చెమట ఏమంత రొమాంటిక్‌గా వుండదు
రొమాన్స్ లేనిది కవిత్వం కాదు
దేవుడు పని చెయ్యడు
భక్తుడు పని చెయ్యడు
నెత్తిన నెమలీక పెట్టుకుని ఒకరు
తాబేటి చిప్ప పట్టుకుని మరొకరు
బజారు తిరుగుతారిద్దరూ
దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం
మీరా, రూమీ, అన్నమయ్య ఎవర్నేనా అడుగు
బజారులో
అక్కడక్కడొక అందమైన భవనం
కాంపౌండులో పచ్చికలా పరుచుకున్న తీరిక
లోనికి వెళ్ళి చూడు, ఎక్కడా
అమ్మల చెమట మరకలుండవు
నాన్నల నుదుటి మడతలుండవు
వస్తువులన్నీ కొత్త యవ్వనంలా నునుపుగా
ముట్టుకోడానికి భయమేసేంత శుభ్రం
అన్నీ జాగర్తగా తుడిచి వుంచిన గాజు పదాలు
ఆ ఇంటి పెరటిలో ఒక చెట్టు
వేయించడానికి సిద్ధంగా వున్న వరుగుల్లాంటి
ఎండి పోయిన కొమ్మల్ని కొమ్ముల్లా విసిరి
పిచికలు వాలకుండా అదిలిస్తూ
దేని కోసమో ఎదురు చూస్తున్నది
చలి కాలం కప్పుకున్న మంచు దుప్పటి
మూసిన కిటీకీ వెనకాల ఎవరో
వూహల పూవులు విరిసే పానుపు మీద
వసంత మేఘుడు తొందరపడి
గొంతు సవరించుకుంటున్న మెత్తని చప్పుడు
అంతా మెత్తగా మెల్లగా హాయిగా
నా బాధ వేరు
నను దహించే మోహం వేరు
నా పానుపు మీద కురుస్తున్నవి
ఊహలు కాదు, పల్లేర్లు
నాన్న
పెరటి చెట్టుకు వేలాడుతున్న నాన్న
ఆయన నుదుటి కింద తడుస్తున్న చేను నేను
ఒక్కొక్క బొట్టుగా
రాలుతున్న ఘర్మం
విడదీయని మర్మం
ఇప్పుడు నాన్న ఒక అంకె
వెయ్యో వెయ్యి కోట్లో ఎన్నో
ఎండి పోయిన కొమ్మలు
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన
ఏ దుప్పి పోగొట్టుకున్న కొమ్ములో
నా పొట్టలో గుచ్చుకుంటున్నాయి
చాల నొప్పెడుతోంది
రంపంలా
కోసుకు పోయే నొప్పి
ఊరికి నిద్రా భంగం కావొద్దని
నోరు నొక్కుకుని అరుస్తాను
నాన్నల కోసం, అమ్మల కోసం
రుజాగ్రస్తమైన మన వూరి కోసం
నొక్కివేయబడిన శబ్దాన్ని నేను, ఇప్పటి కవిత్వాన్ని
ఆకు అడుగున వణుకుతున్న కకూన్ లోని మర్మం
తొడుక్కుంటున్న రెక్కల కింద కదలనున్న గాలిని