ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్ వారు నడిపిన ఉగాది కథల పోటీలో బహుమతులొచ్చిన కథలు, కవితలు, వ్యాసాలూ ప్రచురించటానికి అనుమతించిన వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు, శ్రీ చిట్టెంరాజు వంగూరి గారికి మా కృతజ్ఞతలు. ఈ రచనలన్నీ సెప్టెంబర్ సంచిక విడుదలకన్నా ముందుగా ప్రత్యేకించి ప్రచురించడం జరిగింది. ఇందుకు ముఖ్య కారణాలు రెండు. ఒకటి : వీలున్నంత త్వరగా బహుమతి పొందిన రచనలని పాఠకులకి అందించడమని. రెండు: అతిథి పుస్తకంలో రచనల గుణాగుణాలపై విమర్శకి కాస్త ఎక్కువ వ్యవధి, అవకాశం ఇద్దామని.
ఈ సంచికలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు గిడిగు రామ్మూర్తి పై వ్రాసిన వ్యాసం ప్రచురిస్తున్నాము. ప్రపంచ విఖ్యాతి గాంచిన భాషాశాస్త్రజ్ఞుడు ఎమెనో ఈ మధ్యే పరమపదించారు. ఈమాట లో ఇంతకు ముందు ప్రచురించబడ్డ ఎమెనో గారి ఇంటర్వ్యూని ఆయనకు శ్రద్ధాంజలిగా తిరిగి ప్రచురిస్తున్నాము. ఇవే కాక AID జీవన్‌సాథీలైన రవి, అరవిందల రచనలు, రవిశంకర్, యదుకుల భూషణ్, ఇంద్రాణి, డా. వేద గార్లు రాసిన కవితలు, ఈమాటకు పరిచయస్తులైన వేమూరి, కె.వి.ఎస్. రామారావు, కామేశ్వరరావు, రోహిణీప్రసాద్ గార్ల వ్యాసాలను కూడా ఈ సంచికలో చదవవచ్చు.
కారణమేమిటో తెలియదు, కథలు రావడం కుంటుపడుతున్నది. తెలుగు diaspora అనుభవాలు మరొకరు చెప్పలేరు. ఇక్కడి తెలుగు వారే చెప్పగలరు. అది మన ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ ఒక కథ బాగా చెప్పగలరు అని నానుడి. ఆ కథ వారి స్వంత కథ, వారి స్వానుభవం.
ఈ మాట కు రచయితలే కాదు, సమీక్షకులు (reviewers) కూడా కావాలి. మాకు వచ్చిన ప్రతి రచననీ ఇద్దరు సమీక్షకులకి పంపడం, వారి సూచనలు తిరిగి రచయితకి అందజేయడం, సాధ్యమయినంతవరకూ, ఆ సూచనలకి అనువుగా రచనని మార్పు చేయించడం జరుగుతుంది. సమీక్షలు చెయ్యగల సమర్థులు చాలామంది ఉన్నారని అతిథి పుస్తకం చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ముందుకొచ్చి, మాకు సహాయ పడమని కోరుతున్నాను.
ఈ సంచిక మీకు నచ్చుతుందనీ, దీనిలో రచనలపై విరివిగా అభిప్రాయాలు, విస్తారంగా విమర్శలూ వస్తాయనీ ఆశిస్తున్నాను.
అభివాదాలతో,