తరం మారినా …

[శివారెడ్డి కి కృతజ్ఞతలతో — రచయిత]

మా వూరునుంచి తమ్ముడు పిలిచాడు. రాత్రి ఒంటిగంట దాటింది.

“పార్వతమ్మ పోయిందిరా, అన్నయ్యా!”
“ఊహూ!” అని అన్నానే కానీ, అనుకోకండా గిర్రున కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్.

నిజం చెప్పద్దూ! సరిగా రెండేళ్ళ కిందట, “అమ్మ పోయిందిరా!” అని తమ్ముడు ఫోనులో చెప్పినప్పుడు కూడా అంత బాధ అనిపించలేదు. “అదృష్టవంతురాలు” అనుకున్నా. అమ్మ రెండేళ్ళు మంచం మీదే గడిపింది, రాచపుండుతో. ఆ రెండేళ్ళూ ఇవాళో, రేపో అన్నట్టుగానే బతికింది. ఎప్పుడు తమ్ముడు పిలిచినా, అమ్మ పోయిందని చెప్పడానికే పిలుస్తున్నాడేమో ననిపించేది.

కాని, పార్వతమ్మ పోయిందని వినంగానే, హఠాత్తుగా గుండె ఆగినంత పనయ్యింది.

“చావందరికీ ఒకటే అయినా, అందరి చావూ మనకొక్కటికాదు,” అని ఎప్పుడో చదివిన వాక్యాలు కళ్ళముందు తారట్లాడాయి.

ఎందుకో, పార్వతమ్మ చచ్చిపోతుందనుకోలేదు. నా పిచ్చిగానీ, ఎనభై ఐదేళ్ళు దాటిన పార్వతమ్మ — అమ్మకన్నా ఓ ఏడాదో రెండేళ్ళో చిన్నదేమో — చచ్చిపోకండా ఎన్నాళ్ళు బతికి వుంటుంది?

+++

అమ్మకీ పార్వతమ్మకీ గొప్ప జోడీ. అమ్మ కాపరానికొచ్చిన రెండేళ్ళ తరవాత పార్వతమ్మ మా వూరుకొచ్చిందట. అబ్బో! అది చాలా పెద్ద కథ. అదే! పార్వతమ్మ కథే! పార్వతమ్మ “ఆత్మ” కథ రాసుంటే అది ఒక వెయ్యి పేజీల నవల అయ్యుండేది. అయినా, పార్వతమ్మ లాంటి వాళ్ళ కథలు ఎవరుమాత్రం ఎందుకు రాస్తారు? అయినా, అమ్మ చెప్పిందీ, నే కళ్ళారా చూసిందీ మీకు చెప్పి తీరాలి.

• • •

అబ్బో! ఇది చాలాకాలం కిందటి మాట! డెబ్భైయేళ్ళ కిందటి మాట.

అప్పట్లో మావూళ్ళోను, ఉత్తరాదిలో చిట్టివలసలోనూ జూటు మిల్లులుండేవి. ఇప్పటికీ మా వూళ్ళో జూటు మిల్లుంది. అది వేరే విషయం అనుకోండి. ఆ రోజుల్లో చిట్టివలసలో జూటుమిల్లు దివాలా తీసే స్థితి కొచ్చిందిట. అది ఇవాళో రేపో మూసేస్తారని వదంతి. మిల్లులో రోజుకూలీ పనికి ప్రతిరోజూ జనం మిల్లు గేటు దగ్గిర పడగాపులు కాసే వాళ్ళు. పార్వతమ్మ తాత ఆ మిల్లులోనే పనిచేసాడు. పార్వతమ్మ నాన్న ఆ మిల్లు గేటు దగ్గిరే “బెరుకు బెరుగ్గా – బెదురుగా” నిలబడే వాడు, మూడేళ్ళ వయసు వొచ్చినప్పటినుంచీ. పార్వతమ్మ నాన్న కూడా ఆ మిల్లులోనే పనిచేసాడు, బతికినంతకాలం! ఆ తర్వాత పార్వతమ్మ పెనిమిటి సింహాద్రికూడా, ఆ గేటు దగ్గిరే రోజూ కాపలా కాసే వాడు, లోపలికి పిలుస్తారని. మంచిరోజుల్లో, వారంలో మూడుసార్లన్నా లోపలికి పిలిచే వాళ్ళు, పని కోసం. అలా పనిదొరికిన రోజుల్లో సాయంకాలం సాపాటుకీ, సారాకీ బత్తెం దొరికేది.

