్దామని.”
మధ్యాహ్నం బాస్ శ్రీముఖం విన్న క్షణం నుండి నా మనసు కాస్త ఒంటరితనం కోసం తహతహలాడుతోంది. కాసేపు నాతో నేను మాట్లాడుకోవాలనుంది. నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలనుంది. ఓ రెండు రోజుల పాటు ఎటైనా వెళ్ళిపోదామనిపిస్తోంది. ఇలాంటి సంధర్బం లో దొరికింది అవకాశం, ఒంటరి తనానికి.
” లతా! బంటీ కి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. 10వ క్లాసు. నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు?”
– వాళ్ళ ఆశలపై నీళ్ళు చల్లడం ఇష్టం లేకున్నా, నా ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళ ముందు ఎక్కడ బయట పడిపోతానో అని నా భయం. అందుకే ఒక్కణ్ణే వెళదామనుకున్నా. కాసేపు నేనూ, లతా దీని గురించి చర్చించాం. చివరికి నేనే గెలిచాను. దిగాలుగా వంటింటి వైపుకెళ్ళిన లత ముఖం చూస్తే బాధగా అనిపించినా ఏమీ చేయలేకపోయాను. రాత్రి ఎనిమిది ఔతూండగా భోజనాలకి కూర్చుంటూ ఉంటే ఫోను మోగింది. “హలో” అంటూ ఫోన్ ఎత్తి అవతలి మాటలు వినేసరికి గుండె ఆగినంత పని అయింది. నేను డబ్బులు పొదుపు చేస్తున్న బ్యాంక్ దివాళా తీసిందట. 18 ఏళ్ళ వైవాహిక జీవితం మొత్తం లో కూడబెట్టిన మొత్తం అందులోనే ఉంది. ఈ షాకుల ధాటికి తల తిరగడం మొదలుపెట్టింది. ఏదో ఒకలా కాస్త సేద దీరుదామని టీవీ ఆన్ చేసా. న్యూస్ చానెళ్ళల్లో అయితే లతకి ఇప్పుడే ఈ బ్యాంక్ విషయం తెలిసిపోతుందని వేరే ఏదో చానెల్ పెట్టుకుని కూర్చున్నా. ఆ క్షణం లోనే కనిపించింది కింద స్క్రోల్ బార్ పై: నేను మదుపు చేసిన కంపెనీ ల షేర్లు ఎదగలేక, ఎగరలేక చతికిలబడ్డాయి. కష్టాల కడలి అంటారు, ఎందుకో ఇప్పుడు అర్థమైంది. ఒక్కటొక్కటిగా వస్తాయా? కుప్పలు తెప్పలు గా వస్తాయి. ఇందాక ఆ మేనేజరాసురుడు చేసిన పని గుర్తు వచ్చింది. “చీ! అసమర్థపు బ్రతుకు!” అనుకోకుండా ఉండలేకపోయాను.రకరకాల నెగిటివ్ ఆలోచనలతో నిండి పోయింది మనసు. ధైర్యంగా ఉండాలి అంటారు …. ఎక్కడినుంచి రావాలని ధైర్యం? ఇన్ని ఉపద్రవాలు ఒక్క సారిగా మీద పడితే ఇంకా పాజిటివ్ ఆలోచనలు కూడా ఉంటాయా? ఏమన్నా అంటే గుండె నిబ్బరం, బండ ధైర్యం అంటారు. నాలాంటి మామూలు వాడికి సాధ్యమా అదంతా?
తెల్లవారింది. మచిలీపట్నం ప్రయాణం. వెళ్ళాను. రాజుగాడు బాగా మాట్లాడాడు. క్షణం తీరిక లేదల్లే ఉంది వాడికి అక్కడ. నాకేం తోచడం లేదు. ఎవరి పనుల్లో వారున్నారు. కాలక్షేపం కోసం అలా బీచ్ కి వెళ్ళొద్దామని బయల్దేరాను. జనం పర్వాలేదు. బీచ్ ని చూడగానే ఇదివరలో కలిగిన భావాలకీ, ఇప్పటి భావాలకీ వర్ణించలేని తేడా ఏదో స్పష్టంగా కనిపించింది. పక్కన రాజు గాడు ఉంటే వాడి మార్కు ఫిలాసఫీ చెప్పెవాడేమో – ” ఈ బీచే ఇంత విశాలంగా ఉంటే ప్రపంచం ఎంత విశాలంగా ఉంటుందో అర్థం చేసుకో. ఈ ఉద్యోగం పోతే ఇంకోటి. కొత్త జీవితాన్ని ఆరంభించు” అని. ఇదంతా వినడం నాకెంత విసుగైనా, ఎవరైనా ఇప్పుడు ఈ మాటలు చెబితే బాగుండు. ఇంత అలజడిగా మనసుంటే రెండే మార్గాలు: ఉంటే రాజు గాడి వేదాంతం లేకుంటే దృష్టి మరల్చుకోవడం. రెండోది తేలికేం కాదు. మొదటిది జరిగే సూచనలు లేవు ఎందుకంటే వాడికసలు ఈ విషయం చెప్తే కద!
బీచ్ లో అందరూ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. నా కష్టాల కడలి నాతో ఆడుకుంటోంది. అలలతో దోస్తీ చేస్తూ, అమ్మ నాన్న ల కేకల్ని లెక్కచేయక మున్ముందుకు వెళుతున్నారు పిల్లలు. ఇలా లోలోపలికి వెళితే ….. సమస్యలు తీరవూ? ఎన్నడూ లేని కొత్త ఆలోచన నాలో. అటూ ఇటూ ఓ సారి చూసాను. చూసి నేనూ ముందుకు నడిచాను. మున్ముందుకు. అక్కడ ఎదురుగా కాస్త దూరం లో పెద్ద అల. … నా వైపే. ఏ ఆలంబనా లేక నిశ్చలంగా నిలబడ్డాను. వచ్చేసింది. లిప్తపాటు లో నన్ను ముంచేసింది. మరుక్షణం లో చుట్టూతా నీళ్ళు. తల కూడా నీళ్ళల్లో. అనంతంగా కనిపిస్తున్న సముద్రపు నీట మునిగి – “నేనెక్కడున్నాను?” అని ప్రశ్నించుకోవడం -అదొక అవ్యక్తానుభూతి. ఏదైనా రెండు క్షణాలే. వెనక్కి మళ్ళిన అల … వెనక్కి మరలిన నా విపరీతాలోచనలు. పైకి లేచాను నేను. ఓ సారి చుట్టూతా చూసాను. ప్రపంచమేం మారలేదు. సేం ఓల్డ్ వరల్డ్! – నవ్వుకున్నాను. ఎందుకో … ఇందాకటి “కష్టాలు తీరే మార్గం” – గురించి తలుచుకుంటే విపరీతాలోచన అనిపించడమే కాక, కాస్త సిగ్గేసింది .. మరీ అంత తెలివి లేకుండా ఆలోచించినందుకు. నిండా మునిగిన క్షణాల్లో కంటి పాపల్లో కదలాడిన లత, పిల్లలు ఈ మార్పుకి కారణం అనుకుంటా. కాళ్ళీడ్చుకుంటూ బయటకు వచ్చేసా. కాస్త తారుమారై ఉంటే అవే కాళ్ళను పట్టుకుని ప్రాణం లేని నన్ను ఒడ్డుకు చేర్చేవారేమో!
“అంకుల్! అంకుల్! ఏమి చేస్తున్నారు?” – రాజు కూతురు షర్టు పట్టుకు లాగడం తో ఏడు సంవత్సరాలు దాటి ఈ యేటికి వచ్చాను. అప్పుడు కాస్త పక్క దోవ పట్టి ఉంటే ఎంత జీవితం కోల్పోయే వాణ్ణో … ఎన్ని ఆనందాలు దక్కకుండా పోయేవో! కొద్ది నిముషాల తేడాలో నాలో ఒక గగుర్పొడిచే ఆలోచననూ, వివేకం నిండిన నిర్ణయాన్నీ రెంటినీ పుట్టించి, ప్రాణం తీసినట్లే తీసి, కొత్త ఊపిరి పోసి, నన్నొక కొత్త “నన్ను” గా మార్చిన బంగళాఖాతానికి చూపుల్తోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను. రాజు కూతుర్ని ఎత్తుకుని ఇసుకలో తను తవ్విన లోతుల్నీ, తను కట్టిన ఎత్తుల్నీ చూస్తూ – అందులో దాని వయసు చూడని పాఠాన్ని నా అనుభవం తో చూస్తూ వెనక్కు నడిచాను – మనిషి వైపు, నా జీవితం వైపు. *