మావూళ్ళో జూటు మిల్లు కలకత్తా నుంచి వలసొచ్చిన మార్వాడీలు నడిపేవాళ్ళు. ఇప్పుడూ ఆ మిల్లు వాళ్ళదే అనుకోండి; అది వేరే విషయం. మా వూళ్ళో మిల్లుకి ప్రతియేడూ లాభాలే! అప్పట్లో చిట్టివలస నుంచి బొగ్గు బస్సులో విశాఖపట్నం వచ్చి, అక్కడ “దయ్యాలబండి” పేసింజర్ రైలెక్కి బోలెడుమంది మా వూరికొచ్చేవాళ్ళట. దయ్యాలబండి పేసింజర్ లో దీపాలుండవు; టిక్కెట్టు కలక్టరూ వుండడు. గంటకి పదిమైళ్ళ స్పీడులో, ప్రతిరైలు స్టేషనులోనూ, స్టేషనుకీ స్టేషనుకీ మధ్యకూడా దాని చిత్తమొచ్చినట్టు ఆగుతూ వచ్చేది దయ్యాలబండి. ఆ బండెక్కి, పార్వతమ్మ, సింహాద్రీ మావూరొచ్చారు.

సింహాద్రికి రాంగానే మావూరి మిల్లులో టెంపరరీగా పనిదొరికింది. జూటుమిల్లుకి ఆనుకొని ఉత్తరాన ఖాళీ స్థలంలో వరసగా పాకలు వేయించి, ఆ పాకల్లో గదులు చిట్టివలసనుంచి వలసొచ్చిన పనివాళ్ళకి అద్దెకిచ్చేవాడు, ఒక షావుకారు. ఆ షావుకారు ఒక రోజు హటాత్తుగా గాంధీ టోపీ, ఖద్దరు జుబ్బా వేసుకొని జస్టిస్ పార్టీ నించి కాంగ్రేసుపార్టీలో చేరాట్ట!

ఆ పాకలన్నింటిని కలిపి ఉమ్మడిగా చిట్టివలస పాకలనేవాళ్ళు. అదేమిటో తెలియదు గానీ, మా చిన్నప్పుడు, ప్రతి ఏడూ, ఎండాకాలంలో ఆ పాకలు నిప్పంటుకొని బూడిదయ్యేవి. మళ్ళీ కొత్త తాటి పట్టెలు, కొత్త తాటాకులూ తెచ్చి, కొత్త పాకలూ వేసే వాళ్ళు. ఇప్పటికీ చిట్టివలస పాకలనే, అంటారు ఆప్రాంతం అంతా. పాకలు పోయి పెంకుటిళ్ళొచ్చినప్పటికీ ఆ ఎడ్రసే సార్థకమైపోయింది!

పార్వతమ్మ, సింహాద్రీ ఓ పాకలో రెండుగదుల్లో కాపరం పెట్టారు. అప్పట్లో ఆడంగులకి మిల్లులో పని దొరికేది కాదు. వాళ్ళంతా చుట్టుపక్కల పేటల్లో పాచిపనికి కుదిరేవాళ్ళు. పార్వతమ్మ మా ఇంట్లో, మా మేనత్త గారి ఇంట్లో, పక్కింటి ప్లీడరు గారి ఇంట్లో పాచి పనికి కుదిరింది. అదీ మొదలు, అమ్మకీ పార్వతమ్మకీ స్నేహం!

+++

పాచిపని చేసే మనిషితో స్నేహం ఏమిటి అన్న అనుమానం రాక మానదు. పార్వతమ్మ మొట్టమొదటిసారి అమ్మని చూడంగానే, “ సీతమ్మ గోరు! తమలపాకులాగున్నావ్” అని ఎంతో ఆప్యాయంగా అన్నదిట. అప్పటినుంచీ, రెండేళ్ళ క్రితం అమ్మ పోయేవరకూ వాళ్ళిద్దరిమధ్యా స్నేహం మాత్రం పోలేదు!

+++

చిట్టివలస పాకల్లో సింహాద్రితో కాపరానికొచ్చిన పార్వతమ్మ జీవితం చాలా మలుపులు తిరిగింది. పార్వతమ్మకి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. కొడుకు నాకన్నా ఒక ఏడాది పెద్ద. వాడి పేరు అప్పన్న. బళ్ళోకెళ్ళడం మొదలెట్టాక, అప్పారావు అయ్యాడు. కూతురు, — దాన్ని చిన్నమ్మి అనేవాళ్ళు; నాకన్నా ఒక ఏడాది చిన్న. నేను కాలేజీలో చేరేవరకూ, పార్వతమ్మ మా ఇంట్లో పని చేసింది. మిగతా ఇళ్ళ సంగతి ఏమో కానీ, మా ఇంట్లో ఒక్క పాచి పనే కాదు; పొద్దున్నే నూతిలోనించి నీళ్ళు తోడడం, గంగాళాలు నింపడం, బయట కాగులో వేణ్ణీళ్ళు పెట్టడం, బట్టలుతకడం, అమ్మకి బజారునించి అవీ ఇవీ కూరా నారా కొనుక్కో రావడం…. ఇలా ఎన్నో పై పనులు చేసేది. ప్రతి రోజూ ఇంత పాత చింత కాయ పచ్చడి అడిగి మరీ తీసుకుపోయేది. ఎప్పుడన్నా అమ్మ, “ రోజూ చింతకాయేమిటే! ఇవాళ మాగాయ ఇస్తా,” అనంగానే, “ వద్దమ్మోయ్ సీతమ్మా! మీ బాపనాళ్ళిళ్ళల్లో సింతకాయే బాగుంటాది!” అనేది.

నాకు బాగా గుర్తుంది. తనకి పదేళ్ళప్పుడు తమ్ముడొకసారి, “ఏయ్ పార్వతీ! నూతి గట్టుమీద తువ్వాళ్ళు తడిపి ఆరెయ్య లేదే,” అని దబాయించడం అమ్మ విని, “ వెధవా! వేలెడు లేవు! దాన్ని పార్వతీ అంటావేమిటిరా, నువ్వేదో దాని బొడ్డు కోసినట్టు! దాన్ని పార్వతమ్మా అని పిలువు,” అని గదమాయించింది. అంతే! అప్పటినుంచీ, మాకు ఆవిడ పార్వతమ్మే! నాన్న కూడా పార్వతమ్మా అని పిలిచే వాడు. అమ్మ పార్వతమ్మకి, ప్రతిఏడూ, రెండు పాత చీరెలు, ఒక గుంటూరు కలనేత చీరె ఇచ్చేది, భోగి పండగ పేరుతో! పార్వతమ్మ, రూపాయ బిళ్ళంత బొట్టు పెట్టుకోని, మొహంనిండా పసుపు పట్టించి కొత్త చీరె కట్టుకోని పండగనాడు సాయంత్రం మా ఇంటికొచ్చేది!

ఆ రోజుల్లో చిన్నమ్మి అంటే నాకు చాలా ఇష్టంగా వుండేది. అప్పుడప్పుడు, చిన్నమ్మిని తీసుకొని ఎక్కడికన్నా లేచిపోతే బాగుండును, అని కలలు కనే వాడిని. నేను కాలేజీలో చేరిన సంవత్సరమే అనుకుంటాను, సింహాద్రి పార్వతమ్మని వదిలేసి ఇంకో చిన్నదాన్ని కట్టుకోని ఉత్తరాదికి పోయాడు. మరో ఏడాది తిరక్కండా చిన్నమ్మి ఎవడో చిట్టివలస పాకల్లో కుర్రాడితో సింగరేణికి లేచిపోయింది. పార్వతమ్మ లబోదిబోమని గోలపెట్టింది. అప్పటినించీ పార్వతమ్మ, పాత పార్వతమ్మ కానేకాదు. తన జీవితమే మారి పోయింది. మా ఇంట్లో పని మానేసింది. మేం కూడా, ఇంకో ఇల్లు, పెద్ద ఇల్లు, ఎత్తు అరుగుల డాబా ఇల్లు కొనుక్కొని కాస్త దూరం పోయాం.

+++

అప్పారావుకి చదువంటలా. సిగరెట్లు కాల్చడం మాత్రం అబ్బింది. ఎనిమిదో క్లాసు రెండు సార్లో, మూడుసార్లో తప్పాడు. ఎవరో సినిమావాళ్ళు, మావూరికి ఆరు మైళ్ళ దూరాన పెద్ద ఎరువుల ఫేక్టరీ పెట్టారు. అప్పారావు ఆ ఫేక్టరీ గేటు దగ్గిర నానా పడగాపులు పడి, మొత్తానికి అక్కడ కూలి పని సంపాదించాడు. “ ఈ గేటు పక్క కాకపోతే, మరోగేటుపక్క,” అన్నట్టుగా! అక్కడ కట్టిన పాకల్లో చేరాడు. పార్వతమ్మ చిట్టివలస పాకల్లో ఒక్కత్తే వుండేది.

+++

నేను దేశం వెళ్ళినప్పుడల్లా పార్వతమ్మ భోగట్టా అడిగి తెలుసుకునేవాడిని. పార్వతమ్మ పాచిపని మానేసిందే కానీ, అమ్మని చూడటానికి అప్పుడప్పుడు వస్తూవుండేది. వచ్చి, యధావిధిగా పాత చింతకాయ పచ్చడి పట్టుకు పోయేది.
మళ్ళీ ఇరవై యేళ్ళ తరువాత అనుకుంటా, ఒకసారి చూశాను పార్వతమ్మని. పార్వతమ్మకి అరవై పైచిలుకు వచ్చి వుంటాయి. బాగా ఎండి పోయి కట్టెపుల్లలా వుంది. కర్రవంతెనకి ఇవతల జి.యన్.టి. రోడ్డు పక్కన చిన్న సీనా రేకు నాలుగు కర్రలమీద నిలబెట్టి, దాని కింద కూచొని పార్వతమ్మ మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్నది. పక్కనే ఒక పదేళ్ళ కుర్రాడు, ఇటికల పొయ్యిలో బొగ్గులు ఆరిపోకండా, విసనకర్రతో విసురుతున్నాడు. “పార్వతమ్మా! ఎలాగున్నావ్? ఈ కుర్రాడెవడు?” అని అడిగా. ఠక్కున గుర్తు పట్టింది. “ఏటి! బట్టతలొచ్చేసిందేటి బాబూ, అప్పుడే! అమ్మని చూసి ఆరునెల్లయ్యింది,” అని బాధ పడింది. “ఈ డా! ఈడు నా మనవడు. చిన్నమ్మి కొడుకు. ఈడిని నాకాడ ఒగ్గేసి, అది మారుమనువు చేసుకుంది. జూటుమిల్లులో దాని పెనిమిటికి పని. దానిక్కూడా మిల్లులో పని దొరికింది బాబూ,” అని చెప్పింది. “ మరి నువ్వు కూడా కూతురితో వుండచ్చుగా! ఎందుకీ యాతన?” అన్నా. “ ఛీ, ఛీ, నాకేం కర్మం,” అని రెండు మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇచ్చింది. డబ్బులు తీసుకో మని యెంత బతిమాలినా తీసుకోలేదు.

+++

మరో ఐదేళ్ళ తరవాత, మావూరెళ్ళాను, అమ్మని చూద్దామని. అదే ఆఖరిసారి అమ్మని చూడటం. ఒక రోజు మిట్ట మధ్యాన్నం చిన్ననాటి దోస్తు సత్యం వాళ్ళ అక్కయ్య గారి ఇంటిముందు కూచొని కబుర్లు చెపుతున్నాం. “ తేగలు తేగలు,” అని కేకవిని, “ఏయ్ తేగలమ్మీ, లోపలికి రా,” అని కేకేశా! ఆశ్చర్యం! ఒక చేత్తో రేకుల గేటు తీస్తూ పార్వతమ్మ!! “ కాస్త బుట్ట దించు బాబూ!” అని తలెత్తి చూసింది. ఎంత మారిపోయింది? వడిలిపోయిన తోటకూర కాడల్లా చేతులు, ఎండకి నల్లబడ్డ ముఖం, ఉసూరు మంటూ ఉన్నది. “పార్వతమ్మా! నేను. సీతమ్మ గారి పెద్దబ్బాయిని!” అని అనంగానే, కళ్ళు ఇంత పెద్దవి చేసుకోని, “ ఈ మధ్య అమ్మని చూడనే లేదు బాబూ! మీ అరుగులు ఎక్కలేను. అంతెత్తు అరుగులెందుకు కట్టారో! అమ్మేవో అరుగు దిగలేదు; నేను అరుగులెక్కలేను,” అంటూ సొద మొదలెట్టింది. “ఈ తేగల వ్యాపారం ఏమిటి? నీ మొక్కజొన్న పొత్తుల బడ్డీ ఏమయ్యింది?” అని అడిగా.

“రోడ్డు బాగా పెద్దది చేశారు గా! మా పక్కన ఉన్న బడ్డి కొట్లన్నీ పోలీసోళ్ళు ఎత్తేయించారు. ఆ పక్క పెద్దోళ్ళ కొట్లు వొగ్గేశారులే! ఇప్పుడు ఆ రోడ్డుమీద ఒకటే దుమ్ము. దుమ్మంటే దుమ్ము. వరాసగా కార్లు, లారీలు. ఆ రోడ్డు మీదికెళ్ళడవంటేనే సచ్చే బయం,” అన్నది. “మరి నీ మనవడు బడి కెడుతున్నాడా?” అని ఒక చచ్చు ప్రశ్న వేశా. “బడా! ఆడి మొగవా! ఆడి మావని పట్టుకొని, వూరిచివర ఎరువుల ఫేక్టరీలో చేరిండు,” అని అన్న పార్వతమ్మని చూసి జాలి పడ్డా. కట్టకి రెండు తేగలు; ఐదు కట్టలున్నాయి, పార్వతమ్మ బుట్టలో. అన్నీ తీసుకోని, వంద రూపాయలిచ్చా. “చిల్లర లేదు, నా కాడ,” అంది. “పరవా

లేదులే! రేపు తేగలతోపాటు, ముంజెలు దొరికితే పట్రా,” అని సర్ది చెప్పా. మనకి తెలియందేముంది? అసలే పార్వతమ్మ మొండిది. జాలిపడి డబ్బులిస్తే చచ్చినా పుచ్చుకోదు. ముష్టి డబ్బు నాకెందుకూ, అని మొహం మీదవిసిరి కొట్టినా కొట్టగలదు.

ఆరోజు సాయంత్రం, క్లబ్బులో పొట్టి సుబ్బారావు కలిసాడు. అతను ప్లీడరు. “ఏమండీ! దేశంలో బీద ముసలివాళ్ళకి ప్రభుత్వం ఏదో పెన్షన్ ఇస్తున్నదట? దాన్ని గురించి మీకేమన్నా తెలుసా,” అని అడిగా. సుబ్బారావు ఏమీ అనకముందే, పక్కనే వున్న సూర్యం గారు అన్నాడు: “అబ్బో! దానికి నానా తతంగం వుంది. మధ్య వీళ్ళు వాళ్ళు, రకరకాల వాళ్ళు తినేయగా, అసలు వాళ్ళకి దక్కేది చిల్లరే,” అన్నాడు. అయినా పార్వతమ్మకి ఏదన్నా తగిన సహాయం చేయిద్దామని సూర్యం గారితో మొత్తం కథ అంతా చెప్పా. ఈ పనికి కావలసిన ఖర్చు నేనిస్తా అని చెప్పి, ఇంటిముఖం పట్టాను.

ఆ మర్నాడు పార్వతమ్మ రాలేదు; నేను తాటి ముంజెలు తిననూ లేదు.

+++

అమ్మ పోయిన మరుసటి సంవత్సరం ఒక్క వారం రోజులకి మా వూరెళ్ళా. మాంచి ఎండల్లో! పార్వతమ్మ గురించి వాకబు చెయ్యడానికి సమయం చిక్కలేదు. క్లబ్బులో సూర్యం గారు కూడా కనపడలేదు. అమ్మ పోయినప్పుడు పార్వతమ్మ చూడటానికొచ్చిందని తమ్ముడు చెప్పాడు. అంతే.

+++

పార్వతమ్మ పోయిందిరా అన్నయ్యా, అన్న తమ్ముడి మాటలు పదే పదే గింగురుమంటూ వినిపిస్తున్నాయి.

“ కొంతమంది చచ్చి గాల్లోనూ, వాతావరణంలోనూ,పూల్లోనూ, పసిపాపల నవ్వుల్లోనూ, మనతలపుల్లోనూ, …….నిరంతర నిత్య నూతనంగా బతుకుతారు,” అన్న వాక్యాలు పదే పదే ఖంగున గంట కొట్టినట్టు గుర్తుకొస్తున్నాయి